| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ద్వితీయస్కంధము |
| మ. |
విను మంభోజభవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మాఱు ధ ర్మ నయజ్ఞత్వముతోడ నెంతయుఁ బరామర్శించి మోక్షంబు ద క్కిన మార్గంబున వెంట లేదనుచు భక్తిం జింత సేసెన్ జనా ర్దను నాత్మాకృతి నిర్వికారుఁ డగుచుం దన్మార్గనిర్ణేతయై. |
35 |
| సీ. |
అఖిలభూతములందు నాత్మరూపంబున నీశుండు హరి యుండు నెల్లప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబులఁ గానఁబడును మహత్సేవనీయుఁ డహర్నిశంబు వందనీయుఁడు భక్తవత్సలుం డత్యంతనియతుఁడై సతతంబు నియతబుద్ధి నాత్మరూపకుఁడగు హరికథామృతమును గర్ణపుటంబులఁ గాంక్ష దీరఁ |
|
| తే. |
గ్రోలుచుండెడు ధన్యులు కుటిలబహుళ, విషయ మలినీకృతాంగముల్ వేగ విడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము, కడకుఁ జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర! |
36 |
| క. |
మానుషజన్మము నొందిన, మానవులకు లభ్యమానమరణులకు మహా జ్ఞానులకుఁ జేయవలయు వి, ధానము నిగదింపఁబడియె ధరణీనాథా! |
37 |
| వ. | వినుము. బ్రహ్మవర్చసకాముఁడైన వానికి వేదవిభుండగు చతుర్ముఖుండును, నింద్రియ పాటవకామునకు నింద్రుండును, బ్రజాకామునకు దక్షాది ప్రజాపతులును, భోజనకామునకు నదితియు, స్వర్గకామునకు నాదిత్యులును, రాజ్యకామునకు విశ్వదేవతలును, దేశప్రజా ధనకామునకు సాధ్యులును, శ్రీకామునకు దుర్గయుఁ, దేజస్కామునకు నగ్నియు, వసుకామునకు వసువులును, వీర్యకామునకు వీర్యప్రదులగు రుద్రులును, నాయుష్కామునకు నశ్వినీదేవతలును, బుష్టికామునకు భూమియుఁ, బ్రతిష్ఠా కామునకు లోకమాతలైన గగనభూదేవతలును, సౌందర్యకామునకు గంధర్వులును, గామినీకామునకు నప్సరసయైన యూర్వశియు, సర్వాధిపత్యకామునకు బ్రహ్మయుఁ, గీర్తికామునకు యజ్ఞంబులును, విత్తసంచయకామునకుం బ్రచేతసుండును, విద్యాకామునకు నుమావల్లభుండును, దాంపత్య ప్రీతికామునకు నుమాదేవియు, ధర్మార్థకామునకు నుత్తమశ్లోకుండగు విష్ణువును, సంతానకామునకుఁ బితృదేవతలును, రక్షాకామునకు యక్షులును, బలకామునకు మరుద్గణంబులును, రాజత్వకామునకు మనురూప దేవతలును, శత్రుమరణ కామునకుఁ గోణపాలకుండైన రాక్షసుండును, భోగకామునకుం జంద్రుండును భజనీయు లగుదురు. మఱియును. | 38 |
| క. |
కామింపకయును సర్వముఁ, గామించియునైన ముక్తిఁ గామించి తగన్ లో మించి పరమపురుషుని, నేమించి భజించుఁ దత్త్వనిపుణుం డధిపా! |
39 |
| మ. |
అమరేంద్రాదులఁ గొల్చుభంగి జనుఁ డా యబ్జాక్షు సేవింపఁగా విమలజ్ఞాన విరక్తి ముక్తు లొదవున్ వేయేల? భూనాథ! త త్కమలాధీశ కథాసుధారస నదీకల్లోలమాలా పరి భ్రమ మెవ్వారికినైనఁ గర్ణయుగళీపర్వంబు గాకుండునే? |
40 |
| వ. | అని యిట్లు రాజునకు శుకుండు సెప్పె ననిన విని శౌనకుండు సూతున కిట్లనియె. | 41 |
| క. |
వరతాత్పర్యముతో నిటు, భరతాన్వయవిభుఁడు శుకుని పలుకులు విని స త్వరతాయుతుఁడై శ్రేయ, స్కరతామతి నేమి యడిగె గణుతింపఁగదే! |
42 |
| క. |
ఒప్పెడి హరికథ లెయ్యవి, సెప్పెడినో యనుచు మాకుఁ జిత్తోత్కంఠల్ గుప్పలు గొనుచున్నవి; రుచు, లుప్పతిలన్ నీ మనోహరోక్తులు వినఁగన్. |
43 |
| వ. | అనిన విని సూతుం డిట్లనియె. | 44 |
| క. |
తూలెడి కూఁకటితోడను, బాలురతో నాడుచుండి బాల్యమున మహీ పాలుఁడు హరిచరణార్చన, హేలాలసుఁ డగుచు నుండె నెంతయు నియతిన్. |
45 |
| వ. | అట్టి పరమభాగవతుండైన పాండవేయునకు వాసుదేవపరాయణుండైన శుకుండిట్లనియె. | 46 |
| సీ. |
వాసుదేవ శ్లోకవార్త లాలించుచుఁ గాల మే పుణ్యుండు గడుపుచుండు నతని యాయువుదక్క నన్యుల యాయువు నుదయాస్తమయముల నుగ్రకరుఁడు వంచించి కొనిపోవు, వాఁడది యెఱుఁగక జీవింతుఁ బెక్కేండ్లు సిద్ధ మనుచు నంగనాపుత్త్ర గేహారామ విత్తాది సంసారహేతుకసంగసుఖముఁ |
|
| తే. |
దగిలి వర్తింపఁ గాలంబు తఱి యెఱింగి, దండధరకింకరులు వచ్చి తాడనములు సేసి కొనిపోవఁ బుణ్యంబు సేయ నైతిఁ, బాపరతి నైతి నని బిట్టు పలవరించు. |
47 |
| వ. | అది గావున. | 48 |
| సీ. |
అలరుజొంపములతో నభ్రంకషంబులై బ్రదుకవే వనములఁ బాదపములు! ఖాదన మేహనాకాంక్షలఁ బశువులు జీవింపవే గ్రామసీమలందు! నియతిమై నుచ్ఛ్వాసనిశ్శ్వాసపవనముల్ ప్రాప్తింపవే చర్మభస్త్రికలును! గ్రామసూకర శునకశ్రేణు లింటింటఁ దిరుగవే దుర్యోగదీనవృత్తి! |
|
| తే. |
నుష్ట్రఖరములు మోయవే యురుభరములఁ, బుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు లడవులందు నివాసములందుఁ బ్రాణ, విషయభరయుక్తితో నుంట విఫలమధిప! |
49 |
| సీ. |
విష్ణుకీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కువలయేశ! చక్రిపద్యంబులఁ జదువని జిహ్వలు గప్పల జిహ్వలు కౌరవేంద్ర! శ్రీమనోనాథు నీక్షింపని కన్నులు కేకిపింఛాక్షులు కీర్తిదయిత! కమలాక్షు పూజకుఁగాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన! |
|
| ఆ. |
హరిపద తులసీదళామోద రతి లేని, ముక్కు పందిముక్కు మునిచరిత్ర! గరుడగమను భజనగతి లేని పదములు, పాదపముల పాదపటల మనఘ! |
50 |
| సీ. |
నారాయణుని దివ్యనామాక్షరములపైఁ గరఁగని మనములు కఠినశిలలు మురవైరికథలకు ముదితాశ్రురోమాంచ మిళితమై యుండని మేను మొద్దు చక్రికి మ్రొక్కని జడుని యౌదల నున్న కనకకిరీటంబు గట్టెమోపు మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గచంద్రికావైభవంబు |
|
| ఆ. |
కైటభారిభజన గలిగి యుండనివాఁడు, గాలిలోన నుండి కదలు శవము కమలనాభుపదముఁ గనని వాని బ్రతుకు, పసిఁడికాయలోని ప్రాణి బ్రతుకు. |
