| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | అష్టమస్కంధము |
| క. |
శ్రీమన్నామ! పయోద, శ్యామ! ధరాభృల్లలామ! జగదభిరామా! రామాజనకామ! మహో, ద్దామ! గుణస్తోమధామ! దశరథరామా! |
1 |
| వ. | మహనీయ గుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు శుకయోగీంద్రుం గనుంగొని. | 2 |
| క. |
వినఁబడియెను స్వాయంభువ, మనువంశము వర్ణధర్మమర్యాదలతో మనుజుల దనుజుల వేల్పుల, జననంబులు స్రష్టలెల్ల జనియించుటయున్. |
3 |
| ఉ. |
ఏ మనుకాలమందు హరి యీశ్వరుఁడేటికి సంభవించె? నే మేమి యొనర్చె? నమ్మనువులే? రతఁ డేక్రియఁజేయుచున్న వాఁ? డేమి నటించు మీఁద? గత మెయ్యది? సజ్జనులైనవారు ము న్నేమని చెప్పుచుందురు? మునీశ్వర నా కెఱిఁగింపవే దయన్. |
4 |
| వ. | అనిన శుకుండిట్లనియె. | 5 |
| క. |
ఈ కల్పంబున మనువులు ప్రాకటముగ నార్వురైరి పదునలువురలో; లోకముల జనుల పుట్టువు లాకథితము లయ్యె వరుస నఖిలములు నృపా! |
6 |
| వ. | ప్రథమ మనువైన స్వాయంభువునకు, నాకూతి దేవహూతులను నిరువురు గూఁతులు గలరు. వారికిఁ గ్రమంబునఁ గపిలయజ్ఞ నామంబుల లోకంబులకు ధర్మజ్ఞాన బోధంబు సేయుకొఱకు హరి పుత్త్రత్వంబు నొందె; నందుఁ గపిలుని చరిత్రంబు మున్న చెప్పంబడియె; యజ్ఞుని చరిత్రంబు సెప్పెద వినుము. | 7 |
| మ. |
శతరూపాపతి కామభోగవిరతిన్ సంత్యక్తభూభారుఁడై సతియుం దానును గాన కేఁగి శతవర్షంబుల్ సునందానదిన్ వ్రతియై యేకపదస్థుఁడై నియతుఁడై వాచంయమస్ఫూర్తితో గతదోషుండు తపంబు సేసె భువనఖ్యాతంబుగా భూవరా! |
8 |
| వ. | ఇట్లు తపంబు సేయుచు స్వాయంభువమనువు దన మనంబులోన. | 9 |
| సీ. |
సృష్టిచే నెవ్వఁడు చేతనపడకుండు? సృష్టి యెవ్వని చేఁతచే జనించు? జగములు నిద్రింప జాగరూకత నొంది యెవ్వఁడు బ్రహ్మాండ మెఱుఁగుచుండు? నాత్మకాధారంబు నఖిలంబు నెవ్వఁడౌ? నెవ్వని నిజధనంబింత వట్టు బొడగాన రాకుండఁబొడగను? నెవ్వఁడే నెవ్వని దృష్టికి నెదురు లేదు? |
|
| ఆ. |
జననవృద్ధి విలయ సంగతిఁజెందక, యెవ్వఁడెడపకుండు నెల్లయెడల? దన మహత్త్వసంజ్ఞఁదత్త్వ మెవ్వఁడు దాన, విశ్వరూపుఁడనఁగ విస్తరిల్లు? |
10 |
| వ. | అని మఱియు నిరహంకృతుండును బుధుండును నిరాశియుఁబరిపూర్ణుండును ననన్య ప్రేరితుండును నృశిక్షాపరుండును నిజమార్గ సంస్థితుండును నిఖిలధర్మ భావనుండునునైన పరమేశ్వరునకు నమస్కరించెద నని యుపనిషదర్థంబులు పలుకుచున్న మనువుం గనుంగొని. | 11 |
| క. |
రక్కసులు దినఁగఁగడఁగిన వెక్కసముగ యజ్ఞనామవిష్ణుఁడు వారిం జక్కడిచెఁజక్రధారల మిక్కుటముగ వేల్పులెల్ల మేలని పొగడన్. |
12 |
| వ. | ఇది ప్రథమమన్వంతరం; బింక ద్వితీయమన్వంతరంబు వినుము. | 13 |
| సీ. |
స్వారోచిషుండన సప్తార్చిబిడ్డఁడు మనువు, వానికి నా ద్యుమత్సుషేణ రోచిష్మదాదు లారూఢపుత్త్రులు ధాత్రి నేలిరి; రోచనుఁడింద్రుఁడయ్యె; నధికులు తుషితాదు లమరు లూర్జస్తంభ ముఖ్యు లాఢ్యులు సప్తమునులు నాఁడు వేదశిరుండను విప్రుని దయితకుఁదుషితకుఁబుత్త్రుఁడై తోయజాక్షుఁ |
|
| ఆ. |
డవతరించెను విభుఁడన నశీత్యష్టసహస్రమునులు నధికు లయినవారు; ఘను లనుగ్రహింపఁగౌమారక బ్రహ్మచారి యగుచు నతఁడు సలిపె వ్రతము. |
14 |
| వ. | తదనంతరంబ. | 15 |
| సీ. |
మనువు మూఁడవవాఁడు మనుజేంద్ర! యుత్తముండనఁబ్రియవ్రతునకు నాత్మజుండు పాలించె నిల యెల్లఁ బవన సృంజయ యజ్ఞహోత్రాదు లాతని పుత్త్రు లధిక గుణులు వసిష్ఠుని కొడుకులు ప్రమథాదు లైరి; సప్తర్షులు నమరవిభుఁడు సత్యజిత్తనువాఁడు సత్యభద్రాద్యులు సురలు ధర్మునికిని సూనృతకును |
|
| ఆ. |
బుట్టి సత్యనియతిఁబురుషోత్తముఁడు సత్యసేనుఁడనఁగ దుష్టశీలయుతుల దనుజయక్షపతుల దండించె సత్యజిన్మిత్రుఁడనఁగ జగము మే లనంగ. |
16 |