| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ద్వితీయస్కంధము |
| వ. | నారదుండు బ్రహ్మ కిట్లనియె. | 72 |
| మ. |
చతురాస్యుండవు; వేల్పుపెద్దవు; జగత్సర్గానుసంధాయి; వీ శ్రుతిసంఘాతము నీ ముఖాంబుజములన్ శోభిల్లు; శబ్దార్థ సం యుతమై సర్వము నీ కరామలకమై యుండుంగదా! భారతీ సతి యిల్లా లఁట నీకు; నో జనక! నా సందేహముం బాపవే! |
73 |
| శా. |
ప్రారంభాదివివేక మెవ్వఁ డొసఁగుం? బ్రారంభసంపత్తి కా ధారం బెయ్యది? యేమి హేతువు? యదర్థం బే స్వరూపంబు సం సారానుక్రమ మూర్ణనాభిపగిదిన్ సాగించె దెల్లప్పుడుం భారం బెన్నఁడు లేదు! నీ మనువు దుష్ప్రాపంబు వాణీశ్వరా! |
74 |
| శా. |
నాకుం జూడఁగ నీవు రాజ వనుచున్నాఁడన్ యథార్థస్థితిన్ నీకంటెన్ ఘనుఁ డొక్క రాజు గలఁడో? నీ వంతకున్ రాజవో? నీ కే లాభము రాఁదలంచి జగముల్ నిర్మించె, దీ చేతనా నీకం బెందు జనించు నుండు నడఁగున్? నిక్కంబు భాషింపుమా! |
75 |
| మ. |
సదసత్సంగతి నామ రూప గుణ దృశ్యం బైన విశ్వంబు నీ హృదధీనంబు గదా! ఘనుల్ సములు నీ కెవ్వారలున్ లేరు, నీ పద మత్యున్నత, మిట్టి నీవు తపముం బ్రావీణ్యయుక్తుండవై మది నే యీశ్వరుఁ గోరి చేసితివి? తన్మార్గంబు సూచింపవే! |
76 |
| శా. |
అంభోజాసన! నీకు నీశుఁడు గలం డంటేనిఁ దత్పక్ష మం దంభోజాతభవాండ మే విభుని లీలాపాంగసంయుక్తిచే సంభూతం బగు వర్తమాన మగు సంఛన్నంబగుం దద్విభున్ సంభాషింపఁగ వచ్చునేఁ దలఁప నే చందంబువాఁ డాకృతిన్? |
77 |
| క. |
తోయజసంభవ! నా కీ, తోయము వివరింపు, చాలఁ దోఁచిన నే నా తోయమువారికి నన్యుల, తోయములం జెందకుండ ధ్రువ మెఱిఁగింతున్. |
78 |
| వ. | దేవా ! భూత భవిష్యద్వర్తమానంబులగు వ్యవహారంబులకు నీవ వల్లభుండవు. నీ యెఱుంగని యర్థం బొండెద్దియు లేదు! విశ్వప్రకారంబు వినిపింపు మనిన విని వికసితముఖుండై విరించి యిట్లనియె. | 79 |
| క. |
రారా బుధులు? విరక్తులు, గారా? యీ రీతి నడుగఁగా నేరరు వి స్మేరావహము భవన్మత, మౌరా! నా విభుని మర్మ మడిగితి వత్సా! |
80 |
| శా. |
నానాస్థావరజంగమప్రకరముల్ నాయంత నిర్మింప వి జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వానుసం ధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము న్నే నా యీశ్వరు నాజ్ఞఁగాక జగముల్ నిర్మింప శక్తుండనే? |
81 |
| మ. |
అనఘా! విశ్వము నెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండనే? యినచంద్రానల తారకాగ్రహగణం బే రీతి నా రీతి నె వ్వని దీప్తిం బ్రతిదీప్త మయ్యె భువనవ్రాతంబు; దద్దీప్తిచే ననుదీప్తం బగునట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్. |
82 |
| మ. |
వినుమీ యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి గ్గున సంకోచము నొందు మాయవలనం గుంఠీభవత్ప్రజ్ఞచే నను లోకేశ్వరుఁడంచు మ్రొక్కు మతిహీనవ్రాతముం జూచి నే ననిశంబున్ నగి ధిక్కరింతు హరిమాయాకృత్య మంచున్ సుతా! |
83 |
| వ. | మఱియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులును, జన్మనిమిత్తంబులైన కర్మంబులును, గర్మక్షోభకంబైన కాలంబును, గాలపరిణామ హేతువైన స్వభావంబును, భోక్తయైన జీవుండును, వాసుదేవుండ కా నెఱుంగుము, వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు. సిద్ధంబు. నారాయణ నియమ్యంబులు లోకంబులు, దేవతలు నారాయణశరీర సంభూతులు, వేద యాగ తపో యోగ విజ్ఞానంబులు నారాయణ పరంబులు, జ్ఞానసాధ్యం బగు ఫలంబు నారాయణు నధీనంబు, కూటస్థుండును సర్వాత్మకుండును సర్వద్రష్టయు నయిన యీశ్వరుని కటాక్ష విశేషంబున సృజియింపంబడి ప్రేరితుండనై సృజ్యంబైన ప్రపంచంబు సృజించుచుండుదు, నిర్గుణుండైన యీశ్వరుని వలన రజస్సత్త్వతమోగుణంబులు ప్రభూతంబులై యుత్పత్తి స్థితి లయంబులకుం బాలుపడి కార్యకారణ కర్తృత్వభావంబులందు ద్రవ్యంబులైన మహాభూతంబులును జ్ఞానమూర్తులయిన దేవతలును గ్రియారూపంబులయిన యింద్రియంబులును నాశ్రయంబులుగా నిత్యముక్తుం డయ్యును మాయాసమన్వితుండైన జీవుని బంధించు, జీవులకు నావరణంబులయి యుపాధి భూతంబులయిన మూఁడు లింగంబులు సేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్త్వంబు గల యీశ్వరుం డివ్విధంబునం గ్రీడించుచుండు. | 84 |
| క. |
ఆ యీశుఁ డనంతుఁడు హరి, నాయకుఁ డీ భువనములకు, నాకున్, నీకున్ మాయకుఁ బ్రాణివ్రాతము, కీ యెడలన్ లేద యీశ్వరేతరము సుతా! |
85 |
| వ. | వినుము, మాయావిభుండైన యీశ్వరుండు దన మాయంజేసి దైవయోగంబునం బ్రాప్తంబులయిన కాలజీవాదృష్ట స్వభావంబులు వివిధంబులు సేయ నిశ్చయించి కైకొనియె, నీశ్వరాధిష్ఠితంబైన మహత్తత్త్వంబు వలన నగు కాలంబున గుణవ్యతికరంబును స్వభావంబున బరిణామంబును జీవాదృష్టభూతంబయిన కర్మంబున జన్మంబును నయ్యె, రజస్సత్త్త్వంబులచే నుపబృంహితంబై వికారంబు నొందిన మహత్తత్త్వంబువలనం దమఃప్రధానంబై ద్రవ్యజ్ఞాన క్రియాత్మకంబగు నహంకారంబు గలిగె, నదియు రూపాంతరంబు లొందుచు ద్రవ్యశక్తియైన తామసంబును గ్రియాశక్తియైన రాజసంబును జ్ఞానశక్తియైన సాత్త్వికంబును నన మూఁడు విధంబులయ్యె, నందు భూతాదియైన తామసాహంకారంబువలన నభంబు కలిగె, నభంబునకు సూక్ష్మరూపంబు ద్రష్టృదృశ్యములకు బోధకంబైన శబ్దంబు గుణంబగు, నభంబువలన వాయువు గలిగె, వాయువునకుం బరాన్వయంబున శబ్దంబు స్పర్శంబు నను రెండు గుణంబులు గలిగియుండు, నది దేహంబులం దుండుటం జేసి ప్రాణరూపంబై యింద్రియ మనశ్శరీర పాటవంబునై యోజస్సహోబలంబులకు హేతువై వర్తించు, వాయువువలన రూప స్పర్శ శబ్దంబు లనియెడు గుణంబులు మూఁటితోడఁ దేజంబు గలిగెఁ, దేజంబువలన రస రూప స్పర్శ శబ్దంబు లనియెడు నాలుగు గుణంబులతో జలంబు గలిగె, జలంబువలన గంధ రస రూప స్పర్శ శబ్దంబు లనియెడు గుణంబు లయిదింటితోడం బృథివి గలిగె, వైకారికంబైన సాత్త్వికాహంకారంబువలనఁ జంద్ర దైవతంబయిన మనంబు గలిగె; మఱియు దిక్కులును వాయువును నర్కుండును బ్రచేతసుండును నాశ్వినులును వహ్నియు నింద్రుండును నుపేంద్రుండును మిత్రుండును బ్రజాపతియు ననియెడి దశదేవతలు గలిగిరి, తైజసంబైన రాజసాహంకారంబువలన దిగ్దైవతంబైన త్వగింద్రియంబును సూర్యదైవతంబైన రసనేంద్రియంబును నశ్విదైవతంబైన ఘ్రాణేంద్రియంబును వహ్నిదైవతంబైన హస్తేంద్రియంబును నుపేంద్ర దైవతంబైన పాదేంద్రియంబును మిత్ర దైవతంబైన గుదేంద్రియంబును బ్రజాపతి దైవతంబైన గుహ్యేంద్రియంబును ననియెడి దశేంద్రియంబులును బోధజనకాంతఃకరణైక భాగంబయిన బుద్ధియుఁ గ్రియాజనకాంతః కరణంబయిన ప్రాణంబునుం గలిగె,నిట్టి శ్రోత్రాదులగు దశేంద్రియంబులతోఁ గూడిన భూతేంద్రియ మనోగుణంబులు వేర్వేఱుగ బ్రహ్మాండ శరీర నిర్మాణంబునంద సమర్థంబు లగునపుడు గృహనిర్మాణంబునకుం బెక్కు పదార్థంబులు సంపాదించినంగాని చాలని చందంబున భూతేంద్రియ మనోగుణంబులవలన గృహంబుకైవడి భగవచ్ఛక్తి ప్రేరితంబు లగుచు నేకీభవించిన సమష్టి వ్యష్ట్యాత్మకత్వంబు నంగీకరించి చేతనాచేతనంబులం గల బ్రహ్మాండంబు కల్పితంబయ్యె, నట్టి యండంబు వర్షాయుత సహస్రాంతంబు దనుక జలంబునందుండె, గాల కర్మ స్వభావంబులం దగులువడక సమస్తంబును జీవయుక్తంబుగఁ జేయ నీశ్వరుం డచేతనంబును సచేతనంబునుగ నొనర్చె, నంతం గాలకర్మస్వభావ ప్రేరకుండయిన పరమేశ్వరుండు జీవరూపంబున మహావరణ జలమధ్య స్థితంబయిన బ్రహ్మాండంబు లోను సొచ్చి సవిస్తారంబు గావించి యట్టి యండంబు భేదించి నిర్గమించె నెట్లంటేని. | 86 |
| క. |
భువనాత్మకుఁ డా యీశుఁడు, భవనాకృతితోడ నుండు బ్రహ్మాండంబున్ వివరముతోఁ బదునాలుగు, వివరంబులుగా నొనర్చె విశదంబులుగన్. |
87 |
| మ. |
బహుపాదోరుభుజాననేక్షణశిరఃఫాలశ్రవో యుక్తుఁడై విహరించున్ బహుదేహి దేహగతుఁడై, విద్వాంసు లూహించి త ద్బహురూపావయవంబులన్ భువనసంపత్తిన్ విచారింతు, రా మహనీయాద్భుతమూర్తి యోగిజనహృన్మాన్యుండు మేధానిధీ! |
88 |
| వ. | వినుము. చతుర్దశలోకంబులందు మీఁది యేడు లోకంబులు శ్రీమహావిష్ణువునకుం గటిప్రదేశంబున నుండి యూర్ధ్వదేహ మనియును, గ్రింది యేడు లోకంబులు జఘనంబునుండి యధోదేహ మనియునుం బలుకుదురు. ప్రపంచ శరీరుండగు భగవంతుని ముఖంబువలన బ్రహ్మకులంబును, బాహువులవలన క్షత్త్రియకులంబును, నూరువులవలన వైశ్యకులంబును, బాదంబులవలన శూద్రకులంబును జనియించెనని చెప్పుదురు; భూలోకంబు గటి ప్రదేశంబు, భువర్లోకంబు నాభి, సువర్లోకంబు హృదయంబు, మహర్లోకంబు వక్షంబు, జనలోకంబు గ్రీవంబు, తపోలోకంబు స్తనద్వయంబు, సనాతనంబును బ్రహ్మనివాసంబును నైన సత్యలోకంబు శిరంబు, జఘన ప్రదేశం బతలంబు, తొడలు వితలంబు, జానువులు సుతలంబు, జంఘలు తలాతలంబు, గుల్ఫంబులు మహీతలంబు, పదాగ్రంబులు రసాతలంబు, పాదతలంబు పాతాళంబు నని (లోకమయుంగా) భావింతురు. కొందఱు మఱియుం బాదతలంబువలన భూలోకంబును, నాభివలన భువర్లోకంబును, శిరంబువలన స్వర్లోకంబును గలిగెనని లోకకల్పనంబు నెన్నుదురు. పురుషోత్తముని ముఖంబువలన సర్వజంతు వాచాజాలంబును, తదధిష్ఠాతయగు వహ్నియు నుదయించె! చర్మరక్తమాంస మేదశ్శల్య మజ్జాశుక్లంబులు సప్తధాతువు లందురు. పక్షాంతరంబున రోమ త్వఙ్మాంసాస్థి స్నాయుమజ్జా ప్రాణంబులును సప్తధాతువులని యందురు, అందు రోమంబు లుష్ణిక్ఛందంబనియుఁ. ద్వక్కు ధాత్రీఛందం బనియు, మాంసంబు త్రిష్టుప్ఛందం బనియు, స్నాయు వనుష్టుప్ఛందం బనియు, నస్థి జగతీఛందం బనియు, మజ్జ పంక్తిచ్ఛందం బనియుఁ, బ్రాణంబు బృహతీఛందం బనియు నాదేశింతురు. హవ్యకవ్యామృతాన్నంబులకు, మధురాది షడ్రసంబులకు రసనేంద్రియంబునకు, రసాధీశ్వరుండైన వరుణునికిని హరిరసనేంద్రియంబు జన్మస్థానంబు. సర్వప్రాణాదులకు వాయువునకు విష్ణునాసికా వివరంబు నివాసంబు. సమీప దూరవ్యాపి గంధంబులకు, నోషధులకు, నశ్విదేవతలకు భగవంతుని ఘ్రాణేంద్రియంబు నివాసంబు; దేవలోక సత్యలోకంబులకుఁ, దేజంబునకు, సూర్యునకు, సకలచక్షువులకు లోకలోచనుని చక్షురింద్రియంబు స్థానంబు; దిశలకు, నాకాశంబునకు, శ్రుతిభూతంబులైన యంశంబులకు, శబ్దంబునకు సర్వేశ్వరుని కర్ణేంద్రియంబు జన్మస్థానంబు. వస్తుసారంబులకు, వర్ణనీయ భాగ్యంబులకుఁ బరమ పురుషుని గాత్రంబు భాజనంబు. స్పర్శంబునకు, వాయువునకు, సకలస్నిగ్ధత్వంబునకు దివ్యదేహుని దేహేంద్రియంబు గేహంబు. యూపప్రముఖ యజ్ఞోపకరణంబులగు తరుగుల్మ లతాదులకుఁ బురుషోత్తముని రోమంబులు మూలంబులు, శిలాలోహంబులు సర్వమయుని నఖంబులు, మేఘజాలంబులు హృషీకేశుని కేశంబులు, మెఱుంగులు విశ్వేశ్వరుని శ్మశ్రువులు. భూర్భువస్సువర్లోక రక్షకులైన లోకపాలకుల పరాక్రమంబులకు భూరాదిలోకంబులకు క్షేమంబునకు, శరణంబునకు నారాయణుని విక్రమంబులు నికేతనంబులు; సర్వకర్మంబులకు, నుత్తమంబులైన వరంబులకుఁ దీర్థపాదుని పాదారవిందంబు లాస్పదంబులు. జలంబులకు, శుక్లంబునకుఁ, బర్జన్యునకుఁ, బ్రజాపతిసర్గంబునకు సర్వేశ్వరుని మేఢ్రంబు సంభవ నిలయంబు. సంతానంబునకుఁ, గామాదిపురుషార్థంబులకుఁ జిత్తసౌఖ్యరూపంబులగు నానందంబులకు, శరీర సౌఖ్యంబునకు నచ్యుతుని యుపస్థేంద్రియంబు స్థానంబు. యమునికి, మిత్రునికి, మలవిసర్గంబునకు భగవంతుని పాయ్వింద్రియంబు భవనంబు. హింసకు, నిరృతికి, మృత్యువునకు, నిరయంబునకు నిఖిలరూపకుని గుదంబు నివాసంబు. పరాభవంబునకు, నధర్మంబునకు, నవిద్యకు, నంధకారంబునకు ననంతుని పృష్ఠభాగంబు సదనంబు, నదనదీ నివహంబునకు నీశ్వరునినాడీ సందోహంబు జన్మమందిరంబు. పర్వతంబులకు నధోక్షజుని శల్యంబులు జనకస్థలంబులు. ప్రధానంబునకు, నన్నరసంబునకు, సముద్రంబులకు, భూతలయంబునకు బ్రహ్మాండగర్భుని యుదరంబు నివేశంబు. మనోవ్యాపార రూపంబగు లింగశరీరంబునకు మహామహిముని హృదయంబు సర్గభూమి యగు, మఱియును. | 89 |
| ఆ. |
నీలకంధరునకు నీకు నాకు సనత్కు, మారముఖ్య సుతసమాజమునకు ధర్మసత్త్వబుద్ధి తత్త్వములకు నీశ్వ, రాత్మ వినుము పరమమైన నెలవు. |
90 |
| సీ. |
నరసురాసుర పితృ నాగ కుంజర మృగ, గంధర్వ యక్ష రాక్షస మహీజ సిద్ధ విద్యాధర జీమూత చారణ, గ్రహ తారకాప్సరోగణ విహంగ భూత తటిద్వస్తుపుంజంబులును నీవు, ముక్కంటియును మహామునులు నేను సలిలనభస్స్థలచరములు మొదలైన, వివిధజీవులతోడి విశ్వమెల్ల |
|
| ఆ. |
విష్ణుమయము పుత్త్ర! వే యేల బ్రహ్మాండ, మతని జేనలోన నడఁగి యుండు బుద్ధి నెఱుఁగరాదు భూతభవద్భవ్య, లోకమెల్ల విష్ణులోన నుండు. |
91 |
| క. |
మండలములోన భాస్కరుఁ, డుండి జగంబులకు దీప్తి నొసఁగెడి క్రియ, బ్ర హ్మాండములోపల నచ్యుతుఁ, డుండుచు. బహిరంతరముల నొగి వెలిఁగించున్. |
92 |
| ఉ. |
అట్టి యనంతశక్తి జగదాత్ముని నాభిసరోజమందు నేఁ బుట్టి యజింపఁగా మనసు పుట్టిన యజ్ఞపదార్థజాతముల్ నెట్టన కానరామికి వినిర్మలమైన తదీయరూపమున్ గట్టిగ బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నా మనంబునన్. |
93 |
| సీ. |
పశుయజ్ఞ వాటయూపస్తంభ పాత్ర మృ, ద్ఘట శరావ వసంతకాలములును స్నేహౌషధీబహులోహచాతుర్హోత్ర, మత నామధేయసన్మంత్రములును సంకల్పఋగ్యజుస్సామ నియుక్త వ, షట్కారమంత్రానుచరణములును దక్షిణల్ దేవతాధ్యాన తదనుగత, తంత్రవ్రతోద్దేశ ధరణిసురులు |
|
| తే. |
నర్పణంబులు బోధాయనాదికర్మ, సరణి మొదలగు యజ్ఞోపకరణసమితి యంతయును న మ్మహాత్ముని యవయవములు, గాఁగఁ గల్పించి విధివత్ప్రకారమునను. |
94 |
| క. |
యజ్ఞాంగి యజ్ఞఫలదుఁడు, యజ్ఞేశుఁడు యజ్ఞకర్త యగు భగవంతున్ యజ్ఞపురుషుఁగా మానస, యజ్ఞముఁ గావించితిం దదర్పణబుద్ధిన్. |
95 |
| క. |
అప్పుడు బ్రహ్మలు దమలోఁ దప్పక ననుఁ జూచి సముచితక్రియు లగుచు న్నప్పరమేశున కభిమత, మొప్పఁగఁ దగ సప్తతంతు వొగిఁ గావింపన్. |
96 |
| చ. |
మనువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటి, దా రనయము వారివారికిఁ బ్రియంబగు దేవతలన్ భజించుచున్, ఘనతరనిష్ఠ యజ్ఞములఁ గైకొని చేసిరి, తత్ఫలంబు ల య్యనుపమమూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందఁగన్. |
97 |
| క. |
సువ్యక్తతంత్రరూపకుఁ, డవ్యక్తుఁ డనంతుఁ డభవుఁ డచ్యుతుఁ డీశుం డవ్యయుఁడగు హరి సురగణ, సేవ్యుఁడు క్రతుఫలదుఁ డగుటఁ జేసిరి మఖముల్. |
98 |
| క. |
అగుణుండగు పరమేశుఁడు, జగములఁ గల్పించుకొఱకుఁ జతురత మాయా సగుణుండగుఁ గావున హరి, భగవంతుం డనఁగఁ బరఁగె భవ్యచరిత్రా! |
99 |
| క. |
విశ్వాత్ముఁడు. విశ్వేశుఁడు, విశ్వమయుం డఖిలనేత విష్ణుఁ డజుం డీ విశ్వములోఁ దా నుండును, విశ్వము దనలోనఁ జాల వెలుఁగుచు ఉండున్. |
100 |
| చ. |
అతని నియుక్తిఁజెంది సచరాచరభూత సమేతసృష్టి నే వితతముగా సృజింతుఁ, బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ, బార్వతీ పతి లయ మొందఁజేయు, హరి పంకరుహోదరుఁ డాదిమూర్తి య చ్యుతుఁడు త్రిశక్తియుక్తుఁడగుచుండును నింతకుఁ దాన మూలమై. |
101 |
| క. |
విను వత్స! నీవు నన్నడి, గిన ప్రశ్నకు నుత్తరంబు కేవలపరమం బును బ్రహ్మం బీ యఖిలం, బున కగు నాధారహేతుభూతము సుమ్మీ! |
102 |
| క. |
హరి భగవంతుఁ డనంతుఁడు, కరణాంబుధి సృష్టికార్యకారణ హేతు స్ఫురణుం డవ్విభుకంటెం, బరుఁ డెవ్వఁడు లేఁడు తండ్రి! పరికింపంగన్. |
103 |
| సీ. |
ఇది యంతయును నిక్క మే బొంక నుత్కంఠ మతిఁ దద్గుణధ్యానమహిమఁజేసి పరికింప నే నేమి వలికిన నది యెల్ల సత్యంబ యగు బుధస్తుత్య! వినుము ధీయుక్త! మామకేంద్రియములు మఱచియుఁ, బొరయ వసత్యవిస్ఫురణ మెందు! నదిగాక మత్తను వామ్నాయతుల్యంబు, నమరేంద్రవందనీయంబు నయ్యెఁ, |
|
| తే. |
దవిలి యా దేవదేవుని భవమహాబ్ధి, తారణంబును మంగళకారణంబు నఖిలసంపత్కరంబునై యలరు పాద, వనజమున కే నొనర్చెద వందనములు. |
104 |
| ఉ. |
ఆ నళినాక్షు నందనుఁడనయ్యుఁ, బ్రజాపతినయ్యు, యోగ వి ద్యానిపుణుండ నయ్యును, బదంపడి మజ్జననప్రకారమే యేను నెఱుంగ; నవ్విభుని యిద్ధమహత్త్వ మెఱుంగ నేర్తునే? కానఁబడున్ రమేశపరికల్పితవిశ్వము గొంతకొంతయున్. |
105 |
| మ. |
విను వే యేటికిఁ దాపసప్రవర! యి వ్విశ్వాత్ముఁ డీశుండు దాఁ దన మాయామహిమాంతముం దెలియఁగాఁ దథ్యంబుగాఁ జాలఁ డ న్నను, నే నైనను మీరలైన సురలైనన్ వామదేవుండు నై నను నిక్కం బెఱుఁగంగఁ జాలుదుమె?జ్ఞానప్రక్రియాయుక్తులన్. |
106 |
| వ. | అ మ్మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుం డంటేని. | 107 |
| క. |
గగనము దన కడపలఁ దాఁ, దగ నెఱుఁగని కరణి విభుఁడు దా నెఱుఁగఁ డనన్ గగనప్రసవము లే దన, నగునే సర్వజ్ఞతకును హాని దలంపన్. |
108 |
| చ. |
తలకొని య మ్మహాత్మకుఁడు దాల్చిన య య్యవతారకర్మముల్ వెలయఁగ నస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతు, మ య్యలఘు ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరుం దెలియఁగనేర్తుమే తవిలి? దివ్యచరిత్రున కేను మ్రొక్కెదన్. |
109 |
| మ. |
పరమాత్ముం డజుఁ డీ జగంబుఁ బ్రతికల్పంబందుఁ గల్పించుఁ దాఁ బరిరక్షించును ద్రుంచునట్టి యనఘున్ బ్రహ్మాత్ము నిత్యున్ జగ ద్భరితుం గేవలు నద్వితీయుని విశుద్ధజ్ఞాను సర్వాత్ము నీ శ్వరు నాద్యంతవిహీను నిర్గుణుని శశ్వన్మూర్తిఁ జింతించెదన్. |
110 |
| చ. |
సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీరహృషీకమానస స్ఫురణ గలప్పు డవ్విభుని భూరికళాకలిత స్వరూపముం దర మిడి చూతు; రెప్పుడుఁ గుతర్కతమోహతిచేత నజ్ఞతం బొరసిన యప్పు డవ్విభుని మూర్తిఁ గనుంగొనలేరు నారదా! |
111 |
| వ. | అని వెండియు నిట్లను. ననఘా! య మ్మహనీయతేజోనిధి మొదలి యవతారంబు సహస్రశీర్షాది యుక్తంబయి ప్రకృతి ప్రవర్తకంబగు నాదిపురుష రూపంబగు; నందుఁ గాలస్వభావంబులను శక్తు లుదయించె; నందుఁ గార్యకారణరూపంబయిన ప్రకృతి జనించెఁ; బ్రకృతివలన మహత్తత్త్వంబును, దానివలన నహంకార త్రయంబును బుట్టె; నందు రాజసాహంకారంబువలన నింద్రియంబులును, సాత్త్వికాహంకారంబువలన నింద్రియగుణ ప్రధానంబులైన యధిదేవతలును, తామసాహంకారంబు వలన భూతకారణంబు లయిన శబ్ద స్పర్శరూపరస గంధతన్మాత్రంబులునుం బొడమెఁ; బంచతన్మాత్రంబులవలన గగనానిలవహ్ని సలిలధరాదికంబైన భూతపంచకంబు గలిగె; నందు జ్ఞానేంద్రియంబులయిన త్వక్చక్షుశ్శ్రోత్ర జిహ్వా ఘ్రాణంబులును, గర్మేంద్రియంబులైన వాక్పాణి పాద పాయూపస్థంబులును, మనంబును జనియించె; నన్నింటి సంఘాతంబున విశ్వరూపుండైన విరాట్పురుషుండు పుట్టె; నతని వలన స్వయం ప్రకాశుం డయిన స్వరాట్టు సంభవించె; నందుఁ జరాచరరూపంబుల స్థావరజంగమాత్మకంబయిన జగత్తు గలిగె; నందు సత్త్వరజస్తమో గుణాత్మకుల మయిన విష్ణుండును, హిరణ్యగర్భుండ నయిన యేనును, రుద్రుండును గలిగితి; మందు సృష్టి జననకారణుండయిన చతుర్ముఖుండు పుట్టె; వానివలన దక్షాదులగు ప్రజాపతులు దొమ్మండ్రు గలిగిరి. అందు భవత్ప్రముఖులైన సనకసనందనాది యోగీంద్రులును, నాకలోకనివాసులయిన వాసవాదులును, ఖగలోకపాలకులగు గరుడాదులును, నృలోకపాలకులగు మనుమాంధాతృ ప్రముఖులును, దలలోకపాలకులగు ననంత వాసుకి ప్రభృతులును, గంధర్వ విద్యాధర చారణసాధ్యరక్షో యక్షోరగ నాగలోకపాలురును, మఱియు ఋషులును, బితృదేవతలును, దైత్యదానవ భూతప్రేతపిశాచ కూశ్మాండ పశుమృగాదులును నుద్భవించిరి. ఇట్టి జగత్ప్రథమోద్భవంబు మహత్త్త్త్తత్త్వసృష్టి యనంబడు. ద్వితీయం బండసంస్థితం బనం దగుఁ. దృతీయంబు సర్వభూతస్థం బననొప్పు; నం దైశ్వర్య తేజోబలసంపన్నులైన పురుషులు సర్వాత్ముండైన నారాయణుని యంశసంభవులుగా నెఱుంగుము. అప్పుండరీకాక్షుని లీలావతారంబు లనంతంబులు; దత్కర్మంబులు లెక్కవెట్ట నెవ్వరికి నలవి గాదు. అయినను నాకుం దోఁచినంత నీ కెఱింగించెద వినుము. | 112 |