పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము షష్ఠస్కంధము
శ్రీరస్తు
శ్రీమహాభాగవతము - షష్ఠస్కంధము
ఉపోద్ఘాతము
శా. శ్రీ వత్సాంకితకౌస్తుభస్ఫురితలక్ష్మీచారువక్షస్స్థల
శ్రీవిభ్రాజితు నీలవర్ణు శుభరాజీవాక్షుఁ గంజాత భూ
దేవేంద్రాదిసమస్తదేవమకుటోద్దీప్తోరురత్నప్రభా
వ్యావిద్ధాంఘ్రిసరోజు నచ్యుతుఁ గృపావాసుం బ్రశంసించెదన్‌.
1
ఉ. నిండుమతిం దలంతుఁ గమనీయభుజంగమరాజమండలీ
మండనుఁ జంద్రఖండపరిమండితమస్తకుఁ దారమల్లికా
పాండురవర్ణుఁ జండతరభండను హేమగిరీంద్రచారుకో
దండు మహేశు గంధగజదానవభంజను భక్తరంజనున్‌.
2
ఉ. హంసతురంగముం బరమహంసము నంచితదేవతాకులో
త్తంసము నాగమాంతవిదితధ్రువపుణ్యరమావతంసముం
గంసజిఘాంసునంశమును గర్బురసూత్రసమావృతాంసమున్‌
హింస నడంచు బ్రహ్మము నహీనశుభంబులకై భజించెదన్‌.
3
ఉ. మోదకహస్తునిన్‌ సమదమూషకవాహను నేకదంతు లం
బోదరు నంబికాతనయు నూర్జితపుణ్యు గణేశు దేవతా
హ్లాదగరిష్ఠు దంతిముఖు నంచితభక్తఫలప్రదాయకున్‌
మోదముతోడ హస్తములు మోడ్చి భజించెద నిష్టసిద్ధికిన్‌.
4
ఉ. కల్లతనంబు గాక పొడగట్టిన పూర్వపురీతి నేఁడు నా
యుల్లమునందు నుండుము సమున్నతతేజముతోడ భక్తి రం
జిల్లిన చూపుగూడ విధిఁ జెందిన ప్రోడ బుధాళి నీడ మా
తల్లి దయామతల్లి ప్రణతద్రుమకల్పకవల్లి భారతీ!
5
క. విలసత్కంకణరవరవకలితంబగు నభయవరదకరములు బెరయం
జెలరేఁగి భక్తులకు నల కలుములు దయసేయు జలధికన్యకఁ దలఁతున్‌.
6
క. కాళికి బహుసన్నుతలో కాళికి కమనీయవలయకరకీలిత కం
కాళికిఁ దాపసమానసకేళికి వందనము సేసి కీర్తింతు మదిన్‌.
7
వ. అని యిష్టదేవతాప్రార్థనంబు సేసి. 8
చ. పరమసమాధిధుర్యుఁ బటుపావనకర్మవిధేయదేవతా
వరనరవంద్యు సద్విమలవాక్కు జనార్దనకీర్తనక్రియా
భరణసమర్థు వేదచయపారగు భవ్యుఁ ద్రికాలవేది భా
సురమతిఁ గొల్చు టొప్పు బుధశోభితుఁ బుణ్యుఁ బరాశరాత్మజున్‌.
9
క. వ్యాసుని భగవత్పదసం వాసుని నాగమపురాణవరవిష్ణుకథా
వాసుని నిర్మలకవితాభ్యాసునిపదపద్మయుగము భావింతు మదిన్‌.
10
సీ. వరకవిత్వోద్రేకి వాల్మీకిఁ గొనియాడి భాగవతార్థవైభవముఁ బలుకు
శుకమంజులాలాపు శుకయోగిఁ బ్రార్థించి బాణమయూరులప్రతిభ నొడివి
భాస సౌమిల్లక భారవి మాఘుల ఘనసుధామధురవాక్యములఁ దలఁచి
కాళిదాసుఁ గవీంద్రకల్పవృక్షము గొల్చి నన్నపాచార్యువర్ణనలఁ బొగడి
 
తే. వెలయఁ దిక్కనసోమయాజుల భజించి, యెఱ్ఱనామాత్యు భాస్కరు నిచ్చ నునిచి
సుకవిసోముని నాచనసోము నెఱఁగి, కవిమనోనాథు శ్రీనాథుఘనత మెచ్చి.
11
ఉ. ఎమ్మెలు సెప్పనేల? జగ మెన్నఁగఁ బన్నగరాజశాయికిన్‌
సొమ్ముగ వాక్యసంపదలు సూఱలు చేసినవాని భక్తి లో
నమ్మినవాని భాగవతనైష్ఠికుఁడై తగువానిఁ బేర్మితో
బమ్మెర పోతరాజు కవిపట్టపురాజుఁ దలంచి మ్రొక్కెదన్‌.
12
వ. అని సకలసుకవినికరంబులకు ముకుళితకరకమలుండనై. 13
ఉ. ఎయ్యది కర్మబంధముల నెల్ల హరించు విభూతికారణం
బెయ్యది సన్మునీంద్రులకు నెల్లఁ గవిత్వసమాశ్రయంబు ము
న్నెయ్యది సర్వమంత్రముల నేలిన దెయ్యది మోక్షలక్ష్మి రూ
పెయ్యది దానిఁ బల్కెద సుహృద్యము భాగవతాఖ్యమంత్రమున్‌.
14
వ. అని శ్రీమహాభాగవతపురాణంబునందు షష్ఠస్కంధం బాంధ్రభాష రచియింపం బూని మదీయ కవితామహాలక్ష్మికి నారాయణుండె నాథుఁ డగుటంజేసి యీ కృతి కృష్ణార్పణంబుఁ జేసితి. అది యెట్లనిన, నేను విద్యాభ్యాసంబునం దగిలి కొండుక నై యుండ నొక్కనాఁడు దివంబున. 15
చ. కలితవిశేషవస్త్రములు గట్టి హిమాంబుసుగంధచందనం
బలఁది వినూత్నభూషణము లారయఁ దాల్చి వినోదలీల నిం
పుల మృదుశయ్య నిద్రఁ దగఁ బొందినచోఁ గనుపట్టెఁ బల్మఱుం
గలయఁ దటిద్విలాసములు గట్టిగ నొక్కట నిల్చు పోలికన్‌.
16
సీ. ఉరవడి ప్రాగ్వీథి నుదయించు మార్తాండకోటిబింబచ్ఛాయ గూడినట్లు
హరిహరబ్రహ్మల యాత్మలలో నుబ్బి కరుణ యొక్కట మూర్తి బెరసినట్లు
ఖరకర కర తీవ్రగతినిఁ గరంగుచు హేమాద్రి సోగ పెల్లెగసినట్లు
ఫణిరాజఫణరాజిమణిగణవిస్ఫూర్తి సుషిరంపు వెలిదల చూపినట్లు
 
తే. ఉట్టిపడ్డట్లు కట్టెఱ్ఱ నూఁదినట్లు తేజ మెసఁగంగ నా మ్రోల దివ్యవాణి
పూని సాక్షాత్కరించి సంపూర్ణదృష్టిఁ జూచి యిట్లని పలికె మంజులముగాను.
17
ఉ. ఆటలు పాటలుం జదువు లద్భుతముల్‌ విననొప్పు వాద్యముల్‌
సాటి దలంపరాని బలుసాములు మున్నగు విద్యలెల్ల నీ
కాటలు పాట లయ్యె విను మన్నిటికిన్‌ మెఱుఁగిడ్డ భంగి నా
చాటునఁ జాటుకారపదసాధుకవిత్వముఁ జెప్పు మింపుగన్‌.
18
వ. అని యానతిచ్చు జగన్మాతృ కృపావలోకన సుశ్లోకుండనై యే నొక శ్లోకంబు నా క్షణంబ నొడివితి. అది యెట్టి దనిన. 19
శ్లో. హంసాయ సత్త్వనిలయాయ సదాశ్రయాయ
నారాయణాయ నిఖిలాయ నిరాశ్రయాయ |
సత్సంగ్రహాయ సగుణాయ నిరీశ్వరాయ
సంపూర్ణపుణ్యపతయే హరయే నమ స్తే ||
20
వ. ఈ శ్లోకం బద్దేవి యంగీకరించె. అంత మేలుకాంచి యానందభరితుండ నై నాఁటనుండి, చంద్రానుగత యగు చంద్రికయుం బోలె, నారాయణాంకితం బైన కవిత్వతత్త్వజ్ఞానంబు గోచరం బయ్యె. దానికి ఫలంబుగా గోపికావల్లభుని నుల్లంబున నిడుకొని. 21
ఆ. పలుకఁ గలిగె మొదలు భాగవతార్థంబు భర్త కృష్ణుఁ డాయె భాగ్య మొదవె
నమృతరసము గోర నలరు చింతామణిపాత్ర సంభవించు భంగి నిపుడు.
22
ఆ. భాగవతము తేటపఱుప నెవ్వఁడు సాలు శుకుఁడు దక్క నరునిసఖుఁడు దక్క
బుద్ధిఁ దోఁచినంత బుధులచే విన్నంత భక్తి నిగిడినంత పలుకువాఁడ.
23
ఉ. పుట్టిననాఁటనుండియును బుట్టద యెట్టి యదట్టు నైనఁ జే
పట్టి నుతింపఁ జిత్తము, శుభం బగు మద్వరవాక్యసీమకుం
బట్టము గట్టినాఁడ హరిఁ బాయక తత్కథనామృతంబు నే
నుట్టిపడంగఁ జెప్పుదు బుధోత్తము లానుఁడు శ్రోత్రపద్ధతిన్‌.
24
వ. అని, 25
సీ. శ్రీవత్సగోత్రుండు శివభక్తియుక్తుఁ డాపస్తంబసూత్రుఁ డపారగుణుఁడు
నేర్చూరిశాసనుం డెఱ్ఱన ప్రెగ్గడ పుత్త్రుండు వీరన పుణ్యమూర్తి
కాత్మజుండగు నాదెయామాత్యునకుఁ బోలమాంబకు నందను లమితయశులు
కసువనామాత్యుండు ఘనుఁడు వీరనమంత్రి సింగధీమణియు నంచితగుణాఢ్యు
 
తే. లుద్భవించిరి తేజంబు లూర్జితముగ సొరిది మూర్తిత్రయంబన శుభ్రకీర్తిఁ
బరఁగి రందులఁ గసువనప్రభువునకును ముమ్మడమ్మను సాధ్వి యిమ్ములను వెలసె.
26
ఉ. ఆడదు భర్తమాట కెదురా, డదు వచ్చినవారి వీఁడగా
నాడదు పెక్కుభాష, లెడనాడదు వాకిలి వెళ్ళి, కల్ల మా
టాడదు మిన్నకేని, సుగుణావళి కిందిరగాక సాటి, యే
చేడియ లేదు, చూరికులశేఖరు కస్వయ మమ్ముడమ్మకున్‌.
27
క. ఆ కసువయమంత్రికిఁ బుణ్యాకల్పశుభాంగి ముమ్మడమ్మయు మము న
వ్యాకులచిత్తుల నిరువుర శ్రీకరగుణగణులఁ బుణ్యశీలురఁ గాంచెన్‌.
28
క. అంగజసమలావణ్యశుభాంగులు హరిదివ్యపదయుగాంబుజవిలస
ద్భృంగాయమానచిత్తులు సింగయ తెలగయలు మంత్రిశేఖరు లనఁగన్‌.
29
క. అం దగ్రజుండ శివపూ, జం దనరినవాఁడ విష్ణుచరితామృత ని
ష్యందిపటువాగ్విలాసానందోచితమానసుఁడను నయకోవిదుఁడన్‌.
30
వ. కావునం గృష్ణపాదారవిందసందర్శనాదర్శతలాయమానచిత్తుండనై. 31
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - ShaShTa skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )