పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము తృతీయస్కంధము
కర్దముఁడు భగవదనుజ్ఞ వడసి దేవహూతిని బెండ్లియాడుట
క. విను మనఘ!, కృతయుగంబున, మునినాథుండయిన కర్దముఁడు ప్రజల సృజిం
పను వనజసంభవునిచే, త నియుక్తుండగుచు మది ముదము సంధిల్లన్‌.
746
తే. ధీరగుణుఁడు సరస్వతీతీరమందుఁ, దవిలి పదివేలదివ్యవత్సరము లోలిఁ
దపము సేయుచు నొకనాఁడు జపసమాధి, నుండి యేకాగ్రచిత్తుఁడై నిండు వేడ్క.
747
క. వరదుఁ బ్రసన్నుమనోరథ, వరదానసుశీలు నమరవంద్యు రమేశున్‌
దురితవిదూరు సుదర్శన, కరుఁ బూజించిన నతండు కరుణాకరుఁడై.
748
వ. అంతరిక్షంబునం బ్రత్యక్షంబైన. 749
సీ. తరణిసుధాకరకిరణసమంచితసరసీరుహోత్పలస్రగ్విలాసుఁ
గంకణనూపురగ్రైవేయముద్రికాహారకుండలకిరీటాభిరాముఁ
గమనీయసాగరకన్యకాకౌస్తుభ మణిభూషణోద్భాసమానవక్షు
సలలితదరహాసచంద్రికాధవళిత చారుదర్పణవిరాజత్కపోలు
 
తే. శంఖచక్రగదాపద్మచారుహస్తు, నలికులాలకరుచి భాస్వదలికఫలకుఁ
బీతకౌశేయవాసుఁ గృపాతరంగి, త స్మితేక్షణుఁ బంకజోదరుని హరిని.
750
వ. మఱియు శబ్దబ్రహ్మ శరీరవంతుండును, సదాత్మకుండును, జ్ఞానైక వేద్యుండును, వైనతేయాంస విన్యస్త చరణారవిందుండును నయిన గోవిందునిఁ గనుంగొని సంజాత హర్ష లహరీ పరవశుండును, లబ్ధమనోరథుండును నగుచు సాష్టాంగదండప్రణామంబు లాచరించి తదనంతరంబ. 751
క. ముకుళితకరకమలుండయి, యకుటిలసద్భక్తిపరవశాత్మకుఁ డగుచున్‌
వికచాంభోరుహలోచను, నకు నిట్లనియెం దదాననముఁ గనుఁగొనుచున్‌.
752
సీ. అబ్జాక్ష! సకలభూతాంతరాత్ముఁడ వనఁ దనరుచుండెడి నీదు దర్శనంబుఁ
దలకొని సుకృతసత్ఫలభరితంబు లైనట్టి యనేకజన్మానుసరణి
ప్రకటయోగక్రియాభ్యాసనిరూఢు లైనట్టి యోగీశ్వరు లాత్మఁగోరి
యెంతురు యోగీశ్వరేశ్వర! యే భవత్పాదారవిందసందర్శనంబుఁ
 
తే. గంటి, భవవార్ధిఁ గడవంగఁ గంటి మంటిఁ, గడఁగి నా లోచనంబుల కలిమి నేఁడు
దవిలి సఫలత నొందె మాధవ! ముకుంద! చిరదయాకార! నిత్యలక్ష్మీవిహార!
753
వ. అదియునుం గాక దేవా,! భవదీయ మాయావిమోహితులై హతమేధస్కులై సంసార పారావారోత్తారకంబులైన భవదీయ పాదారవిందంబులు దుచ్ఛవృత్తికాములయి సేవించి నిరయగతులైన వారికిం దత్కామ యోగ్యంబు లగు మనోరథంబుల నిత్తు, వట్టి సకాము లైనవారి నిందించు నేనును గృహమేధధేనువు నశేష మూలమును ద్రివర్గకారణమును సమాన శీలయు నయిన భార్యం బరిణయంబుగా నపేక్షించి కల్పతరుమూల సదృశంబులైన భవదీయ పాదారవిందంబులు సేవించితి, నయిన నొక్క విశేషంబు గలదు, విన్నవించెద నవధరింపుము, బ్రహ్మాత్మకుండ వయిన నీదు వచస్తంతు నిబద్ధులై లోకులు కామహతులైరఁట, యేనును వారల ననుసరించినవాఁడ. కాలాత్మకుండవైన నీకు నభిమతం బగునట్లుగాఁ గర్మ మయంబైన భవదాజ్ఞా చక్రంబు ననుసరించుటకుఁగాని మదీయ కామంబు కొఱకుఁగాదు. భవదీయ మాయావినిర్మితంబును, గాలాత్మక భూరివేగ సమాయుక్తంబును, నక్షరంబును నైన బ్రహ్మంబునందు భ్రమణశీలంబును, నధిమాససమేత త్రయోదశ మాసారంబును, షష్ట్యుత్తర శతత్రయాహోరాత్రమయ పర్వంబును, ఋతుషట్క సమాకలిత నేమియుం, జాతుర్మాస్యత్రయ విరాజిత నాభియు, నపరిమిత క్షణలవాది పరికల్పిత పత్రశోభితంబునుం, గాలాత్మక భూరివేగ సమాయుక్తంబును నైన కాలచక్రంబు సకల జీవనికరాయుర్గ్రసనతత్పరం బగుం గాని కామాభిభూత జనానుగత పశుప్రాయులగు లోకుల విడిచి భవపరితాప నివారణ కారణం బయిన భవదీయ చరణాతపత్రచ్ఛాయా సమాశ్రయులై, తావకీన గుణకథన సుధాస్వాదన రుచిరలహరీ నిరసిత సకల దేహధర్ములైన భగవద్భక్త జనాయుర్హరణసమర్థంబు గాకుండు నని వెండియు. 754
మ. అనఘా! యొక్కఁడవయ్యు నాత్మకృతమాయాజాతసత్త్వాది శ
క్తి నికాయస్థితి నీ జగజ్జననవృద్ధిక్షోభహేతుప్రభా
వ నిరూఢిందగు దూర్ణనాభిగతి విశ్వస్తుత్య! సర్వేశ! నీ
ఘనలీలామహిమార్ణవంబు గడవంగా వచ్చునే యేరికిన్‌?
755
వ. దేవా! శబ్దాది విషయ సుఖకరంబగు రూపంబు విస్తరింపఁ జేయుటెల్ల నస్మదనుగ్రహార్థంబు గాని నీ కొఱకుం గా, దాత్మీయ మాయా పరివర్తితలోక తంత్రంబు గలిగి మదీయ మనోరథ సుధాప్రవర్షివైన నీకు నమస్కరించెద. 756
మ. అని యిబ్భంగి నుతించినన్‌ విని సరోజాక్షుండు మోదంబునన్‌
వినతానందనకంధరోపరిచరద్విభ్రాజమానాంగుఁడై
యనురాగస్మితచంద్రికాకలితశోభాలోకుఁడై య మ్మునీం
ద్రునిఁ గారుణ్య మెలర్పఁజూచి పలికెన్‌ రోచిష్ణుఁడై వ్రేల్మిడిన్‌.
757
క. మునివర! యే కోరిక నీ, మనమునఁ గామించి నను సమంచితభక్తిన్‌
నెనరునఁ బూజించితి? నీ, కనయము నా కోర్కి సఫల మయ్యెడుఁ జుమ్మీ!
758
వ. అని యానతిచ్చి ప్రజాపతి పుత్త్రుండును, సమ్రాట్టును నైన స్వాయంభువ మనువు బ్రహ్మావర్త దేశంబునందు సప్తార్ణవ మేఖలామండిత మహీమండలంబుఁ బరిపాలించుచున్నవాఁ, డమ్మహాత్ముం డపరదివసంబున నిందులకు శతరూపయను భార్యా సమేతుండై భర్తృకామ యగు కూతుం దోడ్కొని భవదీయ సన్నిధికిం జనుదెంచి నీకు ననురూప వయశ్శీల సంకల్ప గుణాకరయైన తన పుత్రిం బరిణయంబు గావించు, భవదీయ మనోరథంబు సిద్ధించు, ననుం జిత్తంబున సంస్మరించుచుండు, నమ్మనుకన్యక నిను వరించి భవద్వీర్యంబువలన నతి సౌందర్యవతు లయిన కన్యలం దొమ్మండ్రం గను, నా కన్యకా నవకంబునందు మునీంద్రులు పుత్త్రోత్పాదనంబులు సేయం గలరు, నీవు మదీయశాసనంబును ధరియించి మదర్పితాశేషకర్ముండ వగుచు నైకాంతిక స్వాంతంబున భూతాభయ దాన దయాచరితజ్ఞానివై నాయందు జగంబులు గల వనియు, నీ యందు నేఁ గల ననియు నెఱింగి సేవింపుము, చరమకాలంబున ననుం బొందఁ గలవు, భవదీయ వీర్యంబువలన నేను నీ భార్యా గర్భంబునఁ బ్రవేశించి మత్కళాంశంబున బుత్త్రుండనై సంభవించి నీకుం దత్త్వసంహిత నుపన్యసింతు నని జనార్దనుండు కర్దమున కెఱింగించి యతండు గనుంగొనుచుండ నంతర్హితుండై. 759
చ. అతులసరస్వతీసరిదుదంచితబాలరసాలసాల శో
భితతటతుంగరంగమగు బిందుసరంబు వినిర్గమించి యం
చిత గరుడాధిరోహణము సేసి తదీయగరుత్ప్రభూత రు
క్ప్రతతివిలక్షణక్రమవిరాజితసామము వించు మోదియై.
760
చ. అరిగె వికుంఠధామమున కంత సకామనుఁడైన కర్దముం
డరయ విమోహియై మనమునందును ముందట వచ్చు కోరికల్‌
పిరిగొనుచుండఁదత్‌క్షణమ బిందుసరంబున కేగి యిందిరా
వరుఁదలపోయుచుండె జనవంద్యుఁడు భక్తినితాంతచిత్తుఁడై.
761
వ. అంత స్వాయంభువుండు గనకరథారూఢుం డగుచు నిజభార్యా సమేతుండై భర్తృవాంఛాపరయైన పుత్త్రికం దోడ్కొనుచు నిజతనూజకుం దగిన వరు నన్వేషించుచు భువనంబులు గలయం గ్రుమ్మరి యెందునుం గానక వచ్చి వచ్చి. 762
ఉ. ముందటఁ గాంచె నంత బుధముఖ్యుఁడు విష్ణుఁడు గర్దమున్‌ దయా
నంద మెలర్పఁజూడ నయనంబుల రాలిన బాష్పముల్‌ ధరన్‌
బిందువులై వెసందొరఁగి పేర్చి సరస్వతిఁజుట్టి పాఱుటన్‌
బిందుసరోవరంబనెడి పేరఁ దనర్చిన పుణ్యతీర్థమున్‌.
763
ఉ. అందుఁ దమాల సాలవకుళార్జుననింబకదంబపాటలీ
చందననారికేళఘనసారశిరీషలవంగలుంగమా
కందకుచందనక్రముకకాంచనబిల్వకపిత్థమల్లికా
కుందమధూకమంజులనికుంజములందనరారి వెండియున్‌.
764
క. పరిపక్వఫలభరానత, తరుశాఖానికరనివసితస్ఫుటవిహగో
త్కరబహుకోలాహలరవ, భరితదిగంతములు గలిగి భవ్యం బగుచున్‌.
765
క. అతినిశితచంచుదళన, క్షతనిర్గతపక్వఫలరసాస్వాదన మో
దిత రాజశుకవచోఽర్థ, శ్రుతిఘోషము సెలఁగె శ్రవణ సుఖదం బగుచున్‌.
766
క. లలితసహకారపల్లవ, కలితాస్వాదనకషాయకంఠవిరాజ
త్కలకంఠపంచమస్వర, కలనాదము లుల్లసిల్లఁ గడు రమ్యములై.
767
క. అతులతమాలమహీజ, ప్రతతీక్షణజాతజలదపరిశంకాంగీ
కృతతాండవఖేలనవిల, సితపింఛవిభాసమానశిఖిసేవ్యంబై.
768
క. కారండవ జలకుక్కుట, సారసబకచక్రవాకషట్పదహంసాం
భోరుహ కైరవ నవ క, ల్హారవిరాజితసరోరుహాకరయుతమై.
769
క. కరిపుండరీకవృక కా, సరశశభల్లూకహరిణచమరీహరి సూ
కరఖడ్గగవయవలిముఖ, శరభప్రముఖోగ్రవన్యసత్త్వాశ్రయమై.
770
వ. ఒప్పు నప్పరమతాపసోత్తముని యాశ్రమంబుంగనుంగొని మితపరిజనంబులతోడంజొచ్చి యందు. 771
సీ. అంచితబ్రహ్మచర్యవ్రతయోగ్యమై విలసిల్లు ఘనతపోవృత్తిచేత
దేహంబు రుచిరసందీప్తమై చెలువొందఁ గడుఁ గృశీభూతాత్మకాయుఁడయ్యు
నలినోదరాలాపనవసుధాపూరంబు శ్రోత్రాంజలులఁ ద్రావి చొక్కియున్న
కతనఁ గృశీభూతకాయుండు గాక జటావల్కలాజినశ్రీ వెలుంగఁ
 
తే. గమలపత్రవిశాలనేత్రములు దనర, నలి నసంస్కారసంచితానర్ఘ్యనూత్న
రత్నమును బోలియున్న కర్దమునిఁ జూచి, భక్తి మ్రొక్కెను మనువు తత్పాదములకు.
772
వ. ఇట్లు వందనంబు గావించినం గర్దముండు దన గృహంబునకు విందై చనుదెంచిన య మ్మనువు నాదరించి యర్ఘ్య పాద్యాది విధులం బరితుష్టునిం గావించి పూర్వోక్తంబైన భగవదాదేశంబు సంస్మరించి స్వాయంభువున కిట్లనియె. 773
సీ. వరగుణాకర! భగవద్భక్తియుక్తుండ వైన త్వదీయపర్యటన మెల్ల
శిష్టపరిగ్రహదుష్టనిగ్రహముల కొఱకుఁ గదా పుణ్యపురుష! మఱియు
వనజహితాహితవహ్నిసమీరవైవస్వతవార్ధిపవాసవాత్మ
కుఁడవు హరిస్వరూపుఁడ వైన నీకును మానితభక్తి నమస్కరింతు
 
తే. ననఘ! నీ విప్పుడే నేమి యఖిలలోక, జైత్రమగు హేమమణిమయస్యందనంబు
నెక్కి కోదండపాణివై యిద్ధసైన్య, పదవిఘట్టనచే భూమిభాగ మగల.
774
మ. తరణింబోలి చరింపకున్న ఘననిద్రంబొంది యెందేని భూ
వర! పద్మోదరకల్పితంబులగు నీ వర్ణాశ్రమోదార వి
స్తరపాథోనిధి సేతుభూతమహిమాచారక్రియల్‌ దప్పి సం
కరమై చోరభయంబునన్‌ నిఖిలలోకంబుల్‌ నశించుంజుమీ!
775
వ. అని పలికి భవదాగమనంబునకు నిమిత్తం బెయ్యది? యనవుడు సమాహిత నిత్యకర్మానుష్ఠానుండైన మునీంద్రునకు స్వాయంభువుం డిట్లనియె. 776
క. సరసిజగర్భుఁడు దనచే, విరచిత మైనట్టి వేదవితతుల నెల్లన్‌
ధర వెలయించుటకై బుధ, వర! మిమ్ముందన ముఖంబువలన సృజించెన్‌.
777
క. దురితస్వరూపపాట, చ్చరపీడంబొందకుండ సకలక్షోణిం
బరిపాలించుటకై మము, నరవిందభవుండు భుజములందు సృజించెన్‌.
778
క. నెఱి నట్టి జలజభవునకుఁ, గర మంతఃకరణగాత్రకములై వరుసం
బఱఁగిన బ్రహ్మక్షత్త్రము, లరయ రమాధీశ్వరునకు నవనీయంబుల్‌.
779
వ. కావున హరిస్వరూపుండవై దుర్జనదుర్దర్శనుండ వయిన నినుం గనుట మదీయ భాగ్యంబున సిద్ధించె, భవత్పాదకంజ కింజల్క పుంజ రంజితంబైన మదీయ మస్తకంబును దావక వచనసుధా పూరితంబులైన శ్రవణంబులును మంగళకరత్వంబున సాఫల్యంబునం బొందె, నేను గృతార్థుండ నయితి దుహితృ స్నేహజదుఃఖ పరిక్లిన్నాంతఃకరణుండనై సకల దేశ పరిభ్రమణ ఖిన్నుండ నయిన నా విన్నపంబవధరింపు మని యిట్లనియె. 780
మ. వరయోగీశ్వర! దేవహూతి యను నీ వామాక్షి మత్పుత్త్రి, దా
వరలావణ్యగుణాఢ్యులన్‌ వినియు నెవ్వారిన్‌ మదింగోర, కా
తురయై నారదుపంపునన్‌ మిము వరింతు న్నంచు నేతెంచె, నీ
తరుణీభిక్షఁ బరిగ్రహింపుము శుభోదాత్తక్రియాలోలతన్‌.
