| పురాణేతిహాసములు | శ్రీమహాభాగవతము | నవమస్కంధము |
| వ. | ఇ ట్లమ్మహానది, పురారాతిజటాజూటరంధ్రంబు వలన దిగంబడి, నిరర్గళ ప్రవాహంబై, నేలకు జల్లించి నెఱసి, నిండి, పెల్లువెల్లిగొని, పెచ్చు పెరిఁగి, విచ్చలవిడిం గ్రేపువెంబడి నుఱక క్రేళ్ళుఱుకు మఱకప్రాయంపుఁ గామధేనువు చందంబున ముందఱికి నిగుడుచు, ముద్దుఁ జందురుతోడి నెయ్యంబునఁ గ్రయ్య నడరి చొప్పుదప్పక సాఁగి చనుదెంచు సుధార్ణవంబు కైవడిఁబెంపు గలిగి, మహేశ్వరు వదన గహ్వరంబువలన నోంకారంబు పిఱుంద వెలువడు శబ్దబ్రహ్మంబు భంగి నదభ్రవిభ్రమంబున నమ్మహీపాల తిలకంబు తెరువువెంట నంటివచ్చుచు వెలియేనుఁగు తొండంబుల ననుకరించి పఱచు వఱద మొగంబులును, వఱద మొగంబుల పిఱుంద నందంద క్రందుకొని, పొడచూపి, తొలంగు బాలశారదా కుచకుంభంబులకు నగ్గలంబైన బుగ్గలును, బుగ్గల సంగడంబునం బారిజాత కుసుమ స్తబకంబుల చెలువంబునుం దెగడు వెలినురువులును, వెలినురువుల చెంగట నర్ధోన్మీలిత కర్పూర తరుకిసలయంబుల గేలిగొను సుళ్ళును, సుళ్ళ కెలంకుల ధవల జలధర రేఖాకారంబులు బాగు మెచ్చని నిడుదయేఱులును, నేఱులం గలసి వాయువశంబుల నొండొంటిం దాఁకి బిట్టు మిట్టించి, మీఁది కెగయు దురితభంగంబులైన భంగంబులును, భంగంబుల కొనల భిన్నభిన్నంబులై కుప్పించి, యుప్పరం బెగసి; ముత్తియంపు సరుల వడువున, మల్లికాదామంబుల తెఱంగునఁ, గర్పూరఖండ కదంబంబుల చెలువంబున, నిందు శకలంబుల తేజంబునఁ, దారకానికరంబుల పొలుపున మెఱయుచు; ముక్తికన్యావశీకరంబులైన శీకరంబులునుం గలిగి మధ్యమలోక శ్రీకరంబై, శ్రీకరంబు తెఱంగున విష్ణుపదంబు ముట్టి, విష్ణు పదంబు భాతి నుల్లసిత హంస రుచిరంబై, రుచిరపక్షంబురీతి నతిశోభిత కువలయంబై, కువలయంబు చెన్నున బహుజీవనంబై, జీవనంబులాగున సుమనోవికాసప్రధానంబై, ప్రధాన పర్వంబు పొలుపున నేకచక్ర బక భీమ మహాభంగ సుభద్రార్జున చరిత్రాభిరామంబై, రామచిత్తంబు మెలుపునం దనవారిలోఁ జొచ్చిన దోషాచరుల కభయప్రదాన చణంబై, ప్రదాన చణవర్తనంబుభాతి సముపాసిత మృత్యుంజయంబై, మృత్యుంజయు రూపంబుపోలిక విభూతి సుకుమారంబై, కుమారచరిత్రంబుఠేవను గ్రౌంచప్రముఖవిజయంబై, విజయ రథంబుభాతి హరిహయామంథరంబై, మంథరవిచారంబు గ్రద్దన మహారామ గిరివన ప్రవేశకామంబై, కామకేతనంబు పెల్లున నుద్దీపిత మకరంబై, మకర కేతనుబాణంబు కైవడి విలీన పరవాహినీకలిత శంబరంబై, శంబరారాతి చిగురుఁ గుంతంబుసూటి నధ్వగవేదనాశమనంబై, శమనదండంబు జాడ న్నిమ్నోన్నత సమవృత్తంబై, వృత్తశాస్త్రంబు విధంబున వడిఁ గలిగి సదా గురులఘువాక్యచ్ఛటాపరిగణితంబై, గణితశాస్త్రంబు కొలఁదిని ఘనఘనమూలవర్గమూలసంకలిత భిన్నమిశ్రప్రకీర్ణ ఖాతభీష్మంబై, భీష్మపర్వంబు పెంపున ననేక భగవద్గీతంబై, గీతాశాస్త్రంబు నిలుకడను మహాసుషిరతను ఘన నానాశబ్దంబై, శబ్దశాస్త్రంబు మర్యాద నచ్చువడి హల్లు గలిగి, మహాభాష్య రూపావతారవృత్తి వృద్ధిగుణసమర్థంబై, యర్థశాస్త్రంబు మహిమను బహుప్రయోజన ప్రమాణ దృష్టాంతంబై, దృష్టాంతంబు తెఱంగున సర్వసామాన్య గుణ విశేషంబై, శేషవ్యాపారంబు కరణిని సుస్థిరోద్ధరణ తత్పరంబై, పరబ్రహ్మంబు గరిమ నతిక్రాంతానేక నిగమంబై, నిగమంబు నడవడిని బ్రహ్మవర్ణ పద క్రమసంగ్రహంబై, గ్రహశాస్త్రంబు పరిపాటిని కర్కట మీన మిథున మకర రాశి సుందరంబై, సుందరి ముఖంబు పోఁడిమిని నిర్మల చంద్రకాంతంబై , కాంతాధరంబు రుచిని శోణచ్ఛాయావిలాసంబై, విలాసవతి కొప్పు నొప్పునఁ గృష్ణనాగాధికంబై, యధికమతి శాస్త్ర సంవాదంబు సొంపున నపార సరస్వతీ విజయవిభ్రమంబై, విభ్రమవతి చనుదోయి పగిది నిరంతర పయోవ్యాప్తాఖిలలోక జీవన ప్రదతుంగభద్రాతిరేఖా సలలితంబై, లలితవతి నగవు మించున నపహసిత చంద్రభాగధేయంబై, భాగధేయవంతుని వివాహంబు లీల మహామేఖల కన్యకావిస్తారం బై, తారకెంగేలి యొడికంబున నాక్రాంత సూర్యతనయంబై, సూర్యతనయు శరవర్షంబు పోలిక భీమరథ్యాటోపవారణంబై, వారణంబు పరుసునం బుష్కరోన్నత సంరంభంబై, రంభ నెమ్మోము డాలున సురసాతిశయదశంబై, దశరథతనయు బొమముడి చాడ్పున సింధుగర్వ ప్రభంజనంబై, ప్రభంజనతనయు గదపెట్టు మాడ్కిని సమీపగత దుశ్శాసన దుర్మద నివారకంబై, వార కన్యక ముంజేతి గతిని ముహుర్ముహు రుచ్చలిత కంకణాలంకృతంబై, కృతయుగంబు నోజ నపంకంబై, పంకజాసన ముఖంబు నొఱపునఁ బ్రభూతముఖవర్ణంబై, వర్ణగుణితంబు తెఱకువను బహుదీర్ఘబిందు విసర్గంబై, సర్గబంధకావ్యంబు విన్ననువున గంభీరభావమధురంబై, మధురాపురంబు సొబగున మహానందనందనంబై, నందనవనంబు పొందున విహరమాణ కౌశికంబై, కౌశికహయంబు రీతి సుదశధ్రువంబై, ధ్రువుతలంపు క్రియం పరిశీలత విశ్వంభరంబై, విశ్వంభరుని శంఖంబు రూపున దక్షిణావర్తోత్తరంబై, యుత్తరావివాహంబు చందంబునఁ బ్రముదిత నరంబై, నరసింహ నఖరంబుల భాతి నాశ్రిత ప్రహ్లాద గురువిభవ ప్రదానంబై, దానకాండంబు సిరిం గామధేను కల్పలతాద్యభినవంబై, నవసూతికాకుచంబు పేర్మిని నిరంతర పయోవర్ధనంబై, ధనదు నిలయంబు తూనిక సంగత మకర పద్మ మహాపద్మ కచ్ఛపంబై, కచ్ఛప కర్పరంబు బలిమిని పతితశైల సముద్ధరణంబై, ధరణీధరంబు సాటి నుత్తుంగ తటముఖ్యంబై, ముఖ్య వరాహంబు గరిమ నున్నతక్షమంబై, క్షమాసుర హస్తంబు గరగరికను సత్పవిత్ర మనోరామంబై, రామచంద్రుబాణంబు కడింది నభ్యాగత ఖరదూషణ మదాపహరణ ముఖరంబై, ముఖర రామ కుఠారంబు రీతిని భూభృన్మూలభేదన ప్రబలంబై, బలరామ హలంబుభాతిని బ్రతికూల సన్నికర్షణ ప్రబుద్ధంబై, బుద్ధదేవుని మేని యొఱపున నభియాతి రక్షోదార మనోహరంబై, హరతాండవంబు మేర నుల్లసి తానిమిషంబై, యనిమిషావతారంబు కీర్తిని శ్రుతి మంగళ ప్రదంబై, ప్రదాత యీఁగి సూటి నర్థపరంపరా వామనంబై, వామన చరణరేఖను బలివంశవ్యపనయంబై, నయశాస్త్రంబు మార్గంబున సామ భేద మాయోపాయ చతురంబై, చతురాననాండంబు భావంబున నపరిమిత భువన జంతుజాల సేవ్యమానంబై, మానిని యన లోఁతు సూపక, గరితయన సడిచప్పుడు సేయక, ముగుద యన బయలుపడక, ప్రమద యనఁ గ్రయ్యం బాఱుచుఁ బతివ్రత యన నిట్టట్టు సనక, తల్లి యన నెవ్వియైన లోఁగొనుచు, దైవంబన భక్త మనోరథంబు లిచ్చుచు, నంతకంతకు విస్తరించి గుఱి గడచి, యవాఙ్మానసగోచరంబై ప్రవహించి. | 230 |
| మ. |
జగతీనాథు రథంబుపజ్జ బహుదేశంబుల్ వడిం దాఁటి త త్సగరక్ష్మాపకుమారభస్మములమీఁదన్ ముంచి పాఱన్ మరు న్నగరావాసము వారు పొందిరి నవీనశ్రీలతో గంగ నీ రు గతింగాక మహాదురంత సుజనద్రోహానలం బాఱునే. |
231 |
| మ. |
హరు మెప్పించి మహాతపోనియతుఁడై యాకాశగంగానదిన్ ధరకుం దెచ్చి నితాంతకీర్తిలతికాస్తంభంబుగా నవ్య సు స్థిరలీలం బితృకృత్య మంతయు నొనర్చెన్ వారితానేక దు స్తరవంశవ్యథుఁ డా భగీరథుఁడు నిత్యశ్రీకరుం డల్పుఁడే! |
232 |
| క. |
హరిఁ దమమనమున లోనిడి, హరిపాదాంభోజజనితమైన నదిన్ సు స్థిరులై గ్రుంకి మునీంద్రులు, హరిఁ గలిసిరి త్రిగుణరహితులై యవ్వేళన్. |
233 |
| వ. | అంత నా భగీరథునకు శ్రుతుండును, శ్రుతునకు నాభావరుండును, నాభావరునకు సింధుద్వీపుండును, సింధుద్వీపునకు నయుతాయువును, నయుతాయువునకు ఋతుపర్ణుడును జనియించె నతండు. | 234 |
| ఆ. |
నయవిశాలబుద్ధి నలచక్రవర్తితో, సంగడీనితనము చాలఁజేసి యక్షహృదయ మతని కభ్యస్తముగ నిచ్చి, యశ్వవిద్య నేర్చె నతనివలన. |
235 |
| వ. | ఆ ఋతుపర్ణునకు సర్వకాముండును, సర్వకామునకు మదయంతీ వల్లభుండైన సుదాసుండును బుట్టె నా రాజశేఖరుని మిత్రసహుండును, గల్మాషపాదుండునని చెప్పుదు రాభూవరుండు వసిష్ఠుని శాపంబున రాక్షసుండై, తన కర్మంబున ననపత్యుండయ్యె ననిన విని పరీక్షిన్నరేంద్రుం డేమి కారణంబున సుదాసునకు గురుశాపంబు ప్రాప్తం బయ్యె నని యడిగిన శుకుం డిట్లనియె. | 236 |
| సీ. |
ఆ సుదాసుఁడు వేఁటకై వనంబున కేఁగి గర్వించి యొక్క రక్కసునిఁ జంపి వానితోఁబుట్టిన వానిఁబో విడిచిన వాఁడును దనతోడివాని చావు వోనీక కపటియై భూపాలుగృహమున నడబాలతనమున నర్థిఁ గొలిచి యుండ వసిష్ఠున కుర్వీశుఁడొక్క నాఁ డన్నంబు సేయంగ నతనిఁబనుప |
|
| తే. |
వాఁడు మానవమాంసంబు వండి తెచ్చి, మునికి వడ్డింపఁ గోపించి ముని నరేంద్రుఁ బిల్చి మానవమాంసంబుఁ బెట్టి తనుచు, నలుకతో రాక్షసుఁడవు గమ్మని శపించె. |
237 |
| వ. | ఇట్లు శపించి పదంపడి, రాక్షసుండు వండి తెచ్చుటయు, సుదాసుని యెఱుంగమియుఁ దన మనంబున నెఱింగి, వసిష్ఠుండు పండ్రెండేండ్లు రక్కసుండవై యుండుమని నియమించె; న య్యవసరంబున. | 238 |
| మ. |
గురువున్ మాఱు శపింతు నంచు జలముల్ గోపంబుతో దోయిటన్ నరనాథుండు ధరింపఁ దత్సతి పతిన్ వారింప మిన్నున్ దిశల్ ధరయుం జీవమయంబకా నిఖిలముం దాఁజూచి చల్లెన్ ధరా వరుఁ డాత్మీయపదంబులం గరపుటీవాఃపూరమున్ బొక్కుచున్. |
239 |
| వ. | ఇట్లు మిత్రసహుండు గావునఁ గళత్రానుకూలుండై శపియింప నొల్లక, సుదాసుండు రాక్షసభావంబు నొంది, కల్మషవర్ణంబు లయిన పాదంబులతో నడవులం దిరుగుచు. | 240 |
| క. |
ఆఁకట మలమల మాడుచు, వీఁక నతం డడవి నున్న విప్రమిథునమున్ దాఁకి తటాలున విప్రునిఁ, గూఁకటి చేఁబట్టి మ్రింగఁగొనిపోవు తఱిన్. |
241 |
| వ. | అంత నా బ్రాహ్మణుని భార్య మోఁదికొనుచుం బెగ్గడిల్లి, డగ్గుత్తికతోఁ బతికి నడ్డంబు వచ్చి, యేడ్చుచు రాచరక్కసున కిట్లనియె. | 242 |
| క. |
మానుషదేహము గలుగుట, భూనాయక! దుర్లభంబు పుట్టినమీఁదన్ దానము పరోపకారము, భూనుతకీర్తియును వలదె పురుషున కెందున్? |
243 |
| మ. |
రవివంశాగ్రణివై సమస్తధరణీరాజ్యానుసంధాయివై భువనస్తుత్యుఁడవై పరార్థరతివై పుణ్యానుకూలుండవై వివరం బేమియు లేక నా పెనిమిటిన్ విప్రున్ దపశ్శీలు స త్ప్రవరున్ బ్రహ్మవిదున్ జగన్నుతగుణున్ భక్షింపఁగాఁ బాడియే? |
244 |
| శా. |
తండ్రీ! మీకు దినేశవంశజులకున్ దైవం బగున్ బ్రాహ్మణుం డండ్రా మాటలు లేవె? భూమిసుర గోహత్యాభిలాషంబు గై కొండ్రే మీ యటువంటి సాధువులు? రక్షోభావ మిట్లేల? మీ తండ్రిం దాతలఁ బూర్వులం దలఁపవే ధర్మంబునం బోఁగదే! |
245 |
| శా. |
అన్నా! చెల్లెల నయ్యెదన్; విడువు నీకన్నంబు వెట్టింతు నా హృన్నాథున్ ద్విజు గంగికుఱ్ఱ నకటా! హింసింప నేలయ్య? నీ వెన్నం డింతులతోడఁ బుట్టవె? నిజం బిట్టైన మున్ముట్ట నా పన్నన్ నన్ను శిరంబు ద్రుంచి మఱి మత్ప్రాణేశు భక్షింపవే. |
246 |
| క. |
అని కరుణ పుట్ట నాడుచు, వనితామణి పలవరింప వసుధాదేవుం దినియె నతఁడు పులి పశువుం, దినుక్రియ శాపంబు కతన ధీరహితుండై. |
247 |
| వ. | అంత నా బ్రాహ్మణి కోపించి కామార్తనైన నాదు పెనిమిటిని భక్షించితివి గావున, నీవు నెలఁతలం బొందఁ జేరిన వేళ మరణంబును బొందు మని, కల్మాషపాదుని శపించి, పతిశల్యంబులతో నగ్ని ప్రవేశంబు సేసి సుగతికిం జనియె, నంతఁ బండ్రెండేండ్లు సనిన నా రాజు మునిశాపనిర్ముక్తుండై. | 248 |
| ఆ. |
రతులకొఱకు భార్య రావింప నదియును, బెదరి విప్రసతి శపించు టెఱిఁగి మగని నడ్డపెట్టి మైథునకర్మంబు, మాన్చె సతుల గోష్ఠి మానె నతఁడు. |
249 |
| క. |
అది కారణముగఁ బుత్రా, భ్యుదయము లే దా సుదాసభూపాలునకున్ దదనుమతి న వ్వసిష్ఠుఁడు, మదయంతికిఁగడుపుసేసె మదన క్రీడన్. |
250 |
| వ. | ఇట్లు సుదాసుని భార్యయగు మదయంతి వసిష్ఠువలన గర్భిణియై యేడేండ్లు గర్భంబు ధరియించి, నీళ్ళాడ సంకటపడుచున్న వసిష్ఠుండు వాఁడియగు నశ్మమున నా గర్భంబుఁ జీరిన, నశ్మకుండను కుమారుండు పుట్టె, నతనికి మూలకుండు పుట్టె నతండు. | 251 |
| క. |
వీరుఁడగు పరశురాముఁడు, ఘోరకుఠారమున నృపులఁగూలుచు వేళన్ నారీజనములు దాఁచిన, నారీకవచుండనంగ నరనుతి కెక్కెన్. |
252 |
| వ. | ఆ నారీకవచుండు నిర్మూలం బయిన రవి వంశంబునకు మూలం బగుటం జేసి, మూలకుం డనఁబరఁగె నా మూలకునకు విశ్వసహుండు పుట్టె. విశ్వసహునకు ఖట్వాంగుండు పుట్టి చక్రవర్తి యయ్యె నతండు. | 253 |
| సీ. |
అమరులు వేఁడిన నసురనాథులఁ జంపి త్రిదశులతోఁదన బ్రదుకు కాల మెంతని యడిగిన ‘నిదె నిండుచున్నది తడవులే దే మైన నడుగు’ మనిన వరములు గోరక వరవిమానం బెక్కి తనపురి కేతెంచి తత్త్వబుద్ధిఁ బరమేశ్వరునియంద భావంబుఁ గీలించి కులదైవత ద్విజకులము కంటె |
|
| తే. |
నంగనాప్రాజ్యరాజ్యపుత్త్రాదు లెల్లఁ, గావు ప్రియములు; ధర్మంబు గడచి నాదు మతి ప్రవర్తింప దెన్నఁడు మది నెఱుంగ, నన్య మా యీశ్వరునిఁదక్క ననుచు మఱియు. |
254 |
| మ. |
ఇలమీఁదం బ్రతుకేల? వేల్పుల వరంబేలా? ధనంబేల? చం చల గంధర్వపురీవిడంబనము లైశ్వర్యంబు లేలా? జగం బులఁ బుట్టించు తలంపునం బ్రకృతితోఁబొత్తై తుదిం బాసి ని ర్మలమై వాఙ్మనసామితంబగు పరబ్రహ్మంబు నేఁజెందెదన్. |
255 |
| వ. | అని నిశ్చయించి. | 256 |
| మ. |
కలసెన్ సంగము లెల్లఁ బాసి నియతిన్ ఖట్వాంగుఁ డశ్రాంతమై కల దయ్యున్ మఱి మీఁద లే దనెడిదై కల్యాణమై యాత్మలోఁ దలఁపంబల్కఁగ రానిదై పరమమై తత్త్వజ్ఞు లూహించి హృ జ్జలజాతంబుల వాసుదేవుఁడని సంస్థాపించు నా బ్రహ్మమున్. |
257 |
| వ. | అట్టి ఖట్వాంగునకు దీర్ఘబాహుండు, దీర్ఘ బాహువునకు రఘువు, రఘువునకుఁ బృథుశ్రవుండుఁ, బృథుశ్రవునకు నజుండు, నజునకు దశరథుండును బుట్టి; రా దశరథునకు సుర ప్రార్థితుండై పరబ్రహ్మమయుండైన హరి నాల్గువిధంబులై శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్ను నామంబుల నిజాంశ సంభూతుండై జన్మించెఁ; దచ్చరిత్రంబు వాల్మీకి ప్రముఖులైన మునులచేత వర్ణితంబైనది; యైననుంజెప్పెద; సావధానమనస్కుండవై యాకర్ణింపుము. | 258 |