| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | చతుర్థస్కంధము |
| క. |
వినువీథినుండి మెల్లన, చనుదెంచిరి బాలసూర్యసంకాశతనుల్ జనవినుత! సిద్ధవర్యులు, సనకాదులు శేముషీవిచక్షణు లంతన్. |
598 |
| వ. | ఇట్లు సనుదెంచి | 599 |
| క. |
అనఘాత్ము లతిథిరూపం, బున రా గృహమేధి ప్రాణములు నుద్గతి చేఁ దనరినఁబ్రత్యుద్గతి వం, దనముల మరలం బ్రతిష్ఠితము లగు ననుచున్. |
600 |
| క. |
వినఁబడు వచనన్యాయం, బున నుద్గతములగు ప్రాణములఁగ్రమ్మఱఁ బొం దను గోరువాఁడునుంబలె, ననుచరఋత్విక్సదస్యుఁడై పృథుఁ డంతన్. |
601 |
| తే. |
ఇంద్రియేశుఁడు గంధాదికేష్ట గుణము, గూర్చి యుద్గమన క్రియఁ గోరి చేయు పగిదిఁ బృథుచక్రవర్తి సంభ్రమముతోడ, మహితభక్తిని బ్రత్యుద్గమంబు సేసె. |
602 |
| క. |
ఘనగౌరవమున న మ్ముని, జనచిత్తవశీకృతుండు సభ్యుఁడుఁ బ్రియుఁడున్ వినయానతకంధరుఁడై, జనవరుఁ డా పరమయోగిచంద్రుల నెలమిన్. |
603 |
| సీ. |
పూని యర్హాసనాసీనులఁగావించి కర మర్థి విధివత్ప్రకారమునను బూజించి తత్పదాంభోరుహక్షాళనసలిలంబు లాత్మమస్తమునఁ దాల్చి హాటకకలితసింహాసనాసీనులై విహితాగ్నులను బోలి వెలుఁగుచున్న శర్వాగ్రజన్ముల సనకాదులను జూచి యతులశ్రద్ధాసంయమాన్వితుండుఁ |
|
| తే. |
బరమసంప్రీతమతియునై పలికె రాజు, గోరి ‘యో మంగళాయనులార! పూర్వ భవమునందెద్ది మంగళప్రద సుకర్మ, మేను జేసితి? మిముఁజూడ నిపుడు గలిగె’. |
604 |
| వ. | అని వెండియు. | 605 |
| క. |
భువి నెవ్వని యెడ విప్రులు, భవుఁడును విష్ణుఁడు దదీయభక్తులును బ్రస న్నవదను లగుదురు వానికి, భువి దివిని నసాధ్యకర్మములు లే వరయన్. |
606 |
| వ. | అని మఱియు ననఘాత్ములార! లోకంబుల నీక్షించుచుం బర్యటనంబు సేయు మిమ్ము సర్వదర్శనుం డయిన యాత్మనుం గనుంగొనం జాలని సర్వదృశ్యంబు చందంబున నీ లోకంబు గనుంగొనంజాలకుండు నట్టి మహాత్ములరయిన మీ దర్శనంబునం జేసి యేను ధన్యుండనైతి, నదియునుం గాక. | 607 |
| చ. |
అరయ ధరిత్రి నెవ్వనిగృహంబు మహార్హజనోపయోగ్య వి స్ఫురితతృణాంబుభృత్యగృహభూముల సారెఁదనర్చు నట్టి మం దిరపతి పేద యైన జగతింగడు ధన్యుఁడటండ్రు గాన సు స్థిరమతి మీరు వచ్చుట నశేషశుభంబుల నేను బొందెదన్. |
608 |
| వ. | అదియునుంగాక. | 609 |
| చ. |
వరమతులార! యెవ్వని నివాసముఁదీర్థపదాంతరంగులై పరఁగినయట్టి భాగవతపాదజలంబులు సోఁకవేని త త్పురుషుఁడు భూరిసంపదలఁబొంపిరిపోయిననైన వాని మం దిర మురగప్రకీర్ణజగతీజముఁబోలు నటండ్రు కోవిదుల్. |
610 |
| వ. | అని పలికి వెండియు నిట్లనియె. | 611 |
| సీ. |
పరమపావనులార! బాల్యంబునందుండి, మానితశ్రద్ధాసమన్వితులును గుణనిధుల్ ధైర్యయుక్తులు ముముక్షువులునై, యధికవ్రతంబుల నాచరింతు రట్టి పుణ్యులు భవదాగమనంబు స్వా, గతమయ్య! సత్కృపాకలితులార! యనివారితవ్యసనార్ణవం బయినట్టి, భూరిదుర్లంఘ్యసంసారమందు |
|
| తే. |
మతివిహీనస్వకీయకర్మములఁ జేసి, యడరి మగ్నులమై యింద్రియార్థములనె తివిరి పురుషార్థములు గాఁగఁదెలియు మాకుఁ, గుశలమున్నదె లోకైకకుశలులార! |
612 |
| వ. | మీర లాత్మారాము లగుటం జేసి మీయందుఁ గుశలాకుశల రూపంబులయిన మతివృత్తులు సంభవింపవు గావునం గుశల ప్రశ్నం బుపపన్నంబు గాదు, కాన నేను గృతవిశ్వాసుండనై సంతప్తులయిన వారలకు సుహృత్తులైన మిమ్ము నాకు నీ సంసారంబునందు నేమిట వేగంబ క్షేమంబు గలుగు నని యడిగెద! నాత్మవంతులకు నాత్మయు నాత్మభావనుండు నయిన యీశ్వరుండు భక్తానుగ్రహంబు కొఱకు నీ లోకంబుల మీ వంటి సిద్ధరూపంబున వర్తించుచుండు నని పలికిన యతని గంభీరార్థ గౌరవంబులును, శుభకరంబులును, న్యాయ సహితంబులును, మితాక్షరంబులును, శ్రోత్ర ప్రియంబులును నయిన వచనంబులు విని సంప్రీత చేతస్కుండును, మందస్మితుండునై సనత్కుమారుండిట్లనియె. | 613 |
| మ. |
ధరణీశోత్తమ! సర్వభూతహితచేతస్కుండవై ధర్మ సు స్థిరభాగ్యోదయశాలివై యెసఁగు నీచే సాధులోకోత్తరో త్తరసంప్రశ్నము సేయఁగాఁబడె మహాత్మా! సాధులోకైకస చ్చరితంబున్ దలపోయ నిట్టిద కదా! చర్చింప లోకత్రయిన్. |
614 |
| తే. |
ధరణి సజ్జనసంగంబు దలఁప నుభయ, సమ్మతంబగు వారలు సలుపునట్టి సరససంభాషణప్రశ్నసరణి నిఖిల, జనములకు సుఖకర మగు జనవరేణ్య! |
615 |
| వ. | అని యభినందించి మోక్షసాధనోపదేశకాముండైన పృథుచక్రవర్తికి వెండియు నిట్లనియె. | 616 |
| సీ. |
ధరణీశ! మధునిషూదనుఁడైనయట్టి నారాయణు లలితపాదారవింద వరగుణధ్యాన ధీపరిణతత్వంబున సకలాత్మ మలవిమోచనములైన రతియును నిత్యవైరాగ్యంబు మొదలుగా లోకోత్తరుఁడవైన నీకుఁగలవు; సమ్యగ్విచారశాస్త్రములందు జనులకు సేమంబునకును నిశ్చితములయిన |
|
| తే. |
ఆత్మ కన్యంబులగు వానియందు వీత, రాగతఁదలంప నిర్గుణబ్రహ్మ మయిన యాత్మయందుల రతియును ననఁగ నివియ, హేతువులు బుద్ధిఁజింతింప నిద్ధచరిత!. |
617 |
| వ. | కావున శ్రద్ధయు భగవద్ధర్మ చర్యయుఁ దద్విశేష జిజ్ఞాసయు నాధ్యాత్మిక యోగనిష్ఠయు యోగేశ్వరోపాస్తియుఁ బుణ్యోపాశ్రయుండును, బుణ్యశ్రవణుండునునైన నారాయణకథాలాపంబులు నర్థేంద్రియారాములైన వారలతోడి సంగతియందు విరక్తియు వారల కభిమతంబులైన యర్థకామంబులందు ననాకాంక్షయు, సర్వేశ్వరుని గుణకీర్తనామృతపానంబు దక్క నితర పదార్థంబులందు వైరాగ్యంబు నొంది యాత్మారామత గలిగి విజనస్థలంబులందుల రుచి గలుగుటయు, నహింసయు, శమాది ప్రధాన వృత్తియు నాత్మహితానుసంధానంబును భగవత్కథానుస్మరణంబును నకామ్యంబు లయిన యమనియమంబులును, నితరభక్తిమార్గాగర్హణంబును, యోగక్షేమార్థక్రియారాహిత్యంబును, శీతోష్ణాది ద్వంద్వసహిష్ణ్టుతయు, భాగవత కర్ణాలంకార భూతంబులగు భగవద్గుణాభిధానంబులు నను వీనిచేత విజృంభమాణంబయిన భక్తి యోగంబునం జేసి యనాత్మయందు నసంగంబును, గార్యకారణరూపంబగు నిర్గుణబ్రహ్మము నందు రతియును, నెప్పుడు గలుగు నప్పుడ సదాచార్యానుగ్రహ వంతుండయిన పురుషుండు బ్రహ్మనిష్ఠులతోడఁ జెలిమిసేయుచు నీషణత్రయంబు వర్జించి ప్రకృతింజేరక జ్ఞానవైరాగ్యవేగంబునంజేసి. | 618 |
| సీ. |
అనఘ! సాక్షాత్కార మగు భక్తి యోగాగ్నిఁగడఁగి జీవాధారకమును బంచ భూతాత్మకంబునై పొలుచు హృద్గ్రంథిని బూని స్వకారణభూత మయిన యరణి దహించు హుతాశను కైవడి నిర్దహించిన నిట్లు నెఱపి దగ్ధ చిత్తుఁడై ముక్తనిశ్శేషాత్మగుణుఁడు సద్ధర్ముఁడు నైన యతండు మిగుల |
|
| తే. |
నర్థి బాహ్యంబు లయిన ఘటాదికములు, నాంతరములైన సౌఖ్యదుఃఖాదికములు నను విభేదము లాత్మభేదనము లగుట, న య్యుపాధివినాశంబు నందఁగలఁడు |
619 |
| వ. | అది యెట్లనిన. | 620 |
| చ. |
పురుషుఁడు నిద్రవోఁగలలఁబొందిన యాత్మసుఖైకహేతువై పరఁగిన రాజభృత్యజనభావగుణంబులు సంప్రబోధమం దరయఁగ మిథ్య యైనగతి నాంతరబాహ్యగుణప్రభేదముల్ పరువడిఁగానకుండు జనపాలనశీలన! నిత్యఖేలనా! |
621 |
| వ. | మఱియును ద్రష్టయైన యాత్మయు దృశ్యంబయిన యింద్రియార్థంబు నను వీనికి నహంకారంబు సంబంధ హేతువగుటం జేసి యది యంతఃకరణంబునం గలుగుచుండు జాగ్రత్స్వప్నంబులయం దీ భేదంబు గనుంగొను చుండు, నిట్టి యంతఃకరణంబు లేనిది యగు సుషుప్తికాలంబునం బురుషుండు జలదర్పణాది నిమిత్తాభావం బగునప్పుడు బింబప్రతిబింబ భేదంబు గనుంగొనని చందంబున దృశ్యభేదంబు గనుంగొనకుండు, గావున నంతఃకరణవిలయంబు నొందిన బాహ్యాంతరభేదంబు కనకుండుట నిశ్చయం బని వెండియు నిట్లనియె. | 622 |
| సీ. |
భువి విషయాకృష్టభూతంబు లయిన యింద్రియములచేతను దివిరి మనము దగ విషయాసక్తిఁదగిలి యాంతరమైన మహితవిచారసామర్థ్యమెల్ల శరకుశాదిస్తంబజాలంబు హ్రదతోయములు గ్రోలుగతిఁగ్రమంబున హరించు నీ రీతి నంతర్విచారసామర్థ్యంబు నపహృతంబయినఁబూర్వాపరాను |
|
| తే. |
మేయ సంధానురూపసంస్మృతి నశించు, నది నశించిన విజ్ఞాన మంతఁ దొలఁగు, నట్టి విజ్ఞాననాశంబు నార్యజనులు, స్వాత్మ కది సకలాపహ్నవంబటండ్రు, |
623 |
| వ. | అదియునుం గాక “ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి”యను వేదవచనంబునం జేసి విషయంబులకుం బ్రియతమత్వంబై యాత్మోపాధికంబు నొంది యాత్మాపహ్నవంబునం బాటిల్లు స్వార్థనాశం బెద్ది గలుగు దాని కంటె లోకంబున నధికంబైన స్వార్థనాశంబు లే, దది యెట్లనిన సర్వార్థనాశంబునకు స్థైర్యంబు నొందించునట్టి యర్థకామాభిధ్యానంబునం దద్ధేతుకంబైన స్వార్థనాశంబునం బరోక్షాపరోక్షరూప జ్ఞానంబు నశించుం గావున నాత్మాపహ్నవంబునకంటె నధికతరంబైన సర్వార్థనాశంబు లేదని వెండియు నిట్లనియె. | 624 |
| సీ. |
అనఘ! యీ సంసార మతిశయంబునఁ దరియింపంగ మది నిశ్చయించువాఁడు గైకొని ధర్మార్థకామమోక్షములకు నతివిఘాతుక మెద్ది యట్టి దాని వలన సంగము సేయ వలవ; దా ధర్మాదులందుఁద్రివర్గంబు నంతకోగ్ర భయయుతంబగుటను బరమమోక్షంబె ముఖ్యార్థమై విలసిల్లునండ్రు బుధులు, |
|
| తే. |
భువి గుణవ్యతికరమునఁ బుట్టి నట్టి, యబ్జజాతాదులకు నస్మదాదులకును గాల విధ్వంసితాఖిలక్రమము గల్గుఁ, గలుగ దెన్నఁడు సేమంబు గాన వినుము. |
625 |
| వ. | మోక్షంబె పరమ పురుషార్థం బని చెప్పి వెండియు నిట్లనియె. నరేంద్రా! దేహేంద్రియ ప్రాణ బుద్ధ్యహంకార పరివృతంబులయిన యీ స్థావరజంగమంబుల హృదయంబులందు వ్యాపకుండుఁ బ్రత్యక్షభూతుండుఁ బ్రత్యగ్రూపుండు భగవంతుండు నయిన యీశ్వరుం డంతర్యామిరూపంబునం బ్రకాశించుచుండు, నిది నారాయణుని సద్రూపంబుగాఁ దెలియు మని వెండియు నిట్లనియె. | 626 |
| ఉ. |
భూవర! యే మహాపురుషభూషణునందుల నీ సమస్త వి శ్వావళి లీనమై సదసదాత్మకభావము నొంది భూరి మా యావిభవంబులందగి సమగ్రవివేకనిరోధిస్రగ్ఘనా శీవిషబుద్ధి దోఁచుచు విశేషగతిన్ వెలుఁగొందు నెప్పుడున్. |
627 |
| చ. |
సుమహితనిత్యముక్తపరిశుద్ధవిబుద్ధసుతత్త్వుఁడై యురు క్రముఁడభిభూతసత్ప్రకృతికర్మకళంకుఁడు నైనయట్టి యు త్తమచరితుంగృపాకరు నుదాత్తగుణోన్నతు నీశ్వరేశుఁ జి త్తమునఁదలంపుమయ్య! జనతాపరిరక్షణ! దుష్టశిక్షణా! |
628 |
| సీ. |
వసుమతీనాథ! యెవ్వని పాదపద్మపలాశవిలాససల్లలితభక్తి సంస్మరణంబుచే సజ్జనప్రకరంబు ఘనకర్మసంచయగ్రథితమగు న హంకారమను హృదయగ్రంథిఁజెఱుతురు; వివరింప నిట్లు నిర్విషయమతులు మహి నిరుద్ధేంద్రియమార్గులు నైనట్టి యతులకుఁజేరంగ నలవి గాని |
|
| తే. |
యట్టి పరమేశుఁగేశవు నాదిపురుషు, వాసుదేవుని భువనపావనచరిత్రు నర్థి శరణంబుగాఁ దత్పదాంబుజములు, భక్తి సేవింపు గుణసాంద్ర! పార్థివేంద్ర! |
629 |
| మ. |
అరిషడ్వర్గమహోర్మినక్రనికరవ్యాకీర్ణసంసారసా గర మబ్జోదరకీర్తనాతరణిసాంగత్యంబునంబాసి తా మరుదారంగనఘాపహప్రకటయోగాదిక్రియాయు క్తిచేఁ దరియింపన్ మదిఁగోరువారలకు దుర్దాంతంబగుంగావునన్. |
630 |
| మ. |
ధరణీశోత్తమ! నీవు కేవలసముద్యద్భక్తి ధీయుక్తిమై వరగోవిందపదారవిందయుగభాస్వన్నావ సంధించి దు స్తరభూరివ్యసనాకరోల్లసితదుర్దాంతోగ్రగంభీర సం సరణాంభోధిఁదరింపవయ్య పరమోత్సాహంబు దీపింపఁగన్. |
631 |
| క. |
అని యీ గతిఁబంకరుహా, సనసుతుఁడును బ్రహ్మబోధశాలియు నగు నా ఘనయోగివల్లభునిచే, తను దెలియఁగఁబడిన బ్రహ్మతత్త్వుండగుచున్. |
632 |
| క. |
జనపతి మునిఁబొగడి ముదం, బున నిట్లనుఁబూర్వజన్మమున నే దీనా వనుఁడైన యీశ్వరుని చే, తను నిక్క మనుగ్రహింపఁదగితి మునీంద్రా! |
633 |
| క. |
వినుఁడట్టి యనుగ్రహ సా, ధనమునకై మీర లిపుడు దగ నిచ్చటికిం జనుదెంచితిరి దయాళురు, ననఘులు భాగవతవరులు నగు నుత్తములున్. |
634 |
| సీ. |
నిరతంబు నాయందు నిష్పాదితములగు దేహసమేతమదీయరాజ్య సర్వసంపదలును సద్ద్విజదత్తముల్ గావునఁబ్రాణకాంతావిభూతి మందిరసుతరాజ్య మహి బల కోశ పరిచ్ఛదంబుల నెల్ల ధృతిఁదలంప రాజుకు భృత్యుండు రాజకీయములగు తాంబూలముఖపదార్థములఁజేసి |
|
| తే. |
రమణ సంతర్పణోపచారములు నడపు, గతిని వారల కవి నివేదితము లయ్యెఁ! గాన మీ కుపచార మేగతి నొనర్తు, నతులగుణసాంద్ర! యోగికులాబ్ధి చంద్ర! |
635 |
| వ. | అది యెట్లు బ్రాహ్మణాధీనం బంటిరేని సేనాధిపత్య రాజ్యదండనేతృత్వ సర్వలోకాధిపత్యంబులు వేదశాస్త్రవేది యైన బ్రాహ్మణునక కాని యితరులకు యోగ్యంబులు గావు! కావున బ్రాహ్మణులకు భోజన వసనదానంబులు స్వకీయంబులై యుండు, క్షత్త్రియాదులకు బ్రాహ్మణానుగ్రహంబున నన్న మాత్రంబు దక్కం దక్కిన వస్తుస్వాతంత్ర్యంబు లేదు, గావున మీకు గురుదక్షిణ యేమి సమర్పించు వాఁడ? నదియునుం గాక స్వాతంత్ర్యంబు గలిగిన నిట్టి యధ్యాత్మవిచారులు వేదాంతవేదులు నై భగవద్భక్తి నుపదేశించెడు, మీ వంటి పుణ్యాత్ములకుం బరిహాసాస్పదుండు దక్కఁ దక్కినవా డెవ్వం డంజలి మాత్రంబు దక్కఁ దక్కిన ప్రత్యుపకారంబు సేయం దలంచు? నది గావున దయాళువులైన మీరలు స్వకృతోపచారంబులం జేసి సంతుష్టాంతరంగు లగుదురు గా కని పలుకుచున్న యాదిరాజయిన పృథుచక్రవర్తిచేతం బూజితులై యాత్మయోగనిష్ఠులైన సనకాదు లతని స్వభావంబుం బ్రశంసించుచు సమస్తజనంబులుఁజూచుచుండ నాకాశగమనంబునంజని రయ్యవసరంబున. | 636 |