పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము చతుర్థస్కంధము
పృథు చక్రవర్తి జ్ఞానవైరాగ్య వంతుండై ముక్తి నొందుట
ఆ. విను మహాత్మ, ముఖ్యుఁడన నొప్పు వైన్యుఁ డే, కాగ్రచిత్తుఁ డగుచు నాత్మనిష్ఠుఁ
డైనయట్టి తను నవాప్త కామునిఁ గాఁగ, బుద్ధిలోనఁ దలఁచె భూవరుండు.
637
వ. అంత. 638
సీ. కర్మంబులను యథాకాల దేశోచిత బలవిత్తములు గాఁగఁ బరఁగు ధర్మ
ములను బ్రహ్మార్పణ బుద్ధిని జేసి కర్మాసక్తుఁ డగుచు సమాహితుండు
ప్రకృతికంటెను దన్నుఁ బరమైన యాత్మను గర్మసంచయ సాక్షిగాఁగ బుద్ధి
నర్థిఁ దలంచుచు నాచరించుచు నట్ల మెఱసి సామ్రాజ్యలక్ష్మీ సమేత
 
తే. మందిరోద్యాన వనభూములందు రాజ్య, గరిమ వర్తింపఁగా నహంకార రహితుఁ
డగుచుఁ దన చిత్తమున నింద్రియార్థములను, దగులకయ యుండె సన్మహోదారుఁ డగుచు.
639
వ. ఇట్లధ్యాత్మయోగనిష్ఠుండై కర్మంబుల నాచరించుచు నర్చి యను భార్యయందు విజితాశ్వుండు, ధూమ్రకేశుండు, హర్యశ్వుండు, ద్రవిణుండు, వృకుండు నను నాత్మసములైన పుత్త్రుల నేవురం గనియె నంత. 640
క. జనవినుత! భూమివలనను, ధనముల మర్యాదఁ గొనుచు దాననిమిత్తం
బునఁ గ్రమ్మఱఁ దా నిచ్చుచు, దిననాయకుఁ బోలి వసుమతీపతి యొప్పెన్‌.
641
వ. అతండు మఱియు నగ్ని చందంబునం దేజోదుర్ధర్షుండును, మహేంద్రుని పగిది దుర్జయుండును, ధరణి కరణి సతతక్షమా యుక్తుండును, స్వర్గంబునుం బోలె నభీష్టదుండును, బర్జన్యుని భాతిఁ గామిత ప్రవర్షణుండును, సముద్రు రీతి గాంభీర్య యుక్తుండును, మేరువు పోలికి సత్త్వవంతుండును, ధర్మరాజు కైవడి ననుశాసకుండును, మహేంద్రుని విధంబున నైశ్వర్య వంతుండును, గుబేరుని మాడ్కి ధనవంతుండును, వరుణుని సరణి గుప్తార్థుండును, సర్వాత్మకుండగు వాయువు చెలువున బలౌజస్తేజోయుక్తుండును, రుద్రుని పగిది నసహ్యతేజుండును, గందర్పుని యనువున సౌందర్యవంతుండును, మృగరాజు నోజ నధిక శౌర్యోపేతుండును, మనువు ననువున వాత్సల్య యుక్తుండును, నజుని చందంబునం బ్రభుత్వ సమేతుండును, బృహస్పతి గరిమ బ్రహ్మవాదియు, సర్వేశ్వరుని జాడ జితేంద్రియుండునునై విష్వక్సేనానువర్తనులైన గో గురు విప్రజనంబులందు భక్తి గలిగి లజ్జావినయశీలంబులందును, బరోపకారంబు నందును నిరుపముండై యివ్విధంబున సర్వలోక పాలక పృథగ్విధ గుణంబుల నన్నింటినిం దానొక్కరుండు ధరియించి. 642
క. అనఘాత్మక! లోకత్రయ, మున సజ్జన కర్ణరంధ్రముల వినఁబడు నా
వినుత యశోమహనీయుఁడు, జనవినుతుం డైన రామచంద్రుని మాడ్కిన్‌.
643
చ. సరస వచో0000ర్థ సత్పురుష సంఘ సమంచిత గీయమాన సు
స్థిర వరకీర్తిపూరము సుధీజన కర్ణములందు నించి తా
నిరుపమ సౌమ్యభాషణమనీషల చేతఁ బ్రజానురక్తుఁడై
ధరణిని రాజనామమునఁ దాఁదగు రెండవ చంద్రుఁడో యనన్‌.
644
వ. మఱియు న మ్మహాత్ముండు విజ్ఞానియు, వర్ధితాశేష స్వానుసర్గుండును, ప్రజాపాలకుండును. స్థావర జంగమ వృత్తి దాయకుండును, సత్పురుష ధర్మవర్తనుండును, నిష్పాదితేశ్వరాదేశుండును నైన పృథుం డొక్కనాఁడు దన వార్ధకంబు వీక్షించి నిజాత్మజ నాత్మజుల యందు నిలిపి ప్రజలు చింతాతురచిత్తు లగుచుండ నిజభార్యాసమేతుండై యప్రతిహత నియమంబున వైఖానససమ్మతంబైన యుగ్రతపంబు నందుఁ బూర్వంబున దిగ్విజయప్రవృత్తుండగు చందంబునం బ్రవృత్తుండై తపోవనంబునకుం జని యందు. 645
మత్త. కందమూల ఫలాశియై బహుకాల ముగ్ర తపః పరి
స్పందుఁడై యటమీఁదటం దృణపర్ణ భక్షణసేసి యా
చంద మేది జలాశి యై నృపసత్తముం డది మాని తా
మంద గంధవహాశి యయ్యెఁ గ్రమంబునన్‌ దృఢచిత్తుఁడై
646
వ. ఇట్లు వర్తించుచు. 647
సీ. మెండుగా మిటమిట మండు వేసవి యందుఁ, దప్త పంచాగ్నిమధ్యమున నిలిచి
మానక జడిగొన్న వానకాలంబునఁ, బైఁగోక వేయక బయట నిలిచి
జనులు హూహూ యను చలివేళఁ గుత్తుక, బంటి తోయముల లోపల వసించి
శిశిరంబు సాల నల్దిశలఁ బర్వినవేళ, వెలయ భూశయనుఁడై విశ్రమించి
 
తే. మహిత నియతిఁ దితిక్షాసమన్వితుండు, నియత పరిభాషణుఁడు జితానిలుఁడు దాంతుఁ
డిద్ధమతి యీశ్వరార్పిత బుద్ధి యనఘుఁ, డూర్ధ్వరేతస్కుఁడునునై క్రమోచితముగ.
648
వ. అతిఘోరం బయిన తపం బాచరించె, నివ్విధంబునం గ్రమానుసిద్ధం బయిన తపంబున విధ్వస్తాశేష కర్మమలాశయుండును బ్రాణాయామంబులచే జితారిషడ్వర్గుండును ఛిన్నబంధనుండునునై పురుషశ్రేష్ఠుండైన పృథుచక్రవర్తి భగవంతుండైన సనత్కుమారుం డెఱింగించిన యోగ మార్గంబున సర్వేశ్వర భజనంబు గావించె, నిట్లు భగవద్ధర్మపరుండును సాధువర్తనుండును శ్రద్ధాసమన్వితుండును నైన పృథునకు నారాయణునందు భక్తి, యనన్యవిషయంబై ప్రవృద్ధం బయ్యె, న వ్విధంబున. 649
క. నరలోకోత్తర భగవ, త్పరిచర్యారాధనమునఁ బరిశుద్ధాంతః
కరణుండగు నా పృథునకు, సరసిరుహోదరు కథానుసంస్మరణమునన్‌.
650
క. పరిపూర్ణంబగు భక్తిని, గర మనిశము సంశయాత్మకంబై చాలన్‌
వఱలిన హృదయగ్రంథిని, నిరసించు విరక్తియుత మనీష జనించెన్‌.
651
వ. దానంజేసి యతండు సంఛిన్న దేహాత్మజ్ఞానుండు నధిగతాత్మస్వరూపుండునై గదాగ్రజుం డయిన శ్రీకృష్ణుని కథాసక్తి నొంది సమస్తయోగసిద్ధులందు నిస్పృహుం డగుటను హృదయగ్రంథివిచ్ఛేదకం బయిన జ్ఞానయోగంబును విడిచి యాత్మయందు నాత్మయోగంబుఁ గావించి బ్రహ్మభూతుండయి నిజకళేబరంబు విడువ నిశ్చయించి 652
సీ. కోరి మడమలచే గుదపీడనము సేసి పూని ముక్తాసనాసీనుఁ డగుచుఁ
దనరు మూలాధారమున నుండి వాయువు నొయ్యన నెగయించి యొనర నాభి
కలితంబు గావించి క్రమమున హృద్వత్స కంఠ శిరః కోష్ఠకములఁ జేర్చి
కైకొని మూర్ధభాగములకు నెగయించి ప్రాణముల్‌ విడిచి యా పవనుఁ బవనుఁ
 
తే. నందు నాకాశ మాకాశమందుఁ దేజ, మందుఁ దేజంబు నుదకంబునందు నుదక
మర్థిఁ గాయంబు మేదినియందుఁ గలిపెఁ, బూని వాని యథోచితస్థానములుగ.
653
వ. మఱియు భూమి నుదకంబునందును, నుదకంబును దేజమందు, దేజంబును వాయువున, వాయువు నాకాశంబునందు, నాకాశంబును మనంబున, మనంబు నింద్రియంబుల, నింద్రియంబులఁ దన్మాత్రల, దన్మాత్రల భూతాదియైన యహంకారంబునందు, నహంకారంబు మహత్తత్త్వంబునందును గూర్చి జీవోపాధి భూతంబయిన ప్రకృతియందుఁ గలిపి జీవభూతుం డయిన పృథుండు జ్ఞానవైరాగ్యంబుల చేత బ్రహ్మనిష్ఠుండై మాయోపాధిం బాసి ముక్తుం డయ్యె నని చెప్పి వెండియు నిట్లనియె. 654
సీ. అంత నా పృథుని భార్యామణి యగు నర్చి పుడమిపై వడి నడుగిడినఁ గందు
సుకుమారపాదాబ్జ సుందరీరత్నంబు నతుల పతివ్రత యగుటఁజేసి
యాత్మేశకృత సువ్రతాచరణంబును సుమహిత భక్తి శుశ్రూషణమును
నార్షేయ మగు దేహయాత్రయు నను వీని చేత మిక్కిలి కృశీభూత దేహ
 
తే. యయ్యుఁ బ్రియనాథ కృత కరుణావలోక, కరతల స్పర్శనాది సత్కారములను
నబల సుఖవృత్తిఁ జెంది య య్యడవులందుఁ, గృశత మదిఁ దోఁపకుండఁ జరించు నపుడు.
655
క. తన మనమున నే దుఃఖము, ననయంబు నెఱుంగనట్టి యర్చి నిజాధీ
శుని ప్రాణరహిత దేహము, గనుఁగొని విలపించి విగతకౌతుక యగుచున్‌.
656
సీ. మానిత మందర సానుప్రదేశంబు నందుఁ జితారోప మర్థిఁజేసి
లలితమహానదీసలిలసుస్నాతయై కలితమహోదారకర్ముఁడయిన
నాథున కుదకదాన క్రియల్‌ గావించి యతిభక్తి సురలకు నతు లొనర్చి
వహ్నికి ముమ్మాటు వలగొని పతిపాదకమలయుగంబుఁ జిత్తమున నిలిపి
 
తే. వీరవరుఁడైన పృథు పృథివీతలేశు, నందు ననుగమనము సేయునట్టి సాధ్వి
నర్చిఁ గనుఁగొని దేవాంగనా సహస్ర, మాత్మనాథులఁ గూడి నెయ్యంబుతోడ.
657
క. పరమోత్కంఠము న న్మం, దరగిరి సాను ప్రదేశతలమున వరుసం
గురియించిరి నవ సురభిత, వర మందార ప్రసూన వర్షము లంతన్‌.
