| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | పంచమస్కంధము - ద్వితీయాశ్వాసము |
| వ. | నరేంద్రా! జంబూద్వీపంబు భూపద్మంబునకు మధ్యప్రదేశంబున లక్షయోజనంబుల వెడల్పు నంతియ నిడుపునుం గలిగి కమలపత్త్రంబునుం బోలె వర్తులాకారంబయి నవసహస్రయోజన పరిమితాయామంబు గల నవవర్షంబులు నష్టమర్యాదాగిరులునుం గలిగి విభక్తంబయి యుండు; నందు మధ్యవర్షం బిలావృతవర్షంబగు; నందు మధ్యప్రదేశంబున సువర్ణమయంబయి. | 17 |
| క. |
భూపద్మమునకు మేరువు, దీపించుచుఁగర్ణికాకృతిని బెంపగుచుం బ్రాపై కులగిరిరాజుగఁ, జూపట్టును సురగణాళి చోద్యంబందన్. |
18 |
| సీ. |
మఱియును నా మేరుగిరి లక్షయోజనో న్నత మగుచుండి యా నడిమి దళము విదితమై పదియాఱువేల యోజనములు నంతియ పాఁతునై యతిశయిల్లు; నా మీఁద విస్తార మరయ ముప్పది రెండు వేల యోజనముల వెలసి యుండు; నా గిరి కుత్తరంబందు నీల శ్వేత శృంగపర్వతములు నింగి ముట్టి |
|
| ఆ. |
యుండు; రెండువేల యోజనంబుల దాఁకఁ, బఱపు గలిగి పూర్వపశ్చిమాయ తంబు దక్షిణోత్తరంబును విస్తార, మగుచు మిగుల రమ్యమై నరేంద్ర! |
19 |
| వ. | ఇట్లు పూర్వపశ్చిమంబులు లవణ సాగరాంతంబులై యున్న సీమాపర్వతంబులయందు నీలశ్వేతశృంగవ త్పర్వతంబులు నిడివిని యథాక్రమంబున దశమాంశ న్యూనప్రమాణ యోజనంబులు గలవిగా నుండు; వీని మధ్య ప్రదేశంబున రమ్యక హిరణ్మయ కురువర్షంబు లను నామంబులు గల వర్షంబు లుండు; వాని విస్తారంబులు నవ సహస్ర యోజనంబులు గలిగి లవణ సముద్రాంతంబులై క్రమంబున నీలాది పర్వత దీర్ఘ పరిమాణంబుల నుండు; నిలావృత వర్షంబునకు దక్షిణంబున నిషధ హేమకూట హిమవత్పర్వతంబులును సీమా పర్వతంబులును, బూర్వ పశ్చిమంబులు నిడుపును, దక్షిణోత్తరంబులు విశాలంబును నగుచు, నా నీలాదిపర్వతంబుల తీరున నుండు; నా గిరుల మధ్య ప్రదేశంబున హరివర్ష కింపురుషవర్ష భారతవర్షంబులను నామంబులు గల వర్షంబు లుండు; నా యిలా వృతవర్షంబునకుఁ బశ్చిమంబున మాల్యవత్పర్వతంబును, బూర్వ భాగంబున గంధమాదనంబును సీమా పర్వతంబులు; పూర్వపశ్చిమంబులు నిడుపును, దక్షిణోత్తరంబులు విశాలంబులు నగుచు నీలపర్వత నిషధపర్వతంబులం గదిసి, ద్విసహస్ర యోజనంబుల విస్తారంబై యుండు; మాల్యవత్పర్వతంబు పశ్చిమ సముద్రాంతంబై కేతుమాలవర్షంబును, గంధమాదన పర్వతంబునకుఁ బూర్వ భాగంబున సముద్రాంతం బగుచు భద్రాశ్వవర్షంబును, మేరువునకుం దూర్పున మందరపర్వతంబును, దక్షిణంబున మేరుమందర పర్వతంబులును, బడమటి పార్శ్వంబుల నుత్తరమునం గుముద పర్వతంబులను నామంబులు గలిగి యయుత యోజనోన్నతంబు లయి మేరునగం బను మధ్యోన్నత మేధిస్తంభంబునకుం జతుర్ముఖంబుల హ్రస్వస్తంభంబులను బోలియుండు; నా చతుస్త్సంభంబుల యందును బర్వతశిఖరంబుల వెలుఁగొందు కేతువులునుంబోలెఁ జూత జంబూ కదంబ న్యగ్రోధంబు లను వృక్షరాజంబులు గ్రమంబున నొండొంటికి నేకాదశశతయోజనాయతంబును శతయోజనవిస్తారంబును గలిగియుండు; మఱియు నా పర్వత శిఖరంబులం క్రమంబునం బయో మ ధ్విక్షురస మృష్ట జలంబులు గలిగి శతయోజన విస్తారంబు లయిన సరోవరంబులు దేజరిల్లు; నందు సుస్నాతు లగువారలకు యోగైశ్వర్యంబులు స్వభావంబునం గలుగు; మఱియు నందన చైత్రరథ వైభ్రాజిక సర్వతోభద్రంబు లను నామంబులు గల దేవోద్యానంబు లా పర్వత శిఖరంబుల వెలుఁగొందుచుండు; నందు దేవతాగణంబులు దేవాంగనలం గూడి గంధర్వుల గీతనృత్యంబులు గనుంగొనుచు విహరింతు రంత. | 20 |
| ఉ. |
మందరపర్వతంబు తుది మామిడి పం డ్లమృతోపమానమై మందరశైలశృంగకసమానములై గిరిమీఁద రాల మా కందఫలామృతంబు గలఁగంబడి జాఱి మహాప్రవాహమై యం దరుణోదనామమున నద్భుతమై విలసిల్లు నెంతయున్. |
21 |
| చ. |
కడు మధురంబునన్ సురభిగంధముచే నరుణ ప్రకాశతన్ వడిగొని మందరాచలము వంతల చెంతల జాఱి యంతలోఁ దొడితొడి నాయిలావృతముఁదోఁచుచు వింతగఁబూర్వవాహియై యడరుఁదరంగసంతతుల నందఱి నచ్చటఁజేయు ధన్యులన్. |
22 |
| ఆ. |
ఆ నదీజలంబు లాడిన యచ్చటి, యంబికానుచరుల యంగగంధ మంది పవనుఁడంత మనుజేశ! పదియోజ, నములు సుట్టుఁబరిమళముల నింపు. |
23 |
| ఆ. |
మేరుమందరములమీఁద జంబూఫలం, బులు మహాగజోపములుగ వ్రాలి యవిసి యంతఁదద్రసామృతం బల్లన, య మ్మహానగంబునందుఁబొడమి. |
24 |
| క. |
అనుపమ మగు జంబూనది, యను పేరను వెలసి లీల నరుగుచు నంతన్ ఘనత నిలావృతవర్షము, పనుపడఁదడుపుచును ధరణిఁబ్రవహించుఁదగన్. |
25 |
| ఉ. |
ఆ నదినీటఁదోఁగి పదనై యటు మృత్తనిలార్కసంగతిం బూని కడున్ విపాకమునఁబొందుచు శుద్ధసువర్ణజాతి జాం బూనద నామమొంది సురముఖ్యుల కెల్లను భూషణార్హమై మానుగ వన్నె మించి కడు మంచిదియై విలసిల్లు నెంతయున్. |
26 |
| వ. | మఱియు సుపార్శ్వ నగాగ్రంబునందుఁ బంచవ్యామపరీణాహ బంధురంబులగు నైదు మధుధారా ప్రవాహంబులు పంచముఖంబుల వెడలి సుపార్శ్వనగ శృంగంబులం బడి యిలావృత వర్షంబు పశ్చిమభాగంబుఁ దడుపుచుం బ్రవహించు, నా తేనియ ననుభవించువారల ముఖమారుత సుగంధంబు శతయోజనపర్యంతంబు పరిమళించు. | 27 |
| సీ. |
కుముదపర్వతశిఖాగ్రమున నుత్పన్నమై కనుపట్టు వటతరుస్కంధమునను నుదయించునట్టి పయో దధి ఘృత మధు గుడ విశిష్టాన్నంబు లుడుగ కెపుడు నంబరశయ్యాసనాభరణాదివస్తువులు గోరికలు దీర్చుచును గుముద పర్వతాగ్రంబునఁబడి యిలావృతవర్షమున జనులకు నెల్ల భోగ్యములను |
|
| ఆ. |
వదల కొసఁగు, వారి వళిపలితంబులు, దలఁగు దుష్టగంధములును బాయు మరణభయము ముదిమి పొరయ దెన్నఁడును శీ, తోష్ణబాధ సెందకుండు నధిప! |
28 |
| ఆ. |
దేవదానవులును దివ్యమునీంద్ర గం, ధర్వు లాదిగాఁగఁదగిలి యాశ్ర యించి యుందు రా గిరీంద్ర మూలమునందు, హర్షమంది ఘనవిహారలీల. |
29 |
| వ. | నరేంద్రా! కురంగ కురర కుసుంభ వైకంకత త్రికూట శిశిర పతంగ రుచక నిషధ శితివాస కపిల శంఖాదులయిన పర్వతంబులు మేరుపర్వతకర్ణికకుఁ గేసరంబులయి పరివేష్టించి యుండు, నామేరు నగేంద్రంబునకుఁ బూర్వభాగంబున జఠర దేవకూటంబులును, బశ్చిమంబునం బవనపారియాత్రంబులు నను పర్వతంబులు నాలుగు, నొండొంటికి దక్షిణోత్తరంబుల నష్టాదశ సహస్ర యోజనంబుల నిడుపును బూర్వ పశ్చిమంబుల ద్విసహస్ర యోజనంబుల వెడల్పును నగుచు దక్షిణంబునఁ గైలాస కరవీరంబులును, నుత్తరంబునఁ ద్రిశృంగమకరంబులను నామంబులు గల పర్వతంబులు నాలుగును, బూర్వపశ్చిమంబుల నష్టాదశసహస్ర యోజనంబుల నిడుపును, దక్షిణోత్తరంబుల ద్విసహస్రయోజనంబుల వెడల్పును నగుచు నగ్నిపురుషునకుం బ్రదక్షిణం బగుచున్న పరిస్తరణంబుల చందంబున మేరువునకుం బ్రదక్షిణంబుగా నష్ట నగంబులు నిలిచియుండు, మేరు శిఖరంబున దశసహస్ర యోజనంబుల నిడుపు నంతియ విస్తారంబు నగుచు సువర్ణమయంబయిన బ్రహ్మపురంబు తేజరిల్లుచుండు, నా పట్టణంబునకు నష్టదిక్కుల యందును లోకపాలుర పురంబు లుండు. | 30 |
| క. |
పరమేష్ఠి పట్టణంబున, హరి మున్ను త్రివిక్రమణము లందన్ సర్వే శ్వర చరణాగ్రనఖాహతిఁ, బరువడి నూర్ధ్వాండ మంతఁబగిలె నరేంద్రా! |
31 |
| వ. | ఇట్లు చరణనఖస్పర్శంజేసి భేదింపంబడ్డ యూర్ధ్వకటాహ వివరంబు వలన నంతః ప్రవేశంబు సేయుచున్న బాహ్యజలధార శ్రీహరిపాదస్పర్శం జేయుచుఁ, జనుదెంచి సకలలోకజనంబుల దురితంబులు వాపుచు భగవత్పాది యనుపేరం దేజరిల్లుచు దీర్ఘ కాలంబు స్వర్గంబున విహరించుచు, విష్ణుపదంబున నుత్తానపాద పుత్త్రుండును బరమభాగవతుండునైన ధ్రువుండు తన కులదేవతయైన శ్రీహరి పాదోదకంబుఁ బ్రతిదినంబును భక్తియోగంబున నిమీలితనేత్రుండై యానందబాష్పంబుల రోమాంచితగాత్రుండై యత్యాదరంబున నేఁడును శిరంబున ధరియించుచున్నవాఁ; డతనికి నధోభాగంబున నుండు మండలాధిపతులైన సప్తర్షులును హరిపాదోదక ప్రభావంబు నెఱింగి తాము పొందు తపస్సిద్ధి యాకాశగంగాజలంబుల స్నాతు లగుటయే యని సర్వభూతాంతర్యామి యగు నీశ్వరునియందు భక్తి సలిపి యితరపదార్థాపేక్ష సేయక మోక్షార్థి ముక్తిమార్గంబు బహుమానంబు సేయు తెఱంగున బహుమానయుక్తంబుగాఁ దమ జటాజూటంబులయందు నేఁడును ధరియించుచుండుదురు. | 32 |
| సీ. |
అంత నసంఖ్యంబులైన దివ్యవిమానసంకులంబుల సువిశాలమైన దేవమార్గంబున దిగి వచ్చి చంద్రమండలముఁదోఁచుచు మేరునగశిఖాగ్ర మునను నా బ్రహ్మదేవుని పట్టణమునకు వచ్చి యందులఁజతుర్ద్వారములను వరుసతో దీర్ఘప్రవాహంబు లగుచును బ్రవహించి యమలప్రభావములను |
|
| ఆ. |
నరుగు లవణసాగరాంతంబులుగ నాల్గు, మోములందు నాల్గు నామములను దన్నుఁగన్నవారిఁదన వారిఁదోఁగిన, వారికెల్ల నమృతవారి యగుచు. |
33 |
| వ. | ఇట్లు సీత యను పేర వినుతి నొందిన యమ్మహానదీప్రవాహంబు బ్రహ్మసదన పూర్వ ద్వారంబున వెడలి కేసరావలయంబుం దడుపుచు గంధమాదనాద్రికిం జని భద్రాశ్వవర్షంబుం బావనంబు సేయుచుఁ బూర్వ లవణసాగరంబునం బ్రవేశించుఁ; జక్షు వనుపేరం దేజరిల్లెడు దీర్ఘ ప్రవాహంబు పశ్చిమద్వారంబున వెడలి మాల్యవత్పర్వతంబు నుత్తరించి కేతుమాలవర్షంబుం బవిత్రంబు సేయుచుఁ బశ్చిమ లవణార్ణవంబునం గలియు, భద్ర యను పేర వెలుఁగొందిన యతుల ప్రవాహం బుత్తర ద్వారంబున వెడలి కుముదనీల శ్వేతాఖ్య పర్వత శిఖరంబులం గ్రమంబునం బ్రవహించుచు శృంగనగంబునకుం జని మానసోత్తరంబు లగు నుత్తర కురుభూములఁ బవిత్రంబు సేయుచు నుత్తర లవణ సాగరంబుఁ జేరు, నలకనంద యనం బ్రఖ్యాతిఁ గాంచిన యమ్మహానదీ ప్రవాహంబు బ్రహ్మసదన దక్షిణద్వారంబున వెడలి యత్యంత దుర్గమంబు లైన భూధరంబులఁ గడచి హేమకూట హిమకూట నగంబుల నుత్తరించి యతివేగంబునఁ గర్మక్షేత్రంబగు భారత వర్షంబుఁబావనంబు సేయుచు దక్షిణలవణాంబుధింగలయు నంత. | 34 |
| సీ. |
జగతిలో మేరు వాదిగఁబర్వతములకుఁ బుత్త్రిక లైనట్టి పుణ్యతీర్థ ములు వేల సంఖ్యలు గలవు; జంబూద్వీప మందు భారతవర్ష మరయఁ గర్మ భూమి; తక్కిన వర్షముల దివంబుననుండి భువికి వచ్చినవారు పుణ్యశేష ములు భుజించుచు నుంద్రు; భూస్వర్గ మనఁదగు నా వర్షముల నుండునట్టి వార |
|
| ఆ. |
లయుతసంఖ్య వత్సరాయువు లయుత మా, తంగబలులు దేవతాసమాను లతులవజ్రదేహు లధిక ప్రమోదితు, లప్రమత్తు లార్యు లనఘు లధిప! |
35 |
| వ. | మఱియు సురతసుఖానందంబున మోక్షంబునైనం గైకొనక సకృత్ప్రసూతు లగుచు ననవరతంబును ద్రేతాయుగ కాలంబు గలిగి ప్రవర్తింతు; రీ యష్టవర్షంబులయందు దేవతాగణంబులు దమ భృత్యవర్గంబు లత్యుపచారంబులు సేయుచుండ నెల్ల ఋతువుల యందుం గిసలయ కుసుమ ఫల భరితంబులైన లతాదుల శోభితంబు లగు వనంబులు గల వర్షనిధిగిరి ద్రోణుల యందును, వికచ వివిధ నవకమలామోద ముదిత రాజహంస కలహంసలు గల సరోవరంబుల యందును జలకుక్కుట కారండవ సారస చక్రవాకాది వినోదంబులు గలిగి మత్తాళిఝంకృతి మనోహరంబులై నానా విధంబులైన కొలంకులయందును దేవాంగనల కామోద్రేకజంబు లయిన విలాస హాస లీలావలోకనంబులం దివియంబడిన మనోదృష్టులు గలిగి విచిత్ర వినోదంబులందగిలి యిచ్ఛావిహారంబులు సలుపుచుండుదురు. | 36 |
| క. |
ఈ నవవర్షంబులయం, దా నారాయణుఁడు వచ్చి యనవరతము లో కానుగ్రహమునకై సు, జ్ఞానం బీఁదలఁచి లీలఁజరియించుఁదగన్. |
37 |
| సీ. |
వసుధ నిలావృతవర్షాధిపతియైన పురహరుం డా వర్షమున వనంబు నందు నుండుటకు నా యంబికాశాప వశంబును నా వనస్థలములందు నెవ్వరు వచ్చిన నింతులై యుందు రా వనమందుఁబార్వతి యనుదినంబు నంగనాజనసహస్రార్బుదంబులతోడ నసమలోచనుఁగొల్చు నతులభక్తి |
|
| ఆ. |
నట్టి శివునిఁగోరి యా యిలావృతవర్ష,మునఁ జరించు జనులు మోదమునను గదిసి తత్ప్రకాశకములైన మంత్ర తం, త్రములఁబూజఁజేసి తలఁతు రెపుడు. |
38 |
| క. |
భద్రాశ్వవర్షమందుల, భద్రశ్రవుఁ డనెడి పేరఁబరఁగుచుఁదపనీ యాద్రి సమధైర్యుఁడగుచు స, ముద్రాంతంబైన జగతిఁబొలుపుగ నేలున్. |
39 |
| క. |
ఆ నరవరునకుఁబ్రియతముఁ, డైన హయగ్రీవమూర్తి ననవరతంబున్ ధ్యానస్తోత్రజపాను, ష్ఠానాదులఁబూజసేసి సజ్జను లంతన్. |
40 |
| ఆ. |
తత్ప్రకాశకృ త్ప్రధాన మంత్రార్థ సం, సిద్ధిఁజేసి ముక్తిఁజెంది రప్పు డట్టి వర్షమందు నా హయగ్రీవునిఁ, దలఁచి కొలిచి మిగుల ధన్యు లగుచు. |
41 |
| సీ. |
హరివర్షపతియైన నరహరి ననిశంబు నందున్న జనులు మహాత్ములయిన దైత్యదానవ కులోత్తములు ప్రహ్లాదాది వృద్ధులఁగూడి సంప్రీతితోడ సుస్నాతులై భక్తిఁజూచుచు నుందురు రమ్యదుకూలాంబరములు దాల్చి తత్ప్రకాశకమంత్రతంత్రజపస్తోత్ర పఠన సుధ్యానతపఃప్రధాన |
|
| గీ. |
మైన సత్పూజలను జేసి యచలబుద్ధి, శ్రీ నృసింహునిఁజేరి పూజించి యతని కరుణ నొందుచు నతులప్రకాశు లగుచు, భుక్తిముక్తులఁగైకొండ్రు భూపవర్య! |
42 |
| వ. | మఱియుఁ గేతుమాల వర్షంబునందు భగవంతుండు శ్రీదేవికి సంతోషంబు నొసంగుటకుఁ గామ దేవరూపంబున నుండు; నమ్మహాపురుషుని యస్త్రతేజః ప్రకాశంబునఁ బ్రజాపతి దుహితలగు రాత్ర్యధి దేవతల గర్భంబులు సంవత్సరాంతంబున నిర్జీవంబులై స్రవించు, నా కామదేవుండును దన గతి విలాసలీలావిలోకన సుందర భ్రూమండల సుభగ వదనారవింద కాంతులం జేసి శ్రీరమాదేవిని రమింపంజేయు; భగవన్మాయారూపిణి యగు శ్రీదేవియుఁ బ్రజాపతి పుత్త్రికలును బుత్త్రులునైన రాత్రులం బగళ్లంగూడి కామదేవుని స్తోత్రపఠనపూజాధ్యానాదులంబూజించుచుండు; మఱియును. | 43 |
| క. |
విమలమతిఁజిత్తగింపుము, రమణీయంబైన విమలరమ్యక మను వ ర్షమునకు నధిదేవత దా, నమరంగా మత్స్యరూపుఁడగు హరి దలఁపన్. |
44 |
| ఆ. |
అట్టి వర్షమునకు నధిపతి యగుచున్న, మనువు పుత్త్రపౌత్త్రమంత్రివరులఁ గూడి మత్స్యమైన కుంభినీధరుఁజిత్త, మతుల భక్తియుక్తి హత్తఁగొలుచు. |
45 |
| ఆ. |
తత్ప్రకాశకృత్ప్రధానమంత్రస్తోత్ర, ములను ధర్మకర్మములను హోమ ములను జనులు సేసి పుణ్యులై భుక్తి ము, క్తులను బొందుచుందు రెలమితోడ. |
46 |
| క. |
వినుము; హిరణ్మయ వర్షం, బునకుంగూర్మావతారమును దాల్చిన యా వనజోదరుఁడధిదేవత, యనఘుఁడు పితృపతి మహాత్ముఁడర్యముఁడు నృపా! |
47 |
| క. |
ఆ వర్షమందు నర్యముఁ, డా వర్షజనంబుఁగూడి హరిఁజిత్తములో భావించి సంస్తవంబులు, గావించుచు భుక్తి ముక్తి గాంచుఁ గడంకన్. |
48 |
| క. |
ఉత్తరకురుభూములఁదను, హత్తుకొని వరాహదేవుఁడధిపతియైనన్ సత్తుగ భూసతి యతనిం, జిత్తములో నిలిపి పూజ సేయుచు నుండున్. |
49 |
| క. |
ఆ వర్షమందులను బ్రజ, లా విపులవరాహమూర్తి ననవరతంబున్ సేవించి కొలిచి సంస్తుతిఁ, గావించుచుఁగాంతు రంతఁగైవల్యంబున్. |
50 |
| క. |
అరయఁగ సీతాలక్ష్మణ, పరివృతుఁడై వచ్చి రామభద్రుఁడు గడిమిం బరఁగు నధిదేవతగఁ గిం, పురుష మహావర్షమునకు భూపవరేణ్యా! |
51 |
| ఆ. |
అట్టి రామభద్రు నంజనీసుతుఁడు గిం, పురుషగణముఁగూడి పూజ సేసి తత్ప్రకాశకృత్ప్రధానమంత్ర స్తోత్ర, పఠనములను దగ నుపాస్తి సేయు. |
52 |
| సీ. |
భారతవర్షాధిపతియగు బదరికాశ్రమమున నున్న నారాయణుండు భూనాథ! యా మహాత్ముని నారదాదులు భారతవర్షంబు ప్రజలఁబ్రేమఁ బాయక చేరి యుపాస్తి సేయుచు సాంఖ్య యోగంబు నుపదేశ ముచితవృత్తి నంది యందఱును గృతార్థులై యట్టి నారాయణదేవు నారాధనంబు |
|
| ఆ. |
సేసి యాత్మఁజాలఁజింతించి తత్ప్రకా, శకము లయిన మంత్రసంస్తవములఁ బూజసేసి ముక్తిఁబొందుచు నుండుదు, రచలమైన భక్తి ననుదినంబు. |
53 |
| క. |
భారతవర్షమునందుల, సారాంశములైన పుణ్యశైలంబులు గం భీరప్రవాహములుఁగల, వారయ నెఱిఁగింతు వాని నవనీనాథా! |
54 |
| వ. | మలయపర్వతంబును, మంగళ ప్రస్థంబును, మైనాకంబును, ద్రికూటంబును, ఋషభపర్వతంబును, గూటరంబును, గోల్లంబును, సహ్యపర్వతంబును, వేదగిరియు, ఋష్యమూక పర్వతంబును, శ్రీశైలంబును, వేంకటాద్రియును, మహేంద్రంబును, వారిధరంబును, వింధ్య పర్వతంబును, శుక్తి మత్పర్వతంబును, ఋక్షగిరియును, బారియాత్రంబును, ద్రోణపర్వతంబును, జిత్రకూటంబును గోవర్ధనాద్రియును, రైవతకంబును, గుకుంభంబును, నీలగిరియును, గాకముఖంబును, నింద్రకీలంబును, రామగిరియు నాదిగాఁగల పుణ్యపర్వతంబు లనేకంబులుగల, వా పర్వతపుత్త్రికలైన చంద్రపటయుఁ, దామ్రపర్ణియు, నవటోదయుఁ, గృతమాలయు, వైహాయసియుఁ, గావేరియు, వేణియుఁ, బయస్వినియుఁ, బయోదయు, శర్కరావర్తయుఁ, దుంగభద్రయుఁ, గృష్ణవేణియు, భీమరథియు, గోదావరియు, నిర్వింధ్యయుఁ బయోష్ణయుఁ, దాపియు, రేవానదియు, శిలానదియు, సురసయుఁ, జర్మణ్వతియు, వేదస్మృతియు, ఋషితుల్యయుఁ, ద్రిసమయుఁ గౌశికియు, మందాకినియు, యమునయు, సరస్వతియు, దృషద్వతియు, గోమతియు, సరయువును, భోగవతియు, సుషమయు, శతద్రువును, జంద్రభాగయు, మరుద్వృథయు, వితస్తయు, నసిక్నియు, విశ్వయు నను నీ మహానదులును; నర్మద, సింధువు, శోణయను నదంబులును నైన మహాప్రవాహంబు లీ భారత వర్షంబునం గల; వందు సుస్నాతులైన మానవులు ముక్తిం జెందుదురు; మఱియు నీ భారత వర్షంబున జన్మించిన పురుషులు శుక్ల లోహిత కృష్ణవర్ణ రూపంబులగు త్రివిధ కర్మంబులంజేసి క్రమంబుగ దేవ మనుష్య నరకగతులను త్రివిధ గతులం బొందుదురు; వినుము; రాగద్వేషాది శూన్యుండును నవాఙ్మానసగోచరుండును, ననాధారుండునగు శ్రీవాసుదేవమూర్తి యందుఁ జిత్తంబు నిలిపి భక్తియోగంబున నారాధించెడు మహాత్ము లవిద్యాగ్రంథి దహనంబు గావించుటం జేసి పరమభాగవతోత్తములు పొందెడు నుత్తమగతిం జెందుదురు; కావున భారతవర్షంబు మిగుల నుత్తమం బని మహాపురుషు లిట్లు స్తుతింపుచుండుదురు. | 55 |
| ఉ. |
భారతవర్ష జంతువుల భాగ్యము లేమని చెప్పవచ్చు? నీ భారతవర్షమందు హరి పల్మఱుఁబుట్టుచు జీవకోటికిన్ ధీరతతోడఁదత్త్వ ముపదేశము సేయుచుఁజెల్మి సేయుచు న్నారయ బాంధవాకృతిఁగృతార్థులఁ జేయుచు నుండు నెంతయున్. |
56 |
| క. |
తన జన్మకర్మములనుం, గొనియాడెడి వారికెల్లఁగోరిన వెల్లం దనియఁగ నొసఁగుచు మోక్షం, బనయముఁగృపసేయుఁగృష్ణుఁడవనీనాథా! |
57 |
| వ. | ఇట్లు భారత వర్షంబునందుల జనంబులకు నెద్దియు నసాధ్యంబు లేదు. నారాయణ స్మరణంబు సకల దురితంబుల నడంచుఁ; దన్నామస్మరణ రహితంబులైన యజ్ఞ తపో దానాదులు దురితంబుల నడంపలేవు, బ్రహ్మకల్పాంతంబు బ్రతికెడి యితర స్థానంబునం బునర్జన్మ భయంబున భీతిల్లుచు నుండుటకన్న భారత వర్షంబునందు క్షణమాత్రంబు మనంబున సర్వసంగ పరిత్యాగంబు సేసిన పురుషశ్రేష్ఠునకు శ్రీమన్నారాయణ పదప్రాప్తి యతిసులభంబుగ సంభవించుం; గావున నట్టి యుత్తమంబగు నీ భారత వర్షంబె కోరుచుండుదురు; మఱియు నెక్కడ వైకుంఠుని కథావాసన లేకుండు, నే దేశంబున సత్పురుషులైన పరమభాగవతులు లేకుండుదు, రే భూమిని యజ్ఞేశ్వరుని మహోత్సవంబులు లేక యుండు, నది సురేంద్రలోకంబైన నుండందగదు; జ్ఞానానుష్ఠాన ద్రవ్యకలాపంబుచేత మనుష్యజాతిం బొంది తపంబున ముక్తిం బొందకుండెనేని మృగంబుల మాడ్కి నతండు దనకుం దానె బంధనంబు నొందు; భారతవర్షంబునందుఁ బ్రజలచేత శ్రద్ధాయుక్తంబుగా ననుష్ఠింపంబడిన యజ్ఞములయందు వేల్వంబడు హవిస్సులను బెక్కునామంబులం బుండరీకాక్షుం డంది తనమీఁది భక్తి యధికంబుగాఁ జేయు; నట్టి భారతవర్షంబు నందలి ప్రజలమీఁదం గరుణించి సర్వేశ్వరుం డిహపర సౌఖ్యంబుల నొసంగుచుండు; జంబూద్వీపంబున సగరాత్మజు లశ్వమేధాశ్వంబు నన్వేషింపంబూని భూఖననంబు సేయుటం జేసి స్వర్ణప్రస్థ చంద్రశుక్లావర్తన రమణక మందేహారుణ పాంచజన్య సింహళ లంకాద్వీపంబులను నెనిమిది యుపద్వీపంబులు గలిగె. | 58 |
| సీ. |
లక్షయోజనముల లవణాబ్ధిపరివృత మగుచు జంబూద్వీప మతిశయిల్లు; విను రెండు లక్షలు విస్తృతముగను బ్లక్షద్వీపముండు నా క్షార సాగ రముఁ జుట్టి, యందుల రమ్యమై యొప్పెడు వృక్షంబు ప్లక్షంబు విదితముగను; దనరు నా ద్వీపంబు తరునామ మహిమచే మిగులఁబ్లక్షం బన మించి రహిని; |
|
| ఆ. |
నందు సంచరించు నట్టి వారల కగ్ని, దేవుఁ డమరు నాదిదేవతయుఁగ, నందులోన నా ప్రియవ్రతసుతుఁడగు, నిధ్మజిహ్వుఁడను మహీవరుండు. |
59 |
| వ. | నరేంద్రా! యా యిధ్మజిహ్వుం డా ప్లక్షద్వీపంబు నేడు వర్షంబులుగ విభజించి యందు నా వర్ష నామధారులుగ నుండు తన పుత్త్రులగు శివ యశస్య సుభద్ర శాంత క్షేమాభయామృతు లనియెడు నేడుగుర నేడు వర్షంబుల కధిపతులం గావించి తపంబునకుం జనియె, నా వర్షంబులయందు మణికూట వజ్రకూటేంద్ర సేన జ్యోతిష్మద్ధూమ్రవర్ణ హిరణ్యగ్రీవ మేఘమాలలను నామంబులు గల సప్త కులపర్వతంబులను, నరుణయు సృమణయు నంగిరసయు సావిత్రియు సుప్రభాతయు ఋతంభరయు సత్యంభరయు నన సప్త మహానదులును, నా నదుల యందు సుస్నాతు లగుచు గత పాపులైన హంసపతం గోర్ధ్వాయన సత్యాంగులను నామంబులుగల చాతుర్వర్ణ్యంబును గలిగి యుండు, నందుఁ బురుషులు సహస్ర వత్సర జీవులును దేవతాసములును దృష్టిమాత్రంబునం గ్లమస్వేదాది రహితంబగు నపత్యోత్పాదనంబు గలవార లగుచు వేదత్రయాత్మకుండును, స్వర్గద్వారభూతుండును, భగవత్స్వరూపియు నగు సూర్యుని వేదత్రయమున సేవింపుదురు; ప్లక్షద్వీపం బాదిగా మీఁదటి ద్వీపపంచకంబు నందలి పురుషులకు నాయు రింద్రియ పటుత్వంబులును దేజోబలంబులును దోడనే జనియించుచుండు. | 60 |
| క. |
ప్లక్షద్వీపము, ద్విగుణిత, లక్షేక్షురసాబ్ధి సుట్టిరా విలసిల్లు; న్నిక్షురసోదద్విగుణం, బక్షయముగ శాల్మలీమహాద్వీప మిలన్. |
61 |
| వ. | అందు శాల్మలీ వృక్షంబు ప్లక్షాయామంబై తేజరిల్లు; నా వృక్షరాజంబునకు నధోభాగంబునం బతత్త్రిరాజుగా నుండు గరుత్మంతుండు నిలుకడగా వసించు; నా శాల్మలీ వృక్షంబు పేర నా ద్వీపంబు శాల్మలీ ద్వీపంబన విలసిల్లు; నా ద్వీపపతియైన ప్రియవ్రతాత్మజుండగు యజ్ఞబాహువు తన పుత్రులగు సురోచన సౌమనస్య రమణక దేవబర్హ పారిబర్హాప్యాయ నాభిజ్ఞాతు లనియెడు వారిపేర నేడు వర్షంబుల నేర్పఱచి యా వర్షంబులయం దేడ్వురఁ గుమారుల నభిషిక్తులంజేసె; నా వర్షంబులయందు స్వరస, శతశృంగ, వామదేవ, కుముద, ముకుంద, పుష్పవర్ష, శతశ్రుతులను పర్వత సప్తకంబును ననుమతియు, సినీవాలియు, సరస్వతియుఁ, గుహువును, రజనియు, నందయు, రాకయునను సప్తమహానదులును గల; వందు శ్రుతధర, విద్యాధర, వసుంధ, రేధ్మధర, సంజ్ఞులగు నా వర్ష పురుషులు భగవత్స్వరూపుండును, వేదమయుండు, నాత్మ స్వరూపుండునగు సోముని వేదమంత్రంబులచే నారాధింపుదు; రాద్వీపంబు లక్షచతుష్టయ పరిమిత యోజన విస్తృతం బయిన సురాసముద్రంబుచే నావృతంబై తేజరిల్లు; నందు. | 62 |
| సీ. |
భూనాథ! యా సురాంభోధికిఁజుట్టుగా నుండు కుశద్వీప ముర్విమీఁదఁ; దోరమై తా ద్విచతుర్లక్ష యోజనంబులను విస్తారమై పొలుపు మిగులు; నందుఁ గుశస్తంబ మనిశంబు దేవతా కల్పితం బైనట్టి కాంతిచేత దిక్కులు వెలిఁగించు ద్వీపంబునకుఁ దన పేరను సత్కీర్తి పెంపుసేయు; |
|
| తే. |
నట్టి దీవికి నధిపతి యగు ప్రియవ్ర, త తనయుండు హిరణ్య రేతసుఁ డనం ద నరెడి భూపతి తన సుతనామములను, వర్షములు సేసె నత్యంతహర్షమునను. |
63 |
| వ. | ఇట్లు హిరణ్యరేతసుండు వసుదాన దృఢరుచి నాభి గుప్త సత్యవ్రత విప్ర వామదేవులను నామంబులు గల పుత్త్రుల నామంబుల సప్తవర్షంబులం గావించి యా కుమారుల నందు నిలిపి తాను దపంబునకుం జనియె; నా వర్షంబునందు బభ్రు చతుశ్శృంగ కపిల చిత్రకూట దేవానీకోర్ధ్వరోమ ద్రవిణంబులను నామంబులు గల సప్తగిరులును; రసకుల్యయు, మధుకుల్యయు, శ్రుతవిందయు, మిత్రవిందయు, దేవగర్భయు, ఘృతచ్యుతయు, మంత్రమాలయు నను సప్త మహానదులును గల; వా నదీ జలంబులఁ గృతమజ్జను లగుచు భగవంతుండగు యజ్ఞపురుషునిఁ గుశల కోవిదాభియుక్తకులక సంజ్ఞలు గల వర్షపురుషు లారాధించు చుందురు. | 64 |
| సీ. |
ఆ కుశద్వీపంబు నరికట్టుకొని యుండు నెనిమిది లక్షల ఘనఘృతాబ్ధి; యా ఘృతసాగరంబవ్వల షోడశలక్షయోజనముల లలిత మగుచు నుండుఁగ్రౌంచద్వీప, ముర్వీశ! యందు మధ్యప్రదేశంబున నట్టి దీవి పేరుగాఁదన పేరఁబెద్దగాఁజేసిన క్రౌంచాద్రి గల; దా నగంబు మున్ను |
|
| ఆ. |
షణ్ముఖుండు దివ్యశరమున ఘననితం, బంబు దూయ నేయఁబాలవెల్లి గరిమఁదడుపుచుండు వరుణుండు రక్షింప, నందు మిగుల భయము నొందకుండె. |
65 |
| వ. | నరేంద్రా! యా క్రౌంచద్వీపపతియగు ఘృతపృష్ఠుండు దన కుమారుల నాపేళ్ళు గల యామోద మధువహ మేఘపృష్ఠ సుదామ ఋషిజ్య లోహితార్ణ వనస్పతులను వర్షంబుల కభిషిక్తులం జేసి, పరమకల్యాణగుణ యుక్తుండయిన శ్రీహరి చరణారవిందంబుల సేవించుచుం దపంబునకుం జనియె, నా వర్షంబులయందు శుక్ల వర్ధమాన భోజనోపబర్హణానంద నందన సర్వతోభద్రంబులను సప్త సీమాపర్వతంబులును నభయయు నమృతౌఘయు నార్యకయుఁ దీర్థవతియుఁ, దృప్తిరూపయుఁ బవిత్రవతియు, శుక్లయు నను సప్తనదులును గల, వందుల పవిత్రోదకంబు లనుభవించుచు గురు ఋషభ ద్రవిణక దేవక సంజ్ఞలు గలిగి వరుణ దేవుని నుదకాంజలులం బూజించుచున్న చాతుర్వర్ణ్యంబుండు. | 66 |
| సీ. |
జగతీశ! వినుము క్రౌంచద్వీపమును జుట్టి యుండు షోడశలక్షయోజనముల విస్తారమై పాలవెల్లి, యందునను శాకద్వీప మతులప్రకాశ మొందు, దండిమై ముప్పదిరెండు లక్షల యోజనముల విస్తారమై యమరియుండు, నందుల శాకవృక్షామోద మా ద్వీపమును సుగంధంబునఁబెనఁగఁజేసి |
|
| తే. |
యంతఁదన పేర దీవి ప్రఖ్యాత మగుటఁ, జేసి యందుల మిగులఁబ్రసిద్ధి కెక్కె; నందు మేధాతిథియుఁ గర్త యగుచునుండెఁ, దవిలి వేడుకఁదనదు నందనులఁజూచి. |
67 |
| వ. | మఱియు నా ప్రియవ్రతపుత్త్రుం డయిన మేధాతిథి దన పుత్రుల పేరంగల పురోజన మనోజన వేపమాన ధూమ్రానీక చిత్రరథ బహురూప విశ్వచారములను సంజ్ఞలు గల సప్తవర్షంబులయందు వారలకుఁ బట్టంబు గట్టి శ్రీహరి పాదసేవ సేయుచుఁ దపోవనంబుకుఁ జనియె, నా శాకద్వీపంబునందు నీశానోరుశృంగ బలభద్ర శతకేసర సహస్రస్రోతో దేవపాల మహానస నామంబులు గల సీమాగిరులును, ననఘాయుర్దోభయ సృష్ట్యపరాజిత పంచపరి సహస్రసృతి నిజధృతులను సప్తనదులును గల, వా నదీ జలంబు లుపయోగించి యచ్చటి వారలు ప్రాణాయామంబు సేసి విధ్వస్త రజస్తమోగుణులయి పరమ సమాధిని వాయురూపంబైన భగవంతుని సేవింతురు; ఋతవ్రత సత్యవ్రత దానవ్రత సువ్రత నామంబులుగల చాతుర్వర్ణ్యం బందుఁ గలిగియుండు. | 68 |
| సీ. |
అట్టి శాకద్వీప మరికట్టి తత్ప్రమాణంబున దధిసముద్రంబు వెలుఁగు, నందుకుఁబరివృతంబై పుష్కరద్వీప మిలఁజతుష్షష్టిలక్షల విశాల; మ మ్మహాద్వీపమం దయుతకాంచనపత్త్రములు గల్గి కమలగర్భునకు నాస నంబగు పంకేరుహంబుండు, నా ద్వీపమధ్యంబునను నొక్కమానసోత్త |
|
| ఆ. |
రం బనంగఁబర్వతం బుండుఁ; దనకుఁ బూ, ర్వాపరముల నుండునట్టి వర్ష ములకు రెంటి కిట్లు నిలిచిన మర్యాద, నగ మనంగఁజాలఁబొగడ నెగడు. |
69 |
| వ. | ఇట్లు దనకు లోపలి వెలుపలి వర్షంబులు రెంటికి మర్యాదాచలంబునుంబోలె నున్న మానసోత్తర పర్వతం బయుత యోజన విస్తారంబును, నంతియ యౌన్నత్యంబును గలిగి యుండు, నా నగంబునకు నలుదిక్కులయందు నాలుగు లోకపాలుర పురంబు లుండు, నా మానసోత్తరపర్వతంబు తుద సూర్యరథ చక్రంబు సంవత్సరాత్మకంబయి యహోరాత్రంబులయందు మేరుప్రదక్షిణంబు సేయు, నందు నా పుష్కరద్వీపాధిపతి యగు వీతిహోత్రుండు రమణక ధాతకనామంబులు గల పుత్త్రుల నిరువుర వర్షద్వయంబునందు నభిషిక్తులం జేసి తాను బూర్వజు లేగిన తెఱంగున భగవత్కర్మశీలుం డగుచుఁ దపంబునకుం జనియె; నంత | 70 |
| క. |
మనుజేశ్వర! యా వర్షం, బున నప్పుడు సంచరించు పురుషులు పద్మా సనుఁదగ సకర్మకారా, ధన సేయుదు రచలబుద్ధితాత్పర్యమునన్. |
71 |
| క. |
ధరణీవల్లభ! విను పు, ష్కర మను ద్వీపమున లేరు చాతుర్వర్ణ్యుల్, పరగఁగ భేదము లేకే, సరసత సము లగుదు రందు సకలజనంబుల్. |
72 |
| వ. | మఱియు బుష్కరద్వీపంబు చతుష్షష్టి లక్షయోజన విస్తారంబైన శుద్ధోదక సముద్రముద్రితం బగుచుండు, నవ్వల లోకాలోక పర్వతంబుండు, శుద్ధోదక సముద్ర లోకాలోకపర్వతంబుల నడుమ రెండుకోట్ల యోజన విస్తారంబయిన నిర్జనభూమి దర్పణోదరసమానంబై దేవతావాసయోగ్యంబుగా నుండు, నా భూమిం జేరిన పదార్థంబు మరలఁ బొంద నశక్యంబుగ నుండు; నట మీఁద లోకాలోకపర్వతం బెనిమిది కోట్ల యోజనంబులు సువర్ణభూమియు సూర్యాదిధ్రువాంతంబు లగు జ్యోతిర్గణంబులు మధ్యంబున నుండుటం జేసి లోకాలోక పర్వతం బనందగి యుండుఁ; బంచాశత్కోటియోజన విస్తృతంబగు భూమండల మానంబునకుఁ దురీయాంశ ప్రమాణంబు గల యా లోకాలోకపర్వతంబు మీఁద నఖిల జగద్గురువగు బ్రహ్మచేతఁ జతుర్దిశలయందు ఋషభ పుష్కరచూడ వామ నాపరాజిత సంజ్ఞలు గల దిగ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండు; మఱియును. | 73 |
| సీ. |
తనదు విభూతులై తనరిన యా దేవబృందతేజశ్శౌర్యబృంహణార్థ మై భగవంతుండు నాదిదేవుండును నైన జగద్గురుండచ్యుతుండు సరిలేని ధర్మవిజ్ఞాన వైరాగ్యాదు లయిన విభూతుల నలరి యున్న యట్టి విష్వక్సేనుఁడాదిగాఁగలుగు పార్షదులతోఁగూడి ప్రశస్తమైన |
|
| గీ. |
నిజవరాయుధ దోర్దండనిత్యసత్త్త్వుఁ, డగుచు నా పర్వతంబుపై నఖిలలోక రక్షణార్థంబు కల్పపర్యంత మతఁడు, యోగమాయాపరీతుఁడై యొప్పుచుండు. |
74 |
| వ. | ఇట్లు వివిధమంత్ర గోపనార్థం బా నగాగ్రంబున నున్న భగవంతుండు దక్క లోకాలోక పర్వతంబునకు నవ్వల నొరులకు సంచరింప నశక్యంబయి యుండు; బ్రహ్మాండంబునకు సూర్యుండు మధ్యగతుండై యుండ; నా సూర్యునకు నుభయ పక్షంబుల యందు నిరువదేనుకోట్ల యోజనపరిమాణంబున నండకటాహం బుండు; నట్టి సూర్యుని చేత నాకాశదిక్స్వర్గాపవర్గంబులును నరకంబులును నిర్ణయింపంబడు; దేవతిర్య ఙ్మనుష్య నాగ పక్షి తృణగుల్మలతాది సర్వజీవులకును సూర్యుండాత్మ యగుచు నుండు. | 75 |
| క. |
కరమనురాగంబున నీ, ధరణీమండలముసంవిధానంబెల్లన్ నరవర! యెఱుఁగంజెప్పితి, మఱి చెప్పెద వినుము దివ్యమానమ్మెల్లన్. |
76 |