పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము అష్టమస్కంధము
గజేంద్ర మోక్షణ కథా ప్రారంభము
వ. చతుర్థమనువు కాలప్రసంగంబు వివరించెద. 17
సీ. మానవాధీశ్వర! మనువు నాలవవాఁడు తామసుండనఁగ నుత్తముని భ్రాత
పృథ్వీపతులు కేతువృషనరఖ్యాత్యాదు లతని పుత్త్రులు పద్గు రధికబలులు
సత్యకహరివీరసంజ్ఞులు వేల్పులు త్రిశిఖనామమువాఁడు దేవవిభుఁడు
మునులు జ్యోతిర్వ్యోమముఖ్యులు; హరి పుట్టె హరిమేధునకుఁబ్రీతి హరిణియందు;
 
ఆ. గ్రాహబద్ధుఁడయిన గజరాజు విడిపించి ప్రాణభయమువలనఁబాపి కాచె
హరి దయాసముద్రుఁ డఖిలలోకేశ్వరుఁ డనిన శుకునిఁజూచి యవనివిభుఁడు.
18
క. నీరాటవనాటములకుఁబోరాటంబెట్లు గలిగెఁ? బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్‌.
19
క. మునినాథ! యీ కథాస్థితి వినిపింపుము వినఁగ నాకు వేడుక పుట్టెన్‌;
వినియెదఁగర్ణేంద్రియముల పెనుఁబండువు సేయ మనముఁబ్రీతింబొందన్‌.
20
క. ఏ కథలయందుఁబుణ్యశ్లోకుఁడు హరి సెప్పఁబడును సూరిజనముచే
నా కథలు పుణ్యకథలని యాకర్ణింపుదురు పెద్ద లతిహర్షమునన్‌.
21
వ. ఇవ్విధంబునఁబ్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు బాదరాయణి నడిగెనని చెప్పి సభాసదులయిన మునుల నవలోకించి సూతుండు పరమహర్ష సమేతుండై చెప్పె; నట్లు శుకుండు రాజున కిట్లనియె. 22
సీ. రాజేంద్ర! విను సుధారాశిలో నొక పర్వతము త్రికూటంబనఁదనరుచుండు
యోజనాయుతమగు నున్నతత్వంబును నంతియ వెడలుపు నతిశయిల్లుఁ;
గాంచనాయస్సారకలధౌతమయములై మూఁడు శృంగంబులు మొనసియుండుఁ;
దటశృంగబహురత్నధాతుచిత్రితములై దిశలు భూనభములుఁదేజరిల్లు;
 
తే. భూరిభూజలతాకుంజపుంజములును, మ్రోసి పఱతెంచు సెలయేటి మొత్తములును
మరఁగి తిరిగెడు దివ్యవిమానములును, జఱులఁగ్రీడించు కిన్నరచయముఁగలిగి.
23
వ. అది మఱియును మాతులుంగ లవంగ లుంగ చూత కేతకీ భల్లాత కామ్రాతక సరళ పనస బదరీ వకుళ వంజుల వట కుటజ కుంద కురవక కురంటక కోవిదార ఖర్జూర నారికేళ సిందువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవీ మధూక తాల తక్కోల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వామలక క్రముక కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శింశు పాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లికామతల్లికా ప్రముఖ నిరంతర వసంతసమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరున్నివహాలంకృతంబును, మణివాలుకానేక విమల పులినతరంగిణీ సంగత విచిత్ర విద్రుమలతా మహోద్యాన శుక పిక నికర నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖిశాఖాంతర పరిపక్వ ఫలరంధ్రప్రవర్షిత రసప్రవాహ బహుళంబును, గనకమయ సలిల కాసార కాంచన కుముద కహ్లార కమల పరిమళ మిళిత కబళాహార సంతతాంగీకార భార పరిశ్రాంత కాంతా సమాలింగిత కుమార మత్త మధుకర విటసముదయ సమీపసంచార సముదంచిత శకుంత కలహంస కారండవ జలకుక్కుట చక్రవాక బక బలాక కోయష్టిక ముఖర జలవిహంగ విసర వివిధ కోలాహల బధిరీభూత భూ నభో0000ంతరాళంబును, దుహినకరకాంత మరకత కమలరాగ వజ్రవైదూర్య నీల గోమేధిక పుష్యరాగ మనోహర కనక కలధౌత మయానేక శిఖరతట దరీవిహరమాణ విద్యాధర విబుధ సిద్ధ చారణ గరుడ గంధర్వ కిన్నర కింపురుష మిథున సంతత సరససల్లాప సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధగజ గవయ గండభేరుండ ఖడ్గ కంఠీరవ శరభ శార్దూల శశ చమర శల్య భల్ల సారంగ సాలావృక వరాహ మహిష మర్కట మహోరగ మార్జాలాది నిఖిల మృగనాథ సమూహ సమర సన్నాహ సంరంభ సంచకిత శరణాగత శమన కింకరంబునై యొప్పు నప్పర్వత సమీపంబునందు. 24
క. భిల్లీ భిల్ల లులాయక, భల్లుక ఫణి ఖడ్గ గవయ వలిముఖ చమరీ
ఝిల్లీహరిశరభకకిటి, మల్లాద్భుతకాకఘూకమయమగు నడవిన్‌.
25
శా. అన్యాలోకనభీకరంబులు జితాశానేకపానీకముల్‌
వన్యేభంబులు గొన్ని మత్తతనులై వ్రజ్యావిహారాగతో
దన్యత్వంబున భూరిభూధరదరీద్వారంబులందుండి సౌ
జన్యక్రీడల నీరుగాలివడి కాసారావగాహార్థమై.
26
ఆ. అంధకార మెల్ల నద్రిగుహాంతర వీథులందుఁబగలు వెఱచి డాఁగి
యెడరు వేచి సంధ్య నినుఁడు వృద్ధత నున్న వెడలె ననఁగ గుహలు వెడలెఁగరులు.
27
క. తలఁగవు కొండలకైనను, మలఁగవు సింగములకైన, మార్కొను కడిమిం;
గలఁగవు పిడుగులకైనను, నిల బలసంపన్న వృత్తి నేనుఁగుగున్నల్‌.
28
సీ. పులుల మొత్తంబులు పొదరిండ్లలోఁదూఱు ఘోరభల్లూకముల్‌ గుహలు సొచ్చు;
భూదారములు నేల బొఱియలలో డాఁగు; హరిదంతముల కేఁగు హరిణచయము;
మడువుల జొరఁబాఱు మహిషసంఘంబులు; గండశైలంబులఁ గపులు ప్రాఁకు;
వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు; నీలకంఠంబులు నింగి కెగయు;
 
తే. వెఱచి చమరీమృగంబులు విసరు వాల, చామరంబుల విహరణశ్రమము వాయ
భయదపరిహేల విహరించు భద్రకరుల, గాలివాఱినమాత్రన జాలిఁబొంది.
29
క. మదగజదానామోదము గదలని తమకములఁద్రావి కడుపులు నిండన్‌
బొదలుచుఁదుమ్మెదకొదమల కదుపులు జుంజుమ్మటంచు గానముసేసెన్‌.
30
క. తేఁటి యొకటి యొరు ప్రియకును మాటికి మాటికిని నాగమదజలగంధం
బేటి? కని, తన్నుఁబొందెడి బోటికి నందిచ్చు నిండు బోటుఁదనమునన్‌.
31
క. అంగీకృతరంగన్మాతంగీ మదగంధ మగుచుఁదద్దయు వేడ్కన్‌
సంగీతవిశేషంబుల భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్కిన్‌.
32
క. వల్లభలు పాఱి మునుపడ వల్లభ మని ముసరి రేని వారణదానం
బొల్లక మధుకరవల్లభు లుల్లంబులఁబొందిరెల్ల యుల్లాసంబుల్‌.
33
వ. అప్పుడు. 34
మ. కలభంబుల్‌ సెరలాడుఁబల్వలము లాఘ్రాణించి మట్టాడుచున్‌
ఫలభూజంబుల రాయుచుంజివురుజొంపంబుల్‌ వడిన్‌ మేయుచుం
బులులంగాఱెనుపోతులన్‌ మృగములంబోనీక శిక్షించుచుం
గొలఁకుల్‌ సొచ్చి కలంచుచున్‌ గిరులపై గొబ్బిళ్లు గోరాడుచున్‌.
35
క. తొండంబుల మదజలవృత గండంబులఁ గుంభములను ఘట్టన సేయం
గొండలు దలక్రిందై పడు, బెండుపడున్‌ దిశలు, చూచి బెగడున్‌ జగముల్‌.
36
క. ఎక్కడఁజూచిన లెక్కకు నెక్కువయై యడవి నడచు నిభయూథములో
నొక్క కరినాథుఁ డెడతెగి చిక్కె నొక కరేణుకోటి సేవింపంగన్‌.
37
వ. ఇట్లు వెనుక ముందట నుభయ పార్శ్వంబులఁదృషార్దితంబులై యరుగుదెంచు నేనుంగు గములం గానక తెఱంగు దప్పి తొలంగుడుపడి యీశ్వరాయత్తంబైన చిత్తంబు సంవిత్తంబు గాకుండుటంజేసి తానును దన కరేణుసముదయంబును నొక్క తెరువై పోవుచు. 38
సీ. పల్వలంబుల లేఁతపచ్చిక మచ్చికఁజెలుల కందిచ్చు నచ్చికము లేక;
ఇవురుజొంపములఁగ్రొవ్వెలయు పూఁగొమ్మలఁబ్రాణవల్లభలకుఁబాలువెట్టు,
ఘనదానశీతలకర్ణతాళంబుల దయితల చెమటార్చుఁదనువు లరసి;
మృదువుగాఁగొమ్ముల మెల్లన గళములు నివురుచుఁబ్రేమతో నెఱపు వలపు;
 
తే. పిఱుఁదుచక్కట్ల డగ్గఱి ప్రేమతోడ, డాసి మూర్కొని దివికిఁదొండంబు సాఁచు
వెద వివేకించుఁగ్రీడించు విశ్రమించు, మత్తమాతంగమల్లంబు మహిమతోడ;
39
సీ. తన కుంభముల పూర్ణతకు డిగ్గి యువతుల కుచములు పయ్యెదకొంగు లీఁగఁ
దన యానగంభీరతకుఁజాల కబలల యానంబు లందెల నండగొనఁగఁ
దన కరశ్రీఁగని తలఁగి బాలల చిఱు దొడలు మేఖలదీప్తిఁదోడు పిలువఁ
దన దంతరుచికోడి తరుణుల నగవులు ముఖచంద్రదీప్తుల ముసుఁగు దిగువఁ
 
తే. దనదు లావణ్యరూపంబుఁదలఁచి చూడ, నంజనాభ్రము కపిలాదిహరిదిభేంద్ర
దయిత లందఱుఁదనవెంటఁదగిలి నడువఁ, గుంభివిభుఁడొప్పె నొప్పులకుప్పవోలె.
40
వ. మఱియు నానాగహన విహరణ మహిమతో మదగజేంద్రంబు మార్గంబుఁదప్పి పిపాసా పరాయత్త చిత్తంబున మత్తకరేణువుల మొత్తంబునుం దానునుం జని చని. 41
మ. అటఁగాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్హారమున్‌
నటదిందిందిరవారముం గమఠమీనగ్రాహదుర్వారమున్‌
వటహింతాలరసాలసాలసుమనోవల్లీకుటీతీరముం
జటులోద్ధూతమరాళచక్రబకసంచారంబుఁగాసారమున్‌.
42
వ. ఇట్లనన్యపురుషసంచారంబై నిష్కళంకంబైన యప్పంకజాకరంబుఁబొడగని. 43
సీ. తోయజగంధంబు దోఁగిన చల్లని మెల్లని గాడ్పుల మేను లలరఁ
గమలనాళాహారవిమలవాక్కలహంస రవములు సెవులపండువులు సేయ
ఫుల్లదిందీవరాంభోరుహామోదంబు ఘ్రాణరంధ్రంబుల గారవింప
నిర్మలకల్లోలనిర్గతాసారంబు వదనగహ్వరముల వాడు దేర్పఁ
 
తే. ద్రిజగదభినవసౌభాగ్య దీప్తమైన, విభవ మీక్షణములకును విందు సేయ
నరిగి పంచేంద్రియవ్యవహారములను, మఱచి మత్తేభయూథంబు మడుఁగుఁజొచ్చె.
44
క. తొండంబులఁబూరించుచు గండంబులఁజల్లుకొనుచు గళగళరవముల్‌
మెండుకొన వలుఁదకడుపులు నిండన్‌ వేదండకోటి నీరుంద్రావెన్‌.
45
వ. అప్పుడు. 46
మ. ఇభలోకేంద్రుఁడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చం
డభమార్గంబున కెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప నా
రభటిన్‌ నీరములోన బెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్‌
నభమం దాడెడు మీనకర్కటములన్‌ బట్టెన్‌ సురల్‌ మ్రాన్పడన్‌.
47
వ. మఱియు నగ్గజేంద్రంబు నిరర్గళవిహారంబున. 48
సీ. కరిణీకరోజ్ఝితకంకణచ్ఛటఁదోఁగి సెలయేటి నీలాద్రి చెలువుఁ దెగడు
హస్తినీహస్తవిన్యస్తపద్మంబుల వేయిగన్నులవాని వెరవు సూపుఁ
గలభసముత్కీర్ణకల్హారరజమునఁ గనకాచలేంద్రంబు ఘనతఁదాల్చుఁ
గుంజరీపరిచితకుముదకాండంబుల ఫణిరాజమండనప్రభ వహించు
 
ఆ. మదకరేణుముక్తమౌక్తికశుక్తుల, మెఱుఁగు మొగిలుతోడ మేలమాడు
నెదురులేని గరిమ నిభరాజమల్లంబు, వనజగేహకేళి వ్రాలునపుడు.
49
వ. మఱియు నా సరోవరలక్ష్మి మదగజేంద్ర వివిధ విహారవ్యాకులిత నూతన లక్ష్మీవిభవయై యనంగ విద్యానిరూఢ పల్లవ ప్రబంధపరికంపిత శరీరాలంకార యగు కుసుమకోమలియునుంబోలె వ్యాకీర్ణ చికురమత్తమధుకరనికరయు, విగతరస వదనకమలయు, నిజస్థాన చలిత కుచరథాంగయుగళయు, లంపటిత జఘనపులినతలయునై యుండె; నంత. 50
సీ. భుగభుగాయితభూరిబుద్బుదచ్ఛటలతోఁగదలుచు దివికి భంగంబు లెగయ;
భువనభయంకరఫూత్కారరవమున ఘోరనక్రగ్రాహకోటి బెగడ,
వాలవిక్షేపదుర్వారఝంఝానిలవశమున ఘుమఘుమావర్త మడరఁ
గల్లోలజాలసంఘట్టనంబులఁదటీ తరులు మూలములతో ధరణిఁగూల,
 
తే. సరసిలోనుండి పొడగని సంభ్రమించి, యుదరి కుప్పించి లంఘించి హుంకరించి
భానుఁగబళించి పట్టు స్వర్భానుపగిది, నొక్క మకరేంద్రుఁడిభరాజు నొడిసి పట్టె.
51
క. వడిఁదప్పించి కరీంద్రుఁడు, నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటంబున్‌
బొడ వడఁగినట్లు జలములఁబడి కడువడిఁబట్టెఁబూర్వపదయుగళంబున్‌.
52
చ. పదములఁబట్టినం దలఁకుఁబా టొకయింతయు లేక శూరతన్‌
మదగజవల్లభుండు ధృతిమంతుఁడు దంతయుగాంత ఘట్టనం
జెదరఁగఁజిమ్మె నమ్మకరిచిప్పలు పాదులు దప్ప నొప్పఱన్‌
వదలి జలగ్రహంబు కరివాలముమూలముఁ జీరెఁగోఱలన్‌.
53
క. కరిఁదిగుచు మకరి సరసికిఁగరి దరికిని మకరిఁదిగుచు గరకరి బెరయన్‌
గరికి మకరి మకరికిఁగరి భర మనుచును నతలకుతలభటు లదరిపడన్‌.
54
వ. ఇట్లు కరిమకరంబులు రెండును నొండొండ సముద్దండదండంబులై తలపడి నిఖిల లోకాలోకన భీకరంబులై, యన్యోన్యవిజయశ్రీ వశీకరంబులై, సంక్షోభిత కమలాకరంబులై, హరి హరియును, గిరి గిరియునుం దాఁకి పిఱుతివియక పెనంగు తెఱంగున నీరాటం బయిన పోరాటంబునం బట్టుచు వెలికి లోనికిం దిగుచుచుఁ గొలంకు గలంకంబందఁ గడువడి నిట్టట్టు పడి తడఁబడక బుడబుడాను కారంబులై బుగులు బుగుల్లను చప్పుళ్లతో నురువులు గట్టుచు జలంబు లుప్పరం బెగయం జప్పరించుచుఁ దప్పక వదనగహ్వరంబుల నప్పళింపుచు నిశితనితాంత దురంతదంత కుంతంబుల నింతింతలు దునియలయి నెప్పళంబునం బునుక చిప్పలు గుదుళ్ళు దప్పి రక్తంబులు గ్రమ్ముదేర హుమ్మని యొక్కుమ్మడిం జిమ్ముచు నితరేతర సమాకర్షణంబులం గదలక పదంబుల మొదలిపట్టు వదలక కుదురై వర్తించుచుఁ బరిభ్రమణ వేగంబున జలంబులం దిరుగుచు మకర కమఠ కర్కట గండక మండూకాది సలిల నిలయంబుల ప్రాణంబులు క్షీణంబులుగా నొండొంటిం దాఁకు రభసంబున నిక్కలువడ మ్రక్కం ద్రొక్కుచు మెండుచెడి బెండువడి నాఁచు గుల్లచిప్పతండంబులం బరస్పర తాడనంబులకు నడ్డంబుగా నొడ్డుచు నోలమాసగొనక గెలుపుఁ దలంపులు బెట్టిదంబులై రెట్టింప నహోరాత్రంబులుం బోలెఁ గ్రమక్రమ విజృంభమాణంబులై బహుకాల కలహ విహారంబులై నిర్గతనిద్రాహారంబులై, యవక్రపరాక్రమఘోరంబులై పోరుచున్న సమయంబున. 55
క. జవమును జలమును బలమును వివిధములుగఁబోరు కరటివీరతకు భువిన్‌
దివి మకరమీన కర్కట నివహము లొక్కటన మిత్రనిలయముఁబొందెన్‌.
56
శా. ఆటోపంబునఁజిమ్ము ఱొమ్మగల వజ్రాభీలదంతంబులం
దాటించున్‌ మెడఁజుట్టిపట్టి హరి దోర్దండాభశుండాహతిన్‌
నీటన్‌ మాటికి మాటికిందిగువఁగా నీరాటమున్‌ నీటి పో
రాటన్నోటమిపాటుఁజూపుట కరణ్యాటంబు వాచాటమై.
57
వ. అప్పుడు. 58
ఆ. మకరితోడఁబోరు మాతంగఁవిభుని నొక్కరుని డించి పోవఁగాళ్ళు రాక
కోరి చూచుచుండెఁగుంజరీయూథంబు మగలు దగులు గారె మగువలకును.
59
వ. అంత. 60
ఆ. జీవనంబు దనకు జీవనంబై యుంట నలవుఁజలము నంతకంత కెక్కి
మకర మొప్పె డస్సె మత్తేభమల్లంబు బహుళపక్షశీతభానుపగిది.
61
మ. ఉఱుకుంగుంభయుగంబుపై హరిక్రియన్‌ హుమ్మంచుఁబాదంబులన్‌
నెఱయుంగంఠము వెన్నుదన్ను; నెగయున్‌ హేలాగతిన్‌, వాలముం
జఱచున్‌; నుగ్గుగఁదాఁకు: ముంచు; మునుఁగున్‌; శల్యంబులున్‌ దంతముల్‌
విఱుగన్‌ వ్రేయుచుఁబొంచి పొంచి కదియున్‌ వేదండయూథోత్తమున్‌.
62
మ. పొడగానంబడకుండ డాఁగు వెలికింబోవంగఁదా నడ్డమై
పొడచూపుం జరణంబులంబెనఁగొనుంబోరాక రారాక బె
గ్గడిలంగూలఁగఁదాఁచు లేచుతఱి నుద్ఘాటించు లంఘించుఁ బ
ర్విడిఁజీరుం దలఁగున్‌ మలంగు నొడియున్‌ వేధించుఁగ్రోధించుచున్‌.
63
వ. ఇట్లు విస్మితనక్రచక్రంబు నిర్వక్రవిక్రమంబున నల్పహృదయజ్ఞాన దీపంబు నతిక్రమించు మహా మాయాంధకారంబునుంబోలె నంతకంతకు నుత్సాహ కలహ సన్నాహ బహువిధ జలావగాహం బయిన గ్రాహంబు మహాసాహసంబున. 64
శా. పాదద్వంద్వము నేలమోపి పవనున్‌ బంధించి పంచేంద్రియో
న్మాదంబుం బరిమార్చి బుద్ధిలతకున్‌ మాఱాకు హత్తించి ని
ష్ఖేదబ్రహ్మపదావలంబనరతింగ్రీడించు యోగీంద్రు మ
ర్యాదన్‌ నక్రము విక్రమించెఁగరిపాదాక్రాంతినిర్వక్రమై.
65
ఆ. వనగజంబు నెగుచు వనచారిఁబొడగని వనగజంబ కాన వజ్రిగజము
వెల్ల నై సురేంద్రు వేచి సుధాంధులుఁబట్టఁబట్టనీక బయలు ప్రాఁకె.
66
ఉ. ఊహ గలంగి జీవనపుటోలమునంబడి పోరుచున్‌ మహా
మోహలతానిబద్ధపదమున్‌ విడిపించుకొనంగలేక సం
దేహముఁబొందు దేహిక్రియ దీనదశన్‌ గజ ముండె భీషణ
గ్రాహదురంతదంతపరిఘట్టితపాదఖురాగ్రశల్యమై.
67
వ. ఇవ్విధంబున. 68
క. అలయక సొలయక వేసట, నొలయక కరి మకరితోడ నుద్దండత రా
త్రులు సంధ్యలు దివసంబులు, సలిపెం బో రొక్కవేయి సంవత్సరముల్‌.
69
మ. పృథుశక్తిన్‌ గజ మా జలగ్రహముతోఁబెక్కేండ్లు పోరాడి సం
శిథిలంబై తన లావు వైరిబలముం జింతించి మిథ్యామనో
రథమింకేటికి? దీని గెల్వ సరి పోరంజాలరా దంచు స
వ్యథమై యిట్లనుఁబూర్వపుణ్యఫలదివ్యజ్ఞానసంపత్తితోన్‌;
70
శా. ఏ రూపంబున దీనిగెల్తు? నిట మీఁదేవేల్పుఁజింతింతు? నె
వ్వారింజీరుదు? నెవ్వరడ్డ? మిఁక ని వ్వారిప్రచారోత్తమున్‌
వారింపందగువార లెవ్వ? రఖిలవ్యాపారపారాయణుల్‌
లేరే! మ్రొక్కెద దిక్కుమాలిన మొఱాలింపంబ్రపుణ్యాత్మకుల్‌.
71
శా. నానానేకపయూథముల్‌ వనములోనంబెద్దకాలంబు స
న్మానింపన్‌ దశలక్షకోటికరిణీనాథుండనై యుండి మ
ద్దానాంభఃపరిపుష్టచందనలతాంతచ్ఛాయలందుండ లే
కీ నీరాశ నిటేల వచ్చితి, భయం బెట్లో కదే యీశ్వరా!
72
ఉ. ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపల నుండు లీనమై;
యెవ్వనియందు డిందుఁ; బరమేశ్వరుఁడెవ్వఁడు; మూలకారణం
బెవ్వఁ; డనాదిమధ్యలయుఁడెవ్వఁడు; సర్వముఁదానయైన వాఁ
డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్‌.
73
క. ఒకపరి జగములు వెలి నిడి యొకపరి లోపలికిఁగొనుచు నుభయముఁదానై
సకలార్థసాక్షి యగు నయ్యకలంకుని నాత్మమూలు నర్థిఁదలంతున్‌.
74
క. లోకంబులు లోకేశులు లోకస్థులుఁదెగిన తుది నలోకంబగు పెం
జీఁకటి కవ్వల నెవ్వం డేకాకృతి వెలుఁగు నతనినే సేవింతున్‌.
75
క. నర్తకునిభంగిఁబెక్కగు, మూర్తులతో నెవ్వఁడాడు? మునులు దివిజులుం
గీర్తింప నేర రెవ్వని, వర్తన మొరు లెఱుఁగ రట్టి వాని నుతింతున్‌.
76
ఆ. ముక్తసంగులైన మునులు దిదృక్షులు, సర్వభూతహితులు సాధుచిత్తు
లసదృశవ్రతాఢ్యులై కొల్తు రెవ్వని, దివ్యపదము వాఁడు దిక్కు నాకు.
77
సీ. భవము దోషంబు రూపంబుఁగర్మంబు నాహ్వయమును గుణము లెవ్వనికి లేక
జగములఁగలిగించు సమయించు కొఱకునై నిజమాయ నెవ్వఁడిన్నియును దాల్చు
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ కిద్ధరూపికి రూపహీనునకును
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁబరమాత్మునకుఁబరబ్రహ్మమునకు
 
ఆ. మాటలను నెఱుకల మనములఁజేరంగఁ, గాని శుచికి సత్త్వగమ్యుఁడగుచు
నిపుణుఁడైనవాని నిష్కర్మతకు మెచ్చు, వాని కే నొనర్తు వందనములు.
78
సీ. శాంతున కపవర్గసౌఖ్యసంవేదికి నిర్వాణభర్తకు నిర్విశేషు
నకు, ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యున కధికవిజ్ఞానమయున
కఖిలేంద్రియద్రష్ట కధ్యక్షునకు బహుక్షేత్రజ్ఞునకు దయాసింధుమతికి
మూలప్రకృతి కాత్మమూలున కఖిలేంద్రియజ్ఞాపకునకు దుఃఖాంతకృతికి
 
ఆ. నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు, నుండు నెక్కటికి మహోత్తరునకు
నిఖిలకారణునకు, నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచుకొఱకు.
79
క. యోగాగ్నిదగ్ధకర్ములు యోగీశ్వరు లే మహాత్ము నొం డెఱుఁగక స
ద్యోగవిభాసితమనముల బాగుగ వీక్షింతు రట్టి పరము భజింతున్‌.
80
సీ. సర్వాగమామ్నాయజలధికి నపవర్గ మయునికి నుత్తమమందిరునకు
సకలగుణారణిచ్ఛన్నబోధాగ్నికిఁదనయంత రాజిల్లు ధన్యమతికి
గుణలయోద్దీపితగురుమానసునకు సంవర్తితకర్మనిర్వర్తితునకు
దిశ లేని నాబోఁటి పశువుల పాపంబు లడఁచువానికి సమస్తాంతరాత్ముఁ
 
ఆ. డై వెలుంగువాని కచ్ఛిన్నునకు భగ, వంతునకుఁదనూజపశునివేశ
దారసక్తు లయినవారి కందఁగరాని, వాని కాచరింతు వందనములు.
81
వ. మఱియును. 82
సీ. వరధర్మకామార్థవర్జితకాములై విబుధు లెవ్వాని సేవించి యిష్ట
గతిఁబొందుదురు? చేరి కాంక్షించువారి కవ్యయదేహ మిచ్చు నెవ్వాఁడు కరుణ?
ముక్తాత్ములెవ్వని మునుకొని చింతింతు? రానందవార్ధిమగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియుఁగోరక భద్రచరిత్రంబుఁబాడుచుందు?
 
ఆ. రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మ, యోగగమ్యుఁబూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమైన వానిఁబరుని నతీంద్రియు, నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.
83
వ. అని మఱియు నిట్లని వితర్కించె. 84
సీ. పావకుండర్చుల భానుండు దీప్తుల నెబ్భంగి నిగిడింతు రెట్లడంతు
రా క్రియ నాత్మకరావళిచేత బ్రహ్మాదుల వేల్పుల నఖిలజంతు
గణముల జగముల ఘననామరూపభేదములతో మెఱయించి తగ నడంచు
నెవ్వఁడు మనము బుద్ధీంద్రియమ్ములుఁదానయై గుణసంప్రవాహంబు బఱపు
 
తే. స్త్రీనపుంసకపురుషమూర్తియును గాక, తిర్యగమరనరాదిమూర్తియును గాక
కర్మగుణభేదసదసత్ప్రకాశి గాక, వెనుక నన్నియుఁదా నగు విభుఁదలంతు.
85
క. కలఁడందురు దీనుల యెడఁ, గలఁడందురు పరమయోగిగణములపాలం
గలఁడందు రన్నిదిశలను గలఁడు కలండనెడు వాఁడు గలఁడో లేఁడో!
86
సీ. కలుగఁడే నాపాలికలిమి సందేహింపఁగలిమిలేములు లేక కలుగువాఁడు;
నా కడ్డపడ రాఁడె నలి నసాధువులచేఁబడిన సాధుల కడ్డపడెడువాఁడు
చూడఁడే నా పాటుఁజూపులఁ జూడక చూచువారలఁగృపఁజూచువాఁడు;
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల మొఱ లెఱుంగుచుఁదన్ను మొఱఁగువాఁడు;
 
తే. అఖిలరూపముల్‌ దన రూపమైనవాఁడు, నాదిమధ్యాంతములు లేక యడరువాఁడు
భక్తజనముల దీనుల పాలివాఁడు, వినఁడె చూడఁడె తలపఁడె వేగ రాఁడె!
87
క. విశ్వకరు విశ్వదూరుని, విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్‌
శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్‌.
88
వ. అని పలికి తన మనంబున నగ్గజేంద్రు డీశ్వరసన్నిధానంబు కల్పించుకొని యిట్లనియె. 89
శా. లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యెఁ; బ్రాణంబులున్‌
ఠావుల్‌ దప్పెను; మూర్ఛ వచ్చెఁ; దనువున్‌ డస్సెస్‌, శ్రమంబయ్యెడిన్‌,
నీవే తప్ప నితఃపరంబెఱుఁగ; మన్నింపందగున్‌ దీనునిన్‌,
రావే యీశ్వర! కావవే వరద!; సంరక్షింపు భద్రాత్మకా!
90
క. విను దఁట జీవుల మాటలు చను దఁట చనరానిచోట్ల శరణార్థుల కో
యను దఁట పిలిచిన సర్వముఁగను దఁట సందేహ మయ్యెఁగరుణావార్ధీ!
91
ఉ. ఓ కమలాప్త! యో వరద! యో ప్రతిపక్షవిపక్షదూర! కు
య్యో! కవియోగివంద్య సుగుణోత్తమ! యో శరణాగతామరా
నోకహ! యో మునీశ్వరమనోహర! యో విమలప్రభావ! రా
వే! కరుణింపవే! తలఁపవే! శరణార్థిని నన్నుఁగావవే!
92
వ. అని పలికి మఱియు నరక్షిత రక్షకుండైన యీశ్వరుం డాపన్నుండైన నన్నుం గాచుఁ గాక యని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగిడించుచు బయ లాలకించుచు న గ్గజేంద్రుండు మొఱ సేయుచున్న సమయంబున. 93
ఆ. విశ్వమయత లేమి వినియు నూరక యుండి రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుఁడు విభుఁడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డపడఁదలంచె.
94
మ. అల వైకుంఠపురంబులో నగరిలో నా మూలసౌధంబు దా
పల మందారవనాంతరామృతసరఃప్రాంతేందుకాంతోపలో
త్పలపర్యంకరమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వలనాగేంద్రము ‘పాహి పాహి’ యనఁగుయ్యాలించి సంరంభియై.
95
మ. సిరికింజెప్పఁడు; శంఖచక్రయుగముం జేదోయి సంధింపఁడే
పరివారంబును జీరఁడభ్రగపతింబన్నింపఁడాకర్ణికాం
తరధమ్మిల్లముఁజక్క నొత్తఁడు వివాదప్రోత్థితశ్రీకుచో
పరిచేలాంచలమైన వీడఁడు గజప్రాణావనోత్సాహియై.
96
వ. ఇట్లు భక్తజన పాలన పరాయణుండును, నిఖిల జంతుహృదయారవింద సదన సంస్థితుండును నగు నారాయణుండు కరి కులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీనాలాపంబు లాకర్ణించి లక్ష్మీకాంతా వినోదంబులం దగులు సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్రరక్షాపరత్వంబు నంగీకరించి నిజపరికరంబు మరల నవధరించి గగనంబున కుద్గమించి వేంచేయునప్పుడు; 97
మ. తనవెంటన్‌ సిరి, లచ్చివెంట నవరోధవ్రాతమున్‌, దాని వె
న్కను బక్షీంద్రుఁడు, వాని పొంతను ధనుఃకౌమోదకీ శంఖ చ
క్ర నికాయంబును, నారదుండు, ధ్వజినీకాంతుండు రా వచ్చి రొ
య్యన వైకుంఠపురంబునం గలుగువా రాబాలగోపాలమున్‌.
98
వ. తదనంతరంబ ముఖారవింద మకరంద బిందు సందోహ పరిష్యందనానందదిందిందిర యగు నయ్యిందిరాదేవి గోవిందకరారవిందసమాకృష్యమాణసంవ్యానచేలాంచలయై పోవుచు. 99
మ. తన వేంచేయు పదంబుఁబేర్కొనఁ; డనాథస్త్రీజనాలాపముల్‌
వినెనో, మ్రుచ్చులు మ్రుచ్చిలించిరొ ఖలుల్‌ వేదప్రపంచంబులన్‌,
దనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో, భక్తులం
గని చక్రాయుధుఁడేఁడి చూపుఁడని ధిక్కారించిరో దుర్జనుల్‌.
100
వ. అని వితర్కించుచు. 101
శా. తాటంకాచలనంబుతో, భుజనటద్ధమ్మిల్లబంధంబుతో,
శాటీముక్తకుచంబుతో, నదృఢచంచత్కాంచితో, శీర్ణ లా
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతోఁ,
గోటీందుప్రభతో, నురోజభరసంకోచద్వలగ్నంబుతోన్‌.
102
క. అడిగెద నని కడు వడిఁజను నడిగినఁదను మగుడ నుడుగఁడని నడ యుడుగున్‌
వెడవెడ చిడిముడి తడఁబడ నడు గిడు; నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్‌.
103
సీ. నిటలాలకము లంట నివుర జుంజుమ్మని ముఖసరోజము నిండ ముసరుఁదేంట్లు;
నళులఁజోఁపఁగఁజిల్క లల్ల నల్లనఁజేరి యోష్ఠబింబద్యుతు లొడియ నుఱుకు;
శుకములఁదోలఁజక్షుర్మీనములకు మందాకినీపాఠీనలోక మెగుచు;
మీనపంక్తుల దాఁట మెయిదీఁగతో రాయ శంపాలతలు మింట సరణి గట్టు;
 
ఆ. శంపలను జయింపఁజక్రవాకంబులు, కుచయుగంబుఁదాఁకి క్రొవ్వుసూపు;
మెలఁత మొగిలు పిఱిఁది మెఱుఁగుఁదీవయుఁబోలె, జలదవర్ణు వెనుకఁజనెడు నపుడు.
104
మ. వినువీథింజనుదేరఁ గాంచి రమరుల్‌ విష్ణున్‌ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁ గరుణావర్ధిష్ణు యోగీంద్ర హృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృందప్రాభవాలంకరి
ష్ణు నవోఢోల్లసదిందిరాపరిచరిష్ణున్‌ జిష్ణు రోచిష్ణునిన్‌.
105
వ. ఇట్లు పొడగని. 106
మ. చనుదెంచెన్‌ ఘనుఁడల్లవాఁడె! హరి పజ్జంగంటిరే లక్ష్మి? శం
ఖ నినాదంబదె; చక్రమల్లదె; భుజంగధ్వంసియున్‌ వాఁడె; క్ర
న్నన నేతెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేతి ని
స్వనులై మ్రొక్కిరి మింట హస్తిదురవస్థావక్రికిం జక్రికిన్‌.
107
వ. అయ్యవసరంబునం గుంజరేంద్రపాలన పారవశ్యంబున దేవతానమస్కారంబు లంగీకరింపక మనస్స మాన సంచారుండై పోయి పోయి కొంతదూరంబున శింశుమార చక్రంబునుం బోలె గురుమకరకుళీర మీన మిథునంబై, కిన్నరేంద్రుని భాండాగారంబునుంబోలె స్వచ్ఛ వరకచ్ఛపంబై, భాగ్యవంతుని భాగధేయంబునుం బోలె సరాగజీవనంబై, వైకుంఠంబునుంబోలె శంఖచక్ర కమలాలంకృతంబై, సంసార చక్రంబునుం బోలె ద్వంద్వసంకుల పంక సంకీర్ణంబై యొప్పు నప్పంకజాకరంబుఁబొడగని. 108
మ. కరుణాసింధుఁడు శౌరి వారిచరమున్‌ ఖండింపఁగాఁబంపె స
త్వరితాకంపితభూమిచక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబరశుక్రమున్‌ బహువిధబ్రహ్మాండభాండచ్ఛటాం
తరనిర్వక్రముఁబాలితాఖిలసుధాంధశ్చక్రముంజక్రమున్‌.
109
వ. ఇట్లు పంచిన. 110
శా. అంభోజాకరమధ్యనూతననలిన్యాలింగనక్రీడనా
రంభుండైన వెలుంగుఱేని చెలువారన్‌ వచ్చి నీటన్‌ గుభుల్‌
గుంభధ్వానముతోఁగొలంకును గలంకుంబొందఁగాఁజొచ్చి దు
ష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై.
111
శా. భీమంబై తలఁద్రుంచి ప్రాణములఁబాపెంజక్ర మాశుక్రియన్‌
హేమక్ష్మాధరదేహముంజకితవన్యేభేంద్రసందోహముం
గామక్రోధనగేహమున్‌ గరటి రక్తస్రావగాహంబు ని
స్సీమోత్సాహము వీతదాహము జయశ్రీమోహమున్‌ గ్రాహమున్‌.
112
వ. ఇట్లు నిమిషస్పర్శనంబున సుదర్శనంబు మకరి తలఁద్రుంచు నవసరంబున. 113
క. మకర మొకటి రవిఁజొచ్చెను, మకరము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్‌;
మకరాలయమునఁదిరిగెడు, మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్‌.
114
మ. తమముంబాసిన రోహిణీవిభుక్రియన్‌ దర్పించి సంసార దుః
ఖము వీడ్కొన్న విరక్తచిత్తునిగతిన్‌ గ్రాహంబు పట్టూడ్చి పా
దము లల్లార్చి కరేణుకావిభుఁడు సౌందర్యంబుతో నొప్పె సం
భ్రమదాశాకరిణీకరోజ్ఝితసుధాంభస్స్నానవిశ్రాంతుఁడై.
115
శా. పూరించెన్‌ హరి పాంచజన్యముఁగృపాంభోరాశి సౌజన్యమున్‌
భూరిధ్వానచలాచలీకృతమహాభూతప్రచైతన్యమున్‌
సారోదారసితప్రభాచకితపర్జన్యాదిరాజన్యమున్‌
దూరీభూతవిపన్నదైన్యమును నిర్ధూతద్విషత్సైన్యమున్‌.
116
మ. మొరసెన్‌ నిర్జరదుందుభుల్‌; జలరుహామోదంబులై వాయువుల్‌
దిరిగెం; బువ్వుల వానజల్లు గురిసెన్‌; దేవాంగనాలాస్యముల్‌
పరఁగెన్‌; దిక్కులయందు జీవజయశబ్దధ్వానముల్‌ నిండె, సా
గర ముప్పొంగెఁదరంగచుంబితనభోగంగాముఖాంభోజమై.
117
క. నిడుద యగు కేల గజమును, మడువున వెడలంగఁదిగిచి మదజలరేఖల్‌
దుడుచుచు మెల్లన పుడుకుచు నుడిపెన్‌ విష్ణుండు దుఃఖ ముర్వీనాథా!
118
క. శ్రీహరి కరసంస్పర్శను దేహము దాహంబు మాని ధృతిఁగరిణీ సం
దోహంబుఁదాను గజపతి మోహనఘీంకారశబ్దములతో నొప్పెన్‌.
119
క. కరమున మెల్లన నివురుచుఁగర మనురాగమున మెఱసి కలయంబడుచుం
గరి హరికతమున బ్రదుకుచుఁగరపీడన మాచరించెఁగరిణుల మరలన్‌.
120
సీ. జననాథ! దేవలశాపవిముక్తుఁడై పటుతరగ్రాహరూపంబు మాని
ఘనుఁడు హూహూనామగంధర్వుఁడప్పుడు దన తొంటి నిర్మలతనువుఁదాల్చి
హరికి నవ్యయునకు నతిభక్తితో మ్రొక్కి తవిలి కీర్తించి గీతములు పాడి
యా దేవు కృప నొంది యందంద మఱియును వినతశిరస్కుఁడై వేడ్కతోడ
 
ఆ. దళితపాపుఁడగుచుఁదనలోకమున కేగె, నపుడు శౌరి కేల నంటి తడవ
హస్తిలోకనాథుఁడజ్ఞాన రహితుఁడై, విష్ణురూపుఁడగుచు వెలుఁగుచుండె.
121
మ. అవనీనాథ! గజేంద్రుఁడా మకరితో నాలంబు గావించె మున్‌
ద్రవిళాధీశుఁడతండు పుణ్యతముఁడింద్రద్యుమ్ననాముండు వై
ష్ణవముఖ్యుండు గృహీతమౌననియతిన్‌ సర్వాత్ము నారాయణున్‌
సవిశేషంబుగఁబూజ సేసెను మహాశైలాగ్రభాగంబునన్‌.
122
మ. ఒకనాఁడా నృపుఁడచ్యుతున్‌ మనములో నూహించుచున్‌ మౌనియై
యకలంకస్థితి నున్నచోఁగలశజుండచ్చోటికిన్‌ వచ్చి లే
వక పూజింపక యున్న మౌనిఁగని నవ్యక్రోధుఁడై మూఢ! లు
బ్ధ! కరీంద్రోత్తమ యోనిఁబుట్టు’ మని శాపం బిచ్చె భూవల్లభా!
123
క. మునిపతి నవమానించిన ఘనుఁడింద్రద్యుమ్నవిభుఁడు గౌంజరయోనిం
జననంబందెను; విప్రులఁగని యవమానింపఁదగదు ఘనపుణ్యులకున్‌.
124
క. కరినాథుఁడయ్యె నాతఁడు కరులైరి భటాదులెల్ల; గజముగ నయ్యున్‌
హరిచరణసేవకతమునఁగరివరునకు నధికముక్తి గలిగె మహాత్మా!
125
ఆ. కర్మతంత్రుఁడగుచుఁగమలాక్షుఁగొల్చుచు, నుభయనియతవృత్తి నుండెనేనిఁ
జెడును గర్మమెల్ల శిథిలమై మెల్లన, ప్రబలమైన విష్ణుభక్తి సెడదు.
126
క. చెడుఁగరులు హరులు ధనములు జెడుదురు నిజసతులు సుతులుఁజెడు చెనఁటులకుం;
జెడక మనునట్టి గుణులకుఁ, జెడని పదార్థములు విష్ణుసేవానిరతుల్‌.
127
వ. అప్పుడు జగజ్జనకుండగు న ప్పరమేశ్వరుండు దరహసిత ముఖకమల యగు నక్కమల కిట్లనియె. 128
క. ‘బాలా! నా వెనువెంటను హేలన్‌ వినువీథినుండి యేతెంచుచు నీ
చేలాంచలంబుఁబట్టుట కాలో నేమంటి నన్ను నంభోజముఖీ!
129
క. ఎఱుఁగుదు తెఱవా యెప్పుడు మఱవను సకలంబు నన్ను మఱచిన యెడలన్‌
మఱతు నని యెఱిఁగి మొఱఁగక మఱవక మొఱ యిడిర యేని మఱి యన్యములన్‌.
130
వ. అని పలికిన నరవిందమందిర యయిన న య్యిందిరాదేవి మందస్మిత చంద్రికా సుందర వదనారవింద యగుచు ముకుందున కిట్లనియె. 131
క. దేవా! దేవర యడుగులు, భావంబున నిలిపి కొలుచు పని నా పని గా
కో వల్లభ! యే మనియెద, నీ వెంటను వచ్చుచుంటి నిఖిలాధిపతీ!
132
క. దీనుల కుయ్యాలింపను దీనుల రక్షింప మేలు దీవనఁబొందన్‌
దీనావన! నీ కొప్పును దీనపరాధీన! దేవదేవ! మహేశా!
133
వ. అని మఱియును సముచిత సంభాషణంబుల నంకించుచున్న య ప్పరమ వైష్ణవీరత్నంబును సాదర సరస సల్లాప మందహాస పూర్వకంబుగా నాలింగనంబు గావించి సపరివారుండై గరుడ గంధర్వ సిద్ధ విబుధగణ జేగీయమానుండై గరుడారూఢుం డగుచు నిజసదనంబునకుం జనియె; నని చెప్పి శుకయోగీంద్రుం డిట్లనియె. 134
సీ. నరనాథ! నీకును నాచేత వివరింపఁబడిన యీ కృష్ణానుభావమైన
గజరాజమోక్షణకథ వినువారికి యశము లిచ్చును గల్మషాపహంబు;
దుస్స్వప్ననాశంబు దుఃఖసంహారంబుఁ; బ్రొద్దున మేల్కాంచి పూతవృత్తి
నిత్యంబుఁబఠియించు నిర్మలాత్మకులైన విప్రులకును బహువిభవ మమరు;
 
తే. సంపదలు గల్గుఁ; బీడలు శాంతిఁబొందు; సుఖము సిద్ధించు; వర్ధిలు శోభనములు;
మోక్ష మఱచేతిదై యుండు; ముదము చేరు, ననుచు విష్ణుండు ప్రీతుఁడై యానతిచ్చె.
135
వ. అని మఱియు నప్పరమేశ్వరుం డిట్లని యానతిచ్చె; నెవ్వరేని నపరరాత్రంబున మేల్కాంచి సమాహిత మనస్కులయి నన్నును నిన్నును నీ సరోవరంబును శ్వేతద్వీపంబున నాకుం బ్రియంబైన సుధాసాగరంబును హేమ నగంబును నిగ్గిరి కందర కాననంబులను వేత్రకీచక వేణులతాగుల్మ సురపాదపంబులను నేనును, బ్రహ్మయు, ఫాలలోచనుండును నివసించియుండు నక్కొండ శిఖరంబులను గౌమోదకీ కౌస్తుభ సుదర్శన పాంచజన్యంబులను శ్రీదేవిని శేష గరుడ వాసుకి ప్రహ్లాద నారదాదిఋషులను మత్స్య కూర్మ వరాహాద్యవతారంబులను దదవతార కృతకార్యంబులను సూర్యసోమపావకులను బ్రణవంబును ధర్మతపస్సత్యంబులను వేదంబును వేదాంగంబులను శాస్త్రంబులను గో భూసుర సాధు పతివ్రతా జనంబులను జంద్రకాశ్యపజాయా సముదయంబును గౌరీగంగా సరస్వతీ కాళిందీ సునందా ప్రముఖ పుణ్యతరంగిణీ నిచయంబును నమరులను నమర తరువులను నైరావతంబును నమృతంబును ధ్రువుని బ్రహ్మర్షినివహంబును బుణ్య శ్లోకులయిన మానవులను సమాహిత చిత్తులై తలంచు వారలకుఁబ్రాణావసాన కాలంబున మదీయంబగు విమలగతి నిత్తునని హృషీకేశుండు నిర్దేశించి శంఖంబు పూరించి సకలామరవందిత చరణారవిందుండై విహగపరివృఢవాహనుండై వేంచేసె; విబుధానీకంబు సంతోషించెనని చెప్పి శుకుండు రాజున కిట్లనియె. 136
క. గజరాజమోక్షణంబును నిజముగఁబఠియించునట్టి నియతాత్ములకున్‌
గజరాజవరదుఁడిచ్చును గజతురగస్యందనములుఁగైవల్యంబున్‌.
137
క. తామసుతమ్ముఁడు రైవత, నామకుఁడై వెలసె మనువు; నలువురమీఁదన్‌
భూమికిఁబ్రతివింధ్యార్జున, నామాదులు నృపులు మనువునందనులు నృపా.
138
సీ. మునులు హిరణ్యరోముఁడు నూర్ధ్వబాహుండు వేదశీర్షుండను వీరు మొదలు
నమరులు భూతరయాదులు శుభ్రుని పత్ని వికుంఠాఖ్య పరమసాధ్వి;
యీ యిద్దఱకుఁబుత్త్రుఁడై తన కళలతో వైకుంఠుఁడనఁబుట్టి వారిజాక్షుఁ
డవనిపై వైకుంఠ మనియెడి లోకంబుఁగల్పించె నెల్ల లోకములు మ్రొక్క;
 
తే. రమ యెదుర్కోలు సేకొనె రాజముఖ్య!, తదనుభావంబు గుణములుఁదలఁపఁదరమె?
యీ ధరారేణుపటలంబు నెఱుఁగవచ్చుఁ, గాని రాదయ్య హరిగుణగణము సంఖ్య.
139
వ. తదనంతరంబు. 140
సీ. చక్షుస్తనూజుండు చాక్షుషుండను వీరుఁడాఱవ మనువయ్యె నవనినాథ!
భూమీశ్వరులు పురుపురుష సుద్యుమ్నాదు లాతని నందను; లమరవిభుఁడు
మంత్రద్యుమాఖ్యుఁడమర్త్యు లాప్యాదికులాహవిష్మద్వీరకాదిఘనులు
మునులందు విభుఁడు సంభూతికి వైరాజునకుఁబుట్టి యజితుఁడు నాఁగ నొప్పె
 
ఆ. నతఁడ కాఁడె కూర్మమై మందరాద్రిని, నుదధిజలములోన నుండి మోచె;
నతఁడు సువ్వె దివిజు లర్థింప నమృతాబ్ధిఁ, ద్రచ్చి యిచ్చె నా సుధారసంబు.
141
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - aShtama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )