| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | అష్టమస్కంధము |
| వ. | ఇట్లు కృతకృత్యుండైన మాయామాణవకుండు దేశాంతరసమాగతులగు బ్రాహ్మణులం గొందఱ నవలోకించి యిట్లనియె. | 520 |
| క. |
వత్తురె విప్రులు? వేఁడఁగ, నిత్తురె దాతలును వేడ్క నిష్టార్థములం? దెత్తురె మీరును సంపద?, లిత్తెఱఁగున దానవీరుఁడెవ్వఁడొ చెపుఁడా? |
521 |
| వ. | అనిన నఖిలదేశీయులగు భూసురు లిట్లనిరి. | 522 |
| మ. |
‘కలరున్ దాతలు; నిత్తురుం ధనములుం; గామ్యార్థముల్ గొంచు వి ప్రులు నేతెంతురు; గాని యీవిని బలింబోలన్ వదాన్యుండు లేఁ డలఘుండై యొనరించె నధ్వరశతం బా భార్గవానుజ్ఞచే; బలి వేఁడం బడయంగ వచ్చు బహుసంపల్లాభముల్ వామనా! |
523 |
| వ. | అని తెలియం జెప్పిన బ్రాహ్మణుల వచనంబు లాలకించి లోకంబులకుం బ్రీతి పుట్టింపఁ బయనంబై లాభవచనంబులు గైకొనుచుఁదల్లిదండ్రుల వీడ్కొని శుభముహూర్తంబునం గదలి. | 524 |
| క. |
ప్రక్షీణదివిజవల్లభ, రక్షాపరతంత్రుఁడగుచు రాజీవాక్షుం డా క్షణమున బలి యింటికి, భిక్షాగమనంబు సేసెఁబేదఱికముతోన్. |
525 |
| క. |
హరి హరి! సిరి యురమునఁ గల, హరి హరిహయుకొఱకు దనుజు నడుగంజనియెం; బరహితరతి మతియుతులగు, దొరలకు నడుగుటయు నొడలితొడవగుఁబుడమిన్. |
526 |
| క. |
సర్వప్రపంచగురుభర, నిర్వాహకుఁడగుటఁజేసి నెఱిఁజనుదేరన్ ఖర్వుని వ్రేఁగు సహింపక, యుర్వీస్థలి గ్రుంగె; మ్రొగ్గె నురగేంద్రుండున్. |
527 |
| వ. | ఇట్లు సని చని. | 528 |
| క. |
శర్మద, యమదండక్షత, వర్మద, నతికఠినముక్తివనితాచేతో మర్మద, నంబునివారిత, దుర్మద, నర్మదఁ దరించెఁద్రోవన్ వటుఁడున్. |
529 |
| వ. | దాఁటి తత్ప్రవాహంబున కుత్తరతటంబునందు. | 530 |
| శా. |
చండస్ఫూర్తి వటుండు గాంచె బహుధాజల్పన్నిశాటంబు, ను ద్దండాహూతమునీభ్యబిభ్యదమృతాంధస్సిద్ధకూటంబు, వే దండాశ్వధ్వజినీకవాటము, మహోద్యద్ధూమసంఛన్న మా ర్తాండస్యందనఘోటమున్, బలిమఖాంతర్వేదికావాటమున్. |
531 |
| వ. | కని దానవేంద్రుని హయమేధవాటి దఱియంజొచ్చు నయ్యవసరంబున. | 532 |
| శా. |
శంభుండో హరియో పయోజభవుఁడో చండాశుఁడో వహ్నియో దంభాకారత వచ్చెఁగాక, ధరణిన్ ధాత్రీసురుండెవ్వఁ డీ శుంభద్ద్యోతనుఁ డీ మనోజ్ఞతనుఁడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిఁగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. |
533 |
| క. |
గుజగుజలు వోవువారును, గజిబిజిఁబడువారుఁ జాలఁగలకలపడుచున్ గజిబిజి యైరి సభాస్థలిఁ, బ్రజ లెల్లను బొట్టివడుగు బాపని రాకన్. |
534 |
| వ. | ఆ సమయంబున బలిసభామండపంబుఁదఱియంజొచ్చి. | 535 |
| సీ. |
చవులుగాఁ జెవులకు సామగానంబులు సదువు నుద్గాతల చదువు వినుచు మంత్రతంత్రార్థసంబంధభావములు పే ర్కొనెడి హోతలతోడఁగూడికొనుచు హోమకుండంబులం దున్న త్రేతాగ్నుల వెలిఁగించు యాజక వితతిఁగనుచు దక్షులై బహువిధాధ్వరవిధానంబులు సెప్పెడు సభ్యులఁజేరఁజనుచుఁ |
|
| తే. |
బెట్టు గోరెడు వేడుక పట్టుపఱుప, నదితిపుట్టువు లచ్చికి నాటపట్టు గోరి చరియించె సభలోనఁగొంతదడవు, పుట్టు వెన్నఁడు నెఱుఁగని పొట్టివడుగు. |
536 |
| వ. | మఱియును. | 537 |
| క. |
వెఱచుచు వంగుచు వ్రాలుచు, నఱిముఱి గుబురులకుఁజనుచు హరి హరి యనుచున్ మఱుఁగుచు నులుకుచు దిఱదిఱఁ, గుఱుమట్టపుఁబొట్టివడుగు గొంత నటించెన్. |
538 |
| క. |
కొందఱతోఁజర్చించును, గొందఱతో జటలు సెప్పు, గోష్ఠిం జేయుం గొందఱతోఁ దర్కించును, గొందఱతో ముచ్చటాడుఁ; గొందఱ నవ్వున్. |
539 |
| వ. | మఱియు ననేకవిధంబుల నందఱకు నన్నిరూపులై వినోదించుచు. | 540 |
| క. |
వెడవెడ నడకలు నడచుచు, నెడనెడ నడు గిడఁగ నడరి యిల దిగఁబడఁగా బుడి బుడి నొడువులు నొడువుచుఁ, జిడిముడి తడఁబడఁగ వడుగు సేరెన్ రాజున్. |
541 |
| వ. | ఇట్లు డగ్గఱి మాయాభిక్షుండు రక్షోవల్లభుంజూచి యిట్లనియె. | 542 |
| మ. |
ఇతఁడే దానవచక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది ది క్పతిగర్వాపనయప్రవర్తి, గతలోభస్ఫూర్తి, నానామఖ వ్రతదానప్రవణానువర్తి, సుమనోరామామనోభేదనో ద్ధతచంద్రాతపకీర్తి, సత్యకరుణాధర్మోల్లసన్మూర్తి దాన్. |
543 |
| వ. | అని కుశపవిత్రాక్షతసంయుతంబగు దక్షిణహస్తంబు సాఁచి యిట్లనియె. | 544 |
| ఉ. |
స్వస్తి జగత్త్రయీభువనశాసనకర్తకు, హాసమాత్ర వి ధ్వస్తనిలింపభర్తకు, నుదారపదవ్యవహర్తకున్, మునీం ద్రస్తుతమంగళాధ్వరవిధానవిహర్తకు, నిర్జరీగళ న్యస్తసువర్ణసూత్రపరిహర్తకు, దానవలోకభర్తకున్. |
545 |
| వ. | అని దీవించి కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియుం బోలె ముందట నకుటిలుండును, జటిలుండును, సదండచ్ఛత్త్రుండును, గక్షాలంబిత భిక్షాపాత్రుండును, గరకలిత జలకమండలుండును, మనోహర చంద్రవదన మండలుండును, మాయావాదన నటుండును నగు వటువుం గని దినకర కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబునఁ దిరోహితులై భృగువులు గూర్చున్న యెడల లేచి సేమం బడిగి తియ్యని మాటల నాదరించిరి, బలియును నమస్కరించి తన గద్దియ నునిచి, పాదంబులు దుడిచి తన ప్రాణవల్లభ పసిండిగిండి నుదకంబులు వోయ వడుగుంగొమరుని చరణంబులు గడిగి తడియొత్తి తత్సమయంబున. | 546 |
| ఆ. |
వటుని పాదశౌచవారి శిరంబునఁ, బరమభద్ర మనుచు బలి వహించె నే జలము గిరీశుఁడిందుజూటుఁడు దేవ, దేవుఁడుద్వహించె ధృతి శిరమున. |
547 |
| వ. | మఱియు నయ్యజమానుండభ్యాగతున కిట్లనియె. | 548 |
| మ. |
వడుగా! యెవ్వరివాఁడ? వెవ్వఁడవు? సంవాసస్థలం బెయ్య? ది య్యెడకున్ నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మముం; గడు ధన్యాత్ముఁడనైతి, నీ మఖము యోగ్యంబయ్యె; నా కోరికల్ గడతేఱెన్! సుహుతంబులయ్యె శిఖులుం గల్యాణ మిక్కాలమున్. |
549 |
| మ. |
వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! |
550 |
| వ. | అని ధర్మయుక్తంబుగాఁబలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి యీశ్వరుండిట్లనియె. | 551 |
| సీ. |
ఇది నాకు నెలవని యేరీతిఁబలుకుదు? నొకచోటనక యెందు నుండ నేర్తు నెవ్వనివాఁడ నం చేమని పలుకుదు? నాయంతవాఁడనై నడవనేర్తు నీ నడవడియని యెట్లు వక్కాణింతుఁ బూని ముప్పోకలఁబోవ నేర్తు నదినేర్తు నిదినేర్తు నని యేల చెప్పంగ? నేరుపు లన్నియు నేన నేర్తు |
|
| ఆ. |
నొరులు గారు నాకు నొరులకు నే నౌదు, నొంటివాఁడఁ జుట్ట మొకఁడు లేఁడు సిరియుఁదొల్లి గలదు చెప్పెద నా టెన్‌ంకి, సుజనులందుఁ దఱచుఁజొచ్చియుందు. |
552 |
| వ. | అది యట్లుండ నిమ్ము. | 553 |
| సీ. |
జననాథ! నీ మాట సత్యంబు సత్కీర్తిదంబుఁ గులార్హంబు ధర్మయుతముఁ గరుణానువర్తులు ఘనసత్త్వమూర్తులు గాని మీ కులమందుఁ గలుగ రొరులు రణభీరువులు వితరణభీరువులు లేరు ప్రత్యర్థు లర్థులు ప్రబ్బికొనిన దానశౌండిమమునఁదనుపుదు రధికులై మీ తాత లందఱు మేటిమగలు |
|
| ఆ. |
మీ కులంబునందు మెఱయుఁప్రహ్లాదుండు, మింటి చంద్రుమాడ్కి మేలి రుచులఁ బ్రథితకీర్తితోడ భవదీయవంశంబు, నీరరాశిభంగి నెగడుచుండు. |
554 |
| వ. | తొల్లి మీ మూఁడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు సేసి గదాయుధుండై భూతలంబునఁ బ్రతి వీరులం గానక సంచరింప విష్ణుండు వరాహరూపంబున నతని సమయించెఁ దద్భ్రాతయగు హిరణ్యకశిపుం డది విని హరిపరాక్రమంబునకు నాశ్చర్యంబు నొంది తన జయంబును, బలంబునుం బరిహసించి గ్రద్దన నుద్దవిడి నద్దనుజమర్దను మందిరంబునకుం జనియె; నప్పుడు- | 555 |
| క. |
శూలాయుధహస్తుండై, కాలాకృతి వచ్చు దనుజుఁ గని విష్ణుండుం గాలజ్ఞత మాయాగుణ, శీలత నిట్లని తలంచెఁ జిత్తములోనన్. |
556 |
| మ. |
ఎదురై పోర జయింప రాదితనిఁ; గా కెందేనియుంబోవ భీ ప్రదుఁడై ప్రాణులఁదోలు మృత్యువు క్రియం బై వచ్చు నంచుం గ్రియా విదుఁ డబ్జాక్షుఁడు సూక్ష్మరూపమున నావేశించె నిశ్శ్వాస రం ధ్ర దిశన్ దైత్యు హృదంతరాళమునఁ బ్రత్యక్షక్రియాభీరుఁడై. |
557 |
| వ. | అంత నద్దైత్యవల్లభుండు వైష్ణవాలయంబు సొచ్చి వెదకి హరిం గానక, కోపంబు మానక, మిన్ను మన్ను నన్వేషించి, త్రిదివంబున నరసి, దిశలం బరికించి, భూ వివరంబులు వీక్షించి, సముద్రంబులు వెదకి, పురంబులు శోధించి, వనంబులు విమర్శించి, జగంబున నదృష్టశత్రుండై మార్గణంబు సాలించి, తనలో నిట్లనియె. | 558 |
| క. |
‘పగవాఁడు మడియనోపును, దెగఁడేనియు నెదురువడఁడె? దేహధరులకుం దెగినయెడఁబగఱ మీఁదను, బగ గొనఁదగ’ దనుచు నుడిగెఁబ్రాభవశక్తిన్. |
559 |
| వ. | అతండు మీ ప్రపితామహుం; డతనిగుణంబు లనేకంబులు గల; వవి యట్లుండనిమ్ము. | 560 |
| క. |
ఆతురభూసురగతిఁ బురు, హూతాదులు దన్ను వేఁడ నొగిఁ గొండనుచున్ మీ తండ్రి యిచ్చె నాయువు, నేతన్మాత్రుఁడవె నీవు నీలోకమునన్? |
561 |
| క. |
ఏలితివి మూఁడు జగములుఁ, దోలితి వింద్రాది సురలఁ, దొల్లిటివారిం బోలితివి దానగుణములఁ, జాలితి వీ రాక్షసులను సంరక్షింపన్. |
562 |
| వ. | అదియునుం గాక. | 563 |
| క. |
రాజ్యంబు గలిగెనేనియుఁ, బూజ్యులకును యాచకులకు భూమిసురులకున్ భాజ్యముగ బ్రదుకఁడేనియుఁ, ద్యాజ్యంబులు వాని జన్మధనగేహంబుల్. |
564 |
| క. |
మున్నెన్నుదురు వదాన్యుల, నెన్నెడుచో నిన్నుఁ ద్రిభువనేశుండనుచున్; ఇన్ని దినంబులనుండియు, నెన్నఁడు నినుఁ బెట్టు మనుచు నీండ్రము సేయన్. |
565 |
| ఆ. |
ఒంటివాఁడ నాకు నొకటి రెండడుగులు, మేర యిమ్ము; సొమ్ము; మేర యొల్లఁ; గోర్కిదీర బ్రహ్మకూఁకటి ముట్టెద, దానకుతుకసాంద్ర! దానవేంద్ర! |
566 |
| వ. | అనినఁబరమయాచకునకుఁ బ్రదాత యిట్లనియె. | 567 |
| ఆ. |
‘ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ!, సత్యగతులు వృద్ధసమ్మతంబు; లడుగఁదలఁచి కొంచె మడిగితివో చెల్ల!, దాత పెంపుసొంపుఁదలఁపవలదె?’ |
568 |
| వ. | అని మఱియు నిట్లనియె. | 569 |
| మ. |
వసుధాఖండము వేఁడితో? గజములన్ వాంఛించితో? వాజులన్ వెస నూహించితొ? కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో? పసిబాలుండవు; నేర వీ వడుగ; నీ భాగ్యంబు లీపాటిగా కసురేంద్రుండు పదత్రయంబడుగ నీ యల్పంబు నీనేర్చునే? |
570 |
| వ. | అన మొగంబునం జిఱునగవు మొలకలొత్త గృహమేధికి మేధావి యిట్లనియె. | 571 |
| మ. |
‘గొడుగో, జన్నిదమో,కమండలమొ, నాకున్ ముంజియో, దండమో, వడు గేనెక్కడ? భూము లెక్కడ? కరుల్, వామాక్షు, లశ్వంబు లె క్కడ? నిత్యోచితకర్మ మెక్కడ? మదాకాంక్షామితంబైన మూఁ డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. |
572 |
| వ. | అదియునుంగాక. | 573 |
| క. |
వ్యాప్తింబొందక వగవక, ప్రాప్తంబగు లేశమైనఁబదివే లనుచుం దృప్తింజెందని మనుజుఁడు, సప్తద్వీపముల నయినఁ జక్కంబడునే? |
574 |
| శా. |
ఆశాపాశము దాఁగడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా రాశిప్రావృతమేదినీవలయసామ్రాజ్యంబు సేకూడియుం గాసింబొందిరి గాక వైన్యగయభూకాంతాదులు; న్నర్థకా మాశం బాయఁగ నేర్చిరే! మును నిజాశాంతంబులంజూచిరే. |
575 |
| సీ. |
సంతుష్టుఁ డీమూఁడు జగములఁబూజ్యుండు సంతోషి కెప్పుడు జరుగు సుఖము సంతోషి గాకుంట సంసారహేతువు సంతసంబున ముక్తిసతియు దొరకుఁ బూఁట పూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ తుష్టిని దేజంబు దోన పెరుఁగుఁ బరితోషహీనతఁబ్రభసెడి పోవును జలధార ననలంబు సమయునట్లు |
|
| ఆ. |
నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట, దగవు కాదు నాకుఁ; దగిన కొలఁది యేను వేఁడికొనిన యీ పదత్రయమును, జాల దనక యిమ్ము; చాలుఁజాలు! |
576 |
| వ. | అని యిట్లు పలుకుచున్న ఖర్వునకు నుర్వీదానంబు సేయం దలంచి కరకలిత సలిల కలశుండైన యవ్వితరణముఖరునిం గని నిజవిచారయుక్తదనుజరాజ్యచక్రుండగు శుక్రుం డిట్లనియె. | 577 |
| సీ. |
‘దనుజేంద్ర! యీతఁడు ధరణీసురుఁడు గాఁడు దేవకార్యంబు సాధించుకొఱకు హరి విష్ణుఁడవ్యయుండదితిగర్భంబునఁ గశ్యపసూనుఁడై కలిగె; నకట! యెఱుఁగ కీతని కోర్కి నిచ్చెద నంటివి దైత్యసంతతి కుపద్రవము వచ్చు నీ లక్ష్మిఁ దేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి యిచ్చుఁ దా వాసవునకు; |
|
| ఆ. |
మొనసి జగములెల్ల మూఁడు పాదంబుల, నఖిలకాయుఁడగుచు నాక్రమించు సర్వధనము విష్ణుసంసర్జనము సేసి, బడుగుపగిది నెట్లు బ్రదికె దీవు? |
578 |
| క. |
ఒక్కపదంబున భూమియు, నొక్కటఁ ద్రిదివంబుఁద్రొక్కి యున్నతమూర్తిన్ దిక్కులు గగనముఁదానై, వెక్కసమై యున్న నెందు వెడలెదు చెపుమా! |
579 |
| సీ. |
ఇచ్చెద నని పల్కి యీకున్న నరకంబుఁ ద్రోవ నీవును సమర్థుఁడవు గావ; యే దానమున నాశ మేతెంచు నదియును దానంబు గాదండ్రు తత్త్వవిదులు; దానంబు యజ్ఞంబుఁదపముఁగర్మంబును దా విత్తవంతుఁడై తలఁపవలయుఁ; దనయింటఁగల సర్వధనమును నైదు భాగములుగా విభజించి కామమునకు |
|
| ఆ. |
నర్థమునకు ధర్మయశముల కాశ్రిత, బృందములకు సమతఁబెట్టునట్టి పురుషుఁడిందు నందుఁ బూర్ణుఁడై మోదించు, దన్నుమాని చేఁత దగవు గాదు. |
580 |
| వ. | అదియునుం గాక యీ యర్థంబునందు బహుభంగి బహ్వృచ గీతార్థంబు గల దొక్కటి సావధానుండవై యాకర్ణింపుము. | 581 |
| సీ. |
అంగీకరించిన నఖిలంబుఁబోవుచో ననృతంబు గాదు లే దనిన నధిప! యాత్మ వృక్షము మూల మనృతంబు నిశ్చయ మనృతమూలము గల్గ నాత్మ సెడదు; పుష్పఫలము లాత్మభూజంబునకు సత్య మా మ్రాను బ్రదుకమి నవియుఁజెడును ఫలపుష్పములు లేక పససెడి వృక్షంబు మూలంబుతో వృద్ధిఁబొందుఁగాదె? |
|
| తే. |
చేటుఁగొఱఁతయు లఘిమయుఁజెందకుండ, నిచ్చు పురుషుండు సెడకుండు నిద్ధచరిత! కాక యంచితసత్యసంగతి నటంచు, నిజధనంబర్థి కిచ్చిన నీకు లేదు. |
582 |
| ఆ. |
సర్వమయినచోట సర్వధనంబులు, నడుగ ‘లే’ దటంచు ననృతమాడు చెనఁటి పంద నేమి సెప్పఁబ్రాణము తోడి, శవము వాఁడు! వాని జన్మమేల? |
583 |
| వ. | మఱియు నిందొక్క విశేషంబు గలదు; వివరించెద. | 584 |
| ఆ. |
వారిజాక్షులందు వైవాహికములందుఁ, బ్రాణవిత్తమానభంగమందుఁ జకితగోకులాగ్రజన్మరక్షణమందు, బొంకవచ్చు నఘము వొందఁ డధిప! |
585 |
| మ. |
కులమున్ రాజ్యముఁదేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంభరుం డలఁతింబోఁడు; త్రివిక్రమస్ఫురణవాఁడై నిండు బ్రహ్మాండముం; గలఁడే మాన్ప నొకండు? నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్; వల దీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా! |
586 |
| వ. | అని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలితలోచనుండయి యశస్వి యిట్లనియె. | 587 |
| సీ. |
నిజ మాన తిచ్చితి నీవు మహాత్మక! మహిని గృహస్థధర్మంబు నిదియ యర్థంబుఁ గామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింప నిత్తు ననియు నర్థలోభంబున నర్థిఁ బొమ్మను టెట్లు? పలికి లేదనుకంటెఁ బాప మెద్ది? ‘యెట్టి దుష్కర్ముని నే భరించెదఁగాని సత్యహీనుని మోవఁజాల’ ననుచుఁ |
|
| తే. |
బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ, సమరముననుండి తిరుగకచచ్చుకంటెఁ బలికి బొంకక నిజమునఁ బరఁగుకంటె, మానధనులకు భద్రంబు మఱియుఁగలదె! |
588 |
| క. |
ధాత్రిని హలికునకును సు, క్షేత్రము బీజములు నొకటఁజేకుఱుభంగిం జిత్రముగ దాత కీవియుఁ, బాత్రము సమకూరునట్టి భాగ్యము గలదే? |
589 |
| శా. |
కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతింబొందరే? వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమి పైఁ బేరైనంగలదే? శిబిప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై యీరే కోర్కులు? వారలన్ మఱచిరే యిక్కాలమున్ భార్గవా! |
590 |
| క. |
ఉడుగని క్రతువుల వ్రతములఁ, బొడగనఁజననట్టి పొడవు పొడవునఁగుఱుచై యడిగెడినఁట; ననుబోఁటికి, నిడరాదె మహానుభావ! యిష్టార్థంబుల్. |
591 |
| శా. |
ఆదిన్ శ్రీసతి కొప్పుపైఁ, దనువుపై, నంసోత్తరీయంబుపైఁ బాదాబ్జంబులపైఁగపోలతటిపైఁబాలిండ్లపై నూత్న మ ర్యాదంజెందు కరంబు గ్రిందగుట మీఁదై నా కరంబుంట మేల్ గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే? కాయంబు నాపాయమే? |
592 |
| మ. |
నిరయంబైన, నిబద్ధమైన, ధరణీనిర్మూలనంబైన, దు ర్మరణంబైనఁ గులాంతమైన నిజమున్ రానిమ్ము; కానిమ్ము పో; హరుఁడైనన్, హరియైన,నీరజభవుం డభ్యాగతుండైన నౌఁ; దిరుగన్ నేరదు నాదు జిహ్వ; వినుమా! ధీవర్య! వేయేటికిన్? |
593 |
| ఆ. |
నొడివినంత పట్టు నుసలక యిచ్చుచో, నేల కట్టు విష్ణుఁ డేటి మాట? గట్టెనేనిఁదాన కరుణించి విడుచును, విడువకుండనిమ్ము విమలచరిత! |
594 |
| క. |
మేరువు దలక్రిందైనను, బారావారంబు లింకఁబాఱిన లోలో ధారుణి రజమై పోయినఁ, దారాధ్వము బద్ధమైనఁదప్పక యిత్తున్. |
595 |
| మత్తకోకిలము. |
ఎన్నఁడుం బరు వేడఁబోఁడఁట! యేకలుండఁట! కన్న వా రన్నదమ్ములు నైన లేరఁట; యన్నివిద్యల మూల గో ష్ఠి న్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ చిన్ని పాపనిఁద్రోసి పుచ్చఁగఁజిత్త మొల్లదు సత్తమా! |
596 |
| వ. | అని యిట్లు సత్య పదవీ ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్వరుండును, విమల యశస్కుండును, దృఢమనస్కుండును, నియతసత్యసంధుండును, నర్థిజనబంధుండును నైన బలిం జూచి శుక్రుండు గోపించి మదీయ శాసనం బతిక్రమించితివి గావున శీఘ్రకాలంబునఁ బదభ్రష్టుండవు గమ్మని శాపం బిచ్చె; బలియును గురుశాప తప్తుండయ్యు ననృతమార్గంబున కభిముఖుండు గాకుండె; నప్పుడు. | 597 |
| ఆ. |
బ్రదుకవచ్చుఁగాక బహుబంధనములైన, వచ్చుఁగాక లేమి వచ్చుఁగాక జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక, మాటఁదిరుగలేరు మానధనులు. |
598 |
| వ. | అ య్యవసరంబున. | 599 |
| ఆ. |
దనుజలోకనాథు దయిత వింధ్యావళి, రాజవదన మదమరాళగమన వటుని కాళ్లు గడుగ వరహేమఘటమున, జలముఁదెచ్చె భర్త సన్న యెఱిఁగి. |
600 |
| వ. | అయ్యవసరంబునఁ గపటవటునకు నద్దానవేంద్రుం డిట్లనియె. | 601 |
| క. |
రమ్మా! మాణవకోత్తమ!, లెమ్మా! నీ వాంఛితంబు లేదన కిత్తుం దెమ్మా యడుగుల నిటు రా, నిమ్మా కడుగంగవలయు నేఁటికిఁదడయన్? |
602 |
| వ. | అనిన విని. | 603 |
| మ. |
బలిదైత్యేంద్రకరద్వయీకృతజలప్రక్షాళనవ్యాప్తికిన్ జలజాతాక్షుఁడు సాఁచె యోగిసుమనస్సంప్రార్థితశ్రీదముం గలితానమ్రరమాలలాటపదవీకస్తూరికాశాదమున్ నళినామోదము రత్ననూపురితనానావేదముం బాదమున్. |
604 |
| క. |
సురలోకసముద్ధరణము, నిరత శ్రీకరుణ మఖిలనిగమాంతాలం కరణము భవసంహరణము, హరిచరణము నీటఁగడిగె నసురోత్తముఁడున్. |
605 |
| వ. | ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు సేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునం జల్లుకొని వార్చి దేశకాలాదిపరిగణనంబు సేసి. | 606 |
| శా. |
‘విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ వే దప్రామాణ్యవిదే త్రిపాదధరణీం దాస్యామి’ యంచుం గ్రియా క్షిప్రుండై దనుజేశ్వరుండు వడుగుం జేసాఁచి పూజించి’ బ్ర హ్మప్రీత’ మ్మని ధారవోసె భువనంబాశ్చర్యముంబొందఁగన్. |
607 |
| వ. | తత్కాలంబున. | 608 |
| ఆ. |
నీరధారఁబడఁగనీక యడ్డంబుగాఁ, గలశరంధ్ర మాఁపఁగాను దెలిసి హరియుఁగావ్యునేత్ర మటఁగుశాగ్రంబున, నడువ నేకనేత్రుఁడయ్యె నతఁడు. |
609 |
| వ. | అంత. | 610 |
| మ. |
అమరారాతికరాక్షతోజ్ఝితపవిత్రాంభఃకణశ్రేణికిం గమలాధీశ్వరుఁడొడ్డె ఖండితదివౌకస్స్వామిజిన్మస్తముం గమలాకర్షణసుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్ విమలశ్రీకుచశాతచూచుకతటీవిన్యస్తమున్ హస్తమున్. |
611 |
| క. |
మునిజననియమాధారను, జనితాసురయువతినేత్రజలకణధారన్ దనుజేంద్రనిరాధారను, వనజాక్షుఁడు గొనియె బలివివర్జితధారన్. |
612 |
| ఆ. |
కమలనాభు నెఱిఁగి కాలంబు దేశంబు, నెఱిఁగి శుక్రు మాట లెఱిఁగి నాశ మెఱిఁగి పాత్ర మనుచు నిచ్చె దానము బలి, మహి వదాన్యుఁ డొరుఁడు మఱియుఁగలఁడె. |
613 |
| క. |
బలి సేసిన దానమునకు, నలినాక్షుఁడు నిఖిలభూత నాయకుఁ డగుటం గలకల మని దశదిక్కులు, బళి బళి యని పొగడె భూతపంచక మనఘా! |
614 |
| క. |
క్షితి దానమిచ్చు నతఁడును, నతికాంక్షఁ బరిగ్రహించు నతఁడును దురిత చ్యుతులై శతవత్సరములు, శతమఖలోకమునఁగ్రీడ సలుపుదు రెలమిన్. |
615 |
| వ. | అట్లు గావున నే దానంబును భూదానంబునకు సదృశంబు గానేరదు; గావున వసుంధరా దానం బిచ్చితి; వుభయలోకంబులం గీర్తిసుకృతంబులు వడయు మని పలికి యమ్మాయావటుం డిట్లనియె. | 616 |
| క. |
ఇది యేమి వేఁడితని నీ, మది వగవక ధారవోయుమా; సత్యము పెం పొదవఁగఁ గోరిన యర్థం, బిది యిచ్చుట ముజ్జగంబు లిచ్చుట మాకున్. |
617 |
| వ. | అని పలికిన వటుని పలుకులకు హర్షనిర్భరచేతస్కుండై వైరోచనుండు. | 618 |
| ఆ. |
‘పుట్టి నేర్చుకొనెనొ పుట్టకనేర్చెనో, చిట్టిబుద్ధు లిట్టి పొట్టివడుగుఁ బొట్ట నున్న వెల్ల బూమెలు’ నని నవ్వి, యెలమి ధరణిదాన మిచ్చె నపుడు. |
619 |