| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| వ. | అవ్వా! యవ్విధంబున లక్షణవంతుండు గాని యీశ్వరుండు లక్షితుండై కర్మసంసరణంబున యోగవియోగంబుల నొందు, సంభవ వినాశ శోక వివేకావివేక చింతా స్మరణంబులు వివిధంబు, లీ యర్థంబునకుఁ బెద్దలు ప్రేతబంధు యమసంవాదంబను నితిహాసంబు నుదాహరింతురు, వినుండు చెప్పెద నుశీనర దేశంబునందు సుయజ్ఞుం డను రాజుగలం డతండు శత్రువుల చేత యుద్ధంబున నిహతుండయి యున్నయెడ. | 40 |
| సీ. |
చిరిఁగిన బహురత్న చిత్రవర్మముతోడ రాలిన భూషణరాజితోడ భీకర బాణ నిర్భిన్న వక్షము తోడఁ దఱుచుఁ గాఱెడు శోణితంబుతోడఁ గీర్ణమై జాఱిన కేశబంధము తోడ రయరోషదష్టాధరంబు తోడఁ నిమిషహీనం బైన నేత్రయుగ్మము తోడ భూరజోయుత ముఖాంబుజము తోడఁ |
|
| ఆ. |
దునిసి పడిన దీర్ఘదోర్దండముల తోడ, జీవ రహితుఁడగు నుశీనరేంద్రుఁ జుట్టి బంధుజనులు సొరిది నుండఁగ భయా, క్రాంత లగుచు నతని కాంత లెల్ల. |
41 |
| శా. |
స్రస్తాకంపిత కేశబంధములతో సంఛిన్నహారాళితో హస్తాబ్జంబులు సాఁచి మోఁదుకొనుచున్ హా నాథ! యంచున్ బహు ప్రస్తావోక్తులతోడ నేడ్చిరి వగం బ్రాణేశు పాదాలపై నస్తోక స్తనకుంకుమారుణ వికీర్ణాస్రంబు వర్షించుచున్. |
42 |
| మ. |
అనఘా! నిన్ను నుశీనర ప్రజల కర్థానంద సంధాయిగా మును నిర్మించిన బ్రహ్మ నిర్దయత నున్మూలించెనే వీరికిం దనయశ్రేణికి మాకు దిక్కు గలదే? ధాత్రీశ! నీబోఁటికిం జనునే పాసి చనంగ భ్రాతృజనులన్ సన్మిత్రులం బుత్త్రులన్? |
43 |
| మ. |
జనలోకేశ్వర! నిన్నుఁబాసిన నిమేషంబుల్ మహాబ్దంబులై చను లోకాంతర గామివై మరల కీ చందంబునన్ నీవు వో యిన మే మెట్లు చరింతు? మొల్లము గదా యీ లోకవృత్తంబు నేఁ డనలజ్వాలలఁ జొచ్చి వచ్చెదము నీ యంఘ్రిద్వయిం జూడఁగన్. |
44 |
| వ. | అని యిట్లు రాజభార్య లా రాజశవంబు డగ్గఱి విలపింపఁబ్రొద్దు గ్రుంకెడు సమయంబున వారల విలాపంబులు విని బ్రాహ్మణ బాలకుండై యముండు సనుదెంచి ప్రేత బంధువులం జూచి యిట్లనియె. | 45 |
| ఉ. |
మచ్చిక వీరికెల్ల బహుమాత్రముఁ జోద్యము, దేహి వుట్టుచుం జచ్చుచునుండఁ జూచెదరు, చావక మానెడు వారిభంగి నీ చచ్చిన వాని కేడ్చెదరు? చావున కొల్లక డాఁగవచ్చునే? యెచ్చటఁ బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్. |
46 |
| క. |
జననీ జనకులఁ బాసియు, ఘనవృకముల బాధవడక కడుఁ బిన్నలమై మనియెద, మెవ్వఁడు గర్భం, బున మును పోషించె వాఁడె పోషకుఁ డడవిన్. |
47 |
| క. |
ఎవ్వఁడు సృజించుఁ బ్రాణుల, నెవ్వఁడు రక్షించుఁ ద్రుంచు నెవ్వఁ డనంతుం డెవ్వఁడు విభుఁ డెవ్వఁడు వాఁ, డివ్విధమున మనుచుఁ బెనుచు హేలారతుఁడై. |
48 |
| ఆ. |
ధనము వీథిఁబడిన దైవవశంబున, నుండుఁ బోవు మూలనున్న నైన నడవి రక్షలేని యబలుండు వర్ధిల్లు, రక్షితుండు మందిరమునఁ జచ్చు. |
49 |
| క. |
కలుగును, మఱి లేకుండును, గల భూతములెల్లఁ గాలకర్మవశము లై నిలఁబడుఁ, బ్రకృతిం దద్గుణ, కలితుఁడుగాఁ డాత్మమయుఁ డగమ్యుఁడు దలఁపన్. |
50 |
| సీ. |
పాంచ భౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలోఁ బూర్వ కర్మ వశమున నొకవేళ వర్తించు దీపించుఁ దఱి యైన నొకవేళఁ దలఁగి పోవుఁ, జెడునేని దేహంబు సెడుఁగాని పురుషుండు సెడఁ డాతనికి నింతసేటు లేదు, పురుషునికిని దేహపుంజంబునకు వేఱు గాని యేకత్వంబు గాన రాదు, |
|
| ఆ. |
దారువుల వెలుంగు దహనుని కైవడిఁ, గాయములఁ జరించు గాలి భంగి నాళలీనమైన నభము చాడ్పున వేఱు, దెలియవలయు దేహి దేహములకు. |
51 |
| వ. | అని మఱియు నిట్లనియె. | 52 |
| సీ. |
భూపాలకుఁడు నిద్రవోయెడి నొండేమి? విలపింప నేటికి వెఱ్ఱులార! యెవ్వఁడు భాషించు నెవ్వఁ డాకర్ణించు నట్టివాఁ డెన్నఁడో యరిగినాఁడు, ప్రాణభూతుండైన పవనుఁ డాకర్ణింప భాషింప నేరఁడు ప్రాణి దేహ ములకు వేఱై తాను ముఖ్యుఁడై యింద్రియవంతుఁడై జీవుండు వలను మెఱయఁ |
|
| ఆ. |
బ్రాభవమున భూత పంచకేంద్రియమనో, లింగదేహములను లీలఁ గూడు, విడుచు నన్యుఁ డొకఁడు విభుఁడు దీనికి మీరు, వొగులనేల? వగలఁ బొరల నేల? |
53 |
| క. |
ఎందాఁక నాత్మదేహము, నొందెడు నందాఁకఁ గర్మయోగము లటపైఁ జెందవు, మాయాయోగ, స్పందితులై రిత్త జాలిఁబడ నేమిటికిన్? |
54 |
| మ. |
చెలులుం దల్లులుఁ దండ్రు లాత్మజులు సంసేవ్యుల్ సతుల్ చారు ని ర్మలగేహంబు లటంచుఁ గూర్తురు, మహామాయాగుణభ్రాంతులై కలలోఁ దోఁచిన యర్థముల్ నిజములే? కర్మానుబంధంబులం గలుగున్ సంగము, లేక మానుఁ బిదపం గర్మాంత కాలంబునన్. |
55 |
| వ. | మఱియు మాయాగుణప్రపంచంబు నెఱింగెడు తత్త్వజ్ఞులు నిత్యానిత్యంబులం గూర్చి సుఖ దుఃఖంబులం జెంద, రజ్ఞులు గొందఱు యోగవియోగంబులకు సుఖదుఃఖంబుల నొందుదురు, తొల్లి యొక్క మహాగహనంబున విహంగంబులకు నంతకభూతుండైన యెఱుకగలఁ డతం డొక్కనాఁడు ప్రభాతంబున లేచి వాటంబైన వేఁట తమకంబున | 56 |
| క. |
వల లురులు జిగురుఁ గండెలుఁ, జలిదియుఁ జిక్కంబు ధనువు శరములు గొనుచుం బులుఁగులఁ బట్టెడు వేఁడుక, నలుగులు వెడలంగఁ గదలి యడవికిఁ జనియెన్. |
57 |
| వ. | ఇట్లడవికిం జని తత్ప్రదేశంబునందు. | 58 |
| క. |
కట్టలుకఁ దడుకు చాటునఁ, బిట్టల నురిగోలఁ దిగిచి బిఱుసున ఱెక్కల్ వట్టి విఱిచి చిక్కములో, బెట్టుచు విహరించె లోకభీకరలీలన్. |
59 |
| వ. | మఱియు నానావిధంబులగు శకుంతంబుల నంతంబు నొందించుచు సకల పక్షి సంహార సంరబ్ధకుండైన లుబ్ధకుండు తన ముందటఁ గాలచోదితంబై సంచరించుచున్న కుళింగపక్షి మిథునంబుల గనుంగొని యందుఁ గుళింగి నురిం దిగిచి యొక్క చిక్కంబులో వైచినం జూచి దుఃఖించి కుళింగపక్షి యిట్లనియె. | 60 |
| చ. |
అడవుల మేఁత మేసి మన మన్యుల కెన్నఁడు నెగ్గు సేయ కి క్కడ విహరింప నేఁడకట! కట్టిఁడి బ్రహ్మ కిరాతు చేతిలోఁ బడుమని వ్రాసెనే నుదుటఁ? బాపపు దైవము కంటికింత యె క్కుడు బరువయ్యెనే బ్రదుకు? కోమలి! యే మన నేర్తుఁ జెల్లరే! |
61 |
| క. |
ఒక మాటు మనల నందఱఁ, బ్రకటించి కిరాతు వలలఁ బడఁ జేయక ని న్నొకటిన్ వలఁ బడఁ జేసిన, వికటీకృత దక్షమైన విధి నే మందున్? |
62 |
| ఉ. |
ఱెక్కలు రావు పిల్లలకు, ఱేపట నుండియు మేఁత గానమిం బొక్కుచుఁ గూఁటిలో నెగసి పోవఁగ నేరవు, మున్ను తల్లి యీ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి న ల్దిక్కులుఁ జూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా! |
63 |
| వ. | అని ఇవ్విధంబున. | 64 |
| క. |
కుంఠితనాదము తోడను, గంఠము శోషింప వగచు ఖగమును హననో త్కంఠుండైన కిరాతుఁ డ, కుంఠిత గతి నేసె నొక్క కోలం గూలన్. |
65 |
| క. |
కాలము వచ్చిన శబరుని, కోలను ధరఁ గూలె ఖగము ఘోషము తోడం గాలము డాసిన నేలం, గూలక పో వశమె యెట్టి గుణవంతులకున్? |
66 |
| ఉ. |
కావున మీరు చచ్చుతఱిఁ గానరు, చచ్చి ధరిత్రిఁ బడ్డ ధా త్రీవిభు దేహముం గదిసి దీనత నేడువ నేల? పొండు, చిం తావతులార! వత్సరశతంబులకైన నిజేశు చక్కికిం బోవుట దుర్లభంబు, మృతిఁ బొందిన వారలు చేరవత్తురే? |
67 |
| వ. | అని యిట్లు కపట బాలకుండై క్రీడించుచున్న యముని యుపలాల నాలాపంబులు విని సుయజ్ఞుని బంధువులెల్ల వెఱఁగుపడి సర్వప్రపంచంబు నిత్యంబు గాదని తలంచి శోకింపక సుయజ్ఞునికి సాంపరాయిక కృత్యంబులు సేసి చని, రంత నంతకుం డంతర్హితుం డయ్యెనని చెప్పి హిరణ్యకశిపుండు దన తల్లిని, దమ్మునిభార్యలంజూచి యిట్లనియె. | 68 |
| క. |
పరు లెవ్వరు? దా మెవ్వరు?, పరికింపఁగ నేక మగుట భావింపరు, త త్పరమజ్ఞానము లేమిని, బరులును నే మనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్లన్. |
69 |
| వ. | అని తెలియం బలికిన హిరణ్యకశిపుని వచనంబులు విని దితి కోడండ్రునుం దానును శోకంబు మాని తత్త్వవిలోకనంబు గలిగి లోకాంతరగతుండైన కొడుకునకు వగవక చనియె నని చెప్పి నారదుండు ధర్మనందనున కిట్లనియె. | 70 |
| క. |
అజరామర భావంబును, ద్రిజగద్రాజ్యంబు నప్రతిద్వంద్వము దో ర్విజితాఖిల శాత్రవమును, గజరిపు బలమును హిరణ్యకశిపుఁడు గోరెన్. |
71 |
| వ. | ఇట్లు గోరి మందరాచలద్రోణికిం జని యందుఁ గాలి పెను వ్రేల నేల నిలువంబడి యూర్ధ్వ బాహుండయి మిన్ను సూచుచు వాఁడి మయూఖంబులతోడి ప్రళయకాల భానుండునుం బోలె దీర్ఘ జటారుణ ప్రభా జాలంబులతోడ నెవ్వరికిం దేఱిచూడరాక పరమ దారుణంబైన తపంబు సేయుచుండె, నిర్జరులు నిజస్థానంబుల నుండి, రంత | 72 |
| మ. |
అదరెం గుంభిని సాద్రియై, కలఁగె నేడంభోనిధుల్, తారకల్ సెదరెన్, సగ్రహసంఘలై దిశలు విచ్ఛిన్నాంతలై మండెఁ, బె ల్లదరెన్ గుండెలు జంతుసంహతికి, నుగ్రాచారదైత్యేంద్ర మూ ర్ధ దిశోద్ధూత సధూమ హేతిపటలోదంచత్తపోవహ్నిచేన్. |
73 |
| వ. | ఇట్లు త్రైలోక్య సంతాపకరంబైన దైత్యరాజ తపో విజృంభణంబు సైరింపక నిలింపులు నాకంబు విడిచి బ్రహ్మలోకంబునకుం జని లోకేశ్వరుండయిన బ్రహ్మకు వినతులయి యిట్లని విన్నవించిరి. | 74 |
| క. |
దితికొడుకు తపము వేఁడిమి, నతితప్తుల మైతి, మింక నలజడి నమరా వతి నుండ వెఱతు, మె య్యది, గతి మాకును? దేవదేవ! కారుణ్యనిధీ! |
75 |
| శా. |
శంకా లేశము లేదు, దేవ! త్రిజగ త్సంహారమున్ దేవతా సంకోచంబును వేదశాస్త్ర పదవీ సంక్షేపమున్ లేక యే వంకన్ లేవ నటంచు దుస్సహ తపోవ్యావృత్తి చిత్తంబులో సంకల్పించె నిశాచరుండు, ప్రతిసంస్కారంబు చింతింపవే. |
76 |
| శా. |
నీ వే రీతిఁ దపోబలంబున జగ న్నిర్మాణముం జేసి యీ దేవాధీశులకంటె నెక్కుడు సిరిం దీపించి, తిబ్భంగిఁ దా నీ విశ్వంబుఁ దపస్సమాధి మహిమన్ హింసించి వే ఱొక్క వి శ్వావిర్భావకరత్వశక్తి మదిలో నర్థించినాఁ డీశ్వరా! |
77 |
| వ. | అదియునుం గాక కాలాత్మకులగు జీవాత్ముల కనిత్యత్వంబు గలుగుటం జేసి తపోయోగ సమాధిబలంబునం దనకు నిత్యత్వంబు సంపాదింతు నని తలంచి నాఁడని మఱియు నిట్లనిరి. | 78 |
| మ. |
భవదీయం బగు నున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సం స్తవనీయంబగు భూతియున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్ భువనశ్రేణికి నిచ్చు దైత్యుని తపస్స్ఫూర్తిన్ నివారించి యో భువనాధీశ్వర! కావవే భువనముల్ పూర్ణప్రసాదంబునన్. |
79 |