పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
గాంధారీ ధృతరాష్ట్రులు దేహత్యాగము చేయుట
వ. అది నిమిత్తంబుగాఁ గాలగతి యెఱింగి విదురుండు ధృతరాష్ట్రున కిట్లనియె. 309
మ. కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబులన్‌ ముందటం
గని ప్రాణేచ్ఛల నుండు జంతువుల నే కాలంబు దుర్లంఘ్యమై
యనివార్యస్థితిఁ జంపునట్టి నిరుపాయంబైన కాలంబు వ
చ్చె నుపాంతంబున, మాఱు దీనికి మదిం జింతింపు ధాత్రీశ్వరా!
310
శా. పుట్టంధుండవు, పెద్దవాఁడవు, మహాభోగంబులా లేవు, నీ
పట్టెల్లం జెడిపోయె; దుస్సహ జరాభారంబు పైఁగప్పె; నీ
చుట్టా లెల్లను బోయి; రాలు మగఁడున్‌ శోకంబునన్‌ మగ్నులై
కట్టా! దాయలపంచ నుండఁదగవే కౌరవ్యవంశాగ్రణీ!
311
క. పెట్టితిరి చిచ్చు గృహమునఁ, బట్టితిరి తదీయభార్యఁ, బాడడవులకుం
గొట్టితిరి, వారు మనుపఁగ, నెట్టైన భరింపవలెనె?యీ ప్రాణములన్‌.
312
క. బిడ్డలకు బుద్ధి సెప్పని, గ్రుడ్డికిఁ బిండంబు వండికొని పొం; డిదె పైఁ
బడ్డాఁడని భీముం డొఱ, గొడ్డెము లాడంగఁ గూడుఁ గుడిచెద వధిపా!
313
క. కనియెదవో బిడ్డల నిఁక, మనియెదవో, తొంటికంటె మనుమల మాటల్‌
వినియెదవో, యిచ్చెద ర, మ్మనియెదవో దానములకు నవనీసురులన్‌
314
క. దేహము నిత్యము గాదని, మోహముఁ దెగఁ గోసి సిద్ధమునివర్తనుఁడై
గేహము వెలువడు నరుఁ డు, త్సాహముతోఁ జెందు ముక్తిసంపద ననఘా!
315
వ. అని విదురుండు ధృతరాష్ట్రునకు విరక్తిమార్గం బుపదేశించిన, నతండు ప్రజ్ఞాచక్షుండై, సంసారంబు దిగనాడి, మోహపాశంబువలన నూడి, విజ్ఞానమార్గంబునం గూడి, దుర్గమంబగు హిమవన్నగంబునకు నిర్గమించిన 316
శా. అంధుండైన పతిన్‌ వరించి, పతిభావాసక్తి నేత్రద్వయీ
బంధాచ్ఛాదనమున్‌ ధరించి, నియమప్రఖ్యాతయై యున్న త
ద్గాంధారక్షితినాథు కూఁతురును యోగప్రీతి చిత్తంబులో
సంధిల్లం బతివెంట నేగె, నుదయత్సాధ్వీగుణారూఢయై.
317
చ. వెనుకకు రాక చొచ్చు రణవీరునికైవడి, రాజదండనం
బునకు భయంబు లేక వడిఁ బోయెడు ధీరుని భంగి, నప్పు డా
వనిత దురంతమైన హిమవంతము పొంత వనాంతభూమికిం
బెనిమిటితోడ నించుకయు భీతి వహింపక యేగెఁ బ్రీతితోన్‌.
318
వ. ఇట్లు విదురసహితులై గాంధారీ ధృతరాష్ట్రులు వనంబునకుం జనిన మఱునాఁడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనంబు సేసి నిత్యహోమంబు గావించి బ్రాహ్మణోత్తములకు గో హిరణ్య తిల వస్త్రాది దానంబులు సేసి నమస్కరించి, గురువందనంబుకొఱకుఁ బూర్వప్రకారంబునం దండ్రి మందిరంబునకుం జని యందు విదుర సహితు లయిన తల్లిదండ్రులం గానక మంజుపీఠంబునఁ గూర్చున్న సంజయున కిట్లనియె. 319
సీ. మా తల్లిదండ్రు లీ మందిరంబున లేరు, సంజయ! వారెందుఁ జనిరి నేఁడు
ముందఱ గానఁడు ముదుసలి మా తండ్రి పుత్త్ర శోకంబునఁ బొగులుఁ దల్లి
సౌజన్యనిధి ప్రాణసఖుఁడు మా పినతండ్రి మందబుద్ధులమైన మమ్ము విడిచి
యెటఁబోయిరో మువ్వు రెఱిఁగింపు గంగలోఁ దన యపరాధంబుఁ దడవికొనుచు
 
ఆ. భార్యతోడఁ దండ్రి పరితాపమునఁ బడుఁ, గపట మింత లేదు కరుణ గలదు
పాండుభూవిభుండు పరలోకగతుఁడైన, మమ్ముఁ బిన్నవాండ్ర మనిచె నతఁడు.
320
వ. అనిన సంజయుండు దయాస్నేహంబుల నతికర్శితుం డగుచుఁ, దన ప్రభువు వోయిన తెఱం గెఱుంగక, కొంత దడ వూరకుండి, తద్వియోగ దుఃఖంబునఁ గన్నీరు కరతలంబునఁ దుడిచికొనుచు, బుద్ధి బలంబునం జిత్తంబు ధైర్యాయత్తంబు సేసి, తన భర్తృపాదంబుల మనంబున నెన్నుచు ధర్మజున కిట్లనియె. 321
తే. అఖిల వార్తలు మున్ను నన్నడుగుచుండు, నడుగఁ డీ రేయి మీ తండ్రి యవనినాథ!
మందిరములోన విదురుతో మంతనంబు, నిన్న యాడుచు నుండెను నేఁడు లేఁడు.
322
వ. విదుర గాంధారీ ధృతరాష్ట్రులు నన్ను వంచించి యెందుఁబోయిరో వారల నిశ్చయంబులెట్టివో యెఱుంగనని సంజయుండు దుఃఖించు సమయంబునఁ దుంబురు సహితుండై నారదుండు వచ్చిన, లేచి నమస్కరించి తమ్ములుం దానును నారదుం బూజించి, కౌంతేయాగ్రజుం డిట్లనియె. 323
ఉ. అక్కట! తల్లిదండ్రులు గృహంబున లేరు మహాత్మ! వారు నేఁ
డెక్కడ వోయిరో యెఱుఁగ, నెప్పుడు బిడ్డల పేరు గ్రుచ్చి తాఁ
బొక్కుచునుండుఁ దల్లి యెటు వోయెనొకో! విపదంబురాశికిన్‌
నిక్కము కర్ణధారుఁడవు నీవు, జగజ్జనపారదర్శనా!
324
వ. అనిన సర్వజ్ఞుండైన నారదుండు ధర్మజున కిట్లనియె; ఈశ్వర వశంబు విశ్వంబు. ఈశ్వరుండ భూతంబుల నొకటితో నొకటిఁజేర్చు, నెడఁబాపు. సూచీ భిన్ననాసిక లందు రజ్జుప్రోతంబు లగుచుఁ గంఠరజ్జువులఁ గట్టంబడిన బలీవర్దంబులంబోలెఁ గర్తవ్యాకర్తవ్యవిధాయక వేదలక్షణ యగు వాక్తంత్రియందు వర్ణాశ్రమ లక్షణంబులు గల నామంబులచే బద్ధులైన లోకపాల సహితంబులై లోకంబీశ్వరాదేశంబు వహించుఁ; గ్రీడాసాధనంబులగు నక్షకందు కాదుల కెట్లు సంయోగ వియోగంబు లట్లు క్రీడించు; నీశ్వరునికిఁ గ్రీడాసాధనంబులైన జంతువులకు సంయోగ వియోగంబు లగుచుండు. సమస్తజనంబును జీవరూపంబున ధ్రువంబును దేహరూపంబున నధ్రువంబునై యుండు; మఱియు నొక్క పక్షంబున ధ్రువంబు నధ్రువంబునుంగాక యుండు; శుద్ధబ్రహ్మస్వరూపంబున ననిర్వచనీయంబుగ రెండునై యుండు. అజగరంబుచేత మ్రింగం బడిన పురుషుం డన్యుల రక్షింప లేని తెఱంగునఁ బంచభూతమయంబై కాలకర్మ గుణాధీనంబైన దేహంబు పరుల రక్షింప సమర్థంబు గాదు. కరంబులు గల జంతువులకుఁ గరంబులు లేని చతుష్పదంబు లాహారంబు లగుఁ; జరణంబులు గల ప్రాణులకుం జరణంబులు లేని తృణాదులు భక్షణీయంబు లగు; నధికజన్మంబు గల వ్యాఘ్రాదులకు నల్పజన్మంబులు గల మృగాదులు భోజ్యంబు లగు, సకల దేహి దేహంబులందు జీవుండు గలుగుటం జేసి జీవునికి జీవుండ జీవిక యగు; అహస్త సహస్తాది రూపంబైన విశ్వమంతయు నీశ్వరుండుగాఁ దెలియుము. అతనికి వేఱు లేదు; నిజమాయా విశేషంబున మాయావియై జాతిభేద రహితుండైన యీశ్వరుండు బహుప్రకారంబుల భోగిభోగ్య రూపంబుల నంతరంగ బహిరంగంబుల దీపించుఁ గాన యనాథులు దీనులు నగు నాదు తల్లిదండ్రులు ననుం బాసి యే మయ్యెదరో, యెట్లు వర్తింతురో యని వగవం బని లేదు. అజ్ఞానమూలం బగు స్నేహంబున నైన మనోవ్యాకులత్వంబు పరిహరింపు మని మఱియు నిట్లనియె. 325
ఆ. అట్టి కాలరూపుఁ డఖిలాత్ముఁడగు విష్ణుఁ, డసురనాశమునకు నవతరించి
దేవకృత్య మెల్లఁ దీర్చి చిక్కిన పని, కెదురుసూచుచుండు నిప్పు డధిప!
326
మత్త. ఎంత కాలము గృష్ణుఁ డీశ్వరుఁ డిద్ధరిత్రిఁ జరించు, మీ
రంత కాలము నుండుఁ డందఱు నవ్వలం బనిలేదు, వి
భ్రాంతి మానుము; కాలముం గడవంగ నెవ్వరు నోప, రీ
చింత యేల నరేంద్రసత్తమ! చెప్పెదన్‌ విను మంతయున్‌.
327
వ. ధృతరాష్ట్రుండు గాంధారీవిదుర సహితుండై హిమవత్పర్వతదక్షిణ భాగంబున నొక్క మునివనంబునకుం జని తొల్లి సప్తర్షులకు సంతోషంబు సేయుకొఱకు నాకాశగంగ యేడు ప్రవాహంబులయి పాఱిన పుణ్యతీర్థంబునం గృతస్నానుండై యథావిధి హోమం బొనరించి, జలభక్షణంబు గావించి, సకల కర్మంబులు విసర్జించి, విఘ్నంబులం జెందక నిరాహారుండయి, యుపశాంతాత్ముండయి పుత్త్రార్థదారైషణంబులు వర్జించి, విన్యస్తాసనుండై ప్రాణంబుల నియమించి, మనస్సహితంబులైన చక్షురాదీంద్రియంబుల నాఱింటిని విషయంబులం బ్రవర్తింపనీక నివర్తించి హరిభావనచే ధారణాయోగంబు వహించి, రజస్సత్త్వతమోరూపంబు లగు మలంబుల మూఁటిని హరించి మనంబు నహంకారాస్పదంబైన స్థూలదేహంబువలనం బాపి, బుద్ధియందు నేకీకరణంబు సేసి, యట్టి విజ్ఞానాత్మను దృశ్యాంశంబువలన వియోగించి, క్షేత్రజ్ఞునియందుఁ బొందించి, దృష్టంబైన యీశ్వరునివలన క్షేత్రజ్ఞునిం బాపి, మహాకాశంబుతోడ ఘటాకాశముం గలుపు కైవడి, నాధారభూతం బైన బ్రహ్మమందుఁ గలిపి, లోపలి గుణక్షోభంబును, వెలుపలి యింద్రియ విక్షేపంబును లేక నిర్మూలిత మాయాగుణవాసనుం డగుచు నిరుద్ధంబు లగు మనశ్చక్షురాదీంద్రియంబులు గలిగి, యఖిలాహారంబులను వర్జించి, కొఱడు చందంబున. 328
మ. ఉటజాంతస్స్థల వేదికన్‌ నియతుఁడై యున్నాఁడు నేఁడాదిగా
నిటపై నేనవనాఁడు మేన్‌ విడువఁగా నిజ్యాగ్ని యోగాగ్ని త
త్పటు దేహంబు దహింపఁ జూచి, నియమ ప్రఖ్యాత గాంధారి యి
ట్టటు వో నొల్లక ప్రాణవల్లభునితో నగ్నిం బడున్‌ భూవరా!
329
క. అంతట వారల మరణము, వింత యగుచుఁ జూడఁబడిన విదురుఁడు చింతా
సంతాప మొదవఁ బ్రీత, స్వాంతుండై తీర్థములకుఁ జనియెడు నధిపా!
330
వ. అని విదురాదుల వృత్తాంతం బంతయు ధర్మనందనుని కెఱింగించి తుంబురు సహితుండయిన నారదుండు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక, ధర్మజుండు భీమునిం జూచి యిట్లనియె. 331
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )