| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | ద్వితీయస్కంధము |
| సీ. |
క్షితిపతి! నీ ప్రశ్న సిద్ధంబు మంచిది యాత్మవేత్తలు మెత్తు రఖిలశుభద మాకర్ణనీయంబు లయుతసంఖ్యలు గల వందు ముఖ్యంబిది యఖిలవరము గృహములలోపల గృహమేధులగునరు లాత్మతత్త్వము లేశమైన నెఱుఁగ రంగనారతుల నిద్రాసక్తిఁ జను రాత్రి పోవుఁ గుటుంబార్థబుద్ధి నహము |
|
| ఆ. |
పశుకళత్రపుత్త్రబాంధవ దేహాది, సంఘమెల్లఁ దమకు సత్యమనుచుఁ గాఁపురములుసేసి కడపటఁ జత్తురు, కనియుఁ గాన రంత్యకాలసరణి. |
3 |
| క. |
కావున సర్వాత్మకుఁడు మ, హావిభవుఁడు విష్ణుఁ డీశుఁ డాకర్ణింపన్ సేవింపను వర్ణింపను, భావింపను భావ్యుఁ డభవభాజికి నధిపా! |
4 |
| ఆ. |
జనులకెల్ల శుభము సాంఖ్యయోగము; దాని, వలన ధర్మనిష్ఠవలన నయిన నంత్యకాలమందు హరిచింతసేయుట, పుట్టువులకు ఫలము భూవరేంద్ర! |
5 |
| తే. |
అరసి నిర్గుణబ్రహ్మంబు నాశ్రయించి, విధినిషేధనివృత్తి సద్విమలమతులు సేయుచుందురు హరిగుణచింతనములు, మానసంబుల నేప్రొద్దు మానవేంద్ర! |
6 |
| సీ. |
ద్వైపాయనుఁడు నాదు తండ్రి, ద్వాపరవేళ బ్రహ్మసమ్మితమైనభాగవతముఁ బఠనంబు సేయించె: బ్రహ్మతత్పరుఁడనై యుత్తమశ్లోకలీలోత్సవమున నాకృష్టచిత్తుండనై పఠించితి; నీవు హరిపాద భక్తుఁడవగుటఁజేసి యెఱిఁగింతు వినవయ్య! యీ భాగవతమున విష్ణుసేవాబుద్ధి విస్తరిల్లు: |
|
| ఆ. |
మోక్షకామునకును మోక్షంబు సిద్ధించు, భవభయంబులెల్లఁబాసిపోవు; యోగిసంఘమునకు నుత్తమవ్రతములు, వాసుదేవనామవర్ణనములు. |
7 |
| తరల. |
హరినెఱుంగక యింటిలో బహుహాయనంబులు మత్తుఁడై పొరలుచుండెడి వెఱ్ఱి ముక్తికిఁబోవ నేర్చునె? వాఁడు సం సరణముం బెడఁబాయఁడెన్నఁడు; సత్య మా హరినామ సం స్మరణమొక్క ముహూర్తమాత్రము చాలు ముక్తిదమౌ నృపా! |
8 |
| సీ. |
కౌరవేశ్వర! తొల్లి ఖట్వాంగుఁడనువిభుం డిల నేడుదీవుల నేలుచుండి శక్రాదిదివిజులు సంగ్రామభూముల నుగ్రదానవులకు నోడివచ్చి తమకుఁ దో డడిగిన ధరనుండి దివి కేఁగి దానవవిభులనందఱ వధింప వరమిత్తు మనుచు దేవతలు సంభాషింప “జీవితకాలంబు సెప్పుఁ డిదియ |
|
| ఆ. |
వరము నాకు నొండువర మొల్ల” ననవుడు, “నాయు వొకముహూర్తమంత తడవు, గల” దటంచుఁ బలుక గగనయానమున న, మ్మానవేశ్వరుండు మహికి వచ్చి. |
9 |
| క. |
గిరులంబోలెడి కరులను, హరులం దన ప్రాణదయితలై మనియెడి సుం దరులను, హితవరులను, బుధవరులను వర్జించి గాఢవైరాగ్యమునన్. |
10 |
| క. |
గోవిందనామకీర్తనఁ, గావించి భయంబు దక్కి ఖట్వాంగధరి త్రీవిభుఁడు సూరగొనియెను, గైవల్యముఁ దొల్లి రెండుగడియలలోనన్. |
11 |
| వ. | వినుము. నీకు నేఁడు దివసంబులకుం గాని జీవితాంతంబు గాదు; తావత్కాలంబునకుం బారలౌకిక సాధనభూతంబగు పరమకల్యాణంబు సంపాదింపవచ్చు. నంత్యకాలంబు దగ్గఱినన్ బెగ్గడిలక దేహి దేహపుత్ర కళత్రాది సందోహంబువలని మోహసాలంబు నిష్కామకరవాలంబున నిర్మూలనంబు సేసి గేహంబు వెడలి పుణ్యతీర్థ జలావగాహంబు సేయుచు నేకాంతశుచి ప్రదేశంబున విధివత్ప్రకారంబునం గుశాజినచేలంబుల తోడం గల్పితాసనుండై మానసంబున నిఖిలజగత్పవిత్రీకరణ సమర్థంబై యకారాది త్రివర్ణ కలితంబై బ్రహ్మబీజంబయిన ప్రణవంబు సంస్మరించుచు వాయువుల జయించి విషయంబులవెంట నంటిపాఱెడి యింద్రియంబుల బుద్ధిసారథియై మనోనామకంబులైన పగ్గంబుల బిగ్గఁబట్టి మ్రొగ్గం దిగిచి దట్టంబులైన కర్మఘట్టంబుల నిట్టట్టు మెట్టెడి మనంబును శేముషీబలంబున నిరోధించి భగవదాకారంబు తోడ బంధించి నిర్విషయంబైన మనంబున భగవత్పాదాద్యవయవంబులం గ్రమంబున ధ్యానంబు సేయుచు రజస్తమో గుణంబులచేత నాక్షిప్తంబును విమూఢంబునగు చిత్తంబునం దద్గుణంబులవలన నయ్యెడి మలంబులం ధారణావశంబునం బోనడిచి నిర్మలచిత్తంబునం బరమంబైన విష్ణుపదంబునకుం జను. ధారణానియమంబు గలుగ సుఖాత్మకం బగు విషయంబు నవలోకించు యోగికి భక్తి లక్షణంబైన యోగాశ్రయంబున వేగంబ మోక్షంబు సిద్ధించు ననిన యోగీంద్రునకు నరేంద్రుం డిట్లనియె. | 12 |
| క. |
ధారణ యే క్రియ నిలుచును?, ధారణ కే రూప? మెద్ది ధారణ యనఁగా? ధారణ పురుషు మనోమల, మేరీతి హరించు? నాకు నెఱిఁగింపఁగదే! |
13 |
| వ. | అనిన విని రాజునకు నవధూతవిభుం డిట్లనియె. | 14 |
| ఆ. |
పవనములు జయించి పరిహృతసంగుఁడై, యింద్రియముల గర్వమెల్ల మాపి హరి విశాలరూపమందుఁ జిత్తముఁజేర్చి, నిలుపవలయు బుద్ధినెఱపి బుధుఁడు. |
15 |
| వ. | వినుము.భగవంతుండైన హరివిరాడ్విగ్రహంబునందు భూతభవిష్యద్వర్తమానంబైన విశ్వంబు విలోక్యమానంబగు. ధరణీసలిలతేజస్సమీరణగగనాహంకారమహత్తత్త్వంబు లనియెడి సప్తావరణంబులచేత నావృతంబగు మహాండకోశంబైన శరీరంబునందు ధారణాశ్రయం బయిన వైరాజపురుషుండు దేజరిల్లు, నమ్మహాత్మునికిఁ బాదమూలంబు పాతాళంబు, పార్‌ష్ణిభాగ పాదాగ్రభాగంబులు రసాతలంబు, గుల్ఫంబులు మహాతలంబు, జంఘలు తలాతలంబు, జానుద్వయంబు సుతలం, బూరువులు వితలా తలంబులు, జఘనంబు మహీతలంబు, నాభీవివరంబు నభస్స్థలంబు, వక్షంబు గ్రహతారకాముఖ జ్యోతిస్సమూహసమేతంబగు నక్షత్రలోకంబు, గ్రీవంబు