| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| శా. |
పంచాబ్దంబులవాఁడు, తండ్రినగు నా పక్షంబు నిందించి య త్కించిద్భీతియు లేక విష్ణు నహితుంగీర్తించుచున్నాఁడు, వ ల్దంచుంజెప్పిన మానఁ, డంగమునఁబుత్రాకారతన్ వ్యాధి జ న్మించెన్, వీని వధించి రండు దనుజుల్ మీ మీ పటుత్వంబులన్. |
187 |
| శా. |
అంగవ్రాతములోఁజికిత్సకుఁడు దుష్టాంగంబు ఖండించి శే షాంగశ్రేణికి రక్ష సేయు క్రియ నీ యజ్ఞుం గులద్రోహి దు స్సంగుం గేశవపక్షపాతి నధముం జంపించి వీరవ్రతో త్తుంగఖ్యాతిఁజరించెదం, గులము నిర్దోషంబు గావించెదన్. |
188 |
| క. |
హంతవ్యుఁడు రక్షింపను, మంతవ్యుఁడు గాఁడు యముని మందిరమునకున్ గంతవ్యుఁడు వధమున కుప, రంతవ్యుం డనక చంపి రం డీ పడుచున్. |
189 |
| వ. | అని దానవేంద్రుం డానతిచ్చిన వాఁడికోఱలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై వక్త్రంబులు దెఱచికొని యుబ్బి బొబ్బలిడుచు ధూమసహితదావదహనంబునుంబోలెఁదామ్రసంకాశంబు లయిన కేశంబులు మెఱయ భేదన వాదనచ్ఛేదనంబులు సేయుచు. | 190 |
| ఉ. |
బాలుఁడు రాచబిడ్డఁడు కృపాళుఁడు సాధుఁడు లోకమాన్య సం శీలుఁడు వీఁ డ వధ్యుఁడని చిక్కక స్రుక్కక క్రూరచిత్తులై శూలములందదంగముల సుస్థిరులై ప్రహరించి రుగ్ర వా చాలత నందఱున్ దివిజశత్రుఁడు వల్దనఁడయ్యె భూవరా! |
191 |
| చ. |
పలువురు దానవుల్ పొడువ బాలుని దేహము లేశమాత్రము న్నొలియదు, లోపలన్ రుధిర ముబ్బదు, కందదు, శల్యసంఘమున్ నలియదు, దృష్టివైభవము నష్టము గాదు, ముఖేందుకాంతియుం బొలియదు, నూతనశ్రమము పుట్టదు, పట్టదు దీనభావమున్. |
192 |
| ఉ. |
తన్ను నిశాచరుల్ పొడువ దైత్యకుమారుఁడు మాటి మాటి ‘కో పన్నగశాయి! యో దనుజభంజన! యో జగదీశ! యో మహా పన్నశరణ్య! యో నిఖిలపావన!’ యంచు నుతించుఁగాని తాఁ గన్నుల నీరు దేఁడు, భయకంపసమేతుఁడు గాఁడు భూవరా! |
193 |
| ఉ. |
పాఱఁడు లేచి దిక్కులకు, బాహువు లొడ్డఁడు, బంధురాజిలోఁ దూఱఁడు, ఘోరకృత్య మని దూఱఁడు తండ్రిని, మిత్రవర్గముం జీరఁడు, మాతృసంఘము వసించు సువర్ణగృహంబులోనికిం దాఱఁడు, కావరే యనఁడు, తాపము నొందఁడు కంటగింపఁడున్. |
194 |
| వ. | ఇట్లు సర్వాత్మకంబై యిట్టి దట్టి దని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు దానయై య మ్మహావిష్ణునియందుఁ జిత్తంబుఁ జేర్చి తన్మయుండయి పరమానందంబునం బొంది యున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుండు దన కింకరుల చేతం జేయించుచున్న మారణకర్మంబులు పాపకర్ముని యందుఁ బ్రయుక్తంబులైన సత్కారంబులుంబోలె విఫలంబు లగుటం జూచి. | 195 |
| ఉ. |
శూలములన్ నిశాచరులు స్రుక్కక దేహము నిగ్రహింపఁగా బాలుఁడు నేలపైఁబడఁడు, పాఱఁడు, చావఁడు, తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధరపక్షము మానితి నంచుఁబాదముల్ ఫాలము సోఁక మ్రొక్కఁ, డనపాయత నొందుట కేమి హేతువో? |
196 |
| వ. | అని శంకించుచు. | 197 |
| సీ. |
ఒకమాటు దిక్కుంభియూథంబుఁ దెప్పించి కెరలి డింభకునిఁద్రొక్కింపఁబంపు, నొకమాటు విషభీకరోరగశ్రేణులఁగడువడి నర్భకుఁగఱవఁబంపు, నొకమాటు హేతిసంఘోగ్రానలములోన విసరి కుమారుని వ్రేయఁబంపు, నొకమాటు కూలంకషోల్లోలజలధిలో మొత్తించి శాబకు ముంపఁబంపు, |
|
| ఆ. |
విషముఁబెట్టఁబంపు విదళింపఁగాఁబంపుఁ, దొడ్డకొండ చఱులఁద్రోయఁబంపుఁ బట్టికట్టఁబంపు బాధింపఁగాఁబంపు, బాలుఁగినిసి దనుజపాలుఁడధిప! |
198 |
| సీ. |
ఒకవేళ నభిచారహోమంబు సేయించు నొకవేళ నెండల నుండఁబంచుఁ, నొకవేళ వానల నుపహతి నొందించు నొకవేళ రంధ్రంబు లుక్కఁ బట్టు, నొకవేళఁదనమాయ నొదవించి బెగడించు నొకవేళ మంచున నొంటి నిలుపు నొకవేళఁబెనుగాలి కున్ముఖుఁగావించు నొకవేళఁబాఁతించు నుర్వియందు, |
|
| తే. |
నీర మన్నంబు నిడనీక నిగ్రహించుఁ, గశల నడిపించు ఱువ్వించు గండశిలల గదల వ్రేయించు, వేయించు ఘనశరములఁ, గొడుకు నొకవేళ నమరారి క్రోధి యగుచు, |
199 |
| వ. | మఱియు ననేక మారణోపాయంబులఁ బాపరహితుండైన పాపని రూపుమాపలేక యేకాంతంబున దురంతచింతాపరిశ్రాంతుండయి రాక్షసేంద్రుండు దన మనంబున. | 200 |
| ఉ. |
ముంచితి వార్ధులన్, గదల మొత్తితి, శైలతటంబులందు ద్రొ బ్బించితి, శస్త్రరాజిఁబొడిపించితి మీఁద నిభేంద్రపంక్తి ఱొ ప్పించితి, ధిక్కరించితి, శపించితి, ఘోరదవాగ్నులందుఁ ద్రో యించితిఁ, బెక్కుపాట్ల నలయించితిఁ, జావఁ డిదేమి చిత్రమో! |
201 |
| చ. |
ఎఱుఁగఁడు జీవనౌషధము, లెవ్వరు భర్తలు లేరు, బాధలం దరలఁడు, నైజతేజమునఁదథ్యము జాడ్యము లేదు, మిక్కిలిన్ మెఱయుచు నున్నవాఁడొక నిమేషము దైన్యము నొందఁడింక నే తెఱఁగునఁద్రుంతు? వేసరితి, దివ్యము వీని ప్రభావమెట్టిదో! |
202 |
| వ. | అదియునుం గాక తొల్లి శునశ్శేఫుండను మునికుమారుండు దండ్రిచేత యాగపశుత్వంబునకు దత్తుండయి తండ్రి తనకు నపకారి యని తలంపక బ్రతికిన చందంబున. | 203 |
| క. |
ఆగ్రహమున నేఁ జేసిన, నిగ్రహములు పరులతోడ నెఱి నొకనాఁడున్ విగ్రహము లనుచుఁ బలుకఁ డ, నుగ్రహములుగా స్మరించు, నొవ్వఁడు మదిలోన్. |
204 |
| వ. | కావున వీఁడు మహాప్రభావ సంపన్నుండు, వీని కెందును భయంబు లేదు, వీనితోడి విరోధంబునం దనకు మృత్యువు సిద్ధించు నని నిర్ణయించి చిన్నవోయి ఖిన్నుండై ప్రసన్నుండు గాక క్రిందు సూచుచు విషణ్ణుండై చింతనంబు సేయుచున్న రాజునకు మంతనంబునఁజండామర్కు లిట్లనిరి. | 205 |
| శా. |
శుభ్రఖ్యాతివి; నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర! రో షభ్రూయుగ్మవిజృంభణమ్మున దిగీశవ్రాతముంబోరులన్ విభ్రాంతంబుగఁజేసి యేలితి గదా విశ్వంబు! వీఁడెంత? యీ దభ్రోక్తుల్ గుణదోషహేతువులు, చింతంబొంద నీకేటికిన్. |
206 |
| శా. |
వక్రుండైన జనుండు వృద్ధగురుసేవంజేసి మేధానయో పక్రాంతిన్ విలసిల్లు, మీఁదట వయఃపాకంబుతో బాలకున్ శక్రద్వేషణబద్ధుఁజేయుచు మదింజాలింపుమీ రోషమున్, శుక్రాచార్యులు వచ్చునంత కితఁడున్ సుశ్రీయుతుం డయ్యెడున్. |
207 |
| వ. | అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు గృహస్థులైన రాజులకు నుపదేశింపఁ దగిన ధర్మార్థకామంబులు ప్రహ్లాదునకు నుపదేశింపుఁడని యనుజ్ఞ చేసిన వారు నతనికిఁ ద్రివర్గంబు నుపదేశించిన, నతండు రాగద్వేషంబులచేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబులైన ధర్మార్థకామంబులు దనకు నగ్రాహ్యంబు లనియును, వ్యవహార ప్రసిద్ధికొఱకైన భేదంబుగాని యాత్మభేదంబు లేదనియును, ననర్థంబులయం దర్థకల్పన సేయుట దిగ్భ్రమం బనియును నిశ్చయించి గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు దమ గృహస్థ కర్మానుష్ఠానంబులకుం బోయిన సమయంబున. | 208 |
| క. |
ఆటలకుఁ దన్ను రమ్మని, పాటించి నిశాటసుతులు భాషించిన దో షాటకులేంద్రకుమారుఁడు, పాటవమున వారిఁజేరి ప్రజ్ఞాన్వితుఁడై. |
209 |
| క. |
చెప్పఁడొక చదువు మంచిది, చెప్పెడిఁ దగులములు చెవులు చిందఱ గొనఁగా నెప్పుడు మనయెడ నొజ్జలు, చెప్పెద నొక చదువు వినుఁడు చిత్తము లలరన్. |
210 |
| వ. | అని రాజకుమారుండు గావునఁ గరుణించి సంగడికాండ్రతోడ నగియెడి చందంబునఁ గ్రీడలాడుచు సమానవయస్కులైన దైత్యకుమారుల కెల్ల నేకాంతంబున నిట్లనియె. | 211 |
| ఉ. |
బాలకులార! రండు మన ప్రాయపుబాలురు గొంద ఱుర్విపైఁ గూలుటఁ గంటిరే! గురుఁడు క్రూరుఁడనర్థచయంబునందు దు శ్శీలత నర్థకల్పనముఁజేసెడి, గ్రాహ్యము గాదు శాస్త్ర, మే మే లెఱిఁగించెదన్! వినిన మీకు నిరంతరభద్ర మయ్యెడిన్. |
212 |
| వ. | వినుండు, సకల జన్మంబులందును ధర్మార్థాచరణ కారణంబయిన మానుషజన్మంబు దుర్లభం, బందుఁ బురుషత్వంబు దుర్గమం, బదియు శతవర్ష పరిమితంబైన జీవిత కాలంబున నియతంబై యుండు, నందు సగ మంధకార బంధురంబయి రాత్రి రూపంబున నిద్రాదివ్యవహారంబుల నిరర్థకంబయి చనుఁ, జిక్కిన పంచాశద్వత్సరంబులందును బాల్యకైశోర వయోవిశేషంబుల వింశతి హాయనంబులు గడచుఁ, గడమ ముప్పది యబ్దంబుల నింద్రియంబుల చేతఁ బట్టువడి దురవగాహంబులయిన కామ క్రోధ లోభ మోహ మద మత్సరంబులను పాశంబులం గట్టువడి విడివడ సమర్థుండు గాక ప్రాణంబులకంటె మధురాయమాణమైన తృష్ణకు లో నై భృత్యతస్కరవణిక్కర్మంబులఁ బ్రాణహానియైన నంగీకరించి పరార్థంబుల నర్థించుచు రహస్యసంభోగచాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికా లవిత్రంబు లయిన కళత్రంబులను, మహనీయ మంజుల మధురాలాపంబులు గలిగి వశులయిన శిశువులను, శీలవయో రూపధన్యలగు కన్యలను, వినయ వివేకవిద్యాలంకారులయిన కుమారులను, గామిత ఫలప్రదాత లగు భ్రాతలను, మమత్వ ప్రేమదైన్య జనకు లయిన జననీ జనకులను, సకల సౌజన్య సింధువు లయిన బంధువులను, ధనకనక వస్తువాహన సుందరంబు లయిన మందిరంబులను, సుకరంబులైన పశుభృత్య నికరంబులను, వంశపరంపరాయత్తంబు లయిన విత్తంబులను వర్జింపలేక సంసారంబు నిర్జించు నుపాయంబుఁ గానక తంతువర్గంబున నిర్గమద్వార శూన్యంబయిన మందిరంబుఁ జేరి చిక్కువడి వెడలెడి పాటవంబు చాలక తగులువడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృత కర్మ బద్ధుండై శిశ్నోదరాది సుఖంబులఁ బ్రమత్తుండయి నిజకుటుంబ పోషణ పారవశ్యంబున విరక్తి మార్గంబుఁ దెలియ నేరక స్వకీయ పరకీయ భిన్న భావంబున నంధకారంబునం బ్రవేశించుఁ, గావునఁ గౌమార సమయంబున మనీషా గరిష్ఠుం డై పరమ భాగవతధర్మంబు ననుష్ఠింపవలయు, దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకుఱుభంగి సుఖంబులును గాలానుసారంబులై లబ్ధంబు లగుం; గావున వృథాప్రయాసంబున నాయుర్వ్యయంబు సేయంజనదు, హరిభజనంబున మోక్షంబు సిద్ధించు, విష్ణుండు సర్వభూతంబులకు నాత్మేశ్వరుండు ప్రియుండు, ముముక్షువైన దేహికి దేహావసాన పర్యంతంబు నారాయణ చరణారవిందసేవనంబు కర్తవ్యంబు. | 213 |
| సీ. |
కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలులై కైకొన్న వెఱ్ఱితనము? భద్రార్థులై యుండి పాయరు, సంసారపద్ధతి నూరక పట్టువడిరి, కల యోనులందెల్ల గర్భాద్యవస్థలఁ బురుషుండు దేహియై పుట్టుచుండుఁ దన్నెఱుంగఁడు, కర్మతంత్రుఁడై కడపట ముట్టఁడు భవశతములకు నయిన |
|
| ఆ. |
దీన శుభము లేదు, దివ్యకీర్తియు లేదు, జగతిఁబుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకుఁ? బుట్టని చావని త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి. |
214 |
| శా. |
హాలాపానవిజృంభమాణమదగర్వాతీతదేహోల్లస ద్బాలాలోకనశృంఖలానిచయసంబద్ధాత్ముఁడై లేశమున్ వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడుం గామినీ హేలాకృష్టకురంగశాబక మగున్ హీనస్థితిన్ వింటిరే! |
215 |
| ఆ. |
విషయసక్తులైన విబుధాహితులతోడి, మనికి వలదు, ముక్తి మార్గవాంఛ; నాదిదేవు విష్ణు నాశ్రయింపుఁడు ముక్త, సంగజనులఁగూడి శైశవమున. |
216 |
| వ. | కావున విషయంబులఁ జిక్కువడిన రక్కసులకు హరిభజనంబు శక్యంబు గాదు, రమ్యమయ్యును బహుతర ప్రయాస గమ్యమని తలంచితిరేనిఁ జెప్పెద, సర్వభూతాత్మకుండై సర్వ దిక్కాల సిద్ధుండై బ్రహ్మ కడపలగాఁ గల చరాచర స్థూల సూక్ష్మజీవసంఘంబు లందును, నభోవాయుకుంభినీ సలిల తేజంబు లనియెడు మహాభూతంబులయందును, భూతవికారంబులయిన ఘటపటాదులయందును, గుణసామ్యంబయిన ప్రధానమందును, గుణవ్యతికరంబైన మహత్తత్త్వాదియందును, రజస్సత్త్వతమోగుణంబుల యందును భగవంతుం డవ్యయుం డీశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మ మనియెడు వాచకశబ్దంబులు గల్గి కేవలానుభవానంద స్వరూపకుండు నవికల్పితుండు ననిర్దేశ్యుండు నయిన పరమేశ్వరుండు త్రిగుణాత్మకంబైన తన దివ్య మాయచేత నంతర్హితైశ్వర్యుండై వ్యాప్యవ్యాపకరూపంబులం జేసి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయు నయి నిర్దేశింపందగి వికల్పితుండై యుండుఁ, దత్కారణంబున నాసుర భావంబు విడిచి సర్వభూతంబులందును దయాసుహృద్భావంబులు కర్తవ్యంబులు, దయాసుహృద్భావంబులు గల్గిన నధోక్షజుండు సంతసించు, ననంతుం డాద్యుండు హరి సంతసించిన నలభ్యం బెయ్యదియు లేదు, జనార్దనచరణ సరసీరుహ యుగళస్మరణ సుధారస పానపరవశుల మైతిమేని మనకు దైవవశంబున నకాంక్షితంబులై సిద్ధించు ధర్మార్థకామంబులు, కాంక్షితంబై సిద్ధించు మోక్షం బననేల? త్రివర్గంబును నాత్మవిద్యయుం దర్కదండనీతి జీవికాదు లన్నియుఁ ద్రైగుణ్య విషయంబు లయిన వేదంబుల వలనం బ్రతిపాద్యంబులు, నిస్త్రైగుణ్యలక్షణంబునం బరమ పురుషుండైన హరికి నాత్మసమర్పణంబు సేయుట మేలు, పరమాత్మ తత్త్వజ్ఞానోదయంబునం జేసి స్వపరభ్రాంతి సేయక పురుషుండు యోగావధూతత్త్వంబున నాత్మ వికల్పభేదంబునం గలలోఁ గన్న విశేషంబుల భంగిం దథ్యం బనక మిథ్యయని తలంచు నని మఱియుఁ బ్రహ్లాదుం డిట్లనియె. | 217 |
| మ. |
నరుఁడుం దానును మైత్రితో మెలఁగుచున్ నారాయణుం డంతయున్ వరుసన్ నారదసంయమీశ్వరునకున్ వ్యాఖ్యానముంజేసె మున్, హరిభక్తాంఘ్రిపరాగశుద్ధతను లేకాంతుల్, మహాకించనుల్, పరతత్త్వజ్ఞులు గాని నేరరు, మదిన్ భావింప నీ జ్ఞానమున్. |
218 |
| వ. | తొల్లి నేను దివ్యదృష్టి గల నారదమహాముని వలన సవిశేషం బయిన యీ జ్ఞానంబును బరమభాగవత ధర్మంబును వింటి: ననిన వెఱఁగుపడి దైత్యబాలకు లద్దనుజరాజకుమారున కిట్లనిరి. | 219 |
| ఉ. |
మంటిమి గూడి భార్గవకుమారకులొద్ద ననేకశాస్త్రముల్ వింటిమి, లేఁడు సద్గురుఁడు వే ఱొకఁడెన్నఁడు రాజశాల ము క్కంటికి నైన రాదు సొరఁగా, వెలికింజన రాదు, నీకు ని ష్కంటకవృత్తి నెవ్వఁడు ప్రగల్భుఁడు సెప్పె గుణాఢ్య! సెప్పుమా! |
220 |
| క. |
సేవింతుము నిన్నెప్పుడు, భావింతుము రాజ వనుచు బహుమానములం గావింతుము, తెలియము నీ, కీ వింత మతిప్రకాశ మే క్రియఁగలిగెన్? |
221 |
| వ. | అని ఇట్లు దైత్యనందనులు ద న్నడిగినఁ బరమభాగవత కులాలంకారుండైన ప్రహ్లాదుండు నగి తనకుఁ బూర్వంబు వినంబడిన నారదు మాటలు దలంచి యిట్లనియె. | 222 |
| శా. |
అక్షీణోగ్రతపంబు మందరముపై నర్థించి మా తండ్రి శు ద్ధ క్షాంతింజని యుండఁ జీమగమిచేతన్ భోగిచందంబునన్ భక్షింపంబడెఁబూర్వపాపములచేఁబాపాత్మకుండంచు మున్ రక్షస్సంఘముమీఁద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై. |
223 |
| శా. |
ప్రస్థానోచితభేరిభాంకృతులతోఁబాకారియుందారు శౌ ర్యస్థైర్యంబుల నేగుదెంచినఁదదీయాటోపవిభ్రాంతులై స్వస్థేమల్ దిగనాడి పుత్రధనయోషామిత్రసంపత్కళా ప్రస్థానంబులు డించి పాఱి రసురుల్ ప్రాణావనోద్యుక్తులై. |
224 |
| మత్తకోకిలము. |
ప్రల్లదంబున వేల్పు లుద్ధతిఁబాఱి రాజనివాసముం గొల్లవెట్టి సమస్తవిత్తముఁగ్రూరతంగొనిపోవఁగా నిల్లు సొచ్చి విశంకుఁడై యమరేశ్వరుండదలించి మా తల్లిఁ దాఁజెఱవట్టె సిగ్గునఁదప్తయై విలపింపఁగాన్. |
225 |
| వ. | ఇట్లు సురేంద్రుండు మా తల్లిం జెఱగొని పోవుచుండ న మ్ముగుద కురరి యను పులుఁగు క్రియ మొఱలిడినఁ దెరువున దైవయోగంబున నారదుండు పొడగని యిట్లనియె. | 226 |
| ఉ. |
స్వర్భువనాధినాథ! సురసత్తమ! వేల్పులలోన మిక్కిలిన్ నిర్భరపుణ్యమూర్తివి, సునీతివి, మానినిఁబట్ట నేల? యీ గర్భిణి నాతురన్ విడువు, కల్మషమానసురాలు గాదు, నీ దుర్భరరోషమున్ నిలుపు దుర్జయుఁడైన నిలింపవైరిపైన్. |
227 |
| వ. | అనిన వేల్పుఁదపసికి వేయిగన్నుల ఠవర యిట్లనియె. | 228 |
| ఉ. |
అంతనిధానమైన దివిజాహితువీర్యము దీని కుక్షి న త్యంతసమృద్ధి నొందెడి మహాత్మక! కావునఁదత్ప్రసూతి ప ర్యంతము బద్ధఁజేసి జనితార్భకు వజ్రపుధారఁద్రుంచి ని శ్చింతుఁడనై తుదిన్ విడుతు, సిద్ధము దానవరాజవల్లభన్. |
229 |
| వ. | అని పలికిన వేల్పుఱేనికిం దపసి యిట్లనియె. | 230 |
| శా. |
నిర్భీకుండు ప్రశస్తభాగవతుఁడున్ నిర్వైరి జన్మాంతరా విర్భూతాచ్యుతపాదభక్తిమహిమావిష్టుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్ దుర్భావంబునఁబొంది చావఁడు భవద్దోర్దర్పవిభ్రాంతుఁడై, |
231 |
| వ. | అని దేవముని నిర్దేశించిన నతని వచనంబులు మన్నించి తానును హరిభక్తుండు గావున దేవేంద్రుండు భక్తిబాంధవంబున మా యవ్వను విడిచి వలగొని సురలోకంబునకుం జనియె, మునీంద్రుండు మజ్జననియందుఁ బుత్రికాభావంబు సేసి యూఱడించి నిజాశ్రమంబునకుం గొనిపోయి నీవు పతివ్రతవు, నీ యుదరంబునఁ బరమభాగవతుండయిన ప్రాణి యున్నవాఁడు, తపోమహత్త్వంబునం గృతార్థుండై నీ పెనిమిటి రాఁగలం, డందాఁక నీ విక్కడ నుండు మనిన సమ్మతించి. | 232 |
| శా. |
యోషారత్నము నాథదేవత విశాలోద్యోగ మా తల్లి, ని ర్వైషమ్యంబున నాథురాక మదిలో వాంఛించి నిర్దోషయై యీషద్భీతియు లేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శు శ్రూషల్ సేయుచు నుండె నారదునకున్ సువ్యక్తశీలంబునన్. |
233 |
| వ. | ఇట్లు దనకుఁ బరిచర్య సేయుచున్న దైత్యరాజకుటుంబినికి నాశ్రితరక్షా విశారదుండైన నారదుండు నిజసామర్థ్యంబున నభయం బిచ్చి గర్భస్థుండనైన నన్ను నుద్దేశించి ధర్మతత్త్వంబును నిర్మలజ్ఞానంబును నుపదేశించిన నమ్ముద్దియ దద్దయుం బెద్ద కాలంబునాఁటి వినికి గావున నాఁడుది యగుటం జేసి పరిపాటి దప్పి సూటిలేక మఱచె, నారదుండు నా యెడఁగృపగల నిమిత్తంబున. | 234 |
| క. |
వెల్లిగొని నాఁటనుండియు, నుల్లసితంబైన దైవయోగంబున శో భిల్లెడు మునిమత మంతయు, నుల్లంబున మఱపు పుట్ట దొకనాఁడైనన్. |
235 |
| ఆ. |
వినుఁడు నాదు పలుకు విశ్వసించితి రేని, సతుల కయిన బాలజనుల కయినఁ దెలియవచ్చు మేలు దేహాద్యహంకార, దళననిపుణమైన తపసిమతము. |
236 |
| వ. | అని నారదోక్త ప్రకారంబున బాలకులకుఁ బ్రహ్లాదుం డిట్లనియె, నీశ్వరమూర్తియైన కాలంబునంజేసి వృక్షంబు గలుగుచుండ ఫలంబునకు జన్మసంస్థాన వర్ధనాపక్షీణత్వ పరిపాకనాశంబులు ప్రాప్తంబులైన తెఱంగున దేహంబునకుంగాని షడ్భావ వికారంబు లాత్మకు లే, వాత్మ నిత్యుండు, క్షయ రహితుండు, శుద్ధుండు, క్షేత్రజ్ఞుండు, గగనాదులకు నాశ్రయుండు, గ్రియాశూన్యుండు, స్వప్రకాశుండు,సృష్టి హేతువు, వ్యాపకుండు, నిస్సంగుండుఁ, బరిపూర్ణుండు, నొక్కండునని వివేక సమర్థంబులగు నాత్మలక్షణంబులు పండ్రెండు నెఱుంగుచు దేహాదులందు మోహజనకంబులగు నహంకార మమకారంబులు విడిచి పసిండి గనులు గల నెలవున విభ్రాజమాన కనకలేశంబులైన పాషాణాదులందుఁ బుటంబు పెట్టి వహ్ని యోగంబునఁ గరంగ నూది హేమకారకుండు పాటవంబున హాటకంబుఁ బడయుభంగి నాత్మకృత కార్యకారణంబుల నెఱింగెడి నేర్పరి దేహంబునం దాత్మసిద్ధికొఱకు నయిన యుపాయంబునం జేసి బ్రహ్మ భావంబుఁ బడయు, మూలప్రకృతియు, మహదహంకారంబులును, బంచతన్మాత్రంబులు, నివి యెనిమిదియుం బ్రకృతులనియు, రజసత్త్వతమమంబులు మూడును బ్రకృతి గుణంబు లనియును, గర్మేంద్రియంబు లయిన వాక్పాణిపాద పాయూపస్థంబులును జ్ఞానేంద్రియుంబులైన శ్రవణనయన రసనా త్వగ్ఘ్రాణంబులును మనంబును మహీసలిల తేజోవాయు గగనంబులును నివి పదాఱును వికారంబు లనియును గపిలాది పూర్వాచార్యులచేతఁ జెప్పంబడియె, సాక్షిత్వంబున నీ యిరువదేడింటిని నాత్మగూడియుండుఁ బెక్కింటి కూటువ దేహ, మదియు జంగమస్థావరరూపంబుల రెండు విధంబులయ్యె, మూలప్రకృతి మొదలయిన వర్గంబునకు వేఱై, మణిగణంబులం జొచ్చియున్న సూత్రంబు చందంబున నాత్మ యిన్నింటియందునుం జొచ్చి దీపించు, నాత్మకు జన్మస్థితి లయంబులు గలవంచు మిథ్యాతత్పరులుగాక వివేక శుద్ధమైన మనంబునం జేసి విచారించి దేహంబునం దాత్మ వెదకవలయు, నాత్మకు నవస్థలు గలయట్లుండుఁ గాని, యవస్థలు లేవు, జాగరణస్వప్న సుషుప్తులను వృత్తు లెవ్వనిచేత నెఱుగంబడు నతండాత్మయండ్రు, కుసుమధర్మంబులైన గంధంబులచేత గంధాశ్రయుండయిన వాయువు నెఱింగెడు భంగిం ద్రిగుణాత్మకంబులయి కర్మజన్యంబు లయిన బుద్ధిభేదంబుల నాత్మ నెఱుంగందగు నని చెప్పి. | 237 |
| సీ. |
సంసార మిది బుద్ధిసాధ్యము గుణకర్మ గణబద్ధ మజ్ఞానకారణంబు, కలవంటి, దింతియ కాని నిక్కము గాదు, సర్వార్థములు మనస్సంభవములు, స్వప్నజాగరములు సమములు, గుణశూన్యుఁడగు పరమునికి గుణాశ్రయమున భవవినాశంబులు పాటిల్లి నట్లుండుఁ బట్టి చూచిన లేవు బాలురార! |
|
| తే. |
కడఁగి త్రిగుణాత్మకములైన కర్మములకు, జనకమై వచ్చు నజ్ఞానసముదయమును ఘనతర జ్ఞానవహ్నిచేఁగాల్చి పుచ్చి, కర్మవిరహితులై హరిఁగనుట మేలు. |
238 |
| వ. | అది గావున గురుశుశ్రూషయు సర్వలాభసమర్పణంబును, సాధుజన సంగమంబును, నీశ్వర ప్రతిమా సమారాధనంబును, హరికథాతత్పరత్వంబును, వాసుదేవునియందలి ప్రేమయు, నారాయణగుణకర్మ నామకీర్తనంబును, వైకుంఠ చరణకమలధ్యానంబును, విశ్వంభరమూర్తి విలోకన పూజనంబులును మొదలయిన విజ్ఞాన వైరాగ్య లాభసాధనంబులైన భాగవత ధర్మంబులపై రతిగలిగి సర్వభూతంబుల యందు నీశ్వరుండు భగవంతుండాత్మ గలండని సమ్మానంబు సేయుచుఁ గామ క్రోధ లోభమోహ మద మాత్సర్యంబుల గెలిచి యింద్రియ వర్గంబును బంధించి భక్తి సేయుచుండ నీశ్వరుండయిన విష్ణు దేవుని యందలి గతి సిద్ధించు. | 239 |
| సీ. |
దనుజారి లీలావతారంబులందలి శౌర్యకర్మంబులు సద్గుణములు విని భక్తుఁడగు వాఁడు వేడ్కతోఁబులకించి కన్నుల హర్షాశ్రుకణము లొలుక గద్గదస్వరముతోఁ గమలాక్ష! వైకుంఠ! వరద! నారాయణ! వాసుదేవ! యనుచు నొత్తిలి పాడు నాడు నాక్రోశించు నగుఁ జింతనము సేయు, నతి యొనర్చు |
|
| తే. |
మరులు కొనియుండుఁదనలోన మాటలాడు, వేల్పుసోఁకిన పురుషుని వృత్తిఁదిరుగు బంధములఁబాసి యజ్ఞానపటలి గాల్చి విష్ణుఁ, బ్రాపించుఁదుది భక్తివివశుఁడగుచు. |
240 |
| వ. | కావున రాగాదియుక్త మనస్కుండయిన శరీరికి సంసారచక్ర నివర్తకం బయిన హరిచింతనంబు బ్రహ్మమందలి నిర్వాణ సుఖంబెట్టి దట్టిదని బుధులు దెలియుదురు, హరి భజనంబు దుర్గమంబు గాదు, హరి సకల ప్రాణి హృదయంబుల యందు నంతర్యామియై యాకాశంబు భంగి నుండు, విషయార్జనంబుల నయ్యెడిది లేదు, నిమిషభంగుర ప్రాణులయిన మర్త్యులకు మమతాస్పదంబులును జంచలంబులును నైన పుత్రమిత్ర కళత్ర పశు భృత్య బల బంధు రాజ్య కోశ మణి మందిర మంత్రి మాతంగ మహీ ప్రముఖ విభవంబులు నిరర్థకంబులు. యాగప్రముఖ పుణ్యలబ్ధంబు లైన స్వర్గాదిలోక భోగంబులు, పుణ్యానుభవ క్షీణంబులుగాని నిత్యంబులు గావు, నరుండు విద్వాంసుండ నని యభిమానించి కర్మంబు లాచరించి యమోఘంబు లయిన విపరీతఫలంబుల నొందుఁ, గర్మంబులు గోరక చేయవలయుఁ, గోరి చేసిన దుఃఖంబులు ప్రాపించుఁ, బురుషుండు దేహంబు కొఱకు భోగంబుల నపేక్షించు, దేహంబు నిత్యంబు గాదు, తోడ రాదు, మృతంబయిన దేహంబును శునకాదులు భక్షించు, దేహి కర్మంబు లాచరించి కర్మబద్ధుండయి క్రమ్మఱం గర్మానుకూలంబైన దేహంబుఁ దాల్చు, నజ్ఞానంబునంజేసి పురుషుండు కర్మదేహంబుల విస్తరించు, నజ్ఞాన తంత్రంబులు ధర్మార్థ కామంబులు, జ్ఞానలభ్యంబు మోక్షంబు, మోక్షప్రదాత యగు హరి సకల భూతంబులకు నాత్మేశ్వరుండు, ప్రియుండు, దన చేతనయిన మహాభూతంబుల తోడ జీవసంజ్ఞితుం డయి యుండు, నిష్కాములై హృదయగతుం డయిన హరిని నిజభక్తిని భజింపవలయు. | 241 |
| క. |
దానవదైత్య భుజంగమ, మానవగంధర్వ సురసమాజములో ల క్ష్మీనాథు చరణకమల, ధ్యానంబున నెవ్వఁడయిన ధన్యత నొందున్. |
242 |
| క. |
చిక్కఁడు వ్రతములఁ గ్రతువులఁ, జిక్కఁడు, దానముల శౌచశీలతపములం జిక్కఁడు, యుక్తిని భక్తిని, జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము సుండీ! |
243 |
| క. |
చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వ మధికశాంతత్వంబుం జాలదు, హరి మెప్పింప వి, శాలోద్యములార! భక్తి చాలిన భంగిన్. |
244 |
| ఆ. |
దనుజభుజగయక్షదైత్యమృగాభీర, సుందరీ విహంగశూద్రశబరు లైనఁబాపజీవు లైన ముక్తికిఁబోదు, రఖిల జగము విష్ణుఁడనుచుఁదలఁచి. |
245 |
| క. |
గురువులు దమకును లోఁబడు, తెరువులు సెప్పెదరు, విష్ణుదివ్యపదవికిం దెరువులు సెప్పరు చీఁకటిఁ, బరువులు పెట్టంగనేల? బాలకులారా! |
246 |
| క. |
తెం డెల్ల పుస్తకంబులు, నిం డాచార్యులకు, మరల నేకతమునకున్ రండు, విశేషము సెప్పెదఁ, బొం డొల్లనివారు కర్మపుంజముపాలై. |
247 |
| క. |
ఆడుదము మనము, హరి రతిఁ, బాడుద మే ప్రొద్దు విష్ణుభద్రయశంబుల్, వీడుదము దనుజసంగతిఁ, గూడుదము ముకుందభక్తకోటిన్ సూటిన్. |
248 |
| క. |
విత్తము సంసృతిపటలము, వ్రత్తము కామాదివైరివర్గంబుల నేఁ డిత్తము చిత్తము హరికిని, జొత్తము నిర్వాణపదము, శుభమగు మనకున్. |
249 |
| వ. | అని యిట్లు ప్రహ్లాదుండు రహస్యంబున న య్యావేళల రాక్షస కుమారులకు నపవర్గమార్గంబు నెఱింగించిన వారును గురుశిక్షితంబులైన చదువులు చాలించి నారాయణ భక్తి చిత్తంబులం గీలించి యుండుటంజూచి వారల యేకాంతభావంబుఁదెలిసి వెఱచి వచ్చి శుక్రనందనుండు శక్రవైరి కిట్లనియె. | 250 |
| శా. |
రక్షోబాలుర నెల్ల నీ కొడుకు చేరంజీరి లోలోన నా శిక్షామార్గము లెల్లఁ గల్ల లని యాక్షేపించి తా నందఱన్ మోక్షాయత్తులఁ జేసినాఁడు, మనకున్ మోసంబు వాటిల్లె, నీ దక్షత్వంబునఁజక్కఁజేయవలయున్ దైతేయవంశాగ్రణీ! |
251 |
| క. |
ఉల్లసితవిష్ణుకథనము, లెల్లప్పుడు మాకుఁజెప్పఁడీ గురుఁడని న న్నుల్లంఘించి కుమారకు, లొల్లరు చదువంగ దానవోత్తమ! వింటే. |
252 |
| క. |
ఉడుగఁడు మధురిపు కథనము, విడివడి జడుపగిదిఁదిరుగు, వికసనమున నే నొడివిన నొడువులు నొడువఁడు, దుడుకనిఁ జదివింప మాకు దుర్లభ మధిపా! |
253 |
| క. |
చొక్కపు రక్కసి కులమున, వెక్కురు జన్మించినాఁడు విష్ణునియందున్ నిక్కపు మక్కువ విడువం, డెక్కడి సుతుఁగంటి? రాక్షసేశ్వర! వెఱ్ఱిన్ |
254 |
| వ. | అని యిట్లు గురుసుతుండు చెప్పినఁ గొడుకువలని విరోధ వ్యవహారంబులు కర్ణరంధ్రంబులందు ఖడ్గ ప్రహారంబులయి సోఁకిన బిట్టు మిట్టిపడి పదాహతంబైన భుజంగంబు భంగిఁ, బవన ప్రేరితంబైన దవానలంబు చందంబున, దండతాడితం బయిన కంఠీరవంబు కైవడి, భీషణరోషరసావేశజాజ్వల్యమాన చిత్తుండును, బుత్రసంహారోద్యోగాయత్తుండును. గంపమాన గాత్రుండును, నరుణీకృత నేత్రుండును నై కొడుకును రప్పించి సమ్మానకృత్యంబులఁదప్పించి నిర్దయుండై యశనిసంకాశభాషణంబుల నదల్చుచు. | 255 |
| శా. |
సూనున్ శాంతగుణప్రధాను నతిసంశుద్ధాంచితజ్ఞాను న జ్ఞానారణ్యకృశాను నంజలిపుటీసంభ్రాజమానున్ సదా శ్రీనారాయణపాదపద్మయుగళీచింతామృతాస్వాదనా ధీనున్ ధిక్కరణంబు సేసి పలికెన్ దేవాహితుండుగ్రతన్. |
256 |
| సీ. |
అస్మదీయంబగు నాదేశమునఁ గాని మిక్కిలి రవి మింట మెఱయ వెఱచు, నన్ని కాలములందు ననుకూలుఁడై కాని విద్వేషియై గాలి వీవ వెఱచు, మత్ప్రతాపానలమందీకృతార్చియై విచ్చలవిడి నగ్ని వెలుఁగ వెఱచు, నతితీక్ష్‌ణమైన నా యాజ్ఞ నుల్లంఘించి శమనుండు ప్రాణులఁజంప వెఱచు, |
|
| తే. |
నింద్రుఁ డౌదల నా మ్రోల నెత్త వెఱచు, నమర కిన్నర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావలి నాకు వెఱచు, నేల వెఱవవు? పలువ! నీ కేది దిక్కు? |
257 |
| శా. |
ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్వేషు లయ్యున్ మదీ యాజ్ఞాభంగము సేయనోడుదురు, రోషాపాంగదృష్టిన్ వివే క జ్ఞానచ్యుతమై జగత్త్రితయముంగంపించు, నీ విట్టిచో నాజ్ఞోల్లంఘన మెట్లు సేసితివి? సాహంకారతన్ దుర్మతీ! |
258 |
| శా. |
కంఠక్షోభము గాఁగ నొత్తిలి మహాగాఢంబుగా డింభ! వై కుంఠుంజెప్పెదు దుర్జయుం డనుచు, వైకుంఠుండు వీరవ్రతో త్కంఠాబంధురుఁడేని నే నమరులన్ ఖండింప దండింపఁగాఁ గుంఠీభూతుఁడు గాక రావలదె మద్ఘోరాహవక్షోణికిన్? |
259 |
| శా. |
ఆచార్యోక్తము గాక బాలురకు మోక్షాసక్తిఁబుట్టించి నీ వాచాలత్వముఁజూపి విష్ణు నహితున్ వర్ణించి మద్దైత్య వం శాచారంబులు నీఱు సేసితివి, మూఢాత్ముం గులద్రోహి నిన్ నీచుంజంపుట మేలు, చంపి కులమున్ నిర్దోషముంజేసెదన్. |
260 |
| క. |
దిక్కులు గెలిచితి నన్నియు, దిక్కెవ్వఁడు రోరి నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేఱొక, ది క్కెఱుఁగక కొలుతు రితఁడె దిక్కని నన్నున్. |
261 |
| క. |
బలవంతుఁడ నే జగముల, బలములతోఁ జనక వీరభావమున మహా బలుల జయించితి, నెవ్వని, బలమున నాడెదవు నాకుఁబ్రతివీరుఁడవై. |
262 |
| వ. | అనినఁదండ్రికి మెల్లన వినయంబునఁగొడు కిట్లనియె. | 263 |
| క. |
బలయుతులకు దుర్బలులకు, బల మెవ్వఁడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బల మెవ్వఁడు ప్రాణులకును, బల మెవ్వండట్టి విభుఁడు బల మసురేంద్రా! |
264 |
| క. |
దిక్కులు కాలముతో నే,దిక్కున లేకుండుఁ, గలుగు దిక్కుల మొదలై దిక్కు గల లేని వారికి, ది క్కయ్యెడు వాఁడు నాకు దిక్కు మహాత్మా! |
265 |
| సీ. |
కాలరూపంబులఁగ్రమవిశేషంబుల నలఘుగుణాశ్రయుండయిన విభుఁడు సత్త్వబలేంద్రియసహజప్రభావాత్ముఁడై వినోదంబున నఖిలజగముఁ గల్పించు, రక్షించు, ఖండించు, నవ్యయుం డన్ని రూపములందు నతఁడు గలఁడు చిత్తంబు సమముగాఁ జేయుము, మార్గంబుఁదప్పి వర్తించు చిత్తంబుకంటె |
|
| తే. |
వైరు లెవ్వరు, చిత్తంబు వైరిగాక, చిత్తమును నీకు వశముగాఁజేయవయ్య! మదయుతాసురభావంబు మానవయ్య!, యయ్య నీ మ్రోల మేలాడరయ్య! జనులు. |
266 |
| ఉ. |
లోకము లన్నియున్ గడియలోన జయించినవాఁడ, వింద్రియా నీకముఁజిత్తమున్ గెలువ నేరవు నిన్ను నిబద్ధుఁజేయు నీ భీకరశత్రు లార్వురఁబ్రభిన్నులఁజేసినఁబ్రాణికోటిలో నీకు విరోధి లేఁడొకఁడు, నేర్పునఁజూడుము దానవేశ్వరా! |
267 |
| క. |
పాలింపుము శేముషి, నున్మూలింపుము కర్మబంధముల, సమదృష్టిం జాలింపుము సంసారముఁ, గీలింపుము హృదయమందుఁగేశవభక్తిన్. |
268 |
| వ. | అనినఁబరమభాగవతశేఖరునకు దోషాచరశేఖరుండిట్లనియె. | 269 |
| క. |
చంపినఁ జచ్చెద ననుచును, గంపింపక యోరి పలువ! కఠినోక్తుల నన్ గుంపించెదు, చావునకుం, దెంపరివై వదరువాని తెఱఁగునఁగుమతీ! |
270 |
| శా. |
నాతోడంబ్రతిభాష లాడెదు, జగన్నాథుండు నా కంటె నీ భూతశ్రేణికి రాజు లేఁడొకఁడు సంపూర్ణప్రభావుండు, మ ద్భ్రాతంజంపిన మున్ను నే వెదకితింబల్మాఱు నారాయణుం డేతద్విశ్వములోన లేఁడు, మఱి వాఁడెందుండురా? దుర్మతీ! |
271 |
| క. |
ఎక్కడఁగలఁ? డే క్రియ నే, చక్కటి వర్తించు? నెట్టి జాడను వచ్చున్? జక్కడుతు నిన్ను విష్ణునిఁ, బెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్. |
272 |
| వ. | అనిన హరికింకరుండు శంకింపక హర్షపులకాంకుర సంకలిత విగ్రహుండై యాగ్రహంబు లేక హృదయంబున హరిం దలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు సేయుచు నిట్లనియె. | 273 |
| మ. |
కలఁడంభోధిఁ, గలండు గాలిఁ, గలఁడాకాశంబునం, గుంభినిం గలఁ, డగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోతచంద్రాత్మలం గల, డోంకారమునంద్రిమూర్తులఁద్రిలింగవ్యక్తులందంతటం గలఁ, డీశుండు గలండు, తండ్రి! వెదకంగా నేల నీ యా యెడన్. |
274 |
| క. |
ఇందుఁగలఁడందు లేఁడని, సందేహము వలదు, చక్రి సర్వోపగతుం, డెం దెందు వెదకి చూచిన, నందందే కలఁడు, దానవాగ్రణి! వింటే. |
275 |
| వ. | అని యి వ్విధంబున. | 276 |
| మ. |
‘హరి సర్వాకృతులంగలం’ డనుచుఁబ్రహ్లాదుండు భాషింప స త్వరుఁడై ‘యెందును లేఁడు లేఁ’డని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండె నచ్యుతుఁడు నానాజంగమస్థావరో త్కరగర్భంబుల నన్ని దేశముల నుద్దండప్రభావంబునన్. |
277 |
| వ. | అయ్యవసరంబున నద్దానవేంద్రుండు. | 278 |
| క. |
డింభక! సర్వస్థలముల, నంభోరుహనేత్రుఁడుండు ననుచు మిగుల సం రంభంబునఁ బలికెద వీ, స్తంభంబునఁజూపఁగలవె? చక్రిన్ గిక్రిన్. |
279 |
| క. |
స్తంభమునఁజూపవేనియుఁ, గుంభిని నీ శిరముఁద్రుంచి కూల్పఁగ రక్షా రంభమున వచ్చి హరి వి, స్రంభంబున నడ్డపడఁగ శక్తుండగునే? |
280 |
| వ. | అనిన భక్తవత్సలుని భటుండి ట్లనియె. | 281 |
| శా. |
‘అంభోజాసనుఁడాదిగాఁగఁదృణపర్యంతంబు విశ్వాత్ముఁడై సంభావంబున నుండు ప్రోడ విపులస్తంభంబునందుండఁడే? స్తంభాంతర్గతుఁడయ్యు నుండుటకు నే సందేహమున్ లేదు, ని ర్దంభత్వంబున నేఁడు గానఁబడుఁబ్రత్యక్షస్వరూపంబునన్’. |
282 |
| వ. | అనిన విని కరాళించి గ్రద్దన లేచి గద్దియ డిగ్గనుఱికి యొఱఁ బెట్టిన ఖడ్గంబు పెఱికి కేల నమర్చి జళిపించుచు మహాభాగవతశిఖామణి యైన ప్రహ్లాదుని ధిక్కరించుచు. | 283 |
| మ. |
వినరా! డింభక! మూఢచిత్త! గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుం డని భాషించెద, వైన నిందుఁగలఁడే యంచున్ మదోద్రేకియై దనుజేంద్రుండఱచేత వ్రేసెను మహోదగ్రప్రభాశుంభమున్ జనదృగ్భీషణదంభమున్ హరిజనుస్సంరంభమున్ స్తంభమున్. |
284 |