పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము పంచమస్కంధము - ప్రథమాశ్వాసము
వృషల రాజభృత్యులు కాళిబలికి భరతునిఁ గొంపోవుట
క. పురిలోన వృషలపతి దా, నరుదుగ సంతానకాముఁడై వేడుకతోఁ
పురుషుఁడగు పశువుఁగాళికిఁ, దఱుముక కొనిపోవఁబశువు దలఁగిన భృత్యుల్‌.
130
ఆ. అరసి కానలేక యా రాత్రి వీరాస, నమునఁ జేనికాఁపు విమలబుద్ధి
నున్న విప్రయోగి నొయ్యనఁబొడగాంచి, పశువు మంచి దనుచుఁబట్టి రతని.
131
క. ఆ రీతిని భూసురవరు, నారయ నా కాళికాగృహమునకు భృత్యుల్‌
బోరనఁ గొని చని సల్పిరి, చారుతరాభ్యంజనాది సంస్కారంబుల్‌.
132
వ. ఇట్లభ్యంజనాది కృత్యంబులు దీర్చి నూతన వసనంబు గట్టనిచ్చి గంధ పుష్పాభరణాక్షతాలంకృతునిం జేసి మృష్టాన్నంబులు భుజియింపంబెట్టి ధూపదీప మాల్యలాజకిసలయాంకుర ఫలోపహారాదులు సమర్పించి పంచ మహావాద్య ఘోషంబులతోడ నా పురుషపశువుం గాళికాదేవి సమ్ముఖంబున నాసీనుం గావించి యా వృషలపతి పురుషపశువు రక్తంబున భద్రకాళి సంతోషపెట్టం దలంచి కాళికామంత్రాభిమంత్రితంబు నతికరాళంబు నైన ఖడ్గంబంది నిజాభీష్టసిద్ధికి హింసింపందలంచిన. 133
సీ. సర్వభూతములకు సఖుఁడును బ్రహ్మభూతాత్ముఁడు నిర్వైరుఁడయిన బ్రహ్మ
సుతుని తేజంబంతఁజూడ దుస్సహమైన భయమంది వడఁకుచు భద్రకాళి
క్రోధంబు ముమ్మడి గొనఁగ హుంకారంబు సలుపుచు నట్టహాసంబు సేసి
పాపాత్ములును దౌష్ట్యపరులును రాజసతామసకర్మసంధాను లగుచు
 
తే. విప్రవరు నట్లు హింసించు వృషలపతిని, భృత్యవర్గంబుతోఁదలల్‌ పృథ్విఁగూల్చి
యపుడు వృషలాధిపుని శిరమంది లీలఁ, బాడి యాడుచు నందంద క్రీడ సలిపె.
134
క. ధరలోన నెవ్వరేనియు, ధరణీసురవరుల కెగ్గు దగఁ దలఁచిన వా
రరయఁగఁ జెడుదురు, నిక్కము, హరి ధరణీసురవరేణ్యులం దుండుటచేన్‌.
135
వ. మఱియును. 136
ఉ. అచ్చట విప్రసూనుఁడు భయం బొకయించుక లేక చంపఁగా
వచ్చిన వారియందుఁ గరవాలమునందును గాళియందుఁ దా
నచ్చుతుభావ ముంచి హృదయంబునఁ బద్మదళాక్షు నెంతయున్‌
మచ్చికతోడ నిల్పి యనుమానము నొందక యుండె నత్తఱిన్‌.
137
వ. మఱియు నా విప్రవరుండు చండికాగృహంబు వెలువడి క్రమ్మఱం జని కావలి యుండు నెడ. 138
సీ. అంతటఁగొన్ని హాయనములు సన సింధుభూపాలనము సేయు భూవరుండు
ధీరత నిక్షుమతీతీరమున నున్న కపిలమహామునిఁగాంచి తత్త్వ
విజ్ఞాన మెఱిఁగెడు వేడ్క తోడుత శిబికారోహణము సేసి యరుగుచుండ
నాలోన నా శిబికావహు లా చేనఁ గాఁపున్న విప్రునిఁగాంచి తెచ్చి
 
తే. శిబిక మోపింత మీతని చేత ననుచుఁ, బట్టి మూఁపునఁబల్లకిఁబెట్టి మోవు
మనుచు మోపించునంత ధరామరుండు, శిబిక మూఁపున నిడి యందుఁజింత లేక.
139
క. తన మనసు కొలఁది నప్పుడు, మునుకొని య ట్లప్రయత్నమున నడవఁగ నా
జనపతి నిమ్నోన్నతమై, చనుట యెఱిఁగి శిబిక మోయు జనులకు ననియెన్‌.
140
ఆ. మీర లిప్పు డిచటఁ జేరి మిక్కిలి ప్రయ, త్నంబుతోడఁదగిలి నడుచుచుండ
విషమ మగుచు గమనవేగంబు నను బాధఁ, బెట్టుచున్న దనిన బెస్త లనిరి.
141
వ. దేవా! యీ విషమగమనంబు మావలన నైనది గా; దీ తురీయవాహకుండు సుఖగమనంబుగా నడువ నేరండు; వీనితోడ మేమును నడువనేర మనిన రహూగణుండను నా రా జుపాసితవృద్ధజనుండైనను బలాత్కారంబునం బుట్టిన కోపంబునం గోపించి విమర్శ దప్పి నీఱు గప్పిన నిప్పునుం బోలె నెఱుంగ రాని బ్రహ్మతేజంబు గల బ్రాహ్మణునికిం గంటకంబుగా నిష్ఠురవాక్యంబుల నిట్లనియె. 142
చ. అలసితి, వెంతయున్‌ ముసలి, వాఁకట డస్సితి, వెన్ను మిక్కిలిం
బలుచన యున్న దీ శిబిక భారము; దూరము మోసి తేగతిన్‌
నిలిచెద? వంచు భూవరుఁడు నిష్ఠురముల్‌ దగఁబల్క నా యెడం
బలుకక మోసె నా శిబిక బ్రాహ్మణవర్యుఁడు పార్థివేశ్వరా!
143
వ. అప్పు డావిప్రవరుండు దనకుం గడపటిదియగు కళేబరంబునందు నహంకార మమకారంబులం బొరయక మిథ్యాజ్ఞానరహితుండై బ్రహ్మభూతుండై మౌనవ్రతంబున నా శిబిక మోయుచున్న విషమగమనంబుఁజూచి యతికుపితుండగుచు నా భూవరుండు వెండియు నిట్లనియె. 144
సీ. ఓరి దుర్మద! విన రోరి జీవన్మృత! నా యాజ్ఞఁదప్పించి నడిచె దీవు,
ఈ వక్రమార్గంబు లిన్నియు విడిపించి నడపింతు నిన్ను సన్మార్గమందు
నని రాజగర్వాంధుఁ డగుచు గుణత్రయంబున వృద్ధిఁబొందిన భూవరుం డ
బద్ధ ప్రలాపముల్‌ పల్కు చుండినఁజూచి శమదమాదులచేఁబ్రశస్తుఁ డగుచు
 
తే. జగతి బ్రహ్మస్వరూపమై సకల భూత, ములకు నత్యంతహితుఁడైన భూసురుండు
యోగివర్తన దెలియ లేకున్న రాజు, నంత వీక్షించి యల్ల ని ట్లనుచుఁబలికె.
145
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - paMchama skaMdhamu - prathamASvAsamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )