| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ద్వితీయస్కంధము |
| ఉ. |
అన్యకథానులాపము లహర్నిశమున్ వినునట్టి సత్క్రియా శూన్యములైన కర్ణముల సూరిజనస్తుత! సర్వలోక స మ్మాన్యమునై తనర్చు హరిమంగళ దివ్యకథామృతంబు సౌ జన్యతఁ గ్రోలవయ్య బుధసత్తమ! యే వివరించి చెప్పెదన్. |
113 |
| వ. | అని పలికి నారదుంజూచి మఱియు నిట్లనియె. | 114 |
| మ. |
కనకాక్షుండు భుజావిజృంభణమునన్ క్ష్మాచక్రముం జాపఁ జు ట్టినమాడ్కిం గొనిపోవ, యజ్ఞమయదంష్ట్రి స్వాకృతిందాల్చి య ద్దనుజాధీశ్వరుఁ దాఁకి యబ్ధినడుమన్ దంష్ట్రాహతిం ద్రుంప ధా త్రిని గూలెం గులిశాహతింబడు మహాద్రింబోలి యత్యుగ్రతన్. |
115 |
| వ. | మఱియు సుయజ్ఞావతారంబు విను మని యిట్లనియె. | 116 |
| సీ. |
ప్రకటరుచిప్రజాపతికిని స్వాయంభువుని కూఁతు రాకూతి యను లతాంగి కర్థి జన్మించి సుయజ్ఞుండు నా నొప్పు నతఁడు దక్షిణ యను నతివయందు సుయమనామామరస్తోమంబుఁ బుట్టించి యింద్రుఁడై వెలసి యుపేంద్రలీల నఖిలలోకంబుల యార్తి హరించిన నతని మాతామహుండైన మనువు |
|
| తే. |
తనమనంబునఁ దచ్చరిత్రమున కలరి, పరమ పుణ్యుండు హరి యని పలికెఁ గాన నంచిత జ్ఞాననిధియై సుయజ్ఞుఁ డెలమిఁ, దాపసోత్తమ! హరి యవతారమయ్యె. |
117 |
| వ. | అని చెప్పి సాంఖ్యయోగ ప్రవర్తకాచార్యవర్యుం డగు కపిలుని యవతారంబు విను మని యిట్లనియె. | 118 |
| చ. |
ధృతమతి దేవహూతికిని దివ్యవిభుండగు కర్దమప్రజా పతికిఁ బ్రమోద మొప్ప నవభామలతోఁ గపిలాఖ్యఁ బుట్టి యే గతి హరిఁబొందు నట్టి సుభగంబగు సాంఖ్యము దల్లి కిచ్చి దు ష్కృతములు వాపి చూపె మునిసేవితమై తనరారు మోక్షమున్. |
119 |
| వ. | మఱియు దత్తాత్రేయావతారంబు వినుము. | 120 |
| సీ. |
తాపసోత్తముఁ డత్రి తనయునిఁ గోరి రమేశు వేఁడిన హరి యేను నీకు ననఘ! “దత్తుఁడ నైతి” నని పల్కుకతమున నతఁడు దత్తాత్రేయుఁడై జనించె న మ్మహాత్ముని చరణాబ్జపరాగసందోహంబుచేఁ బూతదేహు లగుచు హైహయయదువంశ్యు లైహికాముష్మిక ఫలరూపమగు యోగబలము వడసి |
|
| తే. |
సంచితజ్ఞానఫల సుఖైశ్వర్య శక్తి, శౌర్యములఁ బొంది తమ కీర్తి చదల వెలుఁగ నిందు నందును వాసికి నెక్కి రట్టి, దివ్యతరమూర్తి విష్ణు నుతింపఁదరమె? |
121 |
| వ. | వెండియు సనకాద్యవతారంబు వినుము. | 122 |
| సీ. |
అనఘాత్మ! యేను గల్పాదిని విశ్వంబు సృజియింపఁ దలఁచి యంచితతపంబు నర్థిఁ జేయుచు “సన” యని పల్కుటయు నది కారణంబుగ సనాఖ్యలను గల “స నందన“, “సనక”, “సనత్కుమార”, “సనత్సుజాతులు” నల్వురు సంభవించి మానసపుత్రులై మహి నుతికెక్కిరి పోయిన కల్పాంతమున నశించి |
|
| తే. |
నట్టి యాత్మీయతత్త్వంబు వుట్టఁ జేసి, సంప్రదాయకభంగిని జగతి నెల్లఁ గలుగఁ జేసిరి య వ్విష్ణుకళలఁ దనరి, నలువు రయ్యును నొక్కఁడ నయచరిత్ర! |
123 |
| వ. | మఱియు నరనారాయణావతారంబు వినుము. | 124 |
| క. |
గణుతింపఁగ నరనారా, యణు లన ధర్మునకు నుదయ మందిరి దాక్షా యణి యైన “మూర్తి”వలనం, బ్రణుతగుణోత్తరులు పరమపావనమూర్తుల్. |
125 |
| క. |
అనఘులు బదరీవనమున, వినుతతపోవృత్తి నుండ, విబుధాధిపుఁడున్ మనమున నిజపదహానికి, ఘనముగఁ జింతించి దివిజకాంతామణులన్. |
126 |
| క. |
రావించి “తపోవిఘ్నముఁ, గావింపుం”డనుచు బనుపఁ గడు వేడుకతో భావభవానీకిను లనఁ, గా వనితలు సనిరి బదరికా వనమునకున్. |
127 |
| వ. | అందు. | 128 |
| మ. |
నరనారాయణు లున్న చోటికి మరున్నారీసమూహంబు భా స్వరలీలం జని రూపవిభ్రమ కళాచాతుర్య మేపారఁగాఁ బరిహాసోక్తుల నాటపాటలఁ జరింపం జూచి నిశ్చింతతన్ భరితధ్యానతపఃప్రభావనిరతిం బాటించి నిష్కాములై. |
129 |
| క. |
క్రోధము దమ తపములకును, బాధక మగు టెఱిఁగి దివిజభామలపై న మ్మేధాత్మకు లొక యింతయుఁ, గ్రోధముఁ దేరైరి సత్త్వగుణయుతు లగుటన్. |
130 |
| క. |
నారాయణుఁ డప్పుడు దన, యూరువు వెసఁ జీర, నందు నుదయించెను బెం పారంగ నూర్వశీ ముఖ, నారీజనకోటి దివిజనారులు మెచ్చన్. |
131 |
| క. |
ఊరువులందు జనించిన, కారణమున “నూర్వశి”యన ఘనతకు నెక్కెన్ వారల రూపవిలాస వి, హారములకు నోడి రంత నమరీజనముల్. |
132 |
| వ. | అంతం దాము నరనారాయణుల తపోవిఘ్నంబు గావింపంబూని చేయు విలాసంబులు, మానసిక సంకల్పమాత్రంబున సృష్టిస్థితి సంహారంబు లొనర్పంజాలు న మ్మహాత్ముల దెసం బనికిరాక కృతఘ్నునకుం జేయు నుపకృతులుంబోలె నిష్ఫలంబులైన సిగ్గునం గుందుచు, నూర్వశిం దమకు ముఖ్యురాలిగాఁ గైకొని తమ వచ్చిన జాడన మరలి చని రంత. | 133 |
| క. |
కాముని దహించెఁ గ్రోధ మ, హామహిమను రుద్రుఁ, డట్టి యతికోపము నా ధీమంతులు గెలిచి రనం, గామము గెలుచుటలు సెప్పఁగా నేమిటికిన్? |
134 |
| వ. | అట్టి నరనారాయణావతారంబు జగత్పావనంబై విలసిల్లె, వెండియు ధ్రువావతారంబు వివరించెద వినుము. | 135 |
| సీ. |
మానితచరితుఁ “డుత్తానపాదుం”డను భూవరేణ్యునకు సత్పుత్రుఁడనఁగ నుదయించి మహిమఁ బెంపొంది బాల్యంబున జనకునికడ నుండి సవతితల్లి దను నాడు వాక్యాస్త్రతతిఁ గుంది మహిత తపంబు గావించి కాయంబుతోడఁ జని మింట ధ్రువపదస్థాయి యై యటమీఁద నర్థి వర్తించు భృగ్వాదిమునులుఁ |
|
| తే. |
జతురగతి గ్రింద వర్తించు సప్తఋషులఁ, బెంపు దీపింపఁ దన్ను నుతింప వెలసి “ధ్రువుఁడు” నా నొప్పి య వ్విష్ణుతుల్యుఁ డగుచు, నున్న పుణ్యాత్ముఁ డిప్పుడు నున్నవాఁడు. |
136 |
| వ. | మఱియుఁ బృథుని యవతారంబు వినుము. | 137 |
| ఉ. |
వేనుఁడు విప్రభాషణ పవిప్రహతిచ్యుతభాగ్యపౌరుషుం డై నిరయంబునం బడిన నాత్మతనూభవుఁడై పృథుండు నాఁ బూని జనించి తజ్జనకుఁ బున్నరకంబును బాపె, మేదినిన్ ధేనువుఁజేసి వస్తువితతిం బిదికెన్ హరిసత్కళాంశుఁడై. |
138 |
| వ. | అని మఱియు వృషభావతారంబు నెఱింగింతు, వినుము, అగ్నీధ్రుం డనువానికి “నాభి” యనువాఁడుదయించె, నతనికి మేరుదేవి యను నామాంతరంబు గల “సుదేవి”యందు హరి వృషభావతారంబు నొంది జడస్వభావంబైన యోగంబు దాల్చి ప్రశాంతాంతః కరణుండును, బరిముక్తసంగుండునునై పరమ హంసాభిగమ్యం బయిన పదం బిది యని మహర్షులు వలుకుచుండం జరించె, మఱియు హయగ్రీవావతారంబు సెప్పెద వినుము. | 139 |
| చ. |
అనఘచరిత్ర! మన్మఖమునందు జనించె హయాననాఖ్యతన్ వినుతసువర్ణవర్ణుఁడును వేదమయుం డఖిలాంతరాత్మకుం డనుపమయజ్ఞపూరుషుఁడు నై భగవంతుఁడు; దత్సమస్త పా వనమగు నాసికాశ్వసనవర్గములందుదయించె వేదముల్. |
140 |
| వ. | మఱియు మత్స్యావతారంబు వినుము. | 141 |
| సీ. |
ఘనుఁడు వైవస్వతమనువుకు దృష్టమై యరుదెంచునట్టి యుగాంతసమయ మందు విచిత్రమత్స్యావతారము దాల్చి యఖిలావనీమయం బగుచుఁ జాల సర్వజీవులకు నాశ్రయభూతుఁ డగుచు నే కార్ణవంబైన తోయముల నడుమ మన్ముఖశ్లథవేదమార్గంబులను జిక్కు వడకుండ శాఖ లేర్పడఁగఁ జేసి |
|
| తే. |
దివ్యు లర్థింప నా కర్థిఁ దెచ్చి యిచ్చి, మనువు నెక్కించి పెన్నావ వనధినడుమ మునుఁగకుండంగ నరసిన యనిమిషావ, తార మేరికి నుతియింపఁ దరమె వత్స! |
142 |
| వ. | మఱియుఁ గూర్మావతారంబు వినుము. | 143 |
| మ. |
అమృతోత్పాదనయత్నులై విబుధదైత్యానీకముల్, మందరా గముఁ గవ్వంబుగఁజేసి యబ్ధి దరువంగాఁ, గవ్వపుంగొండ వా ర్ధి మునుంగన్ హరి కూర్మరూపమున నద్రిందాల్చెఁ దత్పర్వత భ్రమణవ్యాజత వీఁపుఁదీట శమియింపంజేయఁగా నారదా! |
144 |
| వ. | వెండియు నృసింహావతారంబు వినుము. | 145 |
| మ. |
సురలోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్యద్గదా ధరుఁడై వచ్చు నిశాచరుం గని, కనద్దంష్ట్రాకరాళాస్య వి స్ఫురితభ్రూకుటితో నృసింహగతి రక్షోరాజవక్షంబు భీ కరభాస్వన్నఖరాజిఁ ద్రుంచెఁ ద్రిజగత్కల్యాణసంధాయియై. |
146 |
| వ. | ఇంక నాదిమూలావతారంబు సెప్పెద వినుము. | 147 |
| మ. |
కరినాథుండు జలగ్రహ గ్రహణదుఃఖాక్రాంతుఁడై వేయి వ త్సరముల్ గుయ్యిడుచుండ వేల్పులకు విశ్వవ్యాప్తి లేకుండుటన్ “హరి నీవే శరణంబు నా” క నినఁ గుయ్యాలించి వేవేగ వా శ్చరముంద్రుంచి కరీంద్రుఁ గాచె మహితోత్సాహంబునం దాపసా! |
148 |
| వ. | మఱియును వామనావతారంబు వినుము. | 149 |
| సీ. |
యజ్ఞేశ్వరుండగు హరి విష్ణుఁ డదితిసంతానంబునకు నెల్లఁ దమ్ముఁడయ్యుఁ బెంపారు గుణములఁ బెద్ద యై, వామన మూర్తితో బలిచక్రవర్తిఁ జేరి తద్భూమి మూఁడుపాదమ్ముల నడిగి పదత్రయంబునను జగత్త్రయంబు వంచించి కొనియెను వాసవునకు రాజ్య మందింప నీశ్వరుం డయ్యు మొఱఁగి |
|
| తే. |
యర్థిరూపంబు గైకొని యడుగ వలసె, ధార్మికుల సొమ్ము వినయోచితముగఁ గాని వెడఁగుఁదనమున నూరక విగ్రహించి, చలన మందింపరాదు నిశ్చయము పుత్ర! |
150 |
| చ. |
బలి నిజమౌళి న వ్వటుని పాదసరోరుహభవ్యతీర్థ ము త్కలిక ధరించి, తన్నును జగత్త్రయమున్ హరికిచ్చి, కీర్తులన్ నిలిపె వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వ హానికిం దలఁకక శుక్రు మాటలకుఁ దారక భూరివదాన్యశీలుఁడై. |
151 |
| వ. | మఱియు న ప్పరమేశ్వరుండు నారదా! హంసావతారంబు నొంది యతిశయ భక్తియోగంబున సంతుష్టాంతరంగుం డగుచు నీకు నాత్మతత్త్వ ప్రదీపకంబగు భాగవత మహాపురాణం బుపదేశించె, మన్వవతారంబు నొంది స్వకీయ తేజఃప్రభావంబున నప్రతిహతంబైన చక్రంబు ధరియించి దుష్టవర్తనులైన రాజుల దండించుచు శిష్టపరిపాలనంబు సేయుచు నాత్మీయ కీర్తిచంద్రికలు సత్యలోకంబున వెలింగించె, మఱియు ధన్వంతరి యన నవతరించి తన నామస్మరణంబున భూజనంబునకు సకలరోగనివారణంబు సేయుచు నాయుర్వేదంబుఁ గల్పించె, నింకం బరశురామావతారంబు వినుము. | 152 |
| మ. |
ధరణీ కంటకులైన హైహయ నరేంద్ర వ్రాతమున్ భూరి వి స్ఫురితోదార కుఠారధారఁ గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ జిరకీర్తిన్ జమదగ్ని రాముఁడన మించెం దాపసేంద్రోత్తమా! |
153 |
| వ. | మఱియు శ్రీ రామావతారంబు సెప్పెద వినుము. | 154 |
| సీ. |
తోయజ హిత వంశ దుగ్ధ పారావార రాకా విహార కైరవహితుండు కమనీయ కోసలక్ష్మాభృత్సుతా గర్భ శుక్తి సంపుట లసన్మౌ క్తికంబు నిజపాదసేవక వ్రజ దుఃఖ నిబిడాంధకార విస్ఫురిత పంకరుహసఖుఁడు దశరథేశ్వర కృతాధ్వర వాటికా ప్రాంగణాకర దేవతానోకహంబు |
|
| తే. |
చటులదానవగహనవైశ్వానరుండు, రావణాటోపశైల పురందరుండు నగుచు లోకోపకారార్థ మవతరించె, రాముఁడై చక్రి లోకాభిరాముఁడగుచు. |
155 |
| క. |
చిత్రముగ భరత లక్ష్మణ, శత్రుఘ్నుల కర్థి నగ్రజన్ముం డగుచున్ ధాత్రిన్ రాముఁడు వెలసెఁ బ, విత్రుఁడు దుష్కృతలతాలవిత్రుం డగుచున్. |
156 |
| వ. | అంత. | 157 |
| సీ. |
కిసలయఖండేందు బిసకుందపద్మాబ్జ పద ఫాల భుజ రద పాణి నేత్రఁ గాహళ కరభ చక్ర వియత్పులిన శంఖ జంఘోరు కుచ మధ్య జఘన కంఠ ముకుర చందన బింబ శుక గజ శ్రీకార గండ గంధోష్ఠవాగ్గమన కర్ణఁ జంప కేందు స్వర్ణ శఫర ధను ర్నీల నాసికాస్యాంగదృగ్భ్రూశిరోజ |
|
| తే. |
నళి సుధావర్త కుంతల హాస నాభి, కలిత జనకావనీపాలకన్యకా ల లామఁ బరిణయమయ్యె లలాటనేత్ర, కార్ముక ధ్వంస ముంకువ గాఁగ నతఁడు. |
158 |
| వ. | అంత. | 159 |
| క. |
రామున్ మేచకజలద, శ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సు త్రామున్ దుష్టనిశాట వి, రాముం బొమ్మనియెఁ బంక్తిరథుఁ డడవులకున్. |
160 |
| వ. | ఇట్లు పంచిన. | 161 |
| చ. |
అరుదుగ లక్ష్మణుండు జనకాత్మజయుం దనతోడ నేఁగుదే నరిగి రఘూత్తముండు ముదమారఁగఁ జొచ్చెఁ దరక్షు సింహ సూ కర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి భల్ల కా సర ముఖ వన్య సత్త్వ చయ చండతరాటవి దండకాటవిన్. |
162 |
| క. |
ఆ వనమున వసియించి నృ, పావననయశాలి యిచ్చె నభయములు జగ త్పావన మునిసంతతికిఁ గృ, పావననిధియైన రామభద్రుం డెలమిన్, |
163 |
| క. |
ఖరకరకుల జలనిధి హిమ, కరుఁడగు రఘురామవిభుఁడు గఱకఱితోడన్ ఖరుని వధించెను ఘనభీ, కర శరముల నఖిలజనులుఁ గర మరుదందన్. |
164 |
| క. |
హరిసుతుఁ బరిచరుఁగాఁ గొని, హరిసుతుఁ దునుమాడి పనిచె హరిపురమునకున్, హరివిభునకు హరిమధ్యను, హరిరాజ్యపదంబు నిచ్చె హరివిక్రముఁడై. |
165 |
| వ. | అంత సీతానిమిత్తంబునం ద్రిలోకకంటకుండగు దశకంఠుం దునుమాడుటకునై కపిసేనా సమే తుండయి చనిచని ముందట నతిదుర్గమం బయిన సముద్రంబు పేర్చి తెరువు సూపకున్న నలిగి. | 166 |
| మ. |
వికటభ్రూకుటి ఫాలభాగుఁ డగుచున్ వీరుండు క్రోధారుణాం బకుఁడై చూచినయంతమాత్రమున న ప్పాథోధి సంతప్త తో య కణ గ్రాహ తిమింగిల ప్లవ ఢులీ వ్యాళ ప్రవాళోర్మికా బక కారండవ చక్ర ముఖ్య జలసత్త్వశ్రేణితో నింకినన్. |
167 |
| వ. | అయ్యవసరంబున సముద్రుండు కరుణాసముద్రుం డగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినం గరుణించి యెప్పటి యట్ల నిలిపి నలునిచే సేతువు బంధింపించి తన్మార్గంబునం జని. | 168 |
| మ. |
పురముల్ మూఁడును నొక్క బాణమున నిర్మూలంబు గావించు శం కరు చందంబున నేర్చె రాఘవుఁడు లంకాపట్టణం బిద్ధ గో పుర శాలాంగణ హర్మ్య రాజభవన ప్రోద్యత్ప్రతోళీ కవా ట రథాశ్వ ద్విప శస్త్రమందిర నిశాట శ్రేణితో వ్రేల్మిడిన్. |
169 |
| క. |
రావణు నఖిలజగద్వి, ద్రావణుఁ బరిమార్చి నిలిపె రక్షోవిభుఁగా రావణుననుజన్ముని నై, రావణసితకీర్తి మెఱసి రాఘవుఁడెలమిన్. |
170 |
| సీ. |
ధర్మసంరక్షకత్వప్రభావుం డయ్యు ధర్మవిధ్వంసకత్వమునఁ బొదలి ఖరదండనాభిముఖ్యముఁ బొంద కుండియు ఖరదండనాభిముఖ్యమున మెఱసి పుణ్యజనావనస్ఫూర్తిఁ బెంపొందియుఁ బుణ్యజనాంతకస్ఫురణఁ దనరి సంతతాశ్రితవిభీషణుఁడు గాకుండియు సంతతాశ్రితవిభీషణత నొప్పి |
|
| తే. |
మించెఁ, దన కీర్తిచేత వాసించె దిశలు, దరమె నుతియింప జగతి నెవ్వరికినైనఁ జారుతరమూర్తి నవనీశ చక్రవర్తిఁ, బ్రకటగుణసాంద్రు దశరథరామచంద్రు. |
171 |
| వ. | అట్టి శ్రీరామావతారంబు జగత్పావనంబును నస్మత్ప్రసాద కారణంబునునై నుతికెక్కె, నింకఁ గృష్ణావతారంబు వివరించెద, వినుము. | 172 |
| సీ. |
తాపసోత్తమ! విను దైత్యాంశములఁ బుట్టి నరనాథు లతులసేనాసమేతు లగుచు ధర్మేతరులై ధాత్రిఁ బెక్కుబాధల నలంచుటఁజేసి ధరణి వగలఁ బొందుచు వాపోవ భూభార ముడుపుట కై హరి పరుఁడు నారాయణుండు చెచ్చెరఁ దన సితాసిత కేశయుగమున బలరామ కృష్ణ రూపములఁ దనరి |
|
| తే. |
యదుకులంబున లీలమై నుదయ మయ్యె, భవ్యయశుఁడగు వసుదేవు భార్యలైన రోహిణియు దేవకియు నను రూపవతుల, యందు నున్మత్తదైత్యసంహారి యగుచు. |
173 |
| వ. | ఇట్లు పుండరీకాక్షుండగు నారాయణుండు సమస్తభూభారనివారణంబు సేయం దన మేని కేశద్వయంబ చాలునని యాత్మ ప్రభావంబు దెలుపుకొఱకు నిజకళాసంభవులైన రామకృష్ణుల దేహవర్ణంబులు శ్వేతకృష్ణంబులని నిర్దేశించు కొఱకు సితాసిత కేశ ద్వయ వ్యాజంబున రామకృష్ణాఖ్యల నలరి యవతరించె; నందు భగవంతుండును సాక్షాద్విష్ణుండును నైన కృష్ణుండు జనమార్గవర్తి యయ్యును నతిమానుషకర్మంబుల నాచరించుటం జేసి కేవల పరమేశ్వరుం డయ్యె; నమ్మహాత్ముం డాచరించు కార్యంబులు లెక్క వెట్ట నెవ్వరికి నలవి గాదు; అయినను నాకు గోచరించినయంత యెఱింగించెద వినుము. | 174 |
| క. |
నూతనగరళస్తని యగు, పూతనఁ బురుటింటిలోనఁ బొత్తుల శిశువై చేతనముల హరియించి ప, రేతనగరమునకు ననిచెఁ గృష్ణుఁడు పెలుచన్. |
175 |
| క. |
వికటముగ నిజపదాహతిఁ, బ్రకటముగా మూఁడు నెలల బాలకుఁడై యా శకటనిశాటుని నంతక, నికటస్థునిఁజేసె భక్తనికరావనుఁడై. |
176 |
| క. |
ముద్దుల కొమరుని వ్రేతల, రద్దులకై తల్లి ఱోల రజ్జులఁ గట్టం బద్దులకు మిన్ను ముట్టిన, మద్దుల వడిఁ గూల్చె జనసమాజము వొగడన్. |
177 |
| మ. |
మదిఁ గృష్ణుండు యశోదబిడ్డఁడని నమ్మంజాల యోగీంద్ర! త ద్వదనాంభోజములోఁ జరాచరసమస్త ప్రాణిజాతాటవీ నదనద్యద్రిపయోధియుక్త మగు నానాలోకజాలంబు భా స్వదనూనక్రియఁ జూపెఁ దల్లికి మహాశ్చర్యంబు వాటిల్లఁగన్. |
178 |
| చ. |
వరయమునానదీహ్రదనివాసకుఁడై నిజవక్త్రనిర్గత స్ఫురిత విషాంబుపానమున భూజనులన్ మృతిఁబొందఁజేయు భీ కరగరళద్విజిహ్వుఁడగు కాళియపన్నగు నా హ్రదంబుఁ జె చ్చెర వెడలించి కాచె యదుసింహుఁడు గోపకగోగణంబులన్. |
179 |
| మ. |
తనయా! గోపకు లొక్కరేయి తఱి, నిద్రంజెందఁ గార్చిచ్చు వ చ్చినఁ “గృష్ణా! మము నగ్నిపీడితుల రక్షింపం దగుం గావవే” యనినం “గన్నులు మీరు మోడ్వుఁ డిదె దావాగ్నిన్ వెసన్నార్తు నే” నన వా రట్ల యొనర్ప మ్రింగె శిఖిఁ బద్మాక్షుండు లీలాగతిన్. |
180 |
| క. |
మందుని గతి యమునాంబువు, లందు నిసిం గ్రుంకి బద్ధుఁడై చిక్కిన యా నందుని, వరుణుని బంధన, మందు నివృత్తునిగఁ జేసె హరి సదయుండై. |
181 |
| మ. |
మయసూనుండు నిజానువర్తుల మహామాయన్ మహీభృద్గుహా శ్రయులంగా నొనరించి తత్పథము నీరంధ్రంబు గావించినన్ రయ మొప్పం గుటిలాసురాధమునిఁ బోరం ద్రుంచి గోపావళిన్ దయతోఁ గాచిన కృష్ణు సన్మహిమ మేతన్మాత్రమే తాపసా! |
182 |
| క. |
దివిజేంద్రప్రీతిగ వ, ల్లవజను లేఁటేఁటఁ జేయు లాలితసవనో త్సవము హరి మానిపిన గో, పవరులు గావింపకున్న బలరిపుఁ డలుకన్. |
183 |
| తే. |
మంద గొందలమంద నమందవృష్టిఁ, గ్రందుకొనుఁ డంచు నింద్రుండు మందలింపఁ జండపవన సముద్ధూత చటుల విలయ, సమయ సంవర్తకాభీలజలధరములు. |
184 |
| శా. |
సప్తస్కంధ శిఖా కలాప రుచిమత్సౌదామనీవల్లికా దీప్తోదగ్రముహు స్తమః పిహితధాత్రీ భాగనీరంధ్రమై సప్తాశ్వస్ఫురదిందు మండలనభస్సంఛాదితాశాంతర వ్యాప్తాంభోద నిరర్గళస్ఫుటశిరోవాఃపూరధారాళమై. |
185 |
| వ. | కురియు వానజల్లు పెల్లున రిమ్మగొని సొమ్మలు వోయి గోకులం బాకులంబయి “కృష్ణ! కృష్ణ! రక్షింపు” మని యార్తిం బొంది కుయ్యిడ నయ్యఖండ కరుణారస సముద్రుండును, భక్తజన సురద్రుముండును నైన పుండరీకాక్షుండు. | 186 |
| శా. |
సప్తాబ్దంబుల బాలుఁడై నిజభుజా స్తంభంబునన్ లీలమై సప్తాహంబులు శైలరాజము లసచ్ఛత్త్రంబుగాఁ దాల్చి, సం గుప్తప్రాణులఁ జేసె మాధవుఁడు గోగోపాలక వ్రాతమున్ సప్తాంభోధి పరీతభూధరున కాశ్చర్యంబె చింతింపఁగన్? |
187 |
| సీ. |
సాంద్ర శరచ్చంద్ర చంద్రికా ధవళిత విమల బృందావన వీథియందు రాసకేళీ మహోల్లాసుఁడై యుత్ఫుల్ల జలజాక్షుఁ డొక నిశాసమయమునను దనరారు మంద్ర మధ్యమ తారముల నింపు దళుకొత్త రాగభేదములఁ జెలఁగి ధైవత ఋషభ గాంధార నిషాద పంచమ షడ్జ మధ్యమ స్వరము లోలిఁ |
|
| తే. |
గళలు జాతులు మూర్ఛనల్ గలుగ వేణు, నాళ వివరాంగుళన్యాసలాలనమున మహితగతిఁ బాడె నవ్యక్తమధురముగను, పంకజాక్షుండు దారువు లంకురింప. |
188 |
| మ. |
హరివేణూద్గత మంజులస్వరనినాదాహూతలై గోప సుం దరు లేతేర ధనాధిపానుచరగంధర్వుండు గొంపోవఁ ద త్తరుణుల్ గుయ్యిడ శంఖచూడుని భుజాదర్పంబు మాయించి తాఁ బరిరక్షించినయట్టి కృష్ణుని నుతింపన్ శక్యమే యేరికిన్? |
189 |
| చ. |
నరక ముర ప్రలంబ యవనద్విప ముష్టిక మల్ల కంస శం బర శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్త్ర వా నర ఖర సాల్వ వత్స బక నాగ విదూరథ రుక్మి కేశి ద ర్దుర వృష ధేనుక ప్రముఖదుష్టనిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్. |
190 |
| వ. | మఱియును. | 191 |
| మ. |
బలభీమార్జునముఖ్య చాపధరరూపవ్యాజతం గ్రూరులన్ ఖలులన్ దుష్టధరాతలేశ్వరుల సంగ్రామైకపారీణ దో ర్బలకేళిం దునుమాడి సర్వధరణీభారంబు మాయించి సా ధుల రక్షించినయట్టి కృష్ణుని ననంతుం గొల్తు నెల్లప్పుడున్. |
192 |
| వ. | అట్టి లోకోత్కృష్టుండైన కృష్ణుని యవతారమాహాత్మ్యంబెఱింగించితి నింక వ్యాసావతారంబు వినుము. | 193 |
| చ. |
ప్రతియుగమందు సంకుచితభావులు నల్పతరాయువుల్ సుదు ర్గతికులు నైన మర్త్యుల కగమ్యములున్ స్వకృతంబులున్ సుశా శ్వతములు నైన వేదతరుశాఖలు దా విభజించినట్టి స న్నుతుఁడు పరాశరప్రియతనూజుఁడు నా హరి పుట్టె నర్మిలిన్. |
194 |
| వ. | మఱియు బుద్ధావతారంబు వినుము. | 195 |
| మ. |
అతిలోలాత్ములు సూనృతేతరులు భేదాచార సంశీలు రు ద్ధత పాషండమతౌపధర్మ్యులు జగత్సంహారు లైనట్టి యా దితి సంజాతు లధర్మవాసనల వర్తింపం, దదాచార సం హతి మాయించి హరించె దానవులఁ బద్మాక్షుండు బుద్ధాకృతిన్. |
196 |
| వ. | మఱియుం గల్క్యవతారంబు వినుము. | 197 |
| మ. |
వనజాక్ష స్తవశూన్యులై మఱి వషట్స్వాహా స్వధా వాక్య శో భనరాహిత్యులు, సూనృతేతరులునుం, బాషండులున్నైన వి ప్రనికాయంబును శూద్రభూపులుఁ గలిం బాటిల్లినం గల్కియై జననంబంది యధర్మమున్నడఁచు సంస్థాపించు ధర్మంబిలన్. |
198 |
| వ. | అని మఱియుఁ బితామహుండు నారదున కిట్లనియె. మునీంద్రా, పుండరీకాక్షుం డంగీకరించిన లీలావతారకథావృత్తాంతంబు నేను నీకు నెఱింగించు నంతకు మున్న హరి వరాహాద్యవతారంబు లంగీకరించి తత్ప్రయోజనంబులఁ దీర్చె. మన్వంతరావతారంబు లంగీకరించి నవియు నంగీకరింపఁగలవియునై యున్నయవి; వర్తమానంబున ధన్వంతరి పరశురామావతారంబులు దాల్చి యున్నవాడు. భావికాలంబున శ్రీరామాద్యవతారంబుల నంగీకరింపంగలవాఁ; డమ్మహాత్ముండు సృష్ట్యాది కార్య భేదంబులకొఱకు మాయాగుణావతారంబులందు, బహుశక్తి ధారణుండైన భగవంతుండు సర్గాదిని దపంబు నేనును ఋషి గణంబులును నవప్రజాపతులునునై యవతరించి విశ్వోత్పాదనంబు గావించుచుండు, ధర్మంబును విష్ణుండును యజ్ఞంబులును మనువులును నింద్రాది దేవగణంబులును ధాత్రీపతులును నయి యవతరించి జగంబుల రక్షించుచుండు, నధర్మంబును రుద్రుండును మహోరగంబులును రాక్షసానీకంబులును నై యవతరించి విలయంబు నొందించుచుండు, నిత్తెఱంగునం బరమేశ్వరుండును సర్వాత్మకుండును నైన హరి విశ్వోత్పత్తిస్థితి లయ హేతు భూతుండై విలసిల్లు; ధరణీరేణువుల నయిన గణుతింప నలవియగుం గాని యమ్మహాత్ముని లీలావతారాద్భుత కర్మంబులు లెక్క వెట్ట నెవ్వరికి నశక్యంబై యుండు, నీకు సంక్షేపరూపంబున నుపన్యసించితి సవిస్తారంబుగా నెఱింగింప నాకుం దరంబుగా దనిన నన్యులం జెప్పనేల? వినుము. | 199 |
| చ. |
అమరఁ ద్రివిక్రమస్ఫురణ నందిన యమ్మహితాత్ముపాద వే గమున హతంబులైన త్రిజగంబుల కావల వెల్గు సత్య లో కము చలియించినం గరుణఁ గైకొని కాచి ధరించు పాద ప ద్మము తుదినున్న యప్రతిహతంబగు శక్తి గణింప శక్యమే? |
200 |
| మ. |
హరి మాయాబల మే నెఱుంగ నఁట శక్యంబే సనందాది స త్పురుషవ్రాతముకైన, బుద్ధి నితరంబున్ మాని సేవాధిక స్ఫురణం దచ్చరితానురాగ గుణవిస్ఫూర్తిన్ సహస్రాస్య సుం దరతం బొల్పగు శేషుఁడుం దెలియఁ డన్నన్ జెప్పనే లొండొరున్. |
201 |
| చ. |
ఇతరము మాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నా శ్రితజనసేవితాంఘ్రిసరసీరుహుఁడైన సరోజనాభుఁ డం చితదయతోడ నిష్కపటచిత్తమునం గరుణించు, నట్టి వా రతులదురంతమై తనరు న వ్విభు మాయఁ దరింతు రెప్పుడున్. |
202 |
| వ. | మఱియును సంసారమగ్నులయి దివసంబులు ద్రోఁచియు నంతంబున శునక సృగాలభక్షణంబులైన కాయంబు లందు మమత్వంబు సేయక భగవదర్పణంబు సేసిన పుణ్యాత్ములుం గొందఱు గల రెఱింగింతు వినుము. నేను నీ బ్రహ్మత్వంబునం జెందు రాజసంబు విడిచి య మ్మహాత్ముని పాదారవిందంబుల భక్తి నిష్ఠుండ నయి శరణాగతత్వంబున భజియించునప్పుడు దెలియుదు; రాజసగుణుండనై యున్నవేళం దెలియంజాలఁ; గావున శాస్త్రంబులు ప్రపంచింపక కేవలభక్తి జ్ఞాన యోగంబున సేవింతు; మఱియు సనకాదులగు మీరును, భగవంతుండైన రుద్రుండును, దైత్యపతియైన ప్రహ్లాదుండును, స్వాయంభువ మనువును, నతని పత్నియగు శతరూపయుఁ, దత్పుత్రులగు ప్రియవ్రతోత్తానపాదులునుం, బ్రాచీన బర్హియు, ఋభువును, వేనజనకుండగు నంగుండును, ధ్రువుండును గడవం జాలుదురు వెండియు. | 203 |
| సీ. |
గాధిగయాదు లిక్ష్వాకు దిలీప మాంధాతలు భీష్మ యయాతి సగర రఘు ముచుకుం దైళ రంతిదే వోద్ధవ సారస్వతోదంక భూరిషేణ శ్రుతదేవ మారుతి శతధన్వ పిప్పల బలి విభీషణ శిబి పార్థ విదురు లంబరీష పరాశ రాలర్క దేవల సౌభరి మిథిలేశ్వరాభిమన్యు |
|
| తే. |
లార్‌ష్ణిషేణాదులైన మహాత్ము లెలమిఁ, దవిలి య ద్దేవు భక్తిఁ జిత్తముల నిల్పి తత్పరాయణులౌట దుర్దాంతమైన, విష్ణుమాయఁ దరింతురు విమలమతులు. |
204 |
| మ. |
అనఘా! వీరల నెన్న నేమిటికిఁ, దిర్యగ్జంతుసంతాన ప క్షినిశాటాటవికాఘజీవ నివహ స్త్రీ శూద్రహూణాదు లై నను నారాయణభక్తియోగమహితానందాత్ము లై రేని వా రనయంబుం దరియింతు ర వ్విభుని మాయావైభవాంభోనిధిన్. |
205 |
| వ. | కావున. | 206 |
| క. |
శశ్వత్ప్రశాంతు నభయుని, విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్ శాశ్వతు సము సదసత్పరు, నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్రా! |
207 |
| వ. | అట్లయిన న ప్పుణ్యాత్ముల ననవద్యశీలుర నవిద్య లజ్జావనత వదనయై పొందం జాలక వైముఖ్యంబున దవ్వు దవ్వులం దలంగి పోవు. మఱియును. | 208 |
| చ. |
హరిఁ బరమాత్ము నచ్యుతు ననంతునిఁ జిత్తములం దలంచి సు స్థిరత విశోక సౌఖ్యములఁ జెందిన ధీనిధు లన్యకృత్యము ల్మఱచియుఁ జేయనొల్లరు, తలంచిన నట్టిదయౌ, సురేంద్రుఁడుం బరువడి నుయ్యి ద్రవ్వునె పిపాసితుఁడై సలిలాభిలాషితన్? |
209 |
| ఉ. |
సర్వఫలప్రదాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తుఁడున్ సర్వజగత్ప్రసిద్ధుఁడును, సర్వగతుండగు చక్రపాణి యీ సర్వశరీరులున్ విగమసంగతిఁ జెంది విశీర్యమాణులై పర్వినచో నభంబుగతి బ్రహ్మము దాఁ జెడకుండు నెప్పుడున్. |
210 |
| ఉ. |
కారణకార్యహేతు వగు కంజదళాక్షునికంటె నన్యు లె వ్వారును లేరు; తండ్రి! భగవంతు ననంతుని విశ్వభావనో దారుని సద్గుణావళు లుదాత్తమతిం గొనియాడకుండినం జేరవు చిత్తముల్ ప్రకృతిఁజెందని నిర్గుణమైన బ్రహ్మమున్. |
211 |
| మ. |
నిగమార్థప్రతిపాదకప్రకటమై, నిర్వాణసంధాయిగా భగవంతుండు రచింప భాగవతకల్పక్ష్మాజమై శాస్త్రరా జి గరిష్ఠంబగు నీ పురాణకథ సంక్షేపంబునం జెప్పితిన్; జగతిన్ నీవు రచింపు దీని నతివిస్తారంబుగాఁ బుత్రకా! |
212 |
| చ. |
పురుషభవంబు నొందుట యపూర్వము జన్మములందు; నందు భూ సురకులమందుఁ బుట్టు టతిచోద్యము; నిట్లగుటన్ మనుష్యు ల స్థిరమగు కార్యదుర్దశలచేత నశింపక విష్ణుసేవనా పరతఁ దనర్చి నిత్యమగు భవ్యపథంబును బొందు టొప్పదే? |
213 |
| మ. |
ఉపవాసవ్రత శౌచ శీల మఖ సంధ్యోపాస నాగ్నిక్రియా జప దానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూర; ద చ్చపుభక్తిన్ హరిఁ బుండరీకనయనున్ సర్వాతిశాయిన్ రమా ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వలేకుండినన్. |
214 |
| క. |
వనజాక్షు మహిమ నిత్యము, వినుతించుచు, నొరులు వొగడ వినుచున్, మదిలో ననుమోదించుచు నుండెడు, జనములు దన్మోహవశతఁ జనరు మునీంద్రా! |
215 |
| క. |
అని వాణీశుఁడు నారద, మునివరునకుఁ జెప్పినట్టి ముఖ్యకథా సూ చన మతిభక్తిఁ బరీక్షి, జ్జనపాలునితోడ యోగిచంద్రుఁడు నుడివెన్. |
216 |