పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము తృతీయస్కంధము
శ్రీ యజ్ఞ వరాహావతార వర్ణనము
సీ. అఖిలజగత్కల్పనాటోపమునకుఁ బాల్పడిన నాచేత నె బ్భంగి నిపుడు
దగిలి విశ్వంభరోద్ధరణంబు గావింప నగు నని సర్వభూతాంతరాత్ముఁ
బురుషోత్తముని నవపుండరీకాక్షు లక్ష్మీపతిఁ దన మనస్స్థితునిఁ జేసి
తలపోయుచున్నఁబద్మజు నాసికా వివరమ్మున యజ్ఞవరాహమూర్తి
 
తే. యర్థి నంగుష్ఠమాత్రదేహంబుతోడ, జననమంది వియత్తలస్థాయి యగుచు
క్షణములోపల భూరి గజప్రమాణ, మయ్యె నచ్చటి జనముల కద్భుతముగ.
407
సీ. అంతఁబ్రజాసర్గమందు నియుక్తులై నట్టి మరీచ్యాదులైన మునులు
మనుకుమారకులు న మ్మనుసహితంబుగ యజ్ఞవరాహంబు నర్థిఁ జూచి
“యిట్టి యాశ్చర్య మిట్లెందేనిఁ గలదె నాసారంధ్ర నిర్గత స్తబ్ధరోమ
తోకంబు మనము విలోకింప నంగుష్ఠ మాత్రమై యా క్షణమాత్రలోన
 
తే. మహిమ దీపింప దంతి ప్రమాణమును మ, హోన్నంతబైన గండశైలోపమంబు
నయ్యె” ననుచు వితర్కించి; రబ్జభవుఁడు, హర్ష మిగురొత్త నిట్లని యపుడు దలఁచె.
408
క. నా మనమునఁగల దుఃఖ వి, రామముఁగావించుకొఱకు రాజీవాక్షుం
డీ మేర “యజ్ఞపోత్రి, శ్రీమూర్తి” వహించె నిది విచిత్రము దలఁపన్‌.
409
వ. అని వితర్కించు సమయంబున సూకరాకారుండయిన భగవంతుండు. 410
తే. ప్రళయజీమూతసంఘాత భయదభూరి, గర్జనాటోపభిన్నదిగ్ఘనగభీర
రావ మడరింప నపుడు రాజీవభవుఁడు, మునులు నానందమును బొంది రనఘచరిత!
411
వ. అంత మాయామయవరాహ ఘుర్ఘురారావంబు బ్రహ్మాండకోటర పరిస్ఫోటనంబుఁగావింప విని జనస్తపస్సత్య లోక నివాసులయిన మునులు ఋగ్యజుస్సామ మంత్రంబుల వినుతించిరి; యజ్ఞవరాహరూప ధరుండయిన సర్వేశ్వరుండు సత్పురుష పాలన దయాపరుండు గావున దిగ్గజేంద్రలీలావిలోలుండై. 412
సీ. కఠినసటాచ్ఛటోత్కటజాతవాత నిర్ధూత జీమూతసంఘాతమగుచు
క్షురనిభ సునిశితఖురపుటాహతచలత్ఫణిరాజ దిగ్గజప్రచయ మగుచుఁ
జండదంష్ట్రోత్థ వైశ్వానరార్చిస్స్రవద్రజత హేమాద్రివిస్రంభమగుచు
ఘోరగంభీరఘుర్ఘురభూరి నిస్వనపంకిలాఖిలవార్ధిసంకులముగఁ
 
తే. బొరలుఁ గెరలు నటించు నంబరము దెరల, రొప్పు నుప్పర మెగయును గొప్పరించు
ముట్టె బిగియించు ముసముస మూరుకొనుచు, నడరు సంరక్షితక్షోణి యజ్ఞఘోణి.
413
వ. మఱియు న య్యజ్ఞవరాహంబు. 414
సీ. తివిరి చతుర్దశభువనంబులను దొంతు లొరగఁ గొమ్ములఁజిమ్ము నొక్కమాటు
పుత్తడికొండ మూఁపురమను నొరగంట నొరకు రారాపాడు నొక్కమాటు
ఖురముల సప్తసాగరముల రొంపిగా నుక్కించి మట్టాడు నొక్కమాటు
నాభీలవాలవాతాహతిచే మింటి నొరసి బ్రద్దలు సేయు నొక్కమాటు
 
తే. కన్నుఁగొనలను విస్ఫులింగములు సెదర, నురుభయంకరగతిఁ దోఁచు నొక్కమాటు
పరమయోగీంద్రజనసేవ్య భవ్యవిభవ, యోగ్యమై కానఁగా నగు నొక్కమాటు.
415
వ. ఇట్లు విహరించుచుఁ బ్రాతర్మధ్యందినతృతీయ సవనరూపుండయిన యజ్ఞవరాహమూర్తి యగు సర్వేశ్వరుండు మహాప్రళయంబునందు యోగ నిద్రావశుండై యుండు నవసరంబున నుదకస్థంబైన భూమి రసాతల గతంబైన దాని నుద్ధరించుటకు సముద్రోదరంబుఁ దఱియం జొచ్చు వేగంబు సైరింపఁజాలక సముద్రుం డూర్ములను భుజంబు లెత్తి విశీర్ణ హృదయుండై యార్తుని పగిది “యజ్ఞవరాహ! నన్ను రక్షింపు, రక్షింపు” మని యాక్రోశింప నిశిత కరాళక్షుర తీక్ష్ణంబులైనఖురాగ్రంబుల జలంబులు విచ్ఛిన్నంబులు గావించి యపారంబయిన రసాతలంబుం బ్రవేశించి భూమింబొడగను నవసరంబున. 416
క. శరనిధిలోని మహోగ్రా, మరకంటకుఁ డెదురఁ గాంచె మఖమయగాత్రిన్‌
ఖురవిదళితకులగోత్రిన్‌, ధరణి కళత్రిన్‌ గవేష ధాత్రిన్‌ పోత్రిన్‌.
417
వ. ఇట్లు పొడగని దైత్యుండు రోషభీషణాకారుండై. 418
మ. గద సారించి యసహ్యవిక్రమసమగ్రస్ఫూర్తితో వ్రేయఁగా
నది దప్పించి వరాహమూర్తి నిజదంష్ట్రాగ్రాహతిం ద్రుంచెఁ బెం
పొదవంగ్రోధమదాతిరేకబలశౌర్యోదారవిస్తార సం
పదఁ బంచాస్యము సామజేంద్రుఁజలమొప్పంద్రుంచు చందంబునన్‌.
419
మ. దితిజాధీశుని నీ గతిందునిమి యుద్వృత్తిందదీయాంగ శో
ణిత పంకాంకితగండభాగుఁడగుచు న్విష్ణుండు దా నొప్పె వి
స్తృత సంధ్యాంబుదధాతుచిత్రితసముద్దీప్తక్షమాభృద్గతిన్‌
క్షితి దంష్ట్రాగ్రమునన్‌ ధరించి జలరాశింబాసి యేతేరఁగన్‌.
420
తే. బాలశీతాంశురేఖా విభాసమాన, ధవళదంష్ట్రాగ్రమున నున్న ధరణి యొప్పె
హరికి నిత్యానపాయిని యైన లక్ష్మి, నెరయఁబూసిన కస్తూరినికర మనఁగ.
421
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - tRutIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )