పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము ద్వితీయస్కంధము
పరీక్షితుఁడు శుకునిఁ బ్రపంచోద్భవాదికంబు నడుగుట
సీ. విను శుకయోగికి మనుజేశుఁ డిట్లను మునినాథ! దేవదర్శనము గలుగ
నారదమునికిఁ బంకేరుహభవుఁ డెఱింగించిన తెఱఁగు సత్కృప దలిర్ప
గణుతింప సత్త్వాదిగుణశూన్యుఁడగు హరి కమలాక్షు లోకమంగళములైన
కథలు నా కెఱిఁగింపు కైకొని నిస్సంగ మైన నా హృదయాబ్జమందుఁ గృష్ణు
 
తే. భవ్యచరితుని నాద్యంతభావశూన్యుఁ, జిన్మయాకారు ననఘు లక్ష్మీసమేతు
నిలిపి, యస్థిరవిభవంబు నిఖిల హేయ, భాజనంబైన యీ కళేబరము విడుతు.
217
వ. అదియునుంగాక యెవ్వండేని శ్రద్ధా భక్తి యుక్తుండై కృష్ణగుణకీర్తనంబులు వినుచుం బలుకుచు నుండు నట్టివాని హృదయపద్మంబునందుఁ గర్ణ రంధ్రమార్గంబులం బ్రవేశించి కృష్ణుండు విశ్రమించి సలిలగతంబైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున నాత్మగతంబైన మాలిన్యంబు నపకర్షించుఁ గావున. 218
మ. భరితోదగ్రనిదాఘతప్తుఁడగు నప్పాంథుం డరణ్యాది సం
చరణక్లేశసముద్భవం బగు పిపాసంజెంది యాత్మీయ మం
దిరముంజేరి గతశ్రముం డగుచు నెందేనిం జనంబోని భం
గి రమాధీశుపదారవిందయుగసంగీభూతుఁడై మానునే?
219
వ. అదియునుంగాక సకలభూత సంసర్గశూన్యంబైన యాత్మకు భూతసంసర్గం బేప్రకారంబునం గలిగె? నది నిర్నిమిత్తత్వంబునం జేసియో కర్మంబునం జేసియో యా క్రమంబు నా కెఱింగింపుము. 220
సీ. ఎవ్వని నాభియం దెల్ల లోకాంగ సంస్థానకారణపంకజంబు వొడమె,
నందుదయించి సర్వావయవస్ఫూర్తిఁ దనరారునట్టి పితామహుండు
గడఁగి యెవ్వని యనుగ్రహమున నిఖిల భూతముల సృజించె నుత్కంఠతోడ
నట్టి విధాత యే యనువున సర్వేశు రూపంబు గనుఁగొనె రుచిరభంగి?
 
తే. నా పరంజ్యోతియైన పద్మాక్షునకును, నలినజునకుఁబ్రతీకవిన్యాసభావ
గతులవలనను భేదంబు గలదె? చెపుమ, యతిదయాసాంద్ర! యోగికులాబ్ధిచంద్ర!
221
వ. మఱియును భూతేశ్వరుం డయిన సర్వేశ్వరుం డుత్పత్తి స్థితిలయకారణంబైన తన మాయను విడిచి మాయానియామకుండై యేయే ప్రదేశంబుల శయనంబు సేసె? నదియునుంగాక పురుషావయవంబులచేఁ బూర్వకాలంబున లోకపాలసమేతంబులైన లోకంబు లెత్తెఱంగునం గల్పితంబు లయ్యె? నదియునుంగాక మహాకల్పంబులును, నవాంతర కల్పంబులును, భూతభవిష్యద్వర్తమాన కాలంబులును, దేహాభిమానులై జనియించిన దేవపితృమనుష్యాదులకుం గలుగు నాయుఃప్రమాణంబులును, బృహత్సూక్ష్మకాలాను వర్తనంబులును, ఏ యే కర్మంబులం జేసి జీవు లే యే లోకంబుల నొందుదురు? మఱియు నేయే కర్మంబులం జేసి దేవాది శరీరంబులం బ్రాపింతు? రట్టి కర్మమార్గప్రకారంబును, సత్త్వాది గుణంబుల పరిణామంబులగు దేవాదిరూపంబులం గోరు జీవులకు నే యే కర్మసముదాయం బెట్టు సేయందగు? నెవ్వనికి నర్పింపందగు? నవి యెవ్వనిచేత గ్రహింపంబడు? భూ పాతాళ కకుబ్‌వ్యోమ గ్రహ నక్షత్ర పర్వతంబులును, సరిత్సముద్రంబులును, ద్వీపంబులును నే ప్రకారంబున సంభవించె? నా యా స్థానంబుల గలవారి సంభవంబు లేలాటివి? బాహ్యాభ్యంతరంబులం గలుగు బ్రహ్మాండ ప్రమాణం బెంత? మహాత్ముల చరిత్రంబు లెట్టివి? వర్ణాశ్రమ వినిశ్చయంబులును, ననుగతంబులై యాశ్చర్యావహంబులగు హరియవతార చరిత్రంబులును, యుగంబులును, యుగప్రమాణంబులును, యుగధర్మంబులును, బ్రతియుగంబునందును మనుష్యుల కేయే ధర్మంబు లాచరణీయంబు లట్టి సాధారణ ధర్మంబులును, విశేషధర్మంబులును, జాతి విశేష ధర్మంబులును, రాజర్షి ధర్మంబులును, నాపత్కాల జీవన సాధన భూతంబులగు ధర్మంబులును, మహదాదితత్త్వంబుల సంఖ్యయును, సంఖ్యాలక్షణంబును, నా తత్త్వంబులకు హేతుభూత లక్షణంబులును, భగవత్సమారాధన విధంబును, అష్టాంగయోగ క్రమంబును, యోగీశ్వరుల యణిమాద్యైశ్వర్య ప్రకారంబును, వారల యర్చిరాదిగతులును, లింగశరీర భంగంబులును, ఋగ్యజుస్సామాథర్వవేదంబులును, నుపవేదంబులైన యాయుర్వేదాదులును, ధర్మశాస్త్రంబులును, నితిహాస పురాణంబుల సంభవంబును, సర్వభూతంబుల యవాంతర ప్రళయంబును, మహాప్రళయంబును, నిష్టాపూర్తంబులును, యాగాది వైదిక కర్మజాలంబును, వాపీకూపతటాక దేవాలయాది నిర్మాణంబులును, నన్నదానం బారామప్రతిష్ఠ మొదలగు స్మార్తకర్మంబులును, కామ్యంబులైన యగ్నిహోత్రంబుల యనుష్ఠాన ప్రకారంబును, జీవసృష్టియు, ధర్మార్థకామంబు లనియెడు త్రివర్గంబుల యాచరణప్రకారంబును, మలినోపాధిక పాషండ సంభవంబును, జీవాత్మబంధ మోక్ష ప్రకారంబును, స్వరూపావస్థాన విధంబును, సర్వస్వతంత్రుండైన యీశ్వరుం డాత్మమాయం జేసి సర్వ కర్మసాక్షి యయ్యు న మ్మాయ నెడఁబాసి యుదాసీనగతిని విభుండై క్రీడించు తెఱంగును గ్రమంబునఁ బ్రపన్నుండనైన నాకు నెఱింగింపుము. బ్రాహ్మణ శాపంబునంజేసి శోకవ్యాకుల చిత్తుండవై యనశన వ్రతుండవైన నీవు వినుట యెట్లని సందేహింపవలవదు. త్వదీయ ముఖారవింద వినిఃసృత నారాయణ కథామృత పానకుతూహలి నైన నాకు నింద్రియంబులు వశంబులై యుండు; నది గావున నేనడిగిన ప్రశ్నంబులకు నుత్తరంబులు సవిస్తరంబులుగా నానతిచ్చి కృతార్థునిం జేయఁ బరమేష్ఠితుల్యుండవగు నీ వపూర్వసంప్రదాయానురోధంబున నర్హుండ వగుదు వని విష్ణురాతుం డయిన పరీక్షిన్నరేంద్రుండు బ్రహ్మరాతుండైన శుకయోగి నడిగిన నతండు బ్రహ్మ నారదసంవాదంబును, నేక సంప్రదాయాను గతంబును, గతానుగతిక ప్రకారంబునునై తొల్లి సర్వేశ్వరుండు బ్రహ్మకల్పంబున బ్రహ్మకుపదేశించిన భాగవతపురాణంబు వేదతుల్యంబు నీ కెఱింగింతు విను మని చెప్పెనని సూతుండు శౌనకాది మహామునులకుం జెప్పి నట్లు శుకయోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రున కిట్లనియె. 222
సీ. భూపాలకోత్తమ! భూతహితుండు సుజ్ఞానస్వరూపకుఁడైనయట్టి
ప్రాణికి దేహసంబంధ మెట్లగు నన్న మహి నొప్పు నీశ్వరమాయ లేక
కలుగదు, నిద్రలోఁ గలలోనఁ దోఁచిన దేహబంధంబుల తెఱఁగువలెను
హరియోగ మాయామహత్త్వంబునం బాంచభౌతికదేహసంబంధుఁడగుచు
 
తే. నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి, బాల్య కౌమార యౌవనభావములను
నర సుపర్వాది మూర్తులఁ బొరసి “యేను”, “నాయ దిది” యను సంసారమాయఁదగిలి.
223
వ. వర్తించుచు నిట్లున్న జీవునికి భగవద్భక్తి యోగంబున ముక్తి సంభవించుట యెట్లన్న - నెప్పుడేని జీవుండు ప్రకృతి పురుషాతీతంబయిన బ్రహ్మస్వరూపంబునందు మహితధ్యాన నిష్ఠుండగు నప్పుడు విగతమోహుండై యహంకార మమకారాత్మకంబయిన సంస్కరణంబు దొఱంగి ముక్తుండయి యుండు; మఱియు జీవేశ్వరులకు దేహసంబంధంబులు గానంబడుచుండు; నట్టి దేహధారియైన భగవంతునందలి భక్తిం జేసి జీవునకు ముక్తి యెత్తెఱంగునం గలుగునని యడిగితివి, జీవుం డవిద్యామహిమం జేసి కర్మానుగతంబయిన మిథ్యా రూపదేహసంబంధుండు; భగవంతుండు నిజయోగమాయా మహిమంబునం జేసి స్వేచ్ఛా పరికల్పిత చిద్ఘన లీలావిగ్రహుండు కావున భగవంతుండైన యీశ్వరుండు స్వభజనంబు ముక్తి సాధనజ్ఞానార్థంబు కల్పితంబని చతుర్ముఖునకుఁ దదీయనిష్కపటతపశ్చర్యాది సేవితుండయి నిజజ్ఞానానందఘనంబయిన స్వరూపంబు సూపుచు నానతిచ్చె; నది గావున జీవునికి భగవద్భక్తి మోక్షప్రదాయకంబగు; నిందులకు నొక్క యితిహాసంబు గల దెఱింగింతు నాకర్ణింపుము; దాన భవదీయ సంశయనివృత్తి యయ్యెడు నని శుకయోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె. 224
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - dvitIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )