| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | తృతీయస్కంధము |
| వ. | అట్టి యజ్ఞపోత్రిమూర్తింజూచి కమలాసనప్రముఖు లిట్లని స్తుతియించిరి. | 422 |
| సీ. |
“దేవ! జితం జితం తే పరమేశ్వర! జితయజ్ఞభావన! శ్రుతిశరీర!” యనుచుఁ గారణసూకరాకారుఁడగు నీకు నతిభక్తి మ్రొక్కెదమయ్య వరద! భవదీయరోమకూపములందు లీనంబు లై యుండు నంబుధు లట్టి యధ్వ రాత్మకమై తనరారు నీ రూపంబు గానంగరాదు దుష్కర్మపరుల |
|
| తే. |
కట్టి నీకుఁబ్రణామంబు లాచరింతు, మఖిలజగదేకకీర్తి! దయానువర్తి! భవ్యచారిత్ర! పంకజపత్రనేత్ర!, చిరశుభాకార! యిందిరాచిత్తచోర! |
423 |
| వ. | అని వెండియు నిట్లు స్తుతియించిరి. | 424 |
| సీ. |
త్వక్కున నఖిలవేదములు, రోమంబులయందును బర్హిస్సు, లక్షులందు నాజ్యంబు, పాదంబులందుఁ జాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును, స్రుక్కు తుండంబున, స్రువము నాసికను, నిడాపాత్ర ముదరకోటరమునందు, శ్రవణాస్యబిలములఁజమసప్రాశిత్రముల్, గళమున నిష్టిత్రికంబు, జిహ్వఁ |
|
| తే. |
దగుఁబ్రవర్గ్యము, నగ్నిహోత్రమును నీదు, చర్వణంబును, సభ్యావసథ్యు లుత్త మాంగ మసువులు చయనము లగుఁ గిటీశ! యనుచు నుతియించి రత్తఱి యజ్ఞవిభుని. |
425 |
| వ. | వెండియు ముహుర్ముహు ర్భగవదావిర్భావంబు దీక్షణీయేష్టి యగు. నీదు దంష్ట్రలు ప్రాయణీయంబను దీక్షానంతరేష్టియు, నుదయనీయంబను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు ప్రాతస్సవనాదులు, నీదు త్వఙ్మాంసాది సప్తధాతువు లగ్నిష్టోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబు లను సంస్థాభేదంబులును ద్వాదశాహాదిరూపంబులైన బహు యాగ సంఘాతరూపంబులు నగు; సర్వ సత్త్రంబులు భవదీయశరీర సంధులు; ససోమాసోమంబులగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును నీవు యజనబంధనంబులచే నొప్పుచుందు వదియునుం గాక. | 426 |
| క. |
హవరూపివి! హవనేతవు!, హవభోక్తవు! నిఖిలహవఫలాధారుఁడవున్! హవరక్షకుఁడవు నగు నీ కవితథముగ నుతు లొనర్తుమయ్య ముకుందా! |
427 |
| తే. |
సత్త్వగుణమున సద్భక్తి సంభవించు, భక్తియుతముగఁ జిత్తంబు భవ్య మగును హృదయపద్మంబునందోలి నెఱుఁగఁబడిన, యట్టి నీకు నమస్కారమయ్య వరద! |
428 |
| మ. |
అరవిందోదర! తావకీనసితదంష్ట్రాగ్రావలగ్నక్షమా ధరనద్యబ్ధినదాటవీయుతసమిద్ధక్ష్మాతలంబొప్పె భా సురకాసారజలావతీర్ణమదవచ్ఛుండాలరాడ్దంత శే ఖరసంసక్త సపత్రపంకజము రేఖంబొల్పు దీపింపఁగన్. |
429 |
| మ. | మఱియును. | 430 |
| మ. |
చతురామ్నాయవపుర్విశేషధర! చంచత్సూకరాకార! నీ సితదంష్ట్రాగ్ర విలగ్నమైన ధర రాజిల్లెం గులాద్రీంద్ర రా జితశృంగోపరిలగ్నమేఘముగతిం జెల్వారి, విద్వజ్జనాం చితహృత్పల్వలలోల! భూరమణ! లక్ష్మీనాథ! దేవోత్తమా! |
431 |
| సీ. |
సమధికస్థావరజంగమాత్మకమైన వసుమతీచక్ర మవక్రలీల నుద్ధరింపుము; కరుణోపేతచిత్తుండ వగుచు నస్మన్మాత యయ్యె ధరణి; మాతయౌ టెట్లని మదిఁదలంచెదవేనిఁ జర్చింప మాకు విశ్వమున కీవు జనకుండ వగుట యుష్మత్పత్ని భూదేవి యగుట మాకును దల్లి యయ్యె; నిపుడు |
|
| తే. |
ధరకు నీతోడఁగూడ వందన మొనర్తు, మరణియందును యాజ్ఞికుఁ డగ్ని నిలుపు కరణి మీ తేజ మీ ధరాకాంతయందు, నిలుప ధరణి పవిత్రయై నెగడుఁ గాన. |
432 |
| చ. |
తలఁప రసాతలాంతరగతక్షితిఁగ్రమ్మఱ నిల్పినట్టి నీ కలితన మెన్న విస్మయము గాదు; సమస్తజగత్తు లోలిమైఁ గలుఁగఁగఁ జేయు టద్భుతము గాక, మహోన్నతి నీ వొనర్చు పెం పలరిన కార్యముల్ నడప నన్యులకుం దరమే రమేశ్వరా? |
433 |
| చ. |
సకలజగన్నియామకవిచక్షణలీలఁ దనర్చునట్టి నం దకధర! తావకస్ఫురదుదారత మంత్రసమర్థుఁడైన యా జ్ఞికుఁడరణిన్ హుతాశనుని నిల్పిన కైవడి మన్నివాస మౌ టకుఁదలపోసి యీ క్షితి దృఢంబుగ నిల్పితివయ్య యీశ్వరా! |
434 |
| చ. |
సలలితవేదశాస్త్రమయసౌకరమూర్తిఁ దనర్చుచున్ రసా తలముననుండి వెల్వడు నుదారత మేను విదుర్పఁ దత్సటో చ్చలితములైన బిందువుల సాధుతపోజనసత్యలోకవా సులమగు మేము దోఁగి పరిశుద్ధి వహించితిమయ్య మాధవా! |
435 |
| ఉ. |
విశ్వభవస్థితిప్రళయవేళలయం దవికారసత్త్వమున్ విశ్వము నీవ యీ నిఖిలవిశ్వము లోలి సృజింతు విందిరా ధీశ్వర! యీశ! కేశవ! త్రయీమయ! దివ్యశరీర! దేవ! నీ శాశ్వతలీల లిట్టి వని సన్నుతి సేయఁగ మాకు శక్యమే? |
436 |
| సీ. |
పంకజోదర నీ వపారకర్ముండవు భవదీయకర్మాబ్ధిపార మేద నెఱిఁగెద నని మది నిచ్చగించిన వాఁడు పరికింపఁగా మతిభ్రష్టు గాక విజ్ఞానియే? చూడ విశ్వంబు నీ యోగ మాయాపయోనిధి మగ్న మౌటఁ దెలిసియుఁ దమ బుద్ధిఁ దెలియని మూఢుల నేమన నఖిలలోకేశ్వరేశ! |
|
| తే. |
దాసజనకోటి కతిసౌఖ్యదాయకములు, వితతకరుణాసుధాతరంగితములైన నీ కటాక్షేక్షణములచే నెఱయ మమ్ముఁ, జూచి సుఖులను జేయవే సుభగచరిత! |
437 |
| క. |
అని బ్రహ్మవాదు లగు స, న్మునివర్యులు భక్తియోగమున వినమితులై మనమున మోదము ముప్పిరి, గొనఁ బొగడిరి ఖురవిదళితగోత్రిం బోత్రిన్. |
438 |
| ఉ. |
అంతట లీలఁబోలె జగదాత్ముఁడు యజ్ఞవరాహమూర్తి య త్యంతగభీరభీషణమహార్ణవతోయసమూహమున్ ఖురా క్రాంతముఁజేసి క్రమ్మఱ ధరాతల మంబులమీఁద నిల్పి వి శ్రాంతి వహింపఁజేసి గుణశాలి తిరోహితుఁడయ్యె నయ్యెడన్. |
439 |
| ఉ. |
మంగళమైన యీ కథ సమంచితభక్తిఁబఠింప విన్నవా రింగరుణార్ద్రదృష్టిఁగని శ్రీహరి సాలఁబ్రసన్నుఁడౌను, స త్సంగతుఁడైన విష్ణుఁడు ప్రసన్నుఁడు దా నగునేని వారికిన్ మంగళముల్ లభించు; ననుమానము లే దదిగాక వెండియున్. |
440 |
| చ. |
హరి నిజదాసకోటికి గుహాశయుఁడై రమియించు; నట్టి స త్పురుషుల కిష్టవస్తుపరిపూర్ణమనోరథసిద్ధి గల్గు; సు స్థిర మగుచున్న మోక్ష మఱచేతిదియై చెలువారు నన్న న స్థిరతరతుచ్ఛసౌఖ్యములు సేకుఱుటల్ మఱి చెప్ప నేటికిన్. |
441 |
| ఉ. |
కాన సరోజలోచను జగత్‌స్తవనీయకథాసుధారసం బానిన యట్టి జిహ్వ యసదన్యకథాలవణోదకంబులం బానము సేయఁజూచునె; సుపర్వమహీజమరందపాన లా భానుభవంబు నొందు మధుపప్రభు వేగునె వేఁపచెట్లకున్? |
442 |
| క. |
అని మైత్రేయ మునీంద్రుం, డనఘుఁడు విదురునకుఁ జెప్పినట్టి తెఱం గ ర్జున పౌత్త్రునకున్ వ్యాసుని, తనయుఁడు వినిపించి మఱియుఁ దగ నిట్లనియెన్. |
443 |
| క. |
అని చెప్పిన మైత్రేయునిఁ, గనుఁగొని విదురుండు పల్కు ఘనతరమగు నా దనుజకులాంతకు చరితము, విని తనియదు నా మనంబు విమలచరిత్రా! |
444 |
| చ. |
సవనవరాహమూర్తి కథ సర్వము నీ దయ వింటి; వెండియున్ వివరముగా వినంబలుకవే గుణసాంద్ర! మునీంద్రచంద్ర! మా ధవగుణకీర్తనామృతవితానముఁ గర్ణపుటాంజలిన్ వెసం జవిఁగొన కేల మాను జనసంతతికిన్ భవతాపవేదనల్. |
445 |
| వ. | కావున | 446 |
| సీ. |
శ్రీహరి యజ్ఞవరాహరూపముఁ దాల్చి మించి హిరణ్యాక్షుఁద్రుంచె ననుచు నప్పుడు మునినాథ! చెప్పితి నాతోడ న వ్వరాహంబు దంష్ట్రాగ్రమునను ధరణి నెబ్భంగిని ధరియించె? హరికి హిరణ్యాక్షుతోడ వైరమున కేమి కారణ? మసుర నే గతి సంహరించెఁదా? నింతయు నెఱిఁగింపు మిద్ధచరిత! |
|
| తే. |
యనిన మైత్రేయముని విదురునకు ననియె, హరికథాకర్ణనమునఁబెంపారు నీకు జన్మఫలసిద్ధి యగుటకు సందియంబు, వలదు; హరిమాయ విధికైన వశమె తెలియ? |
447 |
| క. |
అనఘాత్మ! నన్ను నీ వడి, గిన యీ కథ ధ్రువుఁడు విష్ణుకీర్తనపరతం దనరిన నారదు నడుగ న, తని కతఁడెఱిఁగింప హరికథాశ్రవణమునన్. |
448 |
| తే. |
దండధరుఁబెల్చ డాకాలఁ దన్ని ధ్రువుఁడు, నిందు నందును వాసికి నెక్కె; నట్టి విష్ణుసంకీర్తనంబరవిందభవుఁడు, దివిజులకుఁ జెప్పె నది నీకుఁదేటపఱుతు. |
449 |
| వ. | ఆకర్ణింపుము. | 450 |