పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము తృతీయస్కంధము
కపిలుండు దేవహూతికి భక్తి యోగమును తెలియఁజేయుట
క. నలినాయతాక్షి! విను జన, ముల ఫల సంకల్ప భేదమునఁ జేసి మదిం
గల భక్తియోగ మహిమం, బలవడఁగ ననేకవిధము లనఁదగు నవియున్‌.
951
వ. వివరించెదఁ. దామస రాజస సాత్త్విక భేదంబులం ద్రివిధంబై యుండు, నందుఁదామస భక్తి ప్రకారం బెట్టిదనిన. 952
తే. సతత హింసాతి దంభ మాత్సర్య రూప, తమములను జేయుచును భేదదర్శి యగుచుఁ
బరఁగ నాయందుఁ గావించు భక్తి దలఁపఁ, దామసం బనఁదగు, వాఁడు తామసుండు,
953
క. ఘన విషయ ప్రావీణ్యము, లను సుమహైశ్వర్యయశములను బూజాద్య
ర్హుని నను నర్థి భజించుట, చను రాజసయోగ మనఁగ సౌజన్యనిధీ!
954
చ. అనుపమ పాపకర్మ పరిహారముకై భజనీయుఁడైన శో
భన చరితుం డితం డనుచు భావమునం దలపోసి భక్తిచే
ననితర యోగ్యతన్‌ భగవదర్పణబుద్ధి నొనర్చి కర్మముల్‌
జనహితకారియై నెగడ సాత్త్వికయోగ మనంగఁ జొప్పడున్‌.
955
చ. మనుసుత! మద్గుణ శ్రవణమాత్ర లభించినయట్టి భక్తిచే
ననఘుఁడ సర్వశోభన గుణాశ్రయుఁడం బరమేశ్వరుండనై
తనరిన నన్నుఁ జెందిన యుదాత్తమనోగతు లవ్యయంబులై
వననిధిగామి యైన సురవాహినిఁ బోలె ఫలించు నిమ్ములన్‌.
956
క. హేయ గుణ రహితుఁ డనఁగల, నాయందలి భక్తి లక్షణముఁ దెలిపితి, నన్‌
బాయక నిర్హేతుకముగఁ, జేయు మదీయవ్రతైక చిరతర భక్తిన్‌.
957
వ. నిష్కాములయిన మదీయ భక్తులను నట్టి భక్తి యోగంబు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యంబులకు సాధనంబు, కావున మహాత్ములగు వారు నిజమనోరథ ఫలదాయకంబు లయినను మదీయ సేవావిరహితంబు లయిన యితర కర్మంబు లాచరింప నొల్లరు, దీని నాత్యంతిక భక్తి యోగంబని చెప్పుదురు, సత్త్వరజస్తమో గుణహీనుం డయిన జనుండు మత్సమానాకారంబుఁ బొందునని చెప్పి మఱియు నిట్లనియె. 958
సీ. నిత్యనైమిత్తిక నిజధర్మమున గురు శ్రద్ధా గరిష్ఠతఁ జతుర పాంచ
రాత్రోక్త హరి సమారాధన క్రియలను నిష్కామనంబున నెఱి మదీయ
విగ్రహ దర్శన వినుతి పూజా వందన ధ్యాన సంశ్రవణములఁ గర్మ
సంగి గాకుండుట, సజ్జన ప్రకరాభిమానంబు నొందుట, హీనులందుఁ
 
తే. జాల ననుకంపఁ జేయుట, సములయందు, మైత్రి నెఱపుట యమనియమ క్రియాది
యైన యోగంబుచేత నాధ్యాత్మికాధి, భౌతికాదులఁ దెలియుట పలుకుటయును.
959
వ. మఱియును. 960
క. హరి మంగళ గుణకీర్తన, పరుఁడై తగ నార్జవమున భగవత్పరులం
గర మనురక్తి భజించుట, నిరహంకారముగ నుంట నిశ్చలుఁ డగుటన్‌.
961
క. ఇవి మొదలు గాఁగ గలుగు భ, గవదుద్దేశ స్వధర్మ కలితుండై వీ
నివలనఁ బరిశుద్ధగతిం, దవిలిన మది గలుగు పుణ్యతముఁ డెయ్యెడలన్‌.
962
తే. గురుతరానేక కల్యాణ గుణ విశిష్టుఁ, డనఁగ నొప్పిన ననుఁ బొందు నండ గొనక
పవన వశమునఁ బువ్వుల పరిమళంబు, ఘ్రాణమున నావరించిన కరణి మెఱసి.
963
చ. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి యనం దనర్చు నీ
శు నను నవజ్ఞ సేసి మనుజుం డొగి మత్ప్రతిమార్చనావిడం
బనమున మూఢుఁడై యుచిత భక్తిని నన్ను భజింపఁడేని న
మ్మనుజుఁడు భస్మకుండమున మానక వేల్చిన యట్టివాఁ డగున్‌.
964
సీ. అబ్జాక్షి! నిఖిల భూతాంతరాత్ముఁడ నైన నాయందు భూతగణంబునందు
నతిభేదదృష్టి మాయావులై సతతంబుఁ బాయక వైరానుబంధ నిరతు
లగు వారి మనములఁ దగులదు శాంతి యెన్నటి కైన నేను నా కుటిల జనుల
మానక యెపుడు సామాన్యాధిక ద్రవ్య సమితిచే మత్పదార్చన మొనర్ప
 
తే. నర్థి నా చిత్తమున ముదం బందకుందు, ననుచు నెఱిఁగించి మఱియు నిట్లనియెఁ గరుణఁ
గలిత సద్గుణ జటిలుఁ డక్కపిలుఁ డెలమిఁ, దల్లితోడ గుణవతీమతల్లితోడ.
965
సీ. తరళాక్షి! విను మచేతన దేహములకంటెఁ జేతన దేహముల్‌ శ్రేష్ఠ, మందుఁ
బ్రాణవంతంబులై స్పర్శనజ్ఞానంబు గలుగు చైతన్యవృక్షములకంటె
ఘనరసజ్ఞాన సంకలిత చేతను లుత్తములు, రసజ్ఞానంబు గలుగువాని
కంటె గంధజ్ఞాన కలిత భృంగంబులు గడు శ్రేష్ఠములు, వానికంటె శబ్ద
 
తే. వేదు లగుదురు శ్రేష్ఠులు, వెలయు శబ్ద, విదులకంటెను సద్రూప వేదులైన
వాయసాదులు శ్రేష్ఠముల్‌, వానికంటె, వరుస బహుపాదు లుత్తముల్‌, వానికంటె.
966
క. తలఁపఁ జతుష్పదు లధికులు, బలకొని మఱి వానికంటెఁ బాదద్వయముం
గల మనుజు లలఘుతము లి, మ్ముల వారలయందు వర్ణములు నాల్గరయన్‌.
967
వ. అందు. 968
సీ. తలఁప బ్రాహ్మణ లుత్తములు, వారికంటెను వేదవేత్తలు, వేదవిదులకంటె
విలసిత వేదార్థ విదులు, వారలకంటె సమధిక శాస్త్ర సంశయము మాన్పు
మీమాంసకులు, మఱి మీమాంసకులకంటె నిజధర్మ విజ్ఞాననిపుణు, లరయ
వారికంటెను సంగవర్జిత చిత్తులు దగ వారికంటె సద్ధర్మపరులు,
 
తే. ధార్మికులకంటె నుత్తమోత్తముఁడు వినుము, మత్సమర్పిత సకల కర్మ స్వభావ
మహిమములు గల్గి యితర కర్మములు విడిచి, సమత వర్తించు న ప్పుణ్యతముఁడు ఘనుఁడు.
969
వ. అట్టివాని. 970
క. కని సకలభూత గణములు, మనమున నానంద జలధి మగ్నము లగుచున్‌
ఘన బహుమాన పురస్సర, మనయముఁ బాటిల్ల వినుతు లర్థిం జేయున్‌.
971
వ. అంత నీశ్వరుండు జీవస్వరూపానుప్రవిష్టుండై యుండు, నట్టి భగవంతుం జూచి భక్తి యోగంబున నేని, యోగంబున నేనిఁ బురుషుండు పరమాత్మం బొందుఁ, బ్రకృతి పురుషాత్మకంబును దద్వ్యతిరిక్తంబును నైన దైవంబునై కర్మవిచేష్టితం బగుచు నుండు, నదియ భగవద్రూపం, బిట్టి భగవద్రూపంబు రూపభేదాస్పదం బగుచు నద్భుత ప్రభావంబు గల కాలం బనియుఁ చెప్పంబడు, నట్టి కాలంబు మహదాది తత్త్వంబులకును మహత్తత్త్వాభిమానులగు జీవులకును భయావహం బగుటంజేసి సకల భూతంబులకు నాశ్రయం బగుచు నంతర్గతంబై భూతంబులచేత భూతంబుల గ్రసించుచు యజ్ఞఫలప్రదాత గావున వశీకృత భూతుండై ప్రభుత్వంబుల భజియించి విష్ణుండు ప్రకాశించుచుండు, నతనికి మిత్రుండును శత్రుండును బంధుండును లేఁ, డట్టి విష్ణుండు సకలజనంబులయం దావేశించి యప్రమత్తుండై ప్రమత్తులయిన జనంబులకు సంహారకుండై యుండు, నతనివలన భయంబునంజేసి వాయువు వీచు, సూర్యుండు దపియించు, నింద్రుండు వర్షించు, నక్షత్రగణంబు వెలుంగుఁ, జంద్రుండు ప్రకాశించుఁ, దత్తత్కాలంబుల వృక్షలతాదు లోషధులతోడం గూడి పుష్పఫల భరితంబు లగు, సరిత్తులు ప్రవహించు, సముద్రంబులు మేరలు దప్పకయుండు, నగ్ని ప్రజ్వలించు, భూమి గిరులతోఁగూడ బరువునఁ గ్రుంగ వెఱచు, నాకాశంబు సకలజనంబులకు నవకాశం బిచ్చు, మహత్తత్త్వంబు జగత్తునకు నంకుర స్వరూపంబు గావున సప్తావరణావృతం బగు లోకం బను స్వదేహంబు విస్తరింపంజేయు గుణాభిమానులగు బ్రహ్మాదులు సర్వేశ్వరునిచేత జగత్సర్గంబునందు నియోగింపంబడి ప్రతిదినంబు నయ్యయి సర్గంబు సేయ నప్రమత్తులై యుండుదురు. పిత్రాదులు పుత్త్రోత్పత్తిఁ జేయుదురు, కాలుండు మృత్యుసహాయుండై మారకుండై యుండు, చరాచరాత్మకంబగు సకల ప్రపంచంబు భగవదధీనంబై యుండునని చెప్పి కపిలుండు వెండియు నిట్లనియె. 972
క. నెఱి నిట్టి నిఖిలలోకే, శ్వరుని పరాక్రమముఁ దెలియ సామర్థ్యం బె
వ్వరికిని గలుగదు! మేఘము, గరువలి విక్రమముఁ దెలియఁగా లేని గతిన్‌.
973
క. మగువా! విను సుఖహేతుక, మగు నర్థము దొరకమికి మహాదుఃఖమునం
దగులుదు రిది యంతయు నా, భగవంతుని యాజ్ఞఁజేసి ప్రాణులు మఱియున్‌.
974
సీ. పూని యనిత్యంబులైన గృహక్షేత్ర పశుధనసుత వధూబాంధవాది
వివిధ వస్తువులను ధ్రువముగా మది నమ్మి వఱలు దుర్మతి యగువాఁడు జంతు
సంఘాత మగు దేహసంబంధమున నిల్చి యర్థి నయ్యై యోనులందుఁ జొరఁగ
ననుగమించును వానియందు విరక్తుండు గాక యుండును నరకస్థుఁడైన
 
తే. దేహి యాత్మీయదేహంబు దివిరి వదల, లేక తన కది పరమసౌఖ్యాకరంబు
గాఁగ వర్తించు నదియునుగాక యతఁడు, దేవమాయా విమోహిత భావుఁ డగుచు.
975
క. ఘనమగు తనయ వధూ పశు, ధన గృహ రక్షణమునందుఁ దత్తత్క్రియలన్‌
మనమునఁ దలపోయుచు దిన, దినమున్‌ దందహ్యమాన దేహుం డగుచున్‌.
976
క. అతిమూఢ హృదయుఁ డగుచు దు, రిత కర్మారంభమునఁ జరించుచుఁ దరుణీ
కృత గోప్యభాషణములను, సుతలాలన భాషణములఁ జొక్కుచు మఱియున్‌.
977
క. విను మింద్రియ పరవశుఁడై, మునుకొని తత్కూట ధర్మములు గల దుఃఖం
బనయము సుఖరూపంబుగ, మనమునఁ దలపోసి తదభిమానుం డగుచున్‌.
978
క. సతతముఁ దమతమ సంపా, దిత మగు నర్థములచేత ధృతిఁ బరులకుఁ గు
త్సితమతి హింసలు సేయుచు, నతిమూఢమనస్కు లగుచు నాత్మజనములన్‌.
979
తే. పూని రక్షించుచును వారి భుక్త శేష, మనుభవించుచు నంత జీవనము వోక
గడఁకతో నపుడు పరార్థకాముఁ డగుచు, సత్త్వ మెడలి కుటుంబ పోషణమునందు.
980
సీ. బలిమి సాలక మందభాగ్యుఁడై కుమతియై పూని యప్పుడు క్రియాహీనుఁ డగుచుఁ
దవిలి వృథాప్రయత్నంబులు సేయుచు మూఢుఁడై కార్పణ్యమునఁ జరించు
నట్టి యకించనుఁ డగువానిఁ జూచి త ద్దారసుతాదు లాత్మలను వీఁడు
గడు నశక్తుఁడు, ప్రోవఁగాఁ జాలఁ, డితఁ డని సెగ్గింతు రర్థిఁ, గృషీవలుండు
 
తే. బడుగు ముసలెద్దు రోసిన పగిది, నంత, నతఁడు నే వెంటలను సుఖం బందలేక
తాను పోషించు జనులు దన్‌ దనరఁ బ్రోవ, బ్రదుకు ముదిమియు మిక్కిలి బాధ పఱుప.
981
క. వెడరూపుఁ దాల్చి బాంధవు, లడలఁగ నిర్యాణమునకు నభిముఖుఁడై యి
ల్లెడలఁగఁ జాలక శునకము, వడువునఁ గుడుచుచును మేను వడవడ వడఁకన్‌.
982
సీ. అతిరోగపీడితుండై మంద మగు జఠరాగ్నిచే మిగుల నల్పాశి యగుచు,
మెఱసి వాయువుచేత మీఁదికి నెగసిన కన్నులు, కఫమునఁ గప్పఁబడిన
నాళంబులను గంఠనాళంబునను ఘుర ఘుర మను శబ్దంబు దొరయ బంధు
జనులమధ్యంబున శయనించి బహువిధములఁ దన్నుఁ బిలువంగఁ బలుకలేక,
 
తే. చటులతర కాలపాశ వశంగతాత్ముఁ, డగుచు బిడ్డలఁ బెండ్లాము నరసి ప్రోచు
చింత వికలములైన హృషీకములను, గలిగి విజ్ఞానమును బాసి కష్టుఁ డగుచు.
983
వ. అంత మరణావస్థం బొందు సమయంబున నతి భయంకరాకారులు సరభసేక్షణులు నగు యమదూత లిద్దఱు దన ముందఱ నిలిచినం జూచి త్రస్తహృదయుండై శకృన్మూత్రంబులు విడుచుచు, యమపాశంబులచే గళంబున బద్ధుండై శరీరంబువలన నిర్గమించి యాతనాశరీరంబు నవలంబించి బలాత్కారంబున దీర్ఘంబై దుర్గమం బగు మార్గంబును బొంది రాజభటులచే నీయమానుం డగుచు దండనంబున కభిముఖుండై చను నపరాధి చందంబునఁ జనుచుండి. 984
చ. అనయము మూర్ఛనొందు శునకావలిచేతను భక్ష్యమాణుఁడై,
యనుపమ కాలకింకర భయంకర తర్జన గర్జనంబులన్‌
మనము గలంగ, దేహము సమస్తము గంపము వొందఁ గాఁ, బురా
తన భవ పాపకర్మ సముదాయముఁ జిత్తములోఁ దలంచుచున్‌.
985
సీ. అనుపమక్షుత్తృష్ణ లంతర్వ్యథలఁ జేయ ఝంఝానిలజ్వలజ్జ్వలన చండ
భానుప్రదీప్తితప్తంబైన వాలుకా, మార్గానుగత తప్యమానగాత్రుఁ
డై వీఁపుఁ గశలచే నడువంగ వికలాంగుఁ, డగుచు మార్గమునందు నచట నచటఁ
జాల మూర్ఛిల్లు చాశ్రయశూన్యమగు నీళ్ల, మునుఁగుచు లేచుచు మొనసి పాప
 
తే. రూప మయిన తమముచే నిరూఢుఁ డగుచు, వెలయఁ దొంబది తొమ్మిదివేల యోజ
నముల దూరంబు గల యమనగరమునకుఁ, బూని యమభటుల్‌ గొంపోవఁ బోవునంత.
986
వ. ఇట్లు మహాపాపాత్ముం డైనవాఁడు ముహూర్తత్రయ కాలంబునను సామాన్య దోషి యగువాఁడు ముహూర్తద్వయంబునను నేఁగి యాతనం బొందు నందు. 987
క. పట్టుదురు కొఱవులను వడిఁ, బెట్టుదు రసిపుత్రికలను బెనుమంటలయం
దొట్టుదురు నొడలు నలియఁగ, మట్టుదు రప్పాపచిత్తు మత్తుం బెలుచన్‌.
988
ఉ. ముంతురు తప్తతోయముల మొత్తుదు రుగ్ర గదాసిధారలన్‌
ద్రెంతురు పొట్టప్రేవులు, వధింతురు, మీఁద నిభేంద్రపంక్తి ఱొ
ప్పింతురు, ఘోరభంగిఁ గఱపింతురు పాములచేత, బిట్టు ద్రొ
బ్బింతురు మీఁద గుండ్లు, తినిపింతురు దేహము గోసి కండలన్‌.
989
వ. మఱియుఁ గుటుంబపోషణంబునఁ గుక్షింభరుం డగుచు నధర్మపరుండై భూతద్రోహంబున నతిపాపుండై నిరయంబునం బొంది, నిజధనంబులు గోలుపడి మొఱవెట్టు నాపన్నుని చందంబునఁ బరస్పర సంబంధంబునఁ గల్పింపంబడిన తామిస్రాంధతామిస్ర రౌరవాదు లగు నరకంబులం బడి, తీవ్రంబులైన బహుయాతనల ననుభవించి, క్షీణపాపుండై పునర్నరత్వంబునుం బొందు నని చెప్పి వెండియు నిట్లనియె. 990
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - tRutIya skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )