| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| సీ. |
బలిసి దక్షప్రజాపతి తనూభవ దితి సంతానరుచి మానసమునఁబొడమ నొకనాఁడు పుష్పసాయకశరనిర్భిన్న భావయై విరహతాపమున వచ్చి పతి సమాగమవాంఛ ప్రభవింప నిజనాథు సన్నిధి నిలిచి యస్ఖలితనియతి నగ్నిజిహ్వుండును యజురధీశుండును నగు విష్ణుఁదన చిత్తమందు నిలిపి |
|
| తే. |
తగఁబయస్సున నగ్నిహోత్రంబు సేసి, కమలహితుఁ డస్తశైలసంగతుఁడు గాఁగ హోమశాలాంగణమునఁ గూర్చున్న విభునిఁ, గశ్యపునిఁగాంచి వినయవాక్యముల ననియె. |
451 |
| చ. |
గజవిభుఁడుద్ధతి న్ననఁటికంబములన్ విదళించు లీలఁ జి త్తజుఁడు ప్రసూనసాయకవితానముచేత మదీయచిత్తమున్ గజిబిజిసేసి పెన్వగలఁ గాఱియవెట్టఁగ నాథ! నీ పదాం బుజములఁగాన వచ్చితిఁ, బ్రభుత్వ మెలర్పఁగ నన్నుఁగావవే! |
452 |
| వ. | అదియునుం గాక నాతోడి సవతు లెల్లను భవత్కృపా విశేషంబున గర్భాధానంబులు వడసి నిర్భరానందంబున నుండం జూచి శోకవ్యాకులితచిత్త నై యున్న నన్ను రక్షించుట పరమధర్మంబు; నీవు విద్వాంసుండవు; నీ యెఱుంగని యర్థంబు గలదే? నీ వంటి మహానుభావు లయిన సత్పురుషు లార్తులైన వారి కోర్కులు వ్యర్థంబులు గాకుండఁ దీర్చుట ధర్మం బని వెండియు నిట్లనియె. | 453 |
| క. |
పతిసమ్మానము వడసిన, సతులకు నభిమతపదార్థసంసిద్ధియు నూ ర్జితయశముఁగలిగి లోక, స్తుతమై చెలువారుచుండుఁజువ్వె మహాత్మా! |
454 |
| క. |
తన ధర్మపత్నివలనను, మునుకొని తాఁ బుత్త్రరూపమున నుదయించున్ విను దీపమందు ముట్టిం, చిన దీపము రెండు గావె? శిఖి యొకటయ్యున్. |
455 |
| క. |
కావున నీ యర్థమ “యా, త్మా వై పుత్త్ర” యని వేదతతులం దోలిన్ వావిరిఁబలుకఁగ వినవే, ధీవర! ననుఁ గావు మధికదీనం గరుణన్. |
456 |
| చ. |
వరకరుణామతిన్ దుహితృవత్సలతందనరారునట్టి మ ద్గురుఁడొకనాఁడు మమ్ముఁదన కూఁతుల నందఱఁబిల్చి మీ మనో హరు నెఱిఁగింపుఁడిత్తుఁగమలాననలార! య టన్న నందులోఁ బురుషవరేణ్య! యేము పదుమువ్వుర మర్మిలి నిన్ వరింపమే! |
457 |
| క. |
దితి యీ గతిఁ గామవిమో, హితమతి బహువచనముల హృదీశునిఁబలుకన్ ధృతిఁగృపణఁబతివ్రత నిజ, సతిఁగని కశ్యపుఁడు పలికె సల్లాపమునన్. |
458 |
