| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| మ. |
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్. |
218 |
| మ. |
హయరింఖాముఖధూళిధూసర పరిన్యస్తాలకోపేతమై రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో జయముం బార్థున కిచ్చు వేడ్క నని నా శస్త్రాహతిం జాల నొ చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్. |
219 |
| మ. |
నరు మాటల్ విని, నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలోఁ బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు, నీ పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై. |
220 |
| క. |
తనవారిఁ జంపఁజాలక, వెనుకకుఁ బో నిచ్చగించు విజయుని శంకన్ ఘనయోగవిద్యఁ బాపిన, మునివంద్యుని పాదభక్తి మొనయున్ నాకున్. |
221 |
| సీ. |
కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి గగనభాగంబెల్లఁ గప్పికొనఁగ నుఱికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వ్రేఁగున జగతి గదలఁ జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ బై నున్న పచ్చని పటము జాఱ నమ్మితి నాలావు నగుఁబాటు సేయక మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ |
|
| తే. |
గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. |
222 |
| మ. |
తనకున్ భృత్యుఁడు వీనిఁ గాచుట మహాధర్మంబు వొమ్మంచు న ర్జునసారథ్యము పూని పగ్గములు చేఁ జోద్యంబుగాఁ బట్టుచున్ మునికోలన్ వడిఁ బూని ఘోటకములన్ మోదించి తాడించుచున్ జనులన్ మోహము నొందఁ జేయు పరమోత్సాహుం బ్రశంసించెదన్. |
223 |
| క. |
పలుకుల నగవుల నడపుల, నలుకల నవలోకనముల నాభీరవధూ కులముల మనముల తాలిమి, కొలుకులు వదలించు ఘనునిఁ గొలిచెద మదిలోన్. |
224 |
| ఆ. |
మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా, మందిరమున యాగమండపమునఁ జిత్ర మహిమతోడఁ జెలువొందు జగదాది, దేవుఁ డమరు నాదు దృష్టియందు. |
225 |
| మ. |
ఒక సూర్యుండు సమస్తజీవులకుఁ దా నొక్కొక్కఁడై తోఁచు పో లిక నే దేవుఁడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జ న్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానావిధానూన రూ పకుఁడై యొప్పుచునుండు నట్టి హరి నేఁ బ్రార్థింతు శుద్ధుండనై. |
226 |
| వ. | అని యిట్లు మనోవాగ్దర్శనంబులం బరమాత్ముండగు కృష్ణుని హృదయంబున నిలిపికొని, నిశ్శ్వాసంబులు మాని నిరుపాధికంబయిన వాసుదేవ బ్రహ్మంబునందుం గలసిన భీష్మునిం జూచి సర్వజనులు దివసావసానంబున విహంగంబు లూరకయుండు తెఱంగున నుండిరి; దేవ మానవ వాదితంబులై దుందుభి నినాదంబులు మొరసె; మృతుండయిన భీష్మునికి ధర్మజుండు పరలోక క్రియలు సేయించి ముహూర్తమాత్రంబు దుఃఖితుండయ్యె; నంత నచ్చటి మునులు కృష్ణునిఁ దమ హృదయంబుల నిలిపికొని సంతుష్టాంతరంగు లగుచుం దదీయ దివ్యావతారనామంబులచే స్తుతియించి స్వాశ్రమంబులకుం జనిరి; పిదప నయ్యుధిష్ఠిరుండు గృష్ణసహితుండై గజపురంబునకుం జని గాంధారీ సమేతుండయిన ధృతరాష్ట్రు నొడంబఱచి, తత్సమ్మతంబున వాసుదేవానుమోదితుండై పితృపైతామహంబైన రాజ్యంబు గైకొని, ధర్మ మార్గంబునం బ్రజాపాలనంబు సేయుచుండె నని చెప్పిన విని సూతునకు శౌనకుం డిట్లనియె. | 227 |
| ఆ. |
ధనము లపహరించి తనతోడఁ జెనకెడు, నాతతాయిజనుల నని వధించి బంధు మరణ దుఃఖ భరమున ధర్మజుఁ, డెట్లు రాజ్యలక్ష్మి నిచ్చగించె. |
228 |
| వ. | అనిన సూతుం డిట్లనియె. | 229 |
| క. |
కురుసంతతికిఁ బరీక్షి, న్నరవరు నంకురము సేసి నారాయణుఁ డీ ధరణీ రాజ్యమునకు నీ, శ్వరుగా ధర్మజుని నిలిపి సంతోషించెన్. |
230 |
| వ. | ఇట్లు జగంబు పరమేశ్వరాధీనంబుగాని స్వతంత్రంబు గా దనునది మొదలగు భీష్ముని వచనంబులం, గృష్ణుని సంభాషణంబుల ధర్మనందనుండు ప్రవర్ధమాన విజ్ఞానుండును, నివర్తిత శంకాకళంకుండును నై నారాయణాశ్రయుండైన యింద్రుండునుంబోలెఁ జతుస్సాగర వేలాలంకృతంబగు వసుంధరా మండలంబు సహోదరసహాయుండై యేలుచుండె. | 231 |
| సీ. |
సంపూర్ణవృష్టిఁ బర్జన్యుండు గురియించు; నిల యెల్ల కోర్కుల నీనుచుండు గోవులు వర్షించు ఘోషభూములఁ బాలు; ఫలవంతములు లతాపాదపములు; పండు సస్యములు దప్పక ఋతువుల నెల్ల; ధర్మ మెల్లెడలను దనరి యుండు; దైవభూతాత్మతంత్రము లగు రోగాది భయములు సెందవు ప్రజల కెందుఁ; |
|
| ఆ. |
గురుకులోత్తముండు గుంతీతనూజుండు, దానమాన ఘనుఁడు ధర్మజుండు సత్యవాక్య ధనుఁడు సకల మహీరాజ్య, విభవభాజి యయిన వేళయందు. |
232 |