| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| సీ. |
అనఘాత్మ! రాజర్షి యైనట్టి యయ్యంగ మేదినీవిభుఁడశ్వమేధమఖము గావింప ఋత్విఙ్నికాయంబు చేత నా హూత మయ్యును సురవ్రాత మందు నాత్మ హవిర్భాగ మందరాకుండిన నప్పుడు ఋత్విక్కు లద్భుతంబు నందుచు యజమానుఁడైన యయ్యంగ మహీవరుఁ జూచి రాజేంద్ర; యిట్లు |
|
| తే. |
త్రిదశులిదె పిల్వఁబడియును దివిరి యాత్మ, భాగములఁ బొంద రారైరి భవ్యచరిత! యేమిహేతువొ యిది మాకు నెఱుఁగఁబడదు;, కనఁగ హోమంబు దుష్టంబు గాదు మఱియు. |
394 |
| వ. | శ్రద్ధాయుక్తులై ధృతవ్రతులైన యీ బ్రహ్మవాదులచేత సంప్రయుక్తంబులైన యీ ఛందస్సులు వీర్యవంతంబు లయియున్నవి; యిందు దేవతాపరాధం బణుమాత్రం బైన నెఱుంగ; మిట్టిచోటం గర్మసాక్షు లయిన దేవతలు స్వకీయభాగంబు లంగీకరింపకుండుటకుఁ గతం బెయ్యదియో యనిన నయ్యంగుండు దుఃఖితస్వాంతుండై తన్నిమిత్తంబు సదస్యుల నడుగందలంచి వారల యనుమతింబడసి మౌనంబు మాని యిట్లనియె. | 395 |
| ఆ. |
అనఘ చరితులార! యాహూతు లయ్యు సు, పర్వగణము లాత్మభాగములను స్వీకరింప; రేను జేసిన యపరాధ, మెట్టి దనిన వార లిట్టు లనిరి. |
396 |
| క. |
నరనాథ! యిదియు నిప్పుడు, వొరసిన దుష్కృతము గాదు పూర్వభవమునం బరఁగిన దురితం బిది యా, దరమున నెఱిఁగింతు మింత ధన్యచరిత్రా! |
397 |
| క. |
నీ వింతవాఁడ వయ్యును, భూవర! సంతానలాభమును బొందమి నా దేవతలు యాగభాగము, లీ వేళ భుజింపరైరి యిందుకు నీవున్. |
398 |
| తే. |
పుత్రకామేష్టిఁగావించి పుత్రుఁబడయు, మట్లొనర్చిన దేవత లాత్మభాగ మర్థి నంగీకరింతు; రయ్యజ్ఞపురుషు, హరి భజించిన సకలకార్యములుఁగలుగు. |
399 |
| వ. | అనిన నాతండు సంతానార్థంబు శిపివిష్ట దేవతాకంబయిన పురోడాశంబుచే హోమంబు గావించినం దదీయ హోమకుండంబునందు హేమమాల్యాంబరాభరణుండయిన పురుషుండు హిరణ్మయపాత్రంబున సిద్ధపాయసంబు గొనుచు నుదయించిన నప్పుడు విప్రానుమతంబున నా రాజు దత్పాయసంబు నంజలిచే గ్రహించి సంతోషయుక్తుండగుచు భార్యకొసంగె నంత. | 400 |
| చ. |
కమలదళాక్షి పాయసము గౌతుక మొప్ప భుజించి భర్తృ సం గమమునఁజేసి తత్‌క్షణము గర్భముఁదాల్చి కుమారుఁగాంచె న క్కొమరుఁడు నంత మాతృజనకుండగు మృత్యువుఁబోలి తా నధ ర్మమునఁజరించుచుండె గుణమండన! వేనుఁడనంగ నిచ్చలున్. |
401 |
| చ. |
ఎనయఁగ బాల్యమందుఁదన యీడు కుమారులఁగ్రీడఁబోలె నె మ్మనమున భీతి లేక కృపమాలి పశుప్రకరంబు నొంచు పో ల్కిని నరికట్టి చంపుచును గిల్బిషలుబ్ధకవృత్తిమై శరా సనశరముల్ ధరించి మృగజాతి నసాధుగతిన్ వధించుచున్. |
402 |
| వ. | ఇట్లు మాతామహ దోషంబునం బాపవర్తనుండై చరియించు కొడుకుం జూచి యంగుండు వివిధ శాసనంబుల దండించియు నతని దుశ్చేష్టితంబులు మానుపంజాలక దుఃఖితాత్ముండై మనంబున. | 403 |
| క. |
అనయము నిట్టి కుపుత్త్రునిఁ, గని పరితాపంబుఁబొందుకంటెను ధరలో ననపత్యుండగు టొప్పును, వనజాక్షు భజించునట్ట్టి వాఁడగు వాఁడున్. |
404 |
| వ. | అని వెండియు నిట్లనియె. | 405 |
| సీ. |
జనులకు దుష్పుత్త్రకునిచేత నపకీర్తియు, నధర్మమును, సర్వజనవిరోధ మును, మనోవ్యథయును, ననయంబుఁ బ్రాప్తించు నట్టి కుపుత్త్రమోహంబు విడువఁ జాలక బహుమానసంగతిఁ గను నెవ్వఁడతని గేహంబు దుఃఖాలయంబు నగునని మఱియు నిట్లను మనుజుండు శోకస్థానమగు పుత్త్రుకతనఁజేసి |
|
| తే. |
యనుపమక్లేశభాజనంబయిన గృహము, విడుచుఁగావున నిట్టి వివేకహీనుఁ డగు కుపుత్త్రు సుపుత్త్రుఁగా నాత్మఁదలఁతు, ననుచు నా రాజు బహుదుఃఖితాత్ముఁడగుచు. |
406 |
| క. |
తగు సుమహైశ్వర్యోదయ, మగు గృహమును బ్రజల నిద్రనందిన భార్యన్ దిగవిడిచి యెక్క డేనియు, జగతీశుఁడు సనె నిశీథ సమయమునందున్. |
407 |
| వ. | అంతఁ దద్వృత్తాంతం బంతయు సుహృద్బాంధవ పురోహితామాత్య ప్రభృతులయిన ప్రజ లెఱింగి దుఃఖించుచున్న సమయంబున భూమియం దెల్లయెడలఁ దదన్వేషణం బాచరించి గూఢుండయిన పరమ పురుషునిం గానలేని కుయోగి చందంబున నా రాజుం బొడగానలేక విఫలోద్యోగులయి మగిడి పురంబునకు వచ్చిరి. తదనంతరంబ. | 408 |
| సీ. |
సమధిక బ్రహ్మనిష్ఠాతిగరిష్ఠులౌ భృగ్వాదిమౌనీంద్రబృంద మపుడు లోకావనైకావలోకనోత్సుక మౌట జనులు స్వరక్షకజనవిభుండు లేమిఁబశుప్రాయులై మెలంగుటఁగని యంత వేనుని మాత యగు సునీథ యనుమతి నఖిలప్రజావళి కప్రియుండైన న వ్వేనుఁ బట్టాభిషిక్తుఁ |
|
| తే. |
జేసి; రంతట మహితోగ్రశాసనుఁడగు, వేనుఁబట్టంబు గట్టుట విని సమస్త తస్కరులు సర్పభీతిచేఁదలఁగు మూష, కముల కైవడి నడఁగిరి గహనములను. |
409 |
| వ. | అంత నతండు. | 410 |
| చ. |
పరువడి నష్టలోకపరిపాలక ముఖ్య విభూతియుక్తుఁడై పరఁగి నృపాసనంబున విభాసితుఁడౌట స్వభావసిద్ధమై వఱలు మహావలేపమున వారక సంతత మాననీయ స త్పురుషుల నెల్ల నెందుఁ బరిభూతులఁ జేయుచునుండె నిచ్చలున్. |
411 |
| చ. |
మఱియు నతండు భూగగనమార్గములందొకవేళ నొక్కఁ డే యరదము నెక్కి క్రుమ్మరు నిరంకుశవృత్తిఁజరించు మత్త సిం ధురవిభుపోల్కి సత్పురుషదూషితవర్తన నొప్పుచున్ నిరం తరసుజనాపరాధకృతితత్పరమానసుఁడై క్రమంబునన్. |
412 |
| క. |
దివ్యులు వెఱఁగందఁగఁ బృ, థ్వీవ్యోమము లగల భేరి వేయించె “న య ష్టవ్య మదాతవ్య మహో, తవ్యం విప్రా” యనుచునుదాత్త ధ్వనులన్. |
413 |
| క. |
అని యిట్టుల భేరీరవ, మునఁజేసి సమస్తధర్మములు వారింపన్ మును లవినీతుండగు వే, నుని దుశ్చరితంబు జనమనోభయమగుటన్. |
414 |
| తే. |
కని కృపాయత్తు లగుచు నిట్లనిరి యిట్టి, రాజచోర భయంబు లీ భూజనులను బలసి యిరువంకలను బాధపఱుపఁ జొచ్చె, దారువందుల వహ్ని చందనమునఁ బెలుచ. |
415 |
| చ. |
అరయ నరాజకంబగు మహాభయముం దొలఁగింపఁగోరి యి ట్లెఱుఁగక యీ యనర్హుని మహీపతిఁ జేసినయట్టి దోషముం బరువడిఁ జెందె దుగ్ధరసపానమునం బరివృద్ధి నొందు న య్యురగభయంబు పోషకుని నొందినరీతి ననర్థహేతువై. |
416 |
| వ. | అదియునుంగాక | 417 |
| క. |
మునుకొని సునీథ గర్భం, బున జనియించియు స్వభావమున దుర్జనుఁడై యెనయఁబ్రజాపాలనమున, కును బాల్పడి ప్రజల మన్నిగొనఁజొచ్చెఁగదే. |
418 |
| వ. | అదిగాక యీ వేనుండు పూర్వంబున జ్ఞాన సంపన్నులమైన మనచేత రాజుగాఁ జేయంబడియెఁ, గావున నిట్టివాని మన మందఱమును గూడి ప్రార్థింతము; లోకరక్షణార్థంబగుటఁ దద్దోషంబు మనల స్పృశింపదు; సమీచీనోక్తులంజేసి వీని ననునయింప వాని గ్రహింపకుండెనేని మున్న లోకధిక్కారాగ్ని సందగ్ధుండగు వీని మన తేజోమహాగ్ని చేత భస్మీభూతుం జేయుద మని యాలోచించి గూఢమన్యు లగుచు వేనునింగదియంజని యతని కిట్లనిరి. | 419 |
| క. |
నరపాలక! నీ కాయువు, సిరియును బలమును యశంబుఁ జేకుఱు, వృద్ధిం బొరయుదుగా కనుచు మనో, హరముగ నాశీర్వదించి యతివినయమునన్. |
420 |
| వ. | ఇట్లనిరి! నరేంద్రా! యే మొక్కటి విన్నవించెద మవధరింపుము; పురుషులకు వాఙ్మనఃకాయ వృత్తుల వలన నాచరించు ధర్మంబు సమస్త లోకంబులను విశోకంబులం జేయు; నసంగులయినవారికి మోక్షంబు నిచ్చు నట్టి ధర్మంబు ప్రజలకు క్షేమకారణంబు గావున నీయందుఁ జెడకుండుంగాక యని పలికి మఱియు ధర్మంబు నాశంబు నొందిన, నైశ్వర్యంబుచే రాజు విడువంబడు నని చెప్పి వెండియు నిట్లనిరి; దుష్టచిత్తులగు సమాత్యులవలనను, దస్కరులవలనను, బ్రజలు నాశంబు నొందకుండ రక్షించుచు, యథాన్యాయంబుగ వారలచేఁ గరంబు గొనుచునుండు మహీపతి యిహపర సౌఖ్యంబుల నందు; నదియునుం గాక, యెవ్వని రాష్ట్రంబున నే పురంబున యజ్ఞేశ్వరుండయిన పురుషోత్తముండు నిజవర్ణాశ్రమోచితంబయిన ధర్మంబుగల వారిచేత యజింపంబడు, నట్టి నిజశాసనవర్తియగు రాజువలన సర్వభూతభావనుండును, మహాభాగుండును, భగవంతుండును నగు సర్వేశ్వరుండు సంతోషించిన రాష్ట్రాధిపతికి సర్వసౌఖ్యంబులుఁ బ్రాపించు; లోకపాలకు లగువారు సర్వేశ్వరుని కొఱకు బలిప్రదానంబులు సేయుదురు; సమస్తలోక దేవతా యజ్ఞాది సంగ్రహుండును, వేదమయుండును, ద్రవ్యమయుండును, దపోమయుండును నగు నారాయణుని విచిత్రంబులైన యజ్ఞంబులచేత యజనంబు నేసిన నీకు నభయంబగు; మోక్షంబునుం గలుగు కావున; నీ రాజ్యంబున మఖంబులు సేయు మని యాజ్ఞాపింపుము. నీ దేశంబునం జేయంబడిన యజ్ఞంబులచేత హరికళాయుక్తంబులగు దేవగణంబులు స్విష్టంబులై, తుష్టంబులగుచు భవదీయవాంఛితార్థంబుల నిత్తురు; కావున దేవతాతిరస్కారంబు నీకు యుక్తంబు గాదు; వేదచోదితంబులగు ధర్మంబులందాసక్తుండవు గమ్మనిన వేనుండిట్లనియె. | 421 |
| క. |
మునులారా! మీర లిప్పుడు, నను నీగతిఁ బడుచుఁదనమునంబలికితి; రై నను నది యధర్మ; మందుల, నెనయఁగ ధర్మమనఁగలదె? యెచ్చట నైనన్. |
422 |
| వ. | అదియునుంగాక. | 423 |
| చ. |
ఎనయఁగ జారకామిని నిజేశుని మ్రుచ్చిలి జారపూరుషుం దనపతిఁ గాఁ దలంచు గతిఁ దద్దయు మూఢమనస్కులై తన ర్చిన నరపాలరూపము ధరించిన యీశ్వరు నన్నెఱుంగ క న్యుని భజియింప మీ రిహపరోన్నత సౌఖ్యము లంద రెన్నఁడున్. |
424 |
| వ. | అని మఱియు నిట్లనియె; యజ్ఞ పురుషుం డన నెవ్వం; డెవ్వనియందు మీకు భక్తి స్నేహంబు లుదయించె? భర్తృస్నేహవిదూరంబులై కుయోషిద్గణంబులు జారునందుం జేయు భక్తిచందంబునఁ బలికెద; రదియునుంగాక. | 425 |
| క. |
హరిహరహిరణ్యగర్భ, స్వరధీశ్వరవహ్నిశమనజలధిపతిమరు న్నరవాహనశశిభూరవి, సురముఖ్యులు నృపశరీరసూచకు లగుటన్. |
426 |
| క. |
పరికించి నను భజింపుఁడు, ధరణీశుఁడు సర్వదేవతామయుఁడగు, మ త్సరముడుగుఁడు నాకంటెను, బురుషుఁడు మఱి యెవ్వఁడగ్రపూజార్హుఁడిలన్? |
427 |
| వ. | అదిగాక మీరు నాయందు బలివిధానంబులు సేయుండని పాపకర్ముండు నసత్ప్రవర్తకుండు నష్ట మంగళుండు విపరీతజ్ఞానుండు నగు వేనుండు పండితమాని యగుచుం బలికి మునుల వచనంబులు నిరాకరించి యూరకున్న నమ్మునులు భగ్నమనోరథులై తమలో నిట్లని; రీ దారుణకర్ముం డయిన పాతకుండు హతుండగుంగాక! వీఁడు జీవించెనేని వీని చేత నీ జగంబులు భస్మంబులు గాఁగల; విది నిశ్చయంబు; దుర్వృత్తుండగు వీఁడు మహారాజ సింహాసనంబున కర్హుండు గాఁడు; వీఁడు మున్నే సర్వేశ్వరు ననుగ్రహంబున నిట్టి విభూతి యుక్తుం డయ్యె నట్టి యజ్ఞపతియైన శ్రీవిష్ణుని నిందించుచున్నవాడు; గావున నిర్లజ్జుండైన హరిదూషకుని హననంబు సేయవలయునని మునులుద్యోగించి యాత్మప్రకాశితంబైన క్రోధంబునంజేసి హుంకారమాత్రంబున నా యీశ్వర నిందాహతుం డగు వేనునిం బొలియఁ జేసి రంత. | 428 |
| క. |
అరసి సునీథయు శోకా, తురయై తన సుతుఁడు దనువుఁదొఱఁగిన దదనం తరమునను యోగశక్తిం, బరువడి నిజ తనయు తనువుఁబరిపాలించెన్. |
429 |
| వ. | అంత నొక్కనాఁడు. | 430 |
| సీ. |
మునివరేణ్యులు భక్తి దనర సరస్వతీ సలిలంబులను గృతస్నానులగుచు మునుకొని తత్తీరమున నగ్నిహోత్రముల్ విలసిల్ల నియతిఁ గావించి యచటఁ దవిలి సత్పురుషకథా వినోదంబులు సలుపుచు నుండంగ సకలలోక భయదంబులగు మహోత్పాతముల్ దోఁచిన మసలి లోకంబు లమంగళములు |
|
| తే. |
వొరయకుండెడుఁగా కని బుద్ధిలోనఁ, దలఁచుచుండఁగఁ బెలుచ నుదగ్ర మగుచు సర్వదిశలను బాంసువర్షంబు గురిసెఁ; దస్కరులు సర్వజనుల విత్తములు గొనిరి. |
431 |
| వ. | ఇట్టి లోకోపద్రవం బెఱింగి జననాథుం డుపరతుం డగుటంజేసి జనపదంబు లరాజకంబులై యన్యోన్య హింసల నొందుచుం దస్కర బాధితంబు లగుచు నుండుట యెఱింగియుఁ దన్నివారణంబునకు సమర్థు లయ్యును జోరాదిబాధలం గనుంగొనుచు మునులు వారింపక యుండిరి; మఱియు సమదర్శనుండును శాంతుండును మననశీలుండును నగు బ్రాహ్మణుండు దీనుల నుపేక్షించిన నతని తపంబు భిన్నభాండగతం బయిన క్షీరంబు చందంబున స్రవించుం గావున నంగవసుధాధీశవంశోద్భవులు హరిపదాశ్రయులగుటం జేసియు వీరల వంశంబు విచ్ఛిత్తి నొందింప ననర్హంబు గాన స్థాపనీయం బని నిశ్చయించి మృతుండైన వేనుని కళేబరంబు డగ్గఱ వచ్చి తదూరుమథనంబు గావింప నందు. | 432 |
| సీ. |
ఘన కాక కృష్ణ సంకాశ వర్ణుండును హ్రస్వావయవుఁడు మహాహనుండు హ్రస్వబాహుండును హ్రస్వపాదుండును నిమ్న నాసాగ్రుండు నెఱియు రక్త నయనుండుఁ దామ్రవర్ణ శ్మశ్రుకేశుండు నతిదీనవదనుండు నైన యట్టి యొక్క నిషాదకుం డుదయించి యేమి సేయుదునని పలుకుచునున్నఁ జూచి |
|
| తే. |
వరమునులు ‘నిషీద’ యనుచుఁ బలుకుటయును, దాన వాఁడు నిషాదాభిధానుఁ డయ్యె, నతని వంశ్యులు గిరికాననాళి వేను, కల్మషముఁ దెల్పుచుండిరి కడఁక మఱియు. |
433 |
| క. |
కని వా రనపత్యుం డగు, మనుజేంద్రుని బాహు లంత మథియించిన నం దనఘం బగు నొక మిథునము, జనియించెను సకలజనులు సమ్మదమందన్. |
434 |
| వ. | అందు లోకరక్షణార్థంబుగా నారాయణాంశంబున నొక పురుషుండును, హరికి నిత్యానపాయిని యగు లక్ష్మీకళాకలితయు గుణంబులకు భూషణంబులకు నలంకార ప్రదాత్రియు నగు కామినియు జనియించె, నందుఁ బృథుశ్రవుండును పృథుయశుండు నగుట పృథు చక్రవర్తియను పేరం బ్రసిద్ధుం డయ్యె; నయ్యంగనయు నర్చియను నామంబునందనరుచు నతని వరియించె, నా సమయంబున. | 435 |
| సీ. |
అందంద కురియించి రమరులు మునినాథవితతి మోదంబంద విరులవానఁ; బరమానురక్తి శుంభల్లీలఁ జూపట్టె సురపతివీట నచ్చరలయాట; కర్ణరసాయనక్రమమున వీతెంచెఁ బఱపైన తేటకిన్నరులపాట; యనిమిషకరహతంబై చాలఁజెలఁగెను విభవోత్సవంబు దుందుభిరవంబు; |
|
| తే. |
మునినుతి సెలంగె శిఖిగుండముల వెలింగె, నంత నచటికి సరసీరుహాసనుండు గరుడగంధర్వకిన్నరగణముతోడ, నర్థిఁజనుదెంచి సమ్మోద మతిశయిల్ల. |
436 |
| వ. | అంత. | 437 |
| కవిరాజవిరాజితము. |
అరయఁగ వైన్యుని దక్షిణహస్తమునందు రమారమణీసుమనో హరు లలితాయుధచిహ్నము లంఘ్రులయందు సమగ్రహలాంకుశ భా స్వరకులిశధ్వజచాపసరోరుహశంఖవిరాజితరేఖలు వి స్ఫురగతి నొప్పఁబితామహముఖ్యులు చూచి సవిస్మయులైరి తగన్. |
438 |
| వ. | ఇతండు నారాయణాంశ సంభూతుండు నితని యంగన రమాంశ సంభూతయుం గానోపుదురని తలంచి రయ్యవసరంబున బ్రహ్మవాదులగు బ్రాహ్మణోత్తము లతనికి విధ్యుక్త ప్రకారంబున రాజ్యాభిషేకంబు గావించిరి; తదనంతరంబ. | 439 |
| క. |
సరిదంభోనిధిఖగమృగ, ధరణీసురవర్త్మపర్వతప్రముఖములై పరఁగిన భూతశ్రేణులు, నరవరునకుఁ దగు నుపాయనము లిచ్చె నొగిన్. |
440 |
| తే. |
సమధికఖ్యాతి నా పృథు చక్రవర్తి, దేవియగు నర్చితోఁగూడ దివ్యవస్త్ర గంధమాల్యవిభూషణకలితుఁడగుచుఁ, బావకుఁడుఁబోలె సత్ప్రభాభాసి యయ్యె. |
441 |
| సీ. |
రాజరా జా పృథురాజుకు హేమమయంబైన వీరవరాసనంబు జలపతి జలకణస్రావకంబగు పూర్ణచంద్రసన్నిభసితచ్ఛత్త్రకమును బవమానుఁడతులశోభన మగు వాలవ్యజన సమంచితసితచామరములు ధర్ముండు నిర్మలోద్యత్కీర్తిమయమగు మహనీయనవ పుష్పమాలికయును |
|
| తే. |
జంభవైరి కిరీటంబు శమనుఁడఖిల, జననియామకదండంబు జలజభవుఁడు నిగమమయకవచంబు వాణీలలామ, స్వచ్ఛ మగు నవ్యహార మొసఁగిరి మఱియు. |
442 |
| సీ. |
దామోదరుండు సుదర్శనచక్రంబు నవ్యాహతైశ్వర్య మబ్జపాణి చంద్రార్ధధరుఁడర్ధచంద్రరేఖాంకితకమనీయకోశసంకలితఖడ్గ మంబిక శతచంద్ర మను ఫలకముఁజంద్రుఁడమృతమయశ్వేతహయచయంబుఁ ద్వష్ట రూపాశ్రయోదాత్తరథంబును భానుండు ఘృణిమయబాణములును |
|
| తే. |
శిఖియు నజగోవిషాణసంచిత మహాజ, గవ మనందగు చాపంబు నవనిదేవి యోగమయమైన పాదుకాయుగము గగన, చరులు గీతంబు లిచ్చిరి సంతసమున. |
443 |
| వ. | వెండియుం బ్రతిదివసంబు నాకాశంబు పుష్పంబులు గురియింప, మహర్షులు సత్యంబులైన యాశీర్వచనంబులు సలుప, సముద్రుండు శంఖంబును, నదంబులు పర్వతంబులు నదులును రథమార్గంబు నొసంగెఁ; దదనంతరంబ సూత మాగధ వంది జనంబులు దన్ను నుతియించినం బ్రతాపశాలి యగు నవ్వైన్యుండు మందస్మితసుందరవదనారవిందుండై చతురవచనరచనుండగుచు మేఘగంభీరభాషణంబుల వారల కిట్లనియె. | 444 |
| సీ. |
వందిమాగధసూతవరులార! నా యందుఁగమనీయగుణములు గలిగెనేని యర్హంబు నుతిసేయ; నవి లేవు నాయందు; నది గాన మీ నుతి వ్యర్థ మయ్యె; నిటమీద గుణముల నేపారి యుండిన నపుడు నుతించెద రగుట మీద సభ్యనియుక్తులై చతురత నుత్తమశ్లోకుని గుణము లస్తోకభూప్ర |
|
| తే. |
సిద్ధములు గాన సన్నుతి సేయుఁ డజుని, నతని బహువిధభావంబు లభినుతింప నలవిగాకయె యుండుదు; రదియుఁగాక చతురమతులార! మాగధజనములార! |
445 |
| వ. | మఱియు మహాత్ముల గుణంబులు దనయందు సంభావితంబులు సేయ సామర్థ్యంబు గలిగిన నందు మహాత్ముల గుణంబులు ప్రసిద్ధంబులు గావునం దత్సమంబుగా నెట్లు నుతింపవచ్చు? నెవ్వండే నొకండు శాస్త్రాభ్యాసంబునం దనకు విద్యా తపోయోగ గుణంబులు గలుగు నని పలికిన వానిం జూచి సభ్యులు పరిహసింతు; రది కుమతి యగువాఁడెఱుంగం; డదియునుంగాక. | 446 |
| క. |
అతివిశ్రుతులు సులజ్జా, న్వితులు మహోదారు లధికనిర్మలు లాత్మ స్తుతిపరనిందలు దోషము, లతిహేయము లని తలంతు రాత్మల నెపుడున్. |
447 |
| క. |
వందిజనంబులు లోకము, లందు నవిదితవరకర్ములగు భూపతులన్ నందించు టవశ్యంబై, నం దగదు నుతింప శిశుజనంబులపగిదిన్. |
448 |
| క. |
అన సూతవందిమాగధ, జను లా నరనాయకుని వచనములు వినియున్ మునిచోదితులై క్రమ్మఱ, ననురాగము లుప్పతిల్ల న మ్మనుజేంద్రున్. |
449 |
| వ. | అమృతోపమానంబులయిన మధురవాక్యంబుల నిట్లనిరి. | 450 |
| క. |
వేనాంగసంభవుండవు, శ్రీనాథకళాంశజుఁడవు చిరతరగుణ స మ్మానార్హుండ వతర్కిత, మైన భవన్మహిమఁబొగడ నలవియె మాకున్. |
451 |
| క. |
అని వెండియు నిట్ల ని; రై, నను నొకమార్గంబు గలదు నందింప భవ ద్ఘనచరితామృతపానం, బునఁ జేసియు మునులవచనములఁజేసి తగన్. |
452 |
| వ. | శ్లాఘ్యంబులైన భవదీయచరిత్రంబుల స్తుతియించెద మని యిట్లనిరి. | 453 |
| సీ. |
ఈ వైన్యుఁడఖిలలోకావళి ధర్మానువర్తనముల నెప్డు వఱలఁజేసి ఘనధర్మమార్గవర్తనులలో ధన్యుఁడై ధర్మసేతువుఁ బ్రీతిఁదగిలి ప్రోచు; ధర్మశాత్రవులను దండించు నష్టదిక్పాలకమూర్తి సంకలితుఁడగుచు; నయ్యయి కాలంబులందు భాషణదానములఁ బ్రజారంజనములఁదనర్చు; |
|
| తే. |
సవనసద్వృష్టి కరణాదిసక్తుఁడగుట, నుభయలోకంబులకుఁబ్రీతి నొదవఁజేయు; న్యాయమార్గంబునను భూజనాళి ధనముఁ, బుచ్చుకొను నిచ్చు సూర్యుండుఁబోలె నితఁడు. |
454 |
| వ. | మఱియును. | 455 |
| సీ. |
సర్వభూతములకు సముఁడును బర్యతిక్రమమున లోకాపరాధములను నతిశాంతి సంయుక్తుఁడై సహించుచు నార్తు లగువారి యెడఁ గృపాయత్తుఁ డగుచు నరరూపధారియౌ హరిమూర్తి గావున నింద్రుండు వర్షించి యెల్ల ప్రజల రక్షించుగతిఁ దాను రక్షించు; నమృతాంశు సన్నిభ వదనాబ్జ సస్మితాను |
|
| తే. |
రాగ మిళితావలోకన రాజిఁజేసి, సకల జనులకు సంప్రీతి సంభవింపఁ జేయు సంతతమును గూఢచిత్తుఁ డగుచు, శత్రువరుల కగమ్యుఁడై సంచరించు. |
456 |
| వ. | అని వెండియుఁ బ్రవేశ నిర్గమ శూన్యమార్గ నిరూఢ కార్యుండును, నపరిమిత మహత్త్వాది గుణగణైక ధాముండును, సముద్రునిభంగి గంభీర చిత్తుండును, సుగుప్తవిత్తుండును, వరుణుండునుంబోలె సంవృతా త్ముండును శాత్రవాసహ్య ప్రతాప యుక్తుండును, దురాసదుండును, సమీపవర్తియయ్యును దూరస్థునిభంగి వర్తించుచు వేనారణిజనిత హుతాశనుండు గావున హుతాశనుచందంబున ననన్యదుస్స్పర్శనుండునై, చారుల వలన సకలప్రాణి బాహ్యాభ్యంతర కర్మంబులం దెలియుచు; దేహధారులకు నాత్మభూతుండై సూత్రాత్మకుండైన వాయువు భంగి వర్తించుచు, నాత్మస్తుతి నిందలవలన నుదాసీనుం డగుచు, ధర్మపథంబున వర్తించుచు, నాత్మీయ సుహృద్బంధువుల వలనం దప్పు గలిగినను దండించుచు, నాత్మ శత్రువులనైన నదండ్యుల దండింపక ధర్మమార్గ గతుం డగుచుం, దన యాజ్ఞాచక్రం బప్రతిహతం బగుచు మానసాచలపర్యంతంబు వర్తింప సూర్యుండు నిజకిరణంబులచేత నెంత పర్యంతంబు భూమిం బ్రకాశింపంజేయునంత పర్యంతంబు నిజగుణంబులచేత లోకంబుల రంజిల్లంజేయు; నదియునుం గాక ప్రకృతి రంజకంబులైన గుణంబుల చేత దృఢవ్రతుండును, సత్యసంధుండును, బ్రహ్మణ్యుండును, సర్వభూతశరణ్యుండును, వృద్ధసేవకుండును, మానప్రదుండును, దీనవత్సలుండును, బరవనితా మాతృభావనుండును, దన పత్ని నర్ధశరీరంబుగాఁ దలచువాఁడును నగుచుం బ్రజలయెడఁదండ్రివలెఁబ్రీతి సేయుచు రక్షించుచుండు మఱియును. | 457 |
| సీ. |
తలపోయ బ్రహ్మవిద్యానిష్ఠ జనములకనయంబుఁ గింకరుండైనవాఁడు నఖిలశరీరగుఁడాప్తసుహృజ్జన తానందకరుఁడన నలరువాఁడు సంసారఘనకర్మసంగహీనులయందు సంగసంప్రీతుఁడై జరుగువాఁడు దుర్మార్గమనుజసందోహంబునకు నుగ్ర దండధరుండనఁదనరువాఁడు |
|
| తే. |
ప్రకృతిపూరుషావేశుఁడై పరఁగువాఁడు, భగవదవతారయుక్తుఁడై నెగడువాఁడు నగుచు వర్తించు సమ్మోద మతిశయిల్లఁ జారుతరమూర్తి యీ రాజచక్రవర్తి. |
458 |
| వ. | మఱియుం ద్ర్యధీశుండు గూటస్థుఁడుఁ బరమాత్మయు బ్రహ్మకళారూపుండు నగువాఁడునునై యుదయించెం గావున నితనియందు నవిద్యారచితంబైన భేదంబు నిరర్థకం బగు నని పెద్దలగువారలు చూతురు, మఱియును. | 459 |
| సీ. |
ఉదయాద్రిపర్యంత ముర్వీతలం బేకవీరుఁడై రక్షించి వెలయు నీతఁ డొకనాఁడు విజయ యాత్రోత్సవం బేపార సన్నద్ధుఁడై మణిస్యందనంబు నెక్కి చాపముఁబూని దిక్కుల సూర్యుని పగిదిని శత్రుభూపాలతమము విరియింతు నని చాల వెలుఁగొందుచును ధరా చక్ర ప్రదక్షిణశాలి యగుచుఁ |
|
| తే. |
దిరుగునెడ సర్వదిక్పాలవరసమేత, పార్థివోత్తమనికర ముపాయనంబు లిచ్చి తనుఁజక్రపాణికి నెనయు నాది, ధరణివిభుఁడని నుతియించి తలఁతు రెదల. |
460 |
| క. |
ఈ నృపతి ధరాచక్రము, ధేనువుగాఁజేసి పిదుకు ధృతి నఖిలపదా ర్థానీకము విబుధులు స, న్మానింపఁగఁ బ్రజకు జీవనప్రదుఁడగుచున్. |
461 |
| చ. |
అమరవరేణ్యుఁబోలి యనయంబు నితండును గోత్రభేదన త్వమునఁ జెలంగుఁ దా నజగవప్రదరాసన శింజినీనినా దమున విరోధిభూపతులు దల్లడ మంద నసహ్యసింహవి క్రమమున సంచరించునని కౌతుక మొప్పఁగఁ బల్కి వెండియున్. |
462 |
| వ. | ఇట్లనిరి. | 463 |
| చ. |
సకలజగన్నుతుండితఁడు చారుయశోనిధి యశ్వమేధముల్ ప్రకటముగా శతంబు దగఁ బావనమైన సరస్వతీతటీ నికటధరిత్రిఁ జేయుతఱి నేర్పున నంతిమయాగమందుఁ గొం జక మఖసాధనాశ్వమును జంభవిరోధి హరించు నుద్ధతిన్. |
464 |
| సీ. |
ఒకనాఁడు నిజమందిరోపాంత వనముకుఁ జని యందు సద్గుణశాలి యైన ఘనుని సనత్కుమారునిఁగాంచి యమ్మునివరు బ్రహ్మతనయుఁగా నెఱిఁగి భక్తిఁ బూజించి విజ్ఞానమును బొందు నచ్చట బ్రహ్మవేత్తలు మునిప్రవరు వలన మానితలబ్ధవిజ్ఞానులై వర్తింతు, రి మ్మహారాజు మహీతలంబు |
|
| తే. |
నందు విశ్రుతవిక్రముఁడగుచు మిగులఁ దన కథావళి భూప్రజాతతి నుతింప నక్కడక్కడ వినుచు శౌర్యమున నఖిల, దిక్కులను గెల్చి వర్తించు ధీరయశుఁడు. |
465 |
| వ. | ఇట్లు విపాటిత విరోధి శల్యుండు, సురాసుర జేగీయమాన నిజవైభవుండునై ధరాచక్రంబున కితండు రాజయ్యెడి నని యివ్విధంబున స్తోత్రంబు సేసిన వంది మాగధ సూతజనంబులం బృథుచక్రవర్తి పూజించి మఱియుం బ్రాహ్మణ భృత్యామాత్య పురోహిత పౌరజానపద తైలిక తాంబూలిక ప్రముఖాశేష జనంబులం దత్తదుచిత క్రియలం బూజించె నని మైత్రేయుండు సెప్పిన విని విదురుం డిట్లనియె. | 466 |