మహర్లోకంబు, ముఖంబు జనలోకంబు, లలాటంబు తపోలోకంబు, శీర్షంబు సత్యలోకంబు, బాహుదండంబు లింద్రాదులు, గర్ణంబులు దిశలు, శ్రవణేంద్రియంబు శబ్దంబు, నాసాపుటంబు లశ్వినీదేవతలు, ఘ్రాణేంద్రియంబు గంధంబు, వదనంబు వహ్ని, నేత్రంబు లంతరిక్షంబు, చక్షురింద్రియంబు సూర్యుండు, రేయింబగళ్లు ఱెప్పలు, భ్రూయుగ్మవిజృంభణంబు బ్రహ్మపదంబు, తాలువులు జలంబు, జిహ్వేంద్రియంబు రసంబు, భాషణంబులు సకలవేదంబులు, దంష్ట్రలు దండధరుండు, దంతంబులు పుత్రాదిస్నేహకళలు, నగవులు జనోన్మాదకరంబు లయిన మాయావిశేషంబులు, కటాక్షంబు లనంతసర్గంబులు, పెదవులు వ్రీడాలోభంబులు, స్తనంబులు ధర్మంబులు, వె న్నధర్మమార్గంబు, మేఢ్రంబు ప్రజాపతి, వృషణంబులు మిత్రావరుణులు, జఠరంబు సముద్రంబులు, శల్యసంఘంబులు గిరులు, నాడీనివహంబులు నదులు, తనూరుహంబులు తరువులు, నిశ్శ్వాసంబులు వాయువులు, ప్రాయంబు నిరవధికం బయిన కాలంబు, కర్మంబులు నానావిధజంతు నివహసంవృత సంసరణంబులు, శిరోజంబులు మేఘంబులు, కట్టుపుట్టంబులు సంధ్యలు, హృదయంబు ప్రధానంబు, సర్వవికారంబులకు నాశ్రయంబైన మనంబు చంద్రుండు, చిత్తంబు మహత్తత్త్వం, బహంకారంబు రుద్రుండు, నఖంబు లశ్వాశ్వత ర్యుష్ట్రగజంబులు, కటిప్రదేశంబు పశుమృగాదులు, విచిత్రంబులైన యాలాప నైపుణ్యంబులు పక్షులు, బుద్ధి మనువు, నివాసంబు పురుషుండు, షడ్జాదు లైన స్వరవిశేషంబులు గంధర్వ విద్యాధర చారణాప్సర స్సమూహంబులు, స్మృతి ప్రహ్లాదుండు, వీర్యంబు దైత్యదానవానీకంబై యుండు, మరియు న మ్మహీవిభునకు ముఖంబు బ్రాహ్మణులును, భుజంబులు క్షత్త్రియులు, నూరులు వైశ్యులును, జరణంబులు శూద్రులును, నామంబులు నానా విధంబులైన వసురుద్రాది దేవతాభిధానంబులును, ద్రవ్యంబులు హవిర్భాగంబులును, కర్మంబులు యజ్ఞ ప్రయోగంబులును నగు, నిట్టి సర్వమయుండైన పరమేశ్వరుని విగ్రహంబు ముముక్షు వైనవాఁడు మనంబున ననుసంధానంబు సేయవలయునని వక్కాణించి వెండియు నిట్లనియె. | 16 |
| క. |
హరిమయము విశ్వ మంతయు, హరి విశ్వమయుండు, సంశయము పని లే దా హరిమయము గాని ద్రవ్యము, పరమాణువు లేదు వంశపావన! వింటే. |
17 |
| సీ. |
కలలోన జీవుండు కౌతూహలంబునఁ బెక్కు దేహంబులఁ బేరు వడసి యింద్రియంబులవెంట నెల్ల వృత్తంబులు నీక్షించి మఱి తన్ను నెఱుఁగుకరణి నఖిలాంతరాత్మకుఁడగు పరమేశ్వరుఁ డఖిలజీవుల హృదయముల నుండి బుద్ధివృత్తుల నెల్ల బోద్ధయై వీక్షించు బద్ధుండు గాఁడు ప్రాభవమువలన |
|
| తే. |
సత్యుఁ డానందబహుళ విజ్ఞానమూర్తి, యతని సేవింప నగుఁగాక, యన్యసేవఁ గలుగనేరవు కైవల్య గౌరవములు, పాయ దెన్నఁడు సంసారబంధ మధిప! |
18 |
| మ. |
బహువర్షంబులు బ్రహ్మ తొల్లి జగముత్పాదింప విన్నాణి గా క హరిప్రార్థన ధారణావశమునం గాదే! యమోఘోల్లస న్మహనీయోజ్జ్వల బుద్ధియై భువననిర్మాణ ప్రభావంబుతో విహరించెన్ నరనాథ! జంతునివహావిర్భావనిర్ణేతయై. |
19 |
| వ. | విను. మూఢుండు శబ్దమయ వేదమార్గంబైన కర్మఫల బోధన ప్రకారంబున వ్యర్థంబులైన స్వర్గాది నానాలోక సుఖంబుల నిచ్చగించుచు మాయామయ మార్గంబున వాసనా మూలంబున నిద్రించువాఁడు గలలు గను తెఱంగునం బరిభ్రమించుచు నిరవద్య సుఖలాభంబుం జెందఁడు; తన్నిమిత్తంబున విద్వాంసుండు నామమాత్ర సారంబులగు భోగ్యంబులలోన నెంత దేహనిర్వహణంబు సిద్ధించు నంతియ కైకొనుచు నప్రమత్తుండై సంసారంబు సుఖం బని నిశ్చయింపక యొండు మార్గంబున సిద్ధి గలదని చూచి పరిభ్రమణంబు సేయుచుండు. | 20 |
| సీ. |
కమనీయ భూమిభాగములు లేకున్నవే! పడియుండుటకు దూదిపఱుపు లేల? సహజంబులగు కరాంజలులు లేకున్నవే! భోజనభాజనపుంజ మేల? వల్కలాజిన కుశావళులు లేకున్నవే! కట్ట దుకూలసంఘంబు లేల? గొనకొని వసియింప గుహలు లేకున్నవే! ప్రాసాదసౌధాదిపటల మేల? |
|
| తే. |
ఫలరసాదులు గురియవే పాదపములు, స్వాదుజలముల నుండవే సకలనదులు పొసఁగ భిక్షము వెట్టరే పుణ్యసతులు, ధనమదాంధుల కొలువేల తాపసులకు? |
21 |
| క. |
రక్షకులు లేనివారల, రక్షించెద ననుచుఁ జక్రి రాజై యుండన్ రక్షింపు మనుచు నొక నరు, నక్షముఁ బ్రార్థింపనేల యాత్మజ్ఞులకున్? |
22 |
| వ. | అని యిట్లు స్వతస్సిద్ధుండును, నాత్మయుఁ, బ్రియుండును, నిత్యుండును, సత్యుండును, భగవంతుండును నైన వాసుదేవుని భజించి తదీయ సేవానుభవానందంబున సంసార హేతువగు నవిద్యవలన బుద్ధిమంతుండు విడువంబడుం గావున. | 23 |
| మ. |
హరిఁ జింతింపక మత్తుఁడై విషయచింతాయత్తుఁడై చిక్కి వా సరముల్ ద్రోసెడువాఁడు కింకరగదా సంతాడితోరస్కుఁడై ధరణీశోత్తమ! దండభృన్నివసన ద్వారోపకంఠోగ్ర వై తరణీవహ్ని శిఖాపరంపరలచే దగ్ధుండు గాకుండునే? |
24 |
| క. |
మొత్తుదురు గదల, మంటల, కెత్తుదు రడ్డంబు, దేహ మింతింతలుగా నొత్తుదు, రసిపుత్త్రికలను, హత్తుదురు కృతాంతభటులు హరివిరహితులన్. |
25 |
| వ. | మఱియు హరి చరణ కమలగంధ రసాస్వాదనం బెఱుంగని వారలు నిజకర్మబంధంబుల దండధర మందిర ద్వార దేహళీ సమీప జాజ్వల్యమాన వైతరణీ తరంగిణీ దహనదారుణ జ్వాలా జాల దందహ్య మానదేహులం గూడి శిఖిశిఖావగాహంబుల నొందుచుండుదురు; మఱియు విజ్ఞానసంపన్నులై మను ప్రపన్నులు మాయాపన్నులు గాక విన్నాణంబునం దమతమ హృదయాంతరాళంబులం బ్రాదేశమాత్ర దివ్యదేహుండును, దిగిభరాజశుండా దండసంకాశదీర్ఘ చతుర్బాహుండును, కందర్పకోటి సమానసుందరుండును, ధృతమందరుండును, రాకావిరాజమాన రాజమండలసన్నిభ వదనుండును, సౌభాగ్యసదనుండును, బ్రభాతకాల భాసమాన భాస్కరబింబ ప్రతిమానవిరాజిత పద్మరాగరత్న రాజీవిరాజమాన కిరీటకుండలుండును, శ్రీవత్సలక్షణ లక్షిత వక్షోమండలుండును. రమణీయ కౌస్తుభరత్నఖచిత కంఠికాలంకృత కంధరుండును, నిరంతర పరిమళమిళిత వనమాలికా బంధురుండును, నానావిధ గంభీర హారకేయూర కటకకంకణ మేఖలాంగుళీయక విభూషణ వ్రాతసముజ్జ్వలుండును. నిటలతట విలంబమాన విమలస్నిగ్ధ నీలకుంచిత కుంతలుండును. తరుణచంద్ర చంద్రికాధవళ మందహాసుండును, బరిపూర్ణ కరుణావలోకన భ్రూభంగ సంసూచిత సుభగ సంతతానుగ్రహ లీలావిలాసుండును, మహాయోగిరాజ వికసిత హృదయకమల కర్ణికామధ్య సంస్థాపిత విలసిత చరణకిసలయుండును, సంతతానందమయుండును, సహస్రకోటి సూర్య సంఘాతసన్నిభుండును, విభుండును నైన పరమేశ్వరుని మనోధారణావశంబున నిలిపికొని తదీయగుల్ఫచరణజాను జంఘాద్యవయవంబులం గ్రమంబున నొక్కొక్కటిని బ్రతిక్షణంబును ధ్యానంబు సేయుచు నెంతకాలంబునకుఁ బరిపూర్ణ నిశ్చలభక్తి యోగంబు సిద్ధించు నంతకాలంబునుం దదీయచింతా తత్పరులై యుండుదురని మఱియు నిట్లనియె. | 26 |
| సీ. |
ఆసన్నమరణార్థియైన యతీశుండు కాలదేశములను గాచికొనఁడు తనువు విసర్జించు తలఁపు జనించిన భద్రాసనస్థుఁడై ప్రాణపవను మనసుచేత జయించి మానసవేగంబు బుద్ధిచే భంగించి బుద్ధిఁదెచ్చి క్షేత్రజ్ఞుతోఁ గూర్చి క్షేత్రజ్ఞు నాత్మలోపలఁ జేర్చి యాత్మను బ్రహ్మమందుఁ |
|
| తే. |
గలిపి యొక్కటి గావించి గారవమున, శాంతితోడ నిరూఢుఁడై సకలకార్య నివహ మెల్లను దిగనాడి నిత్యసుఖము, వలయు నని చూచు నటమీఁద వసుమతీశ! |
27 |
| వ. | వినుము! పరమాత్మయైన బ్రహ్మంబునకుఁ దక్క కాల దేవ సత్త్వరజస్తమో గుణాహంకార మహత్త్తత్త్వ ప్రధానంబులకుఁ బ్రభుత్వంబు లేదు, కావునం బరమాత్మ వ్యతిరిక్తంబు లేదు, దేహాదులయం దాత్మత్వంబు విసర్జించి యన్యసౌహృదంబు మాని పూజ్యం బయిన హరిపదంబుం బ్రతిక్షణంబును హృదయంబున నాలింగనంబు సేసి వైష్ణవంబయిన పరమపదంబు సర్వోత్తమంబని సత్పురుషులు దెలియుదు, రివ్విధంబున విజ్ఞాన దృగ్వీర్యజ్వలనంబున నిర్దగ్ధవిషయవాసనుండై క్రమంబున నిరపేక్షత్వంబున. | 28 |
| సీ. |
అంఘ్రిమూలమున మూలాధారచక్రంబుఁ బీడించి, ప్రాణంబు బిగియఁబట్టి, నాభితలముఁజేర్చి, నయముతో మెల్లన హృత్సరోజముమీఁది కెగయఁబట్టి, యటమీఁద నురమందు హత్తించి, క్రమ్మఱఁ దాలు మూలమునకుఁ దఱిమి నిలిపి, మమతతో భ్రూయుగమధ్యంబు సేర్చి, దృక్కర్ణనాసాస్య మార్గములు మూసి, |
|
| ఆ. |
యిచ్చ లేని యోగి యెలమి ముహూర్తార్ధ, మింద్రియానుషంగ మింత లేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి, బ్రహ్మమందుఁ గలయుఁ బౌరవేంద్ర! |
29 |
| వ. | మఱియు దేహత్యాగకాలంబున నింద్రియంబులతోడి సంగమంబు విడువనివాఁడు వానితోడన గుణసముదాయ రూపంబగు బ్రహ్మాండంబునందు ఖేచరసిద్ధ విహారయోగ్యంబును నణిమాదిక సకలైశ్వర్య సమేతంబును నైన పరమేష్ఠి పదంబుఁ జేరు, విద్యాతపోయోగ సమాధిభజనంబు సేయుచుఁ బవనాంతర్గత లింగశరీరులైన యోగీశ్వరులకు బ్రహ్మాండ బహిరంతరాళంబులు గతి యని చెప్పుదు, రేరికిం గర్మంబుల నట్టి గతిఁ బొంద శక్యంబు గాదు, యోగి యగువాఁడు బ్రహ్మలోకంబునకు నాకాశపథంబునం బోవుచు సుషుమ్నానాడివెంట నగ్ని యను దేవతం జేరి జ్యోతిర్మయంబైన తేజంబున నిర్మలుండై యెందునుం దగులు వడక తారామండలంబుమీఁద సూర్యాది ధ్రువాంతపదంబులఁ గ్రమక్రమంబున నతిక్రమించి హరిసంబంధంబయిన శింశుమార చక్రంబుఁ జేరి యొంటరి యగుచుఁ బరమాణుభూతంబైన లింగ శరీరంబుతోడ బ్రహ్మవిదులకు నెలవైన మహర్లోకంబుఁ జొచ్చి మహాకల్పకాలంబు క్రీడించుఁ; గల్పాంతంబైన ననంతముఖానల జ్వాలా దందహ్యమానంబగు లోకత్రయంబు నీక్షించుచుఁ దన్నిమిత్త సంజాతానల దాహంబు సహింపంజాలక - | 30 |
| సీ. |
ఇలమీఁద మనువు లీరేడ్వురుఁ జనువేళ దివసమై యెచ్చోటఁ దిరుగుచుండు, మహనీయ సిద్ధవిమాన సంఘము లెందు దినకరప్రభములై తేజరిల్లు, శోకజరామృత్యుశోషణ భయదుఃఖ నివహంబు లెందు జనింపకుండు, విష్ణుపదధ్యాన విజ్ఞానరహితుల శోకంబు లెందుండి చూడవచ్చు, |
|
| ఆ. |
పరమసిద్ధయోగి భాషణామృత మెందు, శ్రవణపర్వమగుచు జరుగుచుండు నట్టి బ్రహ్మలోకమందు వసించును, రాజవర్య! మరల రాఁడు వాఁడు. |
31 |
| వ. | మఱియు నొక్క విశేషంబు గలదు. పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతు లైన వారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు, బ్రహ్మాది దేవతాభజనంబునం జనువారు బ్రహ్మజీవిత కాలం బెల్ల బ్రహ్మ లోకంబున వసియించి ముక్తు లగుదురు. నారాయణ చరణకమల భక్తి పరాయణత్వంబునం జనినవారు నిజేచ్ఛావశంబున నిరర్గళ గమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నత వైష్ణవపదారూఢులయి తేజరిల్లుదు, రీశ్వరాధిష్ఠితంబైన ప్రకృతియంశంబున మహత్తత్త్వంబగు, మహత్తత్త్వాంశంబున నహంకారంబగు, నహంకారాంశంబున శబ్దతన్మాత్రంబగు, శబ్దతన్మాత్రాంశంబున గగనంబగు, గగనాంశంబున స్పర్శతన్మాత్రంబగు, స్పర్శతన్మాత్రాంశంబున సమీరణంబగు, సమీరణాంశంబున రూపతన్మాత్రంబగు, రూపతన్మాత్రాంశంబువలనఁ దేజంబగు, తేజో0000ంశంబున రసతన్మాత్రంబగు, రసతన్మాత్రాంశంబువలన జలంబగు, జలాంశంబున గంధతన్మాత్రం బగు, గంధతన్మాత్రాంశంబునఁ బృథివి యగు, వాని మేళనంబునం జతుర్దశ భువనాత్మకంబైన విరాడ్రూపంబగు; నా రూపంబునకుఁ గోటియోజన విశాలంబైన యండకటాహంబు ప్రథమావరణంబైన పృథ్వియగు, దీనిఁ బంచాశత్కోటివిశాలంబని కొందఱు వలుకుదురు, అయ్యావరణంబు మీఁద సలిల తేజస్సమీర గగనాహంకార మహత్తత్త్వంబు లనియెడి యావరణంబులు క్రమంబున నొండొంటికి దశగుణోత్తరాధికంబులై యుండు, నట్టి యేడింటిమీఁదఁ బ్రకృత్యావరణంబు మహావ్యాపకం బగు; బ్రహ్మాండంబు భేదించి వైష్ణవపదారోహణంబు సేయువాఁడు నిర్భయుండై మెల్లన లింగ దేహంబునఁ బృథివ్యాత్మకత్వంబు నొంది యట్టి పృథివ్యాత్మకత్వంబున ఘ్రాణంబున గంధంబును, జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును, దేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును, సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును, గగనాత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును, నతిక్రమించి భూతసూక్ష్మేంద్రియ లయస్థానంబైన యహంకారావరణంబున సంప్రాప్తుండై యందు మనోమయంబును, దేవమయంబునునైన సాత్త్వికాహంకార గమనంబున మహత్త్తత్త్వంబు సొచ్చి, గుణత్రయంబున లయించి, ప్రధానంబు నొంది, ప్రధానాత్మకత్వంబున దేహంబును, నుపాధిపరంపరావసానంబునం బ్రకృతిం బాసి యానందమయుండై యానందంబునం బరమాత్మరూపంబైన వాసుదేవ బ్రహ్మంబునందుఁ గలయునని చెప్పి వెండియు నిట్లనియె. | 32 |
| ఆ. |
పరమభాగవతులు పాటించు పథ మిది, యీ పథమున యోగి యేఁగెనేని మగుడి రాఁడు వాఁడు మఱి సంశయము లేదు, కల్పశతము లైనఁ గౌరవేంద్ర! |
33 |
| వ. | వినుము, నీవడిగిన సద్యోముక్తియుఁ గ్రమముక్తియు ననియెడు నీ రెండు మార్గంబులు వేదగీతలందు వివరింపంబడియె, వీనిం దొల్లి భగవంతుండైన వాసుదేవుండు బ్రహ్మచేత నారాధితుండై చెప్పె, సంసార ప్రవిష్టుండైన వానికిఁ దపోయోగాదు లయిన మోక్షమార్గంబులు పెక్కులు గల, వందు భక్తిమార్గంబుకంటె సులభంబు లేదు. | 34 |