| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | పంచమస్కంధము - ప్రథమాశ్వాసము |
| మ. |
భరతుండంత ధరాతలంబుఁగడఁకంబాలించుచున్ ధారుణీ శ్వరచంద్రుండగు విశ్వరూపునకు మున్ సంజాతయై యుండి ని ర్భరకాంతిన్ విలసిల్లు పంచజని పేరంగల్గు కాంతామణిం గర మర్థిన్ ధరఁబెండ్లియాడె శుభలగ్నంబందు భూవల్లభా! |
92 |
| వ. | ఇట్లు వివాహితుండై యా పంచజని వలన నహంకారంబునం బంచతన్మాత్రలు జనించిన తెఱంగున సుమతి రాష్ట్ర భృత్సుదర్శనాచరణ ధూమ్రకేతువులను నేవురు పుత్రులం బుట్టించె; నటమున్న యజనాభంబను పేరం బరఁగు వర్షంబు భరతుండు పాలించుకతంబున భారతవర్షంబు నాఁబరఁగె నంత. | 93 |
| క. |
భరతుఁడు నిజపిత లేలిన, కరణినిఁ గర్మముల నెల్లఁగైకొని ప్రజలన్ హరికృప నొందుచు నేలెను, ధరణీసురవరులు వొగడ ధరణీనాథా! |
94 |
| సీ. |
భగవంతుఁడగు జగద్భరితు నల్పంబులు నధికంబులైనపెక్కధ్వరముల దర్శపూర్ణిమలచేఁదగను జాతుర్మాస్యముల నగ్నిహోత్రమువలనఁగడఁకఁ బశుసోమములచేతఁబలుమాఱుఁ బూజించి వేదోక్తమైన యా విమలకర్మ ములఁగల్గు ధర్మంబుఁ బురుషోత్తమార్పణంబుగఁ జేయుచును మఖంబులను మంత్ర |
|
| తే. |
ములను బలికెడు నా దైవములను శ్రీశు, నవయవంబులు గాఁగ భూధవుఁడు ప్రేమ ననుదినంబును బాయక ఘనత దలఁచి యఖిలరాజ్యానుసంధానుఁడగుచు నుండె. |
95 |
| క. |
ఈ రీతిఁగర్మసిద్ధుల, నారయ నత్యంతశుద్ధమగు చిత్తముతో నారాచపట్టి భరతుఁడు, ధారుణిఁబాలించె నధికధర్మాన్వితుఁడై. |
96 |
| వ. | మఱియు నా భరతుండు శ్రీవత్స కౌస్తుభ వనమాలాలంకృతుండును, సుదర్శనాద్యాయుధోపలక్షి తుండును, నిజభక్తజన హృదయారవింద నివాసుండును, బరమ పురుషుండును నైన వాసుదేవుని యందు నధికభక్తి ననుదినంబును జేయుచుఁ నేఁబది లక్షల వేలేండ్లు రాజ్యంబు సేసి పితృ పితామహాద్యాయాతంబగు నా ధనంబును యథార్హంబుగఁ బుత్త్రులకుఁ బంచియిచ్చి బహువిధ సంపదలు గల గృహంబును బాసి పులహాశ్రమంబున కరిగె; నంత. | 97 |
| సీ. |
ఏ యాశ్రమంబున నిందిరాధీశ్వరుఁ డచ్చటివారల నాదరించి ప్రత్యక్షమున నుండుఁబాయక యెప్పుడు నట్టి రమ్యంబైన యాశ్రమమున నిలిచి సాలగ్రామములు గల గండకీ నది యెందు నెంతయుఁగదిసి యుండు నచ్చోట నేకాకి యగుచును భరతుండు బహువిధనవపుష్పపల్లవముల |
|
| తే. |
నతుల తులసీ దళంబుల నంబువులను, గందమూలాదిఫలములఁగంజములను ఘనత నర్పించు నిచ్చలుఁదనివి లేక, సేవ సేయుచునుండె నా శ్రీశు హరిని. |
98 |
| వ. | దానం జేసి విగత విషయాభిలాషుండై శమదమాది గుణంబులు గలిగి యథేచ్ఛం జేసి యెడతెగక పరమపురుషుని పరిచర్యాభక్తి భరంబున శిథిలీకృత హృదయగ్రంథిం గలిగి సంతోషాతిశయంబునం బులకితాంగుండు, నానంద బాష్పనిరుద్ధావలోక నయనుండు నగుచు నిజస్వామియైన హరిచరణారవిందానుధ్యాన పరిచిత భక్తి యోగంబునం బరమానంద గంభీర హృదయంబను నమృత హ్రదంబున నిమగ్నుం డగుచుఁ దా నపుడు పూజించు పూజ నెఱుంగక యిట్లు భగవద్వ్రతంబు ధరియించి యేణాజిన వాసస్త్రిషవణ స్నానంబుల నార్ద్రకుటిల కపిశవర్ణ జటాకలాపంబులు గలిగి మార్తాండాంతర్గతుం డయిన పరమేశ్వరుని హిరణ్మయపురుషునిగాఁదలంచుచు నిట్లనియె. | 99 |
| సీ. |
కర్మఫలంబులఁగడఁక నిచ్చుచు మనోవ్యాపారమున నిట్టి యఖిలలోక ములఁజేసి యా లోకములకు నంతర్యామి యగుచుఁబ్రవేశించి యంతమీఁద నానందరూప మైనట్టి బ్రహ్మముఁగోరు చున్న జీవునిఁదనలోని యోగ శక్తిచేఁదగ ననిశంబుఁబాలన సేయు చుండి యంతటను మార్తాండమధ్య |
|
| ఆ. |
వర్తి యగుచు నిట్లు వఱలుచు జగముల, యందు నుండి ప్రకృతిఁబొంద కంత నతులదివ్యమూర్తియైన యానంద రూ, పమును శరణ మొందె భరతవిభుఁడు. |
100 |
| వ. | అంత నాభరతుం డొక్కనాఁ డా మహానదిం గృతాభిషేకుండయి ముహూర్త త్రయం బంతర్జలంబు లందుఁ బ్రణవోచ్చారణంబు సేయుచుండు సమయంబున నిర్భరగర్భిణియగు నొక్క హరిణి జలార్థినియై యొంటి జలాశయ సమీపంబునకు వచ్చి, జలపానంబు సేయునెడ నా సమీపంబున మృగపతి గర్జించి లోకభయంకరంబుగ నాదంబు సేయ నా హరిణి స్వభావంబున భీత యగుటం జేసి బెగ్గడిలి హరివిలోకనవ్యాకుల చిత్తయై దిగ్గన నదరి గగనంబునకు నెగిరి, యపగత తృష యగుచు నది నుల్లంఘించు నెడ నధిక భయంబునం జేసి యా గర్భంబు యోనిద్వారంబున గళితంబై జలంబులం బడియె; నా హరిణి యుల్లంఘనాది భయంబునం జేసి తత్తీరంబున నుండు గిరిదరింబడి శరీరంబుఁ బాసె; నంత నా హరిణపోతంబు జలంబులం దేలుచున్న భరతుండు గనువిచ్చి చూచి కరుణార్ద్రచిత్తుండై మృతజనని యగు నా హరిణపోతంబును దన యాశ్రమంబునకుం గొంపోయి మిక్కిలి ప్రీతిం జేసి యుపలాలనంబు సేయుచుండఁ బోషణ పాలన ప్రీణన లాలనానుధ్యానంబుల భరతునకు నాత్మనియమంబు లైన అష్టాంగయోగంబులును బరమ పురుష పూజా పరిచర్యాదులు నొక్కొక్కటిగఁ గ్రమక్రమంబునం గొన్ని దినంబులకు సమస్తంబును నుత్సన్నం బయ్యె; నంత. | 101 |
| క. |
ఘనతపము చలన మొందుట, యును భరతుండెఱుఁగ కాత్మయోగంబునఁ జ య్యనఁబాసె హరిణపోతముఁ, దన మదిలో నిల్పి ప్రీతిఁదప్పక పలికెన్. |
102 |
| ఉ. |
అక్కట! తల్లిఁబాసి హరిణార్భక మాప్తులు లేమిఁజేసి యే దిక్కును లేకయున్న నిటఁదెచ్చితి, నాయెడ నీ మృగార్భకం బెక్కుడు ప్రేమఁజేసి చరియించుచు నున్నది నాదు సన్నిధిన్; మక్కువ చేసి దీనిఁగడు మన్ననలం దగఁబ్రోతు నెంతయున్. |
103 |
| క. |
శరణని వచ్చిన జంతువుఁ, గరుణంగను విచ్చి చూచి కాచినఁబుణ్యం బరయఁగ నధికం బని మున్, కర మెఱిఁగించెను మునీంద్రగణములు ప్రేమన్. |
104 |
| వ. | అని యిట్లు హరిణపోతంబుం దన యాశ్రమంబున నత్యాసక్తిం జేసి యాసన శయనాటనస్నాన సమిత్కుశ కుసుమ ఫల పలాశ మూలోదకాహరణ దేవపూజాజపాదుల యెడం దన యొద్దన యునిచి కొనుచు, వృక సాలా వృకాది క్రూరమృగంబుల వలని భయంబున వనంబుల వెనువెంటం దిరుగుచు నధిక ప్రణయభర పరీతహృదయుం డగుచు నతి స్నేహంబునం జేసి కొంతసేపు స్కంధంబుల వహించుచు, మఱి కొంతతడ వురంబున నుత్సంగంబున నుంచికొని లాలించుచు సంతసంబు నొందు; మఱియు నా భరతుండు నిత్య నైమిత్తికాది క్రియాకలాపంబు నిర్వర్తించునెడ నంత నంత లేచి హరిణకుణకంబుం జూచుచుఁ గించిత్స్వస్థహృదయుండై దాని నాశీఃపరంపరల నభినందించుచుఁ జుంబనాదులం బ్రీతి సేయుచు నతిమోహంబునం బెంచుచుండునెడ. | 105 |
| చ. |
గురువులు వాఱి బిట్టుఱికి కొమ్ములఁజిమ్ముచు నంత నంత డ గ్గఱుచును గాలు ద్రవ్వుచు నఖంబుల గీఱుచు గాసి సేయుచున్ నొఱగుచు ధారుణీశ్వరుని యూరువులన్ శయనించి యంతలో నఱకడ యెక్కుచుంబొదలి యాడుచు నా హరిణంబు లీలతోన్. |
106 |
| తే. |
గరిమ నీ రీతి మెల్లన కెరలు వొడిచి, చెలఁగి యాడంగ భరతుండు చిత్తమందు సంతసిల్లుచునుండె నాశ్రమముఁ బాసి, హరిణడింభక మంతలో సురిఁగి చనిన. |
107 |
| వ. | భరతుండంతం దన్మృగశాబకంబు గానంబడమికి వ్యాకులచిత్తుం డగుచు నష్టధనుండునుం బోలె నతిదీనుండై కరుణతోడంగూడి తద్విరహవిహ్వల మతియై దానిన తలంచుచు నతిశోకంబుతో మనంబున దుఃఖించి యిట్లనియె. | 108 |
| తే. |
హరిణపోతంబ! నీకు వనాంతమందుఁ, గ్రూరమృగబాధ లేకుండఁ గోరుచుండఁ, దలఁగి పోయితె యనుచుఁ జిత్తంబునందు, రాజవృషభుఁడు భరతుఁ డారాట మొంది. |
109 |
| తే. |
తల్లి చచ్చిన హరిణపోతంబు వచ్చి, పుణ్య హీనుండనగు నన్నుఁబొంది పాసె, నేమి సేయుదు? నే నింక నెట్లు గందుఁ?, జేరి యే రీతిఁగాంచి రక్షించుకొందు? |
110 |
| క. |
కట్టా! యీ యాశ్రమమునఁ, బుట్టిన తృణచయము మేసి పొదలిన హరిణం బిట్టట్టుఁదిరుగుచుండఁగఁ, బట్టి మృగేంద్రుండు గొట్టి బాధించె నొకో! |
111 |
| వ. | ఇట్లు భరతుండు హరిణకుణక క్షేమంబు గోరుచు నెప్పుడు వచ్చి నన్ను సంతోషపఱచు? నానా ప్రకారంబులైన తన గతులచేత నన్ను నెప్పుడానందంబు నొందించు? ధ్యానసమాధి నున్నప్పుడు నన్నుఁ గొమ్ముల గోకుచు నుండు; నట్టి వినోదంబు లెప్పుడు గనుఁగొందు? దేవ పూజా ద్రవ్యంబులు ద్రొక్కి మూర్కొనినం గోపించి చూచినం గుమారుండునుంబోలె దూరంబునకుం జని నిలిచి మరల నేఁ బిలిచిన వెనుక నిలిచియుండు; నిట్టి మెలఁకువ స్వభావంబు గలుగుట యెట్టు? లీ భూదేవి యెంత తపంబు చేసినదియో? ఏ హరిణ పాదస్పర్శంబులం బవిత్రమైన భూమి స్వర్గాపవర్గకాములైన మునులకు యజ్ఞార్హయగు నట్టి హరిణ పోతంబు నెట్లు గనుఁగొందు? నదియునుంగాక భగవంతుండగు చంద్రుండు మృగపతిభయంబున మృత జననియు, స్వాశ్రమపరిభ్రష్టంబునైన మృగశాబకంబును గొనిపోయి పెంచుచున్నవాఁడో! మున్ను పుత్ర వియోగతాపంబును జంద్రకిరణబులం బాపుదు; నిపుడు హరిణపోతంబు దన శరీర స్పర్శంజేసి చంద్రకిరణంబులకన్న నధికం బగుచుం బుత్ర వియోగతాపంబు నివర్తింపఁజేసె ననుచుం బెక్కు భంగుల హరిణ నిమిత్తంబులైన మనోరథంబుల చేతం బూర్వకర్మవశంబున యోగభ్రష్టుండగు భరతుండు భగవదారాధనంబు వలన విభ్రంశితుం డగుచు నితరజాతింబుట్టిన హరిణపోతంబు మీఁది మోహంబగ్గలంబగుచుండ నుండెనని పలికి శుకయోగీంద్రుండు మఱియు నిట్లనియె. | 112 |
| సీ. |
జననాథ! మున్ను మోక్షవిరోధ మని పాయఁగా రాని పుత్రాదికంబునెల్లఁ బాసి తపస్వియై భరతుండు హరిణశాబకపోషణంబునఁబాలనమున నతిలాలనప్రీణనానుషంగంబుల మూషకబిల మతిరోషమునను సర్పంబు సొచ్చిన చందంబునను యోగవిఘ్నంబు మిక్కిలి విస్తరిల్లెఁ |
|
| ఆ. |
గాన నెంతవానికైనను గాలంబు, గడవ రామి నట్లు గాక పోదు పరమమునుల కైనఁబాయవు కర్మంబు, లొరు లనంగ నెంత? నరవరేణ్య! |
113 |
| వ. | ఇట్లు భరతుండు మృగవియోగ తాపంబు నొందుచుండు నెడ నా మృగశాబకంబు సనుదెంచిన సంతసిల్లుచుండె; నంత నొక్కనాఁడు. | 114 |
| మ. |
భరతుండల్లన నంత్యకాలము వెసం బ్రాపింపఁగా నప్పు డా హరిణంబుంగడుభక్తిఁబుత్రుగతి నత్యాసక్తి వీక్షింప నా హరిణంబుందన యాత్మలో నిలిపి దేహంబంతటంబాసి తా హరిణీగర్భమునన్ జనించి హరిణంబై యొప్పెఁబూర్వస్మృతిన్. |
115 |
| వ. | ఇట్లు భరతుండు హరిణీగర్భంబునం బుట్టియు భగవదారాధన సామర్థ్యంబునం దన మృగత్వకారణంబుఁదెలిసి కడుందాపంబు నొందుచు నిట్లనియె. | 116 |
| ఉ. |
రాజులు ప్రస్తుతింప సురరాజసమానుఁడనై తనూజులన్ రాజులఁజేసి తాపసులు రాజఋషీంద్రుఁడటంచుఁబల్కఁగాఁ దేజము నొంది యా హరిణ దేహమునందలి ప్రీతిఁజేసి నా యోజ సెడంగ నేఁజెడితి యోగిజనంబులలోన బేలనై. |
117 |
| వ. | ఇట్లు శ్రీహరి శ్రవణ మనన సంకీర్తనారాధనానుస్మరణాభియోగంబులం జేసి యశూన్య సకలయామంబగు కాలంబు గల నాకు హరిణపోతస్మరణంబు కతంబున యోగవిఘ్నంబు ప్రాప్తంబయ్యె; మోక్షదూరుండనైతి నని నిగూఢ నిర్వేదుం డగుచుఁ దల్లిం బాసి క్రమ్మఱ నుపశమశీల మునిగణ సేవితంబయి భగవత్‌క్షేత్రంబైన సాలతరునిబిడ తమ గ్రామసమీపపులస్త్య పులహాశ్రమంబునకుం గాలాంజన పర్వతంబు వలనఁ జనుదెంచి యందు మృగదేహత్యాగావసానంబు గోరుచు సంగంబు విడిచి యేకాకి యగుచు శుష్క పర్ణ తృణవీరు దాహారుండై మృగత్వనిమిత్తం బగు నా నదీతీర్థంబు నందుఁదత్తీర్థోదక క్లిన్నంబగుచు నుండు శరీరంబు విడిచె నని శుక యోగీంద్రుండు పరీక్షిన్నరేంద్రునకు వినిపించి మఱియు నిట్లనియె. | 118 |
| సీ. |
హరిణదేహముఁబాసి యంత నాంగిరసాహ్వయుండు శుద్ధుఁడుఁ బవిత్రుండు ఘనుఁడు శమదమఘనతపస్స్వాధ్యాయనిరతుండు గుణగరిష్ఠుఁడు నీతికోవిదుండు నైన బ్రాహ్మణునకు నాత్మజుండై పుట్టి సంగంబువలనను జకితుఁడగుచుఁ గర్మబంధంబుల ఖండింపఁజాలు నీశ్వరుని నచ్యుతు నజు శ్రవణమనన |
|
| తే. |
ములను హరిచరణధ్యానములను విఘ్న, భయమునను జేసి మనమందుఁబాయనీక నిలిపి సంస్తుతి సేయుచు నిలిచియుండె, భరితయశుఁడైన భరతుండు పార్థివేంద్ర! |
119 |
| వ. | ఇట్లాంగిరసుండు ప్రథమభార్యయందుఁ బుత్రనవకంబును, గనిష్ఠ భార్యయందు స్త్రీపురుషుల నిద్దఱను గలుగం జేసిన నందుఁ బురుషుండు పరమ భాగవతుండును రాజర్షి ప్రవరుండును నుత్సృష్ట మృగశరీరుండును జరమశరీరంబునం బ్రాప్తవిప్రశరీరుండును నగు భరతుండయ్యె; నతం డా జన్మంబున నన్యజన సంగంబు జన్మపరంపరలకుఁ గారణం బని యత్యంత భయంబు నొంది కర్మబంధ విధ్వంసన శ్రవణస్మరణాదుల శ్రీహరి యనుగ్రహంబునం బూర్వజన్మపరంపరల సంస్మరించుచుఁ దన స్వరూపంబు నున్మత్తజడాంధబధిర రూపంబుల లోకులకుం జూపుచుండె, నంత. | 120 |
| మ. |
జనకుండాంగిరసుండు నాత్మజుని వాత్సల్యంబునంబెంచుచుం దనరం జౌలముఖాగ్ర్యకర్మములచేతన్ సంస్కృతుంజేసి పా యని మోహంబున నిచ్చలుంగడఁక శౌచాచారముల్ సెప్పినన్ ఘనుఁ డా భాగవతుండసమ్మతిని దత్కర్మంబులంగైకొనెన్. |
121 |
| వ. | ఇట్లు బ్రాహ్మణకుమారుండు గర్మంబులయందు నిచ్చలేక యుండియును బితృనియోగ నిర్బంధంబునం బితృసన్నిధి యందె యసమీచీనంబుగా వ్యాహృతి ప్రణవ శిరస్సహితం బగునట్లు గాయత్రీ మంత్రోపదేశంబు నొంది చైత్రాది చతుర్మాసంబుల సమవేతంబుగ వేదంబుల నధ్యయనంబు సేయుచుండె; జనకుండాత్మజుని శిష్టాచారంబుచే శిక్షింపవలయు నను లోకాచారంబు ననువర్తించి యాత్మభూతుండగు నాత్మజునందు నభినివేశిత చిత్తుం డగుచు శౌచాచమనాధ్యయన వ్రత నియమగుర్వనల శుశ్రూషణాదికంబుల ననభియుక్తంబు లయినంబుత్త్రునిచే నొనరింపించుచు నప్రాప్తమనోరథుండయ్యె; నంత. | 122 |
| క. |
ఈ రీతిని గొడుకున కా, చారంబులు గఱపి చింత సద్గృహమున సం సారి యగుచుండి విప్రుఁడు, బోరన దేహంబుఁబాసి పోయినమీఁదన్. |
123 |
| ఆ. |
తల్లి తండ్రితోడఁదా నగ్నిఁజొచ్చిన, నతని మహిమ లెఱుఁగ కంతలోన సవతితల్లి కొడుకు లవినీతు లగుచును, శాస్త్రవిద్య లతనిఁజదువనీక. |
124 |
| వ. | ఇట్లు బ్రాహ్మణకుమారుని సవతితల్లి కొడుకులు వేద విద్యల వలనం బాపి గృహకర్మంబుల నతని నియమించిన. | 125 |
| క. |
ధరణీసురోత్తముఁడు దా, నరుదుగఁదమవారు సెప్పినవి యెల్లను నే మఱ కందుఁబ్రీతిసేయక, నిరతము గృహకర్మ మట్లు నెఱపుచు నుండెన్. |
126 |
| వ. | ఇట్లు గృహకర్మ ప్రవర్తనుం డగుచు నుండ మూఢులగు ద్విపాత్పశువులచే నున్మత్త! జడ! బధిర! యని యాహూయమానుం డగునపుడు తదనురూపంబులగు సంభాషణంబుల నొనర్చుచుఁ బరేచ్ఛా యదృచ్ఛలం జేసి విష్టి వేతన యాచ్ఞాదులవలన నియుక్తకర్మంబులంబ్రవర్తించుచు. | 127 |
| తే. |
అతుల మృష్టాన్నమైనఁ గదన్నమైన, నెద్ది వెట్టిన జిహ్వకు హితముగానె తలఁచి భక్షించుఁగా; కొండు దలఁచి మిగులఁ, బ్రీతి సేయఁడు రుచులందుఁబెంపుతోడ. |
128 |
| వ. | మఱియు నా విప్రుం డాత్మనిత్యానంద సుఖలాభంబు గలిగి సుఖదుఃఖంబులందు దేహాభిమానంబు సేయక శీతోష్ణ వాత వర్షాతపంబులకు నోడి పై చీరగప్పక వృషభంబునుం బోలెఁ బీనుండును గఠినాంగుండును నగుచు స్థండిలశాయియై రజఃపటలంబునం గప్పంబడిన దివ్యమాణిక్యంబునుం బోలె ననభివ్యక్త బ్రహ్మవర్చసుండై మలినాంబర పరీతకటితటుండు నతి మషీలిప్త యజ్ఞోపవీతుండు నగుటం జేసి యజ్ఞజనంబు లతండు బ్రాహ్మణాభాసుండు మందుండునని పలుక సంచరించుచుండం గర్మమూలంబునం బరులవలన నాహారంబు గొనునపుడు దమవారును వ్యవసాయకర్మంబునందు నియమించిన క్షేత్ర విహిత సమ విషమ న్యూనాధికంబుల నెఱుంగక ప్రవర్తిల్లుచు నూఁక తవుడు తెలికపిండి పొట్టు మాఁడు ద్రబ్బెడ యాదిగాఁ గల ద్రవ్యంబుల యందు నమృతంబు పగిది రుచిసేసి భక్షించుచుం జేని కావలి యుండునెడ నొక్కనాఁడు. | 129 |