పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
శమీకపుత్త్రుం డగు శృంగి పరీక్షితుని శపించుట
క. నరగంధగజస్యందన, తురగంబుల నేలు రాజు తోయాతురుఁడై
పరఁగన్‌ నీ జనకుని మెడ, నురగముఁ దగిలించి పోయె నోడక తండ్రీ!
465
వ. అని పలికిన సమానవయోరూపమునికుమార లీలాసంగి యయిన శృంగి శృంగంబులతోడి మూర్తి ధరించినట్లు విజృంభించి రోషసంరంభంబున నదరిపడి బల్యన్నంబుల భుజించి పుష్టంబు లగు నరిష్టంబులుం బోలె బలిసియు ద్వారంబులం గాచికొని యుండు సారమేయంబుల పగిది దాసభూతులగు క్షత్త్రియాభాసు లెట్టు బ్రాహ్మణోత్తములచే స్వరక్షకులుగ నిరూపితు లయిరి? అట్టివార లెట్లు తద్గృహంబుల భాండసంగతంబగు నన్నంబు భుజింప నర్హు లగుదురు? తత్కృతంబు లయిన ద్రోహంబు లెట్లు నిజ స్వామిం జెందు నని మఱియు నిట్లనియె. 466
ఉ. ఆడఁడు తన్ను దూషణము, లాశ్రమవాసులఁ గాని వైరులం
గూడఁడు, కందమూలములు గూడుగఁ దించు సమాధినిష్ఠుఁడై
వీడఁడు లోని చూడ్కులను, విష్ణునిఁ దక్కఁ బరప్రపంచముం
జూడఁడు మద్గురుండు; ఫణిఁ జుట్టఁగ నేటికి రాచవానికిన్‌?
467
ఉ. పోము హిరణ్య దానములఁ బుచ్చుకొనంగ, ధనంబు లేమియుం
దేము, సవంచనంబులుగ దీవన లిచ్చుచు వేసరింపఁగా
రాము, వనంబులన్‌ గృహవిరాములమై నివసింపఁ జెల్లరే
పామును వైవఁగాఁ దగునె బ్రహ్మమునీంద్రుభుజార్గళంబునన్‌?
468
క. పుడమిఁగల జనులు వొగడఁగఁ, గుడుతురు గట్టుదురుగాక కువలయపతులై
యడవుల నిడుమలఁ బడియెడి, బడుగుల మెడ నిడఁగఁ దగునె పన్నగశవమున్‌?
469
క. భగవంతుఁడు గోవిందుఁడు, జగతిం బెడఁబాసి చనిన శాసింపంగాఁ
దగువారు లేమి దుర్జను, లెగసి మహాసాధుజనుల నేఁచెద రకటా!
470
క. బాలకులార! ధరిత్రీ, పాలకు శపియింతు ననుచు బలువడిని విలో
లాలకుఁడగు మునికుంజర, బాలకుఁ డరిగెం ద్రిలోకపాలకు లదరన్‌.
471
వ. ఇట్లు రోషించి కౌశికీనదికిం జని జలోపస్పర్శంబు సేసి. 472
ఉ. ఓడక వింటికోపున మృతోరగముంగొని వచ్చి మాఱు మా
టాడక యున్న మజ్జనకు నంసతలంబునఁ బెట్టి దుర్మద
క్రీడఁ జరించు రాజు హరకేశవు లడ్డిన నైనఁ జచ్చుఁ బో
యేడవనాఁడు తక్షకఫణీంద్ర విషానలహేతి సంహతిన్‌.
473
వ. అని శమీకమహామునికుమారుం డయిన శృంగి పరీక్షిన్నరేంద్రుని శపియించి, నిజాశ్రమంబునకుం జనుదెంచి కంఠలగ్న కాకోదర కళేబరుండైన తండ్రిం జూచి. 474
క. ఇయ్యెడ నీ కంఠమునను, నియ్యురగ కళేబరంబు నిటు వైచిన యా
యయ్య నిఁక నేమి సేయుదు, నెయ్యంబులు లేవు సుమ్ము నృపులకుఁ దండ్రీ!
475
శా. ప్రారంభంబున వేఁట వచ్చి ధరణీపాలుండు, మా తండ్రిపై
నేరం బేమియు లేక సర్పశవమున్‌ నేఁ డుగ్రుఁ డై వైచి నాఁ
డీరీతిన్‌ ఫణి గ్రమ్మఱన్‌ బ్రదుకునో, హింసించునో కోఱలన్‌,
రారే తాపసులార! దీనిఁ దివరే, రక్షింపరే, మ్రొక్కెదన్‌.
476
వ. అని వెఱపున సర్పంబుఁ దిగుచు నేర్పు లేక యెలుంగెత్తి యేడ్చుచున్న కుమారకు రోదనధ్వని విని యాంగిరసుండయిన శమీకుండు సమాధి సాలించి మెల్లన కన్నులు దెఱచి మూఁపున వ్రేలుచున్న మృతోరగంబు నీక్షించి, తీసి పాఱవైచి, కుమారకుం జాచి. 477
క. ఏ కీడు నాచరింపము, లోకులకున్‌ మనము సర్వలోక సములమున్‌
శోకింప నేల పుత్త్రక!, కాకోదర మేల వచ్చెఁ గంఠంబునకున్‌?
478
వ. అని యడిగినఁ దండ్రికిఁ గొడుకు రాజు సర్పంబు వైచుటయుం దాను శపించుటయును వినిపించిన, న మ్ముని తన దివ్య జ్ఞానంబున న మ్మానవేంద్రుండు పరీక్షిన్నరేంద్రుండని యెఱింగి కొడుకువలన సంతసింపక యిట్లనియె. 479
క. బెట్టిద మగు శాపమునకు, దట్టపు ద్రోహంబు గాదు; ధరణీకాంతుం
గట్టా! యేల శపించితి, పట్టీ! తక్షక విషాగ్నిపాలగు మనుచున్‌?
480
ఆ. తల్లి కడుపులోన దగ్ధుఁడై క్రమ్మఱఁ, గమలనాభు కరుణఁ గలిగినాఁడు;
బలిమి గలిగి ప్రజలఁ బాలించుచున్నాఁడు, దిట్టవడుగ! రాజుఁ దిట్టఁ దగునె?
481
ఉ. కాపరి లేని గొఱ్ఱియల కైవడిఁ గంటక చోరకోటిచే
నే పఱి యున్న దీభువన మీశుఁడు గృష్ణుఁడు లేమి; నిట్టిచో
భూ పరిపాలనంబు సమబుద్ధి నితం డొనరింపఁ జెల్లరే!
యీ పరిపాటి ద్రోహమున కిట్లు శపింపఁగ నేల బాలకా?
482
సీ. పాపంబు నీచేతఁ బ్రాపించె మన; కింక రాజు నశించిన రాజ్యమందు
బలవంతుఁ డగువాఁడు బలహీను పశు దార హయ సువర్ణాదుల నపహరించు;
జారచోరాదులు సంచరింతురు; ప్రజ కన్యోన్యకలహంబు లతిశయిల్లు;
వైదికంబై యున్న వర్ణాశ్రమాచార ధర్మ మించుక లేక తప్పిపోవు;
 
ఆ. నంతమీఁద లోకు లర్థకామంబులఁ, దగిలి సంచరింప ధరణి నెల్ల
వర్ణసంకరములు వచ్చును మర్కట, సారమేయ కులము మేరఁ బుత్త్ర!
483
ఉ. భారతవంశజుం బరమభాగవతున్‌ హయమేధయాజి నా
చారపరున్‌ మహానయవిశారదు రాజకులైకభూషణున్‌
నీరము గోరి నేఁడు మన నేలకు వచ్చిన యర్థి భక్తి స
త్కారము సేసి పంపఁ జనుఁగాక, శపింపఁగ నీకు ధర్మమే?
484
క. భూపతికి నిరపరాధమ, శాపము దా నిచ్చె బుద్ధి చాపలమున మా
పాపఁడు, వీఁడొనరించిన, పాపము దొలఁగింపు కృష్ణ! పరమేశ! హరీ!
485
క. పొడిచినఁ దిట్టినఁ గొట్టినఁ, బడుచుందురు గాని పరమభాగవతులు దా
రొడఁబడరు మాఱు సేయఁగఁ, గొడుకా! విభుఁ డెగ్గుసేయఁ గోరఁడు నీకున్‌.
486
క. చెలఁగరు కలఁగరు సాధులు, మిళితములయి పరులవలన మేలుం గీడున్‌
నెలకొనిన నైన నాత్మకు, నొలయవు సుఖదుఃఖచయము లుగ్రము లగుచున్‌.
487
వ. అని యిట్లు శమీక మహామునీంద్రుండు గ్రమ్మఱింప శక్తి లేని కొడుకు సేసిన పాపంబునకు సంతాపంబు నొంది, తన శిష్యునొక మునికుమారునిం బిలిచి, యేతద్వృత్తాంతం బంతయు రాజున కెఱింగించి రమ్మని పంచె; నంత నా యభిమన్యుపుత్త్రుండు శమీకముని శిష్యునివలన శాపవృత్తాంతంబు విని, కామక్రోధాది విషయాసక్తుండగు తనకుం దక్షకవిషాగ్ని విరక్తి బీజం బగు ననుచుఁ గరినగరంబునకుం జని యేకాంతంబున. 488
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )