పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము అష్టమస్కంధము
క్షీరసాగర మథన కథా ప్రారంభము
వ. అని పలికినం బరీక్షిన్నరేంద్రుండు మునీంద్రున కిట్లనియె. 142
మ. విను; ము న్నేటికిఁద్రచ్చె పాలకడలిన్‌ విష్ణుండు? కూర్మాకృతిన్‌
వనధింజొచ్చి య దెట్లు మోచె బలుకవ్వంబైన శైలంబు? దే
వ నికాయంబమృతంబు నెట్లు వడసెన్‌? వారాశి నేమేమి సం
జనితంబయ్యె? మునీంద్ర! చోద్యము గదా సర్వంబుఁజెప్పంగదే!
143
క. అప్పటినుండి బుధోత్తమ! చెప్పెదు భగవత్కథావిశేషంబులు నా
కెప్పుడుఁదనివి జనింపదు సెప్పఁగదే చెవులు నిండ శ్రీహరికథలన్‌.
144
వ. అని మఱియు నడుగం బడినవాఁడై యతని నభినందించి హరిప్రసంగంబు సెప్ప నుపక్రమించె నని సూతుండు ద్విజుల కిట్లనియె; నట్లు శుకుండు రాజుంజూచి. 145
క. కసి మసఁగి యసుర విసరము లసిలతికల సురల నెగువ నసువులు వెడలం
బసఁజెడిరి; పడిరి; కెడసిరి యసమసమరవిలసనముల ననువెడలి నృపా!
146
క. సురపతి వరుణాదులతో సురముఖ్యులు గొంద ఱరిగి సురశైలముపై
సురనుతుఁడగు నజుఁగని యా సుర దుష్కృతిఁజెప్పి రపుడు సొలయుచు నతులై.
147
క. దుర్వాసు శాపవశమున నిర్వీర్యత జగములెల్ల నిశ్శ్రీకములై
పర్వతరిపుతోఁగూడ నపర్వము లయి యుండె హతసుపర్వావళులై.
148
ఆ. నెలవు వెడలి వచ్చి నిస్తేజులై నట్టి వేల్పుగములఁ జూచి వేల్పుఁబెద్ద
పరమపురుషుఁదలఁచి ప్రణతుఁడై సంఫుల్లపద్మవదనుఁడగుచుఁబలికెఁదెలియ.
149
క. ఏనును మీరును గాలము, మానవ తిర్యగ్లతాద్రుమ స్వేదజముల్‌
మానుగ నెవ్వని కళలము, వానికి మ్రొక్కెదము గాక వగవఁగ నేలా?
150
క. వధ్యుండు రక్షణీయుఁడు సాధ్యుఁడు మాన్యుఁడని లేని సర్గత్రాణా
వధ్యాదు లొనర్చు నతం డాధ్యంత విధానమునకు నర్హుఁడు మనకున్‌.
151
క. వరదునిఁబరమ జగద్గురు, గరుణాపరతంత్రు మనము గనుఁగొన దుఃఖ
జ్వరములు సెడునని సురలకు సరసిజజని చెప్పి యజితు సదనంబునకున్‌.
152
వ. తానును దేవతాసమూహంబును నతిరయంబునం జని వినయంబునం గానంబడని య వ్విభు నుద్దేశించి దైవికంబులగు వచనంబుల నియతేంద్రియుండై యిట్లని స్తుతియించె. 153
సీ. ఎవ్వని మాయకు నింతయు మోహించుఁదఱిమి యెవ్వని మాయ దాఁట రాదు;
తన మాయ నెవ్వఁడింతయు గెల్చినట్టివాఁడెవ్వనిఁబొడగాన రెట్టిమునులు,
సర్వభూతములకు సమవృత్తి నెవ్వఁడు చరియించుఁదనచేత జనితమయిన,
ధరణి పాదములు చిత్తము సోముఁ డగ్ని ముఖంబు గన్నులు సోమకమలహితులు,
 
తే. చెవులు దిక్కులు, రేతంబు సిద్ధజలము, మూఁడు మూర్తుల పుట్టిల్లు, మొదలి నెలవు
గర్భ మఖిలంబు, మూర్ధంబు గగన మగుచు, మలయు నెవ్వఁడు వాని నమస్కరింతు.
154
వ. మఱియు నెవ్వని బలంబున మహేంద్రుండును, బ్రసాదంబున దేవతలును, గోపంబున రుద్రుండును, బౌరుషంబున విరించియు, నింద్రియంబుల వలన వేదంబులును మునులును, మేఢ్రంబునఁ బ్రజాపతియును, వక్షంబున లక్ష్మియు, ఛాయ వలనఁ బితృదేవతలును, స్తనంబుల వలన ధర్మంబును, బృష్ఠంబుల వలన నధర్మంబును, శిరంబు వలన నాకంబును, విహాసంబు వలన నప్సరోజనంబులును, గుహ్యంబువలన బ్రహ్మంబును, ముఖంబు వలన విప్రులును, భుజంబుల వలన రాజులును (బలంబును,) నూరువుల వలన వైశ్యులును (నైపుణ్యంబును,) బదంబుల వలన శూద్రులును, (నవేదంబును) నధరంబువలన లోభంబును, నుపరిరదచ్ఛదంబు వలనఁబ్రీతియు, నాసాపుటంబువలన ద్యుతియు, స్పర్శంబునఁ గామంబును, భ్రూయుగళంబున యమంబును, బక్షంబున గాలంబును సంభవించె; నెవ్వని యోగమాయా విహితంబులు ద్రవ్యవయః కర్మగుణ విశేషంబులు; చతుర్విధభూత సర్గం బెవ్వని యాత్మతంత్రం; బెవ్వని వలన సిద్ధించి లోకంబులును లోకపాలురును బ్రదుకు చుందురు, పెరుఁగుచుందురు; దివిజులకు నాయువు బలంబునై, జగంబులకు నీశుండై, ప్రజలకుఁప్రజనుండై, బ్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు జాతవేదుండై, యంతస్సముద్రంబున ధాతు సంఘాతంబులం బ్రపంచించుచు బ్రహ్మమయుండై, ముక్తికి ద్వారంబై, యమృత, మృత్యు స్వరూపుండై, చరాచర ప్రాణులకు ప్రాణంబై యోజస్సహోబల వాయురూపంబులైన ప్రాణేంద్రియాత్మ శరీర నికేతనుండై పరమ మహాభూతి యగు న ప్పరమేశ్వరుండు మాకుంబ్రసన్నుండగుంగాక! యని మఱియును. 155
క. మొదల జల మిడిన భూజము, దుది నడుమను జల్లఁదనము దొరఁకొను మాడ్కిన్‌
మొదలను హరికిని మ్రొక్కిన, ముద మొందుదు మెల్ల వేల్పుమూఁకలు నేమున్‌.
156
క. ఆపన్నులగు దిదృక్షుల, కో పుణ్య! భవన్ముఖాబ్జ మొయ్యన తఱితోఁ
బ్రాపింపఁజేయు సంపద నో పరమదయానివాస! యుజ్జ్వలతేజా!
157
వ. అని యిట్లు దేవగణసమేతుండై యనేక విధంబులం గీర్తించుచు నున్న పరమేష్ఠియందుఁగరుణించి దయాగరిష్ఠుండగు విశ్వగర్భుం డావిర్భవించె. 158
మ. ఒక వేయర్కులు గూడిగట్టి కరువై యుద్యత్ప్రభాభూతితో
నొకరూపై చనుదెంచు మాడ్కి హరి దా నొప్పారె; నా వేలుపుల్‌
వికలాలోకనులై, విషణ్ణమతులై; విభ్రాంతులై మ్రోలఁగా
నక శంకించిరి కొంత ప్రొద్దు; విభుఁగానంబోలునే వారికిన్‌?
159
వ. అప్పుడు. 160
సీ. హారకిరీటకేయూరకుండలపాదకటకకాంచీలతాకంకణాది
కౌస్తుభోపేతంబుఁగౌమోదకీశంఖచక్రశరాసనసంయుతంబు
మరకతశ్యామంబు సరసిజనేత్రంబుఁగర్ణాభరణకాంతిగండయుగము
గలితకాంచనవర్ణకౌశేయవస్త్రంబు శ్రీ వనమాలికాసేవితంబు
 
ఆ. నై మనోహరంబునై దివ్యసౌభాగ్య, మైన యతని రూపు హర్ష మెసఁగఁ
జూచి బ్రహ్మ హరుఁడు సురలును దానును, బొంగి నమ్రుఁడగుచుఁబొగఁడఁదొడఁగె.
161
క. జననస్థితిలయదూరుని మునినుతు నిర్వాణసుఖసముద్రుని సుగుణుం
దనుతనునిఁబృథుల పృథులుని ననఘాత్ము మహానుభావు నభినందింతున్‌.
162
క. పురుషోత్తమ! నీ రూపము పరమశ్రేయంబు భువనపంక్తుల కెల్లన్‌
స్థిరవైదికయోగంబున వరుసను మీ యంద కానవచ్చెను మాకున్‌.
163
క. మొదలును నీలోఁదోఁచెను దుదియును నటఁదోఁచె; నడుము దోఁచెను; నీవే
మొదలు నడుము దుది సృష్టికిఁగదియఁగ ఘటమునకు మన్ను గతియగు మాడ్కిన్‌.
164
క. నీ మాయచేత విశ్వము, వేమాఱు సృజింతు వనుచు విష్ణుఁడ వనుచున్‌
ధీమంతులు గుణపదవిని, నేమంబున సగుణుఁడైన నినుఁగాంతు రొగిన్‌.
165
ఆ. అన్న మవనియందు నమృతంబు గోవులయందు వహ్ని సమిధలందు నమర
యోగవశతఁబొందు నోజను బుద్ధిచే నగుణు నిన్నుఁగాంతు రాత్మవిదులు.
166
మత్త. పట్టులేక బహుప్రకార విపన్న చిత్తులమైతి; మే
మెట్టకేలకు నిన్నుఁగంటి మభీప్సితార్థము వచ్చుఁ; బె
న్వెట్టయైన దవానలంబున వేఁగు నేనుఁగు మొత్తముల్‌
నిట్టనేర్చిన గంగలోపల నీరు గాంచిన చాడ్పునన్‌.
167
మత్త. నీకు నే మని విన్నవింతుము! నీవు సర్వమయుండవై
లోకమెల్లను నిండియుండఁగ లోకలోచన! నీ పదా
లోకనంబు శుభంబు మాకును లోకపాలకు లేను నీ
నాకవాసులు నీవ వహ్నిఁదనర్చు కేతుతతిక్రియన్‌.
168
వ. అని కమలసంభవప్రముఖులు వినుతి సేసి రని చెప్పి నరేంద్రునకు శుకుండిట్లనియె. 169
శా. ఈ రీతింజతురాననాదినుతుఁడై యేపార జీమూత గం
భీరంబైన రవంబునం బలికె సంప్రీతాత్ముఁడై యీశ్వరుం
డారోమాంచితకాయులన్‌ నవవిముక్తాపాయులం బ్రేయులం
బ్రారబ్ధోగ్రమహార్ణవోన్మథనవాంఛానల్పులన్‌ వేల్పులన్‌.
170
క. ఓ నలువ! యో సురేశ్వర! యో నిటలతటాక్ష! యో సురోత్తములారా!
దానవులతోడ నిప్పుడు మానుగఁబోరామి గలిగి మనుటే యొప్పున్‌.
171
వ. అది యెట్లంటిరేని. 172
క. ఎప్పుడు దనకును సత్త్వము, సొప్పడు నందాఁక రిపులఁజూచియుఁ దనమైఁ
గప్పికొని యుండవలయును, నొప్పుగ నహి మూషకమున కొదిగిన భంగిన్‌.
173
క. అమృతోత్పాదనయత్నము, విమలమతింజేయు టొప్పు; వేల్పులు వినుఁడీ,
యమృతంబుఁద్రావి జంతువు లమృతగతిన్‌ బ్రదుకుచుండు నాయుర్వృద్ధిన్‌.
174
సీ. పాలమున్నీటిలోపల సర్వతృణలతౌషధములు దెప్పించి చాల వైచి
మందరశైలంబు మంథానముగఁజేసి తనర వాసుకిఁదరిత్రాడు సేసి
నా సహాయతచేత నలి నందఱును మీరు తరువుఁడు వేగ మతంద్రు లగుచు;
ఫలము మీఁదయ్యెడు బహుళదుఃఖంబులఁబడుదురు దైత్యులు పాపమతులు;
 
ఆ. అలసటయును లేక యఖిలార్థములుఁగల్గు, విషధిలోన నొక్క విషము పుట్టుఁ;
గలఁగి వెఱవవలదు; కామరోషంబులు, వస్తుచయమునందు వలదు చేయ.
175
వ. అని యాదేశించి. 176
క. అంతాదిరహితుఁడచ్యుతుఁడంతర్ధానంబు నొందె; నజఫాలాక్షుల్‌
సంతోషంబునఁదమ తమ కాంతాలయములకుఁజనిరి గౌరవ మొప్పన్‌.
177
క. కయ్యంబు సేయ నొల్లక నెయ్యంబున నతులు వెట్టి నిర్జరనికరం
బియ్యప్పనములు వెట్టుచుఁదియ్యంబునఁగొల్చె బలిని దేవద్వేషిన్‌.
178
క. పసచెడి తనకును వశమై సుసరపుగతిఁగొల్చుచున్న సురసంఘములన్‌
గసిమసఁగి చంపఁబూనిన నసురుల వారించె బలియు నతినయయుక్తిన్‌.
179
వ. అట్లు వారించి వైరోచని రాక్షససముదయంబున కిట్లనియె. 180
క. పగవారు శరణు చొచ్చిన, మగతనములు నెఱపఁదగునె మగవారలకున్‌
దగు సమయ మెఱుఁగవలదే, మగఁటిమిఁబాటింప వలద మర్త్యులతోడన్‌.
181
వ. అని పలికి కొలువు కూటంబున నసుర నికర పరివృతుండై నిఖిల లోక రాజ్యలక్ష్మీ సహితుండై యఖిల విబుధ వీర విజయాహంకార నిజాలంకారుండై సుఖంబునం గొలువున్న విరోచన నందనుం గని శచీవిభుం డుత్తమ సచివుండునుం బోలె సాంత్వన వచనంబుల శాంతిం బొందించి పురుషోత్తమ శిక్షితంబైన నీతిమార్గంబున శంబరునికిం బ్రియంబు సెప్పి, యరిష్టనేమి ననునయించి, త్రిపురవాసులగు దానవుల నొడంబఱిచి, జంభుని సమ్మతంబు సేకొని, హయగ్రీవుని విగ్రహంబు మాన్చి, నముచి తారక బాణాదులతో సఖ్యంబు నెఱపి, విప్రచిత్తికిం బొత్తు హత్తించి, శకుని విరోచన ప్రహేతులకుఁ బోరామి సూపి, మయ మాలి సుమాలి ప్రముఖులకు మైత్రి యెఱింగించి; కుంభనికుంభులకు సౌజన్యంబు గైకొలిపి, పౌలోమ కాలకేయ నివాత కవచాదులయెడ బాంధవంబు ప్రకటించి, వజ్రదంష్ట్రికి వశుండై, యితర దానవ దైత్యసమూహంబు వలన నతిస్నేహంబు సంపాదించి, మనకు నక్క చెలియండ్ర బిడ్డలకు నొడ్డారంబు లేమిటికి? నేక కార్యపరత్వంబున నడ్డంబు లేక బ్రదుకుద; మన్యోన్య విరోధంబు లేల? తొల్లి యన్యోన్యవిరోధంబున నలంగితి; మిది మొదలు దనుజ దివిజ సముదయంబులకు రాజు విరోచన నందనుండ; మనమందఱ మతని పంపు సేయంగలవార; ముభయ కులంబును వర్ధిల్లునట్టి యుపాయం బెఱింగింతునని యమృతజలధిమథన ప్రారంభ కథనంబు దెలియం జెప్ప; నట్లు సురాసుర యూథంబులు బలారాతిబలి ప్రముఖంబులై పరమోద్యోగంబున సుధాసంపాదనాయత్త చిత్తులై యైకమత్యంబు నొంది యమంద గమనంబున మందరనగంబునకుంజని. 182
సీ. వాసవు వర్ధకి వాఁడిగాఁజఱచిన కుద్దాలముఖములఁగొంత ద్రవ్వి
ముసలాగ్రములు చొన్పి మొదలి పాఁతగలించి దీర్ఘపాశంబులదిండు సుట్టి
పెకలించి బాహులఁబీడించి కదలించి పెల్లార్చి తమ తమ పేరువాడి
పెఱికి మీఁదికి నెత్తి పృథులహస్తంబులఁదలల భుజంబులఁదరలకుండ
 
తే. నాని మెల్లన కుఱుతప్పటడుగు లిడుచు, భార మధికంబు మఱవక పట్టుఁడనుచు
మందరనగంబుఁదెచ్చి రమందగతిని, దేవదైత్యులు జలరాశి తెరువు వట్టి.
183
క. మందరము మోవనోపమి నందఱపైఁబడియె నదియు నతిచోద్యముగాఁ;
గొందఱు నేలం గలిసిరి కొందరు నుగ్గైరి; చనిరి కొందరు భీతిన్‌.
184
క. ఏలా హరికడ కేఁగితి, మేలా దొరఁకొంటి, మధికహేలనశైలో
న్మూలనము సేసి తెచ్చితి, మేలా, పెక్కండ్రు మడిసి రేలా నడుమన్‌?
185
క. ఏఁటికి మముఁబని పంచెను? నేఁటికి మనఁబోఁటివారి కింతలు పను? లిం
కేఁటికి రాఁడు రమేశ్వరుఁ? డేఁటి కుపేక్షించె? మఱవనేఁటికి మనలన్‌?
186
వ. అని కులకుధర పతనజన్యంబు దైన్యంబు సహింపనోపక పలవించుచున్న దివిజ దితిజుల భయంబు మనంబున నెఱింగి సకలవ్యాపకుండగు హరి తత్సమీపంబున. 187
మ. గరుడారోహకుఁడై గదాదిధరుఁడై కారుణ్యసంయుక్తుఁడై
హరికోటిప్రభతో నొహో వెఱవకుండంచుంబ్రదీపించి త
ద్గిరిఁగేలన్‌ నలువొందఁగందుకము మాడ్కింబట్టి క్రీడించుచున్‌
గరుణాలోకసుధన్‌ సురాసురుల ప్రాణంబుల్‌ సమర్థించుచున్‌.
188
క. వారలు గొలువఁగ హరియును, వారాన్నిధి కరుగు మనఁగ వసుధాధరమున్‌
వారిజనయనునిఁగొంచు న, వారిత గతిఁజనియె విహగవల్లభుఁడఱుతన్‌.
189
క. చని జలరాశితటంబున వనజాక్షుని గిరిని డించి వందనములు స
ద్వినుతులు సేసి ఖగేంద్రుఁడు పనివినియెను భక్తి నాత్మభవనంబునకున్‌.
190
వ. అప్పుడు. 191
సీ. భూనాథ! వినవయ్య భోగీంద్రు వాసుకిఁబిలిపించి యతనికిఁబ్రియము సెప్పి
ఫలభాగ మీ నొడఁబడి సమ్మతునిఁజేసి మెల్లన చేతుల మేను నివిరి
‘నీవ కా కెవ్వరు నేర్తు? రీ పని కియ్య కొ’మ్మని యతని కైకోలు వడసి
కవ్వంపుఁగొండ నిష్కంటకంబుగఁజేసి ఘర్షించి యతని భోగంబు జుట్టి
 
ఆ. కడఁగి యమృత జలధిఁగలశంబు గావించి, త్రచ్చు నవసరమునఁదలఁపు లమర
బద్ధవస్త్రకేశభారులై యా రెండు, గములవారు తరువఁగదిసి రచట.
192
వ. తదనంతరంబ. 193
క. హరియును దేవానీకము నురగేంద్రుని తలలు పట్ట నుద్యోగింపన్‌
హరిమాయాపరవశులై సురవిమతులు గూడి పలుకఁజొచ్చిరి కడిమిన్‌.
194
మత్త. స్వచ్ఛమైన ఫణంబు మీరలు చక్కఁబట్టి మథింపఁగాఁ
బుచ్ఛ మేటికి మాకుఁబట్టఁగ? బూరుషత్వము గల్గి మే
మచ్ఛమైన తపోబలాధ్యయనాన్వయంబుల వారమై
యిచ్ఛయింతుమె తుచ్ఛవృత్తికి?నిండు మాకు ఫణాగ్రముల్‌.
195
వ. అని పలుకు దనుజులంజూచి. 196
క. విస్మయముఁబొంది దానవ, ఘస్మరుఁడహిఫణము విడువ గైకొని యసురుల్‌
విస్మితముఖులై యార్చి ర విస్మితముగఁగొనిరి సురలు వీఁకందోఁకన్‌.
197
వ. ఇట్లు సమాకర్షణ స్థానభాగ నిర్ణయంబు లేర్పఱచుకొని దేవతలు పుచ్ఛంబును, బూర్వదేవతలు ఫణంబులుం బట్టి పయోరాశి మధ్యంబునం బర్వతంబు వెట్టి పరమాయత్త చిత్తులై యమృతార్థంబు త్రచ్చుచున్న సమయంబున. 198
క. విడువిడుఁడని ఫణి పలుకఁగఁగడుభరమున మొదలఁగుదురు గలుగమిఁవెడఁగై
బుడ బుడ రవమున నఖిలము వడ వడ వడఁకఁగ మహాద్రి వనధి మునింగెన్‌.
199
ఉ. గౌరవమైన భారమునఁగవ్వపుఁగొండ ధరింపలేక దో
స్సారవిహీనులై యుభయ సైనికులుం గడు సిగ్గుతో నకూ
పారతటంబునం బడిరి పౌరుషముంజెడి పాండవేయ! యె
వ్వారికి నేరఁబోలు బలవంతపుదైవము నాక్రమింపఁగన్‌?
200
క. వననిధి జలములలోపల, మునిఁగెడి గిరిఁజూచి దుఃఖమునఁజింతాబ్ధిన్‌
మునిఁగెడి వేల్పులఁగనుఁగొని, వనజాక్షుఁడు వార్ధినడుమ వారలు సూడన్‌.
201
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - aShtama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )