పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
పృథుచక్రవర్తి సభాసదులకు సద్ధర్మముల నుపదేశించి బ్రాహ్మణ ప్రశంస సేయుట
వ. అట్లెఱింగించి వెండియు నిట్లనియె, ని వ్విధంబున నశేష గుణ విజృంభితంబును, నిర్దోషంబును, సత్పురుష సత్కృతంబును నగు పృథుచక్రవర్తి యశంబును బ్రకటంబుగాఁ జేయంజాలు మైత్రేయునింజూచి మహాభాగవతుండైన విదురుండిట్లనియె. 561
సీ. మునినాథ! విను పృథుజనపాలచంద్రుండు సొబగొప్ప మేదినీసురులచేత
రాజ్యాభిషేకసంపూజ్యుఁడై దేవతా గణముచే లబ్ధార్హ గుణుఁడు నగుచు
వైష్ణవతేజంబు వలనొప్ప ధరియించి యర్థి నే యే కర్మ మాచరించె
నది నాకు నెఱిఁగింపు మనఘాత్మ! భూమి యే రూఢి గవాకృతి రూఢ యెవని
 
తే. విక్రమోద్దీప్తయై యొప్పి వెలయునట్టి, కర్మమున నిప్డు రాజన్యగణము బ్రదుకు
నట్టి పృథుకీర్తి ధరలోన నతివివేకి, దవిలి యెవ్వఁడు వినకుండు ధన్యచరిత!
562
క. నావుడు విని మైత్రేయుం, డా విదురునిఁజూచి పలికె నతి వినయమునం
బావనచరితుఁడు పృథుఁడు ధ, రావరనుతుఁడలఘుయశుఁడు ప్రమదంబలరన్‌.
563
సీ. రంగదుత్తుంగతరంగగంగాయమునామధ్యమందు నున్నతి వసించి
కైకొని ప్రారబ్ధకర్మ క్షయార్థమై యఖిలపుణ్యంబుల ననుభవించు
చును సర్వదేశంబులను దనయాజ్ఞ యప్రతిహతసత్ప్రతాపమునఁజెల్లఁ
బూని సప్తద్వీపములకుఁదానొక్కండ వైష్ణవభూసురావళికిఁ దక్కఁ
 
తే. దక్కుఁగల్గిన ప్రజకెల్ల దండధరునిఁ, బోలి వర్తించుచును గొంతకాల మరుగఁ
దవిలి యొకనాఁడు దీర్ఘసత్త్రంబు సేయ, నర్థిఁగైకొని దీక్షితుండయ్యె, నందు.
564
తే. రాజఋషి దేవఋషి పితృ బ్రహ్మ ఋషులు, జనవరునిచేత విహితపూజనము లొంది
సమధికైశ్వర్యగతి నున్న సమయమునను, జిరశుభాకారుఁడా రాజశేఖరుండు.
565
సీ. ఉన్నతోన్నతుఁడు సముత్తుంగభుజుఁడు సన్మహనీయతరశోభమానముఖుఁడుఁ
జారుసంపుల్లకంజారుణేక్షణుఁడు సునాసాపుటుండు మందస్మితుండు
వక్రసూక్ష్మ స్నిగ్ధ వరనీలకేశుండుఁ గమనీయరుచి కంబుకంధరుండు
సుభగవిశాలవక్షుండును ద్రివళిశోభితమధ్యభాగుండుఁ బృథునితంబ
 
తే. మండలుండు నావర్తసమాననాభి, వివరుఁడును గాంచనస్తంభవిలసదూరు
రాజితుండును నరుణచరణుఁడును ధృత, నవదుకూలోత్తరీయుఁడున్నతయశుండు.
566
వ. మఱియు నియమ నిమిత్తంబునం బరిత్యక్త భూషణుం డగుటం జేసి వ్యక్తాశేష గాత్రశ్రీకుండును, గృష్ణాజినధరుండును, శ్రీమంతుండును, గుశహస్తుండును, గృతోచితుండును, శిశిరస్నిగ్ధ తారాక్షుండును నైన పృథుచక్రవర్తి సభామధ్యంబునం దారాగణ మధ్య విభాసితుండును, సకల జనాహ్లాదకరుండును నగు సుధాకరుండునుంబోలె వెలుంగుచు లేచి నిలుచుండి సదస్య సంతోషదాయకంబులును, జిత్రపదవిరా జితంబులును, బ్రసన్నంబులును, పరిశుద్ధంబులును, గంభీరార్థంబులును, నవ్యాకులంబులును నైన భాషణంబుల నిట్లనియె. 567
క. వినుఁడీ సభ్యులు ధర్మము, ననయము నెఱుఁగంగఁగోరునట్టి జనుఁడు దాఁ
దన తలఁపునఁగల యర్థముఁ, జను నెఱిఁగింపంగ ధీరసత్పురుషులకున్‌.
568
సీ. ఏను నీ లోకవితానంబు నెల్లను శాసించి భూప్రజాసంతతులను
దత్త ద్విహిత వృత్తి దానంబులను జేసి రక్షింప వివిధమర్యాదఁ దప్పి
పోకుండ నిలుపుటకై కమలజుచే నియోగింపఁబడితి, నిట్లొనరియుండ
నట్టి ప్రజాపాలనా ద్యనుష్ఠానవశంబునఁ బ్రాక్కర్మ సాక్షి యీశుఁ
 
తే. డెట్టివానికి సంతుష్టి నెసఁగుచుండు, నట్టివానికి నే లోకమండ్రు బుధులు
కామదుఘములు నైన లోకములు నాకు, సరవిఁగలుగు ననుష్ఠానపరుఁడ నగుట.
569
వ. ఇట్లు ప్రజలను ధర్మంబులయందు ననుశాసింపక యర్థ కాముండై వారివలన నప్పనంబులు గొనెనేని వారల పాపంబు దనకుఁ బ్రాపింపం దేజోహీనుండై భూవిభుండు సెడుం, గావునం బ్రజలు భూపతిహితార్థంబునకు స్వార్థంబునకు నసూయారహితులై వాసుదేవార్పణ బుద్దిం జేసి ధర్మంబు నెప్పుడు నాచరింపవలయు, నిదియ నన్ను ననుగ్రహించుట, యదియునుం గాక పితృదేవర్షితుల్యులగు మీర లనుమోదించి కర్తయు ననుశాసకుండు ననుజ్ఞాతయు నయిన నాకుఁ బరలోకంబున నే ఫలంబు గలుగు నట్టి ఫలంబునకు సదృశంబైన కర్మం బాచరింపవలయు, నట్లయిన సంతోషంబు నొందుదు ననిన వార లా రాజేంద్రున కిట్లనిరి. 570
క. జననాయక! ప్రజ లిర వొం, దిన ధర్మము లెల్ల వాసుదేవార్పణ బు
ద్ధిని జేయవలయు నంటివి, యనయంబును వాసుదేవుఁడనఁగలఁడె మహిన్‌?
571
సీ. అన విని వారికి మనుజేశుఁడను నర్హ, తములార! వినుఁడయ్య తవిలి మీరు
యజ్ఞాధిపతియైన యఖిలేశ్వరుఁడు గొన్ని, మతములఁగలఁడు ధీమంతులార!
యట్లైన మీరలు నందుకు విప్రతి, పత్తి గల్గుట నుపపన్న మరయఁ
గాదంటిరేని యా ఘనునిచే రచితమై, కాంతిమంతమగు జగంబు గానఁ
 
తే. బడుచునున్నది! యిట్టి ప్రపంచరచిత, కర్మ వైచిత్ర్య మ మ్మేటి గలుగకున్న
నమర నది తదుక్తు లుపపన్నములు గావు!, కాన నవ్వాసుదేవుండు గలఁడు మఱియు.
572
వ. అదియునుం గాక యీ జగద్వైచిత్ర్యంబు కర్తయైన యీశ్వరుండు లేకున్నం గర్మవశంబునం జేసి యుపపన్నంబగు నంటి రేని. 573
సీ. పూని ప్రియవ్రతోత్తానపాద ధ్రువ మనుల కస్మత్పితామహుఁ డనంగఁ
దగు నంగ మేదినీధవునకు మఱియును వినుతి కెక్కిన పృథివీపతులకుఁ
బద్మసంభవ భవ ప్రహ్లాద బలిచక్రవర్తి ప్రముఖ భాగవతుల కర్థి
వర్గసుస్వర్గాపవర్గంబులకు ననుగతకారణుం డన ఘనత కెక్కి
 
తే. హీను లగు మృత్యుదౌహిత్రుఁడైన వేన, ముఖ దురాత్ములు ధర్మవిమోహితులును
దక్కఁ దక్కిన వారికిఁ దాఁ బ్రపన్న, వరదుఁడై యిచ్చు నభిమతావళుల నతఁడు.
574
వ. ఇట్టి విద్వదనుభవంబున భువనహితుండగు వాసుదేవుండు లేఁడనుట యుపపన్నంబుగా, దదియునుంగాక. 575
ఉ. భూరితపోభిరామమునిపూజన మెవ్వని పాదపద్మ సే
వారతి వృద్ధిఁబొంది యనివారణఁబూర్వభవానుసార సం
సారమహోగ్రతాపము భృశంబుగఁబాపఁగ నోపుఁదత్పదాం
భోరుహజాతదేవనదిఁబోలి యశేషమనోఘహారియై.
576
వ. మఱియు. 577
చ. అనుపమభక్తి నెవ్వని పదాంబుజమూలము మందిరంబుగా
ననయముఁబొందు వాఁడు నిహతాఖిల భూరి మనోమలుండు స
ద్వినుత విరక్తి బోధ ధృతి వీర్య విశేష సమన్వితుండు దా
ననఁ దగి భూరి సంసృతి మహత్తర దుఃఖము నందఁ డెన్నఁడున్‌.
578
క. నారాయణుండు జగదా, ధారుండగు నీశ్వరుండు, దలఁప నతనికిన్‌
లే రెందు సములు నధికులు, ధీరోత్తముఁడతఁడు నద్వితీయుండగుటన్‌.
579
వ. అదియునుంగాక. 580
ఉ. కర్మవశంబునన్‌ జగము గల్గును హెచ్చు నడంగు నన్నచోఁ
గర్మము బుద్ధిఁజూడ జడకార్యము! గాని ప్రపంచకల్పనా
కర్మమునందుఁ గర్త యనఁగా విలసిల్లఁగఁజాల, దీ జగ
త్కర్మకకార్యకారణము గావున నీశుఁడు విష్ణుఁడారయన్‌.
581
వ. కావున మీర ల వ్వాసుదేవుని నధికారానుసారంబున నిశ్చితార్థ ఫలసిద్ధి గలవారలై మనో వాక్కాయ కర్మంబుల నిష్కపటవృత్తిం దగిలి వినుతి నతిపరిచర్యా పూర్వకంబుగాఁ గామదుఘంబు లయిన యతని పాదపంకజంబులు భజియింపుం; డదియునుంగాక. 582
సీ. రూఢి నీశ్వరుఁడు స్వరూపంబునంజేసి పూని విశుద్ధవిజ్ఞానఘనుఁడు
నగుణుండు నయినఁ దా నరయని కర్మమార్గమునందు వ్రీహ్యాదిద్రవ్యములను
శుక్లాదిగుణము విస్ఫురదవఘాతాదిసత్క్రియలును మంత్రసంచయంబు
సంకల్పమును యాగసాధ్యమైనట్టి యఖండోపకారంబు ఘనపదార్థ
 
తే. శక్తియు మఱి జ్యోతిష్టోమసవనముఖ్య, నామత బహు విశేష గుణతను మెఱయు
నట్టి యధ్వరరూపమై యఖిల జగము, నందు ననిశంబుఁ బ్రఖ్యాతి నొందుచుండు.
583
వ. అదియునుం గాక దారుస్థితంబైన యనలంబు తద్దారు గుణంబులయిన దైర్ఘ్య వక్రత్వాదికంబుల ననుసరించు చందంబున నవ్యక్తంబు తత్‌క్షోభకంబయిన కాలంబును వాసనయు నదృష్టంబు నను కారణంబులచేతం బుట్టిన శరీరంబునందు విషయాకారంబయిన బుద్ధి నొంది తద్విషయాభివ్యంగ్యంబైన యానందస్వరూపుండగుచుఁ గ్రియాఫలంబునం బ్రసిద్ధి నొందునని చెప్పి వెండియు నిట్లను: మదీయజనంబు లి మ్మేదినీ తలంబున దృఢవ్రతులై యజ్ఞభుగీశ్వరుండును గురుండును నయిన సర్వేశ్వరుని, హరిని నిరంతరంబును స్వధర్మయోగంబునం బూజించు చున్నవారలు, వారు నన్నాశ్చర్యకరంబుగా ననుగ్రహించు వారని హరిభక్తిరతులైన య మ్మహాత్ముల నుతియించి వెండియు నిట్లనియె. 584
మ. వరసంపద్విభవప్రతాపసుమహైశ్వర్యంబులంబొల్చు నీ
ధరణీనాథులతేజ మంచితతపోదాంతిక్షమావిద్యలం
గర మొప్పారు ధరాసుపర్వహరిభక్త శ్రేణులం దెప్పుడున్‌,
ధరలోనంబ్రభవింప కుండునని యద్ధాత్రీవిభుండిట్లనున్‌.
585
చ. అరయఁగ నే ధరామరపదాంబుజరేణువు లర్థిఁదాల్చి య
ప్పరమపురాణపూరుషుఁడు బ్రాహ్మణదేవుఁడు నైనయట్టి యీ
శ్వరుఁడు సదానపాయినిని సాగరకన్యను సర్వలోక వి
స్ఫురితపవిత్రకీర్తియును బొంది విభూతిఁదనర్చెఁగావునన్‌.
586
సీ. ఏ వసుధామరసేవను జేసి యశేషగుణాన్వితస్థితిఁదనర్చు
సర్వేశ్వరుఁడు మఱి సంతుష్టుఁడగు నట్టి ధరణిదివిజులఁదద్ధర్మపరులు
నలఘువినీతులునై యవశ్యంబును సేవింపరే? ధరాదేవనిత్య
సేవచేఁ బురుషుఁడు చిరతర జ్ఞానవిద్యాభ్యాసి గాకున్న నైన నతఁడు
 
తే. వేగమున నంతరంగంబు విశద మగుటఁ, జేసి కైవల్యపదమును జెందు, నట్లు
గాన లోకులు భూదేవతానికరముఁ, దగిలి భజియింపవలయు నుదాత్తమతిని.
587
వ. మఱియు. 588
సీ. విజ్ఞానఘనుఁడన వెలయు నీశ్వరుఁడు త త్త్వజ్ఞానయుతులైన వారిచేత
దీపింప నింద్రాదిదేవతోద్దేశంబు నను భూమిసురముఖంబున హుతంబు
లగు హవిస్సులఁదృప్తి నందినగతి నచేతనమైన యా హుతాశనముఖంబు
వలన వేల్చిన హవిస్సులచేతఁ దృప్తుండు గాకుండు గావున లోకమందు
 
తే. నగ్ని ముఖమునకంటె ధరామరేంద్ర, ముఖము పరిశుద్ధ మత్యంతముఖ్య మనఁగఁ
దనరునది గాన భూసురార్చనము సకల, జనులుఁ గావింపఁదగు నార్యజనములార!
589
వ. అదియునుంగాక. 590
సీ. ఏ వేదమందేని నీ విశ్వ మెల్లను దర్పణ ప్రతిబింబితమగు వస్తు
నివహంబు కైవడిఁదివిరి ప్రకాశించు నట్టి విరజమును నవ్యయంబు
నగుచు సనాతనంబగు వేద మే ధరా దేవతాజన మనుదినముఁ దగిలి
మహితశ్రద్ధాతపోమంగళమౌన సంయమసమాధులఁబొలుపారుచుండి
 
తే. యర్థి సదసద్విచారులై యధికరింతు, రట్టివారల పదరజంబర్థిఁ దాల్చు
నలఘులకు సర్వపాపక్షయంబు నఖిల, సద్గుణావాప్తియును నగుఁజతురులార!
591
వ. కావున నట్టి విప్రపాద సరోజరేణువు లేనును గిరీటంబున ధరియింతు, నిట్లు బ్రాహ్మణ భజనంబునం జేసి యవాప్త సకల గుణుండును శీలధనుండును గృతజ్ఞుండును శ్రద్ధాయుక్తుండును నైన మహాత్ము నఖిల సంపదలుఁ బ్రాపించుం గావున గోబ్రాహ్మణ కులంబును ననుచర సమేతుం డయిన జనార్దనుండును నా యెడం బ్రసన్ను లయ్యెదరు గాక యని పలుకుచున్న పృథు చక్రవర్తిం గనుంగొని పితృదేవద్విజ సత్పురుషులు సంతుష్టాంతరంగులై సాధువాదంబుల నభినందించి యిట్లనిరి. 592
క. మనుజేంద్ర! నీ కతంబున, ననుపమఘనబ్రహ్మదండహతుఁడత్యఘ వ
ర్తనుఁడు నగునట్టి వేనుం, డనయము నరకంబువలన నర్థిఁదరించెన్‌.
593
వ. కావునం‘బుత్రేణ లోకాన్‌ జయతి’ యను వేదవచనంబు నిశ్చయం, బదియునుంగాక 594
చ. పురుషవరేణ్య! హేమకశిపుండు రమాలలనేశు నిందచే
నరకమునొందఁగోరియు గుణజ్ఞుఁడు భాగవతుండునైన యా
వరతనయప్రభావమున వాసికి నెక్కి విధూతపాపుఁడై
నిరయముఁబొందఁడయ్యె, నతి నిర్మలకీర్తిఁదనర్చెఁగావునన్‌.
595
క. అని పలికి వీరవర్యుం, డనఁదగు పృథుచక్రవర్తి నయుతాబ్దంబుల్‌
దనరఁగ జీవింతువు గా, కని తగ నాశీర్వదించి యభిమత మొప్పన్‌.
596
వ. వెండియు నిట్లనిరి, దేవా! నీకు సకలలోక భర్తయగు నారాయణునందు నిట్టి భక్తి వొడముటం జేసియు బ్రహ్మణ్య దేవుండు నుత్తమ శ్లోకుండునైన సర్వేశ్వరుని సత్కథాజాలంబు వ్యక్తంబు సేయుచున్న నీవు మాకు నాథుండ వగుటం జేసియు నేము ముకుంద దాసులమైతిమి, భవదీయ ప్రజానుశాసనంబు ప్రజానురాగంబు కారుణ్యమూర్తులైన మహాత్ములకు స్వభావంబులు, గావున నాశ్చర్యంబు గాదు, దైవసంజ్ఞితంబులయిన కర్మంబులచేత వినష్టజ్ఞానులమై పరిభ్రమించు మాదగు తమఃపారంబుఁ గంటి, మే సర్వేశ్వరుండు బ్రాహ్మణజాతి నధిష్ఠించి క్షత్త్రియులను, క్షత్త్రియజాతి నధిష్ఠించి బ్రాహ్మణులను నీ యుభయంబు నధిష్ఠించి విశ్వంబును భరియించు, నట్టి వివృద్ధ సత్త్వుండు సర్వరూపుండు మహాపురుషుండునైన పృథునకు నీశ్వర బుద్ధింజేసి యేము నమస్కరింతు మను సమయంబున. 597
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )