పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము తృతీయస్కంధము
కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతోఁగూడి విహరించుట
వ. ఇట్లు స్వాయంభువుండు దేవహూతిం గర్దమునికి వివాహంబుసేసి మరలి చనినం దదనంతరంబ దేవహూతియుఁ బతిభక్తి గలిగి భవునికి భవాని పరిచర్య సేయు తెఱంగునఁ బతియ తనకు నేడుగడయుంగా నెఱింగి య మ్మునీంద్రుని చిత్తవృత్తికొలఁది దినదినంబునకు భక్తి తాత్పర్య స్నేహంబులు రెట్టింపం బ్రియ శుశ్రూషణంబులు గావించుచు ననూనతేజోవిరాజిత యగుచుఁ గామ క్రోధ దంభ లోభాది గుణవిరహితయై శరీరశుద్ధి వహించి చతుర సౌహార్ద స్నేహంబులు గలిగి పతియ దైవంబుగా భావించి మృదు మధుర వచన రచనయై పతిభక్తి యేమఱక వర్తింప దైవయోగంబు నైననుం దప్పింప సమర్థుండైన కర్దముండు నిజసేవాయాస కృశీభూతదేహయై యున్న దేవహూతిం గరుణాతరంగితాపాంగుండై కనుంగొని మంజుభాషణంబుల నిట్లనియె. 803
ఉ. మానితధర్మమార్గమహిమస్ఫుటభూరితపస్సమాధి వి
ద్యానిభృతాత్మయోగసముపార్జితవిష్ణుకటాక్షలబ్ధ శో
భానఘదివ్యభోగబహుభద్రవితానము లస్మదీయ సే
వానిరతిన్‌ లభించు ననివారణ నిత్తును దివ్యదృష్టియున్‌.
804
తే. నెలఁత! తద్దివ్యదృష్టి నన్నియును నీకుఁ, గానవచ్చు, విలోకింపు, కమలపత్ర
నయను బొమముడి మాత్రాన నాశమందు, నితరమగు తుచ్ఛభోగంబు లేమి సెప్ప.
805
సీ. అనుపమరాజ్యదర్పాంధచేతస్కులై పాపవర్తనులైన పార్థివులకు
ధృతిఁబొందరాని యీ దివ్యభోగంబులు నీదు పాతివ్రత్యనిష్ఠఁజేసి
సంప్రాప్తములు నయ్యె, సమత భోగింపుము కార్యసిద్ధియు నగుఁగాక నీకు
ననుటయు నతివయు ననుపమయోగ మాయావిచక్షణశాలియైన కర్ద
 
తే. మునిఁ గనుంగొని విగతాధియును నపాంగ, కలితలజ్జానతాస్యపంకజయు నగుచు
వినయసౌహార్దములఁజేసి విహ్వలంబు, లయిన పలుకులఁ బతికి నిట్లనియెఁ బ్రీతి.
806
వ. అనఘా!, యమోఘ యోగమాయా విభుండవు, సమర్థుండవు నయిన నీయందు నీ యనుపమ దివ్యభోగంబులు గలుగుట నిక్కం బని యెఱుంగుదు, భవత్సంగతి నన్నియు నాకుం గలుగు, నయినను దేవా! నీ వానతిచ్చిన సంతాన పర్యంతంబైన శరీర సంగమ సమయంబు చిత్తంబునం దలంచి భవదంగ సంగమంబుఁ గృపసేసి మన్నింపుము, భవదీయ సంయోగవాంఛా పరతం గృశీభూతం బయిన యీ దేహం బే విధంబున మజ్జన భోజన పాన సుఖంబులం బరితుష్టిం బొందు నట్టి మన్మనోరథంబుఁ దీర్ప రతి రహస్య ప్రకాశకంబగు కామశాస్త్ర ప్రకారం బుపశిక్షించి యందులకు నుచితంబు లయిన వివిధాంబరాభరణ మాల్యానులేపన మందిరారామ ప్రముఖ నిఖిల వస్తువిస్తారంబు గావించి నన్నుం గరుణింపు మనిన న మ్మహాత్ముండు నిజయోగమాయా బలంబునం దత్క్షణంబ 807
సీ. దివ్యమణిస్తంభదీప్తిఁ జెన్నొందుచు మరకతస్థలముల మహిమ దనర
వరవజ్రకుడ్యకవాటశోభితములై విద్రుమదేహళీవీథు లమరఁ
గొమరొప్ప నవశాతకుంభకుంభములపై, హరినీలశకలవిస్ఫురణ మెఱయఁ
దగఁ బద్మరాగంపు మొగడలఁ జెలువొందు వైదూర్యవలభులు వన్నెఁజూపఁ
 
తే. దరళతరధూతకేతుపతాక లొలయ, మంజుశింజత్సమంచితమధుపకలిత
సురుచిరాలంబమానప్రసూనరాజి, మాలికల నొప్పు వివిధగృహాళిఁ దనరి.
808
క. మఱియును దుకూలచీనాం, బర కౌశేయాదివివిధపట పరివృత మం
దిర సుభగాకారంబై, యరుదార విచిత్రపట్టికాలంకృతమై.
809
మ. లలితోద్యానవనాంతసంచరణలీలాలోలహంసాళి కో
కిలపారావతచక్రవాకశుకకేకివ్యూహ మంచత్సము
త్కలికంగృత్రిమపక్షులన్‌ నిజవిహంగశ్రేణి యంచుం గుతూ
హలియై పల్కుచు నాడుచుండుఁ బ్రతిశాఖారోహణ వ్యాప్తులన్‌.
810
వ. వెండియు. 811
క. ఘనసౌంధాంతరశయ్యా, సనకేళీగేహకృతకజగతీధరశో
భన చంద్రకాంతచారు భ, వన ఫలభరితావనీజవంతము నగుచున్‌.
812
క. సకలర్తుశోభితంబును, సకలశుభావహము సకలసంపత్కరమున్‌
సకలోపభోగయోగ్యము, సకలేప్సితకామదంబు సదలంకృతమున్‌.
813
వ. అగుచు నొప్పు దివ్యవిమానంబుఁ గల్పించి తదీయ సుషమా విశేషచిత్రంబులు నిర్మించిన తానునుం దెలియం జాలని యద్భుత కర్మంబయిన విమానంబు దేవహూతికిం జూపినం జూచి య మ్ముద్దియ సంతసింపకుండుట యెఱింగి సర్వభూతాంతరాశయాభిజ్ఞుండును, సంతుష్టాంత రంగుండును నైన కర్దముం డిట్లనియె. 814
తే. అతివ, భగవత్కృతంబును నఖిల మంగ, ళాకరంబును నగు నీ జలాశయమునఁ
దవిలి గ్రుంకిన జంతువితానములకుఁ, గామ్యఫలసిద్ధి సేకుఱుఁగాన నీవు.
815
క. ఇజ్జలముల నతిభక్తి ని, మజ్జన మొనరించి యీ విమానము వేడ్కన్‌
లజ్జావతి! యెక్కవె యని, బుజ్జవ మొనరంగఁ గర్దముఁడు వల్కుటయున్‌.
816
వ. విని యా కువలయాక్షి పతిసేవాయాస మలినాంబరయు, వేణీ భూతశిరోజయు, ధూళి ధూసరితాతి కృశీభూతాంగియు, శబల స్తనయునై భర్తృ నియోగంబున సరస్వతీ సలిల సంభూత జలచరాశ్రయం బగు బిందుసరోవరంబుఁ బ్రవేశించి తజ్జలంబులఁ గ్రుంకులిడు సమయంబునఁ దద్వాఃపూర మధ్యంబున రుచిర సూక్ష్మాంశుక ధారిణులుఁ, గిశోరవయః పరిపాకశోభితలు, నుత్పల గంధులు నగు కన్యాసహస్రంబులు దేవహూతిం గనుంగొని యిట్లనిరి. 817
క. తరుణీ! సంచితధర్మా, చరణల మగు మేము నీకు సదమలభక్తిం
బరిచర్య సేయనేర్తుము, కరుణాకలితేక్షణములఁ గనుఁగొను మమ్మున్‌.
818
సీ. అని పల్కి డాసి యయ్యతివకు నభ్యంజ నోద్వర్తనములు పెంపొనరఁ జేసి
మలయజకర్పూరమహితవాసిత హేమకలశోదకంబుల జలకమార్చి
ధవళవస్త్రంబులఁ దడియొత్తి సర్వాంగ ధూపంబులొసఁగి కస్తూరి యలఁది
మంజుశింజన్మణిమంజీర కింకిణీ కలరావకలితమేఖలలు రత్న
 
తే. ఖచితతాటంకముద్రికాకంకణాది, సముచితానర్ఘహేమభూషణము లొసఁగి
భవ్యమాల్యానులేపనాంబరము లిచ్చి, షడ్రసోపేతవివిధాన్నసమితిఁ దనిపి.
819
వ. మఱియుం గనక పాత్రరచితంబు లయిన కర్పూర నీరాజనంబుల నివాళించి రుచిరాసనంబునఁ గూర్చుండఁబెట్టి దర్పణంబు సేతి కిచ్చినం దత్ప్రతిఫలిత నిజదేహంబుఁ గనుంగొని కర్దముని మనంబునం దలంచిన నతండునుం గన్యకాసహస్రంబును దత్‌క్షణంబునఁ దనసన్నిధి నుండుటం జూచి నిజభర్తృ యోగ మాయా ప్రభావంబునకు నద్భుతంబు నొందె, నంతఁ గర్దముండు గృతస్నానయైన దేవహూతిం గనుంగొని వివాహంబునకు ముందట నేచందంబునఁ దనరుచుండె నా చందంబునఁ జెన్నొందు చుండుటకు నానంద భరితుండై భార్యా సహితంబుగఁ దత్కన్యకా సహస్రంబు గొలువ నిజ విమానారూఢుండై తారాగణ పరివృత రోహిణీయుక్తుండగు సుధాకరుండునుంబోలె నొప్పుచుం దదనంతరంబ. 820
చ. చిరశుభమూర్తి య మ్ముని యశేషదిగీశవిహారయోగ్యమున్‌,
సురుచిరమందగంధవహశోభితమున్‌, నికటప్రధాతు ని
ర్ఝరసరిదంబుశీతలతుషారమునై తనరారు మేరు కం
దరమున కేగి దేవవనితాయుతుఁడైన కుబేరుచాడ్పునన్‌.
821
వ. మఱియును. 822
మ. అమరోద్యానవనప్రదేశములు, నవ్యారామభూముల్‌, దళ
త్కుముదాంభోజవిభాసి మానససరఃకూలంబులున్‌, మంజు కుం
జములుం, జైత్రరథంబు విస్ఫురితవిస్రంభంబునంజూచె నె
య్యమునం గర్దమయోగి కామగ విమానారూఢుఁడై చెచ్చెరన్‌.
823
వ. ఇవ్విధంబున సమస్త భూభాగంబును వాయు వేగంబునం గలయం గ్రుమ్మరి నిఖిల వైమానికలోకంబు నతిశయించి లోకంబులం జరించె, మోక్షదాయకుండుఁ, దీర్థపాదుండు నగు పుండరీకాక్షుని సన్నుతించి సేవించు పుణ్యాత్ములకుం బొందరాని పదార్థంబులు గలవే? యిట్లు కర్దముఁడు దేవహూతికి నిఖిల ధరాచక్రం బంతయుం జూపి మరల నిజనివాసంబునకుం జనుదెంచి, కామకేళీ వినోదాత్మికయై యున్న భార్య నుపలక్షించి రతిప్రసంగ వ్యాసంగంబు గైకొని బహువిధంబు లయిన యిష్టోపభోగంబుల బహువత్సరంబు లొక్కముహూర్తంబుగా జరుపుచు నన్యోన్యసర సావలోకనంబుల సముచితాలింగన సంభాషణంబులం గాలనిరూపణంబు సేయనేరక శతవత్సరంబులు గడపి తదనంతరంబ. 824
క. మునివరుఁడొకనాఁడిమ్ములఁ, దన నిజదేహంబు నవవిధంబులు గావిం
చి నయంబునఁ దద్వీర్యము, దన సతిగర్భమున నవవిధంబుల నిలిపెన్‌.
825
క. అది కారణంబుగాఁ బెం, పొదవిన మునివలన దేవహూతియుఁ గూఁతుల్‌
ముదమునఁ గనెఁ దొమ్మండ్రన్‌, ముదితయు మది సంతసించె, మునివరుఁ డంతన్‌.
826
తే. సన్న్యసింపంగఁగోరిన సతి యెఱింగి, యాత్మఁ బొడమిన సంతాప మగ్గలింపఁ
జింత వాటిల్లఁ జెక్కిటఁజేయి సేర్చి, పదములను నేల వ్రాయుచుఁ బలికెఁ బతికి.
827
సీ. అనఘ! సంతానపర్యంతంబు ననుఁగూడి, వర్తింతు ననుచుఁ బూర్వమునఁ బలికి
కూఁతుల నిచ్చితి కొమరార, నిప్పు డీ, తరుణులు పతులను దమకుఁ దార
యరసి వర్తింతురో యని భీతి నొందెదఁ, గావున నీ పుత్త్రికలకుఁ దగిన
వరుల సంపాదించి, పరిణయంబులు సేసి, తత్త్వసంహిత నాకుఁ దవిలి తెలుపు
 
తే. సుతునిఁ గృపసేసి ననుఁ గావు సుజనవినుత! యర్థి సంసారదుఃఖంబు నపనయింప
నర్హుఁడవు నీవ, కామమోహమున నింత, కాల మూరక పోయె నే గతియు లేక.
828
చ. ఉపరతి వుట్టె నైహికసుఖోపగతానుభవంబులందు, నేఁ
జపలతఁ గామభోగరతి సంగముఁ గోరి మహాత్మ! నిన్ను న
చ్చపుఁదలఁపొప్పఁగాఁ దెలియఁజాలక యే వరియించుటన్‌ భవ
త్కృప ఫలియించె, ముక్తి నినుఁ గేవలభక్తి భజింపఁగల్గదే?
829
వ. అదియునుం గాక 830
చ. సమమతి నొప్పు సత్పురుషసఖ్యము సద్గతికారణంబు, నీ
చమతి విలోలదుష్పురుషసఖ్యము దుర్గతిహేతు వంచుఁ జి
త్తమునఁ దలంచి యోగిజనతానుత! మిమ్ము భజింతుఁ, బ్రాణి సం
గమమునఁ బుణ్యపాపములు గైకొని పొందవె యెట్టి వారలన్‌?
831
క. అని యిట్లు వేదనాభర, మున మునుకుచుఁ బలుకఁ గర్దముఁడు మనుపుత్త్రిం
గనుఁగొని సరసిజనయను వ, చనములు మది సంస్మరించి సతి కిట్లనియెన్‌.
832
క. మనుసుత! నీ మది దుఃఖం, బును బొందకు, మచిరకాలమున భగవంతుం
డనఘుం డక్షరుఁడు జనా, ర్దనుఁడు భవద్గర్భమందుఁ దగ వసియించున్‌.
833
క. వరనియమవ్రతనిష్ఠా, చరణనియుక్తాంతరంగసమధికవై సం
భరితతపోధన దాన, స్ఫురితశ్రద్ధానుభక్తిపూర్వము గాఁగన్‌.
834
మ. మఱి నారాయణు పాదపద్మములు సమ్యగ్భక్తిఁ బూజించు త
త్పురుషశ్రేష్ఠుఁడు మానసంబున భవత్పూజాసుసంప్రీతుఁడై
కర మర్థిం దరుణీశిరోమణి! భవద్గర్భస్థుఁడై యుండి తాఁ
గరుణంజేయు భవన్మనోజనితశంకాగ్రంథివిచ్ఛేదమున్‌.
835
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - tRutIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )