| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | సప్తమస్కంధము |
| మ. |
అమరుల్ సిద్ధులు సంయమీశ్వరులు బ్రహ్మాదుల్ సతాత్పర్య చి త్తములన్ నిన్ను బహుప్రకారముల నిత్యంబున్ విచారించి పా రము ముట్టన్ నుతిసేయ నోపరఁట, నే రక్ష స్తనూజుండ, గ ర్వమదోద్రిక్తుఁడ, బాలుఁడన్, జడమతిన్, వర్ణింప శక్తుండనే? |
349 |
| మ. |
తపమున్ వంశముఁదేజమున్ శ్రుతము సౌందర్యంబు నుద్యోగమున్ నిపుణత్వంబుఁబ్రతాపపౌరుషములున్ నిష్ఠాబలప్రజ్ఞలున్ జపహోమంబులుఁజాల వీశ్వర! భవత్సంతుష్టికై దంతి యూ థపుచందంబున భక్తిచేయవలయుందాత్పర్యసంయుక్తుఁడై. |
350 |
| మ. |
అమలజ్ఞానసుదానధర్మరతి సత్యక్షాంతి నిర్మత్సర త్వములన్ యజ్ఞతపోఽనసూయలఁ గడున్ దర్పించు ధాత్రీసురో త్తముకంటెన్ శ్వపచుండు ముఖ్యుఁడు మనోఽర్థప్రాణ వాక్కర్మముల్ సమతన్ నిన్ను నయించెనేని నిజవంశశ్రీకరుం డౌఁదుదిన్. |
351 |
| సీ. |
అజ్ఞుండు సేసిన యారాధనములఁజేపట్టఁ డీశ్వరుఁడు కృపాళుఁడగుటఁ జేపట్టు నొకచోట సిద్ధ మీశ్వరునకు నర్థంబు లేకుండు, నతఁడు పూర్ణుఁ డైన నర్థము లీశ్వరార్పణంబులు గాఁగఁజేయుట ధర్మంబు సేసెనేని నద్దంబుఁజూచిన నళికలలామంబు ప్రతిబింబితంబగు పగిది మరల |
|
| తే. |
నర్థములు దోఁచుఁ,గావున నధికబుద్ధి, భక్తిసేయంగవలయును, భక్తి గాని మెచ్చఁడర్థంబు లొసఁగెడు మేరలందుఁ, బరమకరుణుండు హరిభక్తిబాంధవుండు. |
352 |
| క. |
కావున నల్పుఁడ, సంస్తుతిఁ, గావించెద వెఱపు లేక కలనేరుపునన్ నీ వర్ణనమున ముక్తికిఁ, బోవు నవిద్యను జయించి పురుషుఁడనంతా! |
353 |
| సీ. |
సత్త్వాకరుఁడవైన సర్వేశ!, నీ యాజ్ఞ శిరముల నిడుకొని చేయువారు బ్రహ్మాదు లమరులు భయ మందుచున్నారు నీ భీషణాకృతి నేఁడు చూచి రోషంబు మాను, నీ రుచిరవిగ్రహములు కల్యాణకరములు గాని భీతి కరములు గావు లోకములకు, వృశ్చికపన్నగంబుల భంగి భయముఁజేయు |
|
| తే. |
నసుర మర్దించితివి, సాధుహర్ష మయ్యె, నవతరించిన పని దీఱె నలుక యేల? కలుషహారివి సంతోషకారి వనుచు, నిన్నుఁదలఁతురు లోకులు నిర్మలాత్మ! |
354 |
| మ. |
ఖరదంష్ట్రా భ్రుకుటీ సటానఖయు నుగ్రధ్వానయున్ రక్త కే సరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతిఁ జూచి నే వెఱవఁ, బూర్ణక్రూర దుర్వార దు ర్భర సంసారదవాగ్నికిన్ వెఱతు, నీ పాదాశ్రయుం జేయవే! |
355 |
| వ. | దేవా! సకలయోనులందును సుఖవియోగ దుఃఖసంయోగ సంజనితంబైన శోకానలంబున దందహ్యమానుండనై, దుఃఖ నివారకంబు గాని దేహాద్యభిమానంబున మోహితుండనై పరిభ్రమించుచున్న యేను నాకుం బ్రియుండవు సఖుండవుఁ బర దేవతవు నైన నీ యొక్క బ్రహ్మగీతంబు లయిన లీలావతార కథావిశేషంబులఁ బఠియించుచు రాగాదినిర్ముక్తుండనై దుఃఖ పుంజంబులఁ దరియించి భవదీయ చరణకమల స్మరణ సేవా నిపుణులైన భక్తులం జేరి యుండెద, బాలునిఁ దల్లిదండ్రులును, రోగిని వైద్యదత్తం బయిన యౌషధంబును, సముద్రంబున మునింగెడివాని నావయును దక్కనొరులు రక్షింపనేరని తెఱంగున సంసారతాపతంతప్య మానుండై నీ చేత నుపేక్షితుండయిన వాని నుద్ధరింప నీవు దక్క నన్యుండు సమర్థుండు గాఁడు, జగంబుల నెవ్వండేమి కృత్యంబు నెవ్వనిచేతం బ్రేరితుండై యేయింద్రియంబులం జేసి యేమిటికొఱకు నెవ్వనికి సంబంధియై యే స్థలంబున నే సమయంబునం దేమి రూపంబున నే గుణంబున నపరంబైన జనకాది భావంబున నుత్పాదించి పరంబయిన బ్రహ్మాది భావంబున రూపాంతరంబు నొందించునట్టి వివిధ ప్రకారంబు లన్నియు నిత్యముక్తుండవు రక్షకుండవు నైన నీవ, నీ యంశంబైన పురుషునికి నీ యనుగ్రహంబునఁ గాలంబుచేతం బ్రేరిత యై కర్మమయంబును బలయుతంబును బ్రధానలింగమును నైన మనంబును నీ మాయ సృజియించు, నవిద్యార్పితవికారంబును, వేదోక్తకర్మ ప్రధానంబును, సంసార చక్రాత్మకంబైన యీ మనమున నిన్ను సేవింపక నియమించి తరియింప నొక్కండును సమర్థుండు లేఁడు, విజ్ఞాననిర్జిత బుద్ధి గుణుండవు నీవు, నీ వలన వశీకృతకార్య సాధన శక్తియైన కాలంబు మాయతోడం గూడ షోడశవికారయుక్తంబయిన సంసార చక్రంబుఁ జేయుచుండు, సంసారదావ దహన తంతప్య మానుండనగు నన్ను రక్షింపుము. | 356 |
| సీ. |
జనులు దిక్పాలుర సంపదాయుర్విభవములు గోరుదురు భవ్యంబు లనుచు, నవి యంతయును రోషహాసజృంభితమైన మా తండ్రి బొమముడి మహిమఁజేసి విహతంబు లగు,నట్టి వీరుండు నీ చేత నిమిషమాత్రంబున నేఁడు మడిసెఁ, గావున ధ్రువములు గావు బ్రహ్మాదుల శ్రీవిభవంబులు జీవితములుఁ, |
|
| తే. |
గాలరూపకుఁడగు నురుక్రముని చేత, విదళితము లగు, నిలువవు వేయు నేల? యితర మేనొల్ల నీమీఁది యెఱుక కొంత, గలిగియున్నది కొలుతుఁగింకరుఁడ నగుచు. |
357 |
| మత్తకోకిలము. |
ఎండమావులవంటి భద్రము లెల్ల సార్థము లంచు మ ర్త్యుండు రోగనిధాన దేహముతో విరక్తుఁడు గాక యు ద్దండమన్మథవహ్ని నెప్పుడుఁ దప్తుఁడై యొకనాఁడుఁ జే రండు పారము దుష్టసౌఖ్యపరంపరాక్రమణంబునన్. |
358 |
| ఉ. |
శ్రీమహిళామహేశ సరసీరుహగర్భులకైన నీ మహో ద్దామకరంబుచే నభయదానము సేయవు, నేను బాలుఁడం దామస వంశ సంభవుఁడ, దైత్యుఁడ, నుగ్రరజోగుణుండ ని స్సీమ దయం గరాంబుజము శీర్షముఁ జేర్చుట చోద్యమీశ్వరా! |
359 |
| వ. | మహాత్మా! సుజనులయిన బ్రహ్మాదులందును, దుర్జనులైన మాయందును సేవానురూపంబునం బక్షాపక్షంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు సేయుదువు, కందర్పసమేతంబగు సంసార కూపంబునం గూలుచున్న మూఢ జనులం గూడి కూలెడి నేను భవదీయ భృత్యుండగు నారదుని యనుగ్రహంబునం జేసి నీ కృపకుఁ బాత్రుండనైతి, నన్ను రక్షించి మజ్జనకు వధియించుట నా యందులఁ బక్షపాతంబు గాదు, దుష్టదనుజ సంహారంబును శిష్టభృత్యమునిజన రక్షా ప్రకారంబును నీకు నైజ గుణంబులు, విశ్వంబు నీవ; గుణాత్మకంబైన విశ్వంబు సృజియించి యందుం బ్రవేశించి హేతు భూత గుణయుక్తుండవై రక్షక సంహారకాది నానా రూపంబుల నుండుదువు; సదసత్కారణ కార్యాత్మకం బయిన విశ్వంబునకుం బరమకారణంబు నీవ; నీ మాయచేత వీఁడుఁ దాననియెడు బుద్ధివికల్పంబు దోఁచుఁ; గాని నీ కంటె నొండెద్దియు లేదు; బీజంబు నందు వస్తుమాత్ర భూత సౌక్ష్మ్యంబును వృక్షంబునందు నీలత్వాదివర్ణంబునుం గలుగు తెఱంగున విశ్వంబునకు నీ యంద జన్మస్థితి ప్రకాశ నాశంబులుం గలుగు; నీ చేతనయిన విశ్వంబు నీ యంద నిలుపుకొని తొల్లి ప్రళయకాల పారావారంబునఁ బన్నగేంద్ర పర్యంకంబునఁ గ్రియారహితుండవై నిజసుఖానుభవంబు సేయుచు నిద్రితుని భంగి యోగనిమీలిత లోచనుండవై మెలంగుచుఁ గొంతకాలంబునకు నిజకాల శక్తిచేతం బ్రేరితంబులై ప్రకృతి ధర్మంబులయిన సత్త్వాదిగుణంబుల నంగీకరించి సమాధి చాలించి వెలుంగుచున్న నీ నాభియందు వటబీజంబు వలన నుద్భవించు వటంబు తెఱంగున నొక్క కమలంబు సంభవించె, నిట్టి కమలంబువలన నాల్గుమోముల బ్రహ్మ జన్మించి దిశలు వీక్షించి కమలంబునకు నొం డయిన రూపంబు లేకుండుటఁ జింతించి జలాంతరాళంబుఁ బ్రవేశించి జలంబులందు నూఱు దివ్యవత్సరంబులు వెదకి తన జన్మంబునకు నుపాదానకారణంబైన నిన్ను దర్శింప సమర్థుండు గాక మగిడి కమలంబు కడకుం జని విస్మయంబు నొంది చిరకాలంబు నిర్భర తపంబు సేసి పృథివియందు గంధంబు గను చందంబునఁ దనయందు నానా సహస్రవదన శిరో నయన నాసా కర్ణ వక్త్ర భుజ కర చరణుండును బహువిధాభరణుండును మాయాకలితుండును మహాలక్షణలక్షితుండును నిజప్రకాశ దూరీకృతతముండును బురుషోత్తముండును నయిన నిన్ను దర్శించె, నయ్యవసరంబున. | 360 |
| క. |
ఘోటకవదనుఁడవై మధు, కైటభులంద్రుంచి నిగమగణముల నెల్లం బాటించి యజున కిచ్చిన, కూటస్థుఁడ వీశ్వరుఁడవు! కోవిదవంద్యా! |
361 |
| వ. | ఇవ్విధంబునఁ గృత త్రేతా ద్వాపరంబులను మూఁడు యుగంబులందును దిర్యఙ్మానవ మునిజలచరా కారంబుల నవతరించి లోకంబుల నుద్ధరించుచు హరించుచు యుగానుకూల ధర్మంబులం బ్రతిష్ఠింపుచు నుండుదువు. దేవా! యవధరింపుము. | 362 |
| సీ. |
కామహర్షాదిసంకలితమై చిత్తంబు భవదీయచింతనపదవి సొరదు, మధురాదిరసముల మరగి చొక్కుచు జిహ్వ నీ వర్ణనమునకు నిగుడనీదు, సుందరీముఖములఁజూడఁగోరుచుఁజూడ్కి తావకాకృతులపైఁదగులువడదు, వివిధదుర్భాషలు వినఁగోరు వీనులు వినవు యుష్మత్కథావిరచనములు, |
|
| తే. |
ఘ్రాణ మురవడిఁదిరుగు దుర్గంధములకుఁ, దవులు గొలుపదు వైష్ణవధర్మములకు, నడఁగి యుండవు, కర్మేంద్రియములు పురుషుఁ, గలఁచు సవతులు గృహమేధిఁ గలఁచునట్లు. |
363 |
| వ. | ఇవ్విధంబున నింద్రియంబులచేతం జిక్కువడి స్వకీయ పరకీయ శరీరంబులందు మిత్రామిత్ర భావంబులు సేయుచు జన్మమరణంబుల నొందుచు సంసారవైతరణీ నిమగ్నం బయిన లోకంబు నుద్ధరించుట లోకసంభవ స్థితిలయకారణుండవైన నీకుం గర్తవ్యంబు, భవదీయ సేవకుల మయిన మా యందుం బ్రియభక్తులయిన వారల నుద్ధరింపుము. | 364 |
| మ. |
భగవద్దివ్యగుణానువర్తన సుధాప్రాప్తైకచిత్తుండనై బెగడన్ సంసరణోగ్రవైతరణికిన్, భిన్నాత్ములై తావకీ యగుణస్తోత్రపరాఙ్ముఖత్వమున మాయాసౌఖ్యభావంబులన్ సుగతింగానని మూఢులన్ గని మదిన్ శోకింతు సర్వేశ్వరా! |
365 |
| వ. | దేవా! మునీంద్రులు నిజవిముక్తి కాములయి విజనస్థలంబులం దపంబు లాచరింతురు, కాముకత్వంబు నొల్లక యుండువారికి నీ కంటె నొండు శరణంబు లేదు, గావున నిన్ను సేవించెదఁ, గొందఱు కాముకులు కరద్వయ కండూతి చేతం దనియని చందంబునఁ దుచ్ఛంబయి పశుపక్షి క్రిమికీట సామాన్యం బయిన మైథునాది గృహమేధి సుఖంబులం దనియక కడపట నతిదుఃఖవంతు లగుదురు, నీ ప్రసాదంబు గల సుగుణుండు నిష్కాముండయి యుండు, మౌనవ్రత జపతపశ్శ్రుతాధ్యయనంబులును, నిజధర్మవ్యాఖ్యాన విజనస్థలనివాస సమాధులును, మోక్షహేతువులగు, నైన నివి పదియు నింద్రియ జయంబు లేని వారికి, భోగార్థంబు లయి విశ్రమించు వారికి జీవనోపాయంబు లయి, డాంబికులకు వార్తాకరంబులయి యుండు, సఫలంబులు గావు, భక్తిలేక భవదీయజ్ఞానంబు లేదు, రూపరహితుండవైన నీకు బీజాంకురంబుల కైవడిఁ గారణకార్యంబు లయిన సదసద్రూపంబులు రెండును బ్రకాశ మానంబులగు, నా రెంటియందును భక్తియోగంబున బుద్ధిమంతులు మథనంబున దారువులందు వహ్నిం గనియెడు తెఱంగున నిన్నుఁ బొడగందురు, పంచభూత తన్మాత్రంబులును, బ్రాణేంద్రియంబు లును, మనోబుద్ధ్యహంకార చిత్తంబులును నీవ, సగుణంబును నిర్గుణంబును నీవ, గుణాభిమానులయిన జన్మమరణంబుల నొందు విబుధు లాద్యంతంబులు గానక నిరుపాధికుండవైన నిన్నెఱుంగరు, తత్త్వజ్ఞు లయిన విద్వాంసులు వేదాధ్యయనాది వ్యాపారంబులు మాని వేదాంత ప్రతి పాద్యుండవగు నిన్ను సమాధివిశేషంబుల నెఱింగి సేవింతు, రది గావున. | 366 |
| సీ. |
నీ గృహాంగణభూమి నిటలంబు మోవంగ మోదించి నిత్యంబు మ్రొక్కఁడేని, నీ మంగళస్తవనికరవర్ణంబులు పలుమాఱు నాలుకఁబలుకఁడేని, నీ యధీనములుగా నిఖిలకృత్యంబులు ప్రియభావమున సమర్పింపఁడేని, నీ పదాంబుజముల నిర్మలహృదయుఁడై చింతించి మక్కువఁజిక్కఁడేని. |
|
| తే. |
నిన్నుఁజెవులార వినఁడేని, నీకు సేవ, సేయ రాఁడేని బ్రహ్మంబు జెందఁగలఁడె? యోగియైనఁదపోవ్రతయోగియైన, వేదియైన మహాతత్త్వవేదియైన. |
367 |
| వ. | కావున భవదీయ దాస్యయోగంబు కృపసేయు మని ప్రణతుండైన ప్రహ్లాదుని వర్ణనంబులకు మెచ్చి నిర్గుణుండైన హరి రోషంబు విడిచి యిట్లనియె. | 368 |
| శా. |
సంతోషించితి నీ చరిత్రమునకున్, సద్భద్ర మౌఁగాక !నీ యంతర్వాంఛితలాభ మెల్లఁ గరుణాయత్తుండనై యిచ్చెదం? జింతంజెందకు, భక్తకామదుఁడ నే, సిద్ధంబు దుర్లోక్యుఁడన్, జంతుశ్రేణికి నన్నుఁజూచినఁబునర్జన్మంబు లే దర్భకా! |
369 |
| ఆ. |
సకలభావములను సాధులు విద్వాంసు, లఖిల భద్రవిభుఁడ నైన నన్నుఁ గోర్కు లి మ్మటంచుఁగోరుదు, రిచ్చెదఁ, గోరు మెద్దియైనఁ గుఱ్ఱ! నీవు. |
370 |
| వ. | అని పరమేశ్వరుండు ప్రహ్లాదునియందుఁ గల సకామత్వంబుఁ దెలియు కొఱకు వంచించి యిట్లానతిచ్చిన నతండు నిష్కాముండైన యేకాంతి గావునఁ గామంబు భక్తియోగంబునకు నంతరాయం బని తలంచి యిట్లనియె, నుత్పత్తి మొదలు కామాద్యనుభవాసక్తి గల నాకు వరంబు లిచ్చెద నని వంచింప నేల? సంసార బీజంబునకు హృదయ బంధకంబు లయిన కామంబులకు వెఱచి ముముక్షుండనై సేమంబు కొఱకు నేమంబున నిన్నుం జేరితిఁ, గామంబులును, నింద్రియంబులును, మనశ్శరీర ధైర్యంబులును, మనీషాప్రాణ ధర్మంబులును, లజ్జాస్మరణ లక్ష్మీసత్య తేజో విశేషంబులును, నశించు; లోకంబులందు భృత్యు లర్థకాములయి రాజుల సేవింతురు, రాజులుం బ్రయోజనంబు లర్థించి భృత్యులకు నర్థంబు లొసంగుదు, రవ్విధంబునం గాదు, నాకుం గామంబు లేదు, నీకుం బ్రయోజనంబు లే, దయినను దేవా! వరదుఁడ వయ్యెద వేనిఁ గామంబులు వృద్ధిబొందని వరంబు కృపసేయుము, కామంబులు విడిచిన పురుషుండు నీతోడ సమాన విభవుం డగు, నరసింహ! పరమాత్మ! పురుషోత్తమ! యని ప్రణవ పూర్వకంబుగా నమస్కరించిన హరి యిట్లనియె. | 371 |
| సీ. |
నీయట్టి సుజ్ఞాననిపుణు లేకాంతులు గోర్కులు నాయందుఁగోర నొల్ల, రట్లైనఁబ్రహ్లాద! యసురేంద్రభర్తవై సాగి మన్వంతరసమయ మెల్ల, నిఖిలభోగంబులు నీవు భోగింపుము, కల్యాణబుద్ధి నా కథలు వినుము, సకలభూతములందు సంపూర్ణుఁడగు నన్ను యజ్ఞేశు నీశ్వరు నాత్మ నిలిపి |
|
| ఆ. |
కర్మచయము లెల్ల ఖండించి పూజన మాచరింపు మీశ్వరార్పణముగ, భోగముల నశించుఁబుణ్యంబు, వ్రతములఁబాపసంచయములు పాయు నిన్ను. |
372 |
| వ. | మఱియు నటమీఁదఁ గాలవేగంబునం గళేబరంబు విడిచి త్రైలోక్య విరాజమానంబును, దివిజరాజజేగీయ మానంబును బరిపూరిత దశదిశంబును నైన యశంబుతోడ ముక్తబంధుండవై నన్ను డగ్గఱియెదవు. వినుము. | 373 |
| ఆ. |
నరుఁడు ప్రియముతోడ నా యవతారంబు, నీ యుదారగీతనికరములును మానసించునేని మఱి సంభవింపఁడు, కర్మబంధచయముఁగడచిపోవు. |
374 |
| వ. | అనినఁబ్రహ్లాదుండిట్లనియె. | 375 |
| సీ. |
దంష్ట్రివై తొల్లి సోదరుని హిరణ్యాక్షు నీవు చంపుటఁజేసి నిగ్రహమున మా తండ్రి రోషనిమగ్నుఁడై సర్వలోకేశ్వరుఁబరము నిన్నెఱుఁగ లేక పరిపంథిపగిది నీ భక్తుండనగు నాకు నపకారములు సేసె; నతఁడు నేఁడు నీ శాంతదృష్టిచే నిర్మలత్వము నొందెఁ, గావునఁబాపసంఘంబువలనఁ |
|
| తే. |
బాసి శుద్ధాత్మకుఁడు గాఁగ భవ్యగాత్ర!, వరము వేఁడెద నా కిమ్ము వనజనేత్ర! భక్తసంఘాతముఖపద్మపద్మమిత్ర! భక్తకల్మషవల్లికాపటులవిత్ర! |
376 |
| వ. | అనిన భక్తవత్సలుం డిట్లనియె. | 377 |
| మ. |
నిజభక్తుండవు నాకు, నిన్నుఁగనుటన్ నీ తండ్రి త్రిస్సప్త పూ ర్వజులంగూడి పవిత్రుఁడై శుభగతిన్ వర్తించు, విజ్ఞాన దీ ప జితానేకభవాంధకారు లగు మద్భక్తుల్ వినోదించు దే శ జనుల్ దుర్జనులైన శుద్ధులు సుమీ! సత్యంబు దైత్యోత్తమా! |
378 |
| సీ. |
ఘనసూక్ష్మభూతసంఘాతంబులోపల నెల్లవాంఛలు మాని యెవ్వ రయిన నీ చందమున నన్ను నెఱయ సేవించిన మద్భక్తు లగుదురు, మత్పరులకు గుఱిసేయ నీవ యోగ్యుఁడ వైతి, విటమీఁద వేదచోదితమైన విధముతోడఁ జిత్తంబు నామీఁదఁజేర్చి మీ తండ్రికిఁ బ్రేతకార్యములు సంప్రీతిఁజేయు |
|
| తే. |
మతఁడు రణమున నేఁడు నా యంగమర్శ, నమున నిర్మలదేహుఁడై నవ్యమహిమ నపగతాఖిలకల్మషుఁడై తనర్చి, పుణ్యలోకంబులకు నేఁగుఁబుణ్యచరిత! |
379 |
| వ. | అని యిట్లు నరసింహదేవుం డానతిచ్చిన హిరణ్య కశిపునకుం బ్రహ్లాదుండు పరలోక క్రియలు సేసి భూసురోత్తములచేత నభిషిక్తుం డయ్యె, నయ్యెడం బ్రసాద సంపూర్ణ ముఖుండైన శ్రీ నృసింహదేవునిం జూచి దేవతా ప్రముఖ సహితుండైన బ్రహ్మదేవుం డిట్లనియె. | 380 |
| సీ. |
దేవ దేవాఖిలదేవేశ! భూతభావన! వీఁడు నాచేత వరము వడసి మత్సృష్టజనులచే మరణంబు నొందక మత్తుఁడై సకలధర్మములుఁజెఱచి నేఁడు భాగ్యంబున నీచేత హతుఁడయ్యెఁ, గల్యాణ మమరె లోకముల కెల్ల, బాలు నీతని మహాభాగవతశ్రేష్ఠుఁబ్రదికించితివి మృత్యుభయముఁబాపి |
|
| తే. |
వరము కృప సేసితివి మేలు వారిజాక్ష! నీ నృసింహావతారంబు నిష్ఠతోడఁ దగిలి చింతించువారలు దండధరుని, బాధ నొందరు, మృత్యువు బారిఁబడరు. |
381 |
| వ. | అనిన నరసింహదేవుండిట్లనియె. | 382 |
| క. |
‘మన్నించి దేవశత్రుల, కెన్నఁడు నిటువంటి వరము లీకుము, పాపో త్పన్నులకు వరము లిచ్చుట, పన్నగముల కమృత మిడుట పంకజగర్భా!’ |
383 |
| వ. | అని యిట్లానతిచ్చి బ్రహ్మాదిదేవతా సమూహంబుచేఁ బూజితుండై భగవంతుండైన శ్రీనృసింహదేవుండు తిరోహితుండయ్యె!, బ్రహ్లాదుండును శూలికిఁ బ్రణమిల్లి తమ్మిచూలికి వందనంబులు సేసి ప్రజాపతులకు మ్రొక్కి భగవత్కళలైన దేవతలకు నమస్కరించినం జూచి బ్రహ్మదేవుండు శుక్రాది మునీంద్ర సహితుండై దైత్య దానవ రాజ్యంబునకుం బ్రహ్లాదుం బట్టంబు గట్టి యతనిచేతఁ బూజితుండై దీవించె, అంత నీశానాది నిఖిలదేవతలు వివిధంబులగు నాశీర్వాదంబులచేత నా ప్రహ్లాదునిఁ గృతార్థుం జేసి తమ్మిచూలిని ముందట నిడుకొని నిజస్థానంబులకుఁ జని, రిట్లు విష్ణుదేవుండు నిజపార్శ్వచరు లిరువురు బ్రాహ్మణ శాపంబునం జేసి ప్రథమజన్మంబున దితిపుత్రులైన హిరణ్యాక్షహిరణ్యకశిపులను వరాహనారసింహ రూపంబుల నవతరించి వధియించె, ద్వితీయ భవంబున రాక్షసజన్మంబు దాల్చిన రావణకుంభకర్ణులను శ్రీరామ రూపంబున సంహరించెఁ దృతీయ జన్మంబున శిశుపాల దంతవక్త్రులను పేరులం ప్రసిద్ధి నొందిన వారలను శ్రీకృష్ణ రూపంబున ఖండించె, నివ్విధంబున మూఁడు జన్మంబుల గాఢ వైరానుబంధంబున నిరంతర సంభావితధ్యానులై వారలు నిఖిలకల్మషవిముక్తులై హరింగదిసి, రని చెప్పి నారదుండిట్లనియె. | 384 |
| ఉ. |
శ్రీరమణీయమైన నరసింహవిహారము నింద్రశత్రు సం హారముఁబుణ్యభాగవతుఁడైన నిశాచరనాథపుత్ర సం చారము నెవ్వఁడైన సువిచారత విన్నఁబఠించినన్ శుభా కారముతోడ నే భయముఁగల్గని లోకముఁజెందు భూవరా! |
385 |
| మ. |
జలజాతప్రభవాదులున్ మనములోఁజర్చించి భాషావళిం బలుకన్ లేని జనార్దనాహ్వయపరబ్రహ్మంబు నీ యింటిలోఁ జెలియై మేనమఱందియై సచివుఁడై చిత్తప్రియుండై మహా ఫలసంధాయకుఁడై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమా! |
386 |