| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | షష్ఠస్కంధము |
| వ. | సమర్పితంబుగా నా యొనర్పం బూనిన షష్ఠస్కంధంబునకుం గథా ప్రారంభక్రమం బెట్టిదనిన, హరిచరణస్మరణపరిణామవినోదు లయిన శౌనకాదులకు నిఖిలపురాణేతిహాసనిర్ణయవిఖ్యాతుండైన సూతుం డిట్లనియె. | 37 |
| క. |
శ్రీరమణీరమణకథాపారాయణచిత్తుఁ డగుచుఁ బలికెఁ బరీక్షి ద్భూరమణుఁ డాదరంబున సూరిజనానందసాంద్రు శుకయోగీంద్రున్. |
38 |
| సీ. |
షడ్గుణైశ్వర్యశాశ్వతమూర్తి వైనట్టి మునినాథ! దయతోడ ముక్తిపదము మున్నుగా నే మార్గమును వినిపించితి వారయ నపవర్గ భూరిమహిమఁ గ్రమయోగసంభవబ్రహ్మంబుతోడన యనువొంద నగు నవి వినుతి కెక్క మఱియు సత్త్వరజస్తమఃప్రభావంబులఁ గడిఁదియై యున్నట్టి కర్మచయము |
|
| తే. |
నప్పటప్పటి కణఁగని యట్టి ప్రకృతిఁ, గలుగు పురుషుని భోగార్థఘటన దేహ కారణారంభరూపమార్గంబు మొదలు, మాటిమాటికి నన్నియుఁ దేటపడఁగ. |
39 |
| వ. | మఱియు ననేకపాపలక్షణంబులగు నానావిధనరకంబులును వాని కాద్యంతంబులును, స్వాయంభువ సంబంధియగు మన్వంతరంబును, బ్రియవ్రతోత్తానపాదులవంశంబును, దచ్చరిత్రంబును, ద్వీపవర్ష సముద్రాద్రినద్యుద్యానవనస్పతులును, భూమండలసంస్థానంబును, వానిపరిమాణంబును, జ్యోతిశ్చక్రచలన ప్రకారంబును, విభుండైన పరమేశ్వరుం డెవ్విధంబున నిర్మించె, నా విధం బంతయు నెఱింగించినాఁడవు. ఇప్పుడు. | 40 |
| తే. |
కడిఁది వేదనలకుఁ గారణంబై యుండు గుఱుతు లేని నరకకూపరాశి పాలుగాక నరుఁడు బ్రతికెడు మార్గంబు పరమపుణ్య! తెలియఁ బలుక వయ్య! |
41 |
| వ. | అనినం బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె. | 42 |
| క. |
కట్టా! త్రికరణములచేఁ బుట్టిన దురితముల నపుడు పొలియింపని యా కట్టిఁడి దేహం బుడిగినఁ గొట్టాడును బిట్టు నరకకూపంబులలోన్. |
43 |
| ఉ. |
కావునఁ గాలకింకరవికారముఁ గానకమున్న మృత్యు దు ర్భావన చిత్తమున్ వెడఁగుపాటును జెందకమున్న మేనిలో జీవము వెల్గుచుండి తన చెల్వము దప్పకమున్న మున్నుగాఁ బావనచిత్తుఁడై యఘముఁ బాయుతెఱం గొనరింపఁగాఁ దగున్. |
44 |
| క. |
కాలం బెడగని పాపము మూలముఁ జెఱుపంగవలయు మును రోగములన్ దేలిన దోషము నెఱుఁగుచు వాలాయము దాని నడఁచు వైద్యునిభంగిన్. |
45 |
| సీ. |
అనవుడు నాతని కనియె భూకాంతుండు కనుకలి వినుకలి గలిగినట్టి పాపము దనకు నొప్పనిదని కని చాలఁ బరితప్తుఁ డయ్యుఁ గ్రమ్మఱ నొనర్చు మూఢాత్మునకు దోషమోచనం బెయ్యది యారయ నెఱిఁగింపు మదియుఁగాక కలుష మొక్కొకచోటఁ గావించు నొకచోటఁ గావింపకుండుఁ దత్కర్మమెఱిఁగి |
|
| ఆ. |
యిట్టి జనుఁడు పుణ్య మే రీతిఁ జేసిన, నది ఫలింపనేర దని తలంతు సలిలమందు మేలి మలినంబు వోవంగ గజము గ్రుంకువెట్టుగతియుఁబోలె. |
46 |
| వ. | అనిన శుకుం డిట్లనియె. | 47 |
| క. |
కర్మము కర్మముచేతను నిర్మూలము గాదు తెలియనేరక తా నే కర్మము సేసినఁ ద త్ప్రతికర్మం బొనరింపవలయుఁ గలుషవిదూరా! |
48 |
| క. |
హితము గల కుడుపు మఱి రుగ్వితతులఁ బొడమంగనీని విధమున నతి స ద్వ్రతుఁడైనవాఁడు నిర్మలమతిచే నఘరాశినెల్ల మట్టము సేయున్. |
49 |
| చ. |
తపమున బ్రహ్మచర్యమున దానములన్ శమసద్దమంబులన్ జపముల సత్యశౌచముల సన్నియమాదియమంబులన్ గృపా నిపుణులు ధర్మవర్తనులు నిక్కము హృత్తనువాక్యజంపుఁ బా పపు గుదిఁ ద్రుంతు రగ్ని శతపర్వవనంబుల నేర్చుకైవడిన్. |
50 |
| వ. | అదియునుంగాక. | 51 |
| ఉ. |
కొందఱు పుణ్యవర్తనులు గోపకుమారపదారవిందజా నందమరందపానకలనారతషట్పదచిత్తు లౌచు గో విందపరాయణుల్ విమలవేషులు దోష మడంతు రాత్మలం జెందిన భక్తిచేత రవి చేకొని మంచు నడంచు కైవడిన్. |
52 |
| క. |
మరి భక్తిచేతఁ గొందఱు బరిమార్తురు మొదలు ముట్టఁ బాపంబుల ని ష్ఠురతరకరముల సూర్యుం డరుదుగఁ బెనుమంచుఁ బించ మణఁచినభంగిన్. |
53 |
| క. |
దంతిపురనాథ! విను మొకమంతన మెఱిఁగింతు శమదమంబులు నంహో వంతు శుభవంతుఁ జేయవు కంతునిగురుభక్తి ముక్తిఁ గలిగించుగతిన్. |
54 |
| సీ. |
హరికి నర్థముఁ బ్రాణ మర్పితంబుగ నుండువాని కైవల్య మెవ్వనికి లేదు వనజలోచనుభక్తవరుల సేవించినవాని కైవల్య మెవ్వనికి లేదు వైకుంఠ నిర్మలవ్రతపరుం డై నట్టివాని కైవల్య మెవ్వనికి లేదు సరసిజోదరుకథాశ్రవణలోలుండైనవాని కైవల్య మెవ్వనికి లేదు |
|
| తే. |
లేదు తపముల బ్రహ్మచర్యాది నిరతి, శమదమాదుల సత్యశౌచముల దాన ధర్మసుఖముల సుస్థిరస్థానమైన, వైష్ణవజ్ఞానజనితనిర్వాణపదము. |
55 |
| తే. |
అరయ నెన్నఁడుఁ జేటు లేనట్టి ముక్తివర్త్మ మీ లోకమందు నెవ్వనికిఁ గలదు? సాధులును బుణ్యశీలురు సజ్జనులును హరిపరాయణతత్పరు లగుటఁ గాక. |
56 |
| క. |
అరుదుగ నరహరిభక్తిం బొరయని యా పురుషుసుకృతిపుంజంబులు వే మఱు పుణ్యుఁ జేయనేరవు నరవర! మధుఘటముఁ బెక్కునదులుంబోలెన్. |
57 |
| చ. |
సతతముఁ గృష్ణపాదజలజంబులయందు మనంబు నిల్పు సు వ్రతులు తదీయశుద్ధగుణరాగులు కాలునియుగ్రపాశ సం హతుల ధరించు తత్సుభటకౌఘములంగలలోనఁ గాన రే గతులను దుష్టకర్మములు గైకొని వారలఁ జెందనేర్చునే? |
58 |
| వ. | కావున నీ యర్థంబునకుం బురాతనంబగు నొక్క యితిహాసంబు గలదు. అది విష్ణుదూత యమదూతల సంవాదం బనంబడు, దాని నెఱింగింతు, ఆకర్ణింపుము. | 59 |