| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | పంచమస్కంధము - ద్వితీయాశ్వాసము |
| క. |
శ్రీకాంతాహృదయప్రియ!, లోకాలోకప్రచార! లోకేశ్వర! సు శ్లోక! భవభయనివారక!, గోకులమందార! నందగోపకుమారా! |
1 |
| వ. | సకలపురాణార్థజ్ఞానవిఖ్యాతుండయిన సూతుండిట్లనియె. | 2 |
| క. |
మునులార! బాదరాయణి, యనఘాత్మకుఁడైన యుత్తరాత్మజునకు స ద్వినయోక్తి భరతుచరితము, వినిపించుచు మఱియు నిట్లు వినిపించెఁదగన్. |
3 |
| ఆ. |
పార్థివేంద్ర! యట్లు భరతాత్మజుండైన, సుమతి, ధర్మవర్తనమునఁదిరుగ నది యెఱింగి దుష్టులైన పాషండులు, దమమతంబు మిగులఁదలఁచి పొగడి. |
4 |
| క. |
ధరణీవల్లభ! నిన్నును, నిరతంబును బుద్ధదేవునింగొలిచిన యా తెఱఁగునఁగొలిచెద మని భా, సురమతి బోధించి రపుడు సుమతింబ్రీతిన్. |
5 |
| వ. | ఇట్లు పాషండబోధితుండైన సుమతికి ధ్రువసేనయందు దేవతాజిత్తను పుత్త్రుండు జనించె. వానికి దేవద్యుమ్నుండను సత్పుత్రుం డాసురియం దుదయించె; న మ్మహాత్మునకు ధేనుమతియందుఁ బరమేష్ఠి జనియించె; నతనికి సువర్చలయందుఁ బ్రతీహుం డనువాఁడు సుతుండయ్యె; నప్పరమ పురుషుండు సకల జనులకు బ్రహ్మోపదేశంబు సేసి తాను శుద్ధాత్ముండై హరి స్మరణ సేయుచు యజ్ఞకరణ నిపుణులగు ప్రతిహర్త ప్రస్తోత ఉద్గాత యను సత్పుత్రులం గాంచె, నా ప్రతిహర్తకు స్తుతి యందు వ్యోమభూమనామక పుత్త్రద్వయం బుత్పన్నంబయ్యె; నందు భూమునకు ఋషికుల్యయందు నుద్గీథుం డను సుతుండు జనియించె, నతనికి దేవకుల్య యందుఁ బ్రస్తోత గలిగె; నా ప్రస్తోతకు వరరుత్సయందు విభుండను తనయుం డుద్భవించె; నతనికి భారతియందుఁ బృథుషేణుం డుదయించె; నతనికి నాకూతియందు నక్తుండు గలిగె; నా నక్తునకు రాజర్షిశ్రేష్ఠుండగు గయుండను మహాకీర్తిసంపన్నుం డుదయించె. | 6 |
| ఆ. |
అట్టి గయునివలన నఖిలజీవులఁబ్రోవఁ, దలఁచి సాత్త్వికప్రధాన మయిన యట్టి మేను దాల్చి యాత్మతత్త్వ జ్ఞానుఁ, డగుచు నుండె హరి నిజాంశమునను, |
7 |
| వ. | ఇట్టి మహనీయ సుగుణాకరుండగు గయుని గాథానువర్ణనంబు పురావిదులగు మహాత్ములచే నీ తెఱంగున నుతింపఁబడుచున్నది, సావధానమనస్కుండవై యాలకింపు మని యిట్లనియె. | 8 |
| సీ. |
ధర్మమార్గంబున ధారుణీ జనులను బ్రేమతోఁబోషణ ప్రేషణోప లాలన శాసన లక్షణాదులచేతఁబోషించుచును యజ్ఞములను యజ్ఞ పురుషు నీశ్వరుఁజిత్తమున నిల్పి సేవించి స్వాంతమందున్న యీశ్వరునిఁగాంచి యఖిలజీవతతికి నానంద మొసఁగుచు నిరభిమానతమెయి ధరణినేలె |
|
| ఆ. |
సత్యమందు మిగుల సత్సేవయందును, ధర్మమందు యజ్ఞకర్మమందు గయుఁడు వసుధలోనఁ గంజాక్షుఁడే కాని, మానవుండు గాఁడు మానవేంద్ర! |
9 |
| వ. | అట్టి మహాపురుషగుణగణ పరిపూర్ణుండగు గయునికి దక్ష కన్యకలగు శ్రద్ధామైత్రిదయాదులు దమయంతన వచ్చి కోరిక లొసంగ, నతని ప్రజలకు వసుంధర కామధేనువై పిదుక, వేదంబులు సకల కామంబుల నిచ్చుచుండ, సంగరమున భంగంబు నొందిన రాజు లప్పనంబు సేయ, విప్రులు ధర్మం బాఱవపాలు పంచియిడ, నిరంతర సోమపానంబును శ్రద్ధాభక్తి యోగంబులు గలిగి యొనర్చు యజ్ఞంబుల నింద్రాదిదేవతలు తృప్తులై యజ్ఞఫలంబుల నొసంగ, బ్రహ్మాది తృణగుల్మలతా పర్యంతంబు సకల లోకంబుల వారినిం దృప్తిం బొందించుచు, శ్రీహరిం దృప్తిం బొందఁజేయుచు, గయుండు పెక్కుకాలంబు రాజ్యంబు సేసె; నట్టి గయునికి జయంతి యందుఁ జిత్రరథ స్వాత్యవరోధను లను మువ్వురు కొడుకులు పుట్టిరి; నా చిత్రరథునికి నూర్ణయందు సమ్రాట్టును, వానికి నుత్కళయందు మరీచియు, నా మేటికి బిందుమతియందు బిందుమంతుండును, నా బిందుమంతునకు సరఘయందు మధువును, మధువునకు సుమనస యను దాని యందు వీరవ్రతుండును, నా వీరవ్రతునకు భోజయందు మన్యు ప్రమన్యువులను నిరువురును, నందు మన్యువునకు సత్యయందు భువనుండును, నతనికి దోషయందుఁ ద్వష్టయు, నా త్వష్టకు విరోచనయందు విరజుండనువాఁడును జనియించిరంత. | 10 |
| క. |
ఆ విరజున కుదయించిరి, భూవినుత విషూచియందుఁబుత్త్రశతంబు న్నావల నొక కన్యకయు, న్నావేళ సమస్తజనులు హర్షంబందన్. |
11 |
| క. |
ఘనుఁడు ప్రియవ్రతు వంశం, బునకుం దుదయై విరజుఁడు భూవిభువంశం బును దా నలంకరించెను, విను మింద్రావరజుఁడయిన విష్ణునిమాడ్కిన్. |
12 |
| క. |
అని పలికిన శుకయోగిం, గనుఁగొని యభిమన్యుసుతుఁడు గడు మోదముతో వనజదళాక్షుని మహిమలు, విని సంతస మంది యనియె వేడుక మఱియున్. |
13 |
| వ. | మునీంద్రా! సూర్యరశ్మి యెందాఁకం బ్రవర్తిల్లు, నక్షత్ర యుక్తంబులైన చంద్రకిరణంబు లెంతమేరఁ దిరుగు, నంత దూరంబు ప్రియవ్రతుని రథనేమి ఘట్టనలచేత సప్తద్వీపంబులును, సప్తసముద్రంబులు నయ్యెనని పలికితి వా ద్వీపసముద్రంబుల పరిమాణంబులు సవిస్తరంబులుగా నెఱింగింపుము; గుణమయంబును స్థూలరూపంబును నయిన శ్రీహరి శరీరంబగు నీ లోకంబునందు నిలిపిన చిత్తం బగుణంబును, సూక్ష్మంబును, నాత్మ జ్యోతియు బ్రహ్మంబును నైన వాసుదేవుని యందు నిల్చుం గావున, ద్వీపవర్షాదివిస్తారంబు వినిపింపు మనిన శుకయోగీంద్రుం డిట్లనియె. | 14 |
| క. |
ధరణీవల్లభ! విను శ్రీ, హరిమాయాగుణవిభూతు లగు జలనిధులుం బరఁగిన దీవులు వర్షము, లరయంగాఁగొలఁది వెట్ట నలవియె జగతిన్? |
15 |
| ఆ. |
తెలిసినంత వట్టుదెలిపెద సంక్షేప, మునను జిత్తగించి వినుము దెలియ ననుచుఁజెప్పఁదొడఁగె నభిమన్యుసుతునకు, నింపుగాను శుకమునీంద్రుఁడిట్లు. |
16 |