| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | పంచమస్కంధము - ద్వితీయాశ్వాసము |
| ఆ. |
కమలజాండమధ్యగతుఁడైన సూర్యుండు, భరితమైన యాతపంబుచేత మూఁడు లోకములను ముంచి తపింపంగఁ, జేసి కాంతి నొందఁజేయుచుండు. |
77 |
| వ. | అట్టి భాస్కరుం డుత్తరాయణ దక్షిణాయన విషువులను నామంబులు గల మాంద్య తీవ్ర సమానగతుల నారోహణావరోహణస్థానంబులయందు దీర్ఘహ్రస్వసమానంబులుగాఁజేయుచుండు. | 78 |
| ఆ. |
మేషతులలయందు మిహిరుం డహోరాత్రు, లందుఁదిరుగు సమవిహారములను, బరఁగఁగ వృషభాదిపంచరాసులను, నొక్కొక్క గడియ రాత్రి దక్కి నడచు. |
79 |
| ఆ. |
మించి వృశ్చికాదిపంచరాసులను నొ, క్కొక్క గడియ రాత్రి నిక్కి నడచు, దివములందు నెల్ల దిగజాఱు నొక్కొక్క, గడియ నెలకుఁదత్ప్రకారమునను. |
80 |
| వ. | మఱియు ని వ్విధంబున దివసంబు లుత్తరాయణ దక్షిణాయనంబుల వృద్ధిక్షయంబుల నొంద నొక్క యహోరాత్రంబున నేకపంచాశదుత్తర నవకోటియోజనంబుల పరిమాణంబు గల మానసోత్తర పర్వతంబునందుఁ దూర్పున దేవధాని యను నింద్రపురంబును, దక్షిణంబున సంయమని యను యమనగరంబును, బశ్చిమంబున నిమ్లోచని యను వరుణ పట్టణంబును, నుత్తరంబున విభావరి యను సోముని పుటభేదనంబును దేజరిల్లుచుండు; నా పట్టణంబుల యందు నుదయ మధ్యాహ్న సమయ నిశీథంబు లనియెడు కాలభేదంబులను భూతప్రవృత్తి నివృత్తి నిమిత్తం బచ్చటి జనులకుఁ బుట్టించుచుండు, సూర్యుం డెపుడింద్ర నగరంబున నుండి గమనించు నది యాదిగాఁ బదియేను గడియలను రెండుకోట్ల ముప్పదియేడు లక్షల డెబ్బదియైదువేల యోజనంబులు నడుచు, ని వ్విధంబున నింద్ర యమ వరుణ సోమపురంబుల మీఁదఁ జంద్రాది గ్రహ నక్షత్రంబులంగూడి సంచరించుచుఁ బండ్రెండంచులు, నాఱు కమ్ములును, మూడుఁ దొలులుం గలిగి సంవత్సరాత్మకంబయి యేకచక్రం బయిన సూర్యుని రథంబు ముహూర్తమాత్రంబున ముప్పదినాలుగులక్షలయెనమన్నూఱు యోజనంబులు సంచరించు. | 81 |
| సీ. |
ఇనురథంబున నున్న యిరుసొక్కటియ మేరు శిఖరంబునందును జేరియుండు; నొనరఁజక్రము మానసోత్తరపర్వతం బందులఁదిరిగెడు నా రథంబు నిరుసున నున్న రెం డిరుసులు దగులంగఁ బవనపాశంబుల బద్ధ మగుచు ధ్రువమండలంబునందుల నంటి యుండఁగా సంచరించుచునుండు సంతతంబు; |
|
| గీ. |
నట్టి యరదంబు ముప్పది యాఱులక్ష, లందు నంటిన కాఁడియు నన్ని యోజ నముల విస్తారమై తురంగముల కంధ, రములఁదగులుచు వెలుఁగొందు రమణతోడ. |
82 |
| వ. | ఆ రథంబునకు గాయత్రీచ్ఛందం బాదిగా సప్తచ్ఛందంబులు నశ్వంబులై సంచరించు, భాస్కరునకు నగ్రభాగంబున నరుణుండు నియుక్తుండై రథంబు గడపుచుండు; వెండియు నంగుష్ఠపర్వమాత్ర శరీరంబులు గల యఱువదివేల వాలఖిల్యాఖ్యులగు ఋషివరులు సూర్యుని ముందట సౌరసూక్తంబుల స్తుతియింప, మఱియు ననేక మునులును గంధర్వ కిన్నర కింపురుష నాగాప్సరః పతంగాదులును నెలనెల వరుసక్రమంబున సేవింపం దొమ్మిదికోట్లు నేఁబదియొక లక్షయోజనంబుల పరిమాణంబు గల భూమండలంబునందొక క్షణంబున సూర్యుండు రెండువేల యేఁబది యోజనంబులు సంచరించుచు, నొక యహోరాత్రంబునందె యీ భూమండలంబంతయు సంచరించు, ననిన శుకయోగీంద్రునకుఁబరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. | 83 |
| క. |
మునివర! మేరుధ్రువులకు, నొనరఁ బ్రదక్షిణము దిరుగుచుండెడు నజుఁ డా యినుఁడభిముఖుఁడై రాసుల, కనుకూలత నేగునంటి; వది యెట్లొప్పున్? |
84 |
| క. |
అని పలికిన భూవరునిం, గనుఁగొని శుకయోగి మిగులఁగరుణాన్వితుఁడై మనమున శ్రీహరిఁదలఁచుచు, విను మని క్రమ్మఱఁగ నిట్లు వినిపించెఁదగన్. |
85 |
| వ. | నరేంద్రా! యతివేగంబునం దిరుగుచుండు కులాల చక్రంబునందుఁ జక్రభ్రమణంబునకు వేఱైన గతి నొంది బంతిసాగి తిరిగెడు పిపీలికాదుల చందంబున నక్షత్రరాసులతోడం గూడిన కాలచక్రంబు ధ్రువమేరువులం బ్రదక్షిణంబు దిరుగునపు డా కాలచక్రంబు వెంట సంచరించు సూర్యాదిగ్రహంబులకు నక్షత్రాంతరంబులయందును రాశ్యంతరంబులయందును నునికి గలుగుటం జేసి సూర్యాది గ్రహంబులకుఁ జక్రగతి స్వగతులవలన గతిద్వయంబు గలుగుచుండు; మఱియు నా సూర్యుండాదినారాయణమూర్తి యగుచు లోకంబుల యోగక్షేమంబులకు వేదత్రయాత్మకంబై కర్మసిద్ధి నిమిత్తంబై దేవర్షి గణంబులచే వేదాంతార్థంబుల ననవరతంబు వితర్క్యమానం బగుచున్న తన స్వరూపంబును ద్వాదశవిధంబులుగ విభజించి వసంతాది ఋతువుల నా యా కాలవిశేషంబులయందుఁ గలుగఁ జేయుచుండు; నట్టి పరమపురుషుని మహిమ నీ లోకంబున మహాత్ములగు పురుషులు దమ తమ వర్ణాశ్రమాచారంబుల చొప్పున వేదోక్త ప్రకారంబుగా భక్త్యతిశయంబున నారాధించుచు క్షేమంబు నొందుచుందు; రట్టి యాదినారాయణమూర్తి జ్యోతిశ్చక్రాంతర్వర్తియై స్వకీయతేజః పుంజదీపితాఖిల జ్యోతిర్గణంబులు గలవాఁడై ద్వాదశరాసులయందు నొక సంవత్సరంబున సంచరించుచుండు; నట్టి యాదిపురుషుని గమన విశేషకాలంబును లోకు లయన ఋతు మాస పక్ష తిథ్యాదులచే వ్యవహరించు చుందురు; మఱియు నప్పరమపురుషుం డా రాసులయందు షష్ఠాంశసంచారంబు నొందిన సమయంబును ఋతువని వ్యవహరింపుదు; రా రాసులయందు నర్ధాంశ సంచారమ్మున రాశిషట్క భోగం బొందిన తఱి యయనం బని చెప్పుదురు; సమగ్రంబుగా రాసుల యందు సంచార మొందినయెడల నట్టి కాలంబును సంవత్సరం బని నిర్ణయింపుదు; రిట్టి సమగ్రరాశి సంచారంబునందు శీఘ్రగతి మందగతి సమగతు లనియెడు త్రివిధగతి విశేషంబుల వలన వేఱుపడెడు నా వత్సరంబును సంవత్సరంబు పరివత్సరం బిడావత్సరం బనువత్సరం బిద్వత్సరంబని బంచవిధంబులఁ జెప్పుదురు, చంద్రుండు నీ తెఱంగున నా సూర్యమండలంబు మీఁద లక్షయోజనంబుల నుండి సంవత్సర పక్ష రాశి నక్షత్ర భుక్తులు గ్రహించుచు నగ్రచారియై శీఘ్రగతిం జరించునంత వృద్ధిక్షయ రూపంబునం బితృగణంబులకుఁ బూర్వపక్షాపరపక్షంబులచే నహోరాత్రంబుఁ గలుగఁ జేయుచు సకల జీవ ప్రాణంబై యొక్క నక్షత్రంబు త్రింశన్ముహూర్తంబు లనుభవించుచు షోడశకళలు గలిగి మనోమయాన్నమ యామృతమయ దేహుండై దేవ పితృ మనుష్య భూత పశు పక్షి సరీసృప వీరుత్ప్రభృతులకుఁ బ్రాణాప్యాయన శీలుండగుటంజేసి సర్వసముం డనంబడు. | 86 |
| క. |
చందురునకు మీఁదై యా, నందంబున లక్షయోజనంబులఁదారల్ గ్రందుకొని మేరుశైలం, బంది ప్రదక్షిణము దిరుగు నభిజిద్భముతోన్. |
87 |
| సీ. |
అటమీఁదఁదారల కన్నిటి కుపరియై రెండు లక్షల శుక్రుఁడుండి భాస్క రుని ముందఱంబిఱుందను సామ్యమృదు శీఘ్రసంచారములను భాస్కరుని మాడ్కిఁ జరియించుచుండును జనులకు ననుకూలుఁ డై వృష్టి నొసఁగుచు నంతనంతఁ జతురత వృష్టివిష్కంభకగ్రహశాంతి నొనరించువారల కొసఁగు శుభము. |
|
| తే. |
లుండు నామీఁద సౌమ్యుండు రెండు లక్ష, లను జరించుచు రవిమండలంబుఁబాసి కానఁబడినను జనులకు క్షామ డాంబ, రాదిభయములఁబుట్టించు నతులమహిమ. |
88 |
| సీ. |
ధరణీతనూజుఁడంతటిమీఁద రెండు లక్షల నుండు మూఁడు పక్షముల నొక్క రాశి దాఁటుచు నుండుఁ; గ్రమమున ద్వాదశరాసులు భుజియించు రాజసమున; వక్రించియైన నవక్రత నైనను దఱచుగాఁ బీడలు నరుల కొసఁగు; నంగారకుని టెంకి కావల రెండులక్షల యోజనంబుల ఘనత మించి |
|
| ఆ. |
యొక్క రాశినుండి యొక్కొక్క వత్సరం, బనుభవించుచుండు నమరగురుఁడు వక్రమందునైన వసుధామరులకును, శుభము నొసఁగు నెపుడు నభినవముగ. |
89 |
| క. |
సురగురునకు మీఁదై భా, స్కరసుతుఁ డిరులక్షలను జగములకుఁబీడల్ జరపుచుఁద్రింశన్మాసము, లరుదుగ నొక్కొక్క రాశియందు వసించున్. |
90 |
| క. |
ప్రాకటముగ రవిసుతునకు, నేకాదశలక్షలను మహీసురులకు నీ లోకులకు మేలు గోరుచు, జోకగ మునిసప్తకంబు సొంపు వహించెన్. |
91 |
| క. |
మునిసప్తకమున కెగువం, దనరుచు నా మీఁదఁద్రియుతదశలక్షలఁ బెం పున శింశుమారచక్రం, బనఁగా నిన్నిటికి నుపరి యగుచుండు నృపా! |
92 |
| సీ. |
ఆ శింశుమారాఖ్యమగు చక్రమున భాగవతుఁడైన ధ్రువుఁడింద్రవరుణకశ్య ప ప్రజాపతి యమ ప్రముఖులతోఁగూడి బహుమానముగ విష్ణుపదముఁజేరి కణఁక నిచ్చలుఁ బ్రదక్షిణముగాఁ దిరుగుచుఁ జెలఁగియుండును గల్పజీవి యగుచు; ననఘుఁడుత్తాన పాదాత్మజుఁడార్యుఁడు నయిన యా ధ్రువుని మహత్త్వమెల్లఁ |
|
| తే. |
దెలిసి వర్ణింప బ్రహ్మకు నలవిగాదు, నే నెఱింగిన యంతయు నీకు మున్న తెలియఁబలికితిఁ; గ్రమ్మఱఁదలఁచికొనుము, జితరిపువ్రాత! శ్రీపరీక్షిన్నరేంద్ర! |
93 |
| వ. | మఱియు నా ధ్రువుండు కాలంబుచేత నిమిషమాత్రం బెడ లేక సంచరించు జ్యోతిర్గ్రహ నక్షత్రంబులకు నీశ్వరునిచేత ధాన్యాక్రమణంబునఁ బశువులకై యేర్పఱచిన మేధిస్తంభంబు తెఱంగున మేటిగాఁ గల్పింపంబడి ప్రకాశించుచుండు; గగనంబు నందు మేఘంబులును శ్యేనాదిపక్షులును వాయువశంబునం గర్మ సారథులై చరించు తెఱంగున జ్యోతిర్గణంబులును బ్రకృతిపురుష యోగ గృహీతాశులై కర్మ నిమిత్తగతి గలిగి వసుంధరం బడకుందురు. | 94 |
| క. |
పొందుగ జ్యోతిర్గణముల, నందఱ నా శింశుమారమందుల నుండం గొందఱు దఱచుగఁజెప్పుచు, నుందురు; వినిపింతు, విను మనూనచరిత్రా! |
95 |
| క. |
తలక్రిందై వట్రువయై, సలలితమగు శింశుమారచక్రము నందున్ నెలకొని పుచ్ఛాగ్రంబున, నిలిచి ధ్రువుం డుండు నెపుడు నిర్మలచరితా! |
96 |
| వ. | మఱియు నా శింశుమార చక్రపుచ్ఛంబునఁ బ్రజాపతియు నగ్నీంద్ర ధర్ములును, బుచ్ఛమూలంబున ధాతృవిధాతలును, గటి ప్రదేశంబున ఋషి సప్తకంబును, దక్షిణావర్త కుండలీభూత శరీరంబునకు నుదగయన నక్షత్రంబులును, దక్షిణపార్శ్వంబున దక్షిణాయన నక్షత్రంబులును, బృష్ఠంబున దేవమార్గంబును, నాకాశగంగయు, నుత్తరభాగంబునఁ బునర్వసు పుష్యంబులును, దక్షిణాయనంబున నార్ద్రాశ్లేషలును, దక్షిణ వామపాదంబుల నభిజి దుత్తరాషాఢలును, దక్షిణ వామ నాసారంధ్రంబుల శ్రవణ పూర్వాషాఢలును, దక్షిణ వామలోచనంబుల ధనిష్ఠామూలలును, దక్షిణ వామకర్ణంబుల మఘాద్యష్ట నక్షత్రంబులును, వామపార్శ్వంబున దక్షిణాయనంబును, దక్షిణపార్శ్వంబునఁ గృత్తికాది నక్షత్ర త్రయంబును, నుత్తరాయణంబును. వామదక్షిణ స్కంధంబుల శతభిషగ్జ్యేష్ఠలును, నుత్తరహనువున నగస్త్యుండును, నపర హనువున యముండును, ముఖంబున నంగారకుండును, గుహ్యంబున శనైశ్చరుండును, మేఢ్రంబున బృహస్పతియును, వక్షంబున నాదిత్యుండును, నాభిని శుక్రుండును, మనంబునం జంద్రుండును, స్తనంబుల నశ్వినులును, బ్రాణాపానంబుల బుధుండును, గళంబున రాహువును, సర్వాంగంబులఁ గేతుగ్రహంబును, రోమంబులఁ దారలును నుండు; నది సర్వదేవతామయంబైన పుండరీకాక్షుని దివ్యదేహంబు ధ్రువునింగా నెఱుంగుము. | 97 |
| సీ. |
ఇట్టి దివ్యశరీర మెవ్వఁడు ప్రతిదినం బందు సంధ్యాకాల మతులభక్తి మనమందు నిలిపి యేమఱక మిక్కిలి ప్రయత్నంబున నియతుఁడై తత్త్వబుద్ధి మౌనవ్రతంబునఁబూని వీక్షించుచు నీ సంస్తవంబు దానెంతొ ప్రేమ జపియించి కడుఁబ్రశస్తమును మునీంద్ర సేవ్యమును జ్యోతిస్స్వరూపమున వెలుఁగు |
|
| ఆ. |
విపులశింశుమారవిగ్రహంబునకు వం, దనము వందనంబు లనుచు నిలిచి సన్నుతించెనేని సకలార్థసిద్ధులఁ, బొందు మీఁద ముక్తిఁజెందు నధిప! |
98 |
| క. |
ఇనమండలంబునకుఁ గ్రిం, దను దశసాహస్రయోజనంబుల స్వర్భా నుని మండలంబు గ్రహమై, ఘనముగ నపసవ్యమార్గగతి నుండు నృపా! |
99 |
| క. |
అసురాధముఁడగు రాహువు, బిసరుహసంభవుని వరము పెంపున నెంతో పసయగు నమరత్వంబున, నసమానంబైన గ్రహవిహారముఁ బొందెన్. |
100 |
| సీ. |
జననాథ! రాహువు జన్మకర్మంబులు వినిపింతు ముందఱ విస్తరించి యయుతయోజనవిస్తృతార్కమండలము ద్వి షట్సహస్రవిశాలచంద్రమండ లముఁ బర్వకాలంబులను ద్రయోదశసహస్రవిశాలమై మీఁద రాహుఁగప్పు నది చూచి యుపరాగమనుచును బలుకుదు రెల్ల వారును స్వధర్మేచ్ఛు లగుచు. |
|
| ఆ. |
నంతలోన నినశశాంకమండలములఁ, గరుణఁబ్రోవఁదలఁచి హరిసుదర్శ నంబు వచ్చునను భయంబున నైదాఱు, గడియలకును రాహు నడిఁకి తొలఁగు. |
101 |
| క. |
నరవర! యా రాహువునకు, సరసత నా క్రింద సిద్ధచారణవిద్యా ధరు లయుతయోజనంబులఁ, దిరముగ వసియించి లీలఁదిరుగుదు రచటన్. |
102 |
| క. |
పరికింప సిద్ధ విద్యా, ధరులకుఁబదివేలు క్రిందఁదరలక యక్షుల్ మఱియును భూతప్రేతలు, చరియింతురు రాక్షసులు పిశాచులు గొలువన్. |
103 |
| ఆ. |
వారిక్రిందఁదగిలి వాయువశంబున మలయుచుండు మేఘమండలంబు; మేఘమండలంబు మీఁ దగుచుండు భూ మండలంబు క్రిందనుండు నధిప! |
104 |
| వ. | అట్టి భూమండలంబు క్రింద యోజనాయుతాంతరంబున నండ కటాహాయామంబు గలిగి క్రమంబున నొండొంటికిఁ గ్రిందగుచు నతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకంబు లుండు; నట్టి బిల స్వర్గంబులయందు నుపరి స్వర్గంబున కధికంబైన కామభోగంబుల నైశ్వర్యానందంబులను సుసమృద్ధ వనోద్యాన క్రీడా విహారస్థానంబుల ననుభవించుచు దైత్యదానవ కాద్రవేయాది దేవయోనులు నిత్య ప్రముదితానురక్తు లగుచుఁ గళత్రాపత్య సుహృద్బంధు దాసీదాస పరిజనులతోఁ జేరుకొని మణిగణఖచితంబులగు నతిరమణీయగృహంబులయందు నీశ్వరుని వలనం జేటులేని కాయంబులు గలిగి వివిధ మాయా విశేష వినిర్మిత నూతన కేళీసదన విహరణ మండప విచిత్రోద్యానాదులయందుఁ గేళీవినోదంబులు సలుపుచుఁజరియింతు; రంత. | 105 |
| సీ. |
అట్టి పాతాళంబులందును మయకల్పితములగు పుటభేదనములయందు బహురత్ననిర్మితప్రాకార భవనగోపుర సభాచైత్యచత్వరవిశేష ములయందు నాగాసురుల మిథునములచే శుకపికశారికానికరసంకు లముల శోభిల్లు కృత్రిమభూములను గల గృహములచే నలంకృతము లగుచుఁ |
|
| ఆ. |
గుసుమచయసుగంధి కిసలయస్తబక సం, తతులచేత ఫలవితతులచేత నతులరుచిరనవలతాంగనాలింగిత, విటపములను గలుగు విభవములను. |
106 |
| వ. | మఱియు మానసేంద్రియంబుల కానందకరంబులైన నానావిధ జలవిహంగమ మిథునంబులు గలిగి నిర్మల జలపూరితంబులై మత్స్యకుల సంచార క్షుభితంబులైన కుముదకువలయ కహ్లార లోహిత శతపత్త్రాదికంబులఁ దేజరిల్లెడు సరోవరంబులు గల యుద్యాన వనంబుల యందుఁ గృతనికేతనులై స్వర్గభూముల నతిశయించిన వివిధ విహారంబులు గలిగి యహోరాత్రాది కాల విభాగ భయంబులు లేక మహాహిప్రవరులయిన శేషాదుల శిరోమణి దీధితులచే నంధకారోపద్రవంబు లేక యెల్లప్పుడు దివసాయమానంబుగా నుండు; నా లోకంబునందు నఖిల జనులు దివ్యౌషధి రస రసాయనంబుల ననవరతంబు నన్నపానంబులుగా సేవించుటం జేసి యచ్చటివారలకు నాధివ్యాధులును, వలిత పలితంబులును, జరారోగంబులును, శరీర వైవర్ణ్యంబులును, స్వేదదౌర్గంధ్యంబులును గలుగక పరమకల్యాణ మూర్తు లగుచు హరిచక్రభయంబు దక్క నన్యంబగు మృత్యుభయంబు నొందక యుందు; రదియునుంగాక. | 107 |
| తే. |
అట్టి పాతాళలోకంబునందు విష్ణు, చక్ర మెప్పుడేనియుఁబ్రవేశంబు నొందు నప్పు డెల్లను దైత్యకులాంగనలకు, గర్భసంపద లందంద కరఁగుచుండు. |
108 |
| చ. |
అతలమునందు నమ్మయునియాత్మజుఁడైన బలాసురుండు స మ్మతిఁ జరియించు షణ్ణవతిమాయలఁ గూడి వినోద మందుచుం గుతలములందు నేఁడు నొక కొందఱు నచ్చటి మాయఁజెంది సం తతముఁజరించుచుండుదురు దప్పక మోహనిబద్ధచిత్తులై. |
109 |
| వ. | అట్టి బలుని యావలింతలను స్వైరిణులు కామినులు పుంశ్చలు లను స్త్రీ గణంబులు జనియించి; రా కామినీ జనంబులు పాతాళంబుఁ బ్రవేశించిన పురుషునికి హాటక రసం బనియెడు సిద్ధరసఘుటిక నిచ్చి రససిద్ధునిం గావించి యతని యందు స్వవిలాసావలోకనానురాగస్మితసల్లాపోపగూహనాదుల నిచ్ఛా విహారంబులు సలుపుచుండ నా పురుషుండు మదాంధుండై తానే సిద్ధుండ ననియును నాగాయుత బలుండ ననియును దలంచి నానావిధరతిక్రీడలఁబరమానందంబు నొందుచుండు. | 110 |
| సీ. |
హాటకేశ్వరుఁడైన యంబికాధీశుండు వితలంబునందున వేడ్క నిలిచి తనదు పార్షదభూతతతులతో బ్రహ్మ సర్గోపబృంహణమున నొక్కచోటఁ బార్వతీ సంభోగపరుఁడగుచుండఁగా వారల వీర్యంబువలనఁబుట్టి నట్టిది హాటకి యనియెడు నది యనిలాగ్నులు భక్షించి యంత నుమియ |
|
| తే. |
నదియు హాటక మనుపేర నతిశయిల్లి, వన్నె మీఱుచు శుద్ధసువర్ణమయ్యె నా సువర్ణంబు నాలోకమందు నున్న, జనులకెల్లను వినుతభూషణము లయ్యె. |
111 |
| సీ. |
ఆ క్రింద సుతలంబు నందు మహాపుణ్యుఁ డగు విరోచనపుత్త్రుఁడైన యట్టి బలిచక్రవర్తి యా పాకశాసనునకు ముద మొసంగఁగఁగోరి, యదితిగర్భ మున వామనాకృతిఁబుట్టి యంతటఁ ద్రివిక్రమ రూపమునను లోకత్రయంబు నాక్రమించిన దానవారాతిచేత ముందటన యీఁబడిన యింద్రత్వ మిట్లు |
|
| ఆ. |
గలుగువాఁడు పుణ్యకర్మసంధానుండు, హరిపదాంబుజార్చనాభిలాషుఁ డగుచు శ్రీరమేశు నారాధనము సేయు, చుండు నెపుడు నతిమహోత్సవమున. |
112 |
| వ. | నరేంద్రా! సకల భూతాంతర్యామియుఁ దీర్థభూతుండును నయిన వాసుదేవుని యందుఁ జిత్తంబు గలిగి యిచ్చిన భూదానంబునకు సాక్షాత్కరించిన మోక్షంబు ఫలం బగుం; గాని పాతాళ స్వర్గరాజ్యంబులు ఫలంబులు గానేర వయిన నెవ్వరికిని మోక్షంబు సాక్షాత్కృతంబు గాకుండుటంజేసి లోక ప్రదర్శనార్థంబు పాతాళ స్వర్గరాజ్యంబుల నిచ్చె; క్షుత పతన ప్రస్ఖల నాదులందును వివశుండైన యెడల నామస్మరణంబు సేయు పురుషుండు గర్మబంధంబు వలన విముక్తుం డగుచు సుజ్ఞానంబునం బొందు; నట్టి వాసుదేవుం డాత్మజ్ఞాన ప్రమోషణంబు సేయు మాయామయంబు లయిన భోగైశ్వర్యంబుల నెల్ల నెట్లొసంగు ననవలదు; భగవంతుండు యాచనచేసి సకల సంపదలఁ జేకొని శరీరమాత్రావశిష్టునిం జేసి వారుణపాశంబులం గట్టి విడిచినప్పుడు బలీంద్రు డిట్లనియె. | 113 |
| సీ. |
పరమేశ్వరునకు నెప్పటి పదార్థములందుఁదృష్ణ లేకుండుట దెలిసినాఁడ నింద్రాదులెల్ల నుపేంద్రునిఁ బ్రార్థించి యడిగిరి గాని శ్రీహరికిఁగోరి కలు లేవు; మిక్కిలి గంభీరమగు మహాకాలస్వభావంబు గలుగుచుండు నరయంగ మన్వంతరాధిపత్యమును లోకత్రయంబును నెంత గానఁదలఁప |
|
| ఆ. |
మత్పితామహుండు మానవంతుండు ప్ర, హ్లాదవిభునిఁజూచి హర్షమంది యెద్దియైనఁగోరు మిచ్చెద ననుటకు, నంతలోన నీశ్వరాజ్ఞఁదెలిసి. |
114 |
| వ. | ఇట్లకుతోభయంబు, పిత్ర్యంబయిన రాజ్యంబు నొల్లక పరమేశ్వరు దాస్యంబ కోరె, నా ప్రహ్లాద చరిత్ర కథనావసరమ్మున నీ తండ్రికిని నీకును విశేషంబుగా నే పురుషుండు భగవదనుగ్రహంబుఁ బొంద నోపు నని పుండరీకాక్షుం డానతిచ్చిన వాక్యంబులు వక్ష్యమాణగ్రంథంబున విస్తరించెద! నా బలిచక్రవర్తి గృహద్వారంబున నఖిల లోకగురుండైన శ్రీమన్నారాయణుండు గదాపాణియును నిజజనానుకంపితుండును శంఖచక్రాద్యాయుధ ధరుండును నగుచు నిప్పుడును దేజరిల్లుచుండు; నట్టి బలిద్వారంబున నున్న గరుడధ్వజుండు లోకంబుల గెలువ నిచ్చగొన్న దశగ్రీవుం డుల్లంఘిత శాసనుండై ప్రవేశంబు గావింపఁ దన పాదాంగుష్ఠంబున యోజనాయుతాయుతంబులం బాఱఁజిమ్మె, వినుము. | 115 |
| క. |
ఆ సుతలమునకుఁగ్రిందై, భాసిల్లుఁదలాతలంబు; ప్రభువందు మయుం డాసురపుర నిర్మాతగ, వాసిగఁబొగడంది యేలు వసుధాధీశా! |
116 |
| చ. |
పురహరుచే రమేశ్వరుఁడు భూతహితార్థముగాఁబురత్రయం బరుదుగ నీఱుసేసె; శరణాగతు నా మయుఁగాఁచి యెంతయుం గరుణఁదలాతలంబునకుఁగర్తఁగ నిల్పిన నున్నవాఁడు శ్రీ ధరుని సుదర్శనంబునకుఁదప్పి విముక్తభయుండుఁగాఁదగన్. |
117 |
| క. |
తలఁపఁగ నా క్రింద మహా, తలమునఁగద్రువవధూటి తనయులు సర్పం బులు గలవు పెక్కు శిరములు, నలరంగాఁ గ్రోధవశగణావళి యనఁగన్. |
118 |
| వ. | మఱియును గుహక తక్షక కాళియ సుషేణాది ప్రధాను లయినవార లతులశరీరంబులు గలిగి యాదిపురుషుని వాహనంబైన పతగరాజభయంబున ననవరతంబు నుద్వేజితు లగుచు స్వకళ త్రాపత్య సుహృద్బాంధవ సమేతు లయి యుండుదు; రా క్రింద రసాతలంబున దైత్యులు దానవులు నగు నివాతకవచ కాలకేయులను హిరణ్యపుర నివాసులగు దేవతాశత్రువులు మహాసాహసులును దేజో0000ధికులును నగుచు సకల లోకాధీశ్వరుండైన శ్రీహరితేజంబునం బ్రతిహతులై వల్మీకంబులందు నడంగియున్న సర్పంబుల చందంబున నింద్రదూతి యగు సరమచేఁ జెప్పఁబడెడు మంత్రాత్మక వాక్యంబులకు భయంబు నొందు చుండుదురు. | 119 |
| క. |
ఇందుకులోద్భవ! వినుమా, క్రిందటి పాతాళమునను గ్రీడించుచు నా నందము నొందుచు నుండును, సందడిఁబడి నాగకులము చతురతతోడన్. |
120 |
| వ. | ఇట్లు వాసుకి ప్రముఖులైన శంఖ కుళిక మహాశంఖ శ్వేత ధనంజయ ధృతరాష్ట్ర శంఖచూడ కంబళాశ్వతర దేవదత్తాదు లయిన మహానాగంబు లై దాఱేడు పదియు నూఱు వేయు శిరంబులు గలిగి ఫణామణికాంతులం జేసి పాతాళతిమిరంబును బాపుచుండుదురు. | 121 |
| సీ. |
పాతాళలోకంబు పాఁతున శేషుండు వెలయంగ ముప్పదివేల యోజ నంబుల వెడలుపునను దోఁకఁజుట్టఁగాఁ జుట్టుకయుండు; విష్ణుని మహోగ్ర మైన శరీరంబు; దానై యనంతాఖ్య సంకర్షణుండుండు సంతతంబు, నట్టి యనంతనామాభిధానుని మస్తకమున సిద్ధార్థంబుకరణి ధరణి |
|
| ఆ. |
యంత నా విభుండు నఖిలలోకంబుల, సంహరింపఁగోరి చండకోప వశత సృజనఁజేయు వరుస నేకాదశరుద్రమూర్తు లనెడు రౌద్రమతుల. |
122 |
| ఆ. |
అట్టి రుద్రమూర్తు లతులత్రినేత్రులు, నఖిలశూలహస్తులగుచునుందు; రందు నున్న ఫణికులాధిపుల్ శేషుని, పాదపంకజముల భక్తిఁజేరి. |
123 |
| ఆ. |
నమ్రు లగుచు ననుదినంబును మౌళి ర, త్నములచేతఁగడు ముదంబు నొంది కోరికలు దలిర్ప నీరాజనంబుల, నిచ్చుచుందు రెపుడు మచ్చికలను. |
124 |
| వ. | మఱియు నా సంకర్షణమూర్తిం జేరి నాగకన్యకలు కోరికలు గలవార లగుచు నొప్పెడి శరీర విలాసంబులంజేసి యగురు చందన కుంకుమ పంకంబు లనులేపనంబులు సేయుచు, సంకర్షణ మూర్తి దర్శన స్పర్శనాదుల నుద్బోధిత మకరధ్వజావేశిత చిత్తంబులు గలిగి చిఱునవ్వు లొలయ నధికాభిలాషం జేసి స్మితావలోకనంబుల సవ్రీడితలై యవలోకించుచుండ ననంత గుణంబులు గల యనంత దేవుం డుపసంహరింపఁ బడిన క్రోధంబు గలిగి లోకంబులకు క్షేమంబు గోరుచు సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణంబు లనవరతంబు ధ్యానంబు సేయ సంతత సంతోషాతిశయంబున మ్రాఁగన్ను వెట్టుచు, సలలిత గీతావాద్యంబుల నానందంబు నొందుచుఁ, దన పరిజనంబుల నతిస్నేహంబున నవలోకించుచు, నవతులసీగంధ పుష్పరసామోదిత మధుకర వ్రాత మధుర గీతంబులు గల వైజయంతీ వనమాలికల ధరియించుచు నీలాంబరధరుండును, హలధరుండును నగుచు నితండు మహేంద్రుడొ హరుండొ యనుచు జనంబులు వలుకుచుండఁ గాంచనాంబరధరుండై ముముక్షువులు ధ్యానంబులు సేయ నధ్యాత్మ విద్యాయుక్తంబయిన యానంద హృదయ గ్రంథిని భేదించు నట్టి శేషుని స్వాయంభువుండగు నారదుండు తుంబురు ప్రభృతులగు ఋషి శ్రేష్ఠులతోఁజేరుకొని కమలాసనుని సభాస్థానంబునందు నిట్లు స్తుతియించుచుండు. | 125 |
| సీ. |
ఓలిమై నెవ్వని లీలా వినోదముల్ జన్మసంరక్షణక్షయములకును హేతువు లగుచుండు, నెవ్వని చూపుల జనియించె సత్త్వరజస్తమంబు, లెవ్వని రూపంబు లేకమై బహువిధంబులను జగత్తులఁబ్రోచుచుండు, నెవ్వని నామంబు లెఱుగఁక తలఁచిన యంతన దురితంబు లడఁగుచుండు |
|
| తే. |
నట్టి సంకర్షణాఖ్యుండు నవ్యయుండు, నైన శేషుని వినుతి సేయంగఁదరమె? తలఁప నెప్పుడు వాఙ్మనంబులకు నింక, మూఁడు లోకంబులందును భూతతతికి. |
126 |
| ఆ. |
మఱియుఁబెక్కు గతుల మాబోఁటి వారలఁ, బ్రోవఁదలఁచి శేషమూర్తి సాత్త్వి క స్వభావ మొందెఁగడఁకతో నట్టి శే, షునకు మ్రొక్కుచుందు ననుదినంబు. |
127 |
| వ. | మఱియు నా శేషుని నెవ్వండేనియు నాకస్మికంబుగ నయినను నార్తుండగుచు నయినను స్మరించిన మాత్రమున నఖిలపాపంబులం బాసి సకల శ్రేయస్సులం బొందు, నట్టి శేషుని నే ముముక్షువు లాశ్రయించి ధ్యానం బొనర్చి భవబంధ నిర్ముక్తు లగుదు, రతని ఫణంబుల యందు భూగోళం బణుమాత్రం బగుచు నుండు; నతని మహామహిమలు గణుతింప సహస్ర జిహ్వలు గల పురుషుండైన నోపండని పలుకుచుందు; రా యనంతుండు పాతాళంబున నుండి సకలలోకహితార్థంబు భూమిని ధరియించునని లోకతిర్యఙ్మనుష్య గతులను లోకస్థితియును శుకయోగీంద్రుండు వినిపించి యింకనేమి వినిపింతు నెఱింగింపు మనినం బరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రున కిట్లనియె. | 128 |
| క. |
మునివర! లోకచరిత్రం, బనుపమము మహావిచిత్ర మగునట్లుగ నా కును వినిపించితి వంతయుఁ, బనుపడి నా చిత్తమందుఁబాయక నిలిచెన్. |
129 |
| వ. | అనిన శుకయోగీంద్రుండిట్లనియె. | 130 |
| ఆ. |
జంతుజాలములకు శ్రద్ధలు త్రిగుణాత్మ, కములు గాన వారి కర్మగతుల తారతమ్యములును దగిలి యిన్నియు వివి, ధంబు లగుచు సంతతంబు నుండు. |
131 |
| వ. | నరేంద్రా! ప్రతిషిద్ధలక్షణంబగు నధర్మం బాచరించు నరుని శ్రద్ధ విపరీతంబుగాఁ బ్రవర్తిల్లు నట్టి వానికిఁ గలిగెడి కర్మఫలంబును విపరీతంబుగానె యుండుం గావున ననాద్యవిద్యాకామ ప్రవర్తనల వలనఁ బెక్కు తెఱంగులఁ గలిగెడి కర్మగతుల సంగ్రహంబుగ నెఱింగించెద ననిన శుకునితోఁ బరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. | 132 |
| ఆ. |
మునివరేణ్య! నరకములు ముజ్జగంబుల, యందొ యంతరాళమందొ వెలినొ యదియుఁగాక దేశమందుండు భూవిశే, షములయందొ తెలుపు సంతసమున. |
133 |
| వ. | అనిన శుకయోగీంద్రుండిట్లనియె. | 134 |