| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ప్రథమస్కంధము |
| సీ. |
గురునందనుండు సక్రోధుఁడై యేసిన బ్రహ్మశిరోనామబాణవహ్నిఁ గంపించు నుత్తరగర్భంబు గ్రమ్మఱఁ బద్మలోచనుచేత బ్రదికె నండ్రు, గర్భస్థుఁడగు బాలుఁ గంసారి యేరీతి బ్రతికించె మృత్యువు భయము వాపి జనియించి యతఁ డెన్ని సంవత్సరము లుండె? నెబ్భంగి వర్తించె? నేమి సేసె? |
|
| ఆ. |
వినుము శుకుఁడు వచ్చి విజ్ఞాన పద్ధతి, నతని కెట్లు సూపె? నతఁడు పిదపఁ దన శరీర మే విధంబున వర్జించె? విప్రముఖ్య! నాకు విస్తరింపు. |
276 |
| వ. | అనిన సూతుం డిట్లనియె. ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూద్వీపరాజ్యంబు నార్జించియు, మిన్ను ముట్టిన కీర్తి నుపార్జించియు, నంగనా తురంగ మాతంగ సుభట కాంచనాది దివ్యసంపదలు సంపాదించియు, వీరసోదర విప్ర విద్వజ్జన వినోదంబులఁ బ్రమోదించియు, వైభవంబు లలవరించియుఁ గ్రతువు లాచరించియు, దుష్టశిక్షణ శిష్టరక్షణంబు లొనరించియు, ముకుంద చరణారవింద సేవారతుండై సమస్త సంగంబులందు నభిలాషంబు వర్జించి యరిషడ్వర్గంబు జయించి, రాజ్యంబు సేయుచు. | 277 |
| తే. |
చందనాదుల నాఁకట స్రగ్గువాఁడు, దనివి నొందని కైవడి ధర్మసుతుఁడు సంపదలు పెక్కు గలిగియుఁ జక్రిపాద, సేవనంబులఁ బరిపూర్తి సెందకుండె. |
278 |
| వ. | అంతం గొన్ని దినంబులకు నభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుండు దశమమాసపరిచ్ఛేద్యుండై గర్భాంతరాళంబున దురంతంబైన యశ్వత్థామ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచు. | 279 |
| ఉ. |
కుయ్యిడ శక్తి లే దుదరగోళములోపల నున్న వాఁడ ది క్కెయ్యది? దా ననాథ నని యెప్పుడుఁ దల్లి గణింప విందు నేఁ డియ్యిషువహ్ని వాయుటకు నెయ్యది మార్గము? నన్నుఁ గావ నే యయ్య గలండు? గర్భజనితాపద నెవ్వఁ డెఱుంగు దైవమా! |
280 |
| క. |
చిచ్చఱకోలవశంబునఁ, జచ్చి బహిర్గతుఁడఁ గాని సమయమునను దాఁ నుచ్చలితగర్భవేదనఁ, జచ్చును మా తల్లి ఘోరసంతాపమునన్. |
281 |
| క. |
చెచ్చెర బాణజ్వాలలు, వచ్చిన విష్ణుండు గావవచ్చు ననుచుఁ దాఁ ముచ్చటలు సెప్పు సతులకు, నిచ్చలు మాయవ్వ నేఁడు నిజమయ్యెడినో! |
282 |
| శా. |
రాఁడా చూడ, సమస్తభూతములలో రాజిల్లువాఁ డిచ్చటన్ లేఁడా? పాఱుని చిచ్చఱమ్ముఁ దొలఁగన్ లీలాగతిం ద్రోచి నా కీఁడా నేఁడభయప్రదాన మతఁ డూహింపన్ నతత్రాత మున్ గాఁడా? యెందఱిఁ గావఁడీ యెడల మత్కర్మంబు దా నెట్టిదో! |
283 |
| వ. | అని గతప్రాణుండై భ్రూణగతుండైన శిశువు చింతించు సమయంబున | 284 |
| సీ. |
మేఘంబుమీఁది క్రొమ్మెఱుఁగు కైవడి మేని పైనున్న పచ్చని పటమువాఁడు గండభాగంబులఁ గాంచన మణిమయ మకరకుండల కాంతి మలయువాఁడు శరవహ్ని నడఁగించు సంరంభమునఁ జేసి కన్నుల నునుఁగెంపు గలుగువాఁడు బాలార్కమండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబు వాఁడు |
|
| తే. |
కంకణాంగద వనమాలికా విరాజ, మానుఁ డసమానుఁ డంగుష్ఠమాత్రదేహుఁ డొక్క గదఁ జేతఁ దాల్చి నేత్రోత్సవముగ, విష్ణుఁ డావిర్భవించె న వ్వేళయందు. |
285 |
| వ. | ఇట్లు భక్త పరాధీనుండయిన పరమేశ్వరుం డావిర్భవించి మంచు విరియించు మార్తాండుచందంబున శిశువునకు దశదిశలం దనచేతి యఖండిత మహోల్కాజాలసన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగ. జిఱజిఱం ద్రిప్పి విప్రుని చిచ్చఱమ్ము వేఁడిమి పోఁడిమిఁ జెఱచి, డింభకుని పరితాపవిజృంభణంబు నివారించి, గర్భంబు గందకుండ రక్షించి యర్భకునికి నానందంబు గల్పించిన | 286 |
| మ. |
గదఁ జేఁబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయ ప్రదమై వచ్చు శరాగ్నిఁ దుత్తుమురుగా భంజించి రక్షించు నీ సదయుం డెవ్వఁడొకో యటంచు మదిలోఁ జర్చించుచున్ శాబకుం డెదురై చూడ నదృశ్యుఁడయ్యె హరి సర్వేశుండు విప్రోత్తమా! |
287 |
| వ. | అంత ననుకూల శుభగ్రహోదయంబును, సర్వగుణోత్తర ఫలసూచకంబును నైన శుభలగ్నంబునం బాండవ వంశోద్ధారకుం డయిన కుమారుండు జన్మించిన, ధర్మనందనుండు ధౌమ్యాది భూసుర వర్గంబు రప్పించి, పుణ్యాహంబు సదివించి జాతకర్మంబులు సేయించి, కుమారు జన్మ మహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబు లయిన గో భూ హిరణ్య హయానేక గ్రామంబులును, స్వాదు రుచి సంపన్నంబు లయిన యన్నంబు లిడిన వారలు తృప్తులై ధర్మపుత్త్రున కిట్లనిరి. | 288 |
| చ. |
ప్రకటిత దైవ యోగమునఁ బౌరవ సంతతి యంతరింపఁగా వికలత నొందనీక ప్రభవిష్ణుఁడు విష్ణుఁ డనుగ్రహించి శా బకు బ్రదికించెఁ గావున నృపాలక! శాబకుఁ డింక శాత్రవాం తకుఁ డగు, విష్ణురాతుఁ డన ధాత్రిఁ బ్రసిద్ధికి నెక్కుఁ బూజ్యుఁడై. |
289 |
| వ. | అనిన భూదేవోత్తములకు నరదేవోత్తముం డిట్లనియె. | 290 |
| శా. |
ఓ పుణ్యాత్మకులార! నా పలుకు మీ రూహింపుఁడా మ్రొక్కెదన్ మా పెద్దల్ శ్రుతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై యీ పిన్నాతఁడు వారిఁ బోలెడిఁగదా యెల్లప్పుడున్ మాధవ శ్రీపాదాంబుజ భక్తియుక్తుఁ డగుచున్ జీవించునే? చూడరే! |
291 |
| వ. | అనిన విని నరేంద్రా! భవదీయపౌత్త్రుండు మనుపుత్త్రుండయిన యిక్ష్వాకుని చందంబునం బ్రజల రక్షించు; శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్యప్రతిజ్ఞుండు నగు; డేగ వెంట నంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుఁ గాచిన శిబిచక్రవర్తి రీతి శరణ్యుండును వితరణఖనియు నగు; దుష్యంతసూనుండైన భరతు పగిది సోమాన్వయజ్ఞాతివర్గంబులకు యజ్వలకు ననర్గళ కీర్తి విస్తరించు; ధనంజయ కార్తవీర్యుల కరణి ధనుర్ధరాగ్రేసరుండగుఁ; గీలి పోలిక దుర్ధర్షుం డగు; సముద్రుని తెఱంగున దుస్తరుండగు; మృగేంద్రంబు కైవడి విక్రమశాలి యగు; వసుమతివోలె నక్షయ క్షాంతి యుక్తుండగు; భానుని లాగునఁ బ్రతాపవంతుండగు; వాసుదేవు వడువున సర్వభూతహితుం డగుఁ; దల్లిదండ్రుల మాడ్కి సహిష్ణుం డగు. మఱియును. | 292 |
| సీ. |
సమదర్శనంబున జలజాతభవుఁ డనఁ బరమప్రసన్నత భర్గుఁ డనఁగ నెల్లగుణంబుల నిందిరావిభుఁ డన నధికధర్మమున యయాతి యనఁగ ధైర్యసంపద బలిదైత్యవల్లభుఁ డన నచ్యుతభక్తిఁ బ్రహ్లాదుఁ డనఁగ రాజితోదారత రంతిదేవుం డన నాశ్రిత మహిమ హేమాద్రి యనఁగ |
|
| తే. |
యశము నార్జించుఁ, బెద్దల నాదరించు, నశ్వమేధంబు లొనరించు, నాత్మసుతుల ఘనులఁ బుట్టించు, దండించు ఖలులఁ బట్టి, మానధనుఁడు నీ మనుమండు మానవేంద్ర! |
293 |
| భుజంగ ప్రయాతము. |
హరించుం గలిప్రేరితాఘంబు లెల్లన్ భరించున్ ధరన్ రామభద్రుండువోలెన్ జరించున్ సదా వేద శాస్త్రానువృత్తిన్ వరించున్ విశేషించి వైకుంఠు భక్తిన్. |
294 |
| వ. | ఇట్లు పెక్కేండ్లు జీవించి, భూసురకుమారప్రేరితం బయిన తక్షకసర్పవిషానలంబునం దనకు మరణంబని యెఱింగి, సంగవర్జితుండయి ముకుంద పదారవింద భజనంబు సేయుచు, శుకయోగీంద్రుని వలన నాత్మవిజ్ఞానసంపన్నుండై, గంగాతటంబున శరీరంబు విడిచి, నిర్గతభయశోకం బయిన లోకంబుఁ బ్రవేశించునని జాతకఫలంబు సెప్పి లబ్ధకాములయి భూసురులు సని రంత. | 295 |
| క. |
తన తల్లి కడుపులోపల, మును సూచిన విభుఁడు విశ్వమున నెల్లఁ గలం డనుచుఁ బరీక్షింపఁగ జను, లనఘుఁ బరీక్షిన్నరేంద్రుఁ డండ్రు మునీంద్రా! |
296 |
| ఆ. |
కళలచేత రాజు గ్రమమునఁ బరిపూర్ణుఁ, డయిన భంగిఁ దాత లనుదినంబుఁ బోషణంబు సేయఁ బూర్ణుఁ డయ్యెను ధర్మ, పటలపాలకుండు బాలకుండు. |
297 |
| వ. | మఱియు ధర్మనందనుండు బంధుసంహారదోషంబు వాయుకొఱకు నశ్వమేధయాగంబు సేయం దలంచి, ప్రజలవలనం గరదండంబుల నుపార్జితంబయిన విత్తంబు సాలక చిత్తంబునఁ జింతించునెడ నచ్యుత ప్రేరితులై భీమార్జునాదులు, దొల్లి మరుత్తుండను రాజు మఖంబు సేసి పరిత్యజించి నిక్షేపించిన సువర్ణ పాత్రాదికంబైన విత్తం బుత్తరదిగ్భాగంబువలన బలవంతులై తెచ్చిన, నా రాజసత్తముండు సమాయత్త యజ్ఞోపకరణుండై సకల బంధు సమేతంబుగఁ గృష్ణుని నాహ్వానంబు సేసి, పురుషోత్తము నుద్దేశించి మూఁడు జన్నంబులు గావించెఁ దదనంతరంబ కృష్ణుండు బంధుప్రియంబు కొఱకుఁ గరినగరంబునఁ గొన్నినెల లుండి ధర్మ పుత్త్రాదులచే నామంత్రణంబు వడసి, యాదవ సమేతుండయి ధనంజయుఁడు దోడరా నిజనగరంబునకుం జనియె, నంతకు మున్ను విదురుండు తీర్థయాత్రకుఁజని మైత్రేయు ముందటఁ గర్మయోగవ్రతాది విషయంబు లయిన ప్రశ్నంబులఁ గొన్నిటిం జేసి యతనివలన నాత్మ విజ్ఞానంబు దెలిసి, కృతార్థుండై హస్తినాపురంబునకు వచ్చిన. | 298 |
| క. |
బంధుఁడు వచ్చె నటంచును, గాంధారీవిభుఁడు మొదలుగా నందఱు సం బంధములు నెఱపి ప్రీతి న, మంథరగతిఁజేసి రపుడు మన్నన లనఘా! |
299 |
| వ. | అంత ధర్మనందనుండు విదురునికి మజ్జనభోజనాది సత్కారంబులు సేయించి సుఖాసీనుండై తనవార లందఱు విన నిట్లనియె. | 300 |
| సీ. |
ఏ వర్తనంబున నింతకాలము మీరు సంచరించితి రయ్య? జగతిలోన నే తీర్థములు గంటి? రెక్కడ నుంటిరి? భావింప మీవంటి భాగవతులు తీర్థసంఘంబుల ధిక్కరింతురు గదా! మీయందు విష్ణుండు మెఱయు కతన మీరె తీర్థంబులు; మీ కంటె మిక్కిలి తీర్థంబు లున్నవె? తెలిసిచూడ |
|
| తే. |
వేఱు తీర్థంబు లవనిపై వెదక నేల; మిమ్ముఁ బొడగని భాషించు మేలె చాలు? వార్త లేమండ్రు లోకులు వసుధలోన? మీకు సర్వంబు నెఱిఁగెడి మేధ గలదు. |
301 |
| మత్త. |
తండ్రి సచ్చినమీఁద మా పెదతండ్రిబిడ్డలు దొల్లి పె క్కండ్రు సర్పవిషాగ్ని బాధల గాసిఁబెట్టఁగ మమ్ము ని ల్లాండ్ర నంతముఁ బొందకుండఁగ లాలనంబున మీరు మా తండ్రి భంగి సముద్ధరింతురు తద్విధంబు దలంతురే? |
302 |
| క. |
పక్షులు తమఱెక్కలలోఁ, బక్షంబులు రాని పిల్లపదుపుల మమతన్ రక్షించిన క్రియ మీరలు, పక్షీకరణంబు సేయ బ్రతికితిమి గదే! |
303 |
| క. |
మన్నారా ద్వారకలో, నున్నారా? యదువు లంబుజోదరు కరుణన్ గన్నారా? లోకులచే, విన్నారా? మీరు వారి విధ మెట్టిదియో? |
304 |
| చ. |
అన విని ధర్మరాజునకు నా విదురుండు సమస్తలోక వ ర్తనముఁ గ్రమంబుతోడ విశదంబుగఁ జెప్పి యదుక్షయంబు సె ప్పిన నతఁ డుగ్రశోకమున బెగ్గిలు చుండెడి నంచు నేమియున్ విను మని చెప్పఁడయ్యె; యదువీరుల నాశము భార్గవోత్తమా! |
305 |
| ఆ. |
మేలు సెప్పెనేని మే లండ్రు లోకులు, చెట్టయండ్రు కీడు చెప్పెనేని నంతమీఁద శూద్రుఁడైన కతంబున, శిష్టమరణ మతఁడు సెప్పఁడయ్యె. |
306 |
| వ. | అది యెట్లనిన మాండవ్యమహాముని శాపంబునం దొల్లి యముండు శూద్ర యోనియందు విదురుండై జన్మించియున్న నూఱు వత్సరంబు లర్యముండు యథాక్రమంబునం బాపకర్ముల దండించె; నిట యుధిష్ఠిరుండు రాజ్యంబుఁ గైకొని లోకపాలసంకాశు లయిన తమ్ములుం దానును గులదీపకుండైన మనుమని ముద్దుసేయుచుఁ బెద్దకాలంబు మహావైభవంబున సుఖియై యుండెనంత. | 307 |
| క. |
బాలాజన శాలా ధన, లీలావన ముఖ్య విభవలీన మనీషా లాలసు లగు మానవులను, గాలము వంచించు దురవగాహము సుమతీ! |
308 |