పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము పంచమస్కంధము - ప్రథమాశ్వాసము
భరతుండు రహూగణుని మాటలకుఁ బ్రత్యుత్తరంబు లిచ్చుట
వ. నరేంద్రా! నీవు సెప్పినది సత్యంబు; భారం బీ శరీరంబునకే కాని నాకుం గలుగనేర; దైనను స్థౌల్యకార్శ్యం బులు వ్యాధులు నాధులు క్షుత్తృష్ణలు నిచ్ఛావిరోధభయంబులు జరామరణంబులు రోషనిద్రా జాగరణంబులు నహంకార మమకార మదశోషణాదులును దేహంబు తోడన జనియించుంగాని నాకుం గలుగనేరవు; జీవన్మృతుండ నేన కా దాద్యంతంబులు గలుగుటం జేసి యందఱియందును గలిగియుండు; స్వామిభృత్య సంబంధంబులు విధికృతంబు లగుచు వ్యవహారంబులం జేసి శరీరంబులకుం గలుగుంగాని జీవునికి లేక యుండు; నదియునుం గాక రాజాభిమానంబున నీవు నన్నాజ్ఞాపించెద వేనియుం బ్రమత్తుండవైన నీకుం బూర్వస్వభావం బెట్లుండె నట్లుగాక యే నేమి సేయుదు? నెఱింగింపు; మున్మత్తమూకాంధ జడులుంబోలె సహజ స్వభావంబునుం బొందిన నా యందు నీ శిక్షయేమి లాభంబుఁ బొందింప నేర్చు? నదియునుంగాక స్తబ్ధుండు మత్తుండునైన నాకు నీ శిక్ష వ్యర్థంబగు నని పలికి యుపశమ శీలుండైన మునివరుండు పూర్వకర్మ శేషంబునం గల్గు భారవాహకత్వంబుం దలంగం ద్రోయుటకు భారంబు వహించి శిబిక మోచుచుం జనునెడ నా రాజవల్లభుండు దత్త్వజ్ఞానాపేక్షితుండై చనియెడి వాఁడగుటం దన హృదయ గ్రంథి విమోచకంబులును బహుయోగగ్రంథ సమ్మతంబులును నగు బ్రాహ్మణవాక్యంబులను విని యా శిబిక దిగ్గన డిగ్గ నుఱికి యా విప్రునికి సాష్టాంగదండప్రణామంబు లాచరించి సర్వగర్వవర్జితుండై ముకుళితహస్తుండగుచు నిట్లనియె. 146
సీ. ధరణీసురులలోనఁదలఁప నెవ్వఁడవు నీ వవధూతవేషివై యవని యందు
నేమిటికై చరియింపంగ వచ్చి? తిచ్చటికి నొక్కఁడ వొంటి సనుట నేఁడు
ననుఁగృతార్థునిఁజేయ ననుకూలుఁ డగుచున్న యట్టి యా కపిలమహామునీంద్రుఁ
డవొ? నీ మహత్త్వంబు దవిలి విచారింప నెఱుఁగక చేసితిఁ; గరుణఁజూడు
 
తే. తప్పు సైరింపు; నే యమదండమునకు, హరుని శూలంబునకును వజ్రాయుధమున
కనల చంద్రార్క ధనద శస్త్రాస్త్రములకు వెఱవ విప్రుని కే మది వెఱచినట్లు.
147
వ. మఱియు నిస్సంగుండవయి జడుఁడుంబోలె నిగూఢ విజ్ఞానంబు గలిగి చరియించుచునున్న వాఁడవు; నీ వచనంబులు యోగశాస్త్ర సమానంబులై వాఙ్మానసంబులకు నభేద్యంబులయి యున్నవే; నవ్విష్ణుకళావతీర్ణుండు సాక్షాద్ధరియునగు కపిలమహామునివలన బ్రహ్మవిద్య దెలియంగోరి చనుచున్నవాఁడ; నీవు లోక నిరీక్షణార్థం బవ్యక్తలింగుండవై చరియించుచున్న కపిల మహామునీంద్రుండవు గాఁబోలుదువు; మందుండైన గృహస్థుండు యోగీశ్వర చరిత్రంబు లెట్టు లెఱుంగనేర్చుఁ? గర్మవశంబున దృష్టంబై శ్రాంతి వహించుచు నడుచుచున్న యీ యాశ్రమంబు నాకునుంబోలె నీకు నగునని తోఁచుచున్న; దది యెట్లనిన ఘటంబు లేక జలంబులు దేనేరని తెఱంగున లేనిది గలుగ నేరదు; గావునం బ్రమాణమూలం బయిన లోకవ్యవహారంబు సత్పథంబున సమ్మతంబై యుండుటం జేసి నీ వాడు వాక్యంబులు నాకు సమ్మతంబు గానేర వని సింధు దేశాధీశ్వరుండు వినిపించిన నా విప్రుండు లోక వ్యవహారంబునకు నిత్యత్వం బౌపాధికం బగుఁ గాని నిత్యంబు గా నేరదని దృష్టాంతనిదర్శనంబుగా నిట్లనియె. 148
సీ. పావకశిఖలచే భాండంబు దాఁ దప్త మగుఁ; దప్తఘటముచే నందు నున్న
జలము తపించు; నా జలముచేఁ దండులంబులు తప్తమొంది యప్పుడు విశిష్ట
మైన యన్నం బగు; నా చందమునను దా దేహేంద్రియంబులఁదెలివితోడ
నాశ్రయించుక యున్న యట్టి జీవునకు దేహంబునఁబ్రాణేంద్రియాదికమున
 
ఆ. జరుగుచుండు నిట్లు సంసారఘట శిక్ష, రక్షకుండు నయిన రాజు దుష్ట
కర్మములకుఁబాసి కంజాక్షపదసేవఁ, జేసెనేని భవముఁజెందకుండు.
149
ఆ. అనుచు ధారుణీసురాత్మజుఁ డీ రీతిఁ, బలుకుటయును రాజు పరిణమించి
వినయవాక్యములను వినుతించి క్రమ్మఱఁ, బుణ్యుఁడైన సింధుభూవరుండు.
150
వ. మహాత్మా! నేను రాజు ననియెడి యభిమాన మదాంధుండనై మహాత్ములం దిరస్కరించిన నన్నుం గరుణింపుము; నీ వార్తబంధుండవు; నీ కృపాదృష్టింజేసి మహాత్ముల నవమానంబు సేసిన దురితంబువలన విముక్తుండ నయ్యెద. విశ్వసుహృత్త వైన నీకుం గోపంబు గలుగనేర; దసమర్థు లయిన మాబోఁటి వారలు మహాజనావమానంబున శీఘ్రంబె నశింతురు; గావున నీవు దయాళుండ వయి నన్ను మన్నింపు మనిన నా విప్రుండిట్లనియె. 151
క. కడువేడ్క నీ వవిద్వాం, సుఁడవై యుండియును మిగులఁజోద్యము విద్వాం
సుఁడుఁబోలెను బలికెద వి, ప్పుడు మే లనవచ్చుఁగొంత పురుషులలోనన్‌.
152
ఆ. పరఁగఁబెద్ద లీ ప్రపంచమంతయుఁ దథ్య, మనరు; నీవు తథ్య మనుచుఁబలికి;
తట్లుగాన నిన్ను నధికుండ వని పల్క, రాదు నాకుఁజూడ రాజచంద్ర!
153
సీ. యజ్ఞాదికములందు నామ్నాయములయందుఁ దఱచుగాఁదత్త్వవాదంబు లేదు
స్వప్నంబునందుల సౌఖ్య మాకారంబు నందుల నిత్యమై యంత లేని
యట్టి చందమున వేదాంతవాక్యంబులు తత్త్వంబు నెఱిఁగించి తలఁగుఁగాని
నిత్యంబులై యుండనేరవు; పురుషుని చిత్తంబు గుణములఁజెంది యెంత
 
తే. కాలముండును మఱి యంత కాలమందు, నరయ విజ్ఞానకర్మేంద్రియములచేత
మరగి ధర్మంబులును నధర్మంబులట్లు, దగిలి పుట్టించుచుండు నత్యంతమహిమ.
154
వ. మఱియు ధర్మాధర్మ వాసనాయుక్తంబు, విషయానురక్తంబునైన చిత్తంబు గుణ ప్రవాహంబులచేత వికారంబు నొంది దేవతిర్యఙ్మనుష్యరూపంబు లయిన దేహంబులం బుట్టించుచుఁ గాల ప్రాప్తంబులైన సుఖదుఃఖ తదుభయ ఫలంబుల ననుభవించుచు ననవరతంబు జీవునికిం బ్రత్యక్షం బగుచు స్థూల సూక్ష్మరూపంబుల నుండు; స్వాంతంబు గుణరహితంబైన ముక్తి కారణంబగు; ఘృతవర్తులు గల దీపంబు సధూమశిఖలం బుట్టించు; ఘృతవర్తులు నాశంబు నొందిన స్వరూపంబుఁ బొందు; నీ తెఱంగున మనంబు గుణకర్మానుబంధంబైన జన్మాదులం బుట్టించు, గుణకర్మంబులం బాసెనేనిం బరతత్త్వంబు నొందు; జ్ఞానేంద్రియంబు లేనును విషయంబుల మీఁదఁ దోఁచు బుద్ధు లేనును నభిమానంబు నను నేకాదశవృత్తులం గూడిన మనంబు జీవుని నసంఖ్యంబు లయిన జన్మంబులం బొందించు; మనోవృత్తుల నతిక్రమించిన జీవుండు పరంజ్యోతియైన నారాయణ స్వరూపంబుగా నెఱుంగుము; స్థావర జంగమంబు లయిన జీవులకుం బవనుండు ప్రాణంబై యున్న చందంబున నీశ్వరుండు సర్వభూతాంతర్యామి యగుచు జీవాత్మ స్వరూపంబున నుండు; జీవాత్ముండు జ్ఞానోదయంబునం జేసి మాయ నెంత కాలంబు గెలువకుండు నంతకాలంబు ముక్తసంగుండు గాఁ; డరిషడ్వర్గంబును జయించి పరతత్త్వంబు నెఱింగిన నీశ్వరుం డగుఁ; జిత్తం బెంతకాలంబు విషయాసక్తం బగు నంతదడవు సంసారచక్రంబునందు సంచరించుం గావున మహావీరుం డయినను దనకు శత్రువైన మనంబు నప్రమత్తుండయి యుపేక్షా బుద్ధింజేసి యిచ్ఛా విహారంబున జరగనీక పరమగురుండైన శ్రీహరి చరణోపాసనాస్త్రంబునం జిత్తంబు గెలిచినం బరతత్త్వంబు నొందునని విప్రుండు వలికిన నతని మహిమకు వెఱఁగంది బ్రాహ్మణునకు నమస్కారంబు సేయుచు భూవరుండిట్లనియె. 155
ఉ. కారణవిగ్రహంబు నురుకాయము నీ యవధూతవేషమున్‌
భూరిధరామరత్వమును బూర్వసమాగమ మాత్మభావముం
జారువిహార మత్యతుల శాంతి గుణంబును గూఢవర్తనం
బారయఁగల్గు నీకు ననయంబును మ్రొక్కెదఁబెక్కుభంగులన్‌.
156
మ. జ్వరితార్తుండగు రోగి కౌషధ మతీష్టంబైన చందంబునన్‌
ధరలో నాతపతప్తదేహి గడుశీతంబైన తోయంబునున్‌
గరిమంగోరినరీతి నెంతయు నహంకారాహిదష్టుండనై
పరఁగున్‌ నాకును నీ వచో0000మృతము దప్పన్‌ మందు వేఱున్నదే?
157
ఆ. విప్రవర్య! నేను వేడ్కతో నా సంశ, యంబులెల్ల నిన్ను నడిగి తెలియఁ
దలఁచి యున్నవాఁడఁ; దప్పక యెఱిఁగింపు, ముచితవృత్తిఁదత్త్వయోగమెల్ల.
158
వ. అని యడిగిన యా రాజునకు విప్రుండిట్లనియె. 159
తే. కానవచ్చిన ఫలములు కర్మమూల, ము లగుటను జేసి సంసారములను జిత్త
మెపుడు వర్తించుచుండఁగా నెఱుఁగలేవు, తత్త్వయోగంబు మిగుల నిత్యంబటంచు.
160
వ. మఱియు నీ వసుంధర నున్న చరణంబులకు నెక్కుడు జంఘలు నా మీఁద జానువులా పొడవున నూరువు లందులకు నుపరిప్రదేశంబున మధ్యం బట మీఁద నుర మందులకు నెక్కువ కంఠం బఁట మీఁద స్కంధం బందుల దారు వా దారువున శిబిక శిబిక యందు రాజు ననియెడి యభిమానంబు గలిగి నీ వున్న వాఁడ విట్టి శోచ్యులై కష్టదశం బొందిన జనుల దయలేక నిగ్రహించి నీవు ప్రజాపాలనంబు సేయుచున్నవాఁడ; నను గర్వంబున మా వంటి మహాత్ముల సభలలోనం బూజ్యుండవుగాక యున్నవాఁడ; వీ స్థావరజంగమంబులకు నివాసస్థానంబు వసుంధరయైన చందంబున సత్క్రియలచేత నెఱుంగం దగిన జగత్కారణంబైన తత్త్వంబు నెఱింగించెదఁ; బరమాణు సముదయం బీ ధరిత్రియైన చందంబున నవిద్యామనంబులచేతం గల్పితంబయిన కృశస్థూల బృహ దణుసద సజ్జీవాజీవ ద్రవ్య స్వభావాశయ కాలనామబుద్ధి రూపంబైన మాయచే జగత్తు రెండవదియై కల్పింపంబడియె; బాహ్యాభ్యంతరంబులం గలిగి స్వప్రకాశంబై భగవచ్ఛబ్ద వాచ్యంబును విశుద్ధంబును బరమార్థంబును జ్ఞానరూపంబునునైన బ్రహ్మం బొకటియే సత్యంబు; జగత్తసత్యం బగు నని పలికి మఱియును. 161
సీ. ధరలోన బ్రహ్మంబుఁదపమున దానంబు లను గృహధర్మంబులను జలాగ్ని
సోమసూర్యులచేత శ్రుతులచే నైనను బరమభాగవతుల పాదసేవఁ
బొందినమాడ్కిని బొందంగరాదని పలుకుదు రార్యులుఁబరమమునులు
ఘనతపోబాహ్యసౌఖ్యములకు విముఖులునై పుణ్యులు హరిగుణానువాద
 
తే. మోదితాత్ములు నగు బుధపాదసేవ, ననుదినంబును జేసిననంతమీఁద
మోక్షమార్గంబునకును బద్మాక్షునందుఁ, బట్టువడి యుండు నెప్పుడుఁబరఁగ బుద్ధి.
162
వ. నరేంద్రా! యేను పూర్వంబున భరతుండను రాజను; సర్వసంగపరిత్యాగంబు సేసి భగవదారాధనంబు సేయుచు మృగంబుతోడి స్నేహంబు కతన మృగంబనై పుట్టియు నందును హరిభక్తి దప్పకుండిన కతంబున నిప్పుడు మనుష్యుండనై మనుష్య సంసర్గంబును బాసి యేకాకినై చరియించుచున్నవాఁడ; నరుండు వృద్ధసంసేవం జేసి సంసారమోహంబును బాసి హరిధ్యాన కథలచే లబ్ధజ్ఞానుండై పుండరీకాక్షునిం బూజించుచుం బరలోకంబునుంబొందునని పలికి విప్రుండు మఱియు నిట్లనియె. 163
సీ. ధరణీశ! మాయచేతను దాఁటఁగా రాని పథమునఁ బెట్టంగఁ బడ్డ జీవుఁ
డెలమిమై గుణకర్మములఁ జేయుచును లాభ మాశించి తిరుగు బేహారి మాడ్కి
ఫల మపేక్షించుచుఁ బాయక జీవుండు సంసారగహన సంచారి యగుచు
ననవరతము నుండు నా మహావనమందుఁ గామలోభాది తస్కరులు గూడి
 
తే. ధరణి విజితేంద్రియుఁడు గాని నరునిఁబట్టి, ధర్మ మనియెడి యా మహాధనము నెల్ల
నరసి కొనిపోవుచుండుదు రనుదినంబుఁ, గాన సంసారమందు నాకాంక్ష వలదు.
164
క. అరయఁగ సంసారాటవిఁ, దరలక యీ పుత్త్రమిత్త్రదారాదు లనం
బరఁగుచు నుండెడు వృకములు, పరువడి నరబస్తములను భక్షించువడిన్‌.
165
తరల. మలసి సంసృతిఘోరకాననమందిరమ్ముల నెల్లచోఁ
జెలఁగి గుల్మలతాతృణాదులచేత గహ్వరమైన ని
శ్చలనికుంజములందు దుర్జనసంజ్ఞలం గల మక్షికం
బుల నిరోధము దన్ను సోఁకినఁబొందుచుందురు దుర్దశన్‌.
166
ఆ. మఱియు నీ గృహస్థమార్గంబునందెల్ల, విషయములను బొంది విశ్వమెల్లఁ
గడఁకతోడ నిట్లు గంధర్వనగరంబుఁ, గాఁదలంచి మిగుల మోదమందు.
167
ఆ. మరగి కాననమునఁగొఱవిదయ్యముఁగాంచి, యగ్నిఁగోరి వెంట నరుగు మాడ్కిఁ
గాంచనంబు గోరి కలవారి యిండ్ల పం, చలను దిరుగు నరుఁడు చలనమంది.
168
ఆ. బహుకుటుంబి యగుచు బహుధనాపేక్షచే, నెండమావులఁగని యేఁగు మృగము
కరణిఁబ్రేమఁజేసి పరువులు వాఱుచు, నొక్కచోట నిలువకుండు నెపుడు.
169
ఆ. మఱియు నొక్క చోట మత్తుఁడై పవన ర, జో హతాక్షుఁడగుచుఁజూపు దప్పి
దిక్కెఱుంగ కొండుదిశ కేగు పురుషుని, కరణిఁదిరుగు నరుఁడు నరవరేణ్య!
170
వ. మఱియు నొక్కచోట నులూక ఝిల్లీస్వనంబులతోడ సమానంబు లయిన శత్రురాజి తిరస్కారంబులకు దుఃఖపడుచు, నొక్క చోట క్షుధార్దితుండై యపుణ్య ఫలవృక్షంబుల నాశించు మాడ్కిఁ బాపకర్ములు ద్రవ్యహీనులు నగు వారి నాశ్రయించుచు, నొక్క యెడం బిపాసాతురుండై జలహీనంబయిన నదికిఁ జనినరీతి నిహపరదూరులైన పాషండుల సేవించుచు, మఱియు నొక్క ప్రదేశంబునం దగ్నిచేతం దప్తుండయిన వాఁడు దావాగ్నిం జేరి వ్యథ నొందురీతి నన్నార్థి యగుచు దాయాదులం జేరి దుఃఖించుచు, మఱియు నొక్కచోట పరబాధం జేసి మున్ను గానక రాజ్యాభిలాషం బ్రాణసఖులైన పితృపుత్త్రభ్రాతృ జ్యేష్ఠుల నైనను వధియించుచు, మఱియు శూరులచేతం గొట్టువడి సర్వధనంబును బోనాడి చింతాపరవశుండై దుఃఖించుచు నున్నంత గంధర్వనగర ప్రాయంబైన సంసార సుఖంబు ననుభవించి మోదించుచు, మఱియు నగారోహణంబు సేయు నరుండు కంటక పాషాణాదుల వలనం బాధాపీడితుం డగుచు దుఃఖించు చందంబున గృహాశ్రమోచిత మహానుష్ఠానంబునకు నుపక్రమించి వ్యసన కంటక శర్కరాపీడితుండై దుఃఖించుచు, నొక్కచోటన్‌ జఠరాగ్ని పీడితుండై కుటుంబంబు మీఁద నాగ్రహించుచు వనంబున నజగర గృహీతుండై నిగీర్ణుండైన చందంబున రాత్రి గృహాటవియందు నిద్రాపరవశుండై యెఱుంగక వర్తించుచు మఱియును వనంబునఁ దృణచ్ఛన్న కూపపతితుం డగుచు సర్పదష్టుండైన తెఱంగున సంసారియై దుర్జనుల చేత వ్యథిత హృదయుం డగుచు నంధుండై యజ్ఞానాంధ కూపంబునం బడుచు, నొక్కయెడ జుంటి తేనియకునై మక్షికాబాధ నత్యంత దుఃఖితుండయిన మాడ్కిని సంసారకాముండై పరదార ద్రవ్యాభిలాషి యగుచు భూపాలకుల చేతనైనను గృహపతిచేతనైనం దాడితుండయి నరకంబునం బడుచు, యౌవనంబున సంపాదించిన ద్రవ్యంబులు పరులచేతం బోనాడిన విధంబున శీతవాతాద్యనేక ప్రయాసలబ్ధంబైన ధనంబు వోనాడి సంసారి యతిచింతా క్రాంతుండై యుండు; మఱియును వనంబున లుబ్ధకులు సంసృష్టంబయిన యల్పామిషంబునకు నన్యోన్య వైషమ్యంబునం గలహించిన విధంబున సంసృష్టవ్యవహారియై యల్పద్రవ్యంబులకుం బోరాడుచుండు నని భూపాలునకు విప్రుండు సంసారాటవి తెఱంగెఱింగించి వెండియు నిట్లనియె. 171
ఆ. అల్పధనుఁడు విశ్రమాస్థానములఁ దృప్తిఁ, బొంద కొరుల ధనముఁబొందఁగోరి
యరిగి వారివలన నవమానములఁబొంది, యధికమైన దుఃఖ మనుభవించు.
172
ఆ. అంతఁగొందఱల్ల నన్యోన్యవిత్తాది, వినిమయమునఁగడుఁబ్రవృద్ధమైన
వైరములను బొంది పోరాట నొందుదు, రాత్మచింత లేక యనుదినంబు.
173
సీ. సంసారమార్గసంచారుఁడై యధికప్రయాసంబునన గూర్చు నర్థములను
విహరించుచును గొంద ఱిహలోక ఫలములఁగోరుచు మోక్షంబుఁగోర కంతఁ
జెడిపోవుచుందు; రెప్పుడు గాని యందుకుఁ గడపటి యోగంబుఁగానలేరు;
మానవంతులు నసమానశౌర్యులు నగు వారు మిక్కిలియైన వైరబుద్ధి
 
తే. నాహవంబున మడియుదు; రంతెకాని, మోక్షమార్గంబు గానరు మూఢవృత్తి
ననుచు సంసారగహనవిహారమెల్లఁ, దెలిపి క్రమ్మఱ ననియె ధాత్రీసురుండు.
174
వ. మఱియుం గాలచక్రనియంత్రితుండై చక్రాయుధునిం గొల్వక కాక గృధ్ర బకసమానులైన పాషండులతోడి సఖ్యంబునం జేసి వారలచేత వంచితుండై బ్రాహ్మణకులంబునం జేసి శ్రౌతస్మార్త కర్మానుష్ఠానపరుండై విషయసుఖంబులందుఁ దగులువడి కాలంబుతుద నెఱుంగక వృక్షంబులుంబోలె నైహికార్థంబుల యందుఁ దృష్ణ గలిగి మైథున నిమిత్తంబు సుతదారాదుల యందు స్నేహంబు సేయుచుఁ బథికుండు మాతంగంబులయందు భయంబున దీర్ఘనిమ్న కూపంబునం బడిన తెఱంగున సంసారమృత్యుగజ భయంబున గిరికందర ప్రాయంబయిన యజ్ఞాన తమంబునం బడుం గావున మాయచేత సంసార మార్గంబైన రాజభావంబు విడిచి సర్వభూతమైత్రి గలిగి జితేంద్రియుండవై జ్ఞానాసిచే మార్గంబు కడపల గనుమని పలికిన భూపాలుం డిట్లనియె. 175
క. అక్కట! మానుషజన్మము, పెక్కువయై యుండు నెపు డభేదమతిం బెం
పెక్కిన యోగిసమాగమ, మక్కజముగఁగలిగెనేని యఖిలాత్ములకున్‌.
176
క. ధరణీసురవర! నీ శ్రీ, చరణాంబుజయుగళరేణుసంస్పర్శము నా
దురితంబు లడఁచె; నింతట, హరిభక్తియు నంతకంత కధికంబయ్యెన్‌.
177
వ. మఱియు విప్రవరులయందు యోగేశ్వరు లవధూత వేషంబునం జరియింపు చుందురు; గావున విప్రులు పిన్నలు పెద్దలనక యందఱకు నమస్కారం బని స్తుతియించిన నా యోగీశ్వరుండును సింధుపతికిఁ గరుణాన్వితుం డగుచుఁ దత్త్వజ్ఞానం బుపదేశించి యా రాజుచేత వందితచరణుండై పూర్ణార్ణవంబునుం బోలె సంపూర్ణకరుణారసపూరితస్వాంతుండై వసుంధరం జరియించు చుండె; సింధుభూపతియును సుజనసమాగమంబున లబ్ధతత్త్వజ్ఞానుండయి దేహాత్మ భ్రమం బాసె నని పలికిన శుకయోగీంద్రునకుం బరీక్షిన్నరేంద్రుండిట్లనియె. 178
చ. అరయఁగ మక్షికంబు వినతాత్మజుఁగూడఁగలేని రీతి యీ
భరతుని సచ్చరిత్రములు ప్రస్తుతి సేయఁగ నీ వసుంధరన్‌
నరపతు లెల్ల నోపరు మనంబున నైనను నెంచ, నింక నా
భరతుని పుణ్యవర్తనముఁ బ్రస్తుతి సేయఁగ నాకు శక్యమే?
179
వ. నరేంద్రా! భరతుండు సుతదారరాజ్యాదులను బూర్వకాలంబునంద విడిచి భగవత్పరుండగుచు యజ్ఞరూపంబును ధర్మస్వరూపంబును సాంఖ్యయోగంబును బ్రకృతి పురుష స్వరూపంబునైన నారాయణునకు నమస్కారం బనుచు మృగరూపంబునుంబాసె, నట్టి భరతుని చరిత్రం బెవ్వరు సెప్పిన, నెవ్వరు వినిన, నట్టివారలఁ బుండరీకాక్షుండు రక్షించు, నాయు రభివృద్ధియు; ధనధాన్య సమృద్ధియు నగుచుండ స్వర్గోపభోగంబులంబొందుదు రని. 180
మ. నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్య! దివ్యాంబరా
భరణాలంకృత! భక్తవత్సల! కృపాపారీణ! వైకుంఠ మం
దిర! బృందావనభాసుర! ప్రియధరిత్రీనాథ! గోవింద! శ్రీ
కర! పుణ్యాకర! వాసుదేవ! త్రిజగత్కల్యాణ! గోపాలకా!
181
క. పరమపదవాస! దుష్కృత, హర!కరుణాకర! మహాత్మ! హతదితిసుత! భా
సురగోపికామనోహర!, సరసిజదళనేత్ర! భక్తజననుతగాత్రా!
182
మాలిని. సరసహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
భరితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా!
183
గద్య. ఇది సకల కవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్య ప్రణీతంబైన శ్రీమహాభాగవత పురాణంబు నందుఁ బ్రియవ్రతుని సుజ్ఞానదీక్షయు, బ్రహ్మదర్శనంబును, నాగ్నీధ్రాదుల జన్మంబును, నుత్తమతామస రైవతుల జన్మంబును, బ్రియవ్రతుండు వనంబునకుం జనుటయు, నాగ్నీధ్రుం డప్సరసం బరిగ్రహించుటయు, వర్షాధిపతుల జన్మంబును, నాగ్నీధ్రుండు వనంబునకుం జనుటయును, నాభిప్రముఖుల రాజ్యంబును, నాభియజ్ఞంబును, ఋషభుని జన్మంబును, ఋషభుని రాజ్యాభిషేకంబును, భరతుని జన్మంబును, ఋషభుండు తపంబునకుంజనుచు సుతులకు నతులజ్ఞానం బుపదేశించుటయు, భరతుని పట్టాభిషేకంబును, భరతుండు వనంబునకుఁ జనుటయు, భరతుండు హరిణపోతంబునందలి ప్రీతింజేసి హరిణగర్భంబున జనియించుటయు, మఱల విప్రసుతుండై జనియించుటయు, విప్రుండు చండికా గృహంబున బ్రదికి వచ్చుటయు, సింధుపతి విప్రసంవాదంబును నను కథలు గల పంచమ స్కంధంబునందుఁ బ్రథమాశ్వాసము. 184
శ్రీకృష్ణార్పణమస్తు
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - paMchama skaMdhamu - prathamASvAsamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )