| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| వ. | తదనంతరంబ యష్టోత్తరశతషోడశ సహస్ర సౌధకాంతంబయిన శుద్ధాంతభవనంబు సొచ్చి హరి దన మనంబున- | 261 |
| మ. |
ఒక భామా భవనంబు మున్ను సొర వేఱొక్కర్తు లోఁగుందునో సుకరాలాపము లాడదో, సొలయునో, సుప్రీతి నీక్షింపదో, వికలత్వంబున నుండునో యనుచు న వ్వేళన్ వధూగేహముల్ ప్రకటాశ్చర్యవిభూతిఁ జొచ్చె బహురూపవ్యక్తుఁడై భార్గవా! |
262 |
| వ. | ఆ సమయంబున | 263 |
| క. |
శిశువులఁ జంకల నిడి తను, కృశతలు విరహాగ్నిఁ దెలుప గృహగేహళులన్ రశనలు జాఱఁగ సిగ్గున, శశిముఖు లెదురేగి రపుడు జలజాక్షునకున్. |
264 |
| మ. |
పతి నాయింటికి మున్ను వచ్చె, నిదె నా ప్రాణేశుఁ డస్మద్గృహా గతుఁడయ్యెన్ మును సేరెఁబో తొలుత మత్కాంతుండు నాశాలకే నితరాలభ్య సుఖంబు గంటి నని తా రింటింట నర్చించి ర య్యతివల్ నూఱుఁ బదాఱు వేలు నెనమండ్రవ్వేళ నాత్మేశ్వరున్. |
265 |
| వ. | వారలం జూచి హరి యిట్లనియె. | 266 |
| మ. |
కొడుకుల్ భక్తి విధేయు లౌదురు గదా? కోడండ్రు మీ వాక్యముల్ గడవంజాలక యుందురా? విబుధసత్కారంబు గావింతురా? తొడవుల్ వస్త్రములుం బదార్థరస సందోహంబులుం జాలునా? కడమల్ గావు గదా, భవన్నిలయముల్ గల్యాణయుక్తంబులే! |
267 |
| సీ. |
తిలక మేటికి లేదు తిలకినీతిలకమ? పువ్వులు దుఱుమవా పువ్వుఁబోఁడి? కస్తూరి యలఁదవా కస్తూరికాగంధి? తొడవులు దొడువవా తొడవుతొడవ? కలహంసఁ బెంపుదే కలహంసగామిని? కీరముఁ జదివింతె కీరవాణి? లతలఁ బోషింతువా లతికాలలితదేహ? సరసి నోలాడుదే సరసిజాక్షి? |
|
| ఆ. |
మృగికి మేఁత లిడుదె మృగశాబలోచన? గురుల నాదరింతె గురువివేక? బంధుజనులఁ బ్రోతె బంధుచింతామణి? యనుచు సతుల నడిగె నచ్యుతుండు. |
268 |
| వ. | అని యడిగిన వారలు హరిం బాసిన దినంబులందు శరీరసంస్కార కేళీ విహార హాస వన మందిర గమనమహోత్సవ దర్శనంబు లొల్లని యిల్లాండ్రు కావున. | 269 |
| మ. |
సిరి చాంచల్యముతోడిదయ్యుఁ దనకున్ జీవేశ్వరుం డంచుఁ నే పురుషశ్రేష్ఠు వరించె నట్టి పరమున్ బుద్ధిన్ విలోకంబులన్ గరయుగ్మంబులఁ గౌఁగిలించిరి సతుల్ గల్యాణ బాష్పంబు లా భరణశ్రేణులుగాఁ బ్రతిక్షణ నవ ప్రాప్తానురాగంబులన్. |
270 |
| మత్త. |
పంచబాణుని నీఱు సేసిన భర్గునిం దనవిల్లు వ ర్జించి మూర్ఛిలఁ జేయఁజాలు విశేష హాస విలోకనో దంచితాకృతులయ్యుఁ గాంతలు దంభచేష్టల మాధవున్ సంచలింపఁగఁ జేయ నేమియుఁ జాలరైరి బుధోత్తమా! |
271 |
| వ. | ఇవ్విధంబున సంగరహితుండైన కంసారి సంసారి కైవడి విహరింప నజ్ఞాన విలోకులయిన లోకులు లోక సామాన్య మనుష్యుండని తలంతు, రాత్మాశ్రయయైన బుద్ధి యాత్మయందున్న యానందాదులతోడం గూడని తెఱంగున నీశ్వరుండు ప్రకృతితోడం గూడియు నా ప్రకృతి గుణంబులైన సుఖదుఃఖంబులఁ జెందకయుండుఁ, బరస్పరసంఘర్షణంబులచే వేణువులవలన వహ్నిఁ బుట్టించి వనంబుల దహించు మహావాయువు చందంబున భూమికి భారహేతువులై యనేకాక్షౌహిణులతోడం బ్రవృద్ధతేజులగు రాజుల కన్యోన్య వైరంబులు గల్పించి నిరాయుధుండై సంహారంబు సేసి, శాంతుండై పిదపం గాంతామధ్యంబునఁ బ్రాకృతమనుష్యుండునుం బోలె సంచరించుచుండె నా సమయంబున | 272 |
| క. |
యతు లీశ్వరుని మహత్త్వము, మిత మెఱుఁగని భంగి నప్రమేయుఁడగు హరి స్థితి నెఱుఁగక కాముకుఁడని, రతములు సలుపుదురు తిగిచి రమణులు సుమతీ! |
273 |
| క. |
ఎల్లప్పుడు మా యిండ్లను, వల్లభుఁడు వసించు, నేమ వల్లభలము శ్రీ వల్లభున కనుచు గోపీ, వల్లభుచే సతులు మమతవలఁ బడి రనఘా! |
274 |
| వ. | అని చెప్పిన విని శౌనకుండు సూతున కిట్లనియె. | 275 |