658
క. తరమిడి యచ్చర లాడిరి, మొరయించిరి శంఖతూర్యములు దివిజులు పా
డిరి కిన్నరజనులు పర, స్పరనుతు లొనరించి రా సుపర్వాంగనలున్‌.
659
వ. మఱియు నిట్లనిరి. 660
సీ. చర్చింప నిట్టి యాశ్చర్య మెందేనియుఁ, గనుఁగొంటిరే యర్చి యను లతాంగి
ధన్యాత్మురాలు గదా తన విభుఁ గూడి, యిందిరా రమణి యజ్ఞేశుఁ గూడి
వెనుచను కైవడి ననుగమనము సేసె, ని య్యమ నిజహృదయేశుఁ డయిన
ఘను వైన్యు నూర్ధ్వలోకమ్మును బొందును, నేఁ డింతవట్టును నిశ్చితంబు
 
తే. పరమ యోగీంద్రులకు దుర్విభావ్యమైన, దృఢ సుకర్మమువలన నతిక్రమించి
వైన్య భూమీశు వెనుచని వరుస నూర్ధ్వ, గామినియు నయ్యె నీ యింతి ఘనత నొంది.
661
వ. కాన పతివ్రతలకు నసాధ్యం బెందునుం గలదే యని మఱియును. 662
క. పరికింపఁగ నే మనుజుఁడు, హరిపదమును బొందఁ జేయు నట్టి వివేక
స్ఫురణం దనర్చు వానికిఁ, బరువడి నిలఁ బొందరాని పదముం గలదే!
663
తే. అట్టి యపవర్గ సాధన మైన మనుజ, భావ మొందియు విషయ సంబద్ధు డగుచు
వసుధ నెవ్వఁడు వర్తించు వాఁడు ధరణి, ననయము నిజాత్మ వంచకుఁ డనఁగఁ బరఁగు.
664
క. అని వారలు ద న్నర్థిని, వినుతింపఁగ నర్చి యాత్మవిభుఁడగు పృథుఁ డొం
దిన యచ్యుతలోకంబున, ననుపమ విభవమును బొందె నని విదురునకున్‌.
665
క. మునివరుఁడగు మైత్రేయుఁడు, వినయంబున నెఱుఁగఁ జెప్పి వెండియుఁ దగ ని
ట్లను న మ్మహాను భావుం, డనఘుఁడు భగవత్తముండు నగుఁ బృథుఁ డనఘా!
666
క. ఏ నీ కిప్పుడు సెప్పితి, మానుగ నీ పుణ్యకథను మహితశ్రద్ధా
ధీనుండై విస్ఫుర దవ, ధానుండై యెవ్వఁడేని తనరిన భక్తిన్‌.
667
క. వినినఁ బఠించిన వ్రాసిన, వినిపించిన వాఁడు పృథుఁడు విమల గతిం బొ
దిన క్రియ హరిపద మొందెడు, ననయము నిర్ధూతపాపుఁ డగుచు మహాత్మా!
668
సీ. బ్రాహ్మణుం డంచిత భక్తిఁ బఠించిన బ్రహ్మవర్చసము సంప్రాప్త మగును,
క్షత్త్రియుం డర్థిమైఁ జదివిన విన్నను జగతీవిభుత్వంబు సంభవించు,
వైశ్యుండు విని ధనవంతుఁడై యొప్పును శూద్రుండు వినిన సుశ్లోకుఁ డగును
మఱియును భక్తి ముమ్మాఱు పఠించిన విత్తవిహీనుండు విత్తపతియు
 
తే. నప్రసిద్ధుఁడు ప్రఖ్యాత యశుఁడు ప్రజలు లేని యధముఁడు వితత సంతానయుతుఁడు
మూర్ఖచిత్తుండు విజ్ఞాన బోధమతియు, నగుచు నుతి కెక్కుదురు మహితాత్మ! మఱియు.
