పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము సప్తమస్కంధము
బ్రహ్మాది దేవతలు శ్రీనృసింహదేవుని వేర్వేఱ స్తుతించుట
క. కరకమల యుగళ కీలిత, శిరులై డగ్గఱక భక్తిఁజేసిరి బహు సం
సరణాబ్ధితరికి నఖరికి, నరభోజనహస్తిహరికి నరకేసరికిన్‌.
304
వ. ఆ సమయంబున దేవత లందఱు వేఱు వేఱ వినుతించి, రందుఁ గమలాసనుం డిట్లనియె. 305
మ. ఘనలీలాగుణచాతురిన్‌ భువనముల్‌ గల్పించి రక్షించి భే
దనముంజేయు దురంతశక్తికి ననంతజ్యోతికింజిత్ర వీ
ర్యునికిన్‌ నిత్యపవిత్రకర్మునికి నే నుత్కంఠతో నవ్యయా
త్మునికిన్‌ వందన మాచరించెదఁ గృపాముఖ్యప్రసాదార్థినై.
306
వ. రుద్రుం డిట్లనియె. 307
చ. అమరవరేణ్య! మీఁదట సహస్రయుగాంతము నాఁడు గాని కో
పమునకు వేళ కాదు, సురబాధకుఁడైన తమస్వినీచరున్‌
సమరమునన్‌ వధించితివి చాలుఁదదాత్మజుఁడైన వీఁడు స
ద్విమలుఁడు నీకు భక్తుఁడు పవిత్రుఁడు గావుము భక్తవత్సలా!
308
వ. ఇంద్రుం డిట్లనియె. 309
సీ. ప్రాణి సంఘముల హృత్పద్మ మధ్యంబుల నివసించి భాసిల్లు నీవ యెఱుఁగు
దింతకాలము దానవేశ్వరుచే బాధ పడి చిక్కియున్న యాపన్న జనుల
రక్షించితివి మమ్ము రాక్షసేశ్వరుఁ జంపి క్రతుహవ్యములు మాకుఁ గలిగె మరల
మంటిమి నీ సేవ మరగిన వారలు కైవల్య విభవంబు కాంక్షసేయ,
 
ఆ. రితర సుఖము లెల్ల నిచ్ఛయింపఁగ నేల, యస్థిరంబు లివి యనంత భక్తిఁ
గొలువ నిమ్ము నిన్ను ఘోరదైత్యానీక, చిత్తభయద రంహ! శ్రీనృసింహ!
310
వ. ఋషు లిట్లనిరి. 311
మ. భవదీయోదరలీనలోకముల నుత్పాదించి రక్షింప నేఁ
డవి దైత్యేశునిచేత భేదితములై హ్రస్వంబులై యుండ నీ
యవినీతు న్నరసింహరూపమున సంహారంబు నొందించి వే
దవిధింగ్రమ్మఱ నుద్ధరించితి గదా! ధర్మానుసంధాయివై.
312
వ. పితృదేవత లిట్లనిరి. 313
శా. చండక్రోధముతోడ దైత్యుఁడు వడిన్‌ శ్రాద్ధంబులన్‌ మత్సుతుల్‌
పిండంబుల్‌ సతిలోదకంబులుగ నర్పింపంగ మా కీక యు
ద్దండత్వంబునఁదాన కైకొను మహోదగ్రుండు వీఁడిక్కడన్‌
ఖండింపంబడె నీ నఖంబుల నుతుల్‌ గావింతు మాత్మేశ్వరా!
314
వ. సిద్ధు లి ట్లనిరి. 315
క. క్రుద్ధుండై యణిమాదిక, సిద్ధులు గైకొనిన దైత్యుఁ జీరితివి మహా
యోద్ధవు నీ కృప మాకును, సిద్ధులు మఱలంగఁగలిగె శ్రీనరసింహా!
316
వ. విద్యాధరు లిట్లనిరి. 317
క. దానవునిఁ జంపి యంత, ర్ధానాదిక విద్యలెల్ల దయతో మఱలం
గా నిచ్చితివి విచిత్రము, నీ నిరుపమవైభవంబు నిజము నృసింహా!
318
వ. భుజంగు లి ట్లనిరి. 319
క. రత్నములను మత్కాంతా, రత్నములనుబుచ్చుకొన్న రక్కసు నురమున్‌
యత్నమున వ్రచ్చి వైచితి, పత్నులు రత్నములుఁగలిగిఁబ్రతికితి మీశా!
320
వ. మనువు లిట్లనిరి. 321
క. దుర్ణయుని దైత్యుఁ బొరిగొని, వర్ణాశ్రమధర్మసేతువర్గము మరలం
బూర్ణముఁజేసితి వేమని, వర్ణింతుము కొలిచి బ్రదుకువారము దేవా!
322
వ. ప్రజాపతు లిట్లనిరి. 323
మ. ప్రజలంజేయుటకై సృజించితి మముం బాటించి దైత్యాజ్ఞచేఁ
బ్రజలంజేయక యింతకాలము మహాభారంబుతో నుంటి, మీ
కుజనున్‌ వక్షముఁజీరి చంపితివి, సంకోచంబు లే కెల్లచోఁ
బ్రజలంజేయుచు నుండువారము జగద్భద్రాయమాణోదయా!
324
వ. గంధర్వు లి ట్లనిరి. 325
క. ఆడుదుము రేయుఁ బగలుం, బాడుదుము నిశాటునొద్ద, బాధించు, దయం
జూడఁడు, నీచే జమునిం, గూడె మహాపాతకునకుఁగుశలము గలదే?
326
వ. చారణు లిట్లనిరి. 327
క. భువనజనహృదయభల్లుఁడు, దివిజేంద్రవిరోధి నేఁడు దెగె నీ చేతన్‌
భవరోగనివర్తక మగు, భవదంఘ్రియుగంబుఁజేరి బ్రదికెద మీశా!
328
వ. యక్షు లిట్లనిరి. 329
ఉ. భ్రంశము లేని నీ భటుల భంగవిముక్తుల మమ్ము నెక్కి ని
స్సంశయవృత్తి దిక్కులఁబ్రచారము సేయుచు నుండు వీఁడు, ని
స్త్రింశముతోడ వీనిఁగడతేర్చితి, వాపద మానె నో చతు
ర్వింశతితత్త్వశాసక! త్రివిష్టపముఖ్య! జగన్నివాసకా!
330
వ. కింపురుషు లి ట్లనిరి. 331
క. పురుషోత్తమ! నేరము కిం, పురుషుల, మల్పులము, నిన్ను భూషింపఁగ, దు
ష్పురుషున్‌, సకలసుజన హృ, త్పరుషుం జంపితివి జగము బ్రదికె నధీశా!
332
వ. వైతాళికు లిట్లనిరి. 333
క. త్రిభువనశత్రుఁడు పడియెను, సభలందును మఖములందు జగదీశ్వర! నీ
శుభగీతములు పఠించుచు, నభయులమై సంచరింతు మార్తశరణ్యా!
334
వ. కిన్నరు లిట్లనిరి. 335
క. ధర్మము దలఁపఁడు, లఘుతర, కర్మము సేయించు మమ్ముఁగలుషాత్మకు దు
ష్కర్మునిఁజంపితి, వున్నత, శర్ములమై నీదు భక్తి సలిపెదము హరీ!
336
వ. విష్ణుసేవకులిట్లనిరి. 337
ఉ. సంచితవిప్రశాపమునఁజండనిశాచరుఁడైన వీని శి
క్షించుట కీడు గాద, కృప సేసితి వీశ్వర, భక్తితోడ సే
వించుటకంటె వైరమున వేగమ చేరఁగ వచ్చు నిన్ను నీ
యంచితనారసింహతను వద్భుత, మాపదఁబాసి రందఱున్‌.
338
వ. ఇట్లు బ్రహ్మరుద్రేంద్ర సిద్ధ సాధ్య పురస్సరులైన దేవముఖ్యు లందఱు నెడ గలిగి యనేక ప్రకారంబుల వినుతించి, రందు రోష విజృంభమాణుం డయిన నరసింహదేవుని డగ్గఱఁ జేర వెఱచి లక్ష్మీదేవిం బిలిచి యిట్లనిరి. 339
క. హరికిం బట్టపుదేవివి, హరిసేవానిపుణమతివి, హరిగతివి, సదా
హరిరతివి, నీవు సని నర, హరిరోషము డింపవమ్మ! హరివరమధ్యా!
340
వ. అనిన నియ్యకొని మహోత్కంఠతోడ నా కలకంఠకంఠి నరకంఠీరవుని యుపకంఠంబునకుంజని. 341
సీ. ప్రళయార్కబింబంబు పగిది నున్నది గాని నెమ్మోము పూర్ణేందునిభము గాదు,
శిఖిశిఖాసంఘంబు చెలువు సూపెడుఁ గాని చూడ్కి ప్రసాదభాసురము గాదు,
వీరరౌద్రాద్భుతావేశ మొప్పెడుఁగాని భూరికృపారసస్ఫూర్తి గాదు,
భయదదంష్ట్రాంకురప్రభలు గప్పెడుఁగాని దరహసితాంబుజాతంబు గాదు,
 
తే. కఠిననఖరనృసింహవిగ్రహము గాని, కామినీజనసులభవిగ్రహము కాదు,
విన్నదియుఁగాదు, తొల్లి నే విష్ణువలనఁ, గన్నదియుఁగాదు భీషణాకార మనుచు.
342
క. పలికెద నని గమకముఁగొనుఁ, బలికినఁగడు నలుగు, విభుఁడు ప్రతివచనములం
బలుకఁడని నిలుచు శశిముఖి, బలువిడి హృదయమునఁజనవు భయమును గదురన్‌.
343
వ. ఇట్లు నరహరిరూపంబు వారిజనివాసిని వీక్షించి శంకించి శాంతుండైన వెనుక డగ్గఱెద నని చింతించుచున్న వారిజసంభవుం డ ద్దేవుని రోషంబు నివారింప నితరుల కలవి గా దని ప్రహ్లాదుం జీరి యిట్లనియె. 344
క. తీండ్రమగు రోషమున మీ, తండ్రి నిమిత్తమునఁజక్రి దారుణమూర్తిన్‌
వేండ్రము విడువఁడు, మెల్లన, తండ్రీ! శీతలునిఁజేసి దయ సేయఁగదే!
345
వ. అనిన ‘నౌఁగాక’యని మహాభాగవత శేఖరుండయిన బాలకుండు కరకమలంబులు ముకుళించి మందగమనంబున నమంద వినయ వివేకంబుల నరసింహదేవుని సన్నిధికిం జని సాష్టాంగ దండ ప్రణామంబు సేసిన భక్తపరాధీనుండగు నయ్యీశ్వరుం డాలోకించి. 346
ఉ. ప్రాభవ మొప్ప నుత్కటకృపామతియై కదియంగఁ జీరి సం
శోభితదృష్టిసంఘములఁజూచుచు బాలుని మౌళియందు లో
కాభినుతుండు పెట్టె నసురాంతకుఁడుద్భటకాలసర్ప భీ
తాభయదానశస్తము ననర్గళమంగళహేతుహస్తమున్‌.
347
వ. ఇట్లు హరికరస్పర్శనంబున భయవిరహితుండును, బ్రహ్మ జ్ఞాన సహితుండును, బులకితదేహుండును, సముత్పన్న సంతోష బాష్పసలిలధారా సమూహుండును, బ్రేమాతిశయ గద్గద భాషణుండును, వినయవివేక భూషణుండును, నేకాగ్రచిత్తుండును, భక్తి పరాయత్తుండును నయి య ద్దేవుని చరణ కమలంబులు దనహృదయంబున నిలిపికొని కరకమలంబులు ముకుళించి యిట్లని వినుతించె. 348
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - saptama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )