| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| వ. | అయ్యవసరంబునం దక్కిన పాండవులును ఫల్గునసహితుండైన పద్మలోచనుండును గాంచన సమంచితంబు లయిన రథంబు లెక్కి ధర్మజుం గూడి చనిన నతండు గుహ్యకసహితుం డయిన కుబేరుని భంగి నొప్పె; నిట్లు పాండవులు పరిజనులు గొలువఁ బద్మనాభసహితులై కురుక్షేత్రంబున కేగి దివంబుననుండి నేలం గూలిన దేవత తెఱంగున సంగ్రామ రంగపతితుండైన గంగానందనునకు నమస్కరించి; రంత బృహదశ్వ భరద్వాజ పరశురామ గౌతమ పర్వత నారద బాదరాయణ కశ్యపాంగిరస కౌశిక ధౌమ్య సుదర్శన శుక వసిష్ఠాద్యనేక రాజర్షి దేవర్షి బ్రహ్మర్షులు శిష్యసమేతులై చనుదెంచినం జూచి సంతసించి దేశకాలవిభాగవేదియైన భీష్ముండు వారలకుం బూజనంబులు సేయించి. | 205 |
| క. |
మాయాంగీకృత దేహుం, డై యఖిలేశ్వరుఁడు మనుజుఁ డైనాఁడని ప్ర జ్ఞాయతచిత్తంబున గాం, గేయుఁడు పూజనము సేసెఁ గృష్ణున్ జిష్ణున్. |
206 |
| వ. | మఱియు గంగానందనుండు వినయ ప్రేమ సుందరులయిన పాండునందనులం గూర్చుండ నియోగించి మహానురాగ జనిత బాష్ప సలిల సందోహ సమ్మిళిత లోచనుండై యిట్లనియె. | 207 |
| ఆ. |
ధరణిసురులు హరియు ధర్మంబు దిక్కుగా, బ్రదుకఁదలఁచి మీరు బహువిధముల నన్నలార! పడితి రాపత్పరంపర, లిట్టి చిత్రకర్మ మెందుఁ గలదు? |
208 |
| ఉ. |
సంతస మింతలేదు మృగశాప వశంబునఁ బాండు భూవిభుం డంతము నొందియుండ మిము నర్భకులం గొనివచ్చి కాంక్షతో నింతల వారిఁగాఁ బెనిచె నెన్నఁడు సౌఖ్యము పట్టు గాన దీ గొంతి యనేకదుఃఖములఁ గుందుచు నుండును; భాగ్య మెట్టిదో! |
209 |
| ఉ. |
వాయువశంబులై యెగసి వారిధరంబులు మింటఁ గూడుచుం బాయుచు నుండు కైవడిఁ బ్రపంచము సర్వముఁ గాలతంత్రమై పాయుచుఁ గూడుచుండు నొకభంగిఁ జరింపదు కాల; మన్నియుం జేయుచునుండుఁ; గాలము విచిత్రము దుస్తర మెట్టివారికిన్. |
210 |
| ఉ. |
రాజఁట ధర్మజుండు, సురరాజసుతుండఁట ధన్వి, శాత్రవో ద్వేజకమైన గాండివము విల్లఁట, సారథి సర్వభద్ర సం యోజకుఁ డైన చక్రి యఁట, యుగ్రగదాధరుఁడైన భీముఁ డ య్యాజికిఁ దోడు వచ్చునఁట, యాపద గల్గుటిదేమి చోద్యమో! |
211 |
| ఆ. |
ఈశ్వరుండు విషుఁ డెవ్వేళ నెవ్వని, నేమి సేయుఁ బురుషుఁ డేమి యెఱుఁగు నతని మాయలకు మహాత్ములు విద్వాంసు, లడఁగి మెలఁగుచుందు రంధు లగుచు. |
212 |
| వ. | కావున దైవతంత్రంబైన పనికి వగవం బనిలేదు; రక్షకులు లేని ప్రజల నుపేక్షింపక రక్షింపఁబుండరీకాక్షుండు సాక్షాత్కరించిన నారాయణుండు, తేజోనిరూఢుండు గాక యాదవులందు గూఢుండై తన మాయచేత లోకంబుల మోహాతిరేకంబు నొందించు; నతని రహస్య ప్రకారంబులు భగవంతుం డైన పరమేశ్వరుం డెఱుంగు; మఱియు దేవర్షియగు నారదుండును భగవంతుండగు కపిలమునియు నెఱుంగుదురు; మీరు కృష్ణుండు దేవకీ పుత్రుండని మాతులేయుండని తలంచి దూత సచివ సారథి బంధు మిత్ర ప్రయోజనంబుల నియమింతు; రిన్నిటం గొఱంత లేదు; రాగాదిశూన్యుండు, నిరహంకారుం, డద్వయుండు, సమదర్శనుండు, సర్వాత్మకుండు నయిన యీశ్వరునకు నతోన్నత భావ మతివైషమ్యంబు లెక్కడివి? లేవు. అయిన భక్తవత్సలుండు గావున నేకాంతభక్తులకు సులభుండై యుండు. | 213 |
| సీ. |
అతిభక్తి నెవ్వని యందుఁ జిత్తముఁ జేర్చి యెవ్వని నామ మూహించి పొగడి కాయంబు విడుచుచుఁ గామ కర్మాదినిర్మూలనుండై యోగి ముక్తి నొందు నట్టి సర్వేశ్వరుం డఖిలదేవోత్తంసుఁ డెవ్వేళఁ బ్రాణంబు లేను విడుతు నందాఁక నిదె మహాహర్షుఁడై వికసిత వదనారవిందుఁడై వచ్చె నేఁడు |
|
| తే. |
నాల్గు భుజములు గమలాభనయనయుగము నొప్పఁగన్నుల ముందట నున్నవాఁడు మానవేశ్వర! నా భాగ్యమహిమఁ జూడు మేమి సేసితినో పుణ్య మితనిఁగూర్చి |
214 |
| వ. | అని యిట్లు ధనంజయ సంప్రాపిత శరపంజరుం డయిన కురుకుంజరుని వచనంబులు వినయంబున నాకర్ణించి మునులందఱు వినుచుండ ధర్మనందనుండు మందాకినీనందనువలన నరజాతి సాధారణంబులగు ధర్మంబులును, వర్ణాశ్రమ ధర్మంబులును, రాగవైరాగ్యోపాధులతోఁ గూడిన ప్రవృత్తి నివృత్తి ధర్మంబులును, దానధర్మంబులును, రాజ ధర్మంబులును, స్త్రీ ధర్మంబులును శమదమాదికంబులును, హరి తోషణంబులగు ధర్మంబులును, ధర్మార్థ కామ మోక్షంబులును, నానావిధోపాఖ్యానేతిహాసంబులును, సంక్షేప విస్తారరూపంబుల నెఱింగె; నంత రథిక సహస్రంబులకు గమికాఁడైన భీష్ముండు స్వచ్ఛంద మరణులైన యోగీశ్వరులచేత వాంఛితంబగు నుత్తరాయణంబు సనుదెంచిన నది దనకు మరణోచితకాలంబని నిశ్చయించి. | 215 |
| శా. |
ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తముం జేసి దృ గ్జాలంబున్ హరిమోముపైఁ బఱపి తత్కారుణ్యదృష్టిన్ విని ర్మూలీభూత శరవ్యథా నిచయుఁడై మోదించి భీష్ముండు సం శీలం బొప్ప నుతించెఁ గల్మషగజ శ్రేణీహరిన్ శ్రీహరిన్. |
216 |
| వ. | ఇట్లు పీతాంబరధారియుఁ జతుర్భుజుండు నాదిపూరుషుండుఁ బరమేశ్వరుండునగు హరియందు నిష్కాముండై విశుద్ధంబగు ధ్యాన విశేషంబుచే నిరస్తదోషుం డగుచు ధారణావతియైన బుద్ధిని సమర్పించి, పరమానందంబు నొంది ప్రకృతివలననైన సృష్టి పరంపరలఁ బరిహరించు తలంపున మందాకినీ నందనుం డిట్లనియె. | 217 |