| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| మ. |
ఘనశౌర్యోన్నతితోడ సర్వకకుబాకాశంబులందుం బ్రతి ధ్వను లోలిన్ నిగుడంగ శంఖము మహోద్యల్లీలఁబూరింపఁ ద న్నినదంబున్ విని యక్షకాంతలు భయాన్వీతాత్మలై; రుగ్ర సా ధనులై యక్షభటుల్ పురిన్ వెడలి రుత్సాహంబు సంధిల్లఁగన్. |
323 |
| వ. | ఇట్లు వెడలి యా ధ్రువునిందాఁకిన. | 324 |
| చ. |
కరము మహారథుండు భుజగర్వపరాక్రమశాలియున్ ధను ర్ధరుఁడును శూరుఁడౌ ధ్రువుఁడు దన్ను నెదిర్చిన యక్షకోటిఁ జె చ్చెరఁబదుమూఁడువేల నొకచీరికిఁ గైకొన కొక్కపెట్ట భీ కరముగ మూఁడు మూఁడు శితకాండములందగఁగ్రువ్వనేసినన్. |
325 |
| ఉ. |
వారు లలాటముల్ వగిలి వారక సోలియుఁ దేఱి యమ్మహో దారు పరాక్రమప్రకటధైర్యముఁ దత్కరలాఘవంబుఁ బ ల్మాఱు నుతించుచుం గుపితమానసులై పదతాడితప్రదు ష్టోరగకోటివోలెఁ జటులోగ్రభయంకరరోషమూర్తులై. |
326 |
| ఉ. |
ఆ రథికోత్తముం దొడరి యందఱు నొక్కటఁజుట్టు ముట్టి యా ఱాఱు శిలీముఖంబులఁదదంగములన్ బగిలించి వెండి వి స్ఫారగదాశరక్షురికపట్టిస తోమరశూలఖడ్గముల్ సారథియుక్తుఁడైన రథిసత్తముపైఁ గురిపించి రేపునన్. |
327 |
| వ. | అట్లు గురియించిన నతండు. | 328 |
| క. |
పెంపఱి యుండెను ధారా, సంపాతచ్ఛన్నమైన శైలముభంగిన్ గుంపులు గొని యాకసమునఁ, గంపించుచు నపుడు సిద్ధగణములు వరుసన్. |
329 |
| క. |
హాహాకారము లెసఁగఁగ, నోహో యీ రీతి ధ్రువపయోరుహహితుఁ డు త్సాహము సెడి యిటు దైత్య స, మూహార్ణవమందు నేఁడు మునిఁగెనె యకటా! |
330 |
| వ. | అని చింతించు సమయంబున. | 331 |
| క. |
తా మాతని గెలిచితి మని, యా మనుజాశనులు వలుక నట నీహార స్తోమము సమయించు మహో, ద్దాముండగు సూర్యుఁబోలి తద్దయుఁదోఁచెన్. |
332 |
| వ. | అట్లు దోఁచిన. | 333 |
| మ. |
అరి దుఃఖావహమైన కార్ముకము శౌర్యస్ఫూర్తితోఁ దాల్చి భీ కరబాణావళిఁబింజపింజ గరవంగా నేసి ఝంఝానిలుం డురు మేఘావళిఁబాఱఁదోలుగతి నత్యుగ్రాహితక్రూర బం ధురశస్త్రావళి రూపుమాపె విలసద్దోర్లీల సంధిల్లఁగన్. |
334 |
| చ. |
మఱి యపుడమ్మహాత్ముఁడసమానబలుండు మహోగ్రబాణముల్ గఱకరిఁ దాఁక నేసి భుజగర్వ మెలర్ప విరోధివర్మముల్ పఱియలు సేసి యంగములు భంగమునొందఁగఁ జేసి వ్రేల్మిడిన్ గిఱికొని పర్వతంబుల నొగిం దెగఁగొట్టెడు నింద్రుకైవడిన్. |
335 |
| వ. | అయ్యవసరంబున. | 336 |
| చ. |
అలఘుచరిత్రుఁడమ్మనుకులాగ్రణిచే వికలాంగులైన వా రల సకిరీటకుండలవిరాజితమస్తకకోటిచే సము జ్జ్వలమణికంకణాంగదలసద్భుజవర్గముచేత సంగర స్థలమతిరమ్యమై తనరె సంచితవీరమనోహరాకృతిన్. |
337 |
| వ. | అంత హతశేషులు. | 338 |
| క. |
వరబలుఁడగు మను మనుమని, శరసంభిన్నాంగు లగుచు సమరవిముఖులై హరిరాజముఁగని పఱచెడు, కరిబృందముఁబోలెఁజనిరి కళవళపడుచున్. |
339 |
| క. |
అప్పుడు రాక్షసమాయలు, గప్పిన ధ్రువుఁడసురవరుల కార్యంబెఱుఁగం జొప్పడక వారిఁబొడగన, దెప్పర మగుటయును సారథింగని యంతన్. |
340 |
| క. |
తలపోయఁగ భువి మాయా, వుల కృత్యం బెఱుఁగ నెవరు వోలుదు రనుచుం బలుకుచుఁ దత్పురిఁ జొరఁగాఁ, దలఁపఁగ నదిగాన రాక తద్దయు మానెన్. |
341 |
| వ. | అట్లు పురంబున కరుగుట మాని చిత్రరథుండైన యా ధ్రువుండు సప్రయత్నుఁ డయ్యును బర ప్రతియోగ శంకితుండై యుండె నయ్యెడ మహాజలధి ఘోషంబు ననుకరించు శబ్దంబు వినంబడె; నంత సకలదిక్తటంబుల వాయుజనితంబయిన రజఃపటలంబు దోఁచె; దత్‌క్షణంబ యాకాశంబున విస్ఫురత్తటి త్ప్రభాకలితగర్జారవయుక్తమేఘంబు లమోఘంబులై భయంకరాకారంబులై తోఁచెనంత. | 342 |
| మ. |
అనయంబున్ ధ్రువుమీఁద దైత్యకృతమాయాజాల మట్లేఁచి బో రన మస్తిష్కపురీషమూత్ర పల దుర్గంధాస్థిమేదశ్శరా సన నిస్త్రింశ శరాసి తోమర గదా చక్ర త్రిశూలాది సా ధన భూభృద్భుజగావళిం గురిసె నుద్దండక్రియాలోలతన్. |
343 |
| వ. | మఱియు మత్తగజ సింహవ్యాఘ్ర సమూహంబులును నూర్మిభయంకరంబై సర్వతఃప్లవనం బయిన సముద్రంబును గానంబడియె; వెండియుం గల్పాంతంబునందుంబోలె భీషణంబైన మహాహ్రదంబునుం దోఁచె; న వ్విధంబున నానా విధంబులు ననేకంబులు నవిరళభయంకరంబులు నయిన యసురమాయలు గ్రూరప్రవర్తనులగు యక్షులచేత సృజ్యమానంబులై యడరు నా సమయంబున. | 344 |
| క. |
అనయంబును నయ్యక్షుల, ఘనమాయ నెఱింగి మునినికాయము వరుసన్ మనుమనుమని మను మను మని, మనమునఁదలఁచుచును దత్సమక్షంబునకున్ |
345 |
| వ. | చనుదెంచి యా ధ్రువుం గని యిట్లనిరి. | 346 |
| సీ. |
అనఘాత్మ! లోకు లెవ్వని దివ్య నామంబు సమత నాకర్ణించి సంస్మరించి దుస్తరంబైన మృత్యువునైన సుఖవృత్తిఁదరియింతు; రట్టి యీశ్వరుఁడు పరుఁడు భగవంతుఁడును శార్‌ఙ్గపాణియు భక్తజనార్తిహరుండును నైన విభుఁడు భవదీయవిమతులఁ బరిమార్చుఁగా కని పలికిన మునుల సంభాషణములు |
|
| తే. |
విని కృతాచమనుఁడు రమావిభుని పాద, కమలముఁదలంచి రిపుభయంకర మహోగ్ర కలిత నారాయణాస్త్రంబుఁగార్ముకమునఁ, బూనఁదడవఁదదీయసంధానమునను. |
347 |
| తే. |
కడఁగి గుహ్యకమాయాంధకార మపుడు, వెరవు సెడి దవ్వుదవ్వుల విరిసిపోయె విమలమైన వివేకోదయమునఁజేసి, సమయు రాగాదికంబుల సరణి నంత. |
348 |
| మ. |
వరనారాయణ దైవతాస్త్ర భవదుర్వారప్రభాహేమ పుం ఖ రుచిస్ఫార మరాళరాజసితపక్ష క్రూరధారాపత చ్ఛర సాహస్రము లోలి భీషణ విపక్షశ్రేణిపై వ్రాలె భీ కరరావంబునఁ గానఁ జొచ్చు శిఖిసంఘాతంబు చందంబునన్. |
349 |
| వ. | అట్లేసిన. | 350 |
| చ. |
ఖరనిశితప్రదీప్తఘనకాండపరంపర వృష్టిచేఁబొరిం బొరి వికలాంగులై యడరి పుణ్యజనుల్ పృథుహేతిపాణులై గరుడునిఁజూచి భూరిభుజగప్రకరంబు లెదిర్చి పేర్చి చె చ్చెర నడతెంచుచందమునఁజిత్రరథున్ బలుపూని తాఁకినన్. |
351 |
| ఉ. |
వారలఁజండతీవ్రశరవర్గముచేత నికృత్తపాద జం ఘోరుశిరోధరాంబకకరోదరకర్ణులఁజేసి యోగి పం కేరుహమిత్రమండలసకృద్భిద నెట్టి పదంబుఁజెందు నా భూరిపదంబునం బెలుచఁ బొందఁగఁ బంపె భుజావిజృంభియై. |
352 |
| వ. | ఇవ్విధంబున నా చిత్రరథుండగు ధ్రువునిచేత నిహన్యమానులును నిరపరాధులును నయిన గుహ్యకులం జూచి యతని పితామహుండైన స్వాయంభువుండు ఋషిగణపరివృతుండై చనుదెంచి ధ్రువునిం జూచి యిట్లనియె; వత్సా! నిరపరాధులైన యీ పుణ్యజనుల నెట్టి రోషంబున వధియించితి, వట్టి నిరయహేతువైన రోషంబు సాలు; భ్రాతృవత్సల! భ్రాతృవధాభితప్తుండవై కావించు నీ యత్నంబుడుగుము. | 353 |
| క. |
అనఘా! మనుకులమున కిది, యనుచిత కర్మంబ; యొకనికై పెక్కం డ్రి ట్టని మొనఁ ద్రుంగిరి; యిది నీ, కనయంబును వలవ; దుడుగు మయ్య కుమారా! |
354 |
| వ. | అదియునుం గాక దేహాభిమానంబునం బశుప్రాయులై భూతహింస గావించుట హృషీకేశానువర్తనులైన సాధులకుం దగదు; నీవు సర్వభూతంబుల నాత్మభావంబునఁ దలంచి సర్వభూతావాసుండును దురారాధ్యుండును నైన విష్ణుని పదంబులఁ బూజించి తత్పరమపదంబును బొందితి; వట్టి భగవంతుని హృదయంబున ననుధ్యాతుండవు; భాగవతుల చిత్తంబులకును సమ్మతుండవు, మఱియు సాధువర్తనుండ వన నొప్పు నీ వీ పాపకర్మం బెట్లు సేయ సమకట్టితి? వే పురుషుం డైన నేమి మహాత్ములయందుఁ దితిక్షయు, సములయందు మైత్రియు, హీనులయందుఁ గృపయు నితరంబులగు సమస్త జంతువులయందు సమత్వంబును గలిగి వర్తించు వానియందు సర్వాత్మకుండైన భగవంతుండు ప్రసన్నుం డగు; నతండు ప్రసన్నుం డయిన వాఁడు ప్రకృతి గుణంబులఁ బాసి లింగ శరీర భంగంబు గావించి బ్రహ్మానందంబునుం బొందు; నదియునుంగాక కార్యకారణ సంఘాతరూపంబైన విశ్వం బీశ్వరునందు నయస్కాంత సన్నిధానంబు గలిగిన లోహంబు చందంబున వర్తించు; నందు సర్వేశ్వరుండు నిమిత్తమాత్రంబుగాఁ బరిభ్రమించు; నట్టి యీశ్వరుని మాయాగుణ వ్యతికరంబున నారబ్ధంబులైన పంచభూతంబులచేత యోషిత్పురుషవ్యవాయంబు వలన యోషిత్పురుషాదిరూప సంభూతి యగు నవ్విధంబునఁ దత్సర్గంబు దత్సంస్థానంబుఁ, దల్లయంబు నగుచు నుండు; నిట్లు దుర్విభావ్యం బైన కాలశక్తింజేసి గుణక్షోభంబున విభజ్యమానవీర్యుండు ననంతుండు ననాదియు నైన జనంబులచేత జనంబులం బుట్టించుచుండుటం జేసి యాదికరుండును, మృత్యుహేతువున జనంబుల లయంబు నొందించుటం జేసి యంతకరుండును, ననాది యగుటం జేసి యవ్యయుండును నైన భగవంతుండు జగత్కారణుండగుం; గావున నీ సృష్టిపాలన విలయంబులకుం గర్త గానివాని వడువున దానిఁ జేయుచుండు, నిట్లు మృత్యురూపుండును బరుండును సమవర్తియు నైన యీశ్వరునికి స్వపక్ష పరపక్షంబులు లేవు; కర్మాధీనంబులైన భూతసంఘంబులు రజంబు మహావాయువు ననుసరించు చాడ్పున నస్వతంత్రంబు లగుచు నతని ననువర్తించు; నీశ్వరుండును జంతుచయాయు రుపచయాపచయ కరణంబులం దస్పష్టుండును నగు జీవుండు గర్మబద్ధుం డగుటం జేసి కర్మంబు వానికి నాయు రుపచయాపచయంబులం జేయుచుండు;మఱియు సర్వజగత్కర్మసాక్షియగు సర్వేశ్వరుని. | 355 |
| క. |
కొందఱు స్వభావ మందురు, కొందఱు కర్మం బటండ్రు, కొందఱు కాలం బందురు, కొందఱు దైవం, బందురు కొంద ఱొగిఁ గామ మండ్రు మహాత్మా! |
356 |
| వ. | ఇట్టు లవ్యక్తరూపుండును, నప్రమేయుండును, నానాశక్త్యుదయ హేతుభూతుండును నైన భగవంతుండు సేయు కార్యంబుల బ్రహ్మరుద్రాదు లెఱుంగరన నతని తత్త్వంబు నెవ్వరెఱుంగ నోపుదురు? కావునం బుత్రా! యిట్లుత్పత్తి నాశంబులకు దైవంబ కారణంబై యుండుఁ గాన నిద్ధనదానుచరులు భవదీయ భ్రాతృహంత లగుదురే? భూతాత్మకుండు భూతేశుండు భూతభావనుండు సర్వేశ్వరుండు పరాపరుండు నగు నీశుండ మాయాయుక్తుండై స్వశక్తిచే సృష్టి స్థితి లయంబులం జేయు. ఐన ననహంకారంబునంజేసి గుణకర్మంబులచే నస్పృశ్యుం డగుచు వర్తించు. అదియునుం గాక యీ ప్రజాపతులు విశ్వసృణ్ణామంబుల నియంత్రితులై ముకుఁద్రాళ్ళు వెట్టిన పశువులం బోలి యెవ్వని యాజ్ఞాధీనకృత్యులై వర్తింతు రట్టి దుష్టజన మృత్యువు, సుజనామృత స్వరూపుండు, సర్వాత్మకుండు, జగత్పరాయణుండు నైన యీశ్వరుని సర్వ ప్రకారంబుల శరణంబుఁ బొందుము. అదియునుం గాక. | 357 |
| సీ. |
అనఘాత్మ! నీవు పంచాబ్ద వయస్కుండ వై పినతల్లి నిన్నాడినట్టి మాటల నిర్భిన్నమర్ముండ వగుచును జనయిత్రి దిగనాడి వనము కేగి తపమాచరించి యచ్చపు భక్తి నీశ్వరుఁ బూజించి మహితవిభూతి మెఱసి రమణఁద్రిలోకోత్తరంబైన పదమును బొందితి, వది గాన భూరిభేద |
|
| తే. |
రూప మైన ప్రపంచంబు రూఢి నే మ, హాత్మునందుఁబ్రతీతమై యలరు నట్టి యగుణుఁడద్వితీయుండును నక్షరుండు, నైన యీశ్వరుఁబరమాత్ము ననుదినంబు. |
358 |
| సీ. |
కైకొని శుద్ధంబు గతమత్సరంబును నమలంబు నగు హృదయంబునందు సొలయ కన్వేషించుచును బ్రత్యగాత్ముండు భగవంతుఁడును బరబ్రహ్మమయుఁడు నానందమాత్రుండు నవ్యయుఁ డుపపన్న సకల శక్తియుతుండు సగుణుఁడజుఁడు నయిన సర్వేశ్వరునం దుత్తమంబైన సద్భక్తిఁ జేయుచు సమత నొప్పి |
|
| తే. |
రూఢి సో0000హమ్మమేతి ప్రరూఢ మగుచు, ఘనత కెక్కు నవిద్యయన్ గ్రంథి నీవు ద్రెంచి వైచితి; కావున ధీవరేణ్య! సర్వశుభహాని యైన రోషంబు వలదు. |
359 |
| క. |
విను రోషహృదయుచేతను, ననయము లోకము నశించు; నౌషధములచే ఘనరోగములు నశించిన యను, వున నది గాన రోష మడఁపు మహాత్మా! |
360 |
| తే. |
అనఘ! నీదు సహోదరహంతలనుచుఁ, బెనచి యీ పుణ్యజనులఁజంపితి కడంగి పరఁగ నిదియె సదాశివభ్రాత యైన, యర్థవిభునకు నపరాధ మయ్యెఁ గాన. |
361 |
| క. |
నతి నుతులచేత నీ విపుడతనిఁ, బ్రసన్నునిఁగఁజేయు మని మనువు దయా మతిఁజెప్పి ధ్రువునిచే స, త్కృతుఁడై నయ మొప్పఁజనియె ఋషియుక్తుండై. |
362 |
| వ. | అంత. | 363 |
| తే. |
యక్షచారణసిద్ధవిద్యాధరాది, జనగణస్తూయమానుఁడై ధనదుఁడంతఁ బుణ్యజనవైశసనివృత్తు భూరిరోష, రహితుఁడైనట్టి ధ్రువునిఁజేరంగ వచ్చె. |
364 |
| సీ. |
చనుదెంచి వెసఁగృతాంజలియైన ధ్రువుఁ జూచి తివుట నిట్లనియె క్షత్త్రియకుమార! తగ భవదీయపితామహాదేశంబునను దుస్త్యజంబైన ఘనవిరోధ ముడిగితి; వటు గాన నొనరంగ నిపుడు నీ యందుఁబ్రసన్నుండనైతి, భూత జననలయంబుల కనయంబుఁ గాలంబు కర్తయై వర్తించుఁగాన యుష్మ |
|
| తే. |
దనుజుఁజంపినవార లీ యక్షవరులు, గారు; తలపోయ నీ యక్షగణము నిట్లు నెఱి వధించినవాఁడవు నీవు గావు, వినుతగుణశీల! మాటలు వేయునేల? |
365 |
| వ. | అదియునుంగాక యే బుద్ధింజేసి కర్మ సంబంధ దుఃఖాదికంబులు దేహాత్మానుసంధానంబునం జేసి సంభవించు, నట్టి యహంత్వమ్మను నపార్థజ్ఞానంబు స్వప్నమందుంబోలెఁ బురుషునకుం దోఁచు నది గావున, సర్వభూతాత్మ విగ్రహుండును, నధోక్షజుండును, భవచ్ఛేదకుండును, భజనీయ పాదారవిందుండును, ననంతామేయ శక్తి యుక్తుండును గుణమయియగు నాత్మమాయచే విరహితుండును నైన యీశ్వరుని సేవింపుము; నీకు భద్రం బయ్యెడు; భవదీయ మనోగతంబైన వరంబుఁ గోరుము; నీ వంబుజనాభ పాదారవింద సేవనంబుఁ దిరంబుగఁ జేయుదు వని యెఱుంగుదు నని రాజరాజుచేత నట్లు మహామతియు, భాగవతోత్తముండునైన ధ్రువుండు ప్రేరేపింపంబడి యే హరిస్మరణంబుచేత నప్రయత్నంబున దురత్యయంబైన యజ్ఞానంబుం దరియింతు రట్టి హరిస్మరణం బచలితం బగునట్లొసంగుమని యడిగిన నట్లకాక యని యంగీకరించి యంతం గుబేరుండును సంప్రీతచిత్తుండయి, ధ్రువునికి శ్రీహరిస్మరణం బట్ల యనుగ్రహించి యంతర్ధానంబు నొందె; నంత ధ్రువుండు యక్ష కిన్నర కింపురుష గణ సంస్తూయమాన వైభవుండగుచు నాత్మీయపురంబునకు మరలి చనుదెంచి. | 366 |
| సీ. |
గణుతింప భూరిదక్షిణలచేఁ గడునొప్పు యజ్ఞముల్ సేయ న య్యజ్ఞవిభుఁడు ద్రవ్యక్రియాదేవతాఫలరూప సత్కర్మఫల ప్రదాత యయి యొప్పు పురుషోత్తముని నర్థిఁబూజించి మఱియు సర్వోపాధివర్జితుం డుత్తముండు సర్వాత్మకుఁడు నగు జలజాక్షునందుఁ దీవ్రంబై ప్రవాహరూపంబు నైన |
|
| తే. |
భక్తి సలుపుచు నఖిలప్రపంచమందు, నలరఁదనయందు నున్న మహాత్ము హరిని జిదచిదానందమయుని లక్ష్మివరుఁ బరము, నీశ్వరేశ్వరుఁబొడఁగనె నిద్ధచరిత! |
367 |
| వ. | ఇట్లు సుశీల సంపన్నుండును, బ్రహ్మణ్యుండును, ధర్మసేతురక్షకుండును, దీనవత్సలుండు నయి యవనిఁబాలించు ధ్రువుండు దన్నుఁ బ్రజలు దండ్రి యని తలంప నరువది యాఱువేలేండ్లు భోగంబులచేతం బుణ్యక్షయంబును, నభోగంబులైన యాగాదులచే నశుభక్షయంబునుం జేయుచు బహుకాలంబు దనుకఁ ద్రివర్గసాధనంబుగ రాజ్యంబుసేసి కొడుకునకుం బట్టంబుగట్టి యచలితేంద్రియుండై యవిద్యారచిత స్వప్నగంధర్వ నగరోపమం బయిన దేహాదికంబగు విశ్వంబు భగవన్మాయారచితంబని యాత్మం దలంచుచు వెండియు. | 368 |
| చ. |
మనునిభుఁడంత భృత్యజనమంత్రిపురోహితబంధుమిత్ర నం దనపశువిత్తరత్నవనితాగృహ రమ్యవిహారశైల వా రినిధిపరీతభూతలహరిద్ద్విపముఖ్యపదార్థజాలముల్ ఘనమతిచే ననిత్యములుగాఁ దలపోసి విరక్తచిత్తుఁడై. |
369 |
| సీ. |
పురము వెల్వడి చని పుణ్యభూ బదరికా ఘనవిశాలానదీకలిత మంగ ళాంబుపూరంబుల ననురక్తిమైఁ గ్రుంకి కమనీయపరిశుద్ధకరణుఁడగుచు బద్మాసనస్థుఁడై పవనుని బంధించి నెలకొని ముకుళితనేత్రుఁడగుచు హరిరూపవైభవధ్యానంబు సేయుచు భగవంతు నచ్యుతుఁబద్మనేత్రు |
|
| తే. |
నందు సతతంబు నిశ్చలమైనయట్టి, భక్తిఁబ్రవహింపఁజేయుచుఁబరమమోద బాష్పధారాభిషిక్తుండు భవ్యయశుఁడుఁ, బులకితాంగుండు నగుచు నిమ్ములఁ దనర్చి. |
370 |
| వ. | మఱియు విగతక్లేశుండును, ముక్తలింగుండునునై, ధ్రువుండు తన్నుఁదా మఱచియుండు సమయంబున దశదిక్కుల నుద్యద్రాకానిశానాయకుండునుంబోలె వెలిఁగించుచు నాకాశంబున నుండి యొక్క విమానంబు సనుదేర నందు దేవశ్రేష్ఠులును, జతుర్భుజులును, రక్తాంబుజేక్షణులును, శ్యామలవర్ణులును, గదాధరులును, సువాసస్సులును, గిరీటహారాంగదకుండలధరులును, గౌమారవయస్కులును, నుత్తమశ్లోకకింకరులు నయినవారల నిద్దఱంగని సంభ్రమంబున లేచి మధుసూదననామంబులు సంస్మరించుచు వారల భగవత్కింకరులంగాఁదలంచి దండప్రణామంబు లాచరించినం గృష్ణపాదారవింద విన్యస్తచిత్తుండుం, గృతాంజలియు, వినమితకంధరుండు నైన ధ్రువునిం గనుంగొని పుష్కరనాభభక్తులైన సునందనందులు ప్రీతియుక్తులై మందస్మితు లగుచు నిట్లనిరి. | 371 |
| ఉ. |
ఓ నృప! నీకు భద్ర మగు నొప్పగుచున్న మదీయవాక్యముల్ వీనులయందుఁజొన్పుము; వివేకముతో నయిదేండ్లనాఁడు మే ధానిధివై యొనర్చిన యుదాత్తతపోవ్రతనిష్ఠచేతఁ దే జోనయశాలియైన మధుసూదనుఁదృప్తి వహింపఁజేయవే! |
372 |
| ఆ. |
అట్టి శార్‌ఙ్గపాణి యఖిలజగత్కర్త, దేవదేవుఁడతులదివ్యమూర్తి మమ్ముఁబనుప మేము మాధవపదమున, కర్థి నిన్నుఁగొనుచు నరుగుటకును. |
373 |
| వ. | వచ్చితిమి; యే పదంబునేని సూరిజనంబులు సర్వోత్తమంబని పొందుదురు; దేనిఁ జంద్రదివాకర గ్రహనక్షత్రతారాగణంబులు ప్రదక్షిణంబుగాఁ దిరుగుచుండు; మఱియు నీదు పితరులచేతను నన్యుల చేతను ననధిష్ఠితంబును, జగద్వంద్యంబును, నభక్తజనాతిదుర్జయంబును నయిన నట్టి విష్ణుపదంబుం బొందుదువు; రమ్మిదె విమానశ్రేష్ఠం; బుత్తమశ్లోక జనమౌళియైన శ్రీహరి పుత్తెంచె; దీని నెక్క నర్హుండ వనిన నురుక్రమ ప్రియుండయిన ధ్రువుండు తన్మధురవాక్యంబులు విని కృతాభిషిక్తుండయి యచ్చటి మునులకుం బ్రణమిల్లి తదాశీర్వాదంబులు గైకొని విమానంబునకుం బ్రదక్షిణార్చనంబులు గావించి హరి పార్షదులైన సునందనందులకు వందనం బాచరించి భగవద్రూపవిన్యస్త చక్షురంతఃకరణాదికుం డగుచు విమానాధి రోహణంబు గావించుటకు హిరణ్మయరూపంబు ధరియించె నప్పుడు. | 374 |
| క. |
సురదుందుభిపణవానక, మురజాదులు మొరసె విరుల ముసురు గురిసెఁ గి న్నరగంధర్వుల పాటలు, భరితములై చెలఁగె నపుడు భవ్యచరిత్రా! |
375 |
| వ. | అట్టి సమయంబున ధ్రువుండు దుర్గమంబగు త్రివిష్టపంబునకు నేగువాఁ డగుచు దీనయగు జననిం దిగనాడి యెట్లు వోవుదు? నని చింతించువానిం బార్షదు లవలోకించి యగ్రభాగంబున విమానారూఢయై యేగుచున్న జననిం జూపిన సంతుష్టాంతరంగుండగుచు. | 376 |
| క. |
జనని సునీతిని మును గనుఁ, గొని యవల విమాన మెక్కి గొనకొని విబుధుల్ దనమీఁదఁబుష్పవర్షము, లనయముఁగురియింప ధ్రువుఁడు హర్షముతోడన్. |
377 |
| క. |
చని చని వెస గ్రహమండల, మునుఁ ద్రైలోక్యంబు సప్తమునిమండలమున్ ఘనుఁడుత్తరించి యవ్వలఁ, దనరెడు హరిపదము నొందెఁదద్దయుఁబ్రీతిన్. |
378 |
| వ. | అది మఱియు నిజకాంతిచేతం ద్రిలోకంబులం బ్రకాశింపం జేయుచు నిర్దయాగమ్యంబును శాంతులు సమదర్శనులు శుద్ధులు సర్వభూతానురంజనులు నచ్యుత భక్త బాంధవులు నయిన భద్రాచారులకు సుగమ్యంబును నయి గంభీరవేగంబు ననిమిషంబునగు జ్యోతిశ్చక్రంబు సమాహితంబై గోగణంబు మేధియందుంబోలె నెందుఁ బరిభ్రమించుచుండు, నట్టి యచ్యుత పదంబునుం బొంది విష్ణుపరాయణుండైన ధ్రువుండు త్రిలోకచూడామణియై యొప్పుచుండె. అప్పుడు భగవంతుడైన నారదుండు ధ్రువుని మహిమం గనుంగొని ప్రచేతస్సత్త్రంబునందు వీణ వాయించుచు. | 379 |
| సీ. |
పతియె దైవంబుగా భావంబులోపలఁ దలఁచు సునీతినందను తపః ప్ర భావముక్రియ ధర్మభవ్యనిష్ఠలఁబొందఁజాలరు బ్రహ్మర్షి జనము లనిన క్షత్త్రియకులు నెన్నఁగా నేల? యెవ్వఁడు పంచసంవత్సరప్రాయమునను సురుచి దురుక్త్యుగ్రశరభిన్నహృదయుఁడై మద్వాక్యహితబోధమతిఁ దనర్చి |
|
| తే. |
వనమునకు నేగి హరిభక్తివశత నొంది, యజితుఁడగు హరిఁదనవశుఁడై చరింపఁ జేసి వెసఁదత్పదంబును జెందె, నట్టి హరిపదంబును బొంద నెవ్వరికిఁ దరము? |
380 |
| క. |
అని పాడె ననుచు విదురున, కనఘుఁడు మైత్రేయుఁడనియె నంచితభక్తిన్ వినుతోద్దామయశస్కుం, డనఁగల యా ధ్రువుని చరిత మార్యస్తుత్యా! |
381 |
| సీ. |
మహితసత్పురుషసమ్మతమును ధన్యంబు స్వర్గప్రదంబు యశస్కరంబు నాయుష్కరంబుఁబుణ్యప్రదాయకమును మంగళకర మఘమర్షణంబు సౌమనస్యముఁ బ్రశంసాయోగ్యమును బాపహరమును ధ్రువపదప్రాపకంబు నై యొప్పు నీ యుపాఖ్యానంబుఁ దగ నీకు నెఱిఁగించితిని దీని నెవ్వఁడేని |
|
| తే. |
తివుట శ్రద్ధాగరిష్ఠుఁడై తీర్థపాద, చరణ సరసీరుహద్వయాశ్రయుఁడు నగుచు భవ్యచరితు దినాంతప్రభాతవేళ, లను సినీవాలి పూర్ణిమ లందు మఱియు. |
382 |
| తే. |
ద్వాదశిని పద్మ బాంధవ వాసరమున, శ్రవణనక్షత్రమున దినక్షయమునందుఁ బరఁగ సంక్రమణ వ్యతీపాతలందు, సభల భక్తిని వినునట్టి సజ్జనులకు. |
383 |
| వ. | క్లేశనాశంబును మహాప్రకాశంబును నైన భగవద్భక్తియు శీలాదిగుణంబులును గలుగు; మఱియుఁ దేజఃకామునకుఁ దేజంబును, మనఃకామునకు మనంబును, నిష్కామునకుఁ దత్త్వవిజ్ఞానంబును గలుగు. దీని వినిపించు వారికి దేవతానుగ్రహంబు గలుఁగు; నిట్టి యుపాఖ్యానంబు నీ కెఱింగించితి నని మైత్రేయుండు విదురునకుఁ జెప్పిన క్రమంబున శుకయోగి పరీక్షిత్తున కెఱింగించిన తెఱంగున సూతుండు శౌనకాదులకు వినిపించి వెండియు నిట్లనియె; నట్లు సెప్పిన మైత్రేయునింగని విదురుండిట్లనియె. | 384 |
| సీ. |
అనఘాత్మ! నారదమునిపతి ధ్రువచరిత్రము ప్రచేతసుల సత్త్రంబునందు నర్థిమైఁగీర్తించె నంటి; ప్రచేతసులన నెవ్వ రెవ్వరి తనయు? లెట్టి వంశజుల్? సత్త్ర మెవ్వలనను జేసి? రధ్వరమందు నిజకులధర్మశీలు రగు ప్రచేతసులచే యజియింపఁగాఁబడె యజ్ఞపురుషుఁ డెట్టు లచ్యుతాంఘ్రి |
|
| తే. |
భక్తియుక్తుఁడు విదితసద్భాగవతుఁడు, దివిరి హరిపాదసేవావిధి ప్రయుక్త దేవదర్శనుఁడగు నట్టి దివ్యయోగి, నారదుండెట్లు గొనియాడె శౌరికథలు? |
385 |
| క. |
నాకిపు డెఱిఁగింపుము సు, శ్లోకుని చరితామృతంబు శ్రోత్రాంజలులం బైకొని జుఱ్ఱియుఁ దనివిం, గైకొనకున్నది మనంబు గరుణోపేతా! |
386 |
| క. |
అని యడిగిన విదురునిఁ గనుఁ, గొని మైత్రేయుండు పలికె గొనకొని ధ్రువుఁడున్ వనమునకుఁజనిన నాతని, తనయుండగు నుత్కలుండు దళితాఘుండై. |
387 |
| సీ. |
చతురుఁడాజన్మప్రశాంతుండు నిస్సంగుఁడును సమదర్శనుండును ఘనుండు నై యాత్మయందు లోకావళి, లోకంబులందు నాత్మను జూచు చనఘమైన యనుపమయోగక్రియాపావకాదగ్ధ కర్మమలాశయకలనఁబేర్చి జడునికైవడి జీఁకుచందంబునను మూకు పగిది నున్మత్తుని భంగిఁజెవిటి |
|
| తే. |
వడువునను గానఁబడుచు సర్వజ్ఞుఁడై ప్ర, శాంతకీలహుతాశనుసరణిఁబొల్చి సతతశాంతంబు నంచితజ్ఞానమయము, నైన బ్రహ్మస్వరూపంబు నాత్మఁదలఁచి. |
388 |
| క. |
తనకంటె నితర మొక టెఱుఁ, గని కతమున సార్వభౌమకశ్రీఁబొందన్ మనమునఁ గోరక యుండుటఁ, గని కులవృద్ధులును మంత్రిగణములు నంతన్. |
389 |
| వ. | అతని నున్మత్తునిం గాఁ దెలిసి తదనుజుండైన వత్సరునికిఁ బట్టంబు గట్టి; రా వత్సరునికి సర్వర్థి యను భార్యయందుఁ బుష్పార్ణుండును జంద్రకేతుండును నిషుండును నూర్జుండును వసువును జయుండును నన నార్వురు తనయులు గలిగి; రందుఁ బుష్పార్ణుండను వానికిఁ బ్రభయు దోషయు ననునిద్దఱు భార్యలై; రందుఁ బ్రభ యనుదానికిం బ్రాతర్మధ్యందిన సాయంబు లను సుతత్రయంబును దోషయను దానికిఁ బ్రదోషనిశీథ వ్యుష్టు లనువారు ముగ్గురును బుట్టి; రందు వ్యుష్టుండను వానికిఁ బుష్కరిణియను పత్నియందు సర్వతేజుండను సుతుండు వుట్టె; వానికి నాకూతి యను మహిషివలనఁ జక్షుస్సంజ్ఞుండయిన మనువు జనియించె; వానికి నడ్వల యను భార్యయందుఁ బురువును, గుత్సుండును, ద్రితుండును, ద్యుమ్నుండును, సత్యవంతుండును, ఋతుండును, వ్రతుండును, నగ్నిష్టోముండును, నతిరాత్రుండును, ప్రద్యుమ్నుండును, శిబియును, నుల్ముకుండును నను పన్నిద్దఱు తనయులు గలిగి, రందు నుల్ముకునికిఁ బుష్కరిణియను దానివలన నంగుండును, సుమనసుండును, ఖ్యాతియుఁ, గ్రతువును, నంగిరసుండును, గయుండును నను నార్వురు కొడుకులు పుట్టి; రందు నంగునికి సునీథ యనుధర్మపత్నివలన వేనుండను పుత్రుం డుదయించిన. | 390 |
| మ. |
క్షితినాథోత్తముఁ డాత్మనందనుని దుశ్శీలంబు వీక్షించి దుః ఖితుఁడై యొంటిగఁ దత్పురిన్ వెడలి యేగెన్ వేగ నెందేని త ద్గతి వీక్షించి మునీశ్వరుల్ గుపితులై దంభోళిసంకాశ వా క్యతతిం జావ శపింప వాఁ డపుడు వీఁకం గూలె, న మ్మేదినిన్. |
391 |
| సీ. |
కైకొని యపుడు లోకంబరాజకమైనఁ బ్రజలు దస్కరపీడఁబల్లటిల్లఁ గనుఁగొని దుఃఖించి మునులు గతాసుఁడై పడిన వేనుని వలపలి భుజంబు నర్థి మథింప నారాయణాంశంబున నాదిరాజన నొప్పునట్టి పృథుఁడు జనియించె ననవుడు విని విదురుఁడు మునిఁ గనుఁగొని పలికె నో యనఘచరిత! |
|
| తే. |
సాధువు సుశీలనిధియును సజ్జనుండు, నలఘుబ్రహ్మణ్యుఁడును నైనయట్టి యంగ ధరణివిభునకు దుష్టసంతాన మెట్లు, గలిగె? నయ్యంగపతి యేమి కారణమున. |
392 |
| వ. | విమనస్కుం డగుచుఁ బురంబు విడిచె? ధర్మకోవిదులైన మునులు దండవ్రతధరుండును, రాజును నగు వేనునియందు నే పాపంబు నిరూపించి బ్రహ్మదండంబొనర్చి రదియునుంగాక లోకంబున రాజులు లోకపాల తేజోధరులుఁ, బ్రజాపాలనాసక్తులుఁ గావునఁ గల్మషంబు గలిగినం బ్రజలచేత నవజ్ఞార్హులై యుందురు గావున నా వేనుని చరిత్రంబు శ్రద్ధాగరిష్ఠుండు భక్తుండునైన నాకుం బరాపరవిదగ్రేసరుండ వయిన నీ వెఱింగింప నర్హుండ వనిన మైత్రేయుం డతని కిట్లనియె. | 393 |