51 |
| వ. | అని యిట్లు వలికిన వైయాసి వచనంబుల కౌత్తరేయుండు కందళితహృదయుండై నిర్మలమతి విశేషంబున. | 52 |
| ఆ. |
సుతుల హితుల విడిచి, చుట్టాల విడిచి యి, ల్లాలి విడిచి, బహుబలాళి విడిచి రాజు హృదయ మిడియె రాజీవనయనుపై, ధనము విడిచి, జడ్డుఁదనము విడిచి. |
53 |
| వ. | ఇట్లు మృత్యుభయంబు నిరసించి ధర్మార్థకామంబులు సన్న్యసించి పురుషోత్తమునందుఁ జిత్తంబు విన్యసించి హరిలీలాలక్షణంబు లుపన్యసింపు మను తలంపున నరేంద్రుం డిట్లనియె. | 54 |
| క. |
సర్వాత్ము వాసుదేవుని, సర్వజ్ఞుఁడ వైన నీవు సంస్తుతి సేయన్ సర్వభ్రాంతులు వదలె మ, హోర్వీసురవర్య! మానసోత్సవ మగుచున్. |
55 |
| సీ. |
ఈశుండు హరి విష్ణుఁ డీ విశ్వ మే రీతిఁ బుట్టించుఁ రక్షించుఁ బొలియఁజూచు బహుశక్తియుతుఁడగు భగవంతుఁ డవ్యయుఁ డాది నే శక్తుల నాశ్రయించి బ్రహ్మశక్రాదిరూపముల వినోదించెఁ గ్రమముననో యేకకాలముననొ ప్రకృతిగుణంబులఁబట్టి గ్రహించుట నేకత్వమున నుండు నీశ్వరుండు |
|
| ఆ. |
భిన్నమూర్తి యగుచుఁ బెక్కువిధంబుల, నేల యుండు? నతని కేమి వచ్చె నుండకున్నఁ? దాపసోత్తమ! తెలుపవే!, వేడ్క నాకు సర్వవేది వీవు! |
56 |
| వ. | అనిన న య్యుత్తరానందను వచనంబులకు నిరుత్తరుండు గాక సదుత్తరప్రదాన కుతూహలుండై లోకోత్తరగుణోత్తరుండైన తాపసోత్తముండు దన చిత్తంబున. | 57 |
| మ. |
పరుఁడై, యీశ్వరుఁడై, మహామహిముఁడై, ప్రాదుర్భవస్థాన సం హరణక్రీడనుఁడై, త్రిశక్తియుతుఁడై, యంతర్గతజ్యోతియై, పరమేష్ఠిప్రముఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు స్తరమార్గంబునఁ దేజరిల్లు హరికిం దత్త్వార్థినై మ్రొక్కెదన్. |
58 |
| వ. | మఱియు సజ్జనదురిత సంహారకుండును, దుర్జననివారకుండును, సర్వరూపకుండును, బరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయ కమల కర్ణికా మధ్య ప్రదీపకుండును, సాత్వత శ్రేష్ఠుండును, నిఖిల కల్యాణ గుణ గరిష్ఠుండును, బరమ భక్తియుక్త సులభుండును, భక్తిహీనజన దుర్లభుండును, నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును, నిజస్వరూప బ్రహ్మవిహారుండును నైన య ప్పరమేశ్వరునకు నమస్కరించెద. | 59 |
| ఉ. |
ఏ విభు వందనార్చనము లే విభు చింతయు నామకీర్తనం బే విభులీల లద్భుతము లెప్పుడు సంశ్రవణంబు సేయ దో షావలిఁ బాసి లోకము శుభాయతవృత్తిఁ జెలంగునండ్రు నే నా విభు నాశ్రయించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్. |
60 |
| ఉ. |
ఏ పరమేశు పాదయుగ మెప్పుడు గోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధితో నుభయలోకములందుల జడ్డుఁబాసి, యే తాపము లేక బ్రహ్మగతిఁ దారు గతశ్రములై చరింతు: రే నా పరమేశు మ్రొక్కెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్. |
61 |
| చ. |
తపములఁ జేసియైన, మఱి దానము లెన్నియుఁ జేసియైన, నే జపములఁ జేసియైన, ఫలసంచయ మెవ్వనిఁ జేర్పకున్న హే యపదములై దురంత విపదంచితరీతిగ నొప్పుచుండు న య్యపరమితున్ భజించెద నఘౌఘనివర్తను భద్రకీర్తనున్. |
62 |
| మ. |
యవన వ్యాధ పుళింద హూణ శక కంకాభీర చండాల సం భవులుం దక్కిన పాపవర్తనులు నే భద్రాత్ము సేవించి భా గవతశ్రేష్ఠుల డాసి శుద్ధతనులై కల్యాణులై యుందు రా యవికారుం బ్రభవిష్ణు నాదు మదిలో నశ్రాంతమున్ మ్రొక్కెదన్. |
63 |
| మ. |
తపముల్ సేసిననో, మనోనియతినో, దానవ్రతావృత్తినో జపమంత్రంబులనో, శ్రుతిస్మృతులనో, సద్భక్తినో యెట్లు ల బ్ధపదుండౌనని బ్రహ్మరుద్రముఖరుల్, భావింతు రెవ్వాని న య్యపవర్గాధిపుఁ డాత్మమూర్తి సులభుండౌఁగాక నా కెప్పుడున్. |
64 |
| క. |
శ్రీపతియు యజ్ఞపతియుఁ బ్ర, జాపతియున్ బుద్ధిపతియు జగదధిపతియున్ భూపతియు యాదవశ్రే, ణీ పతియున్ గతియునైన నిపుణు భజింతున్. |
65 |
| మ. |
అణువో కాక కడున్ మహావిభవుఁడో, యచ్ఛిన్నుఁడో, ఛిన్నుఁడో, గుణియో, నిర్గుణుఁడో యటంచు విబుధుల్ గుంఠీభవత్తత్త్వ మా ర్గణులై యే విభు పాదపద్మభజనోత్కర్షంబులం దత్త్వవీ క్షణముం జేసెద రట్టి విష్ణుఁ బరమున్ సర్వాత్ము సేవించెదన్. |
66 |
| మ. |
జగదుత్పాదనబుద్ధి బ్రహ్మకు మదిన్ సంధింప నూహించి యే భగవంతుండు సరస్వతిం బనుప నా పద్మాస్య దా నవ్విభున్ మగనింగా నియమించి తద్భువనసామ్రాజ్యస్థితిన్ సృష్టి పా రగుఁ జేసెన్ మును బ్రహ్మ: నట్టి గుణి నారంభింతు సేవింపఁగన్. |
67 |
| సీ. |
పూర్ణుఁడయ్యును మహాభూత పంచకయోగ, మున మేనులను పురములు సృజించి పురములలో నుండి పురుషభావంబున, దీపించు నెవ్వడు ధీరవృత్తిఁ బంచభూతములను పదునొకం డింద్రియ, ములఁ బ్రకాశింపించి భూరిమహిమ షోడశాత్మకుఁ డన శోభిల్లి జీవత్వ, నృత్తవినోదంబు నెఱపుచుండు |
|
| తే. |
నట్టి భగవంతుఁ డవ్యయుం డచ్యుతుండు, మానసోదిత వాక్పుష్పమాలికలను మంజు నవరస మకరంద మహిమ లుట్ట, శిష్టహృద్భావలీలలఁ జేయుఁగాత! |
68 |
| ఉ. |
మానధనుల్, మహాత్ములు, సమాధినిరూఢులు, యన్ముఖాంబుజ ధ్యానమరందపానమున నాత్మభయంబులఁ బాసి ముక్తులై లూనత నొంద: రట్టి మునిలోక శిఖామణికిన్ విశంకటా జ్ఞానతమో నభోమణికి సాధుజనాగ్రణి కేను మ్రొక్కెదన్. |
69 |
| వ. | అని యిట్లు హరి గురువందనంబు సేసి శుకయోగీంద్రుండు రాజేంద్రున కిట్లనియె. | 70 |
| మ. |
అవిరోధంబున నీవు నన్నడుగు నీ యర్థంబు మున్ బ్రహ్మ మా ధవుచేతన్ విని నారదుం డడిగినం దథ్యంబుగాఁ జెప్పె; మా నవలోకేశ్వర! నారదుండు వెనుకన్ నాకుం బ్రసాదించె; సం శ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహవిచ్ఛేదమున్. |
71 |