పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
పరీక్షితుఁడు విప్రశాపం బెఱింగి ప్రాయోపవిష్టుం డగుట
ఉ. ఏటికి వేఁట వోయితి? మునీంద్రుఁడు గాఢసమాధి నుండఁగా
నేటికిఁ దద్భుజాగ్రమున నేసితి సర్పశవంబుఁ దెచ్చి? నేఁ
డేటికిఁ బాపసాహసము లీక్రియఁ జేసితి? దైవ యోగమున్‌
దాఁటఁగ రాదు వేగిరమ; తథ్యము గీడు జనించు ఘోరమై.
489
ఉ. పామువిషాగ్ని కీలలను బ్రాణము లేఁగిన నేఁగుఁగాక, యీ
భూమియు రాజ్యభోగములుఁ బోయిన నిప్పుడ పోవుఁ గాక, సౌ
దామనిఁ బోలు జీవనముఁ దథ్యముగాఁ దలపోసి యింక నే
నేమని మాఱు దిట్టుదు మునీంద్రకుమారకు దుర్నివారకున్‌.
490
ఆ. రాజ ననుచుఁ బోయి రాజ్యగర్వంబున, వనముకొఱకు వారివనము సొచ్చి
దందశూకశవముఁ దండ్రిపై వైచినఁ, బొలియఁ దిట్ట కేల పోవు సుతుఁడు?
491
క. గోవులకును బ్రాహ్మణులకు, దేవతలకు, నెల్లప్రొద్దుఁ దెంపునఁ గీడుం
గావించు పాపమానస, మే విధమునఁ బుట్టకుండ నే వారింతున్‌.
492
వ. అని వితర్కించె. 493
క. దామోదర పదభక్తిం, గామాదుల గెల్చినాఁడు గావునఁ గరుణన్‌
భూమీశుఁ డలుగఁ డయ్యెను, సామర్థ్యము గలిగి దోషసంగిన్‌ శృంగిన్‌.
494
వ. అంత మునికుమారుండు శపించిన వృత్తాంతంబుఁ దక్షకుండు విని యెడరు వేచియుండె; నిటఁ దక్షకవ్యాళ విషానల జ్వాలాజాలంబునం దనకు సప్తమ దినంబున మరణంబని యెఱింగినవాఁడు గావున, భూపాలుండు భూలోక స్వర్గలోక భోగంబులు హేయంబులని తలంచి, రాజ్యంబు విసర్జించి, నిరశన దీక్షాకరణంబు సంకల్పించుకొని. 495
మ. తులసీసంయుతదైత్యజిత్పదరజస్స్తోమంబుకంటెన్‌ మహో
జ్జ్వలమై దిక్పతిసంఘసంయుతజగత్సౌభాగ్యసంధాయియై
కలిదోషావలి నెల్లఁ బాపు దివిషద్గంగా ప్రవాహంబు లో
పలికిం బోయి మరిష్యమాణుఁ డగుచుం బ్రాయోపవేశంబునన్‌.
496
క. చిత్తము గోవిందపదా, యత్తముఁ గావించి మౌనియై తనలో నే
తత్తఱము లేక భూవర, సత్తముఁడు వసించె ముక్తసంగత్వమునన్‌.
497
వ. ఇట్లు పాండవపౌత్త్రుండు ముకుందచరణారవింద వందనానందకందాయమాన మానసుండై విష్ణుపదీతీరంబునం బ్రాయోపవేశంబున నుండుట విని సకలలోక పావనమూర్తులు మహానుభావులు నగుచుఁ దీర్థంబులకుం దీర్థత్వంబు లొసంగ సమర్థులైన యత్రి విశ్వామిత్ర మైత్రేయ భృగు వసిష్ఠ పరాశర చ్యవన భరద్వాజ పరశురామ దేవల గౌతమ కశ్యప కణ్వ కలశసంభవ వ్యాస పర్వత నారదప్రముఖులైన బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి పుంగవులును కాండర్షులయిన యరుణాదులును, మఱియు నానాగోత్రసంజాతులైన మునులును శిష్య ప్రశిష్యసమేతులై చనుదెంచిన వారలకుఁ బ్రత్యుత్థానంబు సేసి పూజించి దండప్రణామంబు లాచరించి, కూర్చుండ నియోగించి. 498
క. క్రమ్మఱ న మ్మునివిభులకు, నమ్మనుజేంద్రుండు మ్రొక్కి హర్షాశ్రుతతుల్‌
గ్రమ్మఁగ ముకుళితకరుఁడై, సమ్మతముగఁ జెప్పె నాత్మసంచారంబున్‌.
499
ఉ. ఓపిక లేక, చచ్చిన మహోరగముం గొని వచ్చి, కోపినై
తాపసు మూఁపుపై నిడిన దారుణ చిత్తుఁడ; మత్తుఁడన్‌ మహా
పాపుఁడ మీరు పాపతృణపావకు లుత్తము లయ్యలార! నా
పాపము వాయు మార్గము గృపాపరులార! విధించి చెప్పరే.
500
ఉ. భూసురపాద రేణువులు పుణ్యులఁ జేయు నరేంద్రులన్‌; ధరి
త్రీసురులార! మీ చరణరేణుకణంబులు మేను సోఁక నా
చేసిన పాప మంతయు నశించెఁ; గృతార్థుఁడ నైతి; నెద్ది యేఁ
జేసిన ముక్తిపద్ధతికిఁ జెచ్చెరఁ బోవఁగ వచ్చుఁ జెప్పరే.
501
క. భీకరతరసంసార, వ్యాకులతన్‌ విసిగి దేహవర్జనగతి నా
లోకించు నాకుఁ దక్షక, కాకోదరవిషము ముక్తి కారణమయ్యెన్‌.
502
క. ఏపారు నహంకార, వ్యాపారములందు మునిఁగి వర్తింపంగా
నా పాలిటి హరి భూసుర, శాపవ్యాజమున ముక్తసంగుం జేసెన్‌.
503
మ. ఉరగాధీశు విషానలంబునకు మే నొప్పింతు; శంకింప; నీ
శ్వరసంకల్పము నేఁడు మానదు; భవిష్యజ్జన్మ జన్మంబులన్‌
హరిచింతారతియున్‌, హరిప్రణుతి, భాషాకర్ణనాసక్తియున్‌,
హరిపాదాంబుజసేవయుం గలుగ మీ రర్థిం బ్రసాదింపరే!
504
క. చూడుఁడు నా కల్యాణము, పాడుఁడు గోవిందు మీఁది పాటలు దయతో
నాడుఁడు హరిభక్తుల కథ, లే డహములలోన ముక్తి కేఁగఁగ నిచటన్‌.
505
క. అమ్మా! నినుఁ జూచిన నరుఁ, బొమ్మాయని ముక్తి కడకుఁ బుత్తు వఁట కృపన్‌
లెమ్మా నీ రూపముతో, రమ్మా నా కెదుర గంగ! రమ్యతరంగా!
506
వ. అని తనకు మీఁద నయ్యెడి జన్మాంతరంబులందును హరిపాదభక్తి సౌజన్యంబులు సంధిల్లుంగాత మని గంగాతరంగిణీ దక్షిణకూలంబునం బూర్వాగ్ర దర్భాసనంబున నుత్తరాభిముఖుండై యుపవేశించి, జనమేజయు రప్పించి, రాజ్యభారంబు సమర్పించి, యత్నంబు సంసారబంధంబునకుం దప్పించి చిత్తంబు హరికి నొప్పించి పరమభాగవతుండైన పాండవపౌత్త్రుండు ప్రాయోపవిష్టుండై యున్న సమయంబున. 507
క. ఒత్తిలి పొగడుచు సురలు వి, యత్తలమున నుండి మెచ్చి యలరుల వానల్‌
మొత్తములై కురిసిరి నృప, సత్తముపై భూరిభేరిశబ్దంబులతోన్‌.
508
వ. ఆ సమయంబున సభాసీను లయిన ఋషు లిట్లనిరి. 509
మ. క్షితినాథోత్తమ! నీ చరిత్రము మహాచిత్రంబు; మీ తాత లు
గ్ర తపోధన్యులు విష్ణుపార్శ్వపదవిం గామించి రాజన్య శో
భితకోటీరమణి ప్రభాన్వితమహాపీఠంబు వర్జించి రు
న్నతులై; నీవు మహోన్నతుండవు గదా నారాయణధ్యాయివై.
510
మ. వసుధాధీశ్వర! నీవు మర్త్యతనువున్‌ వర్జించి నిశ్శోకమై
వ్యసనచ్ఛేదకమై రజోరహితమై వర్తించు లోకంబు స
ర్వసమత్వంబునఁ జేరునంతకు భవద్వాక్యంబులన్‌ వించు నే
దెసకుం బోవక చూచుచుండెదము నీ దివ్యప్రభావంబులన్‌.
511
వ. అని యిట్లు పక్షపాతశూన్యంబులును మహనీయ మాధుర్య గాంభీర్య సౌజన్య ధుర్యంబులును నైన భాషణంబు లాడుచు మూఁడు లోకంబులకు నవ్వలిదైన సత్యలోకంబునందు మూర్తి మంతంబులై నెగడుచున్న నిగమంబుల చందంబునం దేజరిల్లుచున్న ఋషులం జూచి భూవరుండు నారాయణ కథాశ్రవణ కుతూహలుం డయి నమస్కరించి యిట్లనియె. 512
క. ఏడు దినంబుల ముక్తిం, గూడఁగ నే రీతి వచ్చు గురుసంసార
క్రీడన మే క్రియ నెడతెగుఁ, జూడుఁడు మా తండ్రులార! శ్రుతివచనములన్‌.
513
శా. ప్రాప్తానందులు బ్రహ్మబోధన కళాపారీణు లాత్మప్రభా
లుప్తాజ్ఞానులు మీర లార్యులు దయాళుత్వాభిరాముల్‌ మనో
గుప్తంబుల్‌ సకలార్థజాలములు మీకుం గానవచ్చుం గదా!
సప్తాహంబుల ముక్తి కేఁగెడు గతిం జర్చించి భాషింపరే!
514
వ. అని యుత్తరానందనుం డాడిన వచనంబులకు మును లందఱుఁ బ్రత్యుత్తరంబు విమర్శించు నెడ దైవయోగంబున. 515
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )