| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | పంచమస్కంధము - ప్రథమాశ్వాసము |
| క. |
భూనాథుఁడుత్తరాత్మజుఁ, డైన పరీక్షిన్నరేంద్రుఁడభిమన్యు సుతుం డానందమంది ఘన సు, జ్ఞానుండగు శుకునిఁగాంచి సరసతఁబలికెన్. |
3 |
| వ. | మునీంద్రా! పరమభాగవతుండు నాత్మారాముండునైన ప్రియవ్రతుండు గృహంబున నుండి యెట్లు రమించెఁ? గర్మ బంధంబు లయిన పరాభవంబులు గల గృహంబులయందు ముక్త సంబంధులైన పురుషులకు సంతోషంబు గా నేర; దుత్తమ శ్లోకుండైన పుండరీకాక్షుని పాదచ్ఛాయం జేసి నిర్వృత చిత్తులైన మహాత్ములు కుటుంబంబునందు నిస్పృహత సేయుదురు; గాన ప్రియవ్రతునికి సంసారంబునందుఁ దగులంబు గలుగు టెట్లు? దారాగారసుతాదులందుఁ దగులంబు గలుగ వానికి నెట్లు సిద్ధి గలుగు? శ్రీహరియం దస్ఖలితమతి యెట్లు గలుగు? నీ సంశయంబుఁ దేట పఱుపు మని పరీక్షిన్నరేంద్రుఁ డడిగిన శుక యోగీంద్రుం డిట్లనియె. | 4 |
| క. |
హరిచరణాంబుజమకరం, ద రసావేశితమనఃప్రధానుండగు స త్పురుషుఁ డొకవేళ విఘ్నముఁ, బొరసినఁ దన పూర్వమార్గమును విడువఁడిలన్. |
5 |
| క. |
ధరణీవల్లభ! విను మా, నరవరుఁడు ప్రియవ్రతుండు నారదముని స చ్చరణోపసేవఁజెందుచు, నరుదుగ నధ్యాత్మసత్త్రయాగంబందున్. |
6 |
| సీ. |
దీక్షితుండై ధరిత్రీపాలనముఁదండ్రి పనిచిన సుజ్ఞానభంగ మనుచు నంగీకరింపమి నంతయుఁ దెలిసి పద్మాసనుఁడతనికి నతుల రాజ్య మందుల మిక్కిలి యాసక్తిఁబుట్టింతు ననుచును దన చిత్తమందుఁ దలఁచి తారకాద్యనుసృతతారాధిపుని మాడ్కి శ్రుతులతోఁగూడి యచ్యుతవిభూతి |
|
| తే. |
హంసవాహనుఁడగుచు నింద్రాదు లెల్లఁ, గదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునీంద్రులు దన్నుఁబ్రశంససేయ, నల్ల నల్లన యుడువీథి నరుగు దెంచె. |
7 |
| వ. | మఱియు నయ్యై మార్గంబులయందు సిద్ధ సాధ్య గంధర్వ చారణ గరుడ కింపురుషు లిరు దెసల స్తోత్రంబులు సేయుచుండ గంధమాదనద్రోణులం బ్రకాశంబు నొందించుచుఁ జనుదెంచిన పద్మాసనునకు నారదుండు స్వాయంభువ ప్రియవ్రతులతోఁ గూడి ముకుళిత కరకమలుండై యెదురు చనుదెంచి సంస్తుతి స్తబకంబులం బూజించిన; విరించి సంతసించి ప్రియవ్రతునింజూచి నవ్వుచు నిట్లనియె. | 8 |
| క. |
హరి నా ముఖమున నీకును, గర మెఱిఁగింపంగఁ బనిచెఁగావున నిదె సు స్థిరమతి విను మంతయు శ్రీ, హరివాక్యముగా నెఱింగి యవనీనాథా! |
9 |
| ఆ. |
కోరి వేడ్క నీవు నారదుండును నేను, నందఱమును నీశ్వరాజ్ఞఁబూని యుడుగ కెపుడు సేయనున్న వారము గాన, నతని యాజ్ఞఁదప్ప నలవి గాదు. |
10 |
| వ. | మఱియు శ్రీహరి యాజ్ఞను జీవుండు తపోవిద్యలను యోగవీర్యజ్ఞానార్థ ధర్మంబులను దనచేత నొరులచేతం దప్పింప సమర్థుండు గాఁ; డుత్పత్తి స్థితి నాశంబులకు శోకమోహభయ సుఖదుఃఖంబులకు నీశ్వరాధీనుండె కాని జీవుండు స్వతంత్రుండు గాఁడు; శ్రీహరివాగ్రూపంబు లయిన శ్రుతులందు గుణత్రయంబను రజ్జువున బంధింపంబడిన యస్మదాదులము ముకుఁద్రాటిచేఁ బశువు మనుష్యులకు వశంబయిన చందంబున నీశ్వరాజ్ఞం బ్రవర్తించుచుందుము; నరుండు సుఖదుఃఖానుభవంబులకు నీశ్వరాధీనుండు; నేత్రంబులు గలవానిచేతఁ దివియంబడిన యంధుండునుం బోలె నీశ్వరుం డిచ్చిన సుఖదుఃఖంబు లనుభవించుచున్న వారము; స్వప్నంబునం గన్న పదార్థంబు మేల్కాంచి మిథ్యగాఁ దలంచిన చందంబున మోక్షార్థియైన సుజ్ఞానవంతుండు ప్రారబ్ధ సుఖ దుఃఖంబు లనుభవించుచు దేహాంతరారంభ కర్మంబులం బాయనొల్లఁడు; వనవాసి యైనను జితేంద్రియుండు గాకుండెనేనిఁ గామాదిసహితుం డగుటంజేసి సంసారబంధంబులు గలుగు; గృహస్థాశ్రమంబందును జితేంద్రియుండై యాత్మ జ్ఞానంబుగల పురుషునకు మోక్షంబు సిద్ధించు, శత్రువులఁ గెలువ నిచ్ఛయించిన పురుషుండు దుర్గం బాశ్రయించి శత్రువుల జయించిన మాడ్కిని మోక్షార్థియగు నీవును గృహాశ్రయుండ వగుచు శ్రీ నారాయణ చరణారవిందంబు లను దుర్గం బాశ్రయించి యరిషడ్వర్గంబు జయించి ముక్తసంగుండవై యీశ్వర కల్పితంబులగు భోగంబుల ననుభవించి ముక్తిం జెందు మనినఁ బ్రియవ్రతుండు త్రిభువనగురుం డయిన చతురాననునివాక్యంబు లవనతమస్తకుండై బహుమానపూర్వకంబుగ నంగీకరించె నంత. | 11 |
| ఆ. |
సరసిజాసనుండు స్వాయంభువునిచేత, నధికమైన పూజలంది నార దుండు నా ప్రియవ్రతుండును జూడంగఁ, జనియెఁదనదు పూర్వసదనమునకు. |
12 |
| ఆ. |
సత్యసంధుఁడైన స్వాయంభువుండను, మనువు బ్రహ్మచేత మన్ననఁదగ నంది యంత నారదానుమతంబునఁ, దనదు సుతుని రాజ్యమునను నిలిపె. |
13 |
| వ. | ఇట్లు స్వాయంభువ మనువు భూచక్ర పరిపాలనంబునకుఁ బ్రియవ్రతునిఁ బట్టంబు గట్టి విషమంబులగు విషయంబులవలన విముక్తుండై వనంబునకుంజనియె; నంత. | 14 |
| మ. |
ధరణీవల్లభుఁ డా ప్రియవ్రతుఁడు మోదంబందుచున్ లీల నీ శ్వరవాక్యంబునఁగర్మతంత్రపరుఁడై సంగంబులంబాపు శ్రీ హరిపాదాంబుజచింతనందగిలి నిత్యానందముంబొంది దు ర్భరరాగాదులఁబాఱఁదోలి ప్రజలంబాలించె నత్యున్నతిన్. |
15 |
| వ. | ఇట్లు ప్రియవ్రతుండు రాజ్యంబు సేయుచు విశ్వకర్మ ప్రజాపతి పుత్త్రిక యగు బర్హిష్మతి యనుదానిం బత్నిగాఁ బడసి, యా సతివలన శీల వృత్త గుణ రూప వీర్యౌదార్యంబులం దనకు సమానులైన యాగ్నీ ధ్రేధ్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేతో, ఘృతపృష్ఠ, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవులను నామంబులు గల పుత్త్రదశకంబును, నూర్జస్వతి యను నొక్క కన్యకను గాంచె నందుఁ గవి మహావీర సవనులు బాలకులయ్యు నూర్ధ్వ రేతస్కులై బ్రహ్మవిద్యా నిష్ణాతులై యుపశమనశీలు రగుచుం బారమహంస్య యోగం బాశ్రయించి, సర్వ జీవనికాయావాసుండును, భవభీతజన శరణ్యుండును, సర్వాంతర్యామియు భగవంతుండునగు వాసుదేవుని చరణారవిందావిరత స్మరణానుగత పరమభక్తి యోగానుభావంబున విశోధితాంతఃకరణు లగుచు నీశ్వరు తాదాత్మ్యంబుఁబొంది రంత. | 16 |
| సీ. |
వసుధేశ! యా ప్రియవ్రతుఁ డొండు కాంతయం దధికుల మన్వంతరాధిపతుల మఱియు నుత్తముఁడు తామసుఁడు రైవతుఁ డను సుతులను బుట్టించె సుమహితులను; మున్ను జన్మించిన మువ్వురు పుత్త్రులు నవ్యయపదవికి నరుగుటయును నంతఁబ్రియవ్రతుఁడఖిలశాత్రవకోటిఁ దన బాహుబలముచేతను జయించి. |
|
| తే. |
యతఁడు బర్హిష్మతీకాంతయందుఁ బ్రీతి, గలిగి యౌవనలీలావికాసహాస హేలనాదులఁజిత్తంబు గీలుకొల్పి, గతవివేకుండువోలె భోగములఁబొందె. |
17 |
| వ. | ఇట్లు ప్రియవ్రతుం డేకాదశార్బుద పరివత్సరంబులు రాజ్యంబుసేసి యొక్కనాఁడు మేరునగ ప్రదక్షిణంబు సేయు సూర్యునకు నపరభాగంబునం బ్రవర్తించు నంధకారంబు నివర్తింపంబూని భగవదుపాసనా జనితాతిపురుష ప్రభావుండై సవితృరథసదృక్ష వేగంబు గలిగి తేజోమయంబైన రథంబు నారోహణంబు సేసి రాత్రుల నెల్ల దినంబు లొనర్తునని సప్తవారంబులు ద్వితీయ తపనుండునుం బోలె నరదంబు వఱపుటయు నా రథనేమి మార్గంబులు సప్తసముద్రంబులును నా మధ్య భూసంధులు సప్తద్వీపంబులు నయ్యె నందు. | 18 |
| సీ. |
సరసజంబూప్లక్ష శాల్మలిద్వీప కుశక్రౌంచశాకపుష్కరము లనఁగ నలరు నా ద్వీపంబులందు జంబూద్వీప మొనరంగ లక్షయోజనము లయ్యె; నట యుత్తరోత్తరాయతసంఖ్యఁ దా ద్విగుణిత మయి యొండొంటి కతిశయిల్లు క్షారేక్షురస సురాజ్యక్షీర దధ్యుదకంబులు గలుగు సాగరము లేడు. |
|
| తే. |
ద్వీపపరిమాణములు గల్గి విస్తరిల్లు, సంధిసంధిని బరిఖల చందమునను గ్రమము దప్పక యొండొంటిఁ గలయకుండు, సకలజీవుల కెల్ల నాశ్చర్యముగను. |
19 |
| వ. | అట్టి ద్వీపంబుల యందుఁ బరిపాలనంబునకుం బ్రియవ్రతుం డాత్మభవులు నాత్మసమాన శీలురునైన యాగ్నీ ధ్రేధ్మజిహ్వ యజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేథాతిథి వీతిహోత్రుల నొక్కొక్కని నొక్కొక ద్వీపంబునకుం బట్టంబు గట్టి యూర్జస్వతి యను కన్యకను భార్గవున కిచ్చిన నా భార్గవునకు నూర్జస్వతి యందు దేవయాని యను కన్యారత్నంబు జనించె; నట్టి బలపరాక్రమవంతుండైన ప్రియవ్రతుండు విరక్తుండై యొక్కనాఁడు నిజ గురువగు నారదుని చరణానుసేవానుపతిత రాజ్యాది ప్రపంచ సంసర్గంబుఁ దలంచి యిట్లనియె. | 20 |
| సీ. |
అక్కట! యే నింద్రియములచేఁ గట్టంగఁ బడియుండి యందులఁబాయలేక యజ్ఞానవిరచితంబగు సర్వవిషయములను నంధకూపంబులందు నడఁగి తరుణుల కే వినోదమృగంబనై యుండి యవి యెల్ల నే నొల్ల ననుచు రోసి హరికృపచే నప్పు డబ్బిన యాత్మ విద్యను గల్గి తనవెంట నరుగుదెంచు |
|
| తే. |
కొడుకులకు నెల్ల రాజ్యము గుదురుపఱిచి, తనదు పత్నుల దిగనాడి ధనము విడిచి హరివిహారంబు చిత్తంబునందు నిలిపి, పరఁగ నల్లన నారదపదవి కరిగె. |
21 |
| వ. | ఇట్లు తన రథమార్గంబులు సప్తద్వీపసాగరంబులుగాఁ జేసి సూర్యునకుఁ బ్రతిసూర్యుండై సరిద్గిరివనాదులచే భూతనిర్వృతి కొఱకుఁ బ్రతిద్వీపంబునకు నవధులు గల్పించి ద్వీపవర్ష నిర్ణయంబులం బుట్టించి పాతాళ భూ స్వర్గాది సుఖంబులు నరకసమానంబులుగాఁ దలంచి విరక్తిం బొంది నిరంతర భగవద్ధ్యాన విమలీకృతాశయుం డగుచు హరిభక్తి ప్రియుండయిన ప్రియవ్రతు చరిత్రంబు లీశ్వరునకుఁ దక్క నన్యుల కెఱుంగఁ దరంబుగా; దతని మహిమంబులు నేఁడునుం గొనియాడుదురని శుకుండు మఱియు నిట్లనియె. | 22 |
| క. |
హరిసేవనాప్రియవ్రతుఁ, డరయఁగఁగైవల్యపదవి నందుట యరుదే? ధరఁజండాలుండైనను, హరినామస్మరణఁజెందు నవ్యయపదమున్. |
23 |
| వ. | అని పలికి శుకుండు మఱియు నిట్లనియె. | 24 |
| మ. |
జనకుండిట్లు విరక్తుఁడైనను దదాజ్ఞంజేసి యాగ్నీధ్రుఁ డే పున ధర్మప్రతిపాలనుండగుచు జంబూద్వీపము న్నేలుచుం దన సత్పుత్త్రులమాడ్కి నెల్ల ప్రజలం దాత్పర్యచిత్తంబునన్ ఘనతంబ్రోచె ననేకకాల మిలఁబ్రఖ్యాతంబుగా భూవరా! |
25 |
| వ. | ఇట్లాగ్నీధ్రుండు రాజ్యంబు సేయుచు, నొక్కనాఁడు పుత్త్రకాముండై మందరాద్రి సమీపంబున నఖిలోపచారంబుల నేకాగ్రచిత్తుండై యర్చించినం, గమలసంభవుండు సంతసిల్లి, తన సమ్ముఖంబున సంగీతంబు సేయు పూర్వచిత్తియను నప్సరోంగనం బంపుటయు, నా యప్సరోంగన చనుదెంచి రమణీయ వివిధ నిబిడ విటపి విటప సమాశ్లిష్ట సమీప సువర్ణ లతికారూఢస్థల విహంగమ మిథునోచ్చార్యమాణ షడ్జాది స్వరంబులచే బోధ్యమాన సలిల కుక్కుట కారండవ బక కలహంసాది విచిత్ర కూజిత సంకులంబు లయిన నిర్మలోదక కమలాకరంబులు గల తదాశ్రమోపవనంబు నందు విహరించుచు విలాస విభ్రమ గతి విశేషంబులం జలనంబు నొందు స్వర్ణ చరణాభరణస్వనం బ న్నరదేవ కుమారుం డాలించి యోగసమాధింజేసి ముకుళితనేత్రుండై యుండి యల్లన కనువిచ్చి చూచి తన సమీపంబున మధుకరాంగనయుంబోలెఁ బుష్పాఘ్రాణంబు సేయుచు దేవమానవుల మనోనయనంబుల కాహ్లాదంబు పుట్టించుచున్న గతి విహార వినయావలోకన సుస్వరావయవంబుల మన్మథ శరపరంపరల నొందించుచు ముఖకమల విగళితామృత సమానహాస భాషణామోద మదాంధంబు లయిన మధుకర మిథునంబుల వంచించి, శీఘ్ర గమనంబునం జలించు కుచకచమేఖలలు గల దేవిం గనుంగొని చిత్తచలనంబు నొంది మన్మథపరవశుండై జడుని చందంబున నిట్లనియె. | 26 |
| క. |
సతి! నీ వెవ్వతె వీ ప, ర్వతమున కేమేనిఁగోరివచ్చిన వన దే వతవో, శారదవో రతి, పతి పంచిన మాయవో, తపస్సారమవో! |
27 |
| ఉ. |
అంగజుఁడెక్కుడించిన శరాసనమున్ ధరియించి యంత నా యంగజు వేఁట మానవమృగావళిఁజూచుచు నున్న దానవో! రంగగు నీ నిజాకృతి తెఱంగెఱుఁగంగ నిజంబు వల్కుమా యంగన నిన్నుఁగన్గొనిన యంత ననంగుఁడు సందడించెడున్. |
28 |
| క. |
పొలుపగుచున్న విలాసం, బుల నంగజు బాణములను బోలెడి నీ చం చల సత్కటాక్షవీక్షణ, ముల నెవ్వని నింతి! చిత్తమునఁగలఁచెదవే! |
29 |
| చ. |
చెదరఁగ వేదముల్ సదువు శిష్యులపైఁ దగఁ బుష్పవృష్టి స మ్మదమున నంతలోఁగురియుమాడ్కిని మన్మథసామగానముల్ సదివెడు శిష్యులో యనఁగ షట్పదపంక్తులు సేరి మ్రోయఁగాఁ బదపడి మీఁద రాలు గచభారమునందుల జాఱు క్రొవ్విరుల్. |
30 |
| క. |
అందియల వెలయు రత్నము, లందంబుగ లలిత పదములన్ సుభగములై యందంద మ్రోయుచును నా, డెందంబునఁ దగిలి సందడించెడిఁ దరుణీ! |
31 |
| క. |
పాయక కదంబ పుష్ప, చ్ఛాయం గల వస్త్రకాంతి సల్లెడుఁగంటే యా యెడ నితంబరోచులు, గాయుచు నెడతెగక తఱిమి కప్పెడుఁదన్వీ! |
32 |
| క. |
నిరతము నీ తనుమధ్యముఁ, గర మరుదుగ నరసి చూడఁగానంబడ, దీ కరికుంభంబులఁబోలెడి, గురుకుచముల నెట్లు నిలుపుకొంటి లతాంగీ! |
33 |
| క. |
పొంకములగు కుచములపైఁ, గుంకుమపంకంబుఁబూసికొని వాసనలం గొంకక వెదచల్లెడు నీ, బింకంబగు చన్నుదోయి పెంపో సొంపో. |
34 |
| శా. |
ఏ లోకంబుననుండి వచ్చితివి? నీ విచ్చోటికిన్ మున్ను నే నే లోకంబునఁ జెప్పఁజూప నెఱుఁగన్ నీ సుందరాకారమున్ నీ లాలిత్యము లీ వినోదములు నీ కిట్లొప్పునే? కామినీ? భూలోకంబున కెట్టు వచ్చితివి నా పుణ్యంబగణ్యంబుగన్? |
35 |
| క. |
హాసావలోకనంబుల, భాసిల్లెడు నీ ముఖంబు పలుమఱు నిపు డే యాసలు పుట్టింపఁగ నే, నాసగొనెద నిన్నుఁజూచి యంబుజనేత్రా! |
36 |
| ఆ. |
కందులేని యిందుకళ మించి నెమ్మోము, కాంతియుక్త మగుచుఁగానుపించెఁ గాన విష్ణుకలయుఁగాఁబోలు నని నా మ, నంబునందుఁదోఁచె నళిననేత్ర! |
37 |
| మ. |
పటుతాటంకరథాంగయుగ్మమునకుంబల్మాఱు భీతిల్లుచున్ నటనంబందెడు గండుమీనములతో నాసన్న నీలాలకో త్కటభృంగావళితో ద్విజావళి లసత్కాంతిన్ విడంబించు మా ఱట కాసారముఁబోలి నెమ్మొగము దా రంజిల్లు నత్యున్నతిన్. |
38 |
| చ. |
కరువలిఁబాయువస్త్రమును గట్ట నెఱుంగవు, చూడ్కి దిక్కులం బఱపుచుఁజంచరీకముల భాతిఁజెలంగెడు కంధరంబునం బొరలెడు ముక్తకేశభరముందుఱుమంగఁదలంప, విప్పు డి ట్లరుదుగ రత్నకందుకవిహారము సల్పెదు సంభ్రమంబునన్. |
39 |
| వ. | మఱియు నిట్లనుఁ దపోధనులగు వారల తపంబులను నీ రూపంబున నపహ్నవించిన దాన, వీ చక్కఁదనం బేమి తపంబున సంపాదించితివి? నా తోడం గూడి తపంబు సేయుము; సంసారంబు వృద్ధిఁ బొందం జేయుము; పద్మాసనుండు నాకుం బ్రత్యక్షంబై నిన్ను నిచ్చిన వాఁడు; గావున నిన్ను విడువంజాలను; నీ సఖీజనంబులు నా వాక్యంబులకు ననుకూలింతురు గాక! నీవు చను చోటికి నన్నుం దోడ్కొని చను మని స్త్రీలకు ననుకూలంబుగాఁ బలుక నేర్చిన యాగ్నీధ్రుండు పెక్కుభంగులం బలికిన నా పూర్వచిత్తియు నతని యనునయ వాక్యంబులకు సమ్మతించి వీర శ్రేష్ఠుండగు నా రాజవర్యుని బుద్ధిరూపశీలౌదార్య విద్యావయశ్శ్రీలచేఁ బరాధీనచిత్త యగుచు జంబూద్వీపాధిపతి యగు నా రాజశ్రేష్ఠునితోడం గూడి శతసహస్ర సంవత్సరంబులు భూస్వర్గభోగంబు లనుభవించె; నంత నాగ్నీధ్రుం డా పూర్వచిత్తివలన నాభి కింపురుష హరివర్షేలావృత రమ్యక హిరణ్మయ కురు భద్రాశ్వ కేతుమాల సంజ్ఞలు గల కుమారులఁ బ్రతిసంవత్సరంబు నొక్కొక్కనిగఁ దొమ్మండ్రం గాంచె; నంత నా పూర్వచిత్తి యా యర్భకుల గృహంబున విడిచి యాగ్నీధ్రుం బాసి బ్రహ్మలోకంబునకుం జనిన నా యాగ్నీధ్రపుత్రులు మాతృసామర్థ్యంబునం జేసి స్వభావంబునన శరీరబలయుక్తు లగుచుఁ దండ్రిచేత ననుజ్ఞాతులై తమ నామంబులఁ బ్రసిద్ధంబు లయిన జంబూద్వీపాది వర్షంబులం బాలించు చుండి; రంత నాగ్నీధ్రుండు నా పూర్వచిత్తి వలనం గామోపభోగంబులం దృప్తి బొందక పూర్వచిత్తిం దలంచుచు వేదోక్తంబులగు కర్మంబులం జేసి తత్సలోకంబగు బ్రహ్మలోకంబునకుం జనియె; నిట్లు దండ్రి పరలోకంబునకుం జనిన నాభిప్రముఖులగు నాగ్నీధ్రకుమారులు దొమ్మండ్రును మేరుదేవియుఁ బ్రతిరూపయు, నుగ్రదంష్ట్రయు, లతయు, రమ్యయు, శ్యామయు, నారియు, భద్రయు, దేవవతియు నను నామంబులు గల మేరు పుత్త్రికలగు తొమ్మండ్రు కన్యకలను వివాహంబై రంత. | 40 |