781
క. అమలినగృహమేధిక క, ర్మములకు ననురూపగుణవిరాజితశీల
క్రమములఁ దనరిన తరుణిం, బ్రమదమున వరింపుమయ్య భవ్యచరిత్రా!
782
క. అనఘ! విరక్తులకైనం, దనయంత లభించు సౌఖ్యతతి వర్జింపం
జనదఁట, కాముకులకు న, బ్బిన మానుదురే లభించు ప్రియసౌఖ్యంబుల్‌.
783
క. వినుము, ఫలారంభుఁడు గృప, ణుని నడిగినఁ దనయశంబునుందగు మానం
బును జెడుఁ గావునఁ దగ నీ, వెనయ వివాహేచ్ఛఁ దగులు టెఱిఁగి యిచటికిన్‌.
784
క. చనుదెంచితి, యస్మత్ప్రా, ర్థనఁ గైకొని మత్తనూజఁదగ వరియింపుం
డని ముని స్వాయంభువునిం, గనుఁగొని మరలంగఁ బలికెఁ గడుమోదమునన్‌.
785
సీ. అనఘ! నీ చేత ననన్యదత్తముగఁ బ్రతిష్ఠితంబైన యీ తీవఁబోఁడి
కమనీయరూపరేఖావిలాసంబుల మానితలక్ష్మీసమానయగుచు
నొకనాఁటి రాత్రియందుడురాజచంద్రికాధవళితనిజసౌధతలమునందు
మహితహిరణ్మయమంజీరశోభితచరణయై నిజసఖీసహిత యగుచుఁ
 
తే. గందుకక్రీడఁజరియింపఁ గగనమందు, వర విమానస్థుఁ డగుచు విశ్వావసుండు
నాఁగఁ దనరిన గంధర్వనాయకుండు, తరుణిఁ జూచి విమోహియై ధరణిఁ బడియె.
786
తే. పుండరీకాక్షు నెఱుఁగని పురుషపశువు, లీ తలోదరిఁ బొడగాన రేమి సెప్ప?
నట్టి కొమరాలు భాగ్యోదయమునఁ దాన, వచ్చి కామింప నొల్లనివాఁడు గలఁడె?
787
క. ఈ కన్యారత్నమునకు, నాకును గుణరూపవర్తనంబులయెడ నా
లోకింప సమమ కావునఁ, గైకొని వరియింతు విగతకల్మషవృత్తిన్‌.
788
క. విమలాత్మ! దీని కొక సమ, యము గల దెఱిఁగింతు విను గుణాకర యగు నీ
రమణికి నపత్యపర్యం, తము వర్తింపుదు గృహస్థధర్మక్రియలన్‌.
789
ఆ. అంతమీఁద విష్ణు నాజ్ఞ యౌఁదలఁ దాల్చి, శమదమాది యోగసరణిఁ బొంది
సన్న్యసించువాఁడ జలజనేత్రుని వాక్య, కారణమునఁజేసి ధీరచరిత!
790
క. శ్రీవిభునివలన నీ లో, కావళి యుదయించుఁ బెరుఁగు నడఁగును విను రా
జీవభవాదుల కతఁడే, భూవర! నిర్మాణహేతుభూతుం డరయన్‌.
791
వ. అది గావున న మ్మహాత్ముని యాజ్ఞోల్లంఘనంబు సేయరాదని కర్దముండు వలికిన విని స్వాయంభువుండు నిజభార్యయైన శతరూప తలంపును బుత్త్రియైన దేవహూతి చిత్తంబును నెఱింగినవాఁడై ముని సమయంబున కియ్యకొని ప్రహృష్ట హృదయుం డగుచు సమంచిత గుణగణాఢ్యుం డయిన కర్దమునకు దేవహూతిని విధ్యుక్తప్రకారంబున వివాహంబు సేయించెఁ, దదనంతరంబ శతరూపయును బారిబర్హ సంజ్ఞికంబులైన వివాహోచిత దివ్యాంబరాభరణంబులు దేవహూతి కర్దముల కొసంగె, నవ్విధంబున నిజకులాచార సరణిం బరిణయంబు గావించి విగత చింతాభరుండై స్వాయంభువుండు దుహితృ వియోగ వ్యాకులిత స్వాంతుండై కూఁతుం గౌఁగిలించుకొని, చుబుకంబుఁ బుడుకుచుఁ, జెక్కిలి ముద్దుగొని, శిరంబు మూర్కొని, ప్రేమాతిరేకంబున బాష్పధారాసిక్తమస్తకంజేసి తల్లీ! పోయి వచ్చెద నని చెప్పి కర్దమునిచేత నామంత్రితుండై నిజభార్యా సమేతంబుగ రథం బెక్కి సపరివారుండై. 792
చ. తరళతరంగవీచిసముదంచితబిందుసరస్సరస్వతీ
సరిదరవిందతుందిలలసత్తరుతీరనివాససన్మునీ
శ్వరనికరాశ్రమాకలితసంపదలం గనుఁగొంచు వేడ్క ము
ప్పిరిఁగొన నేఁగె నాత్మపుటభేదనవిస్ఫుటమార్గవర్తియై.
793
వ. ఇట్లు సని చని బ్రహ్మావర్తదేశంబునందు. 794
సీ. ఎందేనిఁదొల్లి లక్ష్మీశుండు యజ్ఞసూకరమూర్తిఁగైకొని సరభసముగ
నొడలు జాడించినఁబుడమిపై రాలిన రోమజాలంబులు రుచిరహరిత
వర్ణమై పొలుపార వరకుశకాశమయంబును యజ్ఞక్రియాకలాప
యోగ్యంబునై చాల నొప్పారి బర్హిస్సు సంభవించిన దాన సకలఋషులుఁ
 
తే. గ్రతువు లొనరించి తద్విఘ్నకారులైన, యసురులను ద్రుంచి రట్ల స్వాయంభువుండు
విష్ణుపరముగ మఖము గావించి రుచిర, మేధ సెలువొంది నట్టి యాత్మీయపురము.
795
క. డాయంజనఁ బురజనము లు, పాయనములు దెచ్చి యిచ్చి బహుగతుల నతుల్‌
సేయఁగ మంగళతూర్యము, లాయతగతి మ్రోయఁజొచ్చె నంతఃపురమున్‌.
796
వ. ఇట్లు ప్రవేశించి తాపత్రయోపశమనం బగు భగవద్భక్తి వృద్ధిఁ బొందించుచుఁ బుత్త్రమిత్ర సుహృద్బాంధవ సహితుండై పరమానందంబున. 797
మ. అతిభక్తింబ్రతివాసరంబును హరివ్యాసంగుఁడై మాధవాం
కితగంధర్వవిపంచికాకలితసంగీతప్రబంధానుమో
దితుఁడై యిష్టవిభూతులందు ననురక్తింబొంద కే ప్రొద్దు న
చ్యుతసేవైకపరాయణుండగుచు నస్తోకప్రభావోన్నతిన్‌.
798
మ. హరిపాదాంబురుహద్వయార్పితతులస్యామోదముంగొంచుఁ ద
చ్చరితంబుల్‌ దలపోయుచుం బొగడుచుం జర్చించుచున్‌ వించుఁ ద
త్పరిచర్యావ్యతిరిక్తసంసరణసద్ధర్మార్థకామంబులం
బరిభూతంబులు సేసి మోక్షపదసంప్రాప్తిక్రియారంభుఁడై.
799
క. నిగమార్థగోచరుండనఁ, దగు హరిచరితప్రసంగతత్పరచిత్తుం
డగు నతనికి స్వాంతరగము, లగు యామము లొగి నయాతయామము లయ్యెన్‌.
800
సీ. వెండియు నమ్మేటి విష్ణుమంగళ కథా కర్ణన ధ్యానానుగాన నుతులు
సలుపుచుఁ స్వస్వప్న జాగ్రత్సుషుప్తులఁ దలఁగించి యీ పుణ్యతముఁడు దాను
జక్రిదాసుఁడు గాన శారీర మానస దివ్యమానుష భౌతిక వ్యథలను
దగులక సన్మునీంద్రశ్రేణికిం దగఁ, దనరు వర్ణాశ్రమ ధర్మగతులు
 
తే. దప్పకుండంగ నడుపుచుఁ దగిలి సర్వ, భూతహితవృత్తి నతులవిఖ్యాతలీల
నేకసప్తతియుగము లస్తోకచరితుఁ, డగుచు వర్తించె సమ్మోద మతిశయిల్ల.
801
క. అని య మ్మనుచరితము విదు, రున కమ్మైత్రేయమునివరుఁడు దయతోడన్‌
వినిపించి కర్దముని కథ, దనరఁగ నెఱిఁగింతు నని ముదంబునఁ బలికెన్‌.
802
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - tRutIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )