| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | పంచమస్కంధము - ప్రథమాశ్వాసము |
| ఆ. |
నరవరేణ్యుఁడైన నాభి సంతానార్థ, మంగనయును దాను యజ్ఞపురుషుఁ డయిన వాసుదేవు నతులభక్తి శ్రద్ధ, లను జెలంగి పూజ లొనరఁజేసి. |
41 |
| వ. | మఱియుం బ్రవర్గ్యసంజ్ఞికంబు లగు ధర్మంబులు శ్రద్ధా విశుద్ధ ద్రవ్యదేశకాల మంత్రర్త్విగ్దక్షిణా విధాన యోగంబులం బరమేశ్వరుని మెప్పించిన, నెవ్వరికింఁ బ్రసన్నుండు గాని పుండరీకాక్షుండు భక్తవత్సలుండై సురుచిరావయవంబులతో యజనశీలం బయిన యాతని హృదయంబునందుఁ బాయని రూపంబు గలిగి మనోనయనానందకరావయవంబులు గల తన స్వరూపంబాతనికిఁజూపందలంచి. | 42 |
| సీ. |
అంత నావిష్కృతకాంత చతుర్భుజంబులును బీతాంబరంబును వెలుంగ శ్రీవత్సకౌస్తుభశ్రీరమాచిహ్నంబు లురమందు రమ్యమై యిరవుపడఁగ శంఖచక్రగదాంబుజాతఖడ్గాదిదివ్యాయుధంబులు సేతులందు మెఱయ నతులితనవరత్నహాటకాంకితనూత్న ఘనకిరీటద్యుతుల్ గడలుకొనఁగఁ |
|
| తే. |
గర్ణకుండలకటిసూత్రకనకరత్న, హారకేయూరవరనూపురాదిభూష ణముల భూషితుఁడైన శ్రీనాయకుండు, దంపతుల కప్పు డెదురఁబ్రత్యక్షమయ్యె. |
43 |
| తే. |
ఇట్లు ప్రత్యక్ష మగు పరమేశ్వరునకుఁ, బెన్నిధానంబుఁగనుఁగొన్న పేదమాడ్కి హర్షమున ఋత్విగాదికు లవనతాస్యు, లగుచు నభినుతి సేసి రిట్లనుచు నపుడు. |
44 |
| క. |
పరిపూర్ణుఁడవై యుండియు, మఱవక మా పూజ లెల్ల మన్నింతువు; నీ చరణారవిందసేవయు, ధరఁ బెద్దలు వినిచినటులు దగఁ జేసెదమౌ. |
45 |
| క. |
ఏ మిపుడు సేయు సంస్తుతి, నీ మహిమ నెఱింగి కాదు; నిరతముఁబెద్దల్ దా మెది యుపదేశించిరొ, యా మతమునఁబ్రస్తుతింతు మయ్య మహాత్మా! |
46 |
| వ. | మఱియు నీవు సంసారాసక్త మతి గలిగిన వారికి వశ్యుండవు గా; వీశ్వరుండవును బ్రకృతి పురుష వ్యతిరిక్తుండవును బరమ పురుషుండవును నయిన నిన్నుఁ బొందని ప్రపంచాంతర్గతంబు లయిన నామరూపంబులు గల యస్మదాదులచేత నిరూపింప నశక్యం బగుఁ; సర్వజీవులం జెందిన దురిత సంఘంబుల నిరసించు స్వభావంబు గల నీ యుత్తమ గుణంబులయందు నేకదేశంబ గాని సర్వగుణ నిరూపణంబు సేయ శక్యంబు గా నేరదు; నీ భక్తులు మిక్కిలి భక్తింజేసి సంస్తుతించు గద్గదాక్షరంబులను సలిల శుద్ధ పల్లవ తులసీదళ దూర్వాంకురంబులను సంపాదించిన పూజచే సంతసిల్లెడి నీకు బహువిధ ద్రవ్య సంపాదనంబు గలిగి విభవ యుక్తంబు లయిన యశ్వమేధాదులును దృప్తికరంబులు గా నేరవు; స్వభావంబున సర్వకాలంబులందును సాక్షాత్కరించి యతిశయంబై వర్తించుచు నశేషపురుషార్థ స్వరూపంబు బరమానంద రూపంబు నైనవాఁడ వగుటం జేసి యజ్ఞాదుల యందు నీకుఁ దృప్తి లేకయున్న నస్మదాదుల కోరికల నాపాదించు కొఱకు యజ్ఞాదుల నొనరింతు మని మఱియు నిట్లనిరి. | 47 |
| క. |
బాలిశుల మగుచు మిక్కిలి, మే లెఱుఁగని మమ్ము నీదు మించిన దయచేఁ బాలించి యిత్తు వెప్పుడుఁ, జాలఁగ నిహపరములందు సకలసుఖంబుల్. |
48 |
| ఆ. |
ఇపుడు మేము నీకు నిష్టంబు లగు పూజ, లాచరింపకున్న నైన నధిక మయిన నీ కృపాకటాక్ష వీక్షణములఁ, జక్కఁజూచి తగఁబ్రసన్నుఁడగుచు. |
49 |
| క. |
వర మీయఁదలఁచి మమ్ముం, గరుణించితి గాక! నిన్నుఁగనుఁగొనుటకునై యరసి నుతింపఁగ మాకుం, దర మగునే? వరద! నీరదశ్యామాంగా! |
50 |
| వ. | మఱియు నిస్సంగులై నిశితజ్ఞానంబునం జేసి దోషరహితులై భగవత్స్వభావులు నాత్మారాములు నగు మునులకు స్తుతియింపఁ దగిన గుణంబులు గలవాఁడ వగుచుండియుఁ బ్రసన్నుండవు, స్ఖలన క్షుత పతన జృంభణాది దురవస్థలందును జరామరణాది దుర్దశలందును వివశుల మగు మాకుఁ గల్మష నాశకరంబులయిన భవ ద్దివ్యనామంబులు మా వచనగోచరంబు లగుంగాక, మఱియు నీ రాజర్షి పుత్త్రకాముండై నీ తోడ సమానుండయిన కుమారునిం గోరి కామంబుల స్వర్గాపవర్గంబుల నీ నోపిన నినుం బూజించి ధనకాముం డైనవాఁడు ధనవంతునిం జేరి తుషమాత్రం బడిగిన చందంబున మోక్షనాథుండవైన నీవలన సంతానంబు గోరుచున్న వాఁడు; జయింపరాని నీ మాయచేత నెవ్వండు మోహంబు నొంది విషయాసక్తుండుగాక యుండు? నర్థకాములము మదాంధులము నగు మేము నిన్ను నాహ్వానంబు సేసిన యపరాధంబు సర్వాత్మకుండ వగుటంజేసి సామ్యంబుచే మన్నింపం దగుదువు; మమ్ము దయఁ జూడుమని ప్రణమిల్లిన దేవతాశ్రేష్ఠుండైన సర్వేశ్వరుండు వర్షాధిపతియగు నాభిచేతను, ఋత్విక్కుల చేతను వంద్యమానుండై దయాకలితుండగుచు నిట్లనియె. | 51 |
| క. |
మునులార! వేదవాక్యము, లను బ్రస్తుతి సేసి సర్వలక్షణముల నా కెన యగు పుత్త్రుని నిమ్మని, వినఁబలికితి రిపుడు మిగుల వేడుకతోడన్. |
52 |
| క. |
నాకాదిలోకములలో, నాకున్ సరివచ్చునట్టి నందను నెటు నా లోకింపలేరు; గావున, నాకున్ సరి నేన కా మనమున నెఱుఁగుఁడీ! |
53 |
| వ. | అదియునుంగాక భూసురోత్తములు నా ముఖం బగుటంజేసి విప్రవాక్యంబు దప్పింపరాదు; మీరు నా యీడు కుమారు నడిగితిరి గావున నాభిపత్ని యగు మేరుదేవియందు నేన పుత్త్రుండనై జనియించెద నని పలికి పరమేశ్వరుం డాగ్నీధ్రీయపత్ని యగు మేరుదేవి సూచుచుండ నా యజ్ఞంబున నంతర్ధానంబు నొంది యా నాభి మీఁది దయంజేసి దిగంబరులును దపస్వులును జ్ఞానులును నూర్ధ్వరేతస్కులును నగు నైష్ఠికులకు యోగధర్మంబుల నెఱింగింపం దలంచి పుండరీకాక్షుండు నాభి పత్ని యగు మేరుదేవి గర్భాగారంబునంబ్రవేశించె నంత. | 54 |
| ఆ. |
మేరుదేవియందు మేరుధీరుం డగు, హరి సమస్త లక్షణాన్వితుండు శమదమాది గుణ విశారదుం డుదయించె, సకలజనుల కపుడు సంతసముగ. |
55 |
| ఆ. |
ధవళకాంతియుక్తిఁ దనరు దేహంబును, మహితబలపరాక్రమంబు వీర్య మును దలంచి చూచి జనకుండు పేరిడె, సుతుని ఋషభుఁడనుచు సొంపుతోడ. |
56 |
| క. |
ధరణీసురులును మంత్రులుఁ, బరివారము హితులుఁ బ్రజలు బాంధవులును సు స్థిరమతి నా బాలకునిం, గర మనురాగమున రాజుగాఁ జూచి రిలన్. |
57 |
| క. |
పురుహూతుఁడతని మహిమలు, సరగున విని చిత్తమునకు సహ్యము గామిం బరికించి ఋషభుఁడేలెడి, ధరణి ననావృష్టి మిగుల దట్టము సేసెన్. |
58 |
| ఆ. |
అది యెఱింగి ఋషభుఁడంతట యోగ మా, యా బలంబుకతన నఖిలరాజ్య మందుఁగురియఁజేసె నత్యంతసంపూర్ణ, వృష్టి దినదినంబు వృద్ధిఁబొంద. |
59 |
| వ. | ఇట్లు ఋషభుండు పురందరుండు సేయు దౌష్ట్యంబునకు నవ్వి యజనాభం బను తన మండలంబు సుభిక్షంబుగాఁ జేసె, నాభియుం దన కోరిన చందంబునం బుత్త్రుండు జనియించి వర్ధిల్లుటకు సంతసిల్లి తనచేత నంగీకరింపంబడు నరలోక ధర్మంబు గల పుండరీకాక్షుని మాయావిలసిత మతింజేసి బాలకు, నా తండ్రి యని మోహంబున నుపలాలించుచుఁ బ్రజానురాగంబున సర్వసమ్మతుం డయిన పుత్త్రుని సమయసేతు రక్షణంబునకుఁ బూజ్యం బైన రాజ్యంబునం దభిషిక్తుంజేసి భూసురులకుఁ బ్రధానవర్గంబునకు నప్పగించి మేరుదేవిం గూడి నరనారాయణ స్థానంబయిన బదరికాశ్రమంబునకుం జని, యచ్చట మహాయోగ సమాధిచే నర నారాయణాఖ్యుండుఁ బురుషోత్తముండు నగు వాసుదేవు నారాధించి క్షీణదేహుండై యా నాభి హరి తాదాత్మ్యంబు నొందె నంత. | 60 |
| చ. |
సరసత నే నృపాలకుని జన్నమునందును భూసురోత్తముల్ సరసిజనాభునిందగఁబ్రసన్నతఁబెట్టిన నంత మెచ్చి యీ శ్వరుఁడు దనంత గర్భమున వచ్చి తనూభవుఁడై జనించె, నా నరపతి నాభికిన్ సరి యనందగునే నరనాథ! యన్యులన్. |
61 |
| వ. | అంత | 62 |
| సీ. |
భూవరుఁడగు ఋషభుఁడు దన రాజ్యంబుఁ గర్మభూమిగ నాత్మఁగాంచి జనుల కందఱకును బ్రియం బగునట్లు కర్మతంత్రంబెల్లఁదెలుపంగఁదలఁచి కర్మ ములు సేయుటకు గురువుల యొద్ద వేదంబు సదివి వారల యనుజ్ఞను వహించి శతమన్యుఁడిచ్చిన సతి జయంతీకన్యఁ బరిణయంబై యట్టి పడఁతివలన |
|
| తే. |
భరతుఁడాదిగ సుతుల నూర్వురను గాంచె, నట్టి భరతుని పేరను నవనితలము పురవరాశ్రమగిరితరుపూర్ణ మగుచు, నమరి భారతవర్షనామమున మించె. |
63 |
| వ. | ఆ మహాభారతవర్షంబునందుఁ దమతమ పేరంబరఁగు భూములకుఁ గుశావర్తేలావర్త బ్రహ్మావర్తార్యావర్త మలయకేతు భద్రసే నేంద్రస్పృ గ్విదర్భ కీకటులను తొమ్మండ్రు కుమారులను దక్కుంగల తొంబండ్రు పుత్త్రులకుఁ బ్రధానులంజేసె; నంతం గవి హర్యంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయ నావిర్హోత్ర ద్రమీఢ చమస కరభాజను లను వారు దొమ్మండ్రును భాగవత ధర్మప్రకాశకులైరి; భగవ న్మహిమోపబృంహితంబు లగు వారల చరిత్రంబులు ముంద రెఱింగించెదఁ; దక్కిన యెనుబది యొక్కకుమారులు పిత్రాదేశకరులు నతివినీతులు మహాశ్రోత్రియులు యజ్ఞశీలురుఁ గర్మనిష్ఠులు నయిన బ్రాహ్మణోత్తము లైరి; ఋషభుండు స్వతంత్రుండై సంసారధర్మంబులం బొరయక కేవలానందానుభవుం డయిన యీశ్వరుండై యుండియు బ్రాకృతుండునుం బోలెఁ గాలానుగతంబులగు ధర్మంబుల నాచరించుచు ధర్మ ప్రవర్తకులకు సముండును నుపశాంతుండును మైత్రుండును గారుణికుండునునై ధర్మార్థయశః ప్రజానందామృతావరోధంబుచే గృహస్థాశ్రమంబులం బ్రజల నియమించుచుఁ గొంత కాలంబు నీతి మార్గంబు దప్పక ప్రజాపాలనంబు సేయుచు, వేద రహస్యంబులగు సకల ధర్మంబులును స్వవిదితంబులైనను బ్రాహ్మణోపదేశ పూర్వకంబుగా ద్రవ్యదేశకాల వయశ్శ్రద్ధర్త్విగ్విధోద్దేశోపచితంబులుగా నొక్కొక్క క్రతువును శతవారంబు యథావిధిగఁ జేసి సుఖంబుండె నంత. | 64 |
| క. |
జనవర! ఋషభుని రాజ్యం, బున నైహిక ఫలముఁగోరు పురుషుని నొకనిం గనుఁగొన నెఱుంగ మెన్నఁడు, నినతేజుండతని మహిమ లేమని చెప్పన్. |
65 |