పురాణేతిహాసములు శ్రీమహాభాగవతము నవమస్కంధము
సగర చక్రవర్తి కథాప్రారంభము
సీ. దండించి పగవారు దన భూమిఁ జేకొన్న నంగనలును దాను నడవి కేఁగి
యడవిలో ముసలియై యాతఁడు సచ్చిన నాతని భార్య దా ననుగమింపఁ
గదియుచో నా స్త్రీకి గర్భంబు గలుగుట యౌర్వమునీశ్వరుఁ డాత్మ నెఱిఁగి
వారించె; నంత న వ్వనజాక్షి సవతులు సూలు నిండారినఁ జూడఁ జాల
 
తే. కర్థి నన్నంబు గుడుచుచో నందుఁ గలిపి విషము వెట్టిరి; పెట్టిన విరిసి పడక
గరముతోఁగూడ సగరుండు ఘనుఁడు పుట్టి, వరయశస్స్ఫూర్తితోఁ జక్రవర్తి యయ్యె.
202
శా. చండస్ఫూర్తి నతండు తండ్రిపగకై సంగ్రామరంగంబులం
జెండెన్‌ హైహయబర్బరాదుల; వధించెం దాళజంఘాదులన్‌;
ముండీభూతులుగా నిరంబరులుగా మూర్తుల్‌ సబీభత్సులై
యుండంజేసె నిజారులన్‌ సగరనామోర్వీవిభుం డల్పుఁడే.
203
క. ఖగరాజరుచులు గల యిల, పగరాజుల నడఁచి యేలె బాహాశక్తిన్‌
నగరాజధీరు శూరున్‌, సగరున్‌ హతవిమతనగరుఁ జను వినుతింపన్‌.
204
సీ. ఔర్వుండు సెప్పంగ నమర వేదాత్మకు హరి నీశు నమృతు ననంతుఁగూర్చి;
వాజిమేధంబులు వసుధేశ్వరుఁడు సేసె నం దొక్క మఖమున హయము విడువ
నగభేది గొనిపోయి నాగలోకంబునఁ గపిలుని చేరువఁ గట్టి తొలఁగె;
నంత గుఱ్ఱము గాన కా రాజు దనపుత్త్రనివహంబు దిశలకు నెమకఁ బంప
 
తే. వారు నిల యేడుదీవుల వరుస వెదకి, మఖతురంగంబు లేకున్న మగుడి రాక
ప్రాభవంబున దోర్దండబలము మెఱసి, గ్రొచ్చి కోరాడి త్రవ్విరి కుతల మెల్ల.
205
వ. ఇట్లు సుమతికొడుకులు నేలం ద్రవ్వి పాతాళంబునం దూర్పు ముట్టియున్న యుత్తరభాగంబునం గపిలముని పొంతనున్న తురంగంబుఁ గని. 206
చ. ‘ఎఱిఁగితి మద్దిరయ్య తడ వేటికి? గుఱ్ఱపు దొంగ వీఁడె; యీ
జఱభునిఁ బట్టి చంపు; డతిసాధుమునీంద్రుఁడువోలె నేత్రము
ల్దెఱవక బాకినోరు మెదలింపక బైసుకపట్టె’ నంచు న
య్యఱువది వేవురున్‌ నిజకరాయుధముల్‌ జళిపించి డాయుచోన్‌.
207
చ. కపిలుఁడు నేత్రముల్‌ దెఱవఁగా దమ మేనుల మంట పుట్టి తా
రపగతధైర్యులై పడి యహంకరణంబున మూఢచిత్తులై
నృపసుతు లందఱున్‌ ధరణి నీఱయి రా క్షణమంద; సాధులం
దపసులఁ గాసిఁ బెట్టెడి మదస్ఫురితాత్ములు నిల్వనేర్తురే?
208
సీ. కొందఱు కపిలుని కోపానలంబున మ్రందిరి సగరకుమారు లనుచు
నందు రాముని శాంతుఁ డానందమయమూర్తి తొడరి కోపించునే? దువ్వనేలఁ
గాక జన్మించునే గగనస్థలంబున? నే సాంఖ్యమతమున నిద్ధమతులు
భవసముద్రము మృత్యుభయమును లంఘింతు రా బుద్ధిఁజేయు పరాత్మభూతుఁ
 
తే. డఖిలబోధకుఁ డతనికి నరసి చూడ, సఖు లమిత్రులు నెవ్వరు? సగరసుతులు
దాము దమచేయునేరమి దనువులందు, ననలకీలలు వుట్టి నీఱైరి గాక.
209
వ. మఱియు, సగరుండు గేశినియందుఁ గన్న పుత్త్రుం డసమంజసుం డనువాఁడు, సమంజసగుణంబులు లేక పూర్వజన్మంబున యోగీశ్వరుండై యుండి, సంగదోషంబు వలన యోగభ్రష్టుండయి, సగరునకు జన్మించి, జాతిస్మరజ్ఞానంబు గలిగి లోకంబువారలకుఁ దమవారలకు నప్రియంబగు వర్తనంబునం దిరుగుచు, నొక్కనాఁడు. 210
చ. వరుస నయోధ్యలోనఁ గల వాడల నాడెడు పిన్నవాండ్ర నా
సరయువులోన వైచి జనసంఘముఁ దండ్రియుఁ దిట్టుచుండ వాఁ
డురుమతిఁ గొన్నిప్రొద్దులకు యోగబలంబునఁజేసి బాలురం
దిరిగి పురంబులోపలికిఁ దెచ్చిన నివ్వెఱగంది రందఱున్‌.
211
వ. ఆ య్యసమంజసునికొడుకు అంశుమంతుం డనువాఁడు వినీతుండై, తనయొద్దఁ బనులు సేయుచుండు నంత సగరుం డమ్మనుమని నంశుమంతు నశ్వంబు వెదకి తెమ్మని పంచిన నతండు దమతండ్రులచొప్పునం జని, వారలు ద్రవ్విన మహాఖాతంబు సొచ్చి, యందు భస్మరాసులపొంత నున్న హయంబునుం గని, హయసమీపంబునం దున్న కపిలాఖ్యుండైన విష్ణునికి దండప్రణామంబు సేసి, యిట్లని స్తుతియించె. 212
సీ. మతి సిక్కఁబట్టి సమాధిగౌరవమున వ్రాలియుఁ దనకు నవ్వల వెలుంగు
నినుఁ గానఁ డొకనాఁడు ని న్నెఱుంగునె? బ్రహ్మ యజునిమనంబున నవయవముల
బుద్ధి జన్మించిన భూరిజంతువులందు హీనులమైన మా కెఱుఁగ వశమె?
తమలోన నీ వుండఁ దా మెఱుంగరు నిన్ను గుణములు చూతురు గుణములైనఁ
 
తే. గాన రొకవేళ జీఁకటిఁ గందు రాత్మ, లందుఁ దెలియరు వెలుపల నమరు పొందు
లరయుదురు దేహధారు లత్యంధు లగుచుఁ, గడిఁది నీ మాయ నెన్నఁడు గడవలేక.
213
వ. అని వినుతి సేయుచు, హయంబు విడువుమని చెప్పక తన తండ్రులు నీ ఱగుటం దడవక, మ్రొక్కి నిలుచున్న యంశుమంతునికిఁ గరుణావిపులుండగు గపిలుం డిట్లనియె. 214
క. ‘గుఱ్ఱము గొనిపో బుద్ధుల, కుఱ్ఱఁడ!, మీ తాతయొద్దకున్‌ నీ తండ్రుల్‌
వెఱ్ఱులు నీఱై రదె! యీ, మిఱ్ఱున గంగాజలంబు మెలఁగ శుభ మగున్‌.’
215
వ. అని పలికిన, నమస్కరించి, తురగంబుఁ గొనివచ్చి యా సగరున కిచ్చిన సగరుం డా పశువువలన జన్నంబుకడమ నిండించి, యంశుమంతునకు రాజ్యం బిచ్చి, ముక్తబంధనుండై, యౌర్వుండు సెప్పిన మార్గంబున నుత్తమగతికిం జనియె నంత. 216
క. జనకులు మ్రగ్గినచోటికి, ననిమిషనదిఁ దెత్తు ననుచు నటవీస్థలికిన్‌
జని తపము సేయఁజాలక, మనమున వగ లొలయ నంశుమంతుఁడు దీఱెన్‌.
217
క. ఆతనికొడుకు దిలీపుఁడు, భూతలమున గంగఁ దెచ్చి పొందించుటకై
ప్రీతిం దపంబు సేయుచు, భాతిగఁ దేలేక కాలపరవశుఁ డయ్యెన్‌.
218
క. అతనిసుతుండు భగీరథుఁ, డతితప మొనరించి కనియె నమృతాపాంగన్‌
సుతరంగన్‌ ముఖవనరుహ, రతభృంగన్‌ శివజటాగ్రరంగన్‌ గంగన్‌.
219
వ. కని నమస్కరించిన గంగ కృపసేసి, వరంబు వేఁడు మనిన, నా రాచపట్టి యిట్లనియె. 220
క. మా వారిభస్మరాసుల, నీ వారిం గలిపికొనుము; నెఱి మావారల్‌
నీ వారిఁ గలయ నాకము, మావారికి గలుగు; నిది ప్రమాణము తల్లీ!
221
ఇంద్రవజ్ర. చెల్లన్‌ మది న్ని న్ను భజింతు గంగన్‌
ఫుల్లాంతరంగన్‌ బహుపుణ్యసంగన్‌
గల్లోల లక్ష్మీజితకాశమల్లిన్‌
దల్లిన్‌ సుధీకల్పలతామతల్లిన్‌.
222
వ. అని వినుతులు సేయుచున్న రాజకుమారునకు లోకపావని యిట్లనియె. 223
మ. వినువీథిం బఱతెంచి నేలఁబడ నా వేగంబును న్నిల్ప నో
పినవాఁ డెవ్వఁడు? మేదినీతలము నే భేదించి పాతాళమున్‌
జనుదున్‌; వచ్చితినేని నా జలములన్‌ సుస్నాతులై మానవుల్‌
ననుఁ బొందించు నఘవ్రజంబె చట నే నాశంబుఁ బొందించెదన్‌.
224
వ. అది కారణంబుగా విచారించెద నని పలుకుచున్న లోకమాతకు రాజన్యవర్యుండగు భగీరథుం డిట్లనియె. 225
మ. పరతత్త్వజ్ఞులు శాంతచిత్తులు తపఃపారీణు లార్యుల్‌ ఘనుల్‌
పురుషశ్రేష్ఠులు వచ్చి తల్లి! భవదంభోగాహముల్‌ సేయఁగా
నరసంఘాఘము నిన్నుఁ బొందునె జగన్నాథుండు నానాఘసం
హరుఁ డా విష్ణుఁడు వారిచిత్తములఁ దా నై యుంట మందాకినీ!
226
మ. తనలో నిన్ని జగంబులుం గలుగుటం దా నిన్నిటం గల్గుటన్‌
జననీ! తంతువులందుఁ జీర గల యా చందంబునన్‌ విశ్వభా
వనుఁడై యొప్పు శివుండు గాక మఱి నీ వారి న్నివారింప నే
ర్చిన వార్వెరు; నిన్‌ ధరించుకొఱకై శ్రీకంఠునిన్‌ గొల్చెదన్‌.
227
వ. అని యెఱింగించి వీడ్కొని, చని, భగీరథుండు మహేశ్వరు నుద్దేశించి, గ్రద్దనఁ దపంబు సేసిన. 228
ఆ. భక్తవత్సలుండు ఫాలాక్షుఁ డా భగీ, రథుని మెచ్చి నిజశిరంబునందు
శౌరిపాదపూతసలిలయై దివినుండి, ధరకు వచ్చు గంగఁ దాల్చె నపుడు.
229
AndhraBharati AMdhra bhArati - SrImahAbhAgavatamu - navama skaMdhamu -bammera pOtanAmAtya - bammera pOtana ( telugu literature andhra literature )