669
వ. ఈ లోకంబునం బురుషులకు స్వస్త్యయనంబును నమంగళ నివారణంబును ధనప్రదంబును యశస్కరంబును నాయుష్కరంబును స్వర్గదాయకంబును గలిమలాపహంబును నైన యీ పుణ్యచరిత్రంబు చతుర్విధ పురుషార్థ కాములైన వారికిఁ జతుర్విధ పురుషార్థ కారణం బగుం గావున వినం దగు, సంగ్రామాభిముఖుండైన రా జీ చరిత్రంబు ననుసంధించి విరోధి నెదిర్చిన న వ్విరోధి పృథునకుం బోలెఁ గప్పంబు లిచ్చు, ముక్తాన్యసంగుండును భగవద్భక్తుండును నైన వాఁడు పుణ్యంబును వైన్యమాహాత్మ్య సూచకంబును నైన యీ చరిత్రంబు వినుచుం బఠియించుచుం గృతమతియై దినదినంబును నాదరంబునం బ్రకటంబు సేయువాఁడు భవసింధు పోత పాదుండైన సర్వేశ్వరుని యందు నచలం బయిన భక్తి గలిగి పృథుచక్రవర్తి వొందిన విష్ణుపదంబుం బొందునని యిప్పుణ్య చరిత్రంబు మైత్రేయుండు విదురున కెఱింగించి వెండియు నిట్లనియె. 670
క. పృథునకు నర్చికిఁ బుట్టిన, పృథు కీర్తిధనుండు ఘనుఁడు పృథుతుల్యుండై
పృథుశౌర్య ధైర్య ధుర్యుఁడు, పృథివిన్‌ విజితాశ్వుఁ డొప్పెఁ బృథివీపతియై.
671
క. విను మంతర్ధానగతిం, దనరు సునాసీరు వలనఁ దగ విజితాశ్వుం
డును మఱి యంతర్ధానుం, డనుపేరఁ బ్రసిద్ధుఁ డయ్యె నతి చతురుండై.
672
సీ. స్థిరమతి రాజ్యాభిషిక్తుఁడై య మ్మేటి సమమతి న య్యనుజన్ములైన
హర్యశ్వునకు సమాదరమునఁ దూర్పు, దక్షిణదిశఁ దగ ధూమ్రకేశునకును,
బరఁగంగ వృకునకుఁ బశ్చిమభాగంబు ద్రవిణున కర్థి నుత్తరపు దిశను,
గొమ రొప్ప నలువురకును బంచి యిచ్చి స్వకాంత యైనట్టి శిఖండినికిని
 
తే. మనుజ యోనిని జనియింపుఁ డనుచు మున్ను, పలికినట్టి వసిష్ఠు శాపమునఁ జేసి
పూని త్రేతాగ్ను లతనికిఁ బుత్త్రు లగుచు, జనన మొందిరి సజ్జనస్తవ్య చరిత!
673
వ. వారలు పావకుండుఁ బవమానుండు శుచియు నను నామంబుల మనుష్య యోనిం బుట్టియు నాత్మప్రభావంబునం గ్రమ్మఱ నగ్నులయి చనిరి తదనంతరంబ. 674
క. అతఁడు నభస్వతి యనియెడి, ద్వితీయ పత్ని వలనను హవిర్ధానుఁడు నా
సుతుఁగని విజితాశ్వుం డా, నతవిమతుఁడు రాజ్యవర్తనము దలపోయన్‌.
675
క. విమలాత్మ! కరాదానము, దమశుల్కాదికము గరము దారుణ మని ధై
ర్యమునన్‌ దీర్ఘమఖ వ్యా, జమునం దద్వర్తనంబు సమమతి విడిచెన్‌.
676
వ. ఇట్లు విడిచి. 677
క. అతఁ డాత్మదర్శనుం డయి, చతురతఁ బరమాత్ము హంసు సర్వేశ్వరుఁ ద
త్క్రతువున యజించి కుశలా, ద్భుత యోగసమాధి ముక్తిఁ బొందె మహాత్మా!
678
వ. అంత విజితాశ్వుండు పరలోకగతుం డయిన హవిర్ధానుండు హవిర్ధాని యను భార్యవలన బర్హిష్మదుండు గయుండు శుక్లుండుఁ గృష్ణుండు సత్యుండు జితవ్రతుండు నను పుత్రుల నార్వురం గాంచె, నందు బర్హిష్మదుండు. 679
సీ. సంతత సవన దీక్షాశాలి యగుచు ధరాతలం బెల్లను గ్రతువులకును
విలసిల్లు యజనశాలలు వేఱువేఱ కల్పించి యజ్ఞములు గావించుచుండి
చిరకీర్తి యతఁడు ప్రాచీనాగ్రకుశలచే క్షితితలం బెల్ల నాస్తృతము సేయ
వసుధ యెల్లను యజ్ఞవాటమై విలసిల్ల సత్క్రియాకాండ నిష్ణాతుఁ డగుచు
 
తే. సుభగయోగ సమాధి నిష్ఠుఁడు ప్రజాప, తి యగునని తన్ను జనము నుతింప వెలయు
నట్టి ఘనుఁడు హావిర్ధాని యఖిల జగతిఁ, బఱపి కుశలను బ్రాచీనబర్హి యయ్యె.
680
వ. మఱియు నతండు. 681
చ. అలవడ నే సతీమణి సమంచితలీల వివాహవేళ ను
త్కలికఁ బ్రదక్షిణంబు లిడఁగాఁ గని హవ్యవహుండు దొల్లి యి
మ్ముల శుకిఁజూచి మోహమును బొందినరీతి విమోహి యయ్యె నా
లలిత వినూత్న భూషణ యలంకృత చారు శుభాంగి వెండియున్‌.
682
చ. సురుచిర భంగి నా సతి కిశోర వయఃపరిపాకయై రణ
ద్వరమణి హేమనూపురరవంబు సెలంగఁగ నాడుచున్‌ దివా
కరరుచి రేఖ నొప్పెసఁగఁ గాంచి వినిర్జితులైరి దేవ కి
న్నర నర సిద్ధ సాధ్య ముని నాగ నభశ్చరముఖ్యు లందఱున్‌.
683
వ. అట్టి సౌందర్యఖనియు సముద్రపుత్త్రియు నయిన శతధృతి యను కన్యం బ్రహ్మాదేశంబునం బాణిగ్రహణంబు సేసె, నా శతధృతి వలనం బ్రాచీనబర్హికిఁ బదుగురు కొడుకులు జనియించిరి, వారలు తుల్యనామ వ్రతులును ధర్మపారగులును నయిన ప్రచేతసులు, వారు ప్రజాసర్గంబునందుఁ దండ్రిచేత నాజ్ఞాపితులయి తపంబు గావింప వనంబునకుం జను సమయంబునం దన్మార్గంబునఁ బ్రసన్నుం డగుచు దృశ్యమానుండైన రుద్రునిచేత నేది యుపదేశింపంబడె దాని జపధ్యాన పూజా నియమంబుల సేవించుచుఁ దపఃపతి యైన నారాయణుం బదివేల దివ్య వత్సరంబులు పూజించి రని చెప్పిన విని విదురుండు మైత్రేయున కిట్లనియె. 684
సీ. తాపసోత్తమ! ప్రచేతసులకు నా వన మార్గంబునందు నా భర్గుతోడ
సంగ మెట్లయ్యెఁ? బ్రసన్నుఁడై హరుఁ డెద్ది తివుట వారల కుపదేశ మిచ్చె?
జీవరాశులకు నా శివుతోడి సంగంబు గడు దుర్లభం, బీ జగంబునందుఁ
జర్చింప న మ్మేటి సన్మునీంద్రులకును సంచిత ధ్యానగోచరుఁడు గాని
 
తే. పుడమిఁ బ్రత్యక్షమునఁ గానఁ బడఁడు, మఱియు, నంచితాత్మ సదారాముఁ డఖిల లోక
రక్షణార్థంబుగా విరూపాక్షుఁ డాత్మ, శక్తితోఁ గూడి జగతిపై సంచరించు.
685
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - chaturtha skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )