| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | పంచమస్కంధము - ప్రథమాశ్వాసము |
| సీ. |
ఆ ఋషభుండు రాజ్యంబు సేయుచునుండి యంతట నొక్కనాఁడాత్మయందుఁ దలపోసి భూలోకఫల మపేక్షింపక మోహంబు దిగనాడి పుత్త్రులకును దన రాజ్యమెల్ల నప్పన చేసి వెనువెంటఁగొడుకులు మంత్రులుఁగొలిచి రాఁగ నల్లన యరిగి బ్రహ్మావర్తదేశంబు నందుల నపుడు మహాత్ములయిన |
|
| తే. |
యట్టి మునిజనసమ్ముఖంబందుఁ జేరి, తనదు పుత్రుల నందఱ దాయఁబిలిచి పరమపుణ్యుండు ఋషభుండు ప్రణయ మొప్ప హర్షమందుచు నప్పు డిట్లనుచుఁబలికె. |
66 |
| ఆ. |
తనయులార! వినుఁడు ధరలోనఁ బుట్టిన, పురుషులకును శునకములకు లేని కష్టములను దెచ్చుఁగానఁగామంబుల, వలన బుద్ధి సేయవలదు మీరు. |
67 |
| చ. |
నరులకు నే తపంబున ననంతసుఖంబులు గల్గుచుండు, శ్రీ కరమతి నా తపంబుఁదగఁగైకొని చేసిన బ్రహ్మసౌఖ్యముం దిరముగఁ గల్గు, వృద్ధులను దీనులఁ బ్రోవుఁడు; దుష్టవర్తనన్ జరుగుచునుండు కాముకుల సంగతిఁబోకుఁడు; మీఁద మేలగున్. |
68 |
| వ. | మఱియు నంగనాసక్తులగు కాముకుల సంగంబు నిరయరూపం బయిన సంసారంబగు; మహత్సంగంబు మోక్షద్వారం బగు; నట్టి మహాత్ము లెవ్వరనిన శత్రు మిత్రవివేకంబు లేక సమచిత్తులును శాంతులును గ్రోధరహితులును సకలభూత దయాపరులును సాధువులును నగు వారలు మహాత్ము లనం దగుదు; రట్టి మహాత్ములు నా యందలి స్నేహంబె ప్రయోజనంబుగాఁ గలిగి యుండుటం జేసి విషయవార్తా ప్రవృత్తులగు కుజనులందుఁ దమ దేహగృహమిత్ర దారాత్మజాదులందుఁ బ్రీతిలేక యుండుదురు; విషయాసక్తుఁ డయినవాఁడు వ్యర్థ కర్మంబులం జేయు; నట్టి దుష్కృత కర్మంబులం జేయువాఁ డెప్పుడును బాపకర్ముం డగుచుం గ్లేశదంబగు దేహంబు నొందుచుండుఁ; గావునఁ బాపమూలంబు లయిన కామంబులు గోరకుఁ; డీ జ్ఞానం బెంతకాలంబుఁ లేకయుండు నంతకాలంబు నాత్మతత్త్వం బెఱుంగంబడ; దా తత్త్వం బెఱుంగ కుండుటం జేసి దేహికి దుఃఖం బధికంబై యుండు; లింగదేహం బెంత తడవుండు నంత తడవును మనంబు కర్మ వశంబై జ్ఞానవంతంబుగాక యవిద్యం బాయకుండు, శరీరంబు గర్మమూలం బగుటవలనఁ గర్మంబులు సేయఁజనదు; వాసుదేవుం డగు నాయందుఁ బ్రీతి యెంతతడవు లేక యుండు నంతతడవును దేహ ధర్మంబులు బాధించు, విద్వాంసుడైనను దేహేంద్రియాదులయందుఁ బ్రీతిసేసిన మిథునీభావసుఖ ప్రధానంబగు గృహస్థాశ్రమంబు నంగీకరించి స్వరూప స్మృతిశూన్యుండై మూఢుం డగుచు, నందు సంసార తాపంబులఁ బొందు; పురుషుండు స్త్రీతోడం గూడి యేకీభావంబు నొందుట తనకు హృదయ గ్రంథియై యుండు; నందు జనునకు గృహ క్షేత్ర సుతాప్త విత్తంబులందు ‘నేను నాయది’ యనియెడి మోహంబు గలుగు; నట్టి స్త్రీ పురుష మిథునీ భావంబుచే సంతానంబు గలుగు; నా సంతాన కారణంబున గృహ క్షేత్ర విత్తాదులు సంపాదింపఁబడు; నందు మోహం బధికం బగుటంజేసి మోక్షమార్గంబు దవ్వగు; నిట్లు సంసారంబునం దుండియు మనంబున నెప్పుడు ముక్తిచింతం జేయు నప్పుడు సంసారంబును బాయు; పరమ గురుండనైన నా యందుల భక్తి సేయుటయు విగతతృష్ణయు, ద్వంద్వ తితిక్షయు, సర్వలోకంబులందుల జంతు వ్యసనావగతియు, నీశ్వరవిషయక జ్ఞానాపేక్షయుఁ, దపంబును, విగతేచ్ఛయు, మత్కృతకర్మంబులు, మత్కథలు వినుటయు, నన్నె దైవంబుగా నెఱుంగుటయు, నస్మద్గుణ కీర్తనంబులును, నిర్వైరత్వ సామ్యోపశమంబులును, దేహ గేహంబులందు నాత్మ బుద్ధి జిహాసయు, నధ్యాత్మ యోగంబును, నేకాంత సేవయుఁ, బ్రాణేంద్రియాత్మల గెలుచుటయుఁ, గర్తవ్యాపరిత్యాగంబును, సచ్ఛ్రద్ధయు, బ్రహ్మచర్యంబును, గర్తవ్యకృత్యంబులందుల నప్రమత్తుం డగుటయు, వాఙ్నియమనంబును, సర్వంబు నన్న కాఁదలంచుటయు, జ్ఞానంబును, విజ్ఞాన విజృంభితంబైన యోగంబును, ధృత్యుద్యమంబును, సాత్త్వికంబును నాదిగాఁ గల తెఱంగులచేత లింగదేహంబు జయించి దేహి కుశలుం డగుచు నుండవలయు. | 69 |
| ఆ. |
అరయఁగర్మరూప మగు నవిద్యాజన్మ, మైన హృదయబంధనాది లతల నప్రమత్తయోగ మను మహాఛురికచేఁ, ద్రెంపవలయు నంతఁదెంపుతోడ. |
70 |
| ఆ. |
ఒనర నిట్లు యోగయుక్తుండు గురుఁడైన, భూపుఁడైన శిష్యపుత్రవరుల యోగయుతులఁజేయ నొప్పుగా వలయును, గర్మపరులఁజేయఁగాదు కాదు. |
71 |
| సీ. |
జనులెల్ల నర్థ వాంఛలఁజేసి యత్యంత మూఢులై యైహికంబులు మనంబు లందును గోరుదు; రల్ప సౌఖ్యములకు నన్యోన్యవైరంబు లంది దుఃఖ ములఁబొందుదురు; గాన మునుకొని గురుఁడైనవాఁడు మాయామోహవశుఁడు నెంత జడుఁడు నైనట్టి యా జంతువులందును దయ గల్గి మిక్కిలి ధర్మబుద్ధిఁ |
|
| ఆ. |
గన్నులున్నవాఁడు గానని వానికి, దెరువుఁజూపి నట్లు దెలియఁబలికి యతుల మగుచు దివ్యమైన యా మోక్ష మా, ర్గంబుఁజూపవలయు రమణతోడ. |
72 |
| వ. | మఱియుఁ బితృ గురుజననీ బంధు పతి దైవతంబులలో నెవ్వరైనను సంసార రూప మృత్యురహితం బైన మోక్షమార్గంబుం జూపకుండిరేని వా రెవ్వరును హితులు గానేరరు; నాదు శరీరంబు దుర్విభావ్యంబు; నాదు మనంబు సత్త్వయుక్తంబును, ధర్మసమేతంబును, బాపరహితంబు నగుటంజేసి పెద్దలు నన్ను ఋషభుం డండ్రు; గావున శుద్ధ సత్త్వమయంబైన శరీరంబునం బుట్టిన కుమారులైన మీర లందఱును సోదరుండును మహాత్ముండును నగ్రజుండును నైన భరతు నన్నెకాఁ జూచి యక్లిష్టబుద్ధిచే భజింపుం; డదియ నాకు శుశ్రూషణంబు; ప్రజాపాలనంబు సేయుట మీకును బరమధర్మంబని మఱియు నిట్లనియె. | 73 |
| సీ. |
భూతజాలములందు భూజముల్ వర్యముల్ భూరుహములకంటె భోగికులము భోగిసంతతికన్న బోధనిష్ఠులు బోధమాన్యులకన్నను మనుజవరులు వీరికన్నను సిద్ధవిబుధగంధర్వులు వారి కన్న ను సురల్ వారికన్న నింద్రాదిదేవత లిందఱికన్నను దక్షాది సన్మునుల్ దలఁప నెక్కు |
|
| తే. |
డంతకన్నను భర్గుఁ డా యభవుకన్నఁ, గనులభవుఁడెక్కుఁ; డాతనికంటె విష్ణుఁ డధికుఁడాతఁడు విప్రుల నాదరించుఁ, గాన విప్రుండు దైవంబు మానవునకు. |
74 |
| క. |
భూసురులకు సరిదైవం, బీ సచరాచరమునందు నెఱుఁగను; నాకున్ భూసురులు గుడుచునప్పటి, యా సంతోషంబు దోఁప దగ్నులయందున్. |
75 |
| సీ. |
మంగళంబైన బ్రహ్మస్వరూపంబును వేదరూపంబు ననాదిరూప మగుచున్న నాదు దేహము బ్రాహ్మణోత్తముల్ ధరియింతు రెప్పుడుఁదత్త్వబుద్ధి శమదమానుగ్రహసత్యతపస్తితిక్షలు గల్గు విప్రుండు సద్గురుండు; గాన మిక్కిలి భక్తి గల్గి యకించను లైన భూసురుల దేహములవలన |
|
| తే. |
నందుచుండును నాదు దేహంబు గాఁగ, నెఱిఁగి వరులగు విప్రులనెల్ల భక్తిఁ బూజసేయుటయే నన్నుఁబూజసేయు, టనుచు వినిపించి మఱియు నిట్లనుచుఁ బలికె. |
76 |
| క. |
ఈ తెఱఁగు దెలిసి భూసుర, జాతింబూజించునట్టి జనుఁడును మాయా తీతుండై నిక్కంబుగ, భూతలమున మోక్షమార్గమును బొడగాంచున్. |
77 |
| వ. | ఇట్లు సదాచారు లగు కుమారులకు లోకానుశాసనార్థం బాచారంబు లుపదేశించి మహాత్ముండును బరమసుహృత్తును నగు భగవంతుండు ఋషభాపదేశంబునం గర్మత్యాగంబు సేసి యుపశమశీలురగు మునులకు భక్తిజ్ఞానవైరాగ్య లక్షణంబులు గల పారమహంస్య ధర్మం బుపదేశింపగలవాఁ డగుచుఁ బుత్త్రశతంబునం దగ్రజుండును బరమ భాగవతుండును భగవజ్జన పరాయణుండును నగు భరతుని ధరణీపాలనంబునకుఁ బట్టంబు గట్టి తాను గృహమందె దేహమాత్రావలంబనంబు సేసి దిగంబరుండై యున్మత్తాకారుం డగుచుం బ్రకీర్ణ కేశుండై యగ్నుల నాత్మారోపణంబు సేసి బ్రహ్మావర్తదేశంబును బాసి జడాంధ బధిర మూక పిశాచోన్మాదులుం బోలె నవధూత వేషంబు నొంది జనులకు మాఱు పలుకక మౌన వ్రతంబునం బుర గ్రామాకర జనపదారామ శిబిర వ్రజఘోష సార్థగిరి వనాశ్రమాదుల యందు వెంటంజనుదెంచు దుర్జన తర్జన తాడనావమాన మేహన నిష్ఠీవన పాషాణశకృద్రజః ప్రక్షేపణపూతి వాత దురుక్తులం బరిభూతుం డయ్యును గణనం బెట్టక వనమదేభంబు మక్షికాది కృతోపద్రవంబునుం బోలెఁ గై కొనక దేహాభిమానంబునం జిత్త చలనంబు నొందక యేకాకియై చరియించు చుండ నతి సుకుమారంబులగు కరచరణోరస్స్థలంబులు విఫులంబులగు బాహ్వంసకంఠ వదనాద్యవయవ విన్యాసంబులుం గలిగి ప్రకృతి సుందరం బగుచు స్వతస్సిద్ధదరహాసరుచిర ముఖారవిందంబై, నవ నళిన దళంబులంబోలి శిశిర కనీనికలం జెలువొంది, యరుణాయతంబులగు నయనంబులచే నొప్పి యన్యూనాధికంబులగు కపోల కర్ణ కంఠ నాసాదండంబులచేఁ దేజరిల్లుచు నిగూఢస్మితవదన విభ్రమంబులం బ్రకాశించు తన దివ్య మంగళ విగ్రహంబుచేఁ బుర సుందరుల మనంబుల కత్యంత మోహంబు గలుగఁజేయుచు. | 78 |
| ఆ. |
ధూళిచేత మిగుల ధూసరితంబునై, జడలు గట్టి కడుఁబిశంగవర్ణ ము నగు కేశపాశమును వెలిఁగించుచు, నితరు లెవరుఁదన్ను నెఱుఁగకుండ. |
79 |
| క. |
అవధూతవేషమున ని, ట్లవనిన్ మలినంబులైన యవయవములతోఁ దవిలి చరించుచునుండును, భువి భూతాక్రాంతుఁడయిన పురుషునిమాడ్కిన్. |
80 |
| ఆ. |
జనుల కిట్లు యోగసంచార మెల్ల వి, రుద్ధ మనుచు నాత్మబుద్ధిఁజూచి యజగరంబు మాడ్కి నవనిపై నుండె బీ, భత్సకర్మమునకుఁబాలుపడుచు. |
81 |
| వ. | ఇట్లు బీభత్సరూపంబున వసుంధరం బడియుండి యన్నంబు భుజించుచు నీరు ద్రావుచు మూత్రపురీషంబులు విడుచుచు నవి శరీరంబున నంటం బొరలుచుండు, మఱియుఁ దత్పురీష సౌగంధ్య యుక్తంబగు వాయువు దశదిశలన్ దశయోజన పర్యంతంబు పరిమళింపం జేయుచుండ గోమృగకాక చర్యలం జరియించుచు భగవదంశంబైన ఋషభుండు మహానందంబు ననుభవించుచుం దనయందు సర్వభూతాంతర్యామి యగు వాసుదేవునిం బ్రత్యక్షంబుగాఁ గనుంగొనుచు సిద్ధిం బొందిన వైహాయస మనోజవ పరకాయ ప్రవేశాంతర్ధాన దూర గ్రహణ శ్రవణాది యోగ సిద్ధులు దమంత వచ్చినం గైకొనక యుండె నని పలికిన శుకయోగీంద్రునకుంబరీక్షిన్నరేంద్రుం డిట్లనియె. | 82 |
| క. |
మునివర! యోగజ్ఞానం, బునఁ జెఱుపంబడ్డ కర్మములు గల పెద్దల్ గని యుండెడి యైశ్వర్యం, బును ఋషభుం డెఱిఁగి యేల పొందకయుండెన్? |
83 |
| వ. | అనిన శుకుండిట్లనియె. | 84 |
| మ. |
ధరణీవల్లభ! నీదు వాక్యములు దథ్యంబింతయుందప్ప, దె ట్లరయన్ వన్యమృగంబు పట్టువడి తా నా వేళ నా లుబ్ధకున్ ధర వంచించినమాడ్కి నింద్రియములన్ దండించి చిత్తంబు ని ర్భరకామాదుల కాస యిచ్చుఁగడుసంరంభంబుతోఁగ్రమ్మఱన్. |
85 |
| క. |
చిరకాలతపము నైనను, హరియింపఁగ నోపుఁజిత్త మని పెద్దలు న మ్మరు జారులకున్ జారిణి, కరణిని నడరించు మనసు కామాదులకున్. |
86 |
| క. |
కామక్రోధాదికముల్, భూమీశ్వర! కర్మబంధములు మఱియును జే తోమూలము లగుటను దా, రీ మహిలో మనసు నమ్మ రెప్పుడుఁబెద్దల్. |
87 |
| సీ. |
అదిగాన నెన్నఁడు నైశ్వర్యములను జే పట్టఁజూడఁడు, లోకభవ్యులైన వారలచే నభివందనంబులు వొంది వెలయంగ నవధూతవేష భాష ణంబుల నెఱిఁగికొనఁగరాని భగవత్స్వరూపంబు గలిగి యా రూపమందుఁ బరమయోగధ్యానపరులకు నెల్ల దేహత్యాగసమయంబు నంతలోనఁ |
|
| తే. |
జూపుచుండియు దేహంబుఁబాప నిశ్చయించె; నచ్చట దివ్యయోగీంద్రుఁ డాద్యుఁ డతుల దివ్యప్రకాశకుఁ డమరగురుఁడు, పరమపురుషుండు ఋషభుండు పార్థివేంద్ర! |
88 |
| వ. | అంత విముక్తలింగుండు భగవంతుండునగు ఋషభుండు మనంబున దేహాభిమానంబు విసర్జించి కులాల చక్రంబు కులాలుని చేత భ్రమియింపంబడి విసృష్టంబయ్యు భ్రమియించు గతిం బ్రాచీన సంస్కార విశేషంబగు నభిమానాభాసంబున దేహచలనాదికంబుల నొప్పి యుండియు, యోగమాయా వాసనచే యుక్తుండయ్యె; మఱియు నా ఋషభుం డొక్క దినంబునం గోంకణవంక పట కుటకంబులను దక్షిణ కర్ణాట దేశంబులకు యదృచ్ఛం జని కుటకాచలోపవనంబున నిజాస్యకృతశిలా కబళుం డగుచు నున్మత్తుని చందంబున వికీర్ణ కేశుండు, దిగంబరుండునై సంచరింప, వాయువేగ విధూత వేణుసంఘర్షణ సంజాతంబగు నుగ్రదావానలంబు తద్వనంబు దహింప నందు దగ్ధుండయ్యె; నంత నతని కృత్యంబులు తద్దేశవాసులగు జనంబులు సెప్ప నర్హన్నామకుండగు తద్రాష్ట్రాధిపతి విని, నిజధర్మంబులం బరిత్యజించి స్వదేశస్థులతోడం గూడి, దా నా యాచారంబుల నంగీకరించి, యధర్మ బహుళం బగు కలియుగంబున భవితవ్యతచే విమోహితుండై మనుజుల నసమంజసం బగు పాషండ మతాభినివేశులం జేసె; మఱియును గలియుగంబునందు మనుజాధములు దేవమాయా మోహితులై శాస్త్రోక్త శౌచాచారంబులు విడిచి నిజేచ్ఛం జేసి దేవతా హేళనంబులు సేయుచు, నస్నానానాచమనాశౌచ కేశోల్లుంఛనాది కాపవిత్ర వ్రతంబులం జేయుచు నధర్మ బహుళం బగు కలియుగంబునం జెఱుపంబడ్డ బుద్ధి ధర్మంబులం గలిగి వేద బ్రాహ్మణ యజ్ఞపురుషుల దూషించుచు లోకంబులం దమ తమ మతంబులకుం దామే సంతసిల్లుచు నవేద మూలంబగు స్వేచ్ఛం జేసి ప్రవర్తించి యంధపరంపరచే విశ్వాసంబు సేసి తమంతన యంధతమసంబునం బడుచు నుండుదు; రీ ఋషభుని యవతారంబు రజోవ్యాప్తులగు పురుషులకు మోక్ష మార్గంబు నుపదేశించుటకు నయ్యె; నదియునుంగాక సప్త సముద్ర పరివృతంబులగు నీ భూద్వీప వర్షంబులందలి జనంబులు దివ్యావతార ప్రతిపాదకంబు లతిశుద్ధంబులు నగు నెవ్వని కృత్యంబులం గీర్తింతురు, మఱియు నెవ్వని వంశంబున నతికీర్తిమంతుండగు ప్రియవ్రతుండు గలిగె, నెందు జగదాద్యుండగు పురాణపురుషుం డవతారంబు నొంది కర్మహేతుకంబులుగాని మోక్ష ధర్మంబులం దెలిపె, వెండియు నెవ్వండు యోగమాయా సిద్ధుల నసద్భూతంబు లగుటం జేసి నిరసించె, నట్టి ఋషభునితోడఁ దత్సిద్ధికృత ప్రయత్నులగు నితర యోగీశ్వరులు మనోరథంబుననైన నెట్లు సరియగుదు? రిట్లు సకల వేదలోక దేవబ్రాహ్మణులకు గోవులకుం బరమ గురుండు, భగవంతుండు నగు ఋషభుని చరిత్రంబు వినినవారలకు దుశ్చరితంబులు దొలంగు; మంగళంబులు సిద్ధించు; మిక్కిలి శ్రద్ధతోడ నెవ్వండు విను, వినిపించు, వానికి హరిభక్తి దృఢం బగు; నట్టి హరి భక్తి తాత్పర్యంబునం బెద్దలు భాగవతు లగుటం జేసి సంప్రాప్త సర్వపురుషార్థు లగుచు వివిధ వృజిన హేతుకంబగు సంసారతాపంబును బాసి యవిరతంబుఁ దద్భక్తియోగామృత స్నానంబు సేసి పరమ పురుషార్థంబయిన మోక్షంబును జెందుదురని సప్తద్వీపంబులవారు నేఁడునుం గొనియాడుచుండుదురు. | 89 |
| ఆ. |
యాదవులకు మీకు నత్యంతకులగురు, వైన కృష్ణుఁడెచట నైనఁ గలఁడు; కొలుచువారి కెల్ల సులభుఁడై మోక్షంబు, నిచ్చుఁజింతసేయ నేల నీకు? |
90 |
| సీ. |
నిత్యానుభూతమై నిజరూపలాభ నివృత్తమై తగు మహాతృష్ణ గలిగి యతులిత విపుల మాయారచితంబైన లాభంబునకుఁ దగులంబు లేని మతి గల్గి లోకుల నతి వేడ్కఁ గరుణించి యభయదానంబిచ్చి యందఱ కిల నవ్యయంబై దివ్యమై మహానందమై యత్యంతసేవ్యమై యతులమైన |
|
| తే. |
తనదు లోకంబు చూపంగఁదగిన యట్టి, మోక్షమార్గంబు నెఱిఁగించి ముక్తదేహుఁ డగుచుఁదాదాత్మ్య మొందెఁ బ్రత్యక్ష విష్ణు, వైన ఋషభుండు జనులకు నద్భుతముగ. |
91 |