| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| సీ. |
తనయందు నఖిలభూతములందు నొకభంగి సమహితత్వంబున జరగువాఁడు పెద్దలఁ బొడగన్న భృత్యుని కైవడిఁ జేరి నమస్కృతుల్ సేయువాఁడు కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన మాతృభావన సేసి మరలువాఁడు తల్లిదండ్రులభంగి ధర్మవత్సలతను దీనులఁ గావఁ జింతించువాఁడు |
|
| తే. |
సఖులయెడ సోదరస్థితి జరుపువాఁడు, దైవతములంచు గురువులఁ దలఁచువాఁడు లీలలందును బొంకులు లేనివాఁడు, లలిత మర్యాదుఁడైన ప్రహ్లాదుఁ డధిప |
115 |
| వ. | మఱియును. | 116 |
| సీ. |
ఆకారజన్మ విద్యార్థవరిష్ఠుఁడై గర్వసంస్తంభ సంగతుఁడు గాఁడు, వివిధమహానేక విషయసంపన్నుఁడై పంచేంద్రియములచేఁ బట్టువడఁడు, భవ్యవయోబల ప్రాభవోపేతుఁడై కామరోషాదులఁ గ్రందుకొనఁడు, కామినీ ప్రముఖ భోగము లెన్ని గలిగిన వ్యసనసంసక్తి నా వంకఁబోఁడు, |
|
| ఆ. |
విశ్వమందుఁ గన్న విన్న యర్థములందు, వస్తుదృష్టిఁ జేసి వాంఛ యిడఁడు, ధరణినాథ! దైత్య తనయుండు హరి పర తంత్రుఁడై హతాన్యతంత్రుఁ డగుచు. |
117 |
| ఆ. |
సద్గుణంబు లెల్ల సంఘంబులై వచ్చి, యసుర రాజతనయునందు నిలిచి పాసి చనవు విష్ణుఁ బాయని విధమున, నేఁడుఁ దగిలి యుండు నిర్మలాత్మ! |
118 |
| మ. |
పగవారైన సురేంద్రులున్ సభలలోఁ బ్రహ్లాద సంకాశులన్ సుగుణోపేతుల నెందు మే మెఱుఁగ మంచున్ వృత్తబంధంబులన్ బొగడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ! మీబోఁటి స ద్భగవద్భక్తులు దైత్యరాజ తనయున్ బాటించి కీర్తింపరే! |
119 |
| క. |
గుణనిధి యగు ప్రహ్లాదుని, గుణము లనేకములు గలవు గురుకాలమునన్ గణుతింప నశక్యంబులు, ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్. |
120 |
| వ. | ఇట్లు సద్గుణ గరిష్ఠుండయిన ప్రహ్లాదుండు భగవంతుండయిన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై. | 121 |
| సీ. |
శ్రీవల్లభుఁడు దన్నుఁ జేరిన యట్లైనఁ జెలికాండ్ర నెవ్వరిఁ జేర మఱచు, నసురారి దనమ్రోల నాడినయట్లైన నసుర బాలురతోడ నాడ మఱచు, భక్తవత్సలుఁడు సంభాషించి నట్లైనఁ బరభాషలకు మాఱుపలుక మఱచు, సురవంద్యుఁ దనలోనఁ జూచిన యట్లైనఁ జొక్కి సమస్తంబుఁ జూడ మఱచు, |
|
| తే. |
హరిపదాంభోజయుగ చింతనామృతమున, నంతరంగంబు నిండినట్లైన నతఁడు నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి, జడత లేకయు నుండును జడుని భంగి. |
122 |
| శా. |
పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాస లీ లా నిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సం ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డేతద్విశ్వమున్ భూవరా! |
123 |
| సీ. |
వైకుంఠ చింతా వివర్జిత చేష్టుఁడై యొక్కఁడు నేడుచు నొక్కచోట, నశ్రాంతహరిభావనారూఢ చిత్తుఁడై యుద్ధతుఁడై పాడు నొక్కచోట, విష్ణుఁ డింతియ కాని వేఱొండు లే దని యొత్తిలి నగుచుండు నొక్కచోట, నలినాక్షుఁ డనునిధానముఁ గంటి నే నని యుబ్బి గంతులువైచు నొక్కచోటఁ, |
|
| ఆ. |
బలుకు నొక్కచోటఁ బరమేశుఁ గేశవుఁ, బ్రణయహర్షజనితబాష్పసలిల మిళితపులకుఁడై నిమీలితనేత్రుఁడై, యొక్కచోట నిలిచి యూరకుండు. |
124 |
| వ. | ఇట్లు పూర్వజన్మ పరమభాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున నఖర్వ నిర్వాణ భావంబు విస్తరించుచు, నప్పటికి దుర్జనసంసర్గ నిమిత్తంబునం దన చిత్తం బన్యాయత్తంబు గానీక నిజాయత్తంబు సేయుచు, నప్రమత్తుండును, సంసార నివృత్తుండును, బుధజన విధేయుండును, మహాభాగధేయుండును, సుగుణమణిగణగరిష్ఠుండునుఁ, బరమ భాగవత శ్రేష్ఠుండునుఁ, గర్మబంధ లతాలవిత్రుండునుఁ, బవిత్రుండునునైన పుత్రుని యందు విరోధించి, సురవిరోధి యనుకంప లేక చంపం బంపె నని పలికిన నారదునకు ధర్మజుం డిట్లనియె. | 125 |
| శా. |
పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్ మిత్రత్వంబున బుద్ధి సెప్పి దురితోన్మేషంబు వారింతు రే శత్రుత్వంబుఁ దలంప, రిట్టియెడ నా సౌజన్యరత్నాకరుం బుత్రున్ లోకపవిత్రుఁ దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో? |
126 |
| ఉ. |
బాలుఁ బ్రభావిశాలు హరిపాదపయోరుహ చింతన క్రియా లోలుఁ గృపాళు సాధు గురు లోక పదానతఫాలు నిర్మల శ్రీలు సమస్త సభ్య నుతశీలు విఖండిత మోహవల్లి కా జాలు నదేల తండ్రి వడిఁ జంపఁగ బంపె? మునీంద్ర! సెప్పవే? |
127 |
| వ. | అనిన నారదుం డిట్లనియె. | 128 |
| శా. |
లభ్యంబైన సురాధిరాజపదమున్ లక్షింపఁడశ్రాంతమున్ సభ్యత్వంబున నున్నవాఁ డబలుఁడై జాడ్యంబుతో వీఁడు, వి ద్యాభ్యాసంబునఁ గాని తీవ్రమతి గాఁ డంచున్ విచారించి దై త్యేభ్యుం డొక్కదినంబునం బ్రియసుతున్ వీక్షించి సోత్కంఠుఁడై. |
129 |
| క. |
చదువనివా డజ్ఞుం డగుఁ, జదివిన సదసద్వివేక చతురత గలుగుం, జదువఁగ వలయును జనులకుఁ, జదివించెద నార్యులొద్దఁ జదువుము తండ్రీ! |
130 |
| వ. | అని పలికి యసురలోక పురోహితుండును భగవంతుండును నయిన శుక్రాచార్యు కొడుకులఁ బ్రచండవితర్కులఁ జండామర్కుల రావించి సత్కరించి యిట్లనియె. | 131 |
| శా. |
‘అంధప్రక్రియ నున్నవాఁడు, పలుకం, డస్మత్ప్రతాపక్రియా గంధం బించుక లేదు, మీరు గురువుల్ కారుణ్యచిత్తుల్ మనో బంధుల్ మాన్యులు మాకుఁ బెద్దలు మముం బాటించి యీ బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతికుశలుం గావించి రక్షింపరే!’ |
132 |
| వ. | అని పలికి వారలకుం బ్రహ్లాదు నప్పగించి తోడ్కొని పొం డనిన వారును దనుజ రాజకుమారునిం గొనిపోయి యతనికి సవయస్కులగు సహశ్రోతల నసురకుమారులం గొందఱం గూర్చి. | 133 |
| ఉ. |
అంచిత భక్తితోడ దనుజాధిపు గేహసమీపముం బ్రవే శించి సురారి రాజసుతుఁ జేకొని శుక్రకుమారకుల్ పఠిం పించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రము, లాకుమారుఁ డా లించి పఠించె నన్నియుఁ జలింపని వైష్ణవభక్తి పూర్ణుఁడై. |
134 |
| క. |
ఏ పగిది వారు సెప్పిన, నా పగిదిం జదువుఁ గాని యట్టి ట్టని యా క్షేపింపఁడు, తా నన్నియు, రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్. |
135 |
| శా. |
అంతం గొన్నిదినంబు లేఁగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై నిజనందనున్ గురువు లే జాడం బఠింపించిరో భ్రాంతుం డేమి పఠించెనో, పిలిచి సంభాషించి విద్యా పరి శ్రాంతిం జూచెదఁగాక నేఁడని మహాసౌధాంతరాసీనుఁడై. |
136 |
| ఉ. |
మోదముతోడ దైత్యకులముఖ్యుఁడు రమ్మని చీరఁ బంచెఁ బ్ర హ్లాదకుమారకున్ భవమహార్ణవతారకుఁ గామరోష లో భాది విరోధివర్గ పరిహారకుఁ గేశవచింతనామృతా స్వాద కఠోరకుం గలుషజాల మహోగ్రవనీకుఠారకున్. |
137 |
| వ. | ఇట్లు చారులచేత నాహూయమానుండై ప్రహ్లాదుండు చనుదెంచిన. | 138 |
| శా. |
ఉత్సాహ ప్రభు మంత్రశక్తి యుతమే యుద్యోగ? మారూఢ సం వి త్సంపన్నుఁడ వైతివే? చదివితే వేదంబులున్ శాస్త్రముల్? వత్సా! రమ్మని చేరఁ జీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుఁడై యుత్సంగాగ్రముఁ జేర్చి దానవవిభుం డుత్కంఠ దీపింపఁగన్. |
139 |
| క. |
అనుదినసంతోషణములు, జనితశ్రమతాపదుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు, జనకులకుం గర్ణయుగళ సద్భూషణముల్. |
140 |
| వ. | అని మఱియుఁ బుత్రా! నీ కెయ్యది భద్రంబై యున్నది? సెప్పు మనినఁ గన్న తండ్రికిఁ బ్రియనందనుం డిట్లనియె. | 141 |
| ఉ. |
ఎల్ల శరీరధారులకు నిల్లను చీఁకటి నూతిలోపలం ద్రెళ్ళక వీరు నే మను మతిభ్రమణంబున భిన్నులై ప్రవ ర్తిల్లక సర్వము న్నతని దివ్యకళామయ మంచు విష్ణునం దుల్లముఁ జేర్చి తా రడవి నుండుట మేలు నిశాచరాగ్రణీ! |
142 |
| వ. | అని కుమారుం డాడిన ప్రతిపక్షానురూపంబు లయిన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచు నిట్లనియె. | 143 |
| క. |
ఎట్టాడిన న ట్టాడుదు, రిట్టి ట్టని పలుక నెఱుఁగ రితరుల శిశువుల్ దట్టించి యెవ్వ రేమని, పట్టించిరొ బాలకునకుఁ బరపక్షంబుల్? |
144 |
| శా. |
నాకుం జూడఁగఁ జోద్యమయ్యెడిఁ గదా! నా తండ్రి! యీ బుద్ధి దా నీకున్ లోపలఁ దోఁచెనో? పరులు దుర్నీతుల్ పఠింపించిరో? యేకాంతంబున భార్గవుల్ పలికిరో? యీ దానవశ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుఁ డతనిన్ వర్ణింప నీ కేటికిన్? |
145 |
| మ. |
సురలం దోలుటయో సురాధిపతులన్ స్రుక్కించుటో సిద్ధులం బరివేధించుటయో మునిప్రవరులన్ బాధించుటో? యక్ష కి న్నర గంధర్వ విహంగనాగపతులన్ నాశంబు నొందించుటో హరి యంచున్ గిరి యంచు నేల చెడ మోహాంధుండవై పుత్రకా! |
146 |
| వ. | అనినఁ దండ్రిమాటకుఁ బురోహితు నిరీక్షించి ప్రహ్లాదుం డిట్లనియె, మోహనిర్మూలనంబు సేసి యెవ్వని యందుఁ దత్పరులయి యెఱుక గల పురుషులకుం బరులు దా మనియెడు మాయాకృతం బయిన యసద్గ్రాహ్యంబగు భేదంబు గానంబడ, దట్టి పరమేశ్వరునకు నమస్కరించెద. | 147 |
| శా. |
అజ్ఞుల్ గొందఱు నేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమములన్ భాషింపఁగా నేర, రా జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే దజ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ దర్శింపఁగా నేర్తురే? |
148 |
| తే. |
ఇను మయస్కాంత సన్నిధి నెట్లు భ్రాంత, మగు హృషీకేశుసన్నిధి నా విధమునఁ గరఁగుచున్నది దైవయోగమునఁ జేసి, బ్రాహ్మణోత్తమ! చిత్తంబు భ్రాంత మగుచు. |
149 |
| సీ. |
మందార మకరంద మాధుర్యమునఁ దేలు మధుపంబు వోవునే మదనములకు? నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు రాయంచ సనునె తరంగిణులకు? లలిత రసాలపల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకుఁ? బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నీహారములకు? |
|
| తే. |
నంబుజోదర దివ్య పాదార వింద, చింతనామృత పానవిశేష మత్త చిత్త మేరీతి నితరంబుఁ జేర నేర్చు? వినుత గుణశీల! మాటలు వేయు నేల? |
150 |
| వ. | అనిన విని రోషించి రాజసేవకుం డైన పురోహితుండు ప్రహ్లాదుం జూచి, తిరస్కరించి యిట్లనియె. | 151 |
| ఉ. |
పంచశర ద్వయస్కుఁడవు, బాలుఁడ వించుక గాని లేవు భా షించెదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని యర్థ మొ క్కించుక యైనఁ జెప్ప వసురేంద్రుని ముందట మాకు నౌదలల్ వంచుకొనంగఁ జేసితివి వైరివిభూషణ! వంశదూషణా! |
152 |
| చ. |
తనయుఁడు గాఁడు శాత్రవుఁడు దానవభర్తకు వీఁడు, దైత్య చం దనవనమందుఁ గంటకయుత క్షితిజాతముభంగిఁ బుట్టి నాఁ, డనవరతంబు రాక్షసకులాంతకుఁ బ్రస్తుతి సేయుచుండు దం డనమునఁ గాని శిక్షలకు డాయఁడు పట్టుఁడు కొట్టుఁ డుద్ధతిన్. |
153 |
| క. |
ఈ పాపనిఁ జదివింతుము, నీ పాదము లాన, యింక నిపుణతతోడం గోపింతుము దండింతుము, కోపింపకుమయ్య దనుజకుంజర! వింటే! |
154 |
| వ. | అని మఱియు నా రాచపాపనికి వివిధోపాయంబులం బురోహితుండు వెఱపుఁజూపుచు రాజసన్నిధిం బాపి, తోడుకొని పోయి యేకాంతంబున. | 155 |
| క. |
భార్గవనందనుఁ డతనికి, మార్గము చెడకుండఁ బెక్కు మాఱులు నిచ్చల్ వర్గ త్రితయము చెప్ప న, నర్గళమగు మతివిశేష మమర నరేంద్రా! |
156 |
| వ. | మఱియు, గురుండు శిష్యునకు సామ దాన భేద దండోపాయంబు లన్నియు నెఱింగించి, నీతి కోవిదుం డయ్యె నని నమ్మి నిశ్చయించి, తల్లికి నెఱింగించి, తల్లి చేత నలంకృతుం డయిన కులదీపకు నవలోకించి. | 157 |
| ఉ. |
త్రిప్పకు మన్న మా మతము దీర్ఘములైన త్రివర్గపాఠముల్ దప్పకు మన్న! నేఁడు మన దైత్యవరేణ్యుని మ్రోల నేము మున్ జెప్పిన నీతిగాని మఱి చెప్పకుమన్న విరోధినీతులన్, విప్పకుమన్న దుష్టమగు విష్ణుచరిత్ర కథార్థజాలముల్. |
158 |
| వ. | అని బుజ్జగించి, దానవేశ్వరుని సన్నిధికిం దోడి తెచ్చిన. | 159 |
| సీ. |
అడు గడ్గునకు మాధ వానుచింతన సుధా మాధుర్యమున మేనుమఱచు వాని, నంభోజగర్భాదు లభ్యసింపఁగ లేని హరిభక్తి పుంభావమైనవాని, మాతృగర్భము సొచ్చి మన్నది మొదలుగాఁ జిత్త మచ్యుతుమీఁదఁ జేర్చువాని, నంకించి తనలోన నఖిల ప్రపంచంబు శ్రీవిష్ణుమయమని చెలఁగువాని, |
|
| తే. |
వినయ కారుణ్యబుద్ధి వివేక లక్ష, ణాది గుణముల కాటపట్టయిన వాని శిష్యు బుధలోకసంభావ్యుఁ జేరి గురుఁడు, ముందఱికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కు మనుచు. |
160 |
| క. |
శిక్షించితి మన్యము లగు, పక్షంబులు మాని నీతి పారగుఁడయ్యెన్. రక్షోవంశాధీశ్వర!, వీక్షింపుము నీ కుమారు విద్యాబలమున్. |
161 |
| వ. | అని పలికిన, శుక్రకుమారకు వచనంబు లాకర్ణించి, దానవేంద్రుండు దనకు దండ ప్రణామంబు సేసి నిలుచున్న కొడుకును దీవించి, బాహుదండంబు సాఁచి, దిగ్గనన్ డగ్గఱం దిగిచి, గాఢాలింగనంబు సేసి, తన తొడలమీఁద నిడుకొని, చుంచు దువ్వి, చుబుకంబు పుణికి, చెక్కిలి ముద్దుగొని, శిరంబు మూర్కొని, ప్రేమాతిరేక సంజనిత బాష్పసలిలబిందు సందోహంబుల నతని వదనారవిందంబు దడుపుచు, మందమధురాలాపంబుల నిట్లనియె. | 162 |
| శా. |
చోద్యం బయ్యెడి, నింతకాల మరిగెన్, శోధించి యే మేమి సం వేద్యాంశంబులు సెప్పిరో? గురువు లే వెంటం బఠింపించిరో? విద్యాసార మెఱుంగఁ గోరెద భవ ద్విజ్ఞాత శాస్త్రంబులోఁ బద్యం బొక్కటి సెప్పి సార్థముగఁ దాత్పర్యంబు భాషింపుమా! |
163 |
| శా. |
నిన్నున్ మెచ్చరు నీతిపాఠ మహిమన్ నీతోడి దైత్యార్భకుల్ గన్నా రన్నియుఁ జెప్ప నేర్తురు గదా! గ్రంథార్థముల్ దక్షు లై యన్నా! యెన్నఁడు నీవు నీతివిదుఁడౌ దంచున్ మహావాంఛతో నున్నాఁడన్, ననుఁ గన్నతండ్రి! భవదీయోత్కర్షముం జూపవే! |
164 |
| వ. | అనినం గన్న తండ్రికిఁ బ్రియనందనుం డయిన ప్రహ్లాదుం డి ట్లనియె. | 165 |
| క. |
చదివించిరి నను గురువులు, చదివితి ధర్మార్థముఖ్యశాస్త్రంబులు నేఁ జదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్లఁ జదివితిఁ దండ్రీ! |
166 |
| మ. |
తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్ దాసత్వమున్ వందనా ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్, చింతనం బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలఁతున్ సత్యంబు దైత్యోత్తమా! |
167 |
| శా. |
అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక స ద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావలీ బంధుత్వంబులు భస్మ హవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ స ద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్. |
168 |
| సీ. |
కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము, విష్ణు నాకర్ణించు వీనులు వీనులు, మధువైరిఁ దవిలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి, |
|
| తే. |
దేవదేవునిఁ జింతించు దినము దినము, చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు, కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు, తండ్రి హరిఁ జేరుమనియెడి తండ్రి! తండ్రి |
169 |
| సీ. |
కంజాక్షునకుఁ గాని కాయంబు కాయమే పవనగుంఫిత చర్మ భస్త్రి గాక వైకుంఠుఁ బొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమ ధ్వనితోడి ఢక్క గాక! హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వి గాక! కమలేశుఁ జూడని కన్నులు కన్నులే తనుకుడ్యజాల రంధ్రములు గాక! |
|
| ఆ. |
చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిలబుద్బుదంబు గాక! విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే పాదయుగముతోడి పశువు గాక! |
170 |
| సీ. |
సంసారజీమూత సంఘంబు విచ్చునే, చక్రిదాస్యప్రభంజనములేక? తాపత్రయాభీలదావాగ్ను లాఱునే విష్ణుసేవామృతవృష్టిలేక? సర్వంకషాఘౌఘజలరాసు లింకునే హరి మనీషాబడబాగ్నిలేక? ఘన విపద్గాఢాంధకారంబు లడఁగునే పద్మాక్ష నుతిరవిప్రభలులేక? |
|
| తే. |
నిరుపమాపునరావృత్తి నిష్కళంక, ముక్తినిధిఁ గానవచ్చునే ముఖ్యమైన శార్‌ఙ్గకోదండచింతనాంజనము లేక, తామరసగర్భునకు నైన దానవేంద్ర! |
171 |
| వ. | అని యి వ్విధంబున వెఱపు మఱపు నెఱుంగక యులుకు సెడి పలికెడి కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియ నొదవినఁ గటము లదరఁ బెదవులం గఱచుచు నదరిపడి గురుసుతునిం గనుంగొని విమత కథనంబులు గఱపినాఁడ వని దానవేంద్రుం డిట్లనియె. | 172 |
| చ. |
పటుతర నీతిశాస్త్రచయ పారగుఁ జేసెద నంచు బాలు నీ వటు గొనిపోయి వానికి ననర్హములైన విరోధిశాస్త్రముల్ కుటిలతఁ జెప్పినాఁడవు భృగుప్రవరుండ వటంచు నమ్మితిం, గటకట! బ్రాహ్మణాకృతివి గాక యథార్థపు బ్రాహ్మణుండవే? |
173 |
| క. |
ధర్మేతరవర్తనులును, దుర్మంత్రులునైన జనుల దురితము లొందున్ మర్మములు గలఁచి కల్మష, కర్ముల రోగములు పొందు కైవడి విప్రా! |
174 |
| వ. | అనిన రాజునకుఁ బురోహితుం డిట్లనియె. | 175 |
| ఉ. |
తప్పులు లేవు మా వలన దానవనాథ! విరోధిశాస్త్రముల్ చెప్పము, క్రూరులై పరులు సెప్పరు, మీ చరణంబులాన సు మ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీష, యెవ్వరుం జెప్పెడి పాటిగాదు, ప్రతిచింతఁ దలంపుము నేర్పు కైవడిన్. |
176 |
| క. |
మిత్రులము పురోహితులము, పాత్రుల మే మదియుఁగాక భార్గవులము నీ పుత్రుని నిటువలెఁ జేయఁగ, శత్రులమే? దైత్యజలధిచంద్రమ! వింటే? |
177 |
| వ. | అనిన గురునందనుం గోపింపక దైత్యవల్లభుండు గొడుకు నవలోకించి యిట్లనియె. | 178 |
| క. |
ఒజ్జలు సెప్పని యీ మతి, మజ్జాతుఁడ వైన నీకు మఱి యెవ్వరిచే నుజ్జాత మయ్యె బాలక!, తజ్జనులం బేరుకొనుము తగ నా మ్రోలన్. |
179 |
| వ. | అనినఁ దండ్రికిఁ బ్రహ్లాదుం డిట్లనియె. | 180 |
| ఉ. |
అచ్చపుఁ జీఁకటిం బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుఁ బుట్టుచున్ మరలఁ జర్వితచర్వణు లైన వారికిం జెచ్చెరఁ బుట్టునే పరులు సెప్పిననైన నిజేచ్ఛనైన నే మిచ్చిన నైనఁ గానలకు నేఁగిన నైన హరి ప్రబోధముల్? |
181 |
| ఉ. |
కాననివాని నూఁతగొని కాననివాఁడు విశిష్టవస్తువుల్ గానని భంగిఁ గర్మములు గైకొని కొందఱు కర్మబద్ధులై కానరు విష్ణుఁ గొంద ఱటఁ గందు రకించన వైష్ణవాంఘ్రి సం స్థాన రజోఽభిషిక్తులగు సంహృతకర్ములు దానవేశ్వరా! |
182 |
| శా. |
శోధింపం బడె సర్వశాస్త్రములు రక్షోనాథ! వే యేటికిన్ గాథల్ మాధవశేముషీతరణి సాంగత్యంబునం గాక దు ర్మేధన్ దాఁటఁగ వచ్చునే సుతవధూమీనోగ్ర వాంఛా మద క్రోధోల్లోల విశాల సంసృతి మహా ఘోరామితాంభోనిధిన్. |
183 |
| వ. | అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ సేయక రక్కసుల ఱేఁడు దన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేఁడిచూపులు మింట మంట లెగయ మంత్రులం జూచి యిట్లనియె. | 184 |
| శా. |
క్రోడంబై పినతండ్రిఁ జంపె నని తాఁ గ్రోధించి చిత్తంబులో వీడం జేయఁడు, బంటుభంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుఁడై యోడం డక్కట! ప్రాణవాయువులు వీఁడొప్పించు చున్నాఁడు నా తోడన్ వైరము పట్టె, నిట్టి జనకద్రోహిన్ మహిం గంటిరే? |
185 |
| వ. | అని రాక్షసవీరుల నీక్షించి యిట్లనియె. | 186 |