పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము అష్టమస్కంధము
వామనమూర్తా వ్యిర్భావఘట్టము
వ. అని యిట్లు కమలసంభవుండు వినుతిసేయు నయ్యవసరంబున. 505
మ. రవి మధ్యాహ్నమునం జరింప గ్రహతారాచంద్రభద్రస్థితిన్‌
శ్రవణద్వాదశినాఁడు శ్రోణ నభిజిత్సంజ్ఞాతలగ్నంబునన్‌
భువనాధీశుఁడు పుట్టె వామనగతిం బుణ్యవ్రతోపేతకున్‌
దివిజాధీశ్వరుమాతకుం బరమపాతివ్రత్యవిఖ్యాతకున్‌.
506
వ. మఱియు న ద్దేవుండు శంఖచక్రగదా కమల కలిత చతుర్భుజుండును, బిశంగవర్ణవస్త్రుండును, మకర కుండల మండిత గండ భాగుండును, శ్రీవత్సవక్షుండును, నలిన చక్షుండును, నిరంతర శ్రీవిరాజిత రోలంబ కదంబాలంబిత వనమాలికా పరిష్కృతుండును, మణీకనక కాంచీవలయాంగద కిరీటహార నూపురాలంకృతుండును, కమనీయ కంఠ కౌస్తుభాభరణుండును, నిఖిలజన మనోహరుండునునై యవతరించిన సమయంబున. 507
శా. చింతంబాసిరి యక్షతార్క్ష్యసుమనస్సిద్ధోరగాధీశ్వరుల్‌
సంతోషించిరి సాధ్యచారణమునీశబ్రహ్మవిద్యాధరుల్‌
గాంతిం జెందిరి భానుచంద్రములు; రంగద్గీతవాద్యంబులన్‌
గంతుల్‌ వైచిరి మింటఁగింపురుషులున్‌ గంధర్వులుంగిన్నరుల్‌.
508
క. దిక్కుల కావిరి వాసెను, నెక్కువ నిర్మలత నొందె నేడు పయోధుల్‌
నిక్కమెయి నిలిచె ధరణియుఁ, జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై.
509
క. ముంపుగొని విరుల వానల, జొంపంబులు గురియ సురలు, సుమనోమధువుల్‌
తుంపర లెగయఁబరాగపు, రొంపుల భూభాగ మతినిరూషిత మయ్యెన్‌.
510
వ. తదనంతరంబ. 511
ఆ. ఈ మహానుభావుఁడె ట్లింత కాలంబు, నుదరమందు నిలిచి యుండె ననుచు
నదితి వెఱఁగుపడియె నానంద జయశబ్ద, ములను గశ్యపుండు మొగి నుతించె.
512
వ. అంత నవ్విభుండు సాయుధ సాలంకారంబగు తన దివ్యరూపంబు నుజ్జగించి రూపాంతరం బంగీకరించి కపటవటుని చందంబున నుపనయన వయస్కుండైన వామన బాలకుండై దల్లి ముందటఁ గుమార సముచితా లాపంబు లాడుచుఁగ్రీడించు సమయంబున నదితియుం దన యవలోకనపరిణామపారవశ్యంబున. 513
ఆ. నన్నుఁగన్న తండ్రి! నా పాలిదైవమ!, నా తపఃఫలంబ? నా కుమార!
నాదు చిన్నివడుగ! నా కులదీపక!, రాఁగదయ్య! భాగ్యరాశి వగుచు.
514
క. అన్నా రమ్మని డగ్గఱఁ, చన్నుల పా లేఱువాఱ సంశ్లేషిణియై
చిన్నారి మొగము నివురుచుఁ, గన్నారంజూచెఁగన్నకడుపై యుంటన్‌.
515
క. పురు డీ బోటికి నిందిర, పురు డంబిక గాక యొరులు పురుడే? యనుచున్‌
బురుటాలికిఁబది దినముల, పురుడు ప్రవర్తించి రెలమిఁబుణ్యపు గరితల్‌.
516
వ. అంత న బ్బాలునకు సంతసంబున మహర్షులు గశ్యపప్రజాపతిం బురస్కరించుకొని సముచితో పనయన కర్మకలాపంబులు సేయించిరి; సవిత సావిత్రి నుపదేశించె; బృహస్పతి యజ్ఞోపవీతంబును, గశ్యపుండు ముంజియుఁ, గౌపీనం బదితియు, ధరణి గృష్ణాజినంబును, దండంబు వనస్పతియగు సోముండును, గగనాధిష్ఠాన దేవత ఛత్రంబును, గమండలువు బ్రహ్మయు, సరస్వతి యక్షమాలికయు, సప్తర్షులు గుశపవిత్రంబులు నిచ్చిరి, మఱియును. 517
క. భిక్షాపాత్రిక నిచ్చెను, యక్షేశుఁడు వామనునకు; నక్షయ మనుచున్‌
సాక్షాత్కరించి పెట్టెను, భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్రా!
518
క. శుద్ధబ్రహ్మర్షి సమా, రాద్ధుండై విహితమంత్రరాజిఁ జదువుచుం
బ్రోద్ధంబగు ననలంబున, వృద్ధాచారమున వటుఁడు వేల్చెం గడఁకన్‌.
519
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - aShtama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )