| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| వ. | అని దేవతలు విన్నవించిన స్వయంభూతుండును, భగవంతుండు నైన నలుమొగంబుల వేల్పుప్రోడ భృగు దక్షాదులతోడ మందర పర్వతంబునకు వచ్చి యందు నియమ యుక్తుండును, బిపీలికావృత మేదో మాంసచర్మరక్తుండును, వల్మీకతృణ వేణుపటల పరిచ్ఛన్నుండును, మహాతపః ప్రభావ సంపన్నుండునునై నీరంధ్ర నిబిడ నీరద నికర నివిష్ట నీరజబంధుండునుం బోలె నివసించియున్న నిర్జరారాతిం జూచి, వెఱఁగుపడి నగుచు నిట్లనియె. | 80 |
| మత్తకోకిలము. |
ఓ సురారి కులేంద్ర! నీ క్రియ నుగ్రమైన తపంబు మున్ చేసి చూపినవారు లే రిఁకఁ జేయువారును లేరు, నే నీ సమాధికి మెచ్చితిన్, విను, నీ యభీష్టము లిత్తు, నా యాస మేటికి? లెమ్ము లెమ్ము మహాత్మ! కోరుము కోరికల్. |
81 |
| శా. |
దంశవ్రాతములుం బిపీలికలు మేదఃక్రవ్యరక్తంబులన్ సంశీర్ణంబులు సేసి పట్టి తినఁగా శల్యావశిష్టుండవై వంశచ్ఛన్న తృణావళీయుత మహావల్మీకమం దింద్రియ భ్రంశం బింతయు లేక నీకు నిలువం బ్రాణంబు లెట్లుండెనో? |
82 |
| ఉ. |
ఉత్సుకతన్ జలాన్నముల నొల్లక యీ క్రియ నూఱు దివ్య సం వత్సరముల్ శరీరమున వాయువులన్ నిలుపంగ వచ్చునే? యుత్సవ మయ్యె మాకు, మము నుగ్రతపంబున గెల్చి తీవు, నే వత్సలతన్ నినుం గదియ వచ్చితిఁ, గోరిక లెల్ల నిచ్చెదన్. |
83 |
| వ. | అని పలికి వనమక్షికా పిపీలికా భక్షితంబైన రక్షోవిభుని దేహంబు మీఁదం గమండలుజలంబులు ప్రోక్షించిన నద్దానవేంద్రుండు కమలాసన కరకమల కమనీయ కనకమయ దివ్యామోఘ కమండలు నిర్గతనిర్మల నీరధారా బిందుసందోహ సంసిక్త సకలాంగుండయి, తపంబు సాలించి, సాంద్ర కీచక సంఘాత సంఛాదిత వామలూరు మధ్యంబు వెలువడి, మహా ప్రభావబల సౌందర్య తారుణ్య సహితుండును వజ్రసంకాశ దేహుండును దప్తసువర్ణ వర్ణుండునునై నీరసేంధన నికరనిర్గత వహ్నియునుం బోలె వెలుంగుచుం జనుదెంచి. | 84 |
| మ. |
దివిజానీకవిరోధి మ్రొక్కెఁ గని వాగ్దేవీమనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమత్సంత్రాతకున్ సత్తపో నివహాభీష్ట వరప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాతకున్. |
85 |
| వ. | ఇట్లు దైత్యేశ్వరుండు దివినున్న హంసవాహనునకు ధరణీ తలంబున దండ ప్రణామంబు లాచరించి సంతోష బాష్పసలిల సంవర్ధిత పులకాంకురుండై యంజలి సేసి కంజగర్భుని మీఁద దృష్టి యిడి గద్గదస్వరంబున నిట్లని వినుతించె. | 86 |
| సీ. |
కల్పాంతమున నంధకార సంవృతమైన జగము నెవ్వఁడు దన సంప్రకాశ మున వెలిఁగించుచు, మూఁడుభంగుల రజ స్సత్త్వ తమోగుణసహితుఁ డగుచుఁ గల్పించు రక్షించుఁ గడపటఁ బ్రహరించు, నెవ్వఁ డాద్యుఁడు సర్వహేతు వగుచు శోభితుండై స్వయంజ్యోతియై యొక్కట విలసిల్లు నెవ్వఁడు విభుత మెఱసి |
|
| ఆ. |
సమయ మయిన మానసప్రాణ బుద్ధీంద్రి, యములతోడ నెవ్వఁ డలఘుమహిమ నడరు, నట్టి సచ్చిదానంద మయునకు, మహిత భక్తి నే నమస్కరింతు. |
87 |
| వ. | దేవా! నీవు ముఖ్యప్రాణం బగుటంజేసి ప్రజాపతివి, మనోబుద్ధి చిత్తేంద్రియంబులకు నధీశ్వరుండవు, మహాభూతగణంబులకు నాధార భూతుండవు, త్రయీతనువునం గ్రతువులు విస్తరింతువు, సకల విద్యలు నీతనువు, సర్వార్థ సాధకులకు సాధనీయుండ, వాత్మనిష్ఠాగరిష్ఠులకు ధ్యేయంబగు నాత్మవు, కాలమయుండవై జనులకు నాయుర్నాశంబు సేయుదువు, జ్ఞాన విజ్ఞానమూర్తి, వాద్యంత రహితుండ, వంతరాత్మవు, మూఁడు మూర్తులకు మూలంబగు పరమాత్మవు, జీవలోకంబునకు జీవాత్మవు, సర్వంబును నీవ, నీవు గానిది లేశంబును లేదు, వ్యక్తుండవు గాక పరమాత్మవై పురాణపురుషుండవై యనంతుండ వైన నీవు ప్రాణేంద్రియ మనోబుద్ధి గుణంబుల నంగీకరించి పరమేష్ఠిపద విశేషంబున నిలిచి స్థూలశరీరంబునం జేసి యింతయుం బ్రపంచింతువు, భగవంతుండవైన నీకు మ్రొక్కెద నని మఱియు నిట్లనియె. | 88 |
| క. |
కోరిన వారల కోర్కులు, నేరుపుతో నిచ్చి మనుప నీ క్రియ నన్యుల్ నేరరు కరుణాకర! నేఁ, గోరెద, నీ విచ్చెదేనిఁ గోరిక లభవా! |
89 |
| శా. |
గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం దమఃప్రభల భూరిగ్రాహ రక్షోమృగ వ్యాళాదిత్య నరాదిజంతుకలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శ స్త్రాళిన్ మృత్యువు లేని జీవనము లోకాధీశ! యిప్పింపవే. |
90 |
| వ. | అని మఱియు రణంబులందుఁ దన కెదురులేని శౌర్యంబును లోకపాలుర నతిక్రమించు మహిమయును భువనత్రయ జయంబును హిరణ్యకశిపుండు గోరిన నతని తపంబునకు సంతోషించి దుర్లభంబు లయిన వరంబు లన్నియు నిచ్చి కరుణించి విరించి యిట్లనియె. | 91 |
| శా. |
అన్నా! కశ్యపపుత్ర! దుర్లభము లీ యర్థంబు లెవ్వారికిన్, ము న్నెవ్వారలుఁ గోర రీవరములన్, మోదించితిన్ నీ యెడన్ నన్నుం గోరిన వెల్ల నిచ్చితిఁ బ్రవీణత్వంబుతో బుద్ధి సం పన్నత్వంబున నుండు మీ సుమతివై భద్రైక శీలుండవై. |
92 |
| వ. | అని యి ట్లమోఘంబు లయిన వరంబు లిచ్చి దితినందనుచేతం బూజితుండై యరవింద సంభ వుండు బృందారక సందోహవంద్య మానుం డగుచు నిజమందిరంబునకుం జనియె, నివ్విధంబున నిలింపారాతి వరపరంపరలు సంపాదించుకొని. | 93 |
| క. |
సోదరుఁ జంపిన పగకై, యాదర మించుకయు లేక యసురేంద్రుఁడు కం జోదరుపై వైరము దు, ర్మాద రతుం డగుచుఁ జేసె మనుజాధీశా! |
94 |
| సీ. |
ఒకనాఁడు గంధర్వ యూథంబుఁ బరిమార్చు దివిజుల నొకనాఁడు దెరలఁదోలు, భుజగుల నొకనాఁడు భోగంబులకుఁ బాపు గ్రహముల నొకనాఁడు గట్టివైచు, నొకనాఁడు యక్షుల నుగ్రత దండించు, నొకనాఁడు విహగుల నొడిసిపట్టు నొకనాఁడు సిద్ధుల నోడించి బంధించు, మనుజుల నొకనాఁడు మద మడంచుఁ |
|
| తే. |
గడిమి నొకనాఁడు కిన్నర ఖచర సాధ్య, చారణ ప్రేత భూత పిశాచ వన్య సత్త్వ విద్యాధరాదుల సంహరించు, దితితనూజుండు దుస్సహతేజుఁ డగుచు. |
95 |
| క. |
అట్టళ్లతోడఁ గోటలఁ, గట్టలుకం గూలఁ ద్రోచి క్రవ్యాదులతోఁ జుట్టు విడిసి దిక్పాలుర, పట్టణములు గొనియె నతఁడు బలమున నధిపా! |
96 |
| క. |
కృశలై సంప్రాపిత దు, ర్దశలై సర్వంకషోగ్ర దైతేయాజ్ఞా వశలై నిశలును, దివములు, దిశ లెల్లను గట్టువడియె దీనత ననఘా! |
97 |
| వ. | మఱియు న ద్దానవేంద్రుండు విద్రుమ సోపానంబులును, మరకత మణిమయ ప్రదేశంబులును వైదూర్యరత్న స్తంభ సముదయంబులును, జంద్రికాసన్నిభ స్ఫటిక సంఘటిత కుడ్యంబులును, బద్మరాగ పీఠ కనక కవాట గేహళీ విటంక వాతాయనంబులును, విలంబమాన ముక్తా ఫలదామ వితానశోభిత ధవళ పర్యంకంబులును, వివిధ విచిత్ర విమానంబులును, నిరంతర సురభి కుసుమ ఫల భరిత పాదప మహోద్యానంబులును, హేమారవింద సౌగంధిక బంధుర సరోవరంబులును, రమణీయ రత్న ప్రాసాదవిశేషంబులును, మనోహర పరిమళశీతల మందమారుతంబులును, మృదుమధుర నినద కీరకోకిలకుల కోలాహలంబులును గలిగి విశ్వకర్మ నిర్మితంబై త్రైలోక్యరాజ్యలక్ష్మీ శోభితంబైన మహేంద్ర భవనంబు సొచ్చి. | 98 |
| మ. |
దితిపుత్త్రుండు జగత్త్రయైకవిభుఁడై దేవేంద్ర సింహాసనో ద్ధతుఁడై యుండ హరాచ్యుతాంబుజభవుల్ దప్పంగ భీతిన్ సమా గతులై తక్కిన యక్ష కిన్నరమరుద్గంధర్వ సిద్ధాదు లా నతులై కానిక లిచ్చి కొల్తు రతనిన్ నానా ప్రకారంబులన్. |
99 |
| శా. |
ఏ దిక్పాలురఁ జూచి నేఁ డలుగునో యే దేవు బంధించునో యే దిగ్భాగముమీఁద దాడి చనునో యే ప్రాణులం జంపునో యీ దైత్యేశ్వరుఁ డంచు నొండొరులు దారింద్రాదు లాస్థాన భూ వేదిన్ మెల్లన నిక్కి చూతురు భయావిర్భూత రోమాంచులై. |
100 |
| సీ. |
కోలాహలము మాని కొలువుఁడీ సురలార! తలఁగి దీవింపుఁడీ తపసులార! ఫణు లెత్తకుఁడు నిక్కి పన్నగేంద్రములార! ప్రణతులై చనుఁడి దిక్పాలులార! గానంబు సేయుఁడీ గంధర్వవరులార! సందడిఁ బడకుఁడీ సాధ్యులార! యాడుఁడీ నృత్యంబు లప్సరోజనులార! చేరిక మ్రొక్కుఁడీ సిద్ధులార! |
|
| తే. |
శుద్ధకర్పూర వాసిత సురభి మధుర, భవ్య నూతన మైరేయ పానజనిత సుఖవిలీనత నమరారి సొక్కినాఁడు, శాంతి లేదండ్రు నిచ్చలుఁ జారు లధిప! |
101 |
| శా. |
లీలోద్యాన లతానివాసములలో లీలావతీయుక్తుఁడై హాలాపాన వివర్ధమాన మద లోలావృత్త తామ్రాక్షుఁడై కేళిం దేలఁగ నేనుఁ దుంబురుఁడు సంగీత ప్రసంగంబులన్ వాలాయంబుఁ గరంగఁ జేయుదుము దేవద్వేషి నుర్వీశ్వరా! |
102 |
| క. |
యాగములు బుధులు ధరణీ, భాగములం జేయుచుండఁ బఱతెంచి హవి ర్భాగములు దాన కై కొనుఁ, జాగింపఁడు దైత్యుఁ డమరసంఘంబునకున్. |
103 |
| సీ. |
సకల మహాద్వీప సహిత విశ్వంభరా స్థలిని దున్నక పండు సస్యచయము, కామధేన్వాదుల కరణి నర్థులు గోరు కోర్కులు గగనంబు గురియుచుండు, వననిధు లేడును వాహినీ సందోహములును వీచుల రత్నములు వహించు, నుర్వీరుహంబులు నొక్క కాలంబున నఖిలర్తు గుణముల నతిశయిల్లు, |
|
| తే. |
నంబు సంపూరిత ద్రోణు లగుచు నొప్పుఁ, బర్వతంబులు సర్వదిక్పాల వివిధ గుణము లెల్లను దానె కైకొనుచు దైత్య, విభుఁడు త్రైలోక్యరాజ్య సంవృద్ధి నుండ. |
104 |
| వ. | ఇట్లు సకల దిక్కులు నిర్జించి, లోకైకనాయకుండై, తన యిచ్ఛాప్రకారంబున నింద్రియసుఖంబు లనుభవించుచుం, దనియక శాస్త్రమార్గంబు నతిక్రమించి, విరించి వరజనిత దుర్వార గర్వాతిరేకంబున సుపర్వారాతి యైశ్వర్యవంతుండై పెద్ద కాలంబు రాజ్యంబు సేయునెడ. | 105 |
| ఉ. |
ఎన్నఁడు మాకు దిక్కుగల? దెన్నఁడు దైత్యుని బాధ మాను? మే మెన్నఁడు వృద్ధిఁ బొందఁగల? మెవ్వరు రక్షకు లంచు దేవతా కిన్నర సిద్ధ సాధ్య ముని ఖేచర నాయకు లాశ్రయించి రా పన్నగతల్పు భూరి భవబంధవిమోచనుఁ బద్మలోచనున్. |
106 |
| వ. | ఇట్లు దానవేంద్రుని యుగ్రదండంబునకు వెఱచి యనన్య శరణులై రహస్యంబున నందఱుం గూడికొని. | 107 |
| ఉ. |
ఎక్కడ నున్న వాఁడు జగదీశ్వరుఁ? డాత్మమయుండు మాధవుం డెక్కడి కేఁగె శాంతులు మునీశులు భిక్షులు రారు క్రమ్మఱం దిక్కులనెల్ల నెక్కుడు తుదిం జొర దిక్కగు నట్టి దిక్కుకై మ్రొక్కెద మేము హస్తయుగముల్ ముకుళించి మదీయ రక్షకున్. |
108 |
| వ. | అని మఱియు నాహారనిద్రలు మాని, చిత్తంబులు పరాయత్తంబులు గానీక సమాహిత బుద్ధులై భగవంతుండును, మహాపురుషుండును, మహాత్ముండును, విశుద్ధ జ్ఞానానంద మయుండును నైన హృషీకేశునకు నమస్కరించుచున్న యెడ, మేఘరవసమాన గంభీర నినదంబున దిశలు మ్రోయించుచు సాధులకు నభయంబు గావించుచు, దృశ్యమానుండు గాక పరమేశ్వరుండైన హరి యిట్లనియె. | 109 |
| మ. |
భయముం జెందకుఁడయ్య నిర్జరవరుల్! భద్రంబు మీ కయ్యెడున్, జయముం లాభము భూతసంతతికి మత్సందర్శన ప్రాప్తి న వ్యయమై చేరు, నెఱుంగుదున్ దితిసుత వ్యాపార భాషా విప ర్యయముల్, కాలము గూడఁ జంపెదఁ, జనుం డందాఁక మీ త్రోవలన్. |
110 |
| ఆ. |
శుద్ధ సాధులందు సురలందు శ్రుతులందు, గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందుఁ దగిలి నా యందు వాఁ, డెన్నఁ డలుగు నాఁడె హింస నొందు. |
111 |
| క. |
కన్నకొడుకు శమ దమ సం, పన్నుఁడు నిర్వైరుఁ డనక ప్రహ్లాదుని వాఁ డెన్నఁడు రోషంబున నా, పన్నత నొందించు నాఁడె పట్టి వధింతున్. |
112 |
| శా. |
వేధోదత్తవర ప్రసాద గరిమన్ వీఁ డింతవాఁడై మిమున్ బాధం బెట్టుచు నున్నవాఁడని మదిన్ భావింతు, భావించి నే సాధింపం దఱిగాదు, కావునఁ గడున్ సైరించితిన్, మీఁదటన్ సాధింతున్ సురలార! నేఁడు చనుఁడా శంకింప మీ కేటికిన్? |
113 |
| వ. | అని యిట్లు దనుజమర్దనుండు నిర్దేశించిన, నిలింపులు గుంపులు గొని మ్రొక్కి రక్కసుండు మ్రగ్గుట నిక్కం బని తమ తమ దిక్కులకుం జనిరి. హిరణ్యకశిపునకు విచిత్ర చరిత్రులు నలువురు పుత్రు లుద్భవించి రందు. | 114 |