| వ. | నీవు సెప్పినయట్ల పురుషులకు నంగనలవలన ధర్మార్థ కామంబులు సిద్ధించుఁ; గర్ణధారుండు నావచేతం బయోధిఁ గడచు చందంబున గృహమేధి సర్వాశ్రమవాసుల నరసి రక్షించుచు నిజాశ్రమంబున వ్యసనార్ణవంబుఁ దరియించు; భార్య పురుషునందు నర్ధంబు; భార్యయందు సకల గృహకార్య భారంబునుం జేర్చి పురుషుండు నిశ్చింతుండై సుఖియించుచుండు; మఱియు నితరాశ్రమ దుర్జయంబులైన యింద్రియశత్రు వర్గంబుల భార్యాసమేతుండైన గృహస్థుండు దుర్గాధిపతియైన రాజు శత్రుసంఘంబుల జయించు చందంబున లీలామాత్రంబునం జయించు; నిట్టి కళత్రంబునకుం బ్రత్యుపకారంబు సేయ సకల గుణాభిరాములగు సత్పురుషులు నూఱేండ్లకును జన్మాంతరంబులకునైన సమర్థులు గారనిన మముబోఁటివారలు సేయనోపుదురే? అయిన నీ మనంబునం గల దుఃఖంబు దక్కుమని యిట్లనియె. | 459 |
| తే. |
తరళలోచన! నీవు సంతానవాంఛఁ, జేసి వచ్చితి వౌఁ గులశీలవర్త నములు గల భార్య మనమున నమరు కోర్కిఁ, దవిలి తీర్చుట పతికిఁ గర్తవ్య మరయ. |
460 |
| మ. |
తరుణీ! యొక్క ముహూర్తముండు; మిది సంధ్యాకాల మిక్కాలమం దరయన్ భూతగణావృతుండగుచుఁగామారాతి లీలన్ వృషే శ్వరయానంబున సంచరించుట, నభావ్యంబయ్యె; నీ యుగ్ర వే ళ రమింపంగ నిషిద్ధకర్మ మగు; నేలా ధర్మమున్ వీడఁగన్. |
461 |
| మ. |
అరవిందానన! వీఁడె నీ మఱఁది; లీలాటోపరుద్రక్షమా చర ఝంఝానిలధూతపాంసు పటలచ్ఛన్నుండు, ధూమ్రైక దు ర్భరవిద్యోతితకీర్ణ భీషణజటాబద్ధుండు, భస్మావలి ప్తరుచిస్ఫారసువర్ణవర్ణుఁడగుచున్ భాసిల్లు నత్యుగ్రుఁడై. |
462 |
| క. |
అనలసుధాకరరవి లో, చనముల వికసింపఁజేసి సమధికరోషం బునఁజూచుచున్న వాఁడదె, వనితా! బంధుత్వ మరయ వలవదె సుమ్మీ! |
463 |
| క. |
అతనికిఁ దలపోయ హితా, హితులును సన్మాన్యులును విహీనులు నతి గ ర్హితులును లే; రీశుఁడు సమ, మతియును నిఖిలైకభూతమయుఁడై యుంటన్. |
464 |
| క. |
కావున మద్భ్రాత భవ, ద్దేవరుఁడని తరుణి! నీ మదిం జూడకు; మా దేవాదిదేవుఁ ద్రిజగ, త్పావను నిఖిలైకనేత భగవంతు హరున్. |
465 |
| వ. | ఏమును సత్పురుషులైన విజ్ఞానవంతులును భుక్తభోగంబై దూరతోన్యస్తంబైన పుష్పమాలికయుంబోలె న మ్మహాత్ముని చరణారవిందవందనాభిలాషిణియైన యవిద్యాదేవి ననుసరించి వర్తింతుము. అదియునుంగాక. | 466 |
| సీ. |
ఎవ్వని కరుణ బ్రహ్మేంద్రాది దిక్పాలవరు లాత్మపదవైభవములఁ దనరి రెవ్వని యాజ్ఞ వహించి వర్తించును విశ్వనేత్రి యగు నవిద్య యెపుడు నెవ్వని మహిమంబు లిట్టి వట్టివి యని తర్కింపలేవు వేదంబు లయిన నెవ్వని సేవింతు రెల్లవారును సమానాధికరహితుఁడై యలరు నెవ్వఁ |
|
| తే. |
డట్టి దేవునిఁ ద్రిపురసంహారకరుని, నస్థిమాలాధరుండు భిక్షాశనుండు భూతిలిప్తాంగుఁడుగ్రపరేతభూమి, వాసుఁడని హాస్య మొనరించువారు మఱియు. |
467 |
| క. |
ధర శునకభోగ్యమును నిహ, పరదూరము నైన తను వుపాదేయముగా నెఱి నమ్మి వస్త్రమాల్యా, భరణంబు లలంకరించు పామరజనులున్. |
468 |
| క. |
ఘననిర్భాగ్యులుగా మదిఁ, గను మని యీ రీతిఁబ్రియకుఁ గశ్యపుఁడెఱిఁగిం చిన దితి గ్రమ్మఱఁ బలికెను, మనసిజసాయకవిభిన్నమానస యగుచున్. |
469 |
| క. |
మునుకొని లజ్జావనత వ, దనయై ప్రాణేశు కొంగుఁదాలిమి దూలం బెనఁగొనియె వారకామిని, యనువున వినిషిద్ధకర్మమందభిముఖియై. |
470 |
| వ. | ఇట్లు చేసిన భార్యానిర్బంధంబునకుం దొలంగ నేరక యీశ్వరునకు నమస్కారం బొనరించి యేకాంతంబున నిజకాంతా సంగమంబును జేసి విరజంబును సనాతనంబునునైన బ్రహ్మగాయత్త్రి జపియించె నంత. | 471 |
| క. |
దితియును నిషిద్ధకర్మ, స్థితికై మదిలోన సిగ్గు చిట్టాడఁగ నా నతవదన యగుచు నా పశు, పతివలన భయంబు గల్గి పరమప్రీతిన్. |
472 |
| వ. | కశ్యపుం గనుంగొని యిట్లనియె; సమస్త భూతపతియైన పరమేశ్వరుండు నా చేసిన యపరాధంబు సహించి మద్గర్భపరిపాలనంబు సేయుంగాక! రుద్రుండును మహాత్ముండును స్వయంప్రకాశుండును నలంఘ్యుండును సకామజన ఫల ప్రాపకుండును నిష్కామజన మోక్షప్రదుండును న్యస్తదండుండును ధృతదండుండును దుష్ట శిక్షకుండును బరమాత్ముండును జగదంతర్యామియు నిర్గుణుండును నిష్కాముండును భక్తసులభుండును భగవంతుండును నగు న ప్పరమేశ్వరునకు నమస్కరించెద. మఱియు షడ్గుణైశ్వర్య సంపన్నుండును జగద్భర్తయు మహానుగ్రహశీలుండును నిర్ణయ పరిపాల్య వధూరక్షకుండును సతీదేవీపతియు నైన యా సర్వేశ్వరుండు నన్ను రక్షించుంగాత మని సన్నుతించి. | 473 |
| క. |
అర్భకులు లేని దగుటను, గర్భము నిజనాథువలనఁ గమలానన కా విర్భూతమైనఁ గర్మ వి, నిర్భరపరితోష మాత్మ నెలకొని యుండెన్. |
474 |
| వ. | అంతఁగశ్యపుండు దత్కాలసముచితసంధ్యావందనంబులు దీర్చి. | 475 |
| క. |
ఆ చెలికి గర్భచిహ్నము, లేచినఁబరితోష మాత్మ నేపారక మా రీచుండు నిజతలోదరిఁ, జూచి యకర్మమున కాత్మ స్రుక్కుచుఁబలికెన్. |
476 |
| మ. |
సతి! నీ వే గతి నింద కోడక మనోజాతేక్షుకోదండ ని ర్గతనారాచపరంపరాహతవిశీర్ణస్వాంతవై పాపసం గతి లజ్జాభయధర్మముల్ విడిచి దుష్కాలంబునందే రమిం చితి బల్మిన్ వెలయాలికైవడిని దుశ్శీలక్రియాలోలతన్. |
477 |
| వ. | అట్లగుటం జేసి. | 478 |
| క. |
సతి! విను భూతగణ ప్రే, రితులై రుద్రానుచరుల పృథుశక్తిసమ న్వితు లుగ్రకర్ము లతిశౌ, ర్యతములు భద్రానుభద్రు లను నామములన్. |
479 |
| క. |
పరఁగిన దర్పోద్ధతు లి, ద్దఱు కొడుకులు నీకుఁ బుట్టి ధరణికి వ్రేఁగై నిరతము బుధజనపీడా, పరులై వర్తింతు రాత్మబలగర్వమునన్. |
480 |
| తే. |
అట్టి దుష్కర్ములకును మహాత్ము లలిగి, విశ్వవిదుఁడైన హరికిని విన్నవింప నతఁడు కోపించి హరి కులిశాయుధమున, గిరుల నఱకినగతి వారి ధరణిఁ గూల్చు. |
481 |
| క. |
అని కశ్యపుఁ డెఱిఁగించిన, విని దితి భయమంది చాల విహ్వలమతియై తన హృదయేశు ముఖాబ్జముఁ, గనుఁగొని యిట్లనియె విగతకౌతుక యగుచున్. |
482 |
| చ. |
ధర సుజనాపరాధులగు తామసచిత్తుల కెందు నాయువున్ సిరియు నశించిపోవు; మృతి సేకుఱు శత్రులచేత; నింతయౌ నరయఁగ నిక్కువంబు భవదాత్మజు లార్యుల కెగ్గుసేయ భూ సురుల క్రుధాగ్నిపాల్పడక శోభనమౌ హరిచేతి పంచతన్. |
483 |
| చ. |
అనవుడుఁ గశ్యపుండు గమలానన కిట్లను నింతి! నీవు చే సిన విపరీతకర్మమునఁజేకుఱె నిట్టి యవస్థ; దీనికిన్ మనమునఁదాప మొందకుము! మాధవు పాదసరోజయుగ్మచిం తనమునఁ జేసియున్ నను ముదంబునఁగొల్చుటఁజేసియుందగన్. |
484 |
| తే. |
రమణి! నీ సుతులందు హిరణ్యకశిపు, వలన నుదయించు వారిలోపల ముకుంద పదసరోజాతవిన్యస్తభావుఁడైన, తనయుఁడుదయింపఁగలఁడతిధార్మికుండు. |
485 |
| వ. | మఱియును | 486 |
| క. |
ఘనపుణ్యుండన్వయ పా, వనుఁడగు న ప్పుణ్యతముని వరకీర్తిలతల్ వనజభవాండోదర మె, ల్లను నిండఁగఁ బర్వు బుధలలాముండగుటన్. |
487 |
| తే. |
వామలోచన! వినుము దుర్వర్ణ హేమ, మగ్నిపుటమునఁ బరిశుద్ధ మై వెలుంగు నట్లు, దుష్టాత్మసంభవుఁడయ్యు వంశ, పావనుండగు హరిపాదభక్తుఁడగుట. |
488 |
| తే. |
అంచితాష్టాంగయోగ క్రియాకలాపు, లైన యోగీశ్వరులు న మ్మహానుభావు నతులశీలస్వభావవిజ్ఞానసరణిఁ, దాముఁజరియింప నాత్మలఁదలఁతు రెపుడు. |
489 |
| ఉ. |
ఆ మహితాత్మకుండు సుగుణాంబుధి భాగవతోత్తముండు, ల క్ష్మీమహిళాధినాథుఁ దులసీదళదాముఁబరేశు నాత్మహృ త్తామరసంబునందుఁ బ్రమదంబున నిల్పి తదన్యవస్తువుం దా మదిలో హసించు హరిదాస్యవిహారవినిశ్చితాత్ముఁడై. |
490 |
| వ. | అట్టి నీ పౌత్రుండు. | 491 |
| సీ. |
మహితదేహాద్యభిమానంబు దిగనాడి చిరతరాలంపటశీలుఁడగుచుఁ బరసమృద్ధికి నాత్మఁబరితోష మందుచుఁ బరదుఃఖమునకుఁ దాపమును బొందు నీ విశ్వమంతయు నే విభుమయ మని యెవ్వని కరుణచే నెఱుఁగనయ్యె నట్టి యీశ్వరునిఁ దా నాత్మసాక్షిగ మోద మడరంగఁజూచు ననన్యదృష్టి |
|
| తే. |
నతినిదాఘోగ్రసమయంబునందు నిఖిల, జంతుసంతాప మడఁగించు చంద్రుమాడ్కి నఖిలజగముల దుఃఖంబు లపనయించు, రూఢి నాతఁ డజాతవిరోధి యగుచు. |
492 |
| వ. | మఱియు హరిధ్యాననిష్ఠాగరిష్ఠుండగు న మ్మహాభాగవతాగ్రగణ్యుండు. | 493 |
| క. |
విమలాంతరంగబహిరం, గములను స్వేచ్ఛానురూపకలితుండగు నా కమలాధీశ్వరు కుండల, రమణీయముఖంబుఁజూచుఁబ్రమదంబెసఁగన్. |
494 |
| తే. |
మఱియు నీ విశ్వ మా హరిమయము గాఁగ, మనములోపలఁదలఁచు నమ్మనునిభుండు మనుమహాత్ములలోన నీ మనుమఁ డధికుఁ, డనఁగ నుతికెక్కు నంచుఁ గశ్యపుఁడు పలుక. |
495 |
| క. |
విని తన తనయులు మధుసూ, దనుచే హతు లగుదు రనుచుఁ దన మనుమఁడు స జ్జననుతభాగవతుండగు, ననుచు మదింజాల దుఃఖహర్షము లొదవన్. |
496 |
| వ. | ఉండునంత నా దితియుఁ గశ్యపవీర్య సంభృతంబైన గర్భంబు దుర్భర తేజోభిరామంబును నన్యతేజో విరామంబును దినదినప్రవర్ధమానంబును నై నివ్వటిల్ల నిజోదరస్థితులైన కుమారు లమరదమనులై వర్తింపఁగల రని చింతించుచు గర్భంబు శతవర్షంబులు ధరియించి యున్న యనంతరంబ. | 497 |
| ఉ. |
ఆ దితిగర్భమందు రుచిరాకృతితో నొకతేజ మన్య తే జో దమలీల వెల్వడి వసుంధరయున్ గగనంబు నిండి సం ఛాదితపద్మబాంధవనిశాకరదీప్తులు గల్గి సూచికా భేదమహోగ్రసంతమసభీషణమైన భయాకులాత్ములై. |
498 |
| చ. |
అమరగణంబు లెల్లఁ గమలాసనుపాలికి నేగి తత్పదా బ్జములకు మ్రొక్కి యంజలులు ఫాలములం గదియంగఁజేర్చి చి త్తముల భయంబు సంభ్రమముఁ దార్కొన నిట్లని విన్నవించి రో యమరకులాగ్రగణ్య! దురితార్ణవతారణ! సృష్టికారణా! |
499 |
| ఉ. |
నీవు చరాచరప్రచయనేతవు ధాతవు సర్వలోకపా లావళి మౌళిభూషణుఁడ వంచితమూర్తివి దేవదేవ! వా ణీవర! యీ యజాండమున నీవు నెఱుంగని యర్థ మున్నదే భావమునం దలంపుము విపన్నుల మమ్ము భవత్ప్రపన్నులన్. |
500 |
| వ. | “దేవా! కార్యరూపంబగు చేతనాచేతనాత్మక ప్రపంచంబునకుఁ గారణుండవైన నీచేత సమస్త భువనంబులును సృజియింపఁబడియె, నీవు సర్వ భూతాత్మభావవిదుండవు, లోకనాథశిఖామణి భూతుండవు, విజ్ఞానవీర్యుండ, వవిద్యంజేసి యిట్టి స్రష్టృ రూపంబు నొందితి, గృహీతరజోగుణుండవు, నీయందుఁ బ్రపంచంబు లీనంబై యుండు, సుపక్వయోగంబు నొంది నిష్కాములై ధ్యానంబున నిన్నరయుచు నిర్జితశ్వాసేంద్రియాత్ములై భవత్ప్రసాదంబు వడసిన వారలకుం బరాభవంబు లెక్కడివి? ఎవ్వని వాగ్జాలంబులచేఁ బాశబద్ధంబులైన పశువుల చందంబున నిఖిల జీవులు వర్తింతు రట్టి నీకు నమస్కరించెద, మహోరాత్ర విభాగాభావంబున లుప్తకర్మంబులగు లోకంబులకు సేమంబు గావింపుము, శరణాగతులమైన మమ్ము నతిశయకరుణారస పరిపూర్ణంబులగు కటాక్షంబుల వీక్షించి రక్షింపుము. కశ్యపు వీర్యంబు దితి గర్భంబుననుండి సకల దిగ్వలయంబు నాక్రమించి దారువందు వహ్ని చందంబున లీనంబై ప్రవృద్ధం బగుచున్న” దని విన్నవించిన బృందారక సందోహంబులకు నానందంబు గందళింప నరవిందనందనుం డిట్లనియె. | 501 |