పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ప్రథమస్కంధము
శుకమహర్షి పరీక్షిన్మహారాజు నొద్ద కేతెంచుట
సీ. ప్రతినిమేషము పరబ్రహ్మంబు నీక్షించి మదిఁ జొక్కి వెలుపల మఱచువాఁడు
కమలంబుమీఁది భృంగముల కైవడి మోముపై నెఱపిన కేశపటలివాఁడు
గిఱి వ్రాసి మాయ నంగీకరించని భంగి వసనంబుఁ గట్టక వచ్చువాఁడు
సంగిగాఁడని వెంటఁ జాటు భూతములు నా బాలుర హాసశబ్దములవాఁడు
 
తే. మహిత పద జాను జంఘోరు మధ్య హస్త, బాహు వక్షో గళానన ఫాల కర్ణ
నాసికా గండ మస్తక నయన యుగళుఁ, డైన యవధూతమూర్తివాఁ డరుగుదెంచె.
516
ఉ. ఈరని లోకులం గినిసి, యెగ్గులు వల్కనివాఁడు, గోరికల్‌
గోరనివాఁడు, గూటువలఁ గూడని వాఁడు, వృథాప్రపంచముం
జేరనివాఁడు, దైవగతిఁ జేరిన లాభము సూచి తుష్టుఁడై
నేరని వానిచందమున నేర్పులు సూపెడు వాఁడు, వెండియున్‌.
517
ఆ. అ మ్మహాత్ము షోడశాబ్దవయోరూప, గమన గుణ విలాస కౌశలములు
ముక్తికాంత సూచి మోహిత యగు నన, నితరకాంత లెల్ల నేమి సెప్ప!
518
ఆ. వెఱ్ఱితనము మాని విజ్ఞానమూర్తియై, బ్రహ్మభావమునను బర్యటింప
వెఱ్ఱి యంచు శుకుని వెంట నేతెంతురు, వెలఁదు లర్భకులును వెఱ్ఱు లగుచు.
519
వ. ఇట్లు వ్యాసనందనుండైన శుకుం డరుగుదెంచిన నందలి మునీంద్రు లమ్మహానుభావుని ప్రభావంబు లెఱుంగుదురు గావున నిజాసనంబులు డిగ్గి ప్రత్యుత్థానంబు సేసిరి; పాండవ పౌత్త్రుండు నా యోగిజన శిఖామణికి నతిథిసత్కారంబులు గావించి దండప్రణామంబు సేసి పూజించె; మఱియు గ్రహనక్షత్ర తారకామధ్యంబునం దేజరిల్లు రాకాసుధాకరుండునుంబోలె బ్రహ్మర్షి దేవర్షి రాజర్షి మధ్యంబునం గూర్చుండి విరాజమానుండైన శుకయోగీంద్రుం గనుంగొని. 520
ఉ. ఫాలము నేల మోపి, భయభక్తులతోడ నమస్కరించి, భూ
పాల కులోత్తముండు కరపద్మములన్‌ ముకుళించి, నేఁడు నా
పాలిటిభాగ్య మెట్టిదియొ, పావనమూర్తివి పుణ్యకీర్తి వీ
వేళకు నీవు వచ్చితి వివేకవిభూషణ! దివ్య భాషణా!
521
మ. అవధూతోత్తమ! మంటి, నేఁడు నిను డాయం గంటి; నీవంటి వి
ప్ర వరుం బేర్కొను నంతటన్‌ భసితమౌఁ బాపంబు; నా బోఁటికిన్‌;
భవదాలోకన భాషణార్చన పదప్రక్షాళన స్పర్శనా
ది విధానంబుల ముక్తి చేపడుట చింతింపంగ నాశ్చర్యమే?
522
క. హరిచేతను దనుజేంద్రులు, ధరఁ ద్రుంగెడు భంగి నీ పదస్పర్శముచే
గురుపాతక సంఘంబులు, పొరిమాలుఁ గదయ్య యోగిభూషణ! వింటే.
523
మ. ఎలమిన్‌ మేనమఱందియై సచివుఁడై యే మేటి మా తాతలన్‌
బలిమిం గాచి సముద్రముద్రితధరం బట్టంబుఁ గట్టించె, న
య్యలఘుం డీశుఁడు చక్రి రక్షకుఁడుగా కన్యుల్‌ విపద్రక్షకుల్‌
గలరే? వేఁడెద భక్తి నా గుణనిధిం గారుణ్యవారాన్నిధిన్‌.
524
సీ. అవ్యక్తమార్గుండ వైన నీ దర్శన మాఱడి పో నేర; దభిమతార్థ
సిద్ధి గావించుట సిద్ధంబు; నే డెల్లి దేహంబు వర్జించు దేహధారి
కేమి చింతించిన నేమి జపించిన నేమి గావించిన నేమి వినిన
నేమి సేవించిన నెన్నఁడు సంసార పద్ధతిఁ బాసిన పదవి గలుగు?
 
తే. నుండు మనరాదు గురుఁడవు యోగివిభుఁడ, వావుఁ బిదికిన తడవెంత యంత సేపు
గాని యొక దెస నుండవు కరుణతోడఁ జెప్పవే తండ్రి! ముక్తికిఁ జేరు తెరువు!
525
వ. అని పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగె నని చెప్పి. 526
క. రాజీవపత్త్రలోచన!, రాజేంద్ర కిరీట ఘటిత రత్న మరీచి
భ్రాజితపాదాంభోరుహ!, భూజన మందార! నిత్యపుణ్యవిచారా!
527
మా. అనుపమగుణహారా! హన్యమానారివీరా!
జనవినుతవిహారా! జానకీచిత్తచోరా!
దనుజఘనసమీరా! దానవశ్రీవిదారా!
ఘనకలుషకఠోరా! కంధిగర్వాపహారా!
528
గద్య. ఇది శ్రీ పరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర, కేసనమంత్రి పుత్త్ర, సహజపాండిత్య, పోతనామాత్యప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబునందు నైమిశారణ్య వర్ణనంబును శౌనకాదుల ప్రశ్నంబును, సూతుండు నారాయణ కథాసూచనంబు సేయుటయు, వ్యాసచింతయు, నారదాగమనంబును, నారదుని పూర్వకల్ప వృత్తాంతంబును, బుత్త్రశోకాతురయైన ద్రుపదరాజ నందన కర్జునుం డశ్వత్థామం దెచ్చి యొప్పించి గర్వ పరిహారంబు సేయించి విడిపించుటయు, భీష్మ నిర్యాణంబును, ధర్మనందను రాజ్యాభిషేకంబును, గోవిందుని ద్వారకాగమనంబును, విరాట కన్యకా గర్భ విద్యమానుండైన యర్భకు నశ్వత్థామ బాణానలంబు వలనం బాపి విష్ణుండు రక్షించుటయుఁ, బరీక్షిజ్జన్మంబును, గాంధారీ ధృతరాష్ట్ర విదురుల నిర్గమంబును, నారదుండు ధర్మరాజునకుఁ గాల సూచనంబు సేయుటయుఁ, గృష్ణనిర్యాణంబు విని పాండవులు మహాపథంబునం జనుటయు, నభిమన్యు పుత్త్రుండు దిగ్విజయంబు సేయుచు శూద్రరాజలక్షణ లక్షితుండగు కలిగర్వంబు సర్వంబు మాపి గోవృషాకారంబుల నున్న ధరణీ ధర్మదేవతల నుద్ధరించుటయు, శృంగి శాపభీతుండై యుత్తరానందనుండు గంగాతీరంబునం బ్రాయోపవేశంబున నుండి శుక సందర్శనంబు సేసి, మోక్షోపాయం బడుగుటయు నను కథలు గల ప్రథమస్కంధము. 529
శ్రీకృష్ణార్పణమస్తు
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - prathama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )