| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ద్వితీయస్కంధము |
| సీ. |
హరిపాదభక్తి రహస్యోపదేష్టయు నఖిలదేవతలకు నధివిభుండు నైన విధాత గల్పాదియందును నిజాశ్రయపద్మమున కధిష్ఠాన మరయ నర్థించి జలముల నన్వేషణము సేసి నలినంబు మొదలు గానంగలేక విసివి క్రమ్మఱను దద్బిసరుహాసీనుఁడై సృష్టినిర్మాణేచ్ఛఁజిత్తమందుఁ |
|
| తే. |
జాల నూహించి తత్పరిజ్ఞానమహిమ, సరణి మనమునఁదోఁపక జడనుపడుచు లోకజాలంబుఁ బుట్టింపలేక మోహి, తాత్ముఁడై చింత నొందు న య్యవసరమున. |
225 |
| వ. | జలమధ్యంబుననుండి యక్షర సమామ్నాయంబున స్పర్శంబులందు షోడశాక్షరంబును మఱియు నేకవింశాక్షరంబును నైన యియ్యక్షరద్వయంబువలన నగుచు మహాముని జనధనం బయిన “తప” యను శబ్దం బినుమా ఱుచ్చరింపంబడి వినంబడిన, నట్టి శబ్దంబు వలికిన యప్పురుషుని వీక్షింపంగోరి నలుదిక్కులకుం జని వెదకి, యెందునుం గానక. మరలి వచ్చి నిజస్థానంబైన పద్మంబునం దాసీనుండై యొక్కింత చింతించి యట్టి శబ్దంబు దన్నుఁ దపంబు సేయుమని నియమించుటగాఁ దలంచి ప్రాణాయామ పరాయణుండై, జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి, యేకాగ్ర చిత్తుండై, సకలలోక సంతాపహేతువగు తపంబు వేయి దివ్యవత్సరంబులు గావింప, నీశ్వరుండు ప్రసన్నుండై పొడసూపిన నక్కమలసంభవుండు తత్‌క్షణంబ రాజసతామసమిశ్రసత్త్వగుణాతీతంబును, శుద్ధ సత్త్వగుణావాసంబును, నకాల విక్రమంబును, సర్వలోకోన్నతంబును, సకల సురగణస్తుత్యంబును, ననంత తేజోవిరాజితంబు నైన వైకుంఠ పురంబుం బొడగని యందు. | 226 |
| సీ. |
సూర్యచంద్రానలస్ఫురణలం జొరనీక నిజదీధితిస్ఫూర్తి నివ్వటిల్ల దివ్యమణిప్రభాదీపిత సౌధవిమానగోపురహర్మ్యమండపములుఁ బ్రసవగుచ్ఛ స్వచ్ఛ భరిత కామితఫల సంతానపాదపసముదయములుఁ గాంచనదండసంగతమారుతోద్ధూత తరళవిచిత్రకేతనచయములు |
|
| తే. |
వికచ కైరవ దళదరవింద గత మ, రంద రసపాన మోదితేందిందిర ప్ర భూత మంజుల నినదప్రబుద్ధ రాజ, హంసశోభిత వరకమలాకరములు. |
227 |
| సీ. |
వల నొప్పఁగా ‘న దైవం కేశవాత్పర’ మ్మని పల్కు రాజకీరావళియును మహిమ ‘జగద్విష్ణుమయ మఖిల’మ్మని చదివెడు శారికాసముదయంబు నేపారఁగా ‘జితం తే పుండరీకాక్ష’ యని లీలఁ బాడు పికావళియును లలి మీఱఁగా ‘మంగళం మధుసూదన’ యనుచుఁ బల్కెడు మయూరావళియును |
|
| తే. |
దవిలి ‘శ్రౌషడ్వషట్స్వధే’ త్యాది శబ్ద, కలితముగ మ్రోయు మధుప నికాయములును గలిగి యఖిలైక దివ్య మంగళ విలాస, మహిమఁ జెన్నొందు వైకుంఠమందిరంబు. |
228 |
| వ. | మఱియుంబయోధరావళీవిభాసితనభంబునుంబోలె వెలుంగుచున్న య ద్దివ్యధామంబునందు. | 229 |
| సీ. |
సలలితేందీవరశ్యామాయమానోజ్జ్వలాంగులు నవ్యపీతాంబరులును ధవళారవిందసుందరపత్రనేత్రులు సుకుమారతనులు భాసురవినూత్న రత్న విభూషణ గ్రైవేయ కంకణ హార కేయూర మంజీర ధరులు నిత్యయౌవనులు వినిర్మలచరితులు, రోచిష్ణులును హరిరూపధరులు |
|
| తే. |
నగు సునందుండు నందుండు నర్హణుండుఁ, బ్రబలుఁడును నాదియగు నిజపార్శ్వచరులు మఱియు వైదూర్యవిద్రుమామలమృణాళ, తుల్యగాత్రులు దను భక్తితో భజింప. |
230 |
| సీ. |
క్షాళితాఖిలకల్మషవ్రజామరనదీ జనక కోమలపదాజ్జములవాని నఖిలసంపత్కారణాపాంగ లక్ష్మీ విలాసితవక్షఃస్థలంబువానిఁ బద్మమిత్రామిత్రభాసిత కరుణాతరంగిత చారునేత్రములవాని భువననిర్మాణనైపుణ భవ్య నిజ జన్మకారణ నాభిపంకజమువాని |
|
| తే. |
నహి హితాహితశయన వాహనములవాని, సేవితామరతాపసశ్రేణివాని నఖిలలోకంబులకు గురుఁడైనవానిఁ గాంచెఁ బరమేష్ఠి గన్నుల కఱవు దీఱ. |
231 |
| క. |
కమనీయ రూపరేఖా, రమణీయతఁ జాల నొప్పు రమణీమణి య క్కమలాలయ దన మృదు కర, కమలంబుల విభుని పాదకమలము లొత్తెన్. |
232 |
| వ. | వెండియు. | 233 |
| శా. |
శ్రీకాంతాతిలకంబు రత్నరుచిరాజిప్రేంఖితస్వర్ణ డో లాకేళిన్ విలసిల్లి తత్కచభరాలంకారస్రగ్గంధ లో భాకీర్ణ ప్రచరన్మధువ్రత మనోజ్ఞాలోలనాదంబు ల స్తోకానుస్వరలీల నొప్పఁగ నిజేశున్ వేడ్కతోఁ బాడఁగన్. |
234 |
| వ. | అట్టి నిత్యవిభూతియందు. | 235 |
| మ. |
సతతజ్ఞానరమా యశో బల మహైశ్వర్యాది యుక్తున్ జగ త్పతి యజ్ఞేశు ననంతు నచ్యుతు దళత్పంకేరుహాక్షున్ శ్రియః పతి నాద్యంతవికారదూరుఁ గరుణాపాథోనిధిన్ సాత్వతాం పతి వర్ధిష్ణు సహిష్ణు విష్ణు గుణవిభ్రాజిష్ణు రోచిష్ణునిన్. |
236 |
| మ. |
దరహాసామృతపూరితాస్యు నిజభక్తత్రాణపారాయణు న్నరుణాంభోరుహపత్రలోచనునిఁ బీతావాసుఁ ద్రైలోక్య సుం దరు మంజీరకిరీటకుండలముఖోద్యద్భూషు యోగీశ్వరే శ్వరు లక్ష్మీయుతవక్షుఁ జిన్మయు దయాసాంద్రుం జతుర్బాహునిన్. |
237 |
| వ. | మఱియు ననర్ఘ రత్నమయ సింహాసనాసీనుండును, సునంద నందకుముదాది సేవితుండును, బ్రకృతిపురుష మహదహంకారంబులను చతుశ్శక్తులును గర్మేంద్రియ జ్ఞానేంద్రియమనో మహాభూతంబులను షోడశ శక్తులును బంచతన్మాత్రంబులునుం బరివేష్టింపఁ గోట్యర్క ప్రభావిభాసితుండును, స్వేతరాలభ్య స్వాభావిక సమస్తైశ్వర్యాతిశయుండునునై స్వస్వరూపంబునం గ్రీడించు సర్వేశ్వరుండైన పరమపురుషుం బురుషోత్తముం బుండరీకాక్షు నారాయణుం జూచి సాంద్రానందకందళిత హృదయారవిందుండును, రోమాంచకంచుకితశరీరుండును, ఆనందబాష్పధారాసిక్తకపోలుండును నగుచు. | 238 |
| క. |
వర పరమహంస గమ్య, స్ఫురణం దనరారు పరమపురుషుని పద పం కరుహములకు నజుఁడు చతు, శ్శిరములు సోఁకంగ నతులు సేసిన హరియున్. |
239 |
| చ. |
ప్రియుఁడగు బొడ్డుఁదమ్మి తొలిబిడ్డఁడు వేలుపుఁబెద్ద భూత సం చయములఁ జేయు కర్త నిజశాసనపాత్రుఁడు ధాత మ్రొక్కినన్ దయ దళుకొత్తఁ బల్కెఁ బ్రమదస్మితచారుముఖారవిందుఁడై నయమునఁ బాణిపంకజమునన్ హరి యాతని దేహ మంటుచున్. |
240 |
| ఆ. |
కపటమునుల కెంత కాలమునకు నైన, సంతసింప నేను జలజగర్భ! చిరతపస్సమాధిఁజెంది విసర్గేచ్ఛ, మెలఁగు నిన్నుఁ బరిణమింతుఁగాని. |
241 |
| తే. |
భద్రమగుఁగాక నీకు నో పద్మగర్భ! వరము నిపుడిత్తు నెఱిఁగింపు వాంఛితంబు; దేవదేవుఁడనగు నస్మదీయపాద, దర్శనంబవధి విపత్తిదశల కనఘ! |
242 |
| చ. |
సరసిజగర్భ! నీయెడఁ బ్రసన్నత నొంది మదీయలోక మే నిరవుగఁ జూపుటెల్లను నహేతుక భూరి దయా కటాక్ష వి స్ఫురణన కాని, నీదగు తపోవిభవంబునఁ గాదు, నీ తప శ్చరణము నాదు వాక్యముల సంగతిఁగాదె సరోజసంభవా! |
243 |
| క. |
తప మనఁగ మత్స్వరూపము, తపమను తరువునకు ఫలవితానము నే నా తపముననే జనన స్థి, త్యుపసంహరణము లొనర్చుచుండుదుఁదనయా! |
244 |
| క. |
కావున మద్భక్తికిఁ దప, మే విధమున మూలధనమొ యిది నీ మది రా జీవభవ! యెఱిఁగి తప మిటు, గావించుట విగతమోహకర్ముఁడ వింకన్. |
245 |
| క. |
అని యానతిచ్చి కమలజ!, యెనయఁగ భవదీయమానసేప్సిత మే మై నను నిత్తు వేఁడు మనినను, వనరుహసంభవుఁడు వికచవదనుం డగుచున్. |
246 |
| చ. |
హరివచనంబు లాత్మకుఁ బ్రియం బొనరింపఁ బయోజగర్భుఁ డో పరమపదేశ! యోగిజనభావన! యీ నిఖిలోర్వియందు నీ యరయని యట్టి యర్థ మొకఁడైనను గల్గునె? యైన నా మదిన్ బెరసిన కోర్కి దేవ! వినిపింతు దయామతిఁ జిత్తగింపవే! |
247 |
| వ. | దేవా! సర్వభూతాంతర్యామివై భగవంతుండవైన నీకు నమస్కరించి మదీయ వాంఛితంబు విన్నవించెద నవధరింపు; మవ్యక్తరూపంబులై వెలుంగు భవదీయ స్థూలసూక్ష్మరూపంబులును, నానాశక్త్యుపబృంహితంబులైన బ్రహ్మాది రూపంబులును, నీయంత నీవే ధరించి జగదుత్పత్తి స్థితిలయంబులం దంతు కీటంబునుం బోలెఁ గావించుచు నమోఘసంకల్పుండవై లీలావిభూతిం గ్రీడించు మహిమంబు దెలియునట్టి పరిజ్ఞానంబుఁ గృపసేయుము. భవదీయ శాసనంబున జగన్నిర్మాణంబు గావించునపుడు బ్రహ్మాభిమానంబునంజేసి యవశ్యంబును మహదహంకారంబులు నామదిం బొడముం గావునఁదత్పరిహారార్థంబు వేఁడెద. నన్నుం గరుణార్ద్ర దృష్టి విలోకించి దయసేయు మని విన్నవించిన నాలించి పుండరీకాక్షుం డతని కిట్లనియె. | 248 |
| క. |
వారిజభవ! శాస్త్రార్థ వి, చారజ్ఞానమును భక్తి సమధికసాక్షా త్కారము లను నీ మూఁడు ను, దారత నీ మనమునందు ధరియింపనగున్. |
249 |
| సీ. |
పరికింప మత్స్వరూపస్వభావములును మహిమావతారకర్మములుఁ దెలియఁ తత్త్వవిజ్ఞానంబు దలకొని మత్ప్రసాదమునఁ గల్గెడి నీకుఁ గమలగర్భ! సృష్టిపూర్వమునఁ జర్చింప నే నొకరుండఁ గలిగి యుండుదు వీతకర్మి నగుచు సమధికస్థూలసూక్ష్మ స్వరూపములుఁ దత్కారణప్రకృతియుఁ దగు మదంశ |
|
| ఆ. |
మందు లీనమైన నద్వితీయుండనై, యుండు నాకు నన్య మొకటి లేదు; సృష్టికాలమందు సృజ్యమానం బగు, జగము మత్స్వరూప మగును వత్స! |
250 |
| క. |
అరయఁగఁ గల్పప్రళయాం, తరమున నాద్యంతవిరహితక్రియతోడం బరిపూర్ణనిత్యమహిమం, బరమాత్ముఁడనై సరోజభవ! యే నుందున్. |
251 |
| వ. | అదియుంగాక నీవు నన్నడిగిన యీ జగన్నిర్మాణమాయా ప్రకారం బెఱింగింతు, లేని యర్థంబు శుక్తి రజతభ్రాంతియుంబోలె నేమిటి మహిమం దోఁచి క్రమ్మఱఁ దోఁపకమాను నదియె మదీయ మాయావిశేషం బని యెఱుంగు; మదియునుం గాక లేని యర్థంబు దృశ్యమానం బగుటకును, గల యర్థంబు దర్శనగోచరంబు గాకుండుటకును, ద్విచంద్రాదికంబును దమః ప్రభాసంబును దృష్టాంతంబులుగాఁ దెలియు; మే ప్రకారంబున మహాభూతంబులు భౌతికంబులయిన ఘట పటాదులందుఁ బ్రవేశించియుండు, నా ప్రకారంబున నేను నీ భూత భౌతికంబు లయిన సర్వకార్యంబులందు సత్త్వాదిరూపంబులం బ్రవేశించి యుండుదు; భౌతికంబులు భూతంబులందుఁ గారణావస్థంబొందు చందంబున భూతభౌతికంబులు గారణావస్థం బొంది నాయందు నభివ్యక్తంబులై యుండవు; సర్వదేశంబులయందును, సర్వకాలంబులయందును, నేది బోధితంబై యుండు నట్టిదియ పరబ్రహ్మస్వరూపంబు; తత్త్వం బెఱుంగ నిచ్ఛించిన మిముబోఁటి వారలకు నీ చెప్పిన మదీయ తత్త్వాత్మకంబైన యర్థంబ యర్థం బని యెఱుంగు; ఈ యర్థం బుత్కృష్టం బయినయది; యేకాగ్రచిత్తుండవై యాకర్ణించి భవదీయచిత్తంబున ధరియించిన నీకు సర్గాది కర్మంబులందు మోహంబు సెందకుండెడి నని భగవంతుండయిన పరమేశ్వరుండు చతుర్ముఖున కానతిచ్చి నిజలోకంబుతో నంతర్ధానంబు నొందె నని చెప్పి శుకుండు వెండియు నిట్లనియె. | 252 |
| సీ. |
అవనీశ! బ్రహ్మ యిట్లంతర్హితుండైనఁ బుండరీకాక్షుని బుద్ధి నిలిపి యానందమునఁ బొంది యంజలి గావించి తత్పరిగ్రహమునఁ దనదు బుద్ధి గైకొని పూర్వప్రకారంబునను సమస్త ప్రపంచంబును దగ సృజించి మఱియొకనాఁడు ధర్మప్రవర్తకుఁ డౌచు నఖిలప్రజాపతియైన కమల |
|
| తే. |
గర్భుఁ డాత్మహితార్థమై కాక సకల, భువనహితబుద్ధి నున్నతస్ఫురణ మెఱసి మానితంబైన యమనియమముల రెంటి, నాచరించెను సమ్ముదితాత్ముఁ డగుచు. |
253 |
| వ. | అయ్యవసరంబున | 254 |
| క. |
ఆ నలినాసననందను, లైన సనందాదిమునుల కగ్రేసరుఁడున్ మానుగఁ బ్రియతముఁడును నగు, నా నారదుఁ డేఁగుదెంచె నబ్జజుకడకున్. |
255 |
| క. |
చనుదెంచి తండ్రికిం బ్రియ, మొనరఁగ శుశ్రూషణంబు లొనరిచి యతఁడుం దనదెసఁ బ్రసన్నుఁ డగుటయుఁ, గని భగవన్మాయ దెలియఁగా నుత్సుకుఁడై. |
256 |
| సీ. |
అవనీశ! నీవు నన్నడిగిన పగిది నాతఁడుఁ దండ్రి నడుగఁ బితామహుండు భగవంతుఁ డాశ్రితపారిజాతము హరి గృపతోడఁ దన కెఱింగించినట్టి లోకమంగళచతుశ్ల్శోక రూపంబును దశలక్షణంబులఁ దనరు భాగ వతము నారదున కున్నతిఁ జెప్పె నాతఁడు చారు సరస్వతీ తీరమునను |
|
| తే. |
హరిపదధ్యానపారీణుఁ డాత్మవేది, ప్రకటతేజస్వి యగు బాదరాయణునకుఁ గోరి యెఱిఁగించె; న మ్మహోదారుఁ డెలమి, నాకు నెఱిఁగించె; నెఱిఁగింతు నీకు నేను. |
257 |
| వ. | అదియునుం గాక యిపుడు విరాట్పురుషునివలన నీ జగంబు లే వడుపునఁ బొడమె నను నివి మొదలయిన ప్రశ్నంబులు గొన్ని నన్నడిగితివి. ఏను నన్నింటికి నుత్తరం బగునట్లుగా ని మ్మహాభాగతం బుపన్యసించెద నాకర్ణింపుము. అ మ్మహాపురాణంబు చతుశ్ల్శోకరూపంబును, దశలక్షణంబునునై సంకుచితమార్గంబున నొప్పు; నందు దశలక్షణంబు లెవ్వి యనిన సర్గంబును, విసర్గంబును, స్థానంబును, బోషణంబును, నూతులును, మన్వంతరంబులును, నీశానుచరితంబులును, నిరోధంబును, ముక్తియు, నాశ్రయంబును ననం బది తెఱంగు లయ్యె; దశమాశ్రయవిశుద్ధ్యర్థంబు తక్కిన తొమ్మిది లక్షణంబులుఁ జెప్పంబడె నవి యెట్టివనిన. | 258 |
| తే. |
మహదహంకార పంచతన్మాత్ర గగన, పవన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి య ప్రపంచంబు భగవంతునందు నగుట, “సర్గ” మందురు దీనిని జనవరేణ్య! |
259 |
| క. |
సరసిజగర్భుండు విరా, ట్పురుషునివలనన్ జనించి, భూరితర చరా చరభూతసృష్టిఁ జేయుట, పరువడిని “విసర్గ”మండ్రు భరతకులేశా! |
260 |
| క. |
లోకద్రోహినరేంద్రా, నీకముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా వైకుంఠనాథు విజయం, బాకల్ప “స్థాన” మయ్యె నవనీనాథా! |
261 |
| క. |
హరి సర్వేశుఁ డనంతుఁడు, నిరుపమశుభమూర్తి సేయు నిజభక్త జనో ద్ధరణము “పోషణ”మవనీ, వర! “యూతు” లనంగఁ గర్మవాసన లరయన్. |
262 |
| తే. |
జలజనాభ దయాకటాక్ష ప్రసాద, లబ్ధి నఖిలైక లోకపాలకవిభూతి మహిమఁ బొందినవారి ధర్మములు విస్త, రమునఁ బలుకుట “మన్వంతరములు” భూప! |
263 |
| క. |
వనజోదరునవతార క, థనముఁ దదీయానువృత్తిఁ దచ్చారిత్రం బును విస్తరించి పలుకం, జను నవి “యీశాను కథలు” సౌజన్యనిధీ! |
264 |
| సీ. |
వసుమతీనాథ! సర్వస్వామి యైన గోవిందుండు చిదచిదానందమూర్తి సలలితస్వోపాధి శక్తిసమేతుఁడై తనరారు నాత్మీయధామమందు ఫణిరాజమృదులతల్పంబుపై సుఖలీల యోగనిద్రారతి నున్నవేళ నఖిలజీవులు నిజవ్యాపారశూన్యులై, యున్నతతేజంబు లురలుకొనఁగ |
|
| తే. |
జరుగు న య్యవస్థావిశేషంబు లెల్ల, విదిత మగునట్లు వలుకుట యది “నిరోధ” మన నిది యవాంతర ప్రళయం బనంగఁ, బరఁగు నిఁక “ముక్తి” గతి విను పార్థివేంద్ర! |
265 |
| సీ. |
జీవుండు భగవత్కృపావశంబునఁజేసి దేహధర్మంబులై ధృతి ననేక జన్మానుచరితదృశ్యము లైన యజ్జరామరణంబు లాత్మధర్మంబు లయిన ఘనపుణ్యపాపనికాయ నిర్మోచనస్థితి నొప్పి పూర్వసంచితములైన యపహతపాప్మవత్త్వాద్యష్ట తద్గుణవంతుఁడై తగ భగవచ్ఛరీర |
|
| తే. |
భూతుఁడై పారతంత్ర్యాత్మబుద్ధి నొప్పి, దివ్య మాల్యానులేపన భవ్య గంధ కలిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుఁ, డగుచు హరిరూప మొందుటే యనఘ! “ముక్తి.” |
266 |
| వ. |
మఱియు నుత్పత్తిస్థితిలయంబు లెందగుచుఁ బ్రకాశింపఁబడు నది “యాశ్రయం” బనంబడు. నదియ పరమాత్మ. బ్రహ్మ శబ్దవాచ్యంబు నదియ. ప్రత్యక్షానుభవంబున విదితంబు సేయుకొఱకు నాత్మ యాధ్యాత్మికాది విభాగంబు సెప్పంబడియె; నది యెట్టనిన నాత్మ “యాధ్యాత్మి” “కాధిదైవి” “కాధిభౌతికంబు”లం ద్రివిధం బయ్యె; నందు నాధ్యాత్మికంబు చక్షురాది గోళకాంతర్వర్తియై యెఱుంగం బడుఁ; జక్షురాదికరణాభిమానియై ద్రష్టయైన జీవుండె యాధిదైవికుం డనందగుఁ; జక్షురాద్యధిష్ఠానాభిమానదేవతయై సూర్యాది తేజోవిగ్రహుండు నగుచు నెవ్వనియందు నీ యుభయవిభాగంబునుం గలుగు నతండె యాధిభౌతికుండును, విరాడ్విగ్రహుండును నగుం గావున ద్రష్టయు దృక్కును దృశ్యంబు ననందగు నీ మూఁటియందు నొకటి లేకున్న నొకటి గానరా, దీ త్రితయంబు నెవ్వం డెఱుంగు నతండు సర్వలోకాశ్రయుండై యుండు; నతండె పరమాత్మయును; ఆ మ్మహాత్ముండు లీలార్థంబైన జగత్సర్జనంబుసేయు తలంపున బ్రహ్మాండంబు నిర్భేదించి తనకు సుఖస్థానంబు నపేక్షించి మొదల శుద్ధంబు లగు జలంబుల సృజియించె; స్వతఃపరిశుద్ధుండు గావున స్వసృష్టంబై యేకార్ణవాకారం బైన జలరాశియందు శయనంబు సేయుటం జేసి“శ్లో. ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః, అను ప్రమాణము చొప్పున నారాయణ శబ్దవాచ్యుండు గావున నతనిప్రభావంబు వర్ణింప దుర్లభం; బుపాదానభూతంబయిన ద్రవ్యంబును, ద్రివిధం బయిన కర్మంబును, గళాకాష్ఠాద్యుపాధిభిన్నంబయిన కాలంబును, జ్ఞానాదికంబగు జీవస్వభావంబును, భోక్త యగు జీవుండును, నెవ్వని యనుగ్రహంబునం జేసి వర్తించుచుండు, నెవ్వని యుపేక్షంజేసి వర్తింపకుండు, నట్టి ప్రభావంబు గల సర్వేశ్వరుండు దా నేకమయ్యు ననేకంబుగాఁ దలంచి యోగకల్పంబునం బ్రబుద్ధుండై యుండు. అఁట మీఁద స్వసంకల్పంబునం జేసి హిరణ్మయంబైన తన విగ్రహంబు నధిదైవతంబును, నధ్యాత్మికంబును, నధిభూతంబును నను సంజ్ఞాయుతంబై త్రివిధంబుగా సృజియించె. |
267 |
| సీ. |
అట్టి విరాడ్విగ్రహాంత రాకాశంబు వలన నోజస్సహోబలము లయ్యెఁ బ్రాణంబు సూక్ష్మరూపక్రియా శక్తిచే జనియించి ముఖ్యాసువనఁగఁ బరఁగె వెలువడి చను జీవి వెనుకొని ప్రాణముల్ సనుచుండు నిజనాథు ననుసరించు భటుల చందంబునఁ, బాటిల్లు క్షుత్తును భూరితృష్ణయు మఱి ముఖమువలనఁ |
|
| తే. |
దాలుజిహ్వాదికంబు లుద్భవము నొందె, నందు నుదయించె నానావిధైక రసము, లెనయ నవి యెల్ల జిహ్వచే నెఱుఁగఁబడును, మొనసి పలుక నపేక్షించు ముఖమువలన. |
268 |
| వ. | మఱియు వాగింద్రియంబు వుట్టె, దానికి దేవత యగ్ని; యా రెంటివలన భాషణంబు వొడమె; నా యగ్నికి మహాజల వ్యాప్తం బగు జగంబున నిరోధంబు గలుగుటంజేసి యా జలంబె ప్రతిబంధకం బయ్యె; దోదూయమానం బైన మహావాయువు వలన ఘ్రాణంబు వుట్టెం గావున వాయుదేవతాకం బైన ఘ్రాణేంద్రియంబు గంధ గ్రహణ సమర్థం బయ్యె; నిరాలోకం బగు నాత్మ నాత్మయందుఁ జూడం గోరి తేజంబువలన నాదిత్యదేవతాకంబై రూపగ్రాహకంబైన యక్షియుగళంబు వుట్టె; ఋషి గణంబులచేత బోధితుం డగుచు భగవంతుండు దిగ్దేవతాకంబును శబ్దగ్రాహకంబును నైన శ్రోత్రేంద్రియంబు వుట్టించె; సర్జనంబు సేయు పురుషునివలన మృదుత్వకాఠిన్యంబులును, లఘుత్వ గురుత్వంబులును, నుష్ణత్వ శీతలత్వంబులును జేసెడు త్వగింద్రియాధిష్ఠానంబగు చర్మంబు పుట్టె; దానివలన రోమంబు లుదయించె; వానికి మహీరుహంబు లధిదేవత లయ్యె; నందు నధిగతస్పర్శ గుణుండును, నంతర్బహిఃప్రదేశంబుల నావృతుండును నగు వాయువువలన బలవంతంబులును, నింద్రదేవతాకంబులును, నాదానసమర్థంబులును, నానాకర్మకరణ దక్షంబులును నగు హస్తంబు లుదయించె; స్వేచ్ఛా విషయగతి సమర్థుండగు నీశ్వరుని వలన విష్ణు దేవతాకంబులగు పాదంబు లుదయించెఁ; బ్రజానందామృతార్థియగు భగవంతునివలనఁ బ్రజాపతి దేవతాకంబై, స్త్రీ సంభోగాది కామ్యసుఖంబులు కార్యంబులుగాఁ గల శిశ్నోపస్థంబు లుదయించె; మిత్రుం డధిదైవతంబుగాఁ గలిగి భుక్తాన్నాద్యసారాంశ త్యాగోపయోగంబగు “పాయు”వనెడి గుదం బుద్భవించె; వాని కృత్యం బుభయ మలమోచనంబు; దేహంబున నుండి దేహాంతరంబుఁ జేరం గోరి పూర్వకాయంబు విడుచుటకు సాధనం బగు నాభిద్వారంబు సంభవించె; నట్టి నాభియే ప్రాణాపానబంధ స్థానం బనంబడు; దద్బంధ విశ్లేషంబె మృత్యువగు; నదియ యూర్ధ్వాధోదేహ భేదకం బనియును జెప్పంబడు; నన్నపానాది ధారణార్థంబుగ నాంత్ర కుక్షి నాడీనిచయంబులు గల్పింపంబడియె; వానికి నదులును, సముద్రంబులును నధిదేవత లయ్యె; వానివలనఁ దుష్టి పుష్టులను నుదరభరణ పరిణామంబులు గలిగియుండు; నాత్మీయ మాయాచింతనం బొనర్చునపుడు కామ్యసంకల్పాదిస్థానం బగు హృదయంబు గలిగె; దానివలన మనంబును; జంద్రుండును, గాముండును, సంకల్పంబును నుదయించె; నంతమీఁద జగత్సర్జనంబు సేయు విరాడ్విగ్రహంబున సప్తధాతువులును, బృథివ్యప్తేజోమయంబు లయిన సప్త ప్రాణంబులును, వ్యోమాంబు వాయువులచే నుత్పన్నంబులై గుణాత్మకంబులైన యింద్రియంబులును, నహంకార ప్రభవంబులైన గుణంబులును, సర్వవికార స్వరూపం బగు మనస్సును, విజ్ఞానరూపిణి యగు బుద్ధియును బుట్టు; వివిధంబగు నిది యంతయు సర్వేశ్వరుని స్థూల విగ్రహంబు. మఱియును. | 269 |
| క. |
వరుసఁ బృథివ్యాద్యష్టా, వరణావృతమై సమగ్రవైభవములఁ బం కరుహభవాండాతీత, స్ఫురణం జెలువొందు నతివిభూతి దలిర్పన్. |
270 |
| క. |
పొలుపగు సకల విలక్షణ, ములు గల యాద్యంతశూన్యమును నిత్యమునై లలి సూక్ష్మమై మనో వా, క్కులకుం దలపోయఁగా నగోచర మగుచున్. |
271 |
| సీ. |
అలఘుతేజోమయంబైన రూపంబిది క్షితినాథ! నాచేతఁ జెప్పఁబడియె; మానిత స్థూలసూక్ష్మ స్వరూపంబులవలన నొప్పెడు భగవత్స్వరూప మమ్మహాత్మకుని మాయాబలంబునఁ జేసి దివ్యమునీంద్రులు దెలియలేరు; వసుధేశ! వాచ్యమై వాచకంబై నామ రూపముల్ క్రియలును రూఢిఁదాల్చి |
|
| ఆ. |
యుండు నట్టి యీశ్వరుండు నారాయణుం, డఖిలధృతజగన్నియంతయైన చిన్మయాత్మకుండు సృజియించు నీ ప్రజా, పతుల ఋషులఁ బితృవితతుల నెలమి. |
272 |
| వ. | మఱియును. | 273 |
| సీ. |
సుర సిద్ధ సాధ్య కిన్నర నర చారణ గరుడ గంధర్వ రాక్షస పిశాచ భూత వేతాళ కింపురుష కూశ్మాండ గుహ్యక డాకినీ యక్ష యాతుధాన విద్యాధరాప్సరో విషధర గ్రహ మాతృ గణ వృక హరి ఘృష్టి ఖగ మృగాళి భల్లూక రోహిత పశు వృక్షయోనుల వివిధకర్మంబులు వెలయఁ బుట్టి |
|
| తే. |
జల నభో భూతలంబుల సంచరించు, జంతుచయముల సత్త్వరజస్తమోగు ణములఁ దిర్యక్సురాసురనరధరాది, భావముల భిన్ను లగుదురు పౌరవేంద్ర! |
274 |
| మ. |
ఇరవొందన్ ద్రుహిణాత్మకుండయి రమాధీశుండు విశ్వంబు సు స్థిరతంజేసి, హరిస్వరూపుఁడయి రక్షించున్ సమస్తప్రజో త్కరసంహారము సేయునప్పుడు హరాంతర్యామియై యింతయున్ హరియించుం బవనుండు మేఘముల మాయంజేయు చందంబునన్. |
275 |
| క. |
ఈ పగిదిని విశ్వము సం, స్థాపించును మనుచు నడఁచు ధర్మాత్మకుఁడై దీపిత తిర్యఙ్నర సుర, రూపంబులు దాన తాల్చి రూఢి దలిర్పన్. |
276 |
| సీ. |
హరియందు నాకాశ, మాకాశమున వాయు, వనిలంబువలన హుతాశనుండు, హవ్యవాహనునందు నంబువు, లుదకంబువలన వసుంధర గలిగె; ధాత్రి వలన బహుప్రజావళి యుద్భవంబయ్యె; నింతకు మూలమై యెసఁగునట్టి నారాయణుఁడు, చిదానంద స్వరూపకుం, డవ్యయుం, డజుఁడు, ననంతుఁ, డాఢ్యుఁ |
|
| తే. |
డాదిమధ్యాంతశూన్యుం, డనాదినిధనుఁ; డతనివలనను సంభూతమైన యట్టి సృష్టి హేతుప్రకార మీక్షించి తెలియఁ, జాల రెంతటి మునులైన జనవరేణ్య! |
277 |
| వ. | అదియునుంగాక, | 278 |
| మ. |
ధరణీశోత్తమ! భూతసృష్టి నిటు సంస్థాపించి రక్షించు నా హరికర్తృత్వము నొల్ల కాత్మగత మాయారోపితంజేసి, తా నిరవద్యుండు నిరంజనుండుఁ బరుఁడున్ నిష్కించనుం డాఢ్యుఁడున్ నిరపేక్షుండును నిష్కళంకుఁ డగుచున్ నిత్యత్వముం బొందెడిన్. |
279 |
| వ. | బ్రహ్మసంబంధియగు నీ కల్పప్రకారం బవాంతరకల్పంబుతోడ సంకుచిత ప్రకారంబున నెఱింగించితి; నిట్టి బ్రహ్మకల్పంబున నొప్పు ప్రాకృతవైకృత కల్ప ప్రకారంబులును, దత్పరిమాణంబులును, కాలకల్ప లక్షణంబులును, నవాంతర కల్ప మన్వంతరాది భేద విభాగ స్వరూపంబును నతివిస్తారంబుగ నెఱింగింతు విను; మదియునుం బద్మకల్పం బనం దగునని భగవంతుండైన శుకుండు పరీక్షిత్తునకుం జెప్పెనని సూతుండు మహర్షులకు నెఱింగించిన. | 280 |
| క. |
విని శౌనకుండు సూతుం, గనుఁగొని యిట్లనియె సూత! కరుణోపేతా! జననుతగుణసంఘాతా!, ఘనపుణ్యసమేత! విగతకలుషవ్రాతా! |
281 |
| వ. | పరమ భాగవతోత్తముండైన విదురుండు బంధుమిత్ర జాతంబుల విడిచి సకల భువన పావనంబులును, గీర్తనీయంబులును నైన తీర్థంబులను, నగణ్యంబులైన పుణ్యక్షేత్రంబులను దర్శించి, క్రమ్మఱ వచ్చి కౌషారవియగు మైత్రేయుం గని యతనివలన నధ్యాత్మ బోధంబు వడసె నని వినంబడు; నదియంతయు నెఱింగింపు మనిన నతం డిట్లనియె. | 282 |
| క. |
వినుఁ డిపుడు మీరు నన్నడి, గిన తెఱఁగున శుకు మునీంద్రగేయుఁ బరీక్షి జ్జనపతి యడిగిన నతఁ డా, తని కెఱిఁగించిన విధంబుఁ దగ నెఱిఁగింతున్. |
283 |
| వ. | సావధానులరై వినుండని, | 284 |
| ఉ. |
రామ! గుణాభిరామ! దినరాజకులాంబుధిసోమ! తోయద శ్యామ! దశాననప్రబలసైన్యవిరామ! సురారిగోత్ర సు త్రామ! సుబాహుబాహుబలదర్ప తమఃపటుతీవ్రధామ! ని ష్కామ! కుభృల్లలామ! గరకంఠసతీనుతనామ! రాఘవా! |
285 |
| క. |
అమరేంద్రసుత విదారణ!, కమలాప్తతనూజ రాజ్యకారణ! భవ సం తమస దినేశ్వర! రాజో, త్తమ! దైవత సార్వభౌమ! దశరథరామా! |
286 |
| మా. |
నిరుపమగుణజాలా! నిర్మలానందలోలా!, దురితఘనసమీరా! దుష్టదైత్యప్రహారా! శరధిమదవిశోషా! చారుసద్భక్తపోషా!, సరసిజదళనేత్రా! సజ్జనస్తోత్రపాత్రా! |
287 |
| గద్య. | ఇది శ్రీపరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర, కేసన మంత్రిపుత్ర, సహజపాండిత్య, పోతనామాత్య ప్రణీతం బైన శ్రీమహాభాగవత పురాణంబునందు పరీక్షిత్తుతోడ శుకయోగి భాషించుటయు, భాగవతపురాణ వైభవంబును, “ఖట్వాంగు” మోక్షప్రకారంబును, ధారణాయోగవిషయం బయిన మహావిష్ణుని శ్రీపాదాద్య వయవంబుల సర్వలోకంబులు నున్న తెఱంగును, సత్పురుషవృత్తియు, మోక్షవ్యతిరిక్త సర్వకర్మఫల ప్రదదేవతా భజన ప్రకారంబును, మోక్షప్రదుండు శ్రీహరి యనుటయు, హరి భజనవిరహితులైన జనులకు హేయతాపాదనంబును, రాజప్రశ్నంబును, శుకయోగి శ్రీహరి స్తోత్రంబు సేయుటయు, వాసుదేవ ప్రసాదంబునం జతుర్ముఖుండు బ్రహ్మాధిపత్యంబు వడయుటయు, శ్రీహరివలన బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచంబు పుట్టుటయు, శ్రీమన్నారాయణ దివ్య లీలావతార పరంపరావైభవ వృత్తాంతసూచనంబును, భాగవతవైభవంబును, బరీక్షిత్తు శుకయోగి నడిగిన ప్రపంచాది ప్రశ్నంబులును, నందు శ్రీహరి ప్రధానకర్త యని తద్వృత్తాంతంబు సెప్పుటయు, భగవద్భక్తి వైభవంబును, బ్రహ్మతపశ్చరణంబునకుం బ్రసన్నుండై హరి వైకుంఠ నగరంబుతోడ బ్రసన్నుండయిన స్తోత్రంబు సేసి తత్ప్రసాదంబునం దన్మహిమంబు వినుటయు, వాసుదేవుం డానతిచ్చిన ప్రకారంబున బ్రహ్మ నారదునికి భాగవతపురాణ ప్రధాన దశ లక్షణంబు లుపన్యసించుటయు, నారాయణవైభవంబును, జీవాది తత్త్వ సృష్టియు, శ్రీహరి నిత్యవిభూత్యాది వర్ణనంబును, గల్ప ప్రకారాది సూచనంబును, శౌనకుండు విదురమైత్రేయ సంవాదంబు సెప్పుమని సూతు నడుగుటయు నను కథలు గల ద్వితీయ స్కంధము. | 288 |