| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | పంచమస్కంధము - ద్వితీయాశ్వాసము |
| క. |
ఎడతెగక ముజ్జగంబుల, కడపల నయ్యామ్యదిశను గదలక నిలుచుం గడు ఘోరములుగ నరకము, లడరంగా నంతరాళమందుల నధిపా! |
135 |
| వ. | మఱియును దక్షిణంబున నగ్నిష్వాత్తాది పితృగణంబులు తమ గోత్రజులకు మేలు గలుగుట కొఱకు సత్యంబులగు నాశీర్వాదంబుల నొసంగుచుండుదు; రచ్చటి పితృపతియగు శమనుండు తన లోకంబునకుం జనుదెంచు జంతువుల కర్మంబులకుం దగిన ఫలంబుల నిచ్చి శిక్షించుచునుండు; నందుఁ దామిస్రంబును నంధతామిస్రంబును రౌరవంబును మహారౌరవంబును గుంభీపాకంబును గాలసూత్రంబును నసిపత్త్రవనంబును సూకరముఖంబును నంధకూపంబును గ్రిమిభోజనంబును సందంశంబును దప్తోర్మియు వజ్రకంటకశాల్మలియు వైతరణియుఁ బూయోదంబును బ్రాణరోధంబును విశసనంబును లాలాభక్షణంబును సారమేయాదనంబును నవీచిరయంబును రేతః పానంబును నను నేకవింశతి మహా నరకంబులును, మఱియును క్షారకర్దమంబును రక్షోగణ భోజనంబును శూలప్రోతంబును దందశూకంబును నవట నిరోధనంబును నపర్యావర్తనంబును సూచీముఖంబు నన సప్త విధ నరకంబుల తోడఁ గూడి యష్టావింశతి నరకంబులు గల వని కొందఱు నొడువుదు, రందు. | 136 |
| క. |
పరపుత్త్రకళత్రంబులఁ, బరికింపక యపహసించు పాపాత్ముఁడు దు ష్కరపాశబద్ధుఁడై యమ, పురుషులచే నధికబాధఁబొందుచు నుండున్. |
137 |
| వ. | మఱియు నవ్విధంబున బాధితుం డగుచుఁ దామిస్ర నరకంబునంబడి యనశనాద్రిపాతన దండతాడన తర్జనాది బాధలంజెంది కడు భయంబున మూర్ఛలంబొందుచుండు. | 138 |
| క. |
పరకాంత నెవ్వఁడేనిం, బురుషుండుండంగ మొఱఁగి పొందిన యమ కిం కరు లతనిఁబట్టి వడిఁ ద, త్తరమునఁబడవైతు రంధతామిస్రమునన్. |
139 |
| వ. | నరేంద్రా! యెవ్వఁడేనిం గుటుంబ పోషణార్థంబు పరులకు ద్రోహంబు సేయు, నా నరుండు రౌరవ నరకంబునం బడు; నెవ్వం డిహలోకంబునందు స్వేచ్ఛా విహారంబున సంచరించుచుఁ బరోపద్రవ పరాఙ్ముఖంబు లయియుండు పశుపక్షి మృగాదుల బాధించు, నా యామృగంబులు రురురూపంబులఁ దాల్చి యట్టి పాపజనుల నానా విధ యాతనల బాధించుటం జేసి రౌరవ మహా రౌరవ నరకంబులం బడు; నెవ్వండేని దేహపోషణార్థంబు మూషకాదుల బిలనిరోధంబు సేసి వధించు, నా నిష్కరుణుండైన పురుషుని గుంభీపాక నరకంబుల యందుఁ గల తప్తతైలంబులంబెక్కు బాధలంబొందింతురు. | 140 |
| సీ. |
తల్లిదండ్రులకును ధరణీసురులకును నహితంబు సేసినయట్టివాఁడు కాలసూత్రంబను కడుఁదీవ్రనరకంబు నందును నందంద యయుత యోజ నాయతపాత్రాదులందుల సూర్యుఁ డా మీఁద గ్రిందను వహ్ని మిగుల మండ నత్యంత క్షుత్పిపాసాదులచేతను బాధితుం డగుచుండుఁబాయ కెపుడుఁ |
|
| ఆ. |
బరువు వెట్టుచున్నఁబడియున్న నిలిచినఁ, గదలకున్నఁజాల నొదిఁగియున్న బాధఁబొందుచుండుఁబశురోమముల లెక్క, వరుస నపరిమేయవత్సరములు. |
141 |
| వ. | మఱియు వేదమార్గంబు విడిచి పాషండమార్గంబు లాచరించు పురుషుని నసిపత్త్రవనంబునందు యమకింకరులు తఱట్ల నడచుచుఁ బరిహసించుచుం దోలు నెడ యసిపత్త్రంబు లిరుగెలంకుల శరీరంబుం ద్రెంచుచుండ నడుగడుగున బిట్టు మొఱవెట్టుచుండ బాధించుచుండుదురు. | 142 |
| క. |
దండింపఁదగనివారల, దండించిన విప్రవరుల తనువులు ముట్టం దండించిన దుర్మతులం, దండింతురు కాలసూత్రనరకములందున్. |
143 |
| ఆ. |
మఱియు నట్టి దుష్టమానవుఁగింకరుల్, విఱిచి చెఱకుఁగోల విఱచినట్లు బాధపెట్టుచుండఁబడి మూర్ఛఁజెందుచు, మొఱలువెట్టుచుండు భూపవర్య! |
144 |
| వ. | నరేంద్రా! యెవ్వండేని నీశ్వరకల్పితవృత్తి గల జంతువుల హింసించు నట్టివాని నంధకూపంబను నరకంబునఁ బడవైచిన నందు నతండు దొల్లి తాను జేసిన భూత ద్రోహంబున నచ్చట వివిధక్రూర పక్షి మృగ పశు సర్ప మశక మత్కుణ మక్షికాదులచేత హింసం బొందుచు, మహాంధకారంబునందు నిద్రానుభవసుఖ లేశంబును లేక కుశరీరంబు నందుల జీవుండునుంబోలె మృతప్రాయుండై యుండు; నంత. | 145 |
| క. |
తన కలిమి నెవ్వఁడేనియుఁ, దన బాంధవవరులఁగూడి తగఁ గుడువక తా నును వాయసంబు భక్షిం, చిన మాడ్కిందిన్న వాఁడు శీఘ్రమె యచటన్. |
146 |
| క. |
క్రిమిభోజన మనియెడి నర, కమునంబడి క్రిములె కూడుగాఁగుడుచుచుఁ దాఁ గ్రిమి యగుచు లక్షపరిమా, ణము గల క్రిమికుండమందు నాటుకయుండున్. |
147 |
| వ. | మఱియు నీ భూలోకంబున నెవ్వఁడేనియు నవిపన్నుండై చౌర్యవృత్తిచే బ్రాహ్మణాదుల హిరణ్య రత్నాది ద్రవ్యంబుల నపహరించు, నట్టి పురుషుని నగ్నివర్ణంబులగు నయఃపిండంబుల నగ్నితప్తంబులగు శూలంబుల నతని శరీరంబునం దివియుచుండుదురు; మఱియును మదనాతురు లగుచు స్త్రీపురుషు లగమ్యగమనంబులు సేసిరేని నట్టివారిని యమలోకంబున నతితీక్ష్ణ కశాతాడితులంజేసి యగ్నిమయంబు లయిన యుక్కు ప్రతిమల నాలింగనంబు సేయింతురు. | 148 |
| ఆ. |
సర్వజంతుజాలసంగమ మొందెడు, వానిఁబట్టి కట్టి వజ్రదంష్ట్ర కములు గలుగునట్టి ఘనతరశాల్మలీ, తరువులందుఁజేర్చి దంతు రెపుడు. |
149 |
| ఆ. |
పార్థివేంద్ర! నరుఁడు పాషండదర్శనుఁ, డగుచు ధర్మమార్గ మడఁచెనేని వాఁడు నరకమందు వైతరణీనది, నుడుగ కెపుడుఁ బొరలి పడుచునుండు. |
150 |
| వ. | మఱియు నట్టి వైతరణీనది యందు జలగ్రాహంబులు దిగిచి భక్షింపం బ్రాణంబులు నిర్గమింపఁ దన పాపంబు లుచ్చరించుచు విణ్మూత్రపూయ శోణిత కేశ నఖాస్థి మేదోమాంస వసావాహిని యందుఁ దప్తుం డగుచు నుండు; విప్రుండు శూద్రకామినులం బొంది శౌచాచారంబులం బాసి గతలజ్జుండై పశువుంబోలెఁ జరియించెనేని నతండు నరకంబునుం బొంది యందుఁ బూయ విణ్మూత్రలాలాశ్లేష్మ పూర్ణార్ణవమందు ద్రొబ్బంబడి యతిబీభత్సితంబులగు నా ద్రవ్యంబుల భుజియించుచుండు. | 151 |
| క. |
శునకములఁ బెంచి యెవ్వం, డనయంబును వేఁట సలిపి యాత్మార్థముగా వనమృగములఁ జంపును నా, మనుజాధము నస్త్రములను మర్దింతు రొగిన్. |
152 |
| ఆ. |
జృంభణమున నెవఁడు దంభార్థమై పశు, వులను జంపి జన్నములను జేయు వానిఁబట్టి యమునివారలు గోయుచు, నుందు రెపుడు మిగుల సందడిలుచు. |
153 |
| వ. | కామమోహితుండై యెవ్వండేనియుఁ దన భార్యచేత రేతఃపానంబు సేయించు నా పాపాత్ముని రేతోహ్రదంబునం ద్రోచి యా రేతంబునే పానంబు సేయించుదురు; రాజభటులైనను జోరులైనను ధనికుల గ్రామంబులపైఁ బడి యందు గృహదాహంబు సేయువారలను, విషాదుల వలన నన్యులఁ జంపెడు వారలను, వజ్ర దంష్ట్రలు గల వింశత్యుత్తర సప్త శతశునకంబు లెడతెగక తిగిచి భక్షించుచుండు. | 154 |
| సీ. |
లంచంబుఁ గొని సాక్షి వంచించి యనృతంబు పలికెడు పాపాత్ముఁ బట్టి కట్టి యంత మాన కవీచి యను నరకమునందు శతయోజనోన్నత శైల శిఖర మునఁ దలక్రిందుగా నునిచి యధోముఖంబుగఁ బడద్రొబ్బిన బొబ్బలిడుచుఁ గల్లోలములు లేని కమలాకరముఁబోలెఁ జదరమైయున్న పాషాణమందుఁ |
|
| తే. |
బడిన యంతన దేహంబు పగిలి పెక్కు, తునుకలై పాసి యది గూడికొనుచు నుండ దండి యాకులతను బొందుచుండుఁగాని, చావు లేకుండు నా దుష్టజంతువునకు. |
155 |
| ఆ. |
సోమయాజిభార్యఁగామించి పొందిన, వానిఁగపటమద్యపాన సోమ పాన మనుదినంబుఁబానంబు సేయు విట్, క్షత్త్రియులను బట్టి సంభ్రమమున. |
156 |
| ఆ. |
ఱొమ్ముఁద్రొక్కి మోము ఱిమ్మవట్టఁగ మోఁది, యనలముఖమునందు నగ్నివర్ణ ముగను గాఁచి వక్త్రమున నిండఁగా నుక్కు, నీరు వోతు రేచి నిష్ఠురముగ. |
157 |
| వ. | మఱియు నీచవర్ణుండు నిష్ఠ సలుపుచుం దపో దాన విద్యాచారంబులఁ బెద్దల కవమానంబు సేయు వాఁడు క్షారకర్దమంబను నరకంబునందు నధోముఖుం డగుచు బాధలం బొందు; స్త్రీ పురుషు లెవ్వరేని శరీర రక్షణార్థంబు పశువుల మానవుల బలి యిచ్చి రేని వారలను నిరయంబునందు యమకింకరులు సురియలం దునిమి తద్రక్తంబు పానంబు సేయుచుం బాఱాడుచుందురు; గ్రామారణ్యంబులయందు జంతువుల శూలప్రోతంబులఁ గావించి హింసించుచు హర్షించుచున్న వారలను శూలప్రోతంబను నరకంబునందు శూలప్రోతుల జేసిన క్షుత్పిపాసాపరు లగుచుండఁ గంకగృధ్రాదులు తీక్ష త్ణుండాగ్రంబులం దిగిచి భక్షించుచుండు; మఱియు ధూర్త స్వభావంబునం జంతుపీడనంబుఁ గావించెడు పాపాత్ముల దందశూకంబను నరకంబునందు వైవ నైదు నేడు ముఖంబుల సర్పంబులు గఱచుచుండు. | 158 |
| ఆ. |
ఎనయ దొడ్లలోన నిండ్లలో నైనను, బశుపతంగహరిణపంక్తినెల్లఁ బట్టి హింససేయు పాపాత్ము విషవహ్ని, ధూమశిఖల ద్రొబ్బుదురు నృపాల! |
159 |
| క. |
తన యింటికి వచ్చిన మను, జుని నతిథింగ్రోధదృష్టిఁజూచినవానిం గనుఁగవల వజ్రదంష్ట్రలఁ, దనరిన యా కంకగృధ్రతతి భక్షించున్. |
160 |
| మ. |
ధనవంతుండగు మానవుండు గడఁకన్ ధర్మోపకారంబులన్ ఘనతంజేయక యుండెనేని యమలోకంబందు సూచీముఖం బను నా దుర్గతిఁబట్టి త్రోచి నిధి కాపై యున్న భూతం బటం చును బాశంబులఁబట్టి కట్టి వడితో నొప్పింతు రత్యుగ్రులై. |
161 |
| ఆ. |
నరవరేణ్య! యిట్టి నరకముల్ యమలోక, మందుఁగలవు మఱి సహస్రసంఖ్య, లందు శమనదూత లనిశంబు బాధింతు, రవని ధర్మదూరులయిన నరుల. |
162 |
| ఆ. |
ధర్మవంతులెల్లఁదప్పక స్వర్గంబు, నందు భోగసమితిఁబొందుచుందు; రెలమిఁబుణ్యపాపముల శేషమువల్లఁ, బుట్టుచుందు రవనిఁబుణ్యచరిత. |
163 |
| వ. | నరేంద్రా! మోక్షమార్గంబు మున్నె వినిపించితి; నిప్పుడు నీ కెఱింగించిన వెల్లను బ్రహ్మాండ కోశంబునం జతుర్దశ కోశంబులు గలవని పురాణంబులు పలుకుచుండు; నట్టి బ్రహ్మాండంబు శ్రీమన్నారాయణుని స్థూలశరీరం బగుటం జేసి బ్రహ్మాండం బెవ్వరు వర్ణింతు రెవ్వరు విందురు వారలకు సకల శ్రేయస్సులుం గలుగు; నీశ్వర స్థూలశరీరంబుఁ దెలిసినవారికి శ్రద్ధాభక్తులం జేసి సూక్ష్మదేహంబు నెఱుంగ వచ్చు; భూద్వీప వర్ష సరి దద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్నరక తారాగణ లోకసంస్థితం బయిన సకల జీవనికాయంబై యద్భుతంబైన శ్రీహరి స్థూలశరీరప్రకారంబు వినిపించితిని. | 164 |
| చ. |
జలజభవాదిదేవమునిసన్నుతతీర్థపదాంబుజాత! ని ర్మలనవరత్ననూపురవిరాజిత! కౌస్తుభభూషణాంగ! యు జ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ! శ్రీ నిలయశరీర! కృష్ణ! ధరణీధర! భానుశశాంకలోచనా! |
165 |
| క. |
శ్రీతరుణీహృదయస్థిత!, పాతకహర! సర్వలోకపావన! భువనా తీతగుణాశ్రయ! యతివి, ఖ్యాత! సురార్చితపదాబ్జ! కంసవిదారీ! |
166 |
| మత్తకోకిలము. |
దండితారిసమూహ! భక్తనిధాన! దానవిహార! మా ర్తాండమండలమధ్యసంస్థిత! తత్త్వరూప! గదాసి కో దండశంఖసుదర్శనాంక! సుధాకరార్కసునేత్ర! భూ మండలోద్ధరణార్తపోషణ! మత్తదైత్యనివారణా! |
167 |
| గద్య. | ఇది శ్రీ సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమద్భాగవత మహాపురాణంబునందు భరతాత్మజుండయిన సుమతికి రాజ్యాభిషేకంబును, బాషండ దర్శనంబును, సుమతి పుత్త్ర జన్మ విస్తారంబును, గయుని చరిత్రంబును, గయుని సంస్తుతియు, భూద్వీప వర్ష సరిదద్రి నభస్సముద్ర పాతాళ దిఙ్నరక తారకాగణ సంస్థితియు నను కథలు గల పంచమస్కంధంబునందు ద్వితీయాశ్వాసము